చెట్లు నాటిన మనిషి -జాఁ జియోనో

మానవ ప్రవర్తన యొక్క అరుదైన సుగుణాలు వెల్లడి కావాలంటే దాని పని తీరును అనేక ఏళ్ళపాటు పరిశీలించే అదృష్టం ఉండాలి. ఈ పనితీరు ఏ మాత్రం అహంకారం లేనిదైనట్లయితే, దీనికి ప్రేరణ అసమానమైన ఔదార్యం అయినట్లయితే, ఇది ప్రతిఫలాపేక్ష లేనిదని ధృవపడినట్లయితే, వీటన్నిటికీ తోడు ఇది ఈ భూమి మీద తన ప్రత్యక్ష ముద్ర వేసినట్లయితే అప్పుడు పొరబాటనేది ఉండజాలదు.

ఆల్ఫ్స్‌ కొండల్లో యాత్రికులకు తెలియని కొండ ప్రాంతాల్లో నేను నలభై సంవత్సరాల క్రితం ఎంతో తిరిగాను. ఆ ప్రాంతంలో మనుషులే కాదు చెట్లు కూడా లేవు. పిచ్చి మొక్కలు తప్ప అక్కడ ఏమీ పెరగటం లేదు.
మూడు రోజులు నడచిన తరువాత శిధిలమై పోయిన ఊరికి చేరుకున్నాను. ఆ రాత్రి అక్కడ బస చేశాను. నా దగ్గర ఉన్న మంచినీళ్ళు మొన్నే అయిపోయాయి. కాబట్టి ముందుగా నీళ్ళు ఎక్కడున్నాయో చూడాలి. పాడు పడినా, ఒకప్పుడు ఇది ఊరే కాబట్టి ఇక్కడ ఒక సెలయేరు కానీ, బావి కానీ ఏదో ఒకటి ఉంటుందనుకున్నాను. అనుకున్నట్లే ఒక సెలయేరు ఉంది. కానీ ఎండిపోయి ఉంది. పై కప్పులేని ఒక అయిదారు ఇళ్ళూ, ఒక చర్చీ ఎండకు ఎండి, వానకు తడిసి శిథిలమై ఉన్నాయి. ఇక్కడి జన జీవనం ఎలా అదృశ్యమైపోయిందో చెప్పకుండా ఇవన్నీ జీవరహితంగా పడి ఉన్నాయి.
అది జూన్‌ నెల. ఆకాశం సూర్యకాంతితో ప్రకాశిస్తోంది. ఎత్తయిన ఈ ప్రాంతంలో గాలి మాత్రం తీవ్రంగా వీస్తోంది. సగం భోజనంతో కలతపడిన పులిలాగా గాలి శిథిలాల్లో గర్జిస్తోంది. నేను బస మార్చక తప్పలేదు.
ఐదు గంటలు నడిచిన తరువాత కూడా నీటి జాడ ఎక్కడా కనిపించలేదు. నీళ్ళు దొరుకుతాయన్న ఆశ కూడా క్రమంగా సన్నగిల్లుతోంది. నా చుట్టూ అదే బీడు, అదే గరుకు గడ్డి. దూరంగా ఒక నల్లటి చెట్టు మాను లాగా అనిపించింది. ఆ వైపు నడిచాను. అక్కడ ఉన్నది ఒక గొర్రెల కాపరి. సర్రున కాలుతున్న నేలమీద ముప్ఫయి దాకా గొర్రెలు పడుకుని ఉన్నాయి.
అతని దగ్గర ఉన్న నీటి బుర్రలోంచి నాకు తాగడానికి నీళ్ళు ఇచ్చి తరువాత మైదానం మలుపులో ఉన్న అతని ఇంటికి తీసుకెళ్ళాడు. సహజంగా ఏర్పడిన ఒక లోతయిన బావి గట్టునే అతను ఇల్లులాంటిది కట్టుకున్నాడు. ఆ బావి నీళ్ళు తియ్యగా అమృతం మాదిరి ఉన్నాయి.
అతడు చాలా తక్కువ మాట్లాడతాడు. బహుశా ఒంటరిగా బతికే వాళ్ళందరూ మితభాషులేనేమో! చాలా ఆత్మవిశ్వాసం ఉన్నవాడిలా కనిపించాడు. ఇటువంటి ఎడారి జీవనంలో అంతటి ఆత్మ స్థైర్యం అరుదైనదే. ఒక శిథిలమైన ఇంటిని అతను తన కష్టంతో అందంగా మలుచుకున్నాడు. గోడలు రాతితో కట్టబడి ఉన్నాయి. పై కప్పు ధృఢంగా ఉంది. పెంకులపై గాలి శబ్దం సముద్రపు హోరును గుర్తుకు తెస్తోంది. ఇంట్లో ఎక్కడ ఉండవలసినవి అక్కడ చక్కగా అమర్చి ఉన్నాయి. గిన్నెలు కడిగి ఉన్నాయి. నేల శుభ్రంగా ఉంది. అతని తుపాకి తుప్పు పట్టకుండా మెరుస్తూ ఉంది. పొయ్యి మీద చారు మరుగుతూ ఉంది. అతను శుభ్రంగా గెడ్డం చేసుకుని ఉన్నాడు. అతని బట్టలు శుభ్రంగా ఉన్నాయి. చినుగులు తెలియకుండా బాగు చేసుకున్న బట్టలవి. అతని భోజనాన్ని నాతో పంచుకున్నాడు. అతనికి సిగరెట్టు అందివ్వబోతే అలవాటు లేదన్నాడు. అతనిలాగే అతని కుక్క కూడా మౌనంగా, స్నేహపూర్వకంగా ఉంది.
ఆ రాత్రి అక్కడ బస చెయ్యక తప్పదని గ్రహించాను. దగ్గరలోని పల్లెను చేరడానికి కనీసం రోజు పైన పడుతుంది. ఈ ప్రాంతంలో పల్లెలు తక్కువని నాకు తెలుసు. వ్యాగన్లు పోయే రోడ్డుకి ఒక అంచున ఓక్‌ చెట్ల మధ్య చెల్లాచెదురుగా విసిరేసినట్లు నాలుగయిదు పల్లెలుంటాయి. కలపను కాల్చి బొగ్గు తయారు చేసేవాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళ జీవితాలు చాలా దుర్భరం. ఎండాకాలం, చలికాలం రెండూ తీవ్రంగా ఉంటాయి. ఇటువంటి వాతావరణంలో కిక్కిరిసిన కుటుంబాల మధ్య గొడవలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక్కడి నుండి దూరంగా పారిపోవాలనే అందరి కోరిక. కాల్చిన బొగ్గుని దగ్గర పట్టణంలో అమ్ముకొని వస్తారు మగవాళ్ళు. గానుగెద్దు చాకిరీ వంటి ఈ జీవితంలో ఎంతటి వాడైనా దిగజారిపోతాడు. ఆడవాళ్ళ సమస్యలు ఆడవాళ్ళకున్నాయి. బొగ్గు ధర దగ్గరి నుండి చర్చిలో కూర్చునే చోటు వరకు ప్రతి చిన్న విషయంలో గొడవ పడుతూ ఉంటారు. మనిషిలోని సుగుణాలు, దుర్గుణాలు ఇక్కడ నిరంతరం ఘర్షణకు లోనవుతూ ఉంటాయి. వీటికి తోడు నరాల బలహీనతకు దారి తీసే నిరంతర ఈదురుగాలి. ఇక్కడ ఆత్మహత్యలు, పిచ్చెక్కడం, అది హత్యలకు దారి తీయడం ఎక్కువ.
గొర్రెల కాపరి ఒక సంచి తెచ్చి దాంట్లోని విత్తనాలను కుప్పగా బల్ల మీద పోసుకున్నాడు. ఒక్కటొక్కటీ నిశితంగా పరిశీలించి మంచి విత్తనాలను వేరు చేయసాగాడు. నేను సిగరెట్టు కాల్చుకుంటూ కూర్చున్నాను.
‘నేను సాయం చేయనా’ అని అడిగాను.
‘ఇది నా పని’ అన్నాడు. అతని శ్రద్ధను గమనించి నేను మళ్ళీ వత్తిడి చేయలేదు. మా మధ్య సంభాషణ అంతే. మంచి విత్తనాలనన్నింటినీ వేరు చేసి వదులు వదులుగా లెక్క పెడుతూ సునిశితంగా పరీక్షిస్తూ మళ్ళీ వాటిలో చిన్న వాటిని, పగిలిన వాటిని ఏరివేశాడు. ఆ విధంగా ఒక వంద మంచి విత్తనాలను విడిగా ఉంచి అతను నిద్రకు ఉపక్రమించాడు.
అతనితో కలిసి ఉండటంలో ఒక విధమైన శాంతి ఉంది. ‘నేను ఇక్కడ ఒక్కరోజు విశ్రాంతి తీసుకోవచ్చా?’ అని మరునాడు అడిగాను. ఆ ప్రశ్న అతనికి అసహజంగా అనిపించలేదు. ఏదీ కూడా అతన్ని ఇబ్బంది పెట్టదన్న అభిప్రాయం కలిగింది. నిజానికి నాకు విశ్రాంతి అవసరం లేదు. అతని గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. గొర్రెలను వదిలి వాటిని తనతోపాటు మైదానంలోకి తీసుకెళ్ళాడు. బయలుదేరే ముందు రాత్రి ఏరిన విత్తనాల సంచిని జాగ్రత్తగా ఒక నీటి పాత్రలో వేశాడు.
గజంన్నర పొడవు, బొటనవేలు మందంగల చువ్వను పట్టుకుని బయలుదేరాడు. నేను అతని పక్కనే నడుస్తున్నాను. లోయలోని పచ్చికబీడులో గొర్రెలకు కాపలాగా కుక్కను ఉంచాడు. నేను ఉన్న వైపుకి వస్తున్నాడు. నా వైఖరికి అతనికి కోపం వచ్చిందేమో అనుకున్నాను. కానీ అటువంటిదేమీ లేదు. నాకు వేరే పని లేకపోతే తనతోపాటు రమ్మన్నాడు. వంద గజాల దూరంలోని గుట్టపైకి ఎక్కాం.
చేతిలోని ఇనుప చువ్వతో నేలను తవ్వి ఒక విత్తనం నాటి మట్టితో కప్పి వేయడం మొదలుపెట్టాడు. అతను ఓక్‌ విత్తనాలు నాటుతున్నాడు.
‘ఈ నేల నీదా?’ అని అడిగాను.
‘కాదు’ అతని సమాధానం.
‘పోనీ ఎవరిదో తెలుసా?’
‘తెలియదు’
గ్రామానికి చెందినది గానీ, దాని గురించి పట్టించుకోని వ్యక్తిది గానీ కావచ్చని అతని ఊహ. ఆ భూమి ఎవరిదో తెలుసుకోవాలన్న ఆసక్తి అతనికి లేదు. విత్తనాల్ని ఎంతో శ్రద్ధగా నాటుతున్నాడు.
మధ్యాహ్నం భోజనం తరువాత కూడా అదే పని. నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ విసుగు లేకుండా సమాధానాలిచ్చాడు. గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రతిరోజూ అతను ఇదే పని చేస్తున్నాడు. ఇప్పటికి ఈ విధంగా ఒక లక్ష విత్తనాలను నాటాడు. లక్షలో ఇరవై వేల విత్తనాలు మొలకెత్తాయి. ఈ ఇరవై వేలలో ఎలుకలకూ, ప్రకృతి వైపరీత్యాలకూ పది వేల మొక్కలు పోయుంటాయని అతని అంచనా. పూర్తిగా బీడు అయిన నేలలో పది వేల ఓక్‌ చెట్లు పెరుగుతున్నాయట.
అతని వయసు ఎంతై ఉంటుందన్న అనుమానం అప్పుడు వచ్చింది. యాభై పైనే ఉంటాయి.
‘యాభై ఐదు’ అని చెప్పాడు.
అతని పేరు ఎల్‌జియా బూఫియే.
ఒకప్పుడు అతనికి మైదాన ప్రాంతంలో కొంత పొలం ఉండేది. అక్కడే అతని జీవనం. ముందుగా అతని కొడుకూ, తరువాత అతని భార్యా చనిపోయారు. ఈ ఒంటరి జీవితం అప్పటినుంచే మొదలు. గొర్రెలూ, కుక్కతో తీరికగా జీవించటమే అతని ఒంటరి బతుకులో ఆనందాలు.
చెట్లు లేకపోవటం వల్ల ఈ నేల మరణిస్తోందని అతని అభిప్రాయం. అతనికంటూ వేరే వ్యాపకం లేకపోవటం వల్ల పరిస్థితులను కొంతయినా మార్చటానికి పూనుకున్నాడు.
నేను అప్పటికి యువకుడినే అయినప్పటికీ ఒంటరివాడినే కాబట్టి ఒంటరి హృదయాలతో ఎలా మెలగాలో కొద్దిగా తెలుసు. కానీ యువకుడినే కావటం వల్ల భవిష్యత్తు, అంటే నా వ్యక్తిగత జీవిత సుఖ సంతోషాలకు సంబంధించినదనిపిస్తుంది. ‘ఇంకొక ముప్ఫయి సంవత్సరాలలో ఈ పదివేల ఓక్‌ చెట్లు బ్రహ్మాండమైన వృక్షాలవుతాయి’ అన్నాను. ‘భగవంతుని దయవల్ల ఆయుష్షు ఉంటే ఈ పదివేలు సముద్రంలో నీటిబొట్టు అనిపించేట్టు ముప్ఫయి సంవత్సరాలలో మరెన్నో విత్తనాలను నాటతాను’ అన్నాడు.
ఓక్‌ విత్తనాలను నాటడంతో పాటు అతను బీచ్‌ మొక్కలు పెరిగే విధానాన్ని అధ్యయనం చేస్తున్నాడు. అతని ఇంటి వెనక ఒక మడిలో బీచ్‌ మొక్కలను పెంచుతున్నాడు. గొర్రెలు తినకుండా ఆ మడి చుట్టూ కంచె ఏర్పరిచాడు. ఆ మొక్కలు చాలా అందంగా ఉన్నాయి.
లోయల్లో నేల లోపలి పొరల్లో ఇంకా తేమ మిగిలి ఉండి ఉంటుంది. కాబట్టి అక్కడ బీచ్‌ మొక్కలను పెంచాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరుసటి రోజు మేం విడిపోయాం.
తర్వాతి సంవత్సరం 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలయింది. ఐదు సంవత్సరాలు నేను యుద్ధంలో పని చేయవలసి వచ్చింది. చెట్ల గురించి ఆలోచించే తీరిక లేకపోయింది. నిజం చెప్పాలంటే ఆ మనిషి పని అంతటినీ నేను ఒక తీరుబడి వ్యవహారంగా, సరదా పనిగా మాత్రమే చూశాను. దాని గురించి మరచిపోయాను.
యుద్ధం ముగిసింది. దాంతోపాటు కొంత డబ్బూ, తీరికా చిక్కాయి. కొంతకాలం స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలనే బలమైన కోర్కె కలిగింది. ఇదే ఉద్దేశంతో బీడు ప్రాంతానికి మళ్ళీ ప్రయాణమయ్యాను.
గ్రామ వాతావరణం కొద్దిగా కూడా మారలేదు. కానీ శిధిల గ్రామాన్ని దాటి దూరంగా కొండల మీద ఆకుపచ్చ తివాచీలా ఏదో కనిపించింది. నిన్నటినుంచి చెట్లు నాటే ఆ గొర్రెల కాపరి తరచు గుర్తొస్తున్నాడు. ‘పదివేల ఓక్‌ చెట్లు చాలా ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి’ అనుకున్నాను.
ఈ ఐదేళ్ళలో చాలామంది చనిపోయారు. అందరిలాగే ఎల్‌జియా బూఫియోకి కూడా కాలం చెల్లి ఉంటుందనుకున్నాను. నా వంటి ఇరవై ఏళ్ళ యువకుడికి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు చనిపోవటం మినహా చెయ్యటానికి వేరే ఏమీ లేనివారుగా కనిపిస్తారు. కానీ బూఫియో బతికే ఉన్నాడు. నిజానికి ఇంతకు ముందుకన్నా ఇప్పుడు చురుకుగా ఉన్నాడు. అతని దినచర్య కొంచెం మారింది. గొర్రెలు నాలుగే ఉన్నాయి. వాటికి బదులుగా ఒక వంద తేనె పట్టులను పెంచుతున్నాడు. గొర్రెలు మొక్కలను పాడు చేస్తుండటం వల్ల గొర్రెల సంఖ్య తగ్గించేశాడు. అతను చెప్పినదాని ప్రకారం యుద్ధ ప్రభావం అతనిపై లేదు. అతను అలా మొక్కలు నాటుతూనే ఉన్నాడు.
1910లో నాటిన మొక్కలు పది వసంతాలు చూశాయి. అవి మా ఇద్దరి కంటే పొడవుగా ఉన్నాయి. చూడముచ్చటయిన దృశ్యమది. నాకయితే నోట మాట రాలేదు. సహజంగానే అతను మితభాషి. మేమిద్దరం మౌనంగా అతని అడవిలో నడుస్తూ రోజంతా గడిపాం. ఆ అడవి మూడు భాగాలుగా మొత్తం పదకొండు కిలోమీటర్ల పొడవు ఉంది. బాగా వెడల్పు ఉన్న చోట మూడు కిలోమీటర్లు ఉంది. ఏ విధమయిన సాంకేతిక పరిజ్ఞానం లేని ఒక మనిషి వల్ల ఇదంతా సాధ్యమయిందని తలుచుకున్నప్పుడు మానవ విధ్వంసాన్ని విస్మరిస్తే, మనిషి కూడా దేవుడంతటి శక్తిమంతుడనిపిస్తుంది.
అతని ఆలోచనలను అమల్లో పెట్టాడు. కనుచూపు మేర నా భుజాల ఎత్తు వరకూ పెరిగిన బీచ్‌ చెట్లు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. అయిదేళ్ళ క్రితం 1915లో, అంటే నేను వెర్దాంలో యుద్ధం చేస్తున్నప్పుడు, అతను నాటిన బీచ్‌ మొక్కలను చూపించాడు. అవి ఈనాడు అందమైన పొదలుగా ఉన్నాయి. అతను ఊహించినట్లుగా లోయల్లోపలి పొరల్లో తేమ మిగిలి ఉంది. ఇప్పుడు అక్కడంతా బీచ్‌ మొక్కలు పెరుగుతున్నాయి. అవి పదహారేళ్ళ అమ్మాయిల్లా సుకుమారంగా ఉ న్నాయి.
గొలుసుకట్టు మాదిరి సృష్టి క్రియ మొదలయింది. ఇవన్నీ అతనికి పట్టలేదు. అతను చెయ్యదలచుకున్న పని వంచిన తల ఎత్తకుండా నిరాడంబరంగా చేసుకుంటూ పోతున్నాడు. ఊరి దిశగా తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. ఇంతకంటే అద్భుతమయిన గొలుసుకట్టు ప్రక్రియ నేను చూడలేదు. ఈ సెలయేటిలో చాలా కాలం క్రితం నీళ్ళు ఉండేవి. నేను ఇంతకుముందు పేర్కొన్న గ్రామాలు ఒకప్పటి రోమన్‌ నాగరికత శిథిలాలపై నిర్మించబడ్డాయి. అక్కడ పురావస్తు శాఖ తవ్వకంలో చేపలు పట్టే గాలాలు బయటపడ్డాయి. అటువంటిది ఈ ఇరవయ్యవ శతాబ్దంలో ఇక్కడి మనుషులకు నీళ్ళు దాచుకోవడానికి కుండలు, తొట్లు అవసరమయ్యాయి.
గాలి కూడా అనేక విత్తనాలను వ్యాప్తి చేసింది. నీళ్ళతోపాటు రకరకాల చెట్లూ, పూలమొక్కలూ పుట్టుకొచ్చాయి. మొత్తం మీద ఆ నేలకొక సార్ధకత ఏర్పడిరది. ఈ మార్పు క్రమంగా, ప్రకృతిలో భాగంగా, అబ్బురపాటుకు తావులేకుండా సహజంగా జరిగింది. కుందేళ్ళు, అడవి పందుల వేటకొచ్చిన వాళ్ళు ఈ కొత్త మొక్కలను చూసి ఆశ్చర్యపోయినప్పటికీ ఇదంతా వాతావరణంలోని ఏదో మార్పు ద్వారా సంభవించిందనుకున్నారు. అందువల్లేనేమో బూఫియో పనికి ఏ విధమైన ఆటంకమూ కలగలేదు. ఒకవేళ అతను పని బయటకు తెలిసి ఉంటే ఏదో ఒక రకమైన ప్రతిఘటన ఎదురై ఉండేది. ఒకే ఒక్క మనిషి తన ఒట్టి చేతులతో ఇంతటి అద్భుతాన్ని సృష్టించగలడని గ్రామ ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ ఊహించలేదు.
ఈ పని అంతా పూర్తి ఏకాంతంలోనే చేశాడు. అంటే చివరి రోజుల్లో అతనికి మాట్లాడే అలవాటు తప్పిపోయింది. బహుశా అతను మాటలు అనవసరం అనుకున్నాడేమో!
ఇంటి బయట నిప్పు అంటించడం వల్ల చుట్టూ ఉన్న సహజ వనానికి నష్టం కలుగుతుందంటూ 1933లో ఒక అటవీ అధికారి అతన్ని హెచ్చరించాడు. అడవి సహజంగా తనంతట తాను పెరగటం ఆశ్చర్యంగా ఉందని ఆ రేంజర్‌ అన్నాడు. అప్పటికీ ఆ గొర్రెల కాపరి తన కుటీరానికి పన్నెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న లోయలో బీచ్‌ మొక్కలు నాటుతున్నాడు. అతని వయసు డెబ్భై అయిదు సంవత్సరాలు. అంత దూరం నడిచి వెళ్ళి తిరిగి రావటం చాలా కష్టంగా ఉంది. అతని నివాసాన్ని లోయలోకి మార్చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. ఆ తర్వాత సంవత్సరం అదే చేశాడు కూడా. 1935లో ప్రభుత్వాధికారులు కొందరు ఈ ‘సహజ వనాన్ని’ చూడడానికొచ్చారు. అందులో ఒక అటవీ అధికారి, కొంతమంది సాంకేతిక నిపుణులు ఉన్నారు. పనికిరాని సంభాషణ చాలా సాగింది. ఆ అడవిని కాల్చి బొగ్గు తయారు చెయ్యకుండా నిషేధిస్తూ ప్రభుత్వ రక్షణ కల్పించటం తప్ప ఇతర ప్రయోజనమేమో కన్పించలేదు. ఆరోగ్యంగా పెరుగుతున్న ఆ చెట్ల సౌందర్యం వల్ల కలిగే తన్మయత్వం నుండి తప్పించుకోవటం కష్టం. ఆ బృంద నాయకుడు కూడా ఇదే తన్మయత్వానికి లోనయ్యాడు.
ఆ బృందంలో నా స్నేహితుడొకడున్నాడు. ఆ అద్భుతం ఎలా సాధ్యమయిందో అతనికి వివరించాను. ఒక వారం తరువాత మేమిద్దరం బూఫియేని చూడటానికి వెళ్ళాం. అటవీశాఖ అధికారులు పర్యవేక్షించిన స్థలానికి పది కిలోమీటర్ల దూరంలో బూఫియే తల వంచుకుని తన పని తాను చేసుకుంటున్నాడు. అటవీశాఖలో పనిచేస్తున్న నా స్నేహితుడు మానవ విలువల పట్ల గౌరవం కలిగినవాడు. ప్రచారం, పేరు ప్రఖ్యాతలు ఎంత వృధానో, ప్రమాదకరమో తెలిసినవాడు. నేను బూఫియేకు కానుకగా తెచ్చిన గుడ్లతో ముగ్గురం భోజనం చేశాం. నిశ్శబ్దంగా ప్రకృతి సౌందర్యంలో తన్మయత్వం పొందుతూ ముగ్గురం అనేక గంటలు గడిపాం.
మేం వచ్చిన దారిలో చెట్లు ఇరవై నుండి ఇరవై అయిదు అడుగులు ఎత్తు పెరిగి ఉన్నాయి. 1913లో ఈ ప్రదేశమంతా ఒట్టి ఎడారి. బూఫియోలోని ఆత్మశాంతి, మానసిక ఔన్నత్యం, కృషి, దీక్ష ఇవన్నీ ఇక్కడ పచ్చని అడవిగా రూపు దిద్దుకున్నాయి. నా కళ్ళకు అతను సృష్టికర్త సందేశాలను మోసుకు వచ్చిన వాడిగా కనిపించాడు. ఇంకా ఎన్ని వేల ఎకరాలు అతని చేతుల మీదుగా జీవం పోసుకోనుందోనని ఆశ్చర్యపడ్డాను. వెళ్ళిపోయే ముందు నా మిత్రుడు ఈ నేలకు అనువైన మొక్కల గురించి బూఫియేకు సలహా ఇచ్చాడు. నిజానికి ఈ మొక్కలకు సంబంధించిన పరిజ్ఞానం తనకన్నా బూఫియేకే ఎక్కువని చాలా వినమ్రతతో ఒప్పుకున్నాడు. ఒక గంట నడిచిన తరువాత ‘ఈ విషయాలు అందరికంటే బూఫియేకే బాగా తెలుసు. వీటన్నిటికీ మించి ఆనందంగా జీవించటాన్ని కనుగొన్నాడు’ అన్నాడు.
అడవికీ, బూఫియే ఆనందానికీ నా మిత్రుడు రక్షణ కలిగించాడు. అతను ఆ ప్రాంతంలో ముగ్గురు రేంజర్లను నియమించాడు. కలప కాల్చి బొగ్గు తయారుచేసే యజమానుల మందు సీసాలకు లాలూచి పడకుండా వాళ్ళని భయపెట్టాడు.
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 1939లో బూఫియే చేసిన పనికి ముప్పు కలిగే పరిస్థితి ఏర్పడిరది. ఆ కాలంలో కార్లు కలప కాల్చగా వచ్చే ఇంధనంతో నడిచేవి. 1910లో నాటిన ఓక్‌ చెట్లు దాని కోసం నరకడం మొదలు పెట్టారు. కానీ అదృష్టవశాత్తు ఈ ప్రాంతం రైలు మార్గానికి చాలా దూరంగా ఉండడంతో కలప రవాణా లాభదాయకంగా లేక చెట్లను నరకడాన్ని విరమించుకున్నారు. ఆ సమయంలో అక్కడికి ముప్ఫయి కిలోమీటర్ల దూరంలో వంచిన తల ఎత్తకుండా తన పని తాను చేసుకుంటున్న బూఫియేకి ఇవేమీ తెలియవు. మొదటి ప్రపంచ యుద్ధం మాదిరే రెండవ ప్రపంచ యుద్ధం కూడా అతని దిన చర్యను కొంచెం కూడా ప్రభావితం చేయలేకపోయింది.
ఎల్‌జియా బూఫియేను నేను చివరిసారిగా 1945 జూన్‌ నెలలో చూశాను. అప్పుడు అతని వయసు ఎనభై ఏడు సంవత్సరాలు. బీడు ప్రాంతాల్లోని అదే మార్గంలో ప్రయాణం చేశాను. యుద్ధం మిగిల్చిన అస్వస్థత నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక పోయినప్పటికీ ద్యూరాన్స్‌ లోయకీ, కొండ ప్రాంతాలకూ మధ్య బస్సు నడుస్తోంది. బస్సు వేగం వల్ల ఇంతకు ముందు నేను చూసిన దృశ్యాలను గుర్తించలేక పోతున్నానని భ్రమపడ్డాను. బస్సు కొత్త ప్రదేశం నుండి వెళ్తోందని కూడా అనిపించింది. కానీ ఊరు పేరును బట్టి ఇంతకు ముందు తిరిగిన ఎడారులు, శిధిల ప్రాంతం అదేనన్న నమ్మకం ఏర్పడిరది.
బస్సు నన్ను వెర్గాన్‌లో దింపింది. 1913లో ఇక్కడ ఉన్న పది, పన్నెండు ఇళ్ళల్లో మూడిరటిలోనే కుటుంబాలు ఉండేవి. భౌతికంగా, నైతికంగా చితికిపోయి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. అక్కడి వాతావరణం ఆదిమ సమాజపు వాసన వేస్తూ ఉండేది. చావు కోసం ఎదురు చూడటం తప్ప వేరే లక్ష్యమే లేనట్లు, ఆశారహితంగా, దుర్భరంగా ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో మనుషులలో సుగుణాలు పుట్టవు.
కానీ ఇప్పుడు వాతావరణం పూర్తిగా మారిపోయింది. గాలి కూడా జీవం పోసుకుంది. ఇంతకు ముందు వడగాల్పులా కొట్టే గాలి ఇప్పుడు సువాసనలు మోసుకొస్తూ మలయ మారుతంలా ఉంది. కొండమీద అడవిలోని గాలి జలపాతంలా ధ్వనిస్తోంది. కొలనులోకి పడుతున్న నీటి శబ్దం నన్ను సంభ్రమంలో ముంచింది. ఒక నీటి గుమ్మటం, దాని పక్కనే మందారం నా హృదయాన్ని ఎంతగానో పులకింప చేశాయి. ఆ మందారం నాటి నాలుగేళ్ళు అయ్యుంటుందేమో, ఆకులతో గుబురుగా మారింది. పునఃసృష్టికి ఇది తిరుగులేని నిదర్శనం. ఆశలు చిగిర్చిన ఆ ప్రజలు తమ జీవితాలను మరింత బాగు పరచుకోవటానికి పూనుకుంటున్నారు. శిథిలాలను తొలగించారు. అయిదు ఇళ్ళను నివాస యోగ్యాలుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎనిమిది మంది ఉంటున్నారు. వాళ్ళల్లో కొత్తగా పెళ్ళయిన రెండు జంటలున్నాయి. ప్రతి ఇంటి పెరడులో అనేక కూరగాయలు, పూలమొక్కలు ఉన్నాయి. కాబేజి, తోటకూర, ఉల్లి, గులాబి… ఇలా ఎన్నెన్నో! ఇప్పుడు ఎవరికైనా ఇక్కడ నివసించాలనిపించేలా పల్లె ఉంది.
అక్కడి నుండి నడక మొదలుపెట్టాను. యుద్ధం ఇప్పుడే ముగిసింది. జీవితం ఇంకా పూర్తిగా వికసించలేదు. కానీ లాజరస్‌ (యేసు చనిపోయిన మనిషిని సమాధుల్లోంచి ప్రాణమిచ్చి లేపుకొని వచ్చాడట) మాత్రం సమాధుల్లోంచి బయట పడ్డాడు. కొండ వాలుల్లో బార్లీ, రై తోటలు కనిపిస్తున్నాయి. నెమ్మది నెమ్మదిగా లోయ మొత్తం హరిత వర్ణాన్ని సంతరించుకొంటోంది.
ఎనిమిది సంవత్సరాలలో ఆ ప్రాంతమంతా ఆరోగ్యంతో, సంపదలతో కళకళలాడుతోంది. 1913 నాటి శిథిలాలు, ఎడారుల స్థానంలో నేడు వ్యవసాయ క్షేత్రాలు, శుభ్రమైన, అందమైన ఇళ్ళు సుఖమయ, ఆనందమయ జీవితాన్ని సూచిస్తూ విలసిల్లుతున్నాయి. అడవి వల్ల మంచు, వర్షం పెరిగి ఒకప్పుడు ఎండిపోయిన సెలయేర్లు మళ్ళీ ఇప్పుడు గర్భిణిలా నిండుగా పారుతున్నాయి. వాటిని ప్రజలు పంట కాలువలుగా మలచుకున్నారు.
ప్రతి ఒక్కరి పొలం పచ్చని తివాచిలా ఉంది. క్రమక్రమంగా అక్కడ గ్రామాలు జన జీవాలతో వెల్లివిరుస్తున్నాయి. మైదాన ప్రాంతంలో భూమి ఖరీదు ఎక్కువగా ఉండటం వల్ల అనేకమంది ఇక్కడకు వచ్చి వారితోపాటు యవ్వనాన్ని, ఉత్సాహాన్ని, ధైర్యసాహసాలనూ తెచ్చారు. రోడ్డుమీద అనేకమంది స్త్రీలు, పురుషులు, పిల్లలు సజీవ హాసంతో తారసపడతారు. ఒకప్పటి పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు ఇక్కడ నివాసమేర్పరచుకున్న పదివేల మంది ప్రజలు తమ సుఖసంతోషాలకు ఎల్‌జియా బూఫియేకు రుణపడి ఉన్నారు.
ఒకే ఒక్క మనిషి తన సొంత చేతులతో, నైతిక బలంతో ఈ ప్రాంతపు బీడు నుంచి అద్భుత జన జీవనాన్ని
ఉద్భవింప చేయగలిగాడంటే, ఎన్ని ఘోరాలు జరుగుతున్నప్పటికీ మానవత్వంపై అపార విశ్వాసం, అభిమానం ఏర్పడుతోంది. కానీ ఈ పని సాధించడానికి అవసరమైన మొక్కవోని ఆత్మ సంకల్పం, చెదరని ప్రేమ తలచుకుంటే దేవుడంతటి వాడికే తగిన పని పూర్తి చేసిన ఆ వృద్ధ, చదువురాని గొర్రెల కాపరి పట్ల అనంతమయిన గౌరవం పెల్లుబుకుతుంది.
ఎల్‌జియా బూఫియే 1947లో బానొంలో ప్రశాంతంగా చనిపోయాడు.
జాఁ జియోనో : సుప్రసిద్ధ ఫ్రెంచి రచయితలలో జాఁ జియోనో ఒకరు. ఆరు దశాబ్దాలు గడిచిపోయినా, ఈనాడు కూడా ఆయన రచనలకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఆయన ముఫ్పైకి పైగా నవలలు, అసంఖ్యాకమైన వ్యాసాలూ, కథలూ రచించారు. అందులో అనేకం… సంకలనాలుగా, నాటికలుగా, సినిమా స్క్రిప్టులుగా రూపుదిద్దుకున్నాయి.
జాఁ జియోనో ఈ కథని 1954లో వోగ్‌ సంస్థ కొరకు రాశారు. వారు దీన్ని ‘‘నమ్మకాన్ని నాటి ఆనందాన్ని పండిరచిన మనిషి’’ The man who planted Hope and grew Happiness) అనే పేరిట ప్రచురించారు. ఆ తరువాతి కాలంలో జాఁ జియోనో ఒక అమెరికన్‌ అభిమానికి రాసిన లేఖలో ‘బూఫియే పాత్రను సృష్టించటంలోని ముఖ్యోద్దేశం ప్రజలను వృక్ష ప్రేమికులుగా మార్చడం, మొక్కలు నాటేలా వారిని ప్రోత్సహించడం’ అని పేర్కొన్నారు. ఎల్‌జియా బూఫియేకు సంబంధించిన ఈ కథ అనతికాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి పొంది అనేక భాషల్లోకి అనువదించబడిరది. నాటి నుంచి నేటి వరకు, ప్రపంచ వ్యాప్తంగా అడవుల పునరుద్ధరణ కృషికి ఈ కథ గొప్ప
ఉత్తేజాన్నిస్తోంది.

Share
This entry was posted in నవలిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.