స్త్రీలు గుర్తించిన స్త్రీలు – రాడికలెస్బియన్స్‌ అనువాదం: – ఎ.సునీత

లెస్బియన్‌ అంటే ఏంటి? బద్దలయ్యేంత వరకూ అదిమిపెట్టిన స్త్రీలందరి ఆగ్రహం. పసి వయసు నుండి సమాజం విధించిన పరిమితులను అధిగమించి, ఒక సంపూర్ణ, స్వేచ్ఛాయుత మనిషిగా జీవించాలనే తన లోపలి తపనననుసరించి జీవించే స్త్రీ. ఈ తపన, అది నిర్దేశించే

అవసరాలు, ఆమె జీవిత ఆచరణ ఆమెని తన చుట్టూ ఉండే మనుషులు, పరిస్థితులు, అందరూ ఒప్పుకునే ఆలోచనలు, భావనలు, నడవడికతో బాధాకరమైన సంఘర్షణలోకి నెట్టి, అందరితో నిరంతర యుద్ధంలోకి, చివరికి తనతో తానే యుద్ధం చేసుకునే స్థితికి నెడతాయి. తన వ్యక్తిగత ఆవశ్యకత కోసం మొదలుపెట్టిన ఈ ప్రయాణంలోని రాజకీయ అంతరార్ధం ఆమెకే సరిగ్గా అర్థం కాకపోవచ్చు కానీ ఆమె సమాజం తన కోసం కేటాయించిన మౌలిక పాత్ర… స్త్రీ పాత్రకుండే పరిమితులు, దానిలో నిబిడి ఉన్న అణచివేతను ఒప్పుకోలేకపోతుంది. ఆమె పడే వేదన ఆమెలో ఒక అపరాధ భావాన్ని పురిగొల్పుతుంది. అది సమాజం తన నుండి ఆశించే వాటిని ఎంతమేరకు ఆమె చెయ్యలేకపోతోందో, అంత మేరకు పెరిగి, చివరికి సమాజం ఒప్పుకునే వాటిని ప్రశ్నించి, విశ్లేషించటానికి దారితీస్తుంది.
తన జీవిత దారులని ఆమె తనకి తానే వేసుకోవాల్సి వస్తుంది. చాలావరకు ఒంటరిగానే జీవించాల్సి వస్తుంది. తన తోటి ‘స్ట్రెయిట్‌’ అక్క చెల్లెళ్ళ (పర లైంగిక సంబంధాల్లో ఉండే స్త్రీలు) కంటే ముందుగానే వాస్తవ జీవితం గురించిన భ్రమలు (ముఖ్యంగా పెళ్ళి అనే కల్పిత గాథ జీవితాన్ని మెరుగుపరుస్తుందనే భ్రమ) వదులుకుని స్త్రీల జీవితం ప్రధానంగా ఒంటరిదనే విషయాన్ని త్వరగా గ్రహిస్తుంది. ఎంత మేరకు ‘ఆడపిల్ల’గా తాను పొందిన సాంఘికీకరణని ఆమె విసిరి పారెయ్యగలుగుతుందో అంత మేరకే ఆమె ప్రశాంతంగా
ఉండగలదు. ఒక పక్క సెక్సిస్టు సమాజం తన నుండి ఆశించిన వాటిని ఒప్పుకోవలసి రావటం, ఇంకో పక్క దాని అవసరాలకు తనని వాడుకుంటోందని అర్థం చేసుకోవటం, రెండిటి మధ్య నలిగిపోతూ ఉంటుంది. మనలో ఎవరిమయితే ఈ పరిస్థితి గురించి అర్థం చేసుకుని బయట పడగలుగుతామో, వాళ్ళం దశాబ్దాల కాళ రాత్రిలో సాగిన హింసాత్మక ప్రయాణం ముగించి అవతలి తీరాన్ని చేరుకున్నట్లు. ఆ ప్రయాణం నుండి పొందిన అవగాహన, మనం పొందిన విముక్తి, మన పట్లా, స్త్రీ జాతి పట్లా ఉండే నిజమయిన ప్రేమా… వీటన్నింటినీ అందరు స్త్రీలతో పంచుకోవాలి. ఎందుకంటే మనందరం స్త్రీలే కాబట్టి.
ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. పురుషుల మధ్య లైంగిక సంబంధాలలాగే, స్త్రీల మధ్య లెస్బియన్‌ సంబంధాలు అనే ప్రత్యేక శ్రేణి సంబంధాలు, స్త్రీ పురుషుల మధ్య కఠినమయిన భేదాలు, ఇద్దరికీ వేర్వేరు పాత్రలు ఉండే పురుషాధిక్య సమాజంలో మాత్రమే ఉంటాయి. ఈ సమాజాల్లో స్త్రీలకంటూ కేటాయించిన పాత్రలు స్త్రీల మనిషితనాన్ని కుదించి వాళ్ళని పురుషులనే యాజమాన్య కులానికి, సహకారం కులం లేదా సేవక కులంగా తయారుచేస్తాయి. పురుషులు ఆర్థిక, రాజకీయ, సైనిక విధులు సమర్ధంగా నిర్వహించటానికి వారిని వారి భావోద్వేగాల నుండి దూరం చేసి, తమ శారీరక, భావ పరమయిన అవసరాలను తామే గుర్తించనీయకుండా ఉంచుతాయి. ఇలా లింగ పరమైన పాత్రల అమరికల నుండే సమ లైంగికత పుడుతుంది. వాటిని మాత్రమే ప్రత్యేక శ్రేణి సంబంధాలుగా పరిగణించి పరిశీలించటం మొదలుపెట్టినపుడు ఆ ప్రత్యేకతకి వాస్తవికత లేదని అర్థమవుతుంది. ఏ సమాజంలో పురుషులు స్త్రీలని అణచివేయరో, ఎక్కడయితే భావోద్వేగాల/భావాల ననుసరించి లైంగిక వ్యక్తీకరణ సాధ్యమవుతుందో, అక్కడ పరలైంగికత, సమలైంగికత అనే రెండు భిన్నరకాల సంబంధాలు అదృశ్యమైపోతాయి.
కానీ లెస్బియన్‌ సంబంధాలు మగవాళ్ళ మధ్య సమ లైంగిక సంబంధాల కంటే చాలా భిన్నమైనవి. సమాజంలో భిన్న పాత్రను పోషిస్తాయి. ఇటువంటి సంబంధాలలో ఉండే స్త్రీలు, పురుషులు ఇద్దరిపైనా సమాజం తమ తమ సామాజిక పాత్రలని పోషించనందుకు ‘నిజమైన స్త్రీలు, నిజమైన పురుషులు’ కాదనే నింద వేసినప్పటికీ, భిన్న రకాలైన లెస్బియన్‌ స్త్రీలని డైక్‌ (మగరాయుడు) అనీ, హోమోసెక్సువల్‌ పురుషులని, ఫేగోట్‌ (పనికిరాని వెధవ) అని నిందలు వేస్తుంది. అబ్బాయిలా తిరిగే అమ్మాయిని పొగడటం, ఆడ లక్షణాలుండే అబ్బాయిలని చూసి అసహ్యించుకోవటం రెండూ ఒకే విషయాన్ని సూచిస్తాయి… అది స్త్రీలంటే, స్త్రీ పాత్రలని పోషించే వారంటే చులకన భావం. సమాజం స్త్రీలని ఇటువంటి అవమానకరమైన పాత్రల్లో ఉంచటానికి చాలా కృషి చేస్తుంది. స్త్రీలని గీత దాటకుండా చూడటానికి లెస్బియన్‌ అన్న పదం లేదా ముద్ర బాగా పనికొస్తుంది. ఒక స్త్రీ తన గురించి ఈ మాట ప్రయోగించటం విన్నప్పుడు తనని సమాజం అది గీసిన గీత దాటుతున్నావని హెచ్చరిస్తోందని అర్థం చేసుకుంటుంది. తాను సమాజం విధించిన లైంగిక పాత్రల సరిహద్దు దాటానని తెలుసుకుంటుంది. గబుక్కున వెనక్కి తిరిగి, అలా తనని అన్నందుకు నిరసన వ్యక్తం చేసి, తన చర్యలకి అందరి అనుమతి ఉండేలా తనని తాను మార్చుకుంటుంది.
ఏ స్త్రీ అయితే తాను పురుషుడితో సమానమని అంటుందో, వారి అధికారాన్ని ధిక్కరిస్తుందో (స్త్రీలందరూ పురుషుల మధ్య జరిగే మారకంలో భాగంగా ఉండాలనే ఒప్పందాన్ని కూడా), తన అవసరాలు తనకి అన్నింటికంటే ముఖ్యమని ధైర్యంగా నొక్కి చెప్తుందో వారిపైన వెయ్యటానికి పురుషుడు కనిపెట్టిన ముద్రే లెస్బియన్‌ అన్న పదం. స్త్రీల ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వారికి ఈ ముద్ర వెయ్యటం సుదీర్ఘ చరిత్రలో ఇటీవలి ఘటన మాత్రమే. వయసులో పెద్దవాళ్ళయిన స్త్రీలు, తమ కాలంలో ప్రతిభావంతులు, సఫలీకృతులు, స్వతంత్రులయిన స్త్రీలు, తమ జీవితాలని పురుషుని చుట్టూ అల్లుకోని స్త్రీలని లెస్బియన్‌ అని పిలిచేవారని గుర్తు చేసుకుంటారు. ఒక సెక్సిస్టు సమాజంలో ఒక స్త్రీ స్వతంత్రురాలయితే, ఆమె ఇంక స్త్రీ కాదు, మగరాయుడన్న మాట. అసలు ఆ పదమే స్త్రీల అసలు స్థితి గురించి తెలియచేస్తుంది. స్త్రీలు వ్యక్తులు కాదని, ఆ రెండు పదాలు పరస్పర విరుద్ధమయినవని స్పష్టం చేస్తుంది. ఒక లెస్బియన్‌ని ‘నిజమయిన స్త్రీగా’ భావించరు. అయితే, ప్రజల ఆలోచనలో ఒక లెస్బియన్‌కి, ఒక స్త్రీకి ఒక ప్రధాన భేదం ఉంటుంది… ఆమె లైంగిక ధోరణి. లెస్బియన్‌లకి పురుషులంటే ఆసక్తి ఉండదు. బండగా చెప్పాలంటే, స్త్రీ అంటే ఈ జనాంతిక ఆలోచన ప్రకారం ‘ఒక పురుషుడితో సెక్స్‌ చేయించుకునే మనిషని’ అర్థం. మానవ జాతిని విభజించడానికి పురుషులు కనిపెట్టిన లైంగిక శ్రేణుల్లో ‘లెస్బియన్‌’ ఒకటి. ఈ అమానవీయ ధోరణిలో స్త్రీలందరూ లైంగిక వస్తువులే అయినప్పటికీ, పురుషులతో ముడిపడిన స్త్రీలకి కొన్ని నష్టపరిహారాలు లభిస్తాయి… అతడి అధికారం, అహం, స్థాయితో వచ్చే గుర్తింపు, ఇతర పురుషుల నుండి లభించే రక్షణ, స్త్రీ పాత్రని పోషించటం వల్ల ‘అసలయిన స్త్రీగా’ సమాజం ఇచ్చే గుర్తింపు, ఆమోదం మొదలైనవి. ఎప్పుడైతే ఒక స్త్రీ, వేరే స్త్రీలతో కలిసి తన సామాజిక స్థానాన్ని సూటిగా పరిశీలిస్తుందో అప్పుడు ఆమెకి తానున్న అమానవీయ స్థితి అర్థమవుతుంది. అప్పుడు కలిగే భీతి నుండి తనని తాను కాపాడుకోవటానికి ఆమెకు అప్పటివరకూ పోగేసుకున్న ఏ మానసిక రక్షణ కవచాలు పనికిరావు.
మరో స్త్రీ కోసం తాను లైంగిక పరంగా మారాలంటే స్త్రీలకి ఎక్కడలేని భయం ఎందుకు పుట్టుకొస్తుందో ఇక్కడే మనకి అర్థమవుతుంది. ఇటువంటి సంబంధాల వల్ల మగవాళ్ళతో సంబంధాలు పెట్టుకోవటంతో వచ్చేటటువంటి పరిహారాలేవీ లభించవు. పైగా స్త్రీగా తాను ఎంత శూన్య స్థితిలో బతుకుతోందో అన్నది బయటపడిపోతుంది. ఒక స్ట్రెయిట్‌ స్త్రీ, తన పక్కనున్న స్త్రీ ఒక లెస్బియన్‌ అని తెలియగానే ఆమె తనని ఒక లైంగిక వస్తువుగా పరిగణిస్తోందని అనుకుంటుంది. ఆ స్త్రీని పురుషుడితో సమానం చేసి చూస్తుంది. పరలైంగిక సంబంధాల సామాజిక ఆధిక్యత వల్ల ఆయా స్త్రీలు, లైంగికత అన్న విషయం మస్తిష్కంలోనికి రాగానే తనని తాను ఒక లైంగిక వస్తువుగా భావించుకోవటం మొదలుపెట్టి, లెస్బియన్‌ స్త్రీల మనిషితనాన్ని గుర్తించటానికి నిరాకరిస్తారు. స్త్రీల ఉద్యమంలో స్త్రీలు తమ లెస్బియన్‌ అక్కచెల్లెళ్ళని ఈ రకంగా మగ చూపుల్లోంచి చూస్తున్నారంటే, వాళ్ళు పురుషాధిక్య సంస్కృతిని ఆమోదించి, తామెలా పురుషుల చేత అణచివేయబడుతున్నారో, అలాగే తమ అక్కాచెల్లెళ్ళని కూడా అణచివేయడానికి చూస్తున్నారని అర్థం. మనమెప్పటికీ స్త్రీలని వాళ్ళు ఒక శ్రేణి మనుషులతో ఏ లైంగిక సంబంధాలలో ఉన్నారోనన్న పురుషాధిక్య వర్గీకరణ వ్యవస్థ ప్రకారం మాత్రమే నిర్వచించబోతున్నామా? ఒక సంపూర్ణ మనిషిగా ఎదగాలనుకునే స్త్రీకే కాకుండా, స్త్రీల మధ్య ఉండే అసలు సిసలయిన ప్రేమ, సంఫీుభావం, అతి ముఖ్యమైన సంబంధాలపై లెస్బియన్‌ అనే ముద్ర వేయడం స్త్రీల మధ్య లేని ఒక విభజనని సృష్టించటం కాదా? స్త్రీత్వానికి సంబంధించిన పాత్రల హద్దుల్లో వాళ్ళని నిర్బంధించి, తమ మధ్య తాము మౌలిక సంబంధాలని, సంఘాలని, సముదాయాలని ఏర్పర్చకుండా లెస్బియన్‌ అనే ముద్రని స్త్రీలని భయపెట్టడానికి దిష్టిబొమ్మలా వాడటం కాదూ, దీని లక్ష్యం?
స్త్రీల ఉద్యమంలో లెస్బియనిజం గురించి చర్చ చేయకుండా ఉండటానికి, దాన్ని గుర్తించకుండా ఉండటానికి శత విధాలా ప్రయత్నించారు. ఆ విషయం ఎత్తగానే అందరూ ఆందోళనకి గురవుతారు. శత్రుపూరితంగా వ్యవహరిస్తారు. తప్పించుకోవటానికి చూస్తారు. లేకపోతే ఏదో ‘విశాల సమస్య’లో దీన్ని భాగం చేయడానికి ప్రయత్నిస్తారు. అసలు దాని గురించి మాట్లాడటమే ఎవరికీ ఇష్టముండదు. మాట్లాడాల్సి వస్తే, అసలు విషయాన్ని పక్క దారి పట్టిస్తున్నారు (‘లావెండర్‌ హెర్రింగ్‌’) అంటూ పక్కకి తోసేస్తారు. కానీ ఇదేమీ పానకంలో పుడకలా పక్కకి పెట్టగలిగే విషయం కాదు. స్త్రీలు పూర్తిగా విముక్తులవ్వాలంటే ఈ విషయం గుర్తించి మాట్లాడుకోవడం అత్యవసరం. ఎప్పటివరకయితే మగరాయుడు అన్న ముద్ర స్త్రీలని తమ బలమైన అభిప్రాయాలని తొక్కిపెట్టేలా చేసి, తన సహోదర స్త్రీల నుండి దూరంగా ఉంచి, పురుషులకి, కుటుంబాలకి తప్ప ఇతర విషయాలకి ప్రాధాన్యం ఇవ్వకుండా చేస్తుందో అప్పటివరకూ ఆమె పురుష సంస్కృతి నియంత్రణ క్రిందే ఉంటుంది. స్త్రీలు తమలో తమకి లైంగికపరమైన ప్రేమతో సహా మౌలికంగా నిబద్ధులై ఉండే అవకాశం
ఉందని గుర్తించనంత వరకూ పురుషులకిచ్చే ప్రేమ, విలువ తమకి తాము ఇచ్చుకోలేక రెండవ శ్రేణి మనుషులుగానే ఉండిపోతారు. స్త్రీలకి వ్యక్తులుగానూ, కలిసి చేసే ఉద్యమం గానూ పురుషుల సమ్మతి మాత్రమే ప్రధానమయినంత వరకూ లెస్బియన్‌ అన్న మాట వారికి వ్యతిరేకంగా వాడటానికి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఉన్న వ్యవస్థలో మరింత మెరుగయిన పరిహారాల కోసం చూస్తున్నంత వరకూ పురుషాధిపత్యాన్ని ప్రతిఘటించటం కష్టం. స్త్రీల విముక్తికి కూడా పురుష ఆమోదం కోసం చూస్తూ ఉంటారు. అందులో భాగంగా పురుష కేంద్రంగా ఉండే స్త్రీత్వాన్ని తోసిపుచ్చే లెస్బియనిజంని తిరస్కరిస్తూ ఉంటారు. ఈ మధ్య కొంతమంది యువ, రాడికల్‌ స్త్రీలు లెస్బియనిజం గురించి గంభీరంగా ఆలోచించటం మొదలుపెట్టారు కానీ ప్రధానంగా ఒక లైంగిక సంబంధంగాను, పురుషులతో ప్రేమకి ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఆ భావనలో స్త్రీలతో స్త్రీలు గాఢమైన సంబంధాలని పెట్టుకోవటం కేవలం పురుషులకి వ్యతిరేకమైనది గాను, అలాగే ఆయా సంబంధాలని సెక్స్‌కి సంబంధించినవిగా మాత్రమే చూడటం వల్ల అవి స్త్రీల మధ్య సెక్సిస్టు విభజనలని కొనసాగించి, పురుష ప్రాధాన్యత మునుపటిలాగే కొనసాగుతుంది.
స్త్రీలు వ్యక్తిగతంగాను, రాజకీయం గాను, పురుషుల నుండి తమ భావోద్వేగాలను, లైంగిక శక్తిని ఉపసంహరించుకుని, తమ తమ జీవితాల్లో ఆ శక్తిని వాడుకోవటానికి ప్రత్యామ్నాయాలని వెతుక్కోవాలి. ఇంకొక స్థాయిలో, రాజకీయ/మానసిక జీవితంలో పురుషులు ఆశించే స్పందనల నమూనా నుండి బయటికి రావాలి. మనసు లోతుల్లో వాటిని తెగతెంపులు చేసుకోవాలి. మన ప్రేమలు, లైంగిక శక్తి ఎటువైపు ప్రవహించినా, మెదళ్ళలో పురుషులు నిర్ణయించిన నమూనాలున్నంత వరకూ మనం సంపూర్ణ స్వతంత్రతని సాధించలేము.
స్త్రీల మధ్య సంబంధాలు పురుషులతో, పురుషుల ద్వారా మాత్రమే ఎందుకుంటాయి? పురుషాధిక్య సమాజాల్లో పెరిగినందువల్ల ఆ సంస్కృతి ఇచ్చే నిర్వచనాలను మనం కూడా వంట బట్టించుకుంటాం. ఆయా నిర్వచనాలు మనల్ని కుటుంబ, లైంగిక విధులకు పరిమితం చేసి మన జీవితాలను మన ఇష్టాయిష్టాల ప్రకారం నిర్వచించుకుని, మలచుకునే అవకాశాలను మనకివ్వవు. మనమిచ్చే మానసిక సేవలకు, ఏ ప్రతిఫలం లేని విధులకు, పురుషుడు మనకిచ్చేది ఒకటే… సమాజ దృష్టిలో సాధికారత పొందేందుకు అవసరమయిన బానిస స్టేటస్‌. మన సాంస్కృతిక పరిభాషలో దీన్నే స్త్రీత్వం అని, నిజమయిన స్త్రీ అని అంటారు. ఒక పురుషుడి పేరు తగిలించుకుని అతని అస్తిగా ఉన్నంతవరకూ మనల్ని నిజమయిన, సాధికారిక అచ్చమయిన స్త్రీలుగా పరిగణిస్తారు. ఏ పురుషుడికీ చెందని స్త్రీ అంటే ఆమె దయనీయమయిన, కనిపించని, చెల్లుబాటు కాని మనిషిగా పరిగణిస్తారు. అతని ఆమోదం కోసం ఎలా ఉండాలని నిర్ణయించాడో అలా జీవిస్తుంటే, ఆ ప్రతిబింబాన్ని అసలయిందని అతను ధృవీకరిస్తాడు. మన నిజమయిన అస్తిత్వాన్ని కాదు, అతను నిర్వచించిన స్త్రీత్వాన్ని, అతనితో ఉండే సంబంధంలో ధృవీకరిస్తాడు, మన వ్యక్తిత్వాన్ని, మన నిండయిన మనిషితనాన్ని కాదు.
ఈ సమాజమిచ్చిన పాత్రని వంటబట్టించుకోవడం వల్ల మన లోపలే మనల్ని అసహ్యించుకోవటానికి ఒక పెద్ద ఊట ఏర్పడుతుంది. అయితే ఈ ఆత్మ ద్వేషాన్ని స్త్రీలు గుర్తించటం, ఒప్పుకోవటం కష్టం. చాలామంది స్త్రీలు ఇటువంటిదేమీ లేనే లేదని తిరస్కరిస్తారు. తమకిచ్చిన పాత్రతో అసౌకర్యం గానో, అశాంతి గానో, జడత్వం గానో, లేకుంటే స్తంభింపచేసే ఆందోళన గానో వారికిది అనుభవంలోకి రావచ్చు. లేదా స్త్రీ పాత్ర గొప్పదనో, స్త్రీగా పుట్టడం అదృష్టమనో దాని ప్రాశస్త్యాన్ని పొగిడే వారిగా కూడా తయారవ్వొచ్చు. కానీ ఆ ఊట మాత్రం లోపలే ఉబుకుతూ ఉంటుంది. చేతనావస్థ అంచుల క్రిందే ఉంటూ వారి అస్తిత్వాన్నే విషపూరితం చేస్తుంటుంది, వారినుండి వారినే దూరం చేస్తుంది, వారి అవసరాలను వారినే గుర్తించకుండా చేస్తుంది, స్త్రీలు ఒకరికొకరు అపరిచితులుగా కనబడేలా చేస్తుంది.
ఈ ఆత్మ ద్వేషం, నిజమయిన ఆత్మని ఆవిష్కరించుకోకపోవటం రెండూ పురుషులిచ్చిన అస్తిత్వం నుండే పుడతాయి కాబట్టి, మనం కొత్త అస్తిత్వాన్ని సృష్టించుకోవాలి. మనం ‘స్త్రీగా ఉండాలి’ అనే ఆలోచనని వదులుకోలేనంత వరకూ, మన స్వీయత్వంతో, మనిషి తత్వంతో సంఘర్షణ ఎంతో కొంత జరుగుతూనే ఉంటుంది. స్త్రీత్వానికి, సంపూర్ణ మనిషితనానికి పొసగదనే విషయాన్ని అర్థం చేసుకోవటం, ఒప్పుకోవటం చాలా కష్టం. స్త్రీలు మాత్రమే ఒకరికొకరికి ఆ కొత్త స్వీయత్వాన్ని, అస్తిత్వాన్ని ఇవ్వగలరు. ఆ అస్తిత్వాన్ని పురుష కేంద్రంగా కాకుండా, మన గురించి మనమే ఆలోచించి రూపొందించుకోవాలి.
ఇటువంటి విప్లవాత్మక చైతన్యం నుండే మిగిలినవన్నీ పుడతాయి. మనది ఆర్గానిక్‌ విప్లవం. దీని కోసం మనం ఒకరితో ఒకరు సహకరించుకోవాలి. అందుబాటులో ఉండాలి. మన ప్రేమ, నిబద్ధత, భావోద్వేగ ఆలంబన ఒకరికొకరు ఇచ్చుకోవాలి. మన శక్తిని మన అక్కచెల్లెళ్ళకి ధారబోయాలి. మనల్ని అణచివేసే వారికి కాదు, మనందరినీ ఒక్కొక్కరిగా మన పీడకులతో కట్టి పడేసిన పరలైంగిక సంబంధాల వ్యవస్థని మౌలికంగా ఎదిరించే వరకూ మన శక్తంతా ఒక్కొక్క పురుషుడితో మన సంబంధాన్ని బాగు చేసుకోవటంలోనూ, మెరుగయిన సెక్స్‌ పొందటం కోసం చేసే ప్రయత్నాల్లోనూ, అతడిని ఎలాగోలా మార్చి ‘కొత్త పురుషుడిని’ తయారుచేసే కృషిలోనూ, దాని ద్వారా మనం ‘కొత్త స్త్రీ’గా మారొచ్చనే భ్రమలోనూ ఖర్చయిపోతుంది. ఇదంతా మన శక్తినీ, నిబద్ధతనీ విడగొట్టి మనని విముక్తి చేసే కొత్త దారుల, ధోరణుల నిర్మాణం నుండి మనల్ని పక్క దోవ పట్టిస్తుంది. స్త్రీలు తమ మధ్య ఉండే మౌలిక సంబంధాలను భూమికగా చేసుకొని, కలిసి కొత్త చైతన్యాన్ని సృష్టించుకోవటమే స్త్రీ విముక్తికి దారులేసి, సాంస్కృతిక విప్లవానికి భూమికనేర్పరుస్తుంది. అందరం కలిసి మన అసలయిన స్వీయత్వాన్ని వెతుక్కుని, బలపరుచుకుని, స్థిరపరుచుకోవాలి.
1970లో న్యూయార్క్‌లో సెకండ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ విమెన్‌ జరిగినప్పుడు లావెండర్‌ మేనెస్‌ నిరసనలో భాగంగా ఈ కరపత్రాన్ని రాడికలెస్బియన్స్‌ పంచారు. స్టేజి మీద లైట్లు తీసేసి, మైకు తీసుకుని ఆ సమావేశం నుండి లెస్బియన్ల వెలివేతని ఖండిరచారు. ఆ తర్వాతి సంవత్సరం జరిగిన స్త్రీ వాద సమావేశంలో లెస్బియన్‌ హక్కులను ఉద్యమంలో భాగంగా గుర్తించాలని నిర్ణయించారు.
ఈ కరపత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా లెస్బియన్‌ ఉద్యమానికి భూమిక తయారు చేసిన మౌలిక పత్రాల్లో ఒకటిగా పరిగణిస్తారు. 1960, 1970లలో అమెరికాలో వచ్చిన పౌర హక్కుల ఉద్యమం, యుద్ధ వ్యతిరేక ఉద్యమం, సమ లైంగిక ఉద్యమం, స్త్రీల ఉద్యమం ఒకదానినొకటి చాలా ప్రభావితం చేసుకున్నాయి. అప్పట్లో స్త్రీల ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వారిలో అనేకమంది లెస్బియన్లు, స్త్రీ వాదుల్లో హోమోఫోబియాని, పితృస్వామ్యంతో దాని సంబంధాన్ని, వారి జీవితాన్ని పురుషులతో సంబంధాల స్థాయికి కుదించే తత్వాన్ని ఈ కరపత్రం బాగా చర్చకు పెట్టింది. పితృస్వామ్య సంస్కృతి నేపథ్యంలో స్త్రీల మధ్య ఏర్పడే సన్నిహిత సంబంధాలు రాజకీయమైనవని, ఆ సంస్కృతిని ధిక్కరించటానికి ఇవి అత్యంత అవసరమని వాదిస్తుంది.
దీన్ని రాసినవారు ` ఆర్టిమిస్‌ మార్చ్‌, లోయి హార్ట్‌, రీటా మే బ్రౌన్‌, ఎల్లెన్‌ శుమ్స్కి, సింథియా ఫంక్‌, బార్బరా ఎక్స్‌
(ఉమన్‌ ఐడెంటిఫైడ్‌ ఉమన్‌)

Share
This entry was posted in కరపత్రం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.