తెల్లారి గుడ్లన్నీ ఉతికి ఆరేద్దామని మిద్ది మిందకు పోతి. మా ఇంటి ఉత్తరం పక్క నా మరదలు వాల్లిల్లుంది. నేను మిద్ది మీద గుడ్లు అరేసేది నా మరదలు చూసి,
‘‘ఓ వొదినా సరస నిన్న అలిగి పుట్టింటికి పోయిందంటనే’’ అనె.
‘‘ఏమో పాపా నాకు తెలీదు, నేను నిన్న ఉలవకాయ కొయ్యను పోయుంటి. ఆ ఉలవకాయలో ఒట్టి గాబు. ఆ గాబంతా ముక్కులోకి జొరబడి తుమ్ములు, పడిసము పట్టి పానం సొమ్మగిల్లిపోయింది. రెండు దినాలుగా సరసతో మాట్లాడలేదు’’.
‘‘మీరిద్దరూ అబ్బలబ్బలు కదా ఏమన్నా తెలుసేమో అని అడిగితిలే,’’ అనే.
అది అనింది కూడా నిజమే. చిన్నప్పట్నుంచి సరస నేను మంచి జతగా ఉండే వాళ్ళం. ఒగరి నోట్లో ఒగరం పెరొక్కొని తినే వాళ్ళం. ఇప్పటికీ ఒక తల్లి బిడ్డల కంటే ఎచ్చుగా ఉంటాము. మేము జతగా ఉండేది చూసి ఎంతమంది కుల్లుకునేదో, ‘అయ్యో వాల్లు ఎప్పుడూ జత ఇడసరమ్మ’ అని. పెద్దోల్లు అంటారే ‘‘బంగారట్ల తోడు బాయినీకు పోతావుంటే కడవలో నీల్లు కల్లల్లో బోసి పాయనంట’’ అట్లా మేమిద్దరం జతగా ఉంటే దాని అత్తింటి వాల్లు, దాని మొగుడు దాన్ని తిట్టేది నా జతకు పోవద్దని. నా ఇంట్లో నా మొగుడు నన్ను తిట్టేది దాని జతకు నేను పోకూడదని. నూరుమంది నూరు మాటలన్నీ మేమిద్దరం జత ఇడిసిండ్ల. దానిది నాది పుట్నూరు, అత్తూరు రెండు ఒకటే.
ఇద్దరం ఉండూరులోనే పెళ్ళి చేసుకుంటిమి. అయినా దానికి అలవాటేలే మూడు దినాలు కొన్నాడు అలిగి పుట్టింటికి వచ్చేది. అయినా దాని అలుగు ఎంచేడి, పద్దన ఎలుతుంది మల్ల సాయంత్రం వస్తుంది. అందరికీ ఎగతాలి అయిపోయింది.
మా ఊర్లో సగానికి సగం మంది బేల్దారి పని చేసుకుని బతికే వాల్లే. వారమంతా చేసిన కష్టం మంగళవారం నాడు బట్టుబడ చేతిలోకి పడుతుంది. అందరూ టౌనుకు బోయే దూమ్రాన ఉండారు. నా మొగుడు కూడా ఎలబారిపోయినాడు. ఆయనట్ల పోతానే నేను సరస వాల్లమ్మ గారింటికి పోతి. ఆయాలకు అది కడి గిన్నిలో బెట్టుకొని తింటా ఉంది.
‘‘ఏమ్మే అలిగి వచ్చేసినావంట? బిడ్డలు మీ అంత అవుతా ఉండారు ఇప్పుడు అలిగి పుట్నింటికి వస్తే బగిసనం కాదా?’’ అంటి.
ఆ మాటకు ఉండుకోని సరస, ‘‘బగిసనం అయితే కానీలే ఎల్లకాలం ఎవరు బడేవాళ్ళు’’ అనే.
కాదుమే మీకెందుకు రంపు అంటే, ఆయమ్మి ‘‘చెప్పుకుంటే మానంబోతుంది చెప్పుకోకుంటే పానంపోతుంది. ఊర్లో చెప్పకూడదు ఎప్పుడన్నా ఊరు బయట మనమిద్దరమే ఉన్నప్పుడు చెప్తాలే’’ అనె.
ఆ మరునాడే మా ఊర్లో సీతాఫలం కాయలు పెరక్కచ్చి అమ్ముకుంటూ ఉండారు ఎవరెవరో. మాకు తినేదానికి కూడా లేకుండా చేస్తా ఉండారు. సొంత బూములకాడ చెట్లలో కాసిన కాయలు కూడా దొంగగా పెరుక్కొనిపోయి అమ్ముకుంటుండారు. తినేదాని కన్నా కాయలు పెరకొచ్చుకొందామని నేను, నా జతకు సరసను పిలుసుకొని పోతి. ముద్దలగుట్ట కల్లా సీతాఫలం చెట్లు బాగున్నాయి. గుంపులుగా ఉంటే యాడ పాములు ఉంటాయో అని అరస్త కరస్త బెదురుబెదురుగా పెరుక్కుంటున్నాము. ఒక తావున పెద్ద గుండ్లు ఉన్నాయి. ఆ గుండ్ల సందులో నాలుగు సీతాఫలం చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఎవరి కంట పడిరడ్ల. ఉచ్చిపచ్చి చూడకుండా దూకితే ఆ చెట్లల్లో ఒగొగ సీతాఫలం కాయి ఒక సంగటి ముద్ద అంతున్నాయి. ఒక్కొటి తింటే కడుపు నిండిపోతుంది. పెద్ద పెద్ద కండ్లు. కండ్లు తెరిచిన కాయలను చూసి ఎక్కడలేని సంబరం అయి పాయ. కాయి పట్టుకుంటే మాగి చేతిలోకి వచ్చేసింది. సుమారు పది కాయలు చెట్లోనే మాగి పొయినాయి. చెట్లు పండు బలే తీపు ఉంటుంది. ఆడ ఉగ తావునే తట్లు నిండిపోయినాయి. తెరిసిన కాయలన్నీ తట్లుకు పెరుక్కోని మాగిన కాయలన్నీ వొడిసి ఏసుకొని పక్కన కానగ మాను ఉంటే ఇద్దరం ఆ మాను కింద కూసోని ఆ కాయల పని పడితిమి. ఇద్దరం చెరో మూడు కాయలు తినేసరికి కడుపు నిండిపాయ. ఆయాలకు సరస ‘‘మే ఈ పొద్దు నా మొగుడు కచ్చితంగా నన్ను తారడతా ఉంటాడు, నేను ఫలానా పనికి పాతన్నా అని చెప్పి రాలా’’ అనే!
‘‘అది సరేమే మొన్న ఏమిటికి మీకు రంపు జరిగింది? ఆ పొద్దు చెప్పమంటే ఒంటిగా ఉన్నప్పుడు చెప్తాను అంటివే ఈ పొద్దు ఎవరూ లేరు చెప్పు’’ అంటి.
‘‘అయ్యో… మే అది చెప్పుకుంటే సిగ్గు చేటు నీవు నేను జతగా ఉన్నాము కాబట్టి నీకు చెప్తా ఉండా, నా పెండ్లి అయిన లగాదు నా మొగునికి నేను అరువుగా చీర కట్టుకొని, మగానికి పౌడరు పూసుకొని, నిండుగా పూలు పెట్టుకొని నగతా కనబడితే నన్ను చూసి, ‘ఏమి ఈ పొద్దు బలే సోగ్గా ఉండావు ఎవునికన్నా వస్తానని చెప్పినావా’ అంటాడు. అప్పుడే నా మనసు ఇరిగిపోతుంది. ఇద్దరం పడుకునేదానికి నాకు ఏమన్నా ఇబ్బందిగా ఉండి నేను ఒప్పుకోలేదనుకో అప్పుడు ‘బయట రుచి మరిగితే ఇంట్లో మొగుడు నచ్చడులే’ అంటాడు. నేను అన్నీ మూసుకొని తోసుకొని, దొబ్బుకొని పోతా. ఈ సినిమాలు చూసినప్పుడు పాటలు, డాన్సులు చూసి ఆలుమొగుడు ఒకరిమీద ఒకరు బలే ప్రేమగా ఉండేది చూసి ఒగసారి గాకున్నా ఒగసారి బెమేస్తుంది కదా. నా మొగిన్ని దబ్బుకొని ఆశ పట్టలేక ముద్దులు పెడితిననుకో అప్పుడేమంటాడు, ‘ఈ మధ్య నీకు ఎవుడో బాగా నేర్పిస్తా ఉండాడు. వాని దగ్గర సగదిరిగి వస్తాన్నవా’ అంటాడు. ఈ నా బట్టతో ఏందిలే అని గమ్మున కదలకుండా, మెదలకుండా పడుకోనుంటే దానికి ఓ మాట ‘నీకు నా మీద బెమ లేదు’ అంటాడు. ఎన్ని అన్నా మొగుడేలే అని ప్రేమగా చేతులెత్తేస్తే ‘నీకు ఈనాడు పొగరెక్కువయ్యింది నేను నీకు సాల్లేదులే’ అంటాడు. వాడు ఎట్లా చేస్తే అట్లా చేయించుకునేది, నాకు వాని మీద బెమ కలిగినా నేను వాని మీదకు యగబన్ను. మొన్న జరిగిన రంపు కూడా ఇదే. ఆ పొద్దు పానం అలుపుగా ఉందని ఇసిరేసిన. దానికి నన్ను నానా మాటలు అడిగినాడు. అందుకే నేను వచ్చేసిన. నేను ఎంత బెమగా ఉందామనుకున్నా వొట్టి నిందలు పెట్టడంతో బెమే చచ్చిపోతుంది. కాదుమే ‘తాను దొంగ అయితే పొరుగును నమ్మరంట’ అట్లా ఊరికెనే అనుమానిస్తాడు. తప్పు వాడు చేసి నన్ను ఏలెత్తి చూపిస్తాడు.
‘పొంగిందల్లా పొయిబాలు’ అనుకోని నేను నిబ్బరిచ్చుకొని పాతాఉంటే నన్ను అదవని చేసుకొని నోటికొచ్చినట్లు మాట్లాడుతాడు. కాదుమే నా పెళ్ళయినప్పటి నుంచి నా మొగునికి నా మీద అనుమానమే. ఎందుకంటే నా మొగుడు నాకు సరిజోడి కాదు. నాపైన అన్నీ మట్టమే. ఇది బాగుంది ఏడ నన్ను కాదని ఎవన్నన్నా మరుగుతుందేమోనని ముందుగానే నన్ను అనుమానిస్తాడు. నిజం చెప్పాలంటే నూటికో, కోటికో ఒక్కరిద్దరు తప్పితే మిగిలినోల్లంతా మొగునికి సంసారం చేయాల్లనుకునే వాల్లే కదా. మొగాడే ఆడదాన్ని తప్పు చేసేటట్లు చేసేది. వాని మాటలతోనే ఆడదాని మనసు చంచలం పట్టేది. అయినా యానాకొడుకు ఆడదాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి. ఈ మగ నా బట్టలు ఎప్పుడు ఆడదానిలో రంగు, పొంగు, జంపూ జాగిలీ చూసే కదా బెమ పడేది. మగాడు వానికి కుక్క అరువుగా ఉంటే దాన్ని కూడా ఇడిసిపెట్టడు. ఆడదాని నిలువు చూసి నిందలు పెట్టకూడదు, అని బాధ పడే.
‘‘నేను తప్పు చేయాలంటే ఈ యప్ప కావిలా?’’ అనే.
నిజమే ఆడది తప్పు చేయాలంటే కంట్లో కనుపాపను కత్తిరించి పోయి దాని పని చలాయించుకుని వస్తుంది. ఇట్లాటి దానికి మా గంగ తాత ఒక కథ చెప్పేది.
వొగ ఊర్లో ఒక బోగంది ఉన్నంట. ఆయమ్మ పడుపురుత్తి చేస్తా ఉన్నంట. ఊర్లో వాడొకడు, వీడొకడు మాట్లాడుకున్నారంట. ఏమనంటే ఒరేయ్ ఈ బోగంది నిన్ను రమ్మంటుంది, నన్ను రమ్మంటుంది, మన ఇద్దరికీ రంపు పెడతా ఉంది. దీన్ని బతకనీకూడదు చంపేయాల అని కూడబలుక్కొని ఆయమ్మను చంపేసినారంట.
ఆ మాట ఆ ఊరు రాజుకు తెలిపిరంట. ఆ రాజు రేపు ఏ ఆడదీ ఆ పని చేయకూడదు అని ఆ శవాన్ని నీల్లరేవుల కాడ పండేసి రండి అని చెప్పినాడంట. ఊర్లోని ఆడోల్లు నీల్లకు వచ్చినప్పుడు పోయినప్పుడంతా ఆయమ్మ శవాన్ని చూసి దీనికి అట్లే కావలసింది ఎవుడు చేయమన్నాడు ఆ పని అని తిట్టుకుంటూ పోతా ఉన్నారంట. ఒక ఇంట్లోని అక్క చెల్లెలు నీల్లకు వచ్చిరంట. అక్క ఆయమ్మ శవాన్ని చూసి బొరో అని ఏడుస్తా ఉందంట. చెల్లి ఉండుకొని ఎందుకే దాని శవం కాడ ఏడుస్తావు అది నీకేమన్నా అంటా సంటా, అందెంలో గెంటా యాడ పన్ని దానికోసం నువ్వు ఏడుస్తావు అనే. అయ్యో ఎవరన్నా కానీ అది మనట్ల ఆడదే కదా, చేసిన మగ నా కొడుకులు బాగనే ఉండారు. చేపించుకున్న దాన్ని చంపేసినారు అని బాధపడే. ఆ మాటకి చెల్లిలు ఏమన్నంటే అది కాకపోతే ‘‘అరువు ఎరక్క లంజరికం చేసి కొంటినక్కల పాలైంది, అదే నేనయితే మొగున్ని మిండగాన్ని చేసిందు. మిండగాన్ని మొగున్ని చేసికునిందు,’’ అన్నంట.
ఆ చచ్చినమ్మను చూసి ఊర్లోటి అమ్మలక్కలంతా ఏమనుకుంటారో వినాలని ఇద్దరు రాజులు చాటుగా వింటా ఉండారంట. చెల్లెలు మాట్లాడిన మాటలు అన్నీ విని ఇది మొగిన్ని మిండగానిగా, మిండగాని మొగినిగా చేసేది ఎట్లనో చూడాలని ఇద్దరు రాజులు మారు వేషాల్లో వాల్లింటికి పాయిరంట. వాల్ల ఇంట్లో వాల్లు ఏ ఊరు, ఏ దేశం, ఎక్కడి నుంచి వస్తా ఉండారు అని అడిగినారంట. మాది ఫలానా తూర్పు తుంగభద్ర రాజ్యం. మేము మీ వొతుకులే. మా తమ్మునికి పెండ్లి కూతురు కావల్ల. మీ చిన్నమ్మాయిని ఇస్తే మా తమ్మునికి చేసుకుంటాము. మేము చానా గురుత్రమైన మనుషులం అని చెప్పారంట. పిలగ్లా పుట్టు, రేక బాగానే ఉందని వాల్లు చిన్నదాన్నిచ్చి పెండ్లి చేసిరంట. అన్నా, తమ్ముడు ఆయమ్మను గుర్రంమీద ఎక్కించుకొని వాళ్ళ రాజ్యానికి పాయిరంట. ఆ యమ్మను ఒంటిస్తంభం మేడలో పెట్టి రేయింపొగులు మగవాన్ని ఎవుర్నేగాని రానీయకుండా మధ్యలో ఆ యమ్మను పండేసుకుని ఆ పక్క అన్న, ఈ పక్క తమ్ముడు కావలి ఉంటామనుకున్నారంట. అన్న ఆర్నెల్లు, తమ్ముడు ఆర్నెల్లు కావలి ఉండిరంట. వీళ్ళిద్దరు నిద్రమేలుకొని, మేలుకొని అలిసిపోయి ఒకనాడు ఇద్దరూ ఆదమరిచి నిద్రపోయినారంట. ఆ సందులో ఈ అమ్మ మరిగినోన్ని రమ్మనంట. వాడొచ్చి మధ్యలో దుప్పట్లో దూరి పడుకున్నాడంట. తెల్లారు జాముకాడ తమ్ముడు లేసి చూసినాడంట. మా అన్న చూడు నేను ఈడ ఉంటే దాని పక్కలో పడుకున్నాడు, నాకు చెప్పి ఉంటే నేను కడగా పోయిందు కదా అని మగము ఆ పక్కన తిప్పుకొని పడుకున్నాడంట, మల్ల కొంచేడికి అన్నయ్య అయినోడు లేసి చూసినంట. నా తమ్ముడు చూడు నన్ను ఈడ పెట్టుకొని పక్కలో పడుకున్నాడు. నాకు చెప్పి ఉంటే నేను దూరంగా పోయిందును కదా అని మొహం తిప్పుకొని పడుకున్నాడంట. ఆ తెల్లారి ఇద్దరూ కోపంగా మాట్లాడకుండా నదికి తానానికి బోయె, మల్ల ఇద్దరూ ఎదురుబొదురు బడి నువ్వు రాత్రి చేసింది ఏం బాగోలేదు అని ఒకరినొకరు అడ్డుకున్నారు. నేను కాదని అన్న, నేను కాదని తమ్ముడు మాట్లాడుకుని, అంటే రాత్రి ఎవడో వచ్చినాడు అని తమ్ముడు ఐనోడు ఆలోసన సేస్తా అట్లా ఊరులోకి పోయినంట. ఆ ఊర్లోకి అప్పుడే ఇద్దరు బైరేగులు వచ్చినారంట. వాల్లు ఊరంతా తిరిగి ఊరి ముందర మర్రిచెట్టు కింద కూసున్నారంట. ఊరంతా తిరిగి అలిసిపోయినాము, మన చెలికత్తెలతో కాసేపు సుద్దులాడుకుందామని వాళ్ళ తలకాయ జుట్టులో పెట్టిన ఇద్దరు అమ్మాయిల్ని తీసి వాల్లతో సరసాలు ఆడి అలిసిపోయి బంగు తాగి ఆ మత్తులో అట్లే నిద్రపోయిరంట. ఈ బైరాగులు నిద్రపోయిన తర్వాత ఆ చెలికత్తెలు వాల్ల రైకముల్లో ముడేసుకుని ఉన్న వాల్లు ప్రేమించిన చెలికాల్లను బయట తీసి వాల్లు ఈల్లు సరసాలు ఆడుకున్నారంట. ఇదంతా రాజు సూస్తా ఉన్నాడంట. ఈ బైరేగులకూ మెలకువచ్చి లేసి వెళ్ళిపోతా ఉండారంట.
ఆ యాలకు ఈ రాజు పోయి ఆ బైరాగుల్ని అడ్డగించుకొని ఈ రోజు మా ఇంట్లో భోంచేసే మీరు పోవల్ల అని వాల్లను ఇంటికి తీసుకుపోయి ఇంట్లో వాల్లమ్మకు ఏడు ఇస్తరాకులు కుట్టి భోజనం పెట్టమన్నారు. వాళ్ళ అమ్మ వచ్చింది ఇద్దరే కదా ఏడు ఆకులు ఎందుకు అనుకుంటా ఏడు ఇస్తర్లు కుట్టి భోజనం వడ్డించిందంట. తొలుత బైరాగులిద్దరు విస్తర్ల ముందు కూర్చొని భోజనంలో చేయి పెట్టబోయిరంట. అప్పుడు ఈ రాజు… అయ్యా మీరు తిని మీ చెలికత్తెలు తినకుంటే నాకు మహాపాతకం. వాళ్ళను కూడా రమ్మనండయ్య అన్నంట. ఈ బైరేగులు లేదయ్యా మేమిద్దరమే అంటారంట, అట్లా కాదు లేయ్యా నేను చూసినాను అన్నంట రాజు. అప్పుడు చేసేదేం లేక వాళ్ళ చెలికత్తెలను కిందికి రమ్మనిరి. వాళ్ళకు భోజనాలు పెట్టి వాళ్ళు తినేటప్పుడు మీరు తిని మీ చెలికాల్లు తినకుంటే మాకు మహాపాతకం వాళ్ళను కూడా రమ్మనండయ్యా అనే. వాళ్ళు రైకి ముల్లు ఇప్పిరంట. చెలికాల్లు వచ్చి ఆకులు ముందర కుసుండిరంట. అందరూ తినేటప్పుడు ఈ రాజు పెళ్ళి చేసుకున్న ఆయమ్మను పిలిచి వీళ్ళందరూ తిని రాత్రి వచ్చినోడు తినకపోతే నాకు మహాపాతకం. వాన్ని రమ్మను అన్నంట. వీల్లు తానానికి పోతానే వాన్ని గదిలో వేసి తాలం వేసిందట ఆ యమ్మ. తాలం తీస్తే అప్పుడు వాడు వచ్చి ముందర కుసున్నంట. అప్పుడు మొత్తం ఏడుమంది అయినారు. ఏడు ఆకులు ఎందుకు కుట్టమన్నాడు అని అబుడు వాల్లమ్మకి అర్థం అయినంట.
తర్వాత ఆ రోజు రాత్రి వచ్చినోనికి ఆయమ్మని ఇచ్చి పెండ్లి చేసినంట. అట్లా ఆయమ్మ అన్న మాట నిజం చేసింది. ‘మొగుడు మిండగాడాయ, మిండగాడు మొగుడాయె.’’
అట్లా ‘ఆడదాన్ని నమ్మితే సొమ్ము నమ్మకుంటే దుమ్ము’ మిగిలేది!
(బతుకీత పుస్తకం నుండి)