‘‘సంఘం రేడియో వింటున్న మీ అందరికీ నమస్తే… అందరూ బాగు న్నారా? ఏం జేస్తున్నరు?
పొద్దుబోయింది. పొద్దంతా చేన్లల్ల పనులన్నీ ముగించుకొని ఇంటికొచ్చిన్రు గదా…పిల్లలను జూసుకొంటూ, రొట్టె కూర జేసుకుంట సంగం రేడియో తట్టు ఒక చెవి పెట్టుకుంటే మంచిగుంటదని కోరుతున్న’’
ఆత్మవిశ్వాసం, ఆత్మీయత తొణికిస లాడుతుండగా తీయని కంఠంతో శ్రోతల ను పలకరిస్తుంది ఆ స్వరం.
ఆసియాలోనే తొలి మహిళా రేడియో స్టేషన్, దేశంలో మొదటి గ్రామీణ కమ్యూ నిటీ రేడియో నడుపుతున్న వారిలో ఒకరు.
2008, అక్టోబర్ 15వ తేదీన తన గళం కమ్యూనిటీ రేడియోలో వినిపించిన మొదటి వ్యక్తి ఆమె.
పదవ తరగతి మాత్రమే చదివిన ఆమె రేడియో ప్రసారాలు చేస్తుంది. ఎడిటింగ్ చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ చేస్తుంది. అవుట్ డోర్, ఇండోర్ రికార్డింగ్ చేస్తుంది. గ్రూప్ డిస్కషన్స్ నిర్వహిస్తుంది. యాక్టివిటీ లాగ్ చేస్తుంది. రేడియో జాకీగా, యాంకర్‌గా వ్యవహరిస్తుంది.
సమాజపుటంచుల్లోకి నెట్టివేయబడిన ఈ గ్రామీణ మహిళ ‘‘అవుట్ స్టాండిరగ్ వర్క్ బియాండ్ ది కాల్ ఆఫ్ డ్యూటీ (విధికి మించిన విశేష కృషి)’’ అవార్డు అందుకో వడం విశేషం.
ఆమెనే అందరూ జనరల్ అని పిలిచే జనరల్ నర్సమ్మ జహీరాబాద్ జిల్లా పస్తాపూర్ నివాసి. పదేళ్ళు నిండిన తర్వాత దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ నడిపిన నాన్ ఫార్మల్ స్కూల్ పచ్చ బడిలో చేరి పదో తరగతి పాసయింది. కూలి పనులకు వెళ్తూనే చిన్నప్పటి నుంచి రేడియో నారో కాస్ట్ చేసేది.
‘మీ రేడియోలో మాకు జాగా ఉండదు. ఇచ్చినా చాలా చాలా కొద్దిగా ఇవ్వగలరు. మా రేడియో మాకుంటే మా మాట, మా పాట, మా ముచ్చట, మా వంటలు, మా తిండి, మా తిప్పలు… అన్నీ మావి మేమే చెప్పుకుంటాం. అందుకే అనుమతుల కోసం పెద్ద యుద్ధమే చేసి సాధించుకు న్నాం’’ అని ఒకింత గర్వంగా చెబుతుంది ఆమె.
డిడిఎస్ సహకారంతో నిర్మించుకున్న సంఘం రేడియో స్టేషన్‌లో ట్రాన్స్‌మిషన్ పని చేయమన్నప్పుడు భయపడిరది. అమ్మో నేనేం చేయగలను అని అనుమాన పడిరది. సంస్థ కొంత శిక్షణనిచ్చింది. దాంతో ఆమె ధైర్యంగా ముందుకు సాగింది. 150 గ్రామాలకు పరిచయమై స్థానిక పలుకుబడులు, సామెతలతో వినసొంపుగా ఉండే భాషతో, కమ్మటి స్వరంతో శ్రోతలకు దగ్గరైంది.
ఏ చెట్లకిందో కూర్చుని ముచ్చట పెడుతున్న పెద్దల దగ్గరికి పోయి వాళ్ళతో ముచ్చట పెడుతుంది. చర్చలు చేస్తుంది. పాటలు పాడిస్తుంది. కథలు చెప్పిస్తుంది. ఏది చేసినా అందుకోసం రిహార్సల్స్ ఉండదు. ఆయా ముచ్చట్లు, చర్చల ద్వారా వాళ్ళ అనుభవసారాన్ని టేపుల్లో నిక్షిప్తం చేస్తుంది. జనరల్‌కి భాషపట్ల మక్కువ ఎక్కువ. తెలుగు, మరాఠీ, కన్నడ, ఉర్దూ పదాలతో ఉండే తమ వాడుక భాష నుంచి ఎన్నో పదాలు అంతరించిపోవడం గురించి బెంగపడు తుంది. వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. పదిల పరచుకునే మార్గాలు అన్వేషిస్తుంది. అందులో భాగంగానే రేడియో ద్వారా ప్రతి రోజు ఒక కొత్త పదం పరిచయం చేస్తుంది. బుడగ జంగాలు చెప్పే కథల్లో తమ భాష పదాలు సజీవంగా ఉన్నాయని సంతోషపడుతుంది. వాళ్ళ మాటలను, పెద్ద వయసు వారి మాటలను రికార్డు చేసినపుడు వారి మాటల్లో దొర్లిన పదాల్లో తనకు కొత్తగా అనిపించిన వాటిని ఏరుకుంటుంది. రేడియో ద్వారా తిరిగి జనంలోకి తీసుకొస్తుంది. అలా చేయడంలో తనకి ఆసక్తి మాత్రమే కాదు తృప్తి కూడా ఉందంటుంది జనరల్.
కనుమరుగై పోతున్న పండుగలు, వ్యవసాయ విధానాలు, జానపదుల పాటలు, కథలు, వైద్యం వంటి వాటిని నిలుపుకోవ డంతో పాటు మందులు లేని వ్యవసాయం, ఆడవాళ్ళ సమస్యలు, పిల్లల చదువు, ఆరోగ్యం, ఎన్నో విషయాలను జనం నుంచి తీసుకుని జనంలోకి తీసుకుపోతుంటుంది జనం మనిషి జనరల్. ఆమె చేసే ‘యారాళ్ళ ముచ్చట్లు’ మహిళా శ్రోతలకు మరింత ఇష్టం.
ఆకాశంలో పిట్టలాగా ఎగిరే విమా నాన్ని అబ్బురంతో చూడటమే కానీ ఎక్కగలనని కలలో కూడా అనుకోని ఆమె విమానం ఎక్కి శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ వెళ్ళింది. నాకు రేడియో సంతోషాన్ని చ్చింది, గౌరవాన్ని చ్చింది అంటుంది జనరల్ నర్సమ్మ.
భార్య, భర్తల మధ్య ఉండాల్సింది ఎక్కువ తక్కువ కాదని స్నేహం, పరస్పర అవగాహన ఉండాలని చెప్పే జనరల్‌కి డిగ్రీ చదవాలని కోరిక. ఆమె కోరిక నెరవేరాలని ఆకాంక్షిద్దాం.