రమ ఓ సామాజిక కార్యకర్త. మహిళలపై హింసకి వ్యతిరేకంగా పనిచేసే సంస్థలో ఫీల్డ్ కో`ఆర్డినేటర్‌గా నారాయణపేట జిల్లాలో పనిచేస్తోంది. ముగ్గురు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఉన్న కొద్దిపాటి భూమిలో తనే వ్యవసాయం చూసుకుంటూ పిల్లల్ని చదివించింది. ఐదో తరగతితో బడి మానేసిన రమకి చదువంటే మహా ఇష్టం. హైస్కూల్‌కి
వెళ్తానంటే ములుగర్ర జూపించి నిలవరించిన నాన్నంటే భయం. 13 ఏళ్ళకే సంబంధం తెచ్చి వద్దని మొత్తుకున్నా కట్టబెట్టించిన పెదనాన్నంటే కోపం. వేటికీ ఎదురు చెప్పలేని, అసలు కాదనే మాటే మాట్లాడలేని తల్లంటే జాలి. వీటన్నింటితో అత్తారింటికెళ్ళిన రమకి తనకంటే ముందే ఆ ఇంటి కోడళ్ళైన తన తోటికోడళ్ళతో మంచి స్నేహం ఏర్పడిరది. నాలుగైదేళ్ళకంటే వయసు తేడా లేని ఆ ముగ్గురూ సొంత అక్కాచెల్లెళ్ళలా కలిసిపోయారు. ముగ్గురికీ కలిపి తొమ్మం డుగురు పిల్లలు. ఇద్దరు తప్పించి అందరూ మగపిల్లలే. అందరూ ఒకే దగ్గర ఎవరు ఎవరి పిల్లలో తెలియనంతగా కలిసి పెరిగారు.
భర్త చనిపోయాక సంవత్సరానికి మామ గారు కూడా పోవడంతోనే పరిస్థితులు మారి పోయాయి. కొన్ని తగాదాలు, గొడవల తర్వాత పదెకరాల భూమిని పంచుకున్నారు. ఒకెకరం తల్లి పేరన ఉంది. మిగతా తొమ్మిదె కరాలు మూడు కుటుంబాలకి సమానంగా రిజిస్టర్ చేయించారు. ఇక ఎవరి భూమిలో వారు పండిర చుకోవడం మొదలయ్యాక మెల్లిగా తెలియ కుండానే మూడు కుటుంబాల మధ్య దూరం పెరగడం మొదలైంది. కానీ తోటికోడళ్ళకు మాత్రం ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం. రోజూ కాసేపు ఏదో ఒక వంకతో కలిసి మాట్లా డుకుంటూనే ఉంటారు.
వాళ్ళ ఊర్లో మహిళలతో పనిచేసే సంస్థ ఒకటి పనిచేయడం మొదలెట్టినపుడు రమని చదువుకోమని ప్రోత్సహించారు. ఈ వయసులో చదువేంటని మొదట్లో సిగ్గుపడ్డా చదువంటే ఉన్న ఇష్టంతో దాదాపు పదిహేనేళ్ళ తర్వాత మళ్ళీ పుస్తకం పట్టింది. ఏడాదిలోనే అన్నీ గుర్తు చేసుకుని చిన్న కొడుకుతో కలిసి ఏడో తరగతి పరీక్షలు రాసి పాసయ్యింది. ఆ ఉత్సాహంతో మళ్ళీ సంవత్సరానికి ప్రైవేటుగా పదో తరగతి రాసి పాసయ్యింది. దీంతో తనమీద తనకి నమ్మకం, ధైర్యం మరింత పెరిగాయి. ఆ సంస్థ వారు రమలోని చైతన్యాన్ని చూసి కార్యకర్తగా చేర్చు కున్నారు. ఇక అక్కడి నుండి అంచె లంచెలుగా ఎదిగి, ఊరుదాటి జిల్లా దాటి ఎక్కడెక్కడో పనిచేసింది. పిల్లలు ముగ్గురూ ప్రొషెషనల్ కోర్సులు చేసి మంచి ఉద్యోగాలు సాధించారు. బావల పిల్లలు మాత్రం ఎవ్వరూ పదో తరగతి పూర్తి చేయలేదు. పిల్లలు సఖ్యం గానే ఉన్నట్టున్నా ఎక్కడో అంతరం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే
ఉంటుంది. వారంతా కలవడం కూడా తగ్గింది.
రమ పిల్లలు ‘ఇన్నాళ్ళూ కష్టపడ్డావు, ఇప్పుడు మేము సంపాదిస్తున్నాం. ఇక ఆ ఊళ్ళు తిరిగే
ఉద్యోగం మానేసి రెస్ట్ తీసుకో అమ్మా’ అని పదే పదే అంటుంటారు. సమాధానంగా ‘మీకది
ఉద్యోగంలా అనిపిస్తుంది. కానీ నాకది జీవితం. నేను డబ్బు కోసం ఈ పని చేయట్లేదు. మీ ముగ్గురే కాదు, ఇంకా ఎంతోమంది మీలా అవ్వాలని నా కోరిక. ఆ కుటుంబాలకి చేదోడు నివ్వాలి. ధైర్యా న్నిస్తూ దారి చూపించాలి. ఒక్కొ క్కళ్ళు మంచి కాలేజీలో సీటొచ్చిందని, ఉద్యోగంలో చేరామని, పోటీ పరీక్షల్లో పాసయ్యా మని చెప్తుంటే నేనే కలెక్టరయినంత సంతోషంగా అనిపిస్తుంది. నేను బతికున్నంతకాలం, చెయ్య గలిగినన్ని రోజులు ఈ పని చేస్తూనే ఉంటా. మీరు నన్ను ఆపాలని చూడొద్దు. మీరు చెప్పినా నేను ఆపను కాబట్టి చెప్పి ఓడిపోయామని అనుకోవద్దు’ అని ఖచ్చితం గా చెప్పేసింది రమ.
పెద్దోడు ఓ రోజు అననే అన్నాడు,‘ఊరంతా బాగు చేస్తానంటావు. మన కుటుంబంలోనే ఇంకా ఐదుగురు అన్నదమ్ములున్నారు. పదన్నా పాసవ్వ లేదు ఒక్కడూ. ఏ పనీ చేయకుండా తిరిగే వాళ్ళిద్దరైతే, వ్యవసాయం చేయలేమని ఎటూ కాకుండా తాగుడు, తిరుగుడు, పెళ్ళైనా వ్యస నాలు… ఒక్కొక్కడూ ఒక్కోలా ఉన్నాడు. అది నీ వైఫల్యం కాదా!’ చాలా సూటిగా అడి గాడు. దానికి రమ బాధపడలేదు, కోప్పడలేదు. ‘పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టు ఎన్ని రకాలుగా చెప్పినా, సాయం చేయాలని చూసినా నన్నే చులకన చేయడం నీకు తెలీదా? ఒంటరి దాన్నని, ఇష్టారాజ్యమైపోయిందని ఎన్నేసి మాటలన్నారో నువ్వినలేదా? మర్చిపోయావా?’ అని ప్రశాంతం గా అడిగింది. ఆ రోజులన్నీ గుర్తొచ్చి ‘నిన్ను గన్న నా తమ్ముడు సచ్చిపోయాడు కానీ, నీకు ఊరూరా నాన్నలే ఉన్నట్టున్నారు’ అని అమ్మ ఈ ఉద్యోగం చెయ్యడం ఇష్టంలేని పెదనాన్న తనతో అక్కసుగా అన్న మాటలు గుర్తొచ్చి ‘సారీ అమ్మా’ అంటూ అమ్మని పట్టుకొని ఏడ్చాడు. మనసులో ఏదీ పెట్టుకోకుండా వీలయినప్పుడల్లా ఊరికి వెళ్తూనే ఉంటారు. వీలైనంతగా అన్నదమ్ములకి డబ్బు సాయం చేస్తూనే ఉన్నారు.
పెద్ద బావ చిన్న కొడుకు పెళ్ళిక నెల్రోజులే. ఆ తర్వాత నా చిన్నోడికి కూడా మంచి సంబంధం చూడాలి’ అనుకుంటుండగా రమ ఫోన్ మోగింది. ఉలిక్కిపడి ఫోన్ చూస్తే పెద్ద తోటికోడలు. చిన్నగా నవ్వుకుంటూ ఆన్ చేసి అలానే నిశ్చేష్టయి పోయింది. అవతలినుంచి ‘చిన్నోడు సచ్చిండే’ అని ఆమె ఏడుపు. నెల్రోజుల్లో పెళ్ళి, మూడ్నెల్ల యింది ఎంగేజ్‌మెంట్ అయ్యి. ఇంతలో ఇదేంటని ఉరుకులాడుతూ ఆస్పత్రికి వెళ్ళింది రమ.
పెద్ద బావ చిన్న కొడుకు గిరి. పదో తరగతి పూర్తి చెయ్యలేదు. వ్యవసాయంలో తండ్రికి సాయం చేస్తుంటాడు. ఇంటర్ చదివిన సంగీతతో పెళ్ళి నిశ్చయమైంది. ఎంగేజ్‌మెంట్ అయినప్ప ట్నించి సంగీతని వేధించడం మొదలెట్టాడు. ఫోన్ చేసిన వెంటనే తియ్యకపోతే ఎక్కడ తిరుగుతు న్నావని, ఫోన్ ఎంగేజ్ వస్తే ఎవడితో మాట్లాడుతు న్నావని, ఏదన్నా ఒక మాట ఒప్పుకోకపోతే ఎక్కువ చదివావన్న పొగరని… వేధించడానికి అంతే లేదు. మూడ్నెల్లుగా భరిస్తూ వస్తున్న ఆ అమ్మాయి ‘ఇక నా వల్ల కాదు. ఈ సంబంధం నాకొద్దు. ఈ పెళ్ళి చేసుకోన’ని భీష్మించిందట. పిల్ల తండ్రి వచ్చి చెప్పిపోయాడట. ఇది విన్న గిరి నానా గొడవా చేసి ‘అసలు దానికి ఎవడో ఉన్నాడు కాబట్టే ఇలా చేసింది, దాని అంతు చూస్తాన’ని ఆవేశంగా వెళ్ళాడట. అమ్మాయిదో చిన్న పల్లెటూరు. వాలంటీర్‌గా పనిచేస్తున్న సంగీతంటే ఆ ఊరివారందరికీ అభిమానం. ఇబ్బందుల్లో ఉన్న ప్రతి కుటుంబానికీ తగిన ప్రభుత్వ పథకమో, ప్రభుత్వేతర సాయమో అందేలా చూసే సంగీతని ఇష్టపడని వాళ్ళే లేరు ఆ ఊళ్ళో. ఆవేశంగా అక్కడికెళ్ళిన గిరికి ఊరివాళ్ళు బుద్ధి చెప్పి పంపించారు. అవమా నపడ్డ గిరి సరాసరి పొలానికెళ్ళి కల్లు తాగి, అక్కడున్న గుళికల మందు మింగి ఏ రాత్రో ఇంటికొచ్చి పడ్డాడట. తెల్లారకముందే చేనుకి నీరుకడ్దాదమని లేచిన తండ్రి నురగలు కక్కుకుం టున్న గిరిని చూసి గుండెలు బాదు కుంటూ హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఒక గంటకి పోయాడట. రమ వాడ్ని మార్చలేకపోయానని తల్లడిల్లి పోయింది.
సంక్లిష్టమైన సమయాల్లో ఉన్నాం. జీవితాల్ని ఇంకా సంక్లిష్టంగా చేసుకుంటున్న యువతకి మార్గనిర్దేశం ఏది? ఎవరు చెయ్యాలి? ఎలా??