మన్యం సిగలో పువ్వు గుడిస – కొండవీటి సత్యవతి

రాజమండ్రికి వెళ్ళింది ఆఫీస్‌ పనిమీద ఒకరోజు ఆఫీస్‌కి, ఒకరోజు నాకు. రంపచోడవరం, చిలకమామిడి, మారేడుమిల్లి, గుడిస. ఒక్కరోజు ప్రోగ్రాంలో ఇన్నింటిని ఇరికించాను.

రాజమండ్రిలో మీటింగ్‌ అయ్యాక ఐదు గంటలకి రంపచోడవరం బయలుదేరాను. పిల్లల కోసం స్వీట్లు, చాక్లెట్లు వగైరాలు కొని కారెక్కుతుంటే హఠాత్తుగా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. బాగా వానొచ్చేట్టుంది మేడం, వానొస్తే ఫర్వాలేదు కానీ గాలి రాకూడదండీ అన్నాడు డ్రైవర్‌ వినయ్‌. గోకవరం దాటాక చూస్తే రోడ్డు మీద బోలెడు ట్రాఫిక్‌ ఆగిపోయింది. రోడ్డు మధ్య వరకూ ఓ పెద్ద చెట్టు కూలిపోయింది. నేను చెప్పాను కదండీ గాలేస్తే అంతేనండి, చెట్లు పడిపోతాయి. వర్షాకాలం ఏజెన్సీ ఏరియాకి రాకూడదండీ అన్నాడు. ఓ గంట అక్కడే ఉన్నాం. జిల్లా కలెక్టర్‌ కూడా ట్రాఫిక్‌లో ఉన్నాడండీ అని వార్త పట్టుకొచ్చాడు. కలెక్టర్‌ ఉన్నాడని చెట్టుకు తెలియదు కదా మనతో పాటే కలెక్టర్‌ అంటూ నవ్వాను. అరగంట తర్వాత పోలీసులొచ్చి చెట్టును తొలగించారు. ట్రాఫిక్‌ మెల్లగా కదిలింది. దారి పొడుగునా కరెంట్‌ లేదు. గాలి బీభత్సానికి చెట్లు కూలి కరెంట్‌ స్తంభాలమీద పడ్డాయట.
చీకట్లోనే గెస్ట్‌హౌస్‌ చేరాం. జనరేటర్‌ ఉందని చెప్పారు కానీ అరగంటయ్యాక అది పనిచేసింది. అప్పటికే చిలకమామిడి నుండి ఆదిరెడ్డి వచ్చి అక్కడ ఉన్నాడు. భోజనానికి వాళ్ళూరు వెళ్ళాలి, కానీ గాలీ వాన వల్ల కరెంట్‌ పోయింది. ఊరంతా చీకట్లో ఉందని చెప్పి నా కోసం నాటుకోడి కూర తెచ్చాడు. థాంక్స్‌ చెప్పి, మర్నాటి ప్రోగ్రాం ఫిక్స్‌ చేసుకుని అతన్ని పంపించేశాను. 12 గంటలకి కరెంట్‌ వచ్చింది. హాయిగా నిద్రపోయాను. మర్నాడు ఉదయం ఆరింటికల్లా తయారైపోయి మారేడుమిల్లి, అక్కడి నుండి గుడిస వెళ్ళాలని బయల్దేరాం. ‘‘గుడిస’’ వెళ్ళాలంటే పర్మిషన్‌ కావాలంటున్నారు, టూరిస్టులని వెళ్ళనీయడం లేదంట, అక్కడి సర్పంచ్‌ నాకు తెలుసండీ, ఆయన దగ్గరికెళ్దాం అన్నాడు ఆదిరెడ్డి. పర్మిషన్‌ ఎందుకు అంటే, ‘టూరిస్టులు గుడిస కొండని చాలా పాడుచేశారు.
వందల్లో టూరిస్టులొచ్చి రాత్రి ళ్ళు కొండమీద ఉండిపోయి టెంట్లు వేసి, మంటలేసి, తాగి సీసాలు పగలగొట్టి నానా బీభత్సం చేశారండి. విపరీతంగా ప్లాస్టిక్‌ సీసాలు వదిలేసి, మిగిలిపోయిన ఆహారాలు విసిరేసి ఇంకా చాలా నాశనం చేశారండి. గుడిస అంటేనే గడ్డి కొండ. మంటలేసి పొల్యూట్‌ చేసి గడ్డంతా పాడుచేశారు. అందుకే టూరిస్టుల్ని ఆపేశారు’ అన్నాడు ఆదిరెడ్డి. మేడంగారూ నా బండి గుడిస కొండ ఎక్కదండి, మీరు జీప్‌లో వెళ్ళాలి అన్నాడు వినయ్‌. ఆయనే బొలేరో బండి మాట్లాడాడు. మారేడుమిల్లిలో మంచి పెసరట్టు తిని బొలేరోలో గుడిసకు బయలుదేరాం. బొలేరో డ్రైవర్‌ సూర్యప్రకాష్‌. మారేడుమిల్లి నుండి గుడిస వెళ్ళే దారంతా దట్టమైన అడవి. మహాద్భుతంగా ఉంది ప్రయాణం. చిన్న ఊళ్ళు, విస్తారంగా జాఫ్రా తోటలు. మొదట నేను కాఫీ తోటలనుకున్నాను. ఇక్కడ చాలా కాలంగా జాఫ్రా పండిస్తున్నారని ఆదిరెడ్డి చెప్పాడు.
పుల్లంగి అనే ఊరి దగ్గర ఆగి సర్పంచ్‌తో మాట్లాడడానికి ఆదిరెడ్డి వెళ్ళాడు. సర్పంచ్‌ లేరని, ఆయన భార్యకి చెప్పి వచ్చానని చెప్పాడు. మీరు చూసి వచ్చేయడమే కదా ఫర్వాలేదు వెళ్ళి రండి అన్నారట. సూర్యప్రకాష్‌ చాకచక్యంగా డ్రైవ్‌ చేస్తూ గుడిస వైపు బయలుదేరాడు. ఘాట్‌ రోడ్డు చాలా ఘోరంగా ఉంది. వానకి పెద్ద పెద్ద గుంతలు, మలుపులు మరీ ప్రమాదకరంగా ఉన్నాయి. కిందంతా చాలా అందమైన లోయలు. ఆకుపచ్చటి అడవి. దారంతా కొండ చీపుర్ల మొక్కలు. దీన్ని చీపుర్ల కొండ అంటారని చెప్పాడు ప్రకాష్‌.
ఒక మలుపు దగ్గర ఒకామె ఒక్కతే నడుచుకుంటూ వెళ్ళడం కనిపించింది. ఎవరీమె ఒక్కతే వెళ్తోంది అంటే అటువైపు గుడిస గ్రామముంది, ఆ గ్రామం నుంచే ఆమె వెళ్తోందని చెప్పాడు ప్రకాష్‌. మేము తిరుగు ప్రయాణంలో కొండ కింద ఆమెను కలిశాం.
గుడిస కొండ మలుపులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రకాష్‌ చాలా చాకచక్యంగా డ్రైవ్‌ చేస్తూ ‘నేను రోజుకు రెండు, మూడు ట్రిప్పులు వచ్చేవాడ్ని. టూరిస్టులు విపరీతంగా వచ్చేవారు. మాకు ఆదాయం బాగా ఉండేది. ఇప్పుడంతా పోయింది మేడమ్‌’ అన్నాడు. ‘అవునండీ వాళ్ళవల్లనే కొండమీద చాలా ప్లాస్టిక్‌ పేరుకుపోయింది. ముఖ్యంగా ఇది గడ్డి కొండ. రాత్రిళ్ళు మంటలేయడం వల్ల ఆ గడ్డంతా పోయింది. గ్రామస్తులంతా పది రోజుల పాటు క్లీన్‌ చేశారు. అంత చెత్త పేరుకుపోయింది. అందుకే మొత్తం బంద్‌ చేశారు’ అన్నాడు ఆదిరెడ్డి. పైకి వెళ్ళాక ఆ విషయం అర్థమైంది. ఎక్కడ చూసినా పగిలిపోయిన మందు బాటిళ్ళ పెంకులు, గడ్డిలో ప్లాస్టిక్‌ సీసాలు ఇంకా కనబడుతున్నాయి. కొండమీద నుంచి కిందికి చూస్తూ కళ్ళు తిప్పుకోలేకపోయాను.
చుట్టూ పచ్చటి కొండలు, లోయలు, ప్రకృతి సౌందర్యం పోతపోసినట్టుంది. ఎక్కడినుండో నెమళ్ళు కూతలు వినిపిస్తున్నాయి. అదిగోండి అదే గుడిస ఊరు అన్నాడు ఆదిరెడ్డి. అందమైన లోయలో కొన్ని ఇళ్ళు కనిపిస్తున్నాయి. అదిగో చూడండి ఆ రోడ్డు ఆ ఊరికెళ్ళడానికి వేశారు అంటూ పాములా మెలికలు తిరిగిన రోడ్డును చూపించాడు. మెలికలు మెలికలుగా ఆ రోడ్డు గుడిస గ్రామానికి వెళ్తోంది. అక్కడికి వెళ్ళొచ్చా అని అడిగితే కష్టం మేడం వెహికల్‌ వెళ్ళదు అన్నాడు ప్రకాష్‌. గుడిస గ్రామస్తులు ఈ కొండెక్కి, దిగి కింద గ్రామానికి వెళ్ళి కావలసినవి తెచ్చుకుంటారు. హమ్మో ఎంత కష్టం అనుకున్నాను. కొండ చుట్టూ అందమైన లోయల్ని, కొండల్ని చూస్తూ చాలాసేపు తిరిగాను. అయితే కొండ మీద మచ్చుక్కూడా ఒక్క చెట్టు లేదు. నీడ లేదెక్కడా. చిట్టీత మొక్కలూ, గడ్డి తప్ప మరేమీ లేవు. చీపురు మొక్కలు ఉన్నాయి.
నీళ్ళు కానీ, బాత్రూమ్‌లు కానీ ఏమీ లేవు. అంతమంది టూరిస్టులొచ్చి సకలం బహిరంగ ప్రదేశంలోనే కానిచ్చి కొండ మొత్తాన్ని ఓపెన్‌ టాయ్‌లెట్‌ చేసి ఉంటారు. రాత్రి టెంట్‌లు వేసుకొని ఉన్నవాళ్ళు ఉదయాన కాలకృత్యాలన్నీ బయటే చేయడంవల్ల కూడా కొండ కలుషితమైపోయింది. ఈ విషయాలు చెబుతూ ఇప్పుడు బాగుచేశారండీ, లేకపోతే ఘోరంగా ఉండేది అన్నాడు.
ఇంత అందమైన ప్రదేశాన్ని అంత అధ్వాన్నంగా చేశారా అని చాలా విషాదమనిపించింది. మందు తాగడానికే కుర్రాళ్ళు బళ్ళమీద వచ్చేవారండీ అంటుంటే మందు మత్తు కావలసిన వాళ్ళకి ఈ సౌందర్యం ఎటూ కానరాదు, వేలం వెర్రండీ అన్నాడు ప్రకాష్‌.
మళ్ళీ ఒకసారి తనివితీరా లోయల్లోకి చూసి తిరుగు ప్రయాణమయ్యాం. ఎండ పెరుగుతోంది. నిలబడ్డానికి నీడ లేదు.
కొండ దిగుతున్నప్పుడు ఒకచోట మేము కొండ ఎక్కుతున్నప్పుడు చూసిన మహిళ, మరికొంతమంది మగవాళ్ళు ఒక పాకలో కూర్చుని కనిపించారు. వారిముందు కొన్ని బియ్యం బస్తాలున్నాయి. అక్కడ ఆగాం. అంతకు ముందే రేషన్‌ బండి బస్తాలను దింపి ముందు గ్రామానికి వెళ్ళిందంట. తిరిగొచ్చి తూకం వేసి బియ్యం ఇస్తారట. ఎదురుచూస్తూ అక్కడ కూర్చున్నారు. వాళ్ళతో పాటు కూర్చుని మాట కలిపాను. ఆమె పేరు పార్వతి. కొండ మీద నుంచి దిగువ లోయలో కనబడిన గుడిస గ్రామస్థురాలు. బియ్యం కోసం కొండ దిగి వచ్చింది. మూట నెత్తిన పెట్టుకుని మళ్ళీ కొండెక్కి దిగాలి. రెండు మోటార్‌ సైకిళ్ళున్నాయి, కానీ పార్వతి నడిచే వెళ్తుందంట. మీ వయసెంత అని అడిగితే 70 అని చెప్పింది. నడవడం కష్టం కదా అంటే ‘ఏమి చెయ్యాలి, అలవాటైపోయింది. ఇంతకుముందు రాగులు, సజ్జలు పండిరచుకునేవాళ్ళం. ఈ బియ్యం అలవాటైంది. నెలనెలా ఇలా రావాలి’ అన్నాడొక అబ్బాయి.
గుడిస గ్రామంలో ఎన్ని కుటుంబాలున్నాయి అంటే, ‘26 కుటుంబాలు, 120 మంది మనుషులు ఉన్నారు. పిల్లలు హాస్టళ్ళలో చదువుకుంటున్నారు’Ñ కొండెక్కి దిగి నడిచి చాలా కష్టం కదా అంటే, ‘కష్టమే మరి, మా తాత ముత్తాతలంతా ఈ కష్టం పడ్డారు. మేమూ పడతాం’ అంది పార్వతి. నా పక్కన కూర్చున్న అబ్బాయి ‘మమ్మల్ని ఖాళీ చేసి రమ్మంటారు గవర్నమెంటోళ్ళు. చిన్న జాగా ఇచ్చి ఇళ్ళు కట్టుకోమంటారు. మా పొలాలు మా తాత ముత్తాతల జ్ఞాపకాలు. వాళ్ళ సమాధులు, గుర్తులు ఇవన్నీ పోతాయి కదా. మా స్వేచ్ఛ పోతుంది. విశాలమైన పచ్చటి లోయలోంచి మా జీవితం చిన్న జాగాలో ఇరుక్కుపోతుంది. అందుకే మేము రామని చెప్పాం. మా కోసం రోడ్డు వేశారు.’ అతని మాటలు విస్తాపన చెందే లక్షలాది మందిని గుర్తు చేశాయి ‘‘మా సముద్రం పోనాదండి బాబో’’ అంటూ విలపించిన గంగవరం పోర్టు నిర్వాసితుల దుఃఖం గుర్తొచ్చింది. చాలాసేపు వాళ్ళతో మాట్లాడి నాతో తెచ్చిన స్వీట్లు వాళ్ళకిచ్చి కిందకి దిగేశాం. గుడిస గ్రామానికి వెళ్ళలేకపోయాననే వెలితి వాళ్ళని కలిసి మాట్లాడడంతో తీరిపోయింది. మారేడుమిల్లిలో దిగి మా వెహికల్లో రంపచోడవరం బయలుదేరాం. ప్రకాష్‌కి థాంక్స్‌ చెప్పి టిప్‌ ఇచ్చినపుడు చాలా సంతోషపడ్డాడు.
రంపచోడవరంలో గెస్ట్‌హౌస్‌కి వెళ్ళి బేంబూ చికెన్‌ తిని రూం ఖాళీ చేసి ఆదిరెడ్డి వాళ్ళ ఊరు చిలకమామిడి బయల్దేరాం. మధ్యలో ఆదిరెడ్డి భార్య, పిల్లలు కలిశారు. ఆదిరెడ్డి కూతుళ్ళు సాన్వి, గీత కార్లో ఎక్కి బోలెడు కబుర్లు చెప్పారు. చిలకమామిడి గ్రామంలోకి ప్రవేశిస్తూనే అక్కడున్న అతి పెద్ద చింత మాను నన్నాకర్షించింది. ఆ తర్వాత లైబ్రరీ ఏర్పాటైన కమ్యూనిటీ హాల్‌కి వెళ్ళాం. పిల్లలు బుద్ధిగా కూర్చుని ఉన్నారు. గాలి, వర్షం వల్ల ఆ గ్రామంలో కరెంట్‌ లేదు. పిల్లల్తో చాలాసేపు గడిపి నేను తెచ్చిన చాక్లెట్లు, నువ్వులుండలు, స్వీట్‌లు పంచాను. వాగులో కొట్టుకుపోతుంటే ఆదిరెడ్డి రక్షించిన ఇద్దరమ్మాయిలు ఉన్నారక్కడ.
ఎండ పెరుగుతోంది. నేను బయలుదేరాలి.అక్కడినుండి ఆదిరెడ్డి వాళ్ళింటికెళ్ళాను. ఆదిరెడ్డిని నాకు పరిచయం చేసిన ఈ గ్రామంతో మంచి అనుబంధాన్ని కలిపి, ఎంతో సాహసంతో ఇద్దరు పిల్లల్ని రక్షించిన వాగును చూడడానికి వెళ్ళాం. వాళ్ళ ఇంటి వెనుకే ఉంది వాగు. ఆ నాటి దృశ్యం కళ్ళముందుకొచ్చింది. నేను చూస్తుండగానే ఆదిరెడ్డి కూతురు గీత చకచకా దిగుతూ వాగులోకి వెళ్ళింది. ‘‘పిల్లలకి, మాకూ అలవాటేనండి. ఆ రోజు హఠాత్తుగా, ఉధృతంగా వాగొచ్చింది. పిల్లలిద్దరూ వాగులో బట్టలుతుక్కుంటున్నారు. నేను నా భార్య, కొడుకుతో పొలం నుండి వస్తున్నప్పుడు జరిగింది. ఆ రోజు నేను నలుగుర్ని రక్షించానండి’’ అన్నాడు ఆదిరెడ్డి.
అక్కడినుండి మళ్ళీ ఆదిరెడ్డి వాళ్ళింటికి వెళ్ళి ఇంటి వెనకున్న జీలుగు చెట్టు నుండి ఫ్రెష్‌గా తీసిన జీలుగు కల్లు తాగి బయల్దేరాను. చిలకమామిడి చుట్టూ కొండలతో, వాగులతో, సెలయేళ్ళతో చాలా అందమైన ఊరు. ఆ ఊరినిండా జీడిమామిడి తోటలే. ఓ కవర్‌ నిండా పచ్చి జీడిపప్పు మూటకట్టి నాకిచ్చాడు ఆదిరెడ్డి. చిలకమామిడికి, ఆదిరెడ్డి కుటుంబానికి వీడ్కోలు చెప్పి నేను ఎయిర్‌పోర్టుకు బయల్దేరాను. ఎన్నో అద్భుతానుభవాలు, ఎంతో ఆనందం, ఎంతో తాజాదనం గుండెల్లో నింపుకుని రాజమండ్రి ఎయిర్‌పోర్టులో దిగి డ్రైవర్‌ వినయ్‌కి థాంక్స్‌ చెప్పడంతో రెండు రోజుల విహారం ముగిసింది.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.