‘చైతన్య వైభవం’` కొవ్వలి గ్రామ సమ్మర్‌ క్యాంప్‌ ` మనోహరి, గ్రామ దీపం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఏలూరు పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది కొవ్వలి గ్రామం. 2015 నుండి పర్యావరణ హిత గ్రామాల నిర్మాణం, నాణ్యమైన విద్యతో పాటు బాలల మరియు మహిళల వికాసం, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరిక్షించే లక్ష్యాలతో, ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ గ్రామదీప్‌

.
ఈ సంస్థ, ఈ వేసవి సెలవులకు ‘చైతన్య వైభవం’ పేరుతో బాలల సమగ్ర వ్యక్తిత్వ అభివృద్ధికి, గ్రామంపై, పరిసరాలపై కార్యక్రమాలను, సమ్మర్‌ క్యాంప్‌ను రూపకల్పన చేసింది. గ్రామదీప్‌ స్వచ్ఛంద సంస్థ, కొవ్వలి గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాల, కొవ్వలి వికాస కేంద్రం సంయుక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. మే 11, 2022 నుండి జూన్‌ 22, 2022 వరకు జరుగుతుందీ కార్యక్రమం.
ప్రతిరోజూ ఉదయం 5:30 నుండి 6:30 వరకు యోగా, మెడిటేషన్‌లలో శిక్షణ జరుగుతుంది. అలాగే వేసవికి ప్రతిరోజూ ప్రత్యేక డాన్స్‌ శిక్షణా తరగతులు కూడా నిర్వహించబడతాయి.
కొవ్వలి గ్రామ సమ్మర్‌ క్యాంప్‌లో ఈ వారం రోజులు ఉత్సాహంగా, విజ్ఞానవంతంగా సాగాయి. ప్రకాశం జిల్లా, కనిగిరికి చెందిన ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, 20 ఏళ్ళుగా సామాజిక సేవా విభాగంలో ఉన్న సృజన గారు రెండు రోజుల పాటు తోలుబొమ్మలాట వర్క్‌షాప్‌ను నిర్వహించారు. వారమంతా కొవ్వలిలోనే ఉన్న ప్రజా సైన్స్‌ వేదిక రాష్ట్ర అధ్యక్షులు, సి.ఎ.ప్రసాద్‌ గారు పిల్లలకు కథలు, పాటలు, డ్రామాల ద్వారా భాషా పరిజ్ఞానాన్ని, సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని, భయం లేకుండా మాట్లాడగలిగే విధంగా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను, టీం వర్క్‌, మంచి ఆలోచనలు, విలువలు కలిగించే పాఠాలను, సందేశాత్మక కథలను అప్పటికప్పుడు పిల్లలే సృష్టించి, వారు తయారు చేసిన సింథటిక్‌ బొమ్మలతో ప్రదర్శన ఇచ్చారు.
కొవ్వలి గ్రామ సమ్మర్‌ క్యాంప్‌లో భాగంగా ఊరిలోని పాత గృహాలు, బోడెంపూడి బాలకృష్ణ గారు 1905లో నిర్మించిన మేడ, వడ్లపట్ల నరసింహారావు (బాచీ) గారి రెనోవేట్‌ చేసిన పెంకుటింటికి వెళ్ళాం. 117 ఏళ్ళ ఈ బోడెంపూడి వారి మేడను గ్రామంలో వీథి గుండా వెళ్తూ కొంతమంది కోడిగుడ్ల మేడ అని పిలుస్తూ వెళ్ళడం చూస్తాం. 1905లో ఈ మేడను నిర్మించినప్పుడు కోడిగుడ్డు సొనను కూడా వాడడం, అలా పిలవటానికి కారణం కావచ్చు. అప్పటి మద్రాస్‌లోని ఒక మేడ డిజైన్‌ను నమూనాగా తీసుకొని నిర్మించారట. బర్మాటీక్‌, రంగుల అద్దాలు, ఇప్పటికీ ధృడంగా ఉన్న ఇనుప స్పైరల్‌ స్టెయిర్‌ కేస్‌ (మెట్లు), పందిరి మంచం, చెక్కు చెదరని మందమైన గోడలు, ఆకర్షణీయమైన స్తంభాలు, టెర్రస్‌ పైకి వెళ్ళడానికి కొత్తగా అనిపించిన చెక్క మెట్ల వరస… గుర్తుంచుకొనే అంశాలు. కొవ్వలిలో ఇదే మొదటి మేడగా చెప్పుకోవచ్చు.
వడ్లపట్ల బాచీ గారి పెంకుటిల్లు పాత`కొత్తల కలయిక. శిథిలావస్థకు చేరుకుంటున్న పాత ఇల్లు. మారుతున్న కాలానికి అనుగుణంగా అందుబాటులోకి వచ్చిన మెటీరియల్‌తో ఇంటి పైకప్పును మార్చి, పాత సొగసును కోల్పోకుండా, పాతూరును మన సంస్కృతిని బ్రతికించడానికి చేసిన ఈ ప్రయత్నం అందరికీ ఆదర్శం, అభినందనీయం.
కొవ్వలి గ్రామ సమ్మర్‌ క్యాంప్‌లో భాగంగా కొవ్వలి గ్రామంలో హైవేకి వెళ్ళే మార్గంలో ఉన్న సత్యదేవ రైస్‌ మిల్లుకు వెళ్ళాం. గ్రామంలో నివసిస్తున్నప్పటికీ అసలు రైస్‌మిల్లుకి ఎప్పుడూ వెళ్ళలేదు. అసలు లోపల ఏం జరుగుతుందో పిల్లలకే కాదు చాలామంది పెద్దవాళ్ళకు కూడా అవగాహన లేదు. వెళ్ళేముందు క్యాంపులో చర్చిస్తే, అసలు ఊక అంటే ఏంటి, దాన్ని దేనికి ఉపయోగిస్తారు, వడ్లు ఒక్కొక్కటి వలిచి బియ్యం చేస్తారా అంటూ అడిగింది ఐదవ తరగతి చదువుతున్న ప్రసిస్థ. రైస్‌ మిల్లులో బియ్యంతో పాటు తవుడు, నూక వస్తాయనే అవగాహనతో పాటు, వడ్లను విస్తృతంగా బియ్యంగా మార్చి మూడు స్థాయిలలో పాలిష్‌ చేస్తున్న ఆధునికమైన యంత్రాలు, విడిగా పోగవుతున్న ఊక, తవుడు, నూక, పైన ఎయిర్‌ కండిషన్డ్‌ గదిలో ప్రత్యేకంగా స్కాన్‌ చేసి, రంగు మారిన బియ్యాన్ని వేరు చేసే కొరియన్‌ యంత్రం… అన్నీ పిల్లలను అబ్బురపరిచాయి. ముఖ్యంగా అంత ఎత్తులో బస్తాలను ఎలా పేర్చారు అంటూ ఆశ్చర్యపోతూ అడిగింది ఎనిమిదవ తరగతి చదువుతున్న శ్రీ విజయ. వీరందరికీ ఎంతో ఓర్పుతో సమాధానాలు చెప్పి మిల్లు అంతా తిప్పి చూపించిన యజమానులకు కృతజ్ఞతలు.
సమ్మర్‌ క్యాంప్‌లో భాగంగా సరదాగా, గ్రామానికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో దెందులూరు వైపు ఉన్న ఐస్‌ ఫ్యాక్టరీకి గ్రామ పిల్లలతో కలిసి వెళ్ళాము. అంత దగ్గర్లో ఉన్నప్పటికీ, ఐస్‌ తయారీపై అస్సలు అవగాహన లేదు. ఐస్‌ ఎలా తయారవుతుందిÑ చుట్టుపక్కల చేపల చెరువుల వారికి ఈ ఫ్యాక్టరీ ఎలా ఉపయోగపడుతుందిÑ చేపలను పట్టి, రవాణా చేయడానికి ఐస్‌ ఫ్యాక్టరీలోని ఐస్‌ ఎలా ఉపయోగపడుతుందనేది నేరుగా తెలుసుకున్నారు. ఐస్‌ కనబడగానే ఏదో కోహినూర్‌ వజ్రంలాగా ఐస్‌ ముక్కలను భద్రంగా పట్టుకొని తిరగటం… పిల్లలు, పిల్లలే మరి!
ఇవే కాదు, ఈ వేసవి అంతా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు, ఆటలు, టూర్‌లు ప్లాన్‌ చేసుకున్నాము.

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.