ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ కంపెనీ, మెకఫీ, 2022లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఇండియాలోని పిల్లలకి మొబైల్ మెచ్యూరిటీ (మొబైల్ ఫోన్లని, డివైజులని ఉపయోగించగలగడం) 10`14 ఏళ్ళకే వచ్చేస్తోంది. ఆ అధ్యయనంలో భాగంగానే భారతీయ
పిల్లలకు సైబర్ బుల్లియింగ్ ప్రమాదం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ఉందని వెల్లడిరచారు. ఇతర దేశాల్లో పిల్లల్లో 17% సైబర్ బుల్లియింగ్‌కి గురవుతుంటే మన దేశంలో ఆ సంఖ్య 22% వరకూ చేరుకుంటోంది. 48% పిల్లలు తమకు తెలియని వ్యక్తులతో తరచుగానో, అప్పుడప్పుడూనో ఆన్‌లైన్‌లో మాట్లాడుతుంటామని చెప్పారు.
ఇవన్నీ ఆందోళన కలిగించే స్టాట్స్. సమస్య ఇంతకు ముందూ తీవ్రంగానే ఉన్నా, కోవిడ్`19 వల్ల స్కూళ్ళు లేకపోవడం, ఆన్‌లైన్ క్లాసుల వల్ల డివైజుల ఉపయోగం ఎక్కువై, దాంతో ఇంటర్నెట్‌ను మామూలుకన్నా త్వరగా వాడటం వల్ల తక్కువ వయసు పిల్లలు కూడా దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి తోడు తల్లిదండ్రులకు, స్కూల్ యాజమాన్యానికి కూడా ఈ విషయమై ఉండాల్సిన అవగాహన లేకపోవడం వల్ల సమస్య మరింత జఠిలంగా మారుతోంది.
సైబర్ బుల్లియింగ్ అంటే ఏమిటి? టెక్నాలజీని వాడుతూ ఒకరిని వేధించడం, బెదిరించడం, వ్యక్తిగత విషయాలు బహిరంగపరచడం, అవమానించడం, అసభ్య పదజాలం వాడడం లాంటివన్నీ సైబర్ బుల్లియింగ్ కిందకు వస్తాయి. వ్యక్తి జాతిని, మతాన్ని, కులాన్ని, ఆచార వ్యవహారాలని, సెక్సువల్ ఓరియంటేషన్‌ని ఎద్దేవా చేస్తూ, తిడుతూ అవమానకరమైన కామెంట్లు/పోస్టులు చేయడం కూడా ఇందులో భాగమే. అనుమతి లేకుండా దురుద్దేశంతో ఇతరుల వీడియోలు, ఫోటోలు, పోస్టులను ఆన్‌లైన్‌లో షేర్ చేయడం కూడా.
సైబర్ బుల్లియింగ్ జరిగే అవకాశాలున్న ప్రదేశాలు: సోషల్ మీడియా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, టిక్‌టాక్ మొదలైనవి), ఎస్.ఎం.ఎస్/ఎం.ఎం.ఎస్ (సెల్యూలార్ నెట్‌వర్క్‌పై పంపించే మెసేజ్‌లు), ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీసులు (ఫేస్‌బుక్ మెసెంజర్, వాట్సాప్ మొదలైనవి) ఈ మెయిల్, kidsstoppress.com వెబ్‌సైట్ వారు చేసిన అధ్యయనం ప్రకారం టీనేజర్లు ఎక్కువగా ఎదుర్కొనేది మాటలు అనిపించుకోవడం, పుకార్లు లేపడం, అసభ్యకరమైన ఫోటోలు అందుకోవడం లాంటివి. వీటిల్లో భాగంగా ఆడపిల్లలు బాడీ షేమింగ్, మగపిల్లలు తమ సెక్స్యువల్ ఓరియంటేషన్ గురించి వినరాని మాటలు వినవలసి వస్తుంటుంది.
THE MOST COMMON TYPES OF CYBERBULLYING EXPERIENCED INCLUDE: 42%-Offensive name-calling; 32% – Spreading of false rumours; 25% – Receiving explicit images they didn’t ask for; 21% – Constant asking of who they are, what they’re doing, and who they’re with by someone other than a parent ; 16% – Physical threats; 7% – Having explicit images shared without their consent; (Source : kidsstoppress.com)
ఇవన్నీ చట్టవ్యతిరేక పనులు. అంటే, పోలీసులను, న్యాయ వ్యవస్థను ఆశ్రయించి తగిన న్యాయం పొందే అవకాశాలున్నాయని గుర్తించాలి.
టీనేజర్లలో సైబర్ బుల్లియింగ్ పర్యవసానాలు ఎలా ఉంటాయి?
ముఖ్యంగా హైస్కూళ్ళలో బుల్లియింగ్ అనేది ఒక సవాలే అయినా సైబర్ బుల్లియింగ్‌లో అవతలివారి ఐడెంటిటీ (అసలు పేరు, వివరాలు) తెలుసుకోవడం కష్టం కాబట్టి పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయి. అవతల ఉన్నది ఒక వ్యక్తా, అనేకమంది వ్యక్తులా, ముఠానా అనేది తెలియకపోవడంతో శత్రువుని ఎదుర్కోవడం అసాధ్యమనిపించి ఆన్‌లైన్‌లోకి రావడమే మానుకోవడం, కొన్ని విపరీతమైన కేసుల్లో ప్రాణాలు తీసుకోవడం వరకూ వెళ్ళిన ఉదంతాలు ఉన్నాయి.
టీనేజ్ అనేది సున్నితమైన దశ. ఆ దశలో సైబర్ బుల్లియింగ్ లాంటి అనుభవాలు ఎదుర్కొంటే పిల్లల మనసులపై చెరగని ముద్రలు పడతాయి. ఎవరిని నమ్మాలో, ఎవరిని అనుమానించాలో తెలీని తికమక, తమ తప్పు లేకపోయినా అవతలివారి బెదిరింపులకో, అదిలింపులకో భయపడి చేయకూడని పనులు చేసే అలవాటు మొదలవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.
ఆన్‌లైన్‌లో బుల్లియింగ్‌ని ఎదుర్కొనే పిల్లలు చదువులోనూ వెనుకబడే అవకాశాలు ఎక్కువ. చదువులు/ఆటల్లో ఆసక్తి చూపకపోవడం, ముభావంగా ఉండడం, చిన్న చిన్న విషయాలకు గాభరా పడడం, తమ ఫోన్/లాప్‌టాప్ దగ్గరికి ఇంకెవరన్నా రాగానే కంగారు పడడం, ఆన్‌లైన్‌లో ఎవరితో మాట్లాడుతున్నారో, ఎలాంటి స్టేటస్‌లు పంచుకుంటున్నారో మాట మాత్రంగా చెప్పడానికి కూడా నిరాకరించడం వంటివి మామూలు కన్నా ఎక్కువగా కనిపిస్తే తల్లిదండ్రులు/గార్డియన్‌లు గమనించుకోవాలి. చాలామంది తల్లిదండ్రులతో ఈ విషయాలను పంచుకోవడానికి సంకోచిస్తారు. పైగా పెద్దవాళ్ళకి తెలిస్తే ఇంకా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బుల్లియింగ్ చేసేవారు బెదిరించి ఉంటారు. అందుకని కూడా పిల్లలు తల్లిదండ్రులతో, టీచర్లతో ఈ విషయాలు పంచుకోడానికి వెనుకాడతారు.
తల్లిదండ్రులు తీసుకోదగ్గ జాగ్రత్తలు: పిల్లలు సైబర్ బుల్లియింగ్‌కి గురికాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే, ఇది కేవలం తల్లిదండ్రులమీదే వదిలేసే బాధ్యత కాదు. స్కూళ్ళు, కమ్యూనిటీలు కూడా ఈ విషయమై పిల్లలతో చర్చించాలి. ఈ విషయమై తీసుకోదగ్గ కొన్ని జాగ్రత్తలు: పిల్లలని ఫోన్‌లో ఎవరు కాంటాక్ట్ చేయవచ్చుననేది మీరే నిర్ధారించడం. తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్లు, మెసేజెస్ బ్లాక్ చేసేలా వీలైతే సెట్టింగ్స్ పెట్టండి. వాళ్ళ నంబర్లను నమ్మదగ్గ వారితో పంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్లిక్ డొమైన్‌లో ఈ సమాచారం ఉండకుండా చూసుకోవాలి. పిల్లల ఫోన్‌లో వేసే యాప్స్‌లో వీలైనన్ని రూల్స్ సెట్ చేయండి. ఎవరు కాంటాక్ట్ చేయవచ్చు, ఎవరికి వారి ఫోటోలు, స్టేటస్ అప్‌డేట్‌లు కనిపించాలి అన్న విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ యాప్స్‌లో అయినా కిడ్స్ మోడ్, టీన్ మోడ్ ఉంటే దాన్ని యాక్టివేట్ చేయటం ఉత్తమం. పిల్లల ఫోన్‌లోని యాప్స్‌కి ‘‘కంటెంట్ అండ్ ప్రైవసీ రిస్ట్రిక్షన్స్’’ వీలున్న చోటల్లా ఎక్కువ స్థాయిలో ఉండేలా చూసుకోవాలి.
రోజుకి ఎంత స్క్రీన్ టైమ్ లిమిట్ ఉందో, నెలకి ఎంత డేటా వాడవచ్చు అనేవి సెట్ చేయనిచ్చే ‘పేరంటల్ కంట్రోల్’ యాప్స్ ఉంటాయి. పిల్లల డివైజ్‌లని ఇలాంటి యాప్స్ ద్వారా మోనిటర్ చేస్తూ ఉంటే కొన్ని ప్రమాదాలను పసిగట్టవచ్చు. ఇలాంటివి దొంగచాటుగా చేయనవసరం లేదు. పెద్దవాళ్ళకి తమపై నమ్మకం లేదన్న భావన పిల్లలకి కలగడం మంచిది కాదు. అందుకని, వాళ్ళను కూర్చోబెట్టి ఇంటర్నెట్‌లో ఉండే ‘‘బ్యాడ్ యాక్టర్స్’’ (దుష్టులు, హాని కలిగించేవారు) వివరంగా చెప్పి, వారి సంరక్షణ కోసమే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు అర్థమయ్యేలా చెప్పాలి. వయసు మళ్ళినవారికి టెక్నాలజీ వాడడంలో కొంత డిజిటల్ లిటరసీ అవసరం పడినట్లే, పిల్లల విషయంలోనూ అవసరం. ఎవరితో మాట్లాడవచ్చు, స్టేటస్ అప్‌డేట్స్‌లో ఏ విషయాలు రాయకూడదు, ఎలాంటి ఫోటోలు అప్‌లోడ్ చేయకూడదు వగైరా విషయాల గురించి వీలైనంతగా అవగాహన కల్పించాలి. అలానే సోషల్ మీడియా ఎటిక్వెట్స్… ఆన్‌లైన్‌లో తోటివారితో ఎలా మసలుకోవాలి, ఎలాంటి భాష వాడాలి, వాదోపవాదాలు, తిట్టుకోవడాలకు ఎలా దూరంగా ఉండాలి అన్నవి కూడా చర్చించదగ్గ విషయాలు. వార్తల్లో వచ్చే సైబర్ క్రైమ్‌ల గురించి, ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో జరిగి ఎక్కువ వైరల్ అయ్యే న్యూస్‌లు పిల్లలతో పంచుకుంటూ ఉండాలి. రేపు తమకో, తమ స్నేహితులకో చేదు అనుభవాలు ఎదురైనప్పుడు ‘‘నాకే ఎందుకు ఇలా జరిగింది? నేనేం తప్పు చేశాను?’’ లాంటి ఆలోచనల్లో ఇరుక్కోకుండా ‘‘ఇంటర్నెట్‌లో ఇలాంటివి ఎవరికైనా జరగవచ్చు. అందుకని నేను వెంటనే పెద్దల సాయం తీసుకుంటాను’’ అనే దిశగా ఆలోచించగలుగుతారు.
ఎంత నచ్చచెప్పినా, ఎంత స్నేహపూరితంగా ఉన్నా పిల్లలు తల్లిదండ్రులతో కొన్ని విషయాలు పంచుకోలేరు. ముఖ్యంగా టీనేజర్లు, ఉదాహరణకి, తోటివాళ్ళలో ఎవరన్నా నచ్చితే, ఎవరితోనైనా స్నేహం చేయాలనిపిస్తే, ఆ వయసు కలిగించే భావావేశాలు వారికి కొత్త. బుల్లియింగ్ చేసేవాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకుని, మంచి మాటలతో ముగ్గులోకి దింపి, ఆ పైన తాము చెప్పింది చేయకపోతే పంచుకున్న ప్రైవేట్ విషయాలను పబ్లిక్ చేస్తామని బెదిరిస్తుంటారు. అందుకని పిల్లలకి తల్లిదండ్రులు మాత్రమే కాక వాళ్ళకన్నా కొంచెం పెద్దవాళ్ళైన కజిన్స్, సోషల్ సర్కిల్‌లో ఫ్రెండ్స్‌తో ఒక ‘‘బడ్డీ సిస్టమ్’’ ఉంటే అనూహ్య సంఘటనలు ఎదుర్కొన్నప్పుడు బయటికి చెప్పగలుగుతారు. లేదంటే పిల్లలు తమలో తామే కుమిలిపోయి విపరీత నిర్ణయాలు తీసుకునేదాకా వెళ్ళే అవకాశముంది.
టీనేజర్లు సైబర్ బుల్లియింగ్ ఎదుర్కొంటే… అన్నింటికన్నా ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేమిటంటే అన్ని సైబర్ బుల్లియింగ్ కేసులూ ఒకటే తీవ్రతను కలిగి ఉండవు. అవతలివారికి సమాధానం ఇవ్వకుండా, ఇంకేం సమాచారం అందించకుండా కేవలం ‘‘బ్లాక్’’ చేసి సమస్యను రూపుమాపే అవకాశాలున్న కేసులూ ఉంటాయని గుర్తుంచుకుంటే అప్పుడు బుల్లియింగ్ కేస్ అనగానే హైరానా పడకుండా ఉండగలం. కొన్ని కేసులు కొంత ఆందోళన కలిగించవచ్చు. అలాంటి వాటి విషయంలో ముందు పిల్లలకు ధైర్యంచెప్పి, వాళ్ళను ఆ ఆప్స్/డివైజ్‌లకు దూరంగా ఉంచి, బుల్లియింగ్ చేసే వ్యక్తులు ఏ స్థాయికి దిగజారుతున్నారు, ఏమని బెదిరిస్తున్నారన్న దాన్ని బట్టి తగిన చర్యలు తీసుకోవచ్చు. బుల్లియింగ్ చేసేవాళ్ళు స్కూల్‌కి సంబంధించినవారైతే స్కూల్ యాజమాన్యానికి, కాలనీకి సంబంధించినవారైతే అసోసియేషన్‌లకు చెప్పి వారి సహాయం తీసుకోవచ్చు. ముఖ్యంగా, తెలిసినవాళ్ళే ఇటువంటి దురాగతాలకు పాల్పడినప్పుడు పిల్లలింకా బెదిరిపోతారు. ఇలా చేయడం సబబు కాదని, చట్టరీత్యా నేరమని తెలియని తోటి పిల్లలే చేసినప్పుడు ఇద్దరి పిల్లల తల్లిదండ్రులు, టీచర్లు అంతా కలిసి చర్చించి, బుల్లియింగ్ చేసిన, గురైన పిల్లలకు సరైన మార్గం చూపించాలి. మరికొన్ని కేసులు పూర్తిగా జటిలమైపోయి ఉండవచ్చు. వాటికోసం సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్లు, పిల్లల సంక్షేమ సంస్థలు, పోలీసుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకూడదు. పోలీసులు, కోర్టుల వరకూ వెళ్ళడానికి మధ్యతరగతి కుటుంబాలు వెనుకాడతాయన్నది సైబర్ నేరాలు చేసేవాళ్ళ నమ్మకం. కానీ మనకు అవగాహన ఉంది, అన్యాయంగా ఇరుక్కోమని వారికి అనిపిస్తే మాత్రం చాలా మటుకు వెనక్కి తగ్గుతారు.
ఇండియాలో సైబర్ బుల్లియింగ్ చట్టాలు: భారతదేశంలో సైబర్ బుల్లియింగ్ కోసం ప్రత్యేకమైన చట్టాలేమీ లేవు. అయితే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ (ఐటి యాక్ట్) లోని సెక్షన్ 67 ద్వారా సైబర్ బుల్లియింగ్ కేసులు నమోదు చేయవచ్చు. సెక్షన్ 67 ప్రకారం అసభ్యమైన మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో పంచుకోవడానికి ఐదేళ్ళ జైలుశిక్ష, పది లక్షల రూపాయల వరకూ జరిమానా పడే అవకాశముంది. ఈ విషయమై మరో రెండు చట్టాలు కూడా సహాయపడతాయని విశేషజ్ఞుల అభిప్రాయం. సెక్షన్ 507 ఐ.పి.సి: సైబర్ బుల్లియింగ్ దాదాపుగా ‘అనానిమస్’ (అవతలివారి వివరాలు గోప్యంగా) జరుగుతుంటాయి కాబట్టి, ఆన్‌లైన్‌లో బెదిరింపులకు దిగేవారికి ఈ సెక్షన్ కింద రెండేళ్ళ వరకూ జైలు శిక్ష పడవచ్చు. సెక్షన్ 66ఇ, ఐటీ యాక్ట్: వ్యక్తిగత సమాచారాన్ని అనుమతి లేకుండా దక్కించుకుని, ఆన్‌లైన్‌లో పెట్టడాన్ని ఈ సెక్షన్ కింద ఫైల్ చేయవచ్చు.
జాగ్రత్త వహిస్తే ప్రమాదం దాదాపు తప్పినట్లే: ఆన్‌లైన్‌కి దూరంగా ఉండి కేవలం ఆఫ్‌లైన్‌లోనే జీవితం గడిపే అవకాశం ఇప్పటి పిల్లలకు లేదు. అవకాశాలు, అనుభవాలు, ఆలోచనలు అన్నింటికీ ఆన్‌లైన్‌లో ఉండడం తప్పనిసరి. అయితే, సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాలు తప్పించుకోలేకపోతే, లేత మనసులు చవిచూసే చేదు అనుభవాలు వాళ్ళని జీవితాంతం వెంటాడే అవకాశాలు ఉంటాయి. బుల్లియింగ్‌లోలా శారీరక ప్రమాదం ఆన్‌లైన్‌లో ఉండకపోవచ్చ. కానీ సైబర్ బుల్లియింగ్ మానసిక ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీస్తుంది. అందుకని, పదిమందితో కలిసి మెలిసి తిరగడానికి కావలసిన సోషల్ స్కిల్స్‌లో ఆన్‌లైన్ ఎటిక్వెట్స్ కూడా నేర్పించాలి. ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీ వెల్లువను మనం అర్థం చేసుకుంటూ వారికి అర్థం చేయించాలి. పిల్లలు ఇలాంటి విషయాలు త్వరగానే గ్రహిస్తారు, సరైన పద్ధతులు పాటిస్తారు. వారికి చెప్పేవారుండాలి. ఆ పనిని తల్లిదండ్రుల మీదే వదలకుండా ప్రతి ఒక్కరూ తమకి చేతనైన విధంగా చేస్తూనే ఉండాలి.
– తొలి ప్రచురణ`బిబిసి తెలుగు