వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : సతీహిత బోధిని (1883`1905) -డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

18, 19 శతాబ్దాలనాటి వలస భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమం ముమ్మరంగా సాగింది. సంస్కరణోద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయడానికి సంఘ సంస్కర్తలు వివిధ భారతీయ భాషల్లో పత్రికల్ని ప్రారంభించారు. సంఘ సంస్కరణోద్యమానికి స్త్రీల సమస్యలు ప్రధాన కేంద్ర బిందువుగా ఉండేవి. అందుకే స్త్రీలలో సంఘ సంస్కరణ సందేశాన్ని ప్రచారం

చేయడానికి ప్రత్యేకంగా స్త్రీల కోసం పత్రికలు ఏర్పాటు చేయబడ్డాయి. గుజరాతీ, బెంగాలీ, ఉర్దూ, హిందీ, తమిళం, మళయాళం, కన్నడ మొదలైన భారతీయ భాషల్లో అనేక స్త్రీల పత్రికలు ప్రచురితమయ్యాయి. ఇంతవరకూ లభిస్తున్న చారిత్రకాధారాల ప్రకారం గుజరాతీలో 1850ల్లో వెలువడడం ప్రారంభమై ఒక శతాబ్దం పాటు కొనసాగిన ‘‘స్త్రీ బోధ్‌’ వలస భారతదేశంలో వెలువడ్డ స్త్రీల పత్రికలన్నింటిలోకీ ప్రప్రథమమైనది.
ఈ చారిత్రక నేపథ్యంలో, సంఘ సంస్కరణోద్యమంలో భాగంగా తెలుగులో కూడా అనేక స్త్రీల పత్రికలు వెలువడనారంభించాయి. వలసపాలన ముగిసేనాటికి సుమారు 20కి పైగా స్త్రీల పత్రికలు వెలువడ్డాయి. కొన్ని పురుషుల సంపాదకత్వంలో వెలువడితే అనేకం స్త్రీల సంపాదకత్వంలో వెలువడ్డాయి. ‘సతీహిత బోధిని’, ‘తెలుగు జనానా’, ‘గృహలక్ష్మి’ మొదలైనవి పురుషుల సంపాదకత్వంలో వెలువడ్డ స్త్రీల పత్రికలు. ‘హిందూ సుందరి’, ‘సావిత్రి’, ‘వివేకవతి’, ‘అనసూయ’, ‘ఆంధ్రలక్ష్మి’, ‘ఆంధ్ర మహిళ’ మొదలైనవి స్త్రీల సంపాదకత్వంలో వెలువడిన స్త్రీల పత్రికలు. స్త్రీల పత్రికలు మహిళల్లో సంఘ సంస్కరణోద్యమ వ్యాప్తికి ఇతోధికంగా తోడ్పడడమే కాకుండా వలసాంధ్రలో మహిళోద్యమం రూపుదిద్దుకోవడానికి కూడా దోహదపడ్డాయి. తొలినాటి స్త్రీల పత్రికల్లో పరిమితమైన అంశాలనే… అంటే స్త్రీ విద్య, బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహాలు, గృహ సంస్కరణ మొదలైన అంశాలను మాత్రమే చర్చించేవారు. కాలక్రమేణా స్త్రీలలో కలిగిన జెండర్‌ చైతన్యానికి అద్దంపడుతూ స్త్రీల పత్రికల్లో మహిళా హక్కులకు సంబంధించిన అంశాలు విరివిగా ప్రచురించబడ్డాయి. స్త్రీ, పురుష సమానత్వం, పురుష దురహంకార నిరసన, స్త్రీలకు దక్కాల్సిన పౌర, చట్టపరమైన సమాన హక్కులు (ఆస్తి హక్కు, చట్టసభల్లో సమాన ప్రాతినిధ్యం, విడాకుల హక్కు మొదలైనవి), కుటుంబ సంబంధాల ప్రజాస్వామీకరణ, సమానత్వం ప్రాతిపదికన సామాజిక సంబంధాలు, జెండర్‌ న్యాయం మొదలైన ప్రజాస్వామిక విషయాలన్నీ ‘గృహలక్ష్మి’, ‘ఆంధ్ర మహిళ’ లాంటి స్త్రీల పత్రిలకల్లో చర్చించబడేవి. మరో ముఖ్యమైన విషయమేంటంటే 20వ శతాబ్ది ప్రారంభం నుండి వలసాంధ్రలో అనేక మహిళా సంఘాలు ఏర్పడ్డాయి. వివిధ ప్రాంతాల్లో ఏర్పడిన స్వతంత్ర మహిళా సంఘాలే కాకుండా యావందాంధ్ర స్త్రీలనూ ఒకే గొడుగు క్రిందకు తెచ్చిన ‘ఆంధ్ర మహిళా మహాసభ’ (ప్రారంభం 1910 సం॥), ఆలిండియా ఉమెన్స్‌ కాన్ఫరెన్స్‌ రాష్ట్ర శాఖ అయిన ‘ఆంధ్ర రాష్ట్ర మహిళా మహాసభ’ (ప్రారంభం 1927 సం॥) మొదలైన రాష్ట్రస్థాయి మహిళా సంఘాలు కూడా ఏర్పడ్డాయి. ఈ సంఘాల సమావేశ వివరాలనూ, అక్కడ స్త్రీలు చేసిన ప్రసంగాల పూర్తి పాఠాలనూ స్త్రీల పత్రికలు అత్యంత శ్రద్ధతో ప్రచురించేవి. అనేకమంది మహిళోద్యమ నాయకురాళ్ళు, కార్యకర్తల ఛాయాచిత్రాలను కూడా ప్రచురించిన స్త్రీల పత్రికలు మహిళల దృష్టి కోణంతో మహిళోద్యమ చరిత్రను నిర్మించడానికి అత్యంత అమూల్యమైన ఆకరాలుగా, ప్రాథమికాధారాలుగా తోడ్పడుతున్నాయి. ఈ విధంగా వలసాంధ్రలో మహిళోద్యమానికి స్త్రీల పత్రికలు వెన్నెముకగా ఉండేవని చెప్పడం ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు!
‘సతీహిత బోధిని’ తెలుగులో వెలువడ్డ మొట్టమొదటి స్త్రీల పత్రిక. ఇది ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం సంపాదకత్వంలో ఏప్రిల్‌ 1883 నుండి సంస్కరణోద్యమానికి ప్రధాన కేంద్రమైన రాజమండ్రి నుండి వెలువడనారంభించింది. 1905 వరకు కొనసాగిన ‘సతీహిత బోధిని’ 1886`88 మధ్య కొంతకాలం ఆగిపోయి 1888లో పునరుద్ధరించబడిరది. సెప్టెంబరు 1904లో ఒక సంవత్సరంపాటు ఇంకో స్త్రీల పత్రిక అయిన ‘తెలుగు జనానా’లో కలిసిపోయింది. ‘సతీహిత బోధిని’ ముఖపత్రంపై ‘‘స్త్రీల నిమిత్తము మాసమునకొకసారి ప్రకటింపబడును’’ అని తెలుగులోనూ, ‘‘యాన్‌ ఇలస్ట్రేటెడ్‌ మంత్లీ మేగజైన్‌ ఫర్‌ ద యూజ్‌ ఆఫ్‌ ఫీమేల్స్‌’’ అని ఇంగ్లీష్‌లోనూ ప్రచురించబడేది. తపాలా ఖర్చుతో కలుపుకొని సంవత్సర చందా రెండు రూపాయలుÑ అర్థ సంవత్సరానికి ఒక రూపాయిÑ విడి ప్రతి నెల నాలుగు అణాలు. ప్రారంభంలో ప్రతి సంచికలోనూ 15 పుటలుండేవి, 1888ల్లో వీటి సంఖ్య 20 నండి 24 పుటలకు పెరిగింది. ‘సతీహితబోధిని’ లోని విశేషాంశమేంటంటే ఇందులో అనేక పటాలుండేవి. పత్రిక ‘వివేకవర్ధని ముద్రాక్షరశాల’లో ముద్రితమయ్యేది. ‘సతీహితబోధిని’కి ఎంత సర్క్యులేషన్‌ ఉండేదో స్పష్టంగా తెలియదు. స్త్రీలలో సంఘ సంస్కరణోద్యమ భావాలను వ్యాపింపజేయడానికి వీరేశలింగం ‘సతీహిత బోధిని’ని చాలా బలంగా ఉపయోగించారు. ఈ పత్రికలను ప్రారంభించడానికి గల కారణాన్ని వీరేశలింగం తన ‘స్వీయ చరిత్రము’లో ఈ క్రింది విధంగా స్పషం చేశారు.
‘‘నాకు స్త్రీ విద్య యందును, స్త్రీలయభివృద్ధియందును విశేషాభిమానము. స్త్రీల దురవస్థకు బలుమాఱు పరితపించి వారి దుస్థితిని దొలగింప బ్రయత్నింప వలయుననియు, స్త్రీలను ప్రస్తుత స్థితిలోనే యుంచి తాము పైకి లేచుట పురుషులకెన్నడును సాధ్యము కాదనియు, తాము బాగుపడవలెనన్నచో వారిని గూడ విద్యావివేకాదులయందు మంచి స్థితిలోనికి దెచ్చి వారితో గలిసి యున్నత పదవికి లేవవలయుననియు, తాము మాత్రమే వృద్ధినొంది వారిని నిజమైన మైత్రి కనర్హమైన దాస్యమునందే యుంచదలచిన పక్షమున దెలియకయే, దినదినక్రమమున దామున్నత పదము నారోహించువచ్చటకు మాఱుగా నొక్కొక్క మెట్టు దిగుచు వచ్చి కడపట వారితో గూడ నడుగంటుట యనివార్యమనియు, నేను దలంచుచుండెడువాడను. వారు చదువుటకు తెలుగులో మంచి పుస్తకములు లేకుండుట దలపోసి యాలోపమును నాచేతనైనంతవఱకు తొలగింపవలెనని 1883వ సంవత్సరమునందు స్త్రీల కొఱకు ‘సతీహిత బోధిని’ యను పేరితో తెలుగుననొక మాసపత్రికను బ్రకటించుట కారంభించితిని.’’ (రెండవ భాగము, పు.203`204)
పత్రిక పేరుకు తగ్గట్లే అది స్త్రీలకు ఉపయోగకరమని తలచిన వివిధ విషయాలను ‘‘బోధించుటకు’’ ఉద్దేశింపబడిరది. దైనందిన జీవితంలో స్త్రీలు ఏమి చేయాలి, ఏవి చేయకూడదు మొదలైన విషయాలను చర్చించేది. ‘సతీహిత బోధిని’ స్త్రీల విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. స్త్రీ విద్య ప్రాధాన్యతను వివరిస్తూ మొట్టమొదటి సంచికలోనే ఈ క్రింది విధంగా రాశారు :
‘‘తల్లి చదువెరుంగని మూఢురాలైన పక్షమున చదువు నిమిత్తము తండ్రి కేకలు వేసినప్పుడును, శిక్షించినప్పుడును తల్లి కల్పించుకొని యడ్డము వచ్చి కొమాళ్ళ చదువుగూడ చెడగొట్టి వాండ్రను ఎందుకుంబనికిరానివారిగా జేయును. తల్లి విద్యావతి అయ్యేనేని బిడ్డల చదువును తాను స్వయముగా కనుగొని ఇంటివద్ద పాఠములు చెప్పి చదివించి విద్యాబుద్ధులయందు ప్రవీణులుగా దిద్దును. పూర్వ కాలమునందొక రాజు గ్రామ పాఠశాలను పరీక్షించుటకై వెళ్ళి యందులో ఒక చిన్నవాడు తానడిగిన ప్రశ్నలన్నింటికిని మంచి సమాధానములు చెప్పుటచేత ఆశ్చర్యపడి, ఉపాధ్యాయులను పిలిచి ఈ పిల్లవాడిరత తెలివితో చదువుటకితని విద్య, విషయమున నీవెక్కువ శ్రద్ధపుచ్చుకొనుచున్నావా అని అడిగెను. ఆ ఉపాధ్యాయుడు తానందఱికంటెను ప్రత్యేకంగా ఈ బాలుని విషయమయి ఎక్కువ శ్రద్ధ పుచ్చుకొనలేదనీ, అతని తల్లి చదివినదగుటచేత ఇంటివద్ద ఆమె శిక్షణ చేతనే ఈ చిన్నవాడు తన తోటి వారందరికంటే వయస్సున చిన్నవాడయినను విద్యయందు వారందరికంటెను తెలివిగలవాడయ్యెననియు రాజుతో చెప్పెను. ఆ మాటలకు రాజు మిక్కిలి సంతోషించి పిల్లవానికి మంచి బహుమానమిచ్చుటయేకాక కొడుకు విషయమయి ఎంతో శ్రద్ధ పుచ్చుకొన్నందుకుకయి తల్లికి కూడ స్వర్ణమయమయిన రత్నాభరణమును బహుమతిగానంపెను.’’
ఒక వ్యాసానికి ‘చదువెఱుగని స్త్రీలు తమ బిడ్డలకు శతృవులు’ అనే ఆకర్షణీయమైన శీర్షిక ఉండేది. ఈ శీర్షిక ఎంత ప్రాచుర్యం పొందిందంటే తర్వాత కాలంలో పలుమంది ఈ శీర్షికతోనే స్త్రీ విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ వ్యాసాలు రాశారు. ఉదాహరణకు స్త్రీల పత్రిక అయిన ‘వివేకవతి’ ఆగస్టు 1913 నాటి సంచికలో కత్తిరశెట్టి కేశవమ్మ ఈ శీర్షికతో ఒక వ్యాసాన్ని ప్రచురించారు. (పు.333`’35). (ఇది ఈమె శ్రీకాకుళం మహిళా సంఘంలో యిచ్చిన ప్రసంగ పాఠం. స్త్రీ విద్యను బలంగా కాంక్షించిన కేశవమ్మ బాలికలకు విద్య నేర్పించని తల్లిదండ్రులను శిక్షించడానికి ఒక చట్టం ఉండాలని కోరారు.) విద్య ద్వారా స్త్రీలు గృహకార్య నిర్వహణలో ప్రవీణులౌతారని వీరేశలింగం బలంగా విశ్వసించారు. ఆయన ప్రకారం, ‘‘ఇంట నడచు గృహకృత్యములనెల్ల జక్కబెట్టవలసిన భారము స్త్రీలది గాని పురుషులది గాదు… వారు చదివినవారైయున్న యెడల, ఆ కార్యముల నెంత బాగుగాను, జాగ్రత్తతోను, వారు నిర్వహింతురు? ఇప్పటి మన ముగుదల కట్టి సామర్ధ్యము లేకపోవుటచేతనే కదా యింటి బరువంతయు బురుషులమీదనే పడి, పగలెల్ల వెలుపల గొలువు చేసివచ్చి బడలియుండియు, ఆ వెనుక నింటిపనినిగూడ దామే విసువుతో జూచుకోవలసిన వారుగా నున్నారు? ఒకప్పుడు భర్త విదేశగామియగుటయు సంభవించును. అప్పుడు గృహకృత్యములయందలి రహస్యములను భార్య భర్త కెన్నిటినైన దెలుపవలసి యుండును. ఇల్లాండ్రు చదువులేని వారైనేని, ఆ గోప్య విషయములనెల్ల బ్రియులకు దెలిపి యవసరోచితములగు ప్రత్యుత్తరములం బొందజాలక కార్యభంగమునకైన నోరిచికొని యూరకుండవలసినవారేకదా!’’
విద్యతోపాటు ‘సతీహిత బోధిని’ స్త్రీలు పతివ్రతా ధర్మాన్ని పాటించాల్సిన అవసరాన్ని విశేషంగా ప్రచారం చేసింది. 1883 జూన్‌ సంచికలో పతివ్రతా ధర్మాన్ని గూర్చి రాస్తూ స్త్రీలు తమను తామే రక్షించుకోవాలనీ, పురుషులు వారికి రక్షణ కల్పించాలనుకోవడం సబబు కాదనీ ఈ క్రింది విధంగా హితబోధ చేశారు. ‘‘పురుషులు స్త్రీల పాతివ్రత్యమును రక్షించుటకయి పూర్వకాలము నుండియు సర్వ ప్రయత్నములును చేయుచున్నారు. అయినను ఈ పాతివ్రత్యము విద్యా ప్రభావమువలన గలిగిన వివేకము చేత నిలువవలసినదే కాని పురుషులు చేయు నిర్బంధములచేత నిలుచునది కాదు… పురుషులు స్త్రీలను గదులలోపెట్టి, తాళము వేసి, కావలియుంచి, నిరోధించుట వలన పాతివ్రత్యమును రక్షింపజాలరనియు, స్త్రీలకు విద్యా వివేకాదులు కలిగించి వారియాత్మలను వారు కాపాడుకొనునట్లు చేసిననే పాతివ్రత్య రక్షణము కలుగుననియు (స్మృతికారుడు) స్పష్టముగా కనబరచియున్నాడు… పురుషులవలని భీతియు నిర్బంధములను పనిలేక మనంతట మనమే రూపమున మన్మథులైనను పరపురుషులను తృణప్రాయముగా చూచి మన మానమును కాపాడుకొనవలయును… ఎప్పుడైన దుర్బుద్ధి పుట్టవచ్చును గనుక సాధ్యమయినంతవరకు గుణవంతురాండ్రను తోడుగా వుంచుకొనుచు మన మనస్సునకు దుర్మార్గపు చింతల కవకాశము లేకుండ (చేసుకొనవలెను)’’.
విద్య స్త్రీలను పతివ్రతలుగా మారుస్తుందని భావించారు వీరేశలింగం. ఆయన మాటల్లో: ‘‘స్త్రీలు తాము గ్రంథములందు జదివిన పూర్వపు బుణ్యసతుల చరితములను మదిని నిలిపి వారివలె బ్రవర్తింప నుత్సాహము కలవారయి, పతివ్రతలగుదురు.’’
‘సతీహిత బోధిని’లో స్త్రీ విద్య, పాతివ్రత్యం పైననే కాకుండా ఇంకా అనేక ఇతర అంశాలపై కూడా విరివిగా రచనలు ప్రచురితమయ్యాయి. ‘సుగుణదుర్గుణములు’, ‘భూతదయ’, ‘జీవకారుణ్యము’, ‘పరోపకారము’, ‘సహనమును ధైర్యమును’, ‘గర్వము’, ‘గృహిణీ ధర్మము’, ‘బాల శిక్షణము’, ‘బిడ్డల నాజ్ఞలోనుంచుట’, ‘మిత వ్యయము’, ‘ధనము’, ‘ఆభరణములు’, ‘అమిత వ్యయము’, ‘దేహారోగ్యము’, ‘తగువులమారితనము’, ‘కొండెములు చెప్పుట‘, ‘అత్తగారి కోడండ్రికము’, ‘హిందూ సుందరుల ప్రస్తుత స్థితి’, ‘శకునములు’, ‘జ్యోతిశ్శాస్త్రము’, ‘సూక్ష్మవస్తు దర్శక యంత్రము’, ‘అగ్ని పర్వతములు’, ‘పాములు’, ‘శ్రీ విక్టోరియా మహారాణిగారు’ మొదలైన అంశాలపై వ్యాసాలూ, పద్యాలూ, గీతాలూ ప్రచురితమయ్యాయి. ఇలాంటి రచనల్ని ప్రచురించడం ద్వారా స్త్రీలలో సుగుణరాశుల్ని పెంపొందించి వారిని ఉత్తమ గృహిణులుగానూ, మంచి భార్యలుగానూ, తల్లులుగానూ, తమ భర్తలకు విజ్ఞానులైన సహచరిణులుగానూ మార్చడానికి ‘సతీహిత బోధిని’ తన శాయశక్తులా ప్రయత్నించింది. ఈ రచనల్లో అధికశాతం వీరేశలింగం ద్వారా రచించబడ్డాయి. ఆయన స్త్రీల అవసరాన్ని దృష్టిలో
ఉంచుకొని చాలా సులభమైన శైలిలో విషయాల్ని వివరించడానికి ప్రయత్నించారు. చాలా సందర్భాల్లో సులభంగా అర్ధం కావడం కోసం విషయాన్ని నీతి కథల రూపంలో ప్రచురించారు.
స్త్రీలను విద్యావంతులను చేసి వారిని సంస్కరించి ఆధునీకరించడం ‘సతీహితబోధిని’ ప్రధాన ఉద్దేశం. అంతేకానీ స్త్రీలను స్వంత వ్యక్తిత్వమున్న స్వతంత్ర వ్యక్తులుగా తీర్చిదిద్దడం కాదు. వలసపాలనా కాలంలో పురుషులకేర్పడిన అవసరాలూ, ఆకాంక్షలకనుగుణంగా స్త్రీలను మలచడం… ఉత్తమ గృహిణులుగానూ, మంచి తల్లులుగానూ, భార్యలుగానూ, తమ భర్తలకు అన్ని విషయాల్లోనూ సహాయ సహకారాలందించే జ్ఞానవంతులైన సహచరులుగానూ స్త్రీలను తయారుచేయడం వీరేశలింగం ఉద్దేశం. ఆయన ఉద్దేశానికనుగుణంగానే ‘సతీహిత బోధిని’ పనిచేసింది. అయినప్పటికీ 19వ శతాబ్ది చివర్లో స్త్రీల కోసం ఒక పత్రికను ఏర్పాటు చేయడమన్నది దానంతటకదే ఒక అభ్యుదయకరమైన విషయం. తొలి స్త్రీల పత్రిక అయిన ‘సతీహిత బోధిని’ తర్వాత కాలంలో అనేక స్త్రీల పత్రికలు వెలువడడానికి, 20వ శతాబ్ది ప్రథమార్ధంలో స్త్రీలే స్త్రీల పత్రికలకు సంపాదకులుగా పనిచేయడానికి ముందుకు రావడానికి చక్కటి బాటవేసి దారిచూపిన దీపశిఖ.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.