మనిషితనం నింపుకోలేమా…? – వి.శాంతి ప్రబోధ

‘‘మేడం నేనోటి అడగాల్న… చెబుతారా’’ తన పని తాను చేసుకుంటూ అడిగింది యాదమ్మ.
టీ తాగుతూ చదువుతున్న పేపర్‌ మడుస్తూ ‘‘ఊ’’ అన్నాను ఆమెనే చూస్తూ. ‘‘బిడ్డను తొమ్మిది నెలలు మోసేది నేను. కనేది నేను. పెంచేది నేను. కానీ మద్దెన నా మొగుడి పెత్తనమేంటో..’’ చేస్తున్న పని ఆపి నా మొహంలోకి చూస్తూ అంది యాదమ్మ.

మంచం కింద ఊడుస్తూ ‘‘ముగ్గురు ఆడపిల్లల తల్లిని. ఇంక కనే ఓపిక లేదంటే ఒప్పడు. తలకొరివి పెట్టే కొడుకు లేకుంటే ఎట్ట అని కొడతాడు. డాక్టరమ్మ కాడకి పోతే, బతకాలని లేదా? మళ్ళీ కడుపయితే పెద్ద ప్రాణానికే కష్టమని ముందే చెప్పాను కదా… అని నన్నే తిట్టింది. కడుపు తీయించుకో ఇంకో నెలయితే కష్టం అంది’’
పాలిపోయిన మొహంతో ఎండు పుల్లలాగా ఉండే యాదమ్మ తన ధోరణిలో తాను చెప్పుకుపో తున్నదల్లా ఆగి ‘‘అమెరికా వోళ్ళే కడుపు చేయించు కోకూడదని చెప్పారని నా పెనిమిటి అంటుండు. నిజమేనా మేడం? అమెరికా వాళ్ళు చెప్పితే మనం అట్లనే నడవాల్నా మేడం’’ అంటూ అవతలి గదిలోకి వెళ్ళింది యాదమ్మ. ఆమె ఎప్పుడూ అంతే. ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది. జవాబు కోసం ఎదురు చూడకుండా తన పని చేసుకుంటూ మాట్లాడేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది.
యాదమ్మ వదిలిన ప్రశ్న నాలో ఆలోచనల తుట్ట లేపింది. పెద్దన్నగా భావించే అమెరికాలో ఎక్కడో చేసిన ఓ నిర్ణయం ఈ దేశంలో సామాన్య జనంలోకి పోయింది. ఇక్కడ మనం చెబుతున్న మాటలు ఎందుకు చెవికి ఎక్కడం లేదు, ఎందుకని? లింగ అసమానతల సమాజం మనది. సామాజికంగా, సాంస్కృతికంగా ఆడ, మగ మధ్య వ్యత్యాసం, పితృస్వామ్యం వ్యవస్థ నుంచి వచ్చిన మన కుల, మత ఆచారాలు, నమ్మకాలు, కట్టుబాట్లు అన్నీ లింగ అసమానతలకు దోహదం చేస్తున్నవే.
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ప్రచురించిన జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌ కోసం 146 దేశాలలో సర్వే చేస్తే మన దేశం 135వ స్థానం అని నిన్న చదివిన విషయం గుర్తొచ్చింది. అందరూ గొప్పగా చెప్పుకునే అమెరికా స్థానం కూడా అంత గొప్పగా ఏమీ లేదు. 30వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా రాజకీయ సాధికారతతో అమెరికన్‌ మహిళలు చాలా వెనుకబడే ఉన్నారు. అక్కడ కూడా లింగ అసమా నత స్పష్టంగా తెలుస్తూనే ఉంది. మహిళల అబార్షన్‌ హక్కులను కాలరాయడం కూడా అందులో భాగమే కదా!
గత ఏడాది 156 దేశాల్లో 140వ స్థానంలో నిలిచింది మన దేశం. ఈ ఏడాది గతం కంటే కొద్దిగా మెరుగైంది. 2006 నుంచి వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ తన గ్లోబల్‌ గ్యాప్‌ రిపోర్ట్స్‌లో జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌ (జిజిఐ)ని వెల్లడిస్తోంది. తద్వారా లింగ అసమానతలు తెలుసుకుని వాటి మధ్య దూరాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేయడం కోసం ఈ సర్వే జరుగుతోంది. వాళ్ళు ఏర్పరచుకున్న సూచికలు మహిళలు ఎదుర్కొంటున్న లింగ అంతరాల్ని, అసమానతల్ని పూర్తిగా పట్టుకోలేక పోతున్నదని భావించిన యుఎన్‌డిపి 2010లో మానవ అభివృద్ధి నివేదికలో లింగ అసమానత సూచికను ప్రవేశపెట్టింది. లింగ అసమానతలు కొలవడానికి ప్రతి ఏడాది ప్రపంచ దేశాల్లో సర్వే జరుగుతోంది. 2006లో 115 దేశాల్లో సర్వే నిర్వహించగా మన దేశం 98వ స్థానంలో నిలిచింది. 2012లో 135 దేశాల్లో సర్వే నిర్వహించగా 105వ స్థానంలో నిలిచింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ నివేదిక ప్రకారం 2021లో మన దేశం 156 దేశాల్లో 140వ స్థానంలో ఉంది. ఈ ఏడాది 146 దేశాల్లో అందుబాటులో ఉన్న వనరులు, అవకా శాలు యాక్సెస్‌లో లింగ ఆధారిత అంతరాలను కొలవ డానికి రూపొం దించారు. 2022కు గాను లింగ సమానత్వం కొలవడానికి రూపొందిం చిన సూచిక ప్రకారం చిన్న చిన్న దేశాలైన బంగ్లాదేశ్‌ 21, నేపాల్‌ 96, శ్రీలంక 110, మాల్దీవ్స్‌ 117, భూటాన్‌ 127 స్థానంతో మనకంటే మెరుగ్గానే ఉన్నాయి.
ఇరాన్‌ 143, పాకిస్థాన్‌ 145, ఆఫ్ఘనిస్తాన్‌ 146 మాత్రమే మనకంటే వెనుకబడి ఉన్నాయి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన భారత్‌ వెనుక నుండి పదో స్థానంలో ఉండడం మన పరిస్థితి తెలియజేస్తోంది. జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌ను ఈ నాలుగు అంశాల్లో లెక్కించారు. అవి ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాలు (143వ స్థానం), ఉన్నత విద్యా సాధన (107), పునరుత్పత్తి ఆరోగ్యం మరియు మనుగడ (146), రాజకీయ సాధికారత (48) స్థానంలో ఉన్నాం మనం.
మొత్తంగా చూసినపుడు ఐస్లాండ్‌ 90.8%, ఫిన్లాండ్‌ 86%, నార్వే 84.5%, న్యూజీలాండ్‌ 84%, స్వీడన్‌ 82%, ర్వాండా 81.1% (ఆఫ్రికన్‌ దేశం), నికరాగువా 81.1% (లాటిన్‌ అమెరికా), నమీబియా 80.7% (ఆఫ్రికన్‌), ఐర్లాండ్‌ 80.4%, జర్మనీ 80.2% (యూరోప్‌), మొదటి పది స్థానాల్లో నిలిచాయి. లింగ అసమానతలు ఎంత తక్కువ
ఉంటే అంత అభివృద్ధి సాధ్యమవుతుంది. లింగ అసమానతల వల్ల దేశాలు మానవ అభివృద్ధిలో సమాజ వికాసంలో ఎంతో నష్టపోతున్నాయి.
కుటుంబ పనుల దగ్గర నుండి వ్యవసాయ పనుల వరకు ఆమె లేనిదే పూట గడవదు. కానీ స్త్రీలు, పిల్లలు చేసే శ్రమకు గుర్తింపు, విలువ, చెల్లింపులు ఉండవు. స్పష్టంగా కనిపించే మహిళల అసమానత అది. ఆడ, మగ వేతనాల్లో వ్యత్యాసం కొనసాగుతోంది. శ్రామిక మహిళా భాగస్వామ్యం 2012 నుంచి 2022 మధ్య చూస్తే 17 శాతం తగ్గిపోయిందంటే అసమానత మరింత పెరిగినట్లే కదా. గత పదేళ్ళలో చూసినప్పుడు బడిలో చేరే ఆడపిల్లల శాతం 92 నుంచి 93.57కి కొద్దిగా పెరిగింది. మహిళలు శాస్త్ర, సాంకేతిక, రాజకీయ, కార్యనిర్వాహక రంగాల్లో ప్రవేశిస్తున్నప్పటికీ, రాణిస్తున్నప్పటికీ వారి శాతం అతి తక్కువ. వృత్తి, వైద్యం, విద్య, ఉపాధి రంగాల్లో మహిళల శాతం పెరిగినప్పటికీ ఆదాయాలు మాత్రం పురుషులతో సమానంగా పెరగలేదన్నది సుస్పష్టం.
అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ప్రాథమిక విద్య, ఆరోగ్యం మెరుగైంది. మహిళల జీవిత కాలం కూడా 57 నుండి 60.4కి పెరిగింది. కానీ, మన జాతీయ ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ ప్రకారం 2019`2021 డేటా ప్రకారం 57 శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. 2015`16లో అది 53%
ఉండగా కోవిడ్‌ పాండమిక్‌ కొంత వెనక్కి తీసుకుపో యింది. పార్లమెంటులో 14.9%, మంత్రులుగా 9.09% మహిళలు మాత్రమే ఉన్నారు. పంచాయతీ రాజ్‌లో రాజకీయ సాధికారత కాస్త మెరుగ్గా కనిపించినప్పటికీ ఇంకా చేరాల్సిన దూరం చాలా ఉంది. నిర్ణయాధికారం లేని పదవులలో మహిళల పేరు ఉన్నంతనే సరిపోదు కదా!
స్త్రీలను దేవతలుగా పూజించే దేశంలో స్త్రీలకు సమానత్వం లేదు. సమానత్వం ఉంటేనే దేశం సుభిక్షంగా ఉండేది. ఆడపిల్ల అంటే అప్పు, మగపిల్లవాడు పున్నామ నరకం తప్పిస్తాడని అపోహ మనవాళ్ళది. విద్య, వైద్యం, ఆహారం, ఆస్తి, రాజకీయ సమానత్వం కోసం ఏర్పరచుకున్న చట్టాలున్నాయి. కానీ ఫలితాలు అశించినట్లుగా లేవు. అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు అనుకునే అమెరికా, యూకే, సింగపూర్‌, ఆస్ట్రేలియా కంటే వెనుకబడిన దేశంగా చెప్పుకునే బంగ్లాదేశ్‌ లింగ సమానత విషయంలో మెరుగ్గా ఉండటం విశేషం.
లింగ అసమానత సూచికలపై కొన్ని విమర్శలు ఉండవచ్చు. ముఖ్యమైన అంశాలు పరిగణనలోకి రాకపోయి ఉండొచ్చు. కానీ లింగ అసమానతలు అధికంగా ఉన్న దేశాలు మానవ వనరుల్ని ఎంతో నష్టపోతున్నాయనేది మాత్రం నిజం. 2022 నాటికి 662 మిలియన్‌ ఆడ జనాభా ఉన్న మన దేశంలో లింగ అసమానతలు తగ్గించుకుంటూ లింగ సమానత్వాన్ని సాధించడానికి ఎంతో సంఘర్షణ జరుగుతోంది. లింగ అంతరం పూరించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ, కానీ సాధ్యం కానిది కాదు. స్త్రీ, పురుషులు అన్ని కోణాల్లో, అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉన్నప్పుడే అర్థవంతమైన సమాజం సాధ్యపడుతుంది. అది జరగాలంటే కనీసం 132 ఏళ్ళయినా పడుతుందని ఒక అంచనా.

Share
This entry was posted in కిటికి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.