ఈ మాట వినబడని ఇల్లుంటుందా? కొన్ని కుటుంబాల్లో సున్నితంగా వినబడితే మరి కొన్ని కుటుంబాల్లో గద్దింపులాగా వినబడుతుంది. వంట చేయడం, వడ్డించడం ఆడవాళ్ళే చెయ్యాలనే ధ్వని ఈ వాక్యంలో వినబడుతుంది. ఇందులో కొత్త ఏముంది? తరాలుగా
జరుగుతున్నదే కదా అనిపిస్తుంది కదా! నిజమే, తరం తర్వాత తరం ఆడవాళ్ళు వంట, వడ్డింపు పనిని మార్పు ఆశించకుండా చేస్తూనే ఉన్నారు.
నేను పుట్టి పెరిగింది ఓ పెద్ద ఉమ్మడి కుటుంబంలో. మగవాళ్ళు పొలానికి వెళ్ళి పని చేయడం, ఆడవాళ్ళు ఇంటిల్లిపాదికీ వంట చేయడం, వడ్డించడం చాలా మామూలుగా జరిగే వ్యవహారంగానే ఉండేది. ఓ అరవై ఏళ్ళ క్రితం సామాజిక స్థితిగతులు అలానే ఉండేవి. ఆడవాళ్ళకి వంట చేయడం, పిల్లల్ని కనడం మాత్రమే పనిగా ఉండేది. అప్పట్లో చదువుల్లేవు, ఉద్యోగాల్లేవు కాబట్టి ఆడవాళ్ళు ఈ పనులకే పరిమితమై ఉండేవాళ్ళు.
అయితే దళిత కుటుంబాల్లో ఆడవాళ్ళకు బయట పని కూడా ఉంటుంది. కూలిపనులకెళ్ళి సంపాదించుకొచ్చినా వండడం ఆమె పనే. బహుశా వడ్డించడాలు ఉండవు. అన్నం, కూర మాత్రమే ఉండే గుడిశెల్లో ఎవరికి వారు కంచంలో పెట్టుకుని తినడమే నేను చూశాను. అలా అని ఇద్దరూ సమానంగా తింటారని కాదు. అక్కడ వండిరదాంట్లో మగవాళ్ళదే సింహభాగం. మిగిలిందే ఆడవాళ్ళకి. ఈ తిండి ఆడవాళ్ళకి ఎంత బలమిస్తుందో, ఎలాంటి పోషకాహారం అందుతుందో మన ఊహకు కూడా రాదు.
నా చిన్నప్పటి పరిస్థితికి ఇప్పటి స్థితికి ఏమైనా మార్పు జరిగిందా అని ఆలోచించినపుడు విచిత్రంగా కుటుంబంలో ఏమీ చెప్పుకోదగ్గ మార్పులు కనబడలేదు. అప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో మందికి వండి వార్చితే ఇప్పుడు వ్యస్టి కుటుంబాల్లో అంటే భార్య, భర్త, పిల్లలు ఉండే కుటుంబాల్లో వంట, వడ్డింపు ప్రధానంగా ఆడవాళ్ళ బాధ్యతగానే ఉంది. అరవై ఏళ్ళ క్రితం చదువుకోని ఆడవాళ్ళు ఇళ్ళల్లో వంటకే పరిమితమయ్యారు. కానీ ఆధునిక కాలంలో, 21వ శతాబ్దంలో మహిళలు విద్యలో ముందుంటున్నారు, రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు, రాత్రింబవళ్ళు షిఫ్ట్‌ల్లో పనిచేస్తున్నారు, మంచి జీతాలు సంపాదిస్తున్నారు. మరి వంటెవరు చేస్తున్నారు, వడ్డించే పనెవరు చేస్తున్నారు. ప్రధానంగా ఆడవాళ్ళే చేస్తున్నారు. జెండర్ సెన్సిటివిటితో ఉండే కొన్ని కుటుంబాల్లో మగవాళ్ళు ఆ పనులు చేస్తుండవచ్చు. కానీ ప్రధానంగా ఈ బాధ్యత మహిళల మీదే ఉందన్నది నగ్నసత్యం.
ఇటీవల యునిసెఫ్ నిర్వహించిన ఒక సమావేశానికి హాజరైనప్పుడు, అది కిశోర బాలికల పోషకాహార లోపానికి సంబంధించినదే అయినా మహిళలకు సంబంధించి చాలా షాకింగ్ గణాంకాలు షేర్ చేశారు. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 60% మంది స్త్రీలు, కిశోర బాలికలు తీవ్ర పోషకాహార లోపంతో ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో 120 మిలియన్ స్త్రీలు పోషకాహార లోపంతో ఉన్నారట. బాల్య వివాహాల కారణంగా కిశోరీ బాలికలు చిన్న వయస్సులోనే గర్భం దాల్చడంతో తల్లీబిడ్డల పరిస్థితి ప్రమాదకరంగా తయారవుతోంది. తల్లి రక్తహీనతతో ఉంటే పుట్టే బిడ్డ కూడా అనారోగ్యంతో, బరువు తక్కువతోనే పుడుతుంది. దీనివల్ల బిడ్డ మరణంతో పాటు తల్లులైన కిశోరీ బాలికల మరణాలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి.
బాల్యవివాహాలకు, గర్భిణీ స్త్రీలలో ఏర్పడే పోషకాహార లోపానికి ఉన్న సంబంధం అర్థం చేసుకోకపోతే పుట్టే బిడ్డలు కూడా బలహీనంగానే పుడతారు. మన దేశంలో కిశోరీ బాలికలలో ప్రబలి ఉన్న ఎనీమియా, పోషకాహార లోపం గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటీవల జరిగిన ఒక మీటింగులో తెలంగాణ చీఫ్ సెక్రటరీ యుక్తవయస్కుల పోషకాహార లోపం గురించి మాట్లాడుతూ ‘‘వీళ్ళంతా ఎవరికీ చెందని పిల్లలు (Nobody’s Children)’’ అని చెప్పడం ఈ సమస్య తీవ్రతను ఎత్తి చూపుతోంది. సాధారణంగా అంగన్‌వాడీ సెంటర్లలో ఐదేళ్ళలోపు పిల్లలకి, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు పోషకాహారం అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కానీ యుక్తవయస్కులకు ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమమూ లేదు. చాలా సంవత్సరాల క్రితం ‘సబల’ పేరుతో వీరి కోసం ఒక ప్రభుత్వ పథకం నడిచింది. ఎందువల్లనో అది కొనసాగలేదు. ఒక సమావేశంలో ఒక కిశోరీ బాలిక చాలా ఘాటుగా ‘‘మాకు ఓటు హక్కు లేదని కదా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఓటు హక్కు ఇవ్వండి మా పవర్ చూపిస్తాం’’ అంటూ చాలా ఆవేశంగా మాట్లాడిరది. ఇప్పటికైనా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించడం చాలా సంతోషించాల్సిన విషయం.
అయితే నేను చర్చించాలనుకున్న విషయం యుక్తవయస్కుల పోషకాహార లోపం గురించి కాదు, మన కుటుంబాల్లో మహిళల తిండి తిప్పల గురించి. పితృస్వామ్య కుటుంబం ఎలా ఆపరేట్ అవుతుందో అందరికీ తెలుసు. మెజారిటీ కుటుంబాల్లో వంట చేయడం, వడ్డించడం అనేది మహిళల బాధ్యతగా ఉంది. భర్తకి ఇష్టమైన కూరగాయలూ, ఆహార పదార్థాలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. అతను చికెన్ తినాలంటే చికెన్ మాత్రమే వండాలి. అతనికి కాకరకాయ ఇష్టం లేకపోతే ఆ ఇంట్లో కాకరకాయ కూర వండడం చాలా అరుదు. భార్యకి తినాలనిపించినా తన కోసం ఆమె వండుకోదు. ఒకవేళ వండుకున్నా ఒక హేళనతో కూడిన కామెంట్ వస్తుంది. అది ఇష్టం లేక తను వండడమే మానేసుకుంటుంది. అందుకని దాదాపు అన్ని కుటుంబాల్లోను పురుషులకు ఇష్టమైన వంటకాలే ఉడుకుతాయి.
వంట వండడం ఒక పనైతే అందరికీ కడుపు నిండా వడ్డించడం ఆమె పనే. కుటుంబంలో భార్య, భర్త, అత్త మామలు, పిల్లలు లాంటి కుటుంబ సభ్యులుంటే వాళ్ళందరికీ వడ్డించిన తర్వాతే ఆమె తింటుంది. మా పెద్ద ఉమ్మడి కుటుంబంలో లాగా చివరన అడుగు, బొడుగులు, చప్పగా చల్లారిపోయిన ఆహారమే ఆమె తింటుంది. చివరన తినే ఆమె కోసం కూరలున్నాయా, ఆమెకు సరిపోతాయా అనే ఆలోచన ఎవ్వరికీ రాదు. శ్రామిక కుటుంబాల్లో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. చేసే పని ఎక్కువ ఉంటుంది, తినే తిండి సరిపడా ఉండదు. అందులో పోషకాహారం గురించి మాట్లాడే సీనే ఉండదు. వారిలో రక్తహీనత ఊహించలేని ఎక్కువ స్థాయిలో ఉంటుంది.
ఆమె గర్భం దాల్చినప్పుడు పరిస్థితి చాలా ప్రమాదకరంగా తయారవుతుంది. ఆ సమయంలో కూడా ఆమె మీద పని భారమేమీ తగ్గదు. గర్భంతో ఉంది కదా అనే విచక్షణ ఎవ్వరికీ ఉండదు. ఆమె కోసం వండి వడ్డించే వాళ్ళెవరూ ఉండరు. గర్భధారణ సమయంలో ఆమెలో చోటు చేసుకునే మానసిక, శారీరక మార్పులు, తీవ్రమైన వేవిళ్ళ సమస్య, వాంతులు ఇవన్నీ కుటుంబం పట్టించుకోవాల్సిన అంశాలు. ముఖ్యంగా భర్త పట్టించుకోవాలి. ఆమె సరిగ్గా తింటోందా? ఆమెకు సరైన పోషకాహారం దొరుకుతోందా? భర్తగా తన బాధ్యతేంటి? కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉంది అనేదాన్ని కూడా భర్త పట్టించుకోవాలి. కానీ నువ్వు తిన్నావా అని కూడా అడగని మన కుటుంబ సంస్కృతిలో మగవారిలో ఇలాంటి ప్రవర్తనను పెంపొందించడానికి చాలా పెద్ద ప్రయత్నమే చెయ్యాలి. ఆ దిశగా చాలా కృషి చెయ్యాల్సి ఉంటుంది.
ఇంటి పనిలో, వంట పనిలో పురుషుల భాగస్వామ్యంతో పాటు, కుటుంబంలో మహిళల ఆరోగ్యం, వారి బాగోగుల గురించి పట్టించుకోవడం గురించి పురుషులతో నిరంతర సంభాషణ జరగాలి. జెండర్ అసమానత్వం సర్వత్రా వ్యాపించి
ఉండడం వల్ల పురుషులు కూడా అందులో భాగంగా ఉండడం వల్ల కొన్ని రకాల శిక్షణల ద్వారానే వారిలో చైతన్యం కల్గించగలుగుతాం. వారికి అర్థం చేయించగలుగుతాం. అవగాహనను చైతన్యాన్ని పెంచుకున్న పురుషుల దృక్పథాల్లో తప్పకుండా మార్పు వస్తుంది. అప్పుడే వారు కుటుంబంలో ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడడానికి ప్రేరకులవుతారు.
వంటైందా? వడ్డిస్తావా? అని కాకుండా వంటైంది కదా! తిందామా అనే దిశవైపు అందరి ప్రయత్నాలు మొదలై కొనసాగాలి.