సిరిధాన్యాల సాగుతో అంతర్జాతీయ గుర్తింపు -యెనిగళ్ళ శ్రీనివాసకుమార్‌

సరస్వతి కొమ్మొజుల, డిగ్రీ తర్వాత మహిళలపై జరుగుతున్న హింసను ఆపడం సాధ్యమే అన్న నినాదంతో ప్రారంభించిన సామాజిక సేవా ప్రస్థానంలో చిరుధాన్యాల సాగు ద్వారా ఆహార భద్రత, ఆరోగ్య భద్రత మరియు పర్యావరణ భద్రతలను సాధించగలమని తాను నమ్మి తద్వారా 1000 మంది చిరుధాన్యాల చెల్లమ్మలను 30 గ్రామాలలో తయారుచేసి ‘‘ఆరోగ్య

చిరుధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం’’ ద్వారా ఆర్థిక భద్రతను సాధించగలిగేలా చేయగలిగింది. ఆహార పంటల సాగు తగ్గడం, పోషకాహార లోపం, ఆహార భద్రత లేకపోవడం, ఇవన్నీ స్త్రీలపై కనబడని హింసకు కారణమవుతున్నాయని గ్రహంచి మహిలళలను చైతన్య పరచి నాబార్డు సహకారంతో తిరిగి తిండి గింజల సాగు వైపు మళ్ళించడం జరిగింది. ఈ దశలో ఎందరో అబలలను ‘సబల’’లుగా తీర్చిదిద్ది ఒక మహిళా సైన్యాన్ని తయారు చేసుకొని ‘‘చిరుధాన్యాల సాగు ` బహుముఖ భద్రతలకు ఎంతో బాగు’’ అని నమ్మూతూ ముందుకుసాగారు.
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని జీవితంలో సాధించాలంటే పట్టుదల ఉన్న ఏ వ్యక్తికైనా కష్టాలు, అవమానాలు, బెదిరింపులు, నిరుత్సాహపరుస్తూ భయపెట్టేవారు ఇలా అడుగు అడుగునా అవరోధాలే వెంటాడుతూ ఉంటాయి. సమాజంలో మనం మాత్రమే బాగుండాలని కోరుకునేవారికి ఇటువంటి బాధలతో సంబంధం లేకపోవచ్చు. అంతో ఇంతో చదువుకున్న బుద్ధిమంతులు కొందరు పెద్ద మనసుతో ఆలోచన చేస్తే, సమాజ హితం కోసం ప్రాకులాడుతూనే ఉంటారు. ప్రతి గ్రామంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఏ సమస్యను పరిష్కరించి మన వంతు న్యాయం చేయగలమని అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్య. సాయం చేయాలని దృఢసంకల్పం ఉంటే మార్గం అదే దొరుకుతుంది. సమస్యను చూసి భయపడితే అడుగు ముందుకు వేయలేం. వెంటాడే కరువుతో గ్రామంలోని ప్రజలు వలసలు వెళ్ళకుండా ఆపాలి. సమయానికి అంత ముద్ద దొరికే విధంగా పంటలు పండిస్తూ ఉన్న గ్రామంలోనే బ్రతకగలం అనే ధైర్యాన్ని వారికి కనిపించాలి. ఆ లక్ష్యంతోనే ఒక మహిళ అబల కాదు ‘సబల’ అని నిరూపిస్తూ, విజయనగరం జిల్లాలో ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలిచి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్న విశాఖ జిల్లా వాసి ‘సబల’ మహిళా సంస్థ ముఖ్యనిర్వహణాధికారిణి కొమ్మొజుల సరస్వతి. ఉత్తరాంధ్ర ప్రాంత మహిళల గుండెల్లో చిరుధాన్యాల సాగులో చిరంజీవిగా నిలిచిపోయారు.
వెంటాడే కరువుకు చిరుధాన్యాల సాగే పరిష్కారం: కరువు ప్రాంతాలలో అన్నిటికీ కరువే. తింటానికి తిండి ఉండదు. తాగడానికి నీరు అంతంత మాత్రమే. చాలీచాలని వర్షాలతో పాడి పంటలకు సకాలంలో సాగునీరు అందక పంటలు పండిరచలేని దుస్థితి. దీంతో ఆకలితో అన్నమో రామచంద్రా అంటూ నరకయాతన అనుభవించక తప్పడంలేదు. అడపాదడపా తొలకరిలో కురిసిన జల్లులకు రాగులు, సజ్జలు, జొన్నలు ఏదో ఒక చిరుధాన్యపు పంటను పండిరచి, ఉన్న దాంట్లో సరిపెట్టుకొనేవారు. గంజి దొరికితే గంజి, అంబలి త్రాగేవారు, అంబలి, జొన్న అన్నం తినేవారు మరికొందరు. సమయానికి ఏది అందుబాటులో ఉంటే దాన్ని తింటూ పొట్ట నింపుకునేవారు. పొలం పనులు, పాడి పశువుల పోషణ, వీటితోపాటు జీవాల (గొర్రెలు, మేకలు) సంరక్షణ, అభివృద్ధితో జీవనం సాగించేవారు. రాను రాను వాతావరణంలో తీవ్రమైన మార్పులు నెలకొనడంతో పంట మార్పిడి చేయడం జరిగింది. సరివి, జామాయిల్‌ మొక్కలను నాటడం మొదలుపెట్టారు. వీటి ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో కరువు ప్రాంతంగా తయారైంది. ఇంకేముంది బ్రతుకు తెరువు కోసం ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేసి వలసలు వెళ్ళిపోయేవారు. గ్రామంలో పెద్దవాళ్ళు అక్కడక్కడ అరకొర జనంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు.
వలసలు వెళ్ళే గ్రామాలకు చెక్‌ పెట్టిన సబల సరస్వతి: బి.ఎస్‌.సి. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూర్చుని చేసే ఉద్యోగం కావడంతో చేసే పనిలో సంతృప్తి లేదు. ఒక సంస్థ ద్వారా విదేశాలకు సంబంధించిన అగ్రికల్చర్‌ ప్రాజెక్ట్‌ చేస్తున్న సమయంలో ఉద్యోగ అవకాశం వచ్చింది. అప్పుడే వ్యవసాయంపై ఆసక్తి కలిగింది. అనేక స్వచ్ఛంద సంస్థలతో పరిచయం ఏర్పడిరది. సాగులో ఏ పంటకు ఏ విధంగా ఎరువులు వినియోగించాలి, చీడపీడల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సాగు పద్ధతిలో మెళకువలు తెలుసుకునే అదృష్టం కలిగింది. ఒక సంస్థను నడపాలంటే ఎటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్ళాలో అనుభవ పాఠాలు నేర్పాయి.
ఒక బలమైన సంకల్పంతో 2004 సంవత్సరంలో ‘సబల’ అనే సంస్థను ఏర్పాటు చేసి, వలసలు వెళ్ళే గ్రామాలను నియంత్రించాలంటే చిరుధాన్యాల పంటలు సాగు చేయడమే సరైన మార్గమని గుర్తించడం జరిగింది. పూర్వం చిరుధాన్యాలతో వండిన ఆహారమే ప్రధాన ఆహారంగా ఉండేది. గాడితప్పిన పంటల వలన పర్యావరణం, మన ఆరోగ్యం నష్టపోవడాన్ని ఆ ప్రాంత ప్రజలకు సబల సంస్థ ద్వారా వివరించడం జరిగింది. వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు, శాస్త్రవేత్తల సహకారం, ప్రోత్సాహంతో అనేక అవగాహన సదస్సులు, శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి ఆ ప్రాంత గ్రామ ప్రజలను చైతన్యవంతులను చేసి సరివి, జామాయిల్‌ పంటలకు స్వస్తి పలికే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది.
కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆ గ్రామ రైతులకు ఎకరాకు సుమారు ఐదు వేల వరకు ఆర్థిక సహాయం అందచేయడంతో పాటు పంటకు కావలసిన విత్తనాన్ని అందించడంతో అక్కడ రైతులు చిరుధాన్య పంటలపై ఆసక్తి చూపించారు. ప్రస్తుతం లక్కవరపుకోట, కొత్తవలస, వేపాడు మండలాలలోని 35 గ్రామాలకు పైగా రైతులు సుమారు 1000 ఎకరాలలో చిరుధాన్యాల సాగు చేయడం జరుగుతోంది. దీనికి మహిళా రైతులు తీసుకొన్న చొరవ మరువలేనిది.
విత్తనంపై పెత్తనం ఎవరికీ లేదు: విత్తనం కోసం రైతులు ఎవరి దయపైనా ఆధారపడకూడదు. విత్తనంపై ఎవరి పెత్తనం ఉండకూడదు. కాలం సక్రమంగా ఉండి పండిరచిన పంట చేతికి వస్తే చాలు. నాణ్యమైన విత్తనం రైతులే తయారు చేసుకొనే విధంగా శిక్షణనివ్వడం జరిగింది. సంస్థ ద్వారా ముందుగా సాగు ప్రారంభ సమయంలో పంటకు కావలసిన విత్తనాన్ని అందిస్తాం. అయితే ఇక్కడ రైతులకు, సంస్థకు మధ్య ఒక చిన్న షరతు పెట్టుకోవడం జరిగింది.
విత్తనాభివృద్ధే లక్ష్యంగా ఒక కిలో విత్తనం రైతులకు పంటకు ముందు సంస్థ అందిస్తే, పంట చేతికి వచ్చిన తర్వాత రెండు కిలోల విత్తనం సంస్థ రైతుల నుండి తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన పంట మార్కెట్‌ ప్రకారం రైతుల నుండి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ విధానం ద్వారా విత్తనం కొరత లేకుండా మరికొంత మంది రైతులకు విత్తనం సరఫరా చేసే వెసులుబాటు ఉంటుంది. రాబోయే పంటకు రైతులే విత్తనాన్ని భద్రపరచుకోవచ్చు. విత్తనం కోసం తిండితిప్పలు లేకుండా విత్తనాల షాపుల వద్ద పడిగాపులు కాసి, చెప్పులు అరిగేలా తిరగవలసిన పని ఉండదు. నాణ్యమైన విత్తనం మనవద్దే అందుబాటులో ఉంటుంది. బ్యాంకులో డబ్బులు ఉన్నట్లే, చిరుధాన్యాలు సాగు చేసే రైతుల వద్ద విత్తన బ్యాంకు ఉంటుంది. విత్తన కొరతనేదే ఉండదు. అప్పుడు విత్తనంపై ఎవరి పెత్తనం ఉండదు. రైతులు నిశ్చింతగా సమయానికి సాగు చేసుకోగలుగుతారు.
విలువ ఆధారిత ఉత్పత్తులు: సంస్థ ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి మరింత కృషి చేస్తున్నాం. చిరుధాన్యాల సాగులో మహిళలు కూడా ఉత్సాహంగా భాగస్వాములవుతున్నారు. ముఖ్యంగా వీరిని దృష్టిలో ఉంచుకొని రైతులు పండిరచిన ధాన్యాన్ని బియ్యం, పిండి రూపంలో మార్చడానికి కావలసిన యంత్రాలను సమకూర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంస్థను గుర్తించడంతో నాబార్డు వారు సహాయం చేయడానికి ముందుకు రావడం ఆనందదాయకం.
చిరుధాన్యాలతో తయారుచేసిన బిస్కెట్లు, జంతికలు, చక్రాలు, బెల్లంతో తయారు చేసిన లడ్డూలకు మంచి డిమాండ్‌ వస్తోంది. దీంతో విజయనగరం జిల్లా కొత్తవలస పట్టణంలో ‘సబల’ సంస్థ ద్వారా పండిరచి, తయారుచేసే ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా స్టాల్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ‘సబల’ సంస్థ చిరుధాన్యాలతో తయారుచేసిన నాణ్యమైన ఆహార ఉత్పత్తులు దేశంలో అనేక ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది.
మార్కెట్‌: పండిరచిన పంటను రైతులే అమ్ముకొనే విధంగా ఆరోగ్య సిరిధాన్యాల ఉత్పత్తిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో సుమారు 1000 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. దీనిద్వారా రైతులు పండిరచిన పంటను వ్యాపారులు, వినియోగదారులకు సరుకును విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని ఖర్చులు తీసివేసి మిగిలిన సంపదను రైతులందరు సర్దుబాటు చేసుకొనే వెసులుబాటు కల్పించాం. దీనిద్వారా రైతుల్లో చిరుధాన్యాల సాగుపై మరింత నమ్మకం కలిగింది.
మంచి ఆహారం: చిరుధాన్యాలలో పోషకవిలువలు సమృద్ధిగా ఉండడంతో పిల్లల నుండి పెద్దల వరకు తీసుకోదగిన ఆహారం. రెండు కప్పుల వరి అన్నం తినడం కంటే చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహారం ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది. జావ రూపంలో కూడా తాగవచ్చు. జీర్ణశక్తి బాగుంటుంది, రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది, ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇటువంటి ఆహారం అందరికీ అందుబాటులో దొరకాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా చొరవ తీసుకొంటేనే సాధ్యపడుతుంది. అందుకు అనుగుణంగా దేశంలోని అనేక స్వచ్ఛంద సంస్థలు కలిసి సంతకాలతో కూడిన పత్రాన్ని సంబంధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులకు అందజేసి చిరుధాన్యాల వలన ఆరోగ్యం, పర్యావరణానికి ఏ విధంగా మేలు చేస్తుందో మా వంతు తెలియజేయడం జరిగింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిరుధాన్యాలపై అధ్యయనం చేసి దీని ప్రాముఖ్యతను తెలియజేయడంతో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు అందజేసేటటువంటి రేషన్‌ దుకాణాల్లో రాగులు, జొన్నలు సరఫరా చేయడం జరిగిందని వివరించారు. మధ్యాహ్న భోజన పథకాలలో చిరుధాన్యాలతో చేసిన వివిధ రకాల పంటలను పరిచయం చేయాలి. దీనికి తల్లిదండ్రులు, గురువుల సహకారం ఎంతో అవసరం. వాటి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించి అలవాటు చేసినప్పుడు మాత్రమే పిల్లలు తినడానికి ఇష్టపడతారు.
చిరుధాన్యాల సాగు: రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు ముందుగా ఆ నాలుగు రకాల పంటలకు కావలసిన విత్తనాలను సేకరించి సబల సంస్థ ద్వారా విజయనగరం జిల్లా లక్కవరపుకోట, వేపాడు, కొత్తవలస మండలాలలోని చిరుధాన్యాల సాగుపై ఆసక్తి చూపించే రైతులను గురించి విత్తనం అందజేయడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయంలో పాడి, పంట రెండూ ఉండాలి. పశువులు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఏదో ఒకటి పశుసంపద ఉంటేనే సాగుకు కావలసిన ఎరువులు పుష్కలంగా దొరుకుతాయి. ఆ విధంగా గేదెలు, ఆవులు లేదా మేకలు ఉన్న రైతులను గుర్తించి చిరుధాన్యాల ప్రాముఖ్యతను తెలుపుతూ పంటలు పండిరచే విధంగా ప్రోత్సహించేవాళ్ళం. పశుపోషణ లేకుండా వ్యవసాయం చేయడం ఊహించలేం.
సాగు ఖర్చు, ఆదాయ వివరాలు: మహిళలు కూడా చిరుధాన్యాలు సాగు చేయడానికి ఉత్సాహం చూపించడం శుభపరిణామం. మిగిలిన పంటలతో పోలిస్తే వీటి పంట ఖర్చు తక్కువ. చిరుధాన్యాల పంటకాలం మూడు నెలలు. విత్తనం నాటేటప్పుడు అదును పదును ఉంటే, ఏ కాలంలోనైనా విత్తుకోవచ్చు. చీడపీడల సమస్య ఉండదు. ఏ నేలలోనైనా సాగు చేయవచ్చు. నీటి వసతి ఉంటే పంటకాలంలో రెండు మూడు తడులు పెట్టడం మంచిది. వరుణుడు కరుణిస్తే అంతకంటే అదృష్టం ఏముంది.
ఏదైనా సొంత భూమి, పశుసంపద ఉండి ఇంటిల్లపాదీ వ్యవసాయ పనుల్లో భాగస్వాములైనప్పుడు, ఎకరా పంట ఖర్చు సుమారు రూ.6 వేల నుండి రూ.8 వేల వరకు వస్తుంది. పంట దిగుబడి సుమారు ఆరు క్వింటాళ్ళ వరకు వస్తుంది. రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు ఏవైనా రైతుకు క్వింటా ధర రూ.2,500 కంటే మించదు. ఆ విధంగా ఆరు క్వింటాళ్ళకు లెక్కగడితే ఆదాయం రూ.15,000 వరకు వస్తుంది. పంట ఖర్చు రూ.8 వేలు తీసివేయగా ఆదాయం రూ.7 వేల వరకు వస్తుంది. ఒకే పంటను సాగు చేయకుండా సంవత్సరంలో మూడు నాలుగు రకాల పంటలు పండిరచడం మంచిది. విత్తనం రూపంలోనే కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తులు మార్కెట్‌లో వినియోగదారులకు కావలసిన విధంగా బియ్యం, పిండి, బిస్కెట్లు, జంతికలు, చక్రాలు, లడ్డూల రూపంలో తయారుచేసి అమ్మినపుడు ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా రైతుల ఆదాయం పెంచే విధంగా సంస్థ సహకరించి ప్రోత్సహిస్తోంది. చిరుధాన్యాలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. మార్కెట్‌లో వినియోగదారుల నుండి అండుకొర్రలు, ఊదలు, సామలు, అరికెలు వాటికి డిమాండ్‌ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విత్తనాలను కూడా సేకరించి రైతులకు వీటి ప్రాముఖ్యతను వివరిస్తూ సాగుచేసే విధంగా వారిని ప్రోత్సహించి వాటి విత్తన అభివృద్ధికి తోడ్పడుతోంది.
చిరుధాన్యాల పంట కాలం సాధారణంగా 90 రోజుల వరకు ఉంటుంది. అండుకొర్రలు విషయానికి వస్తే పంట కాలం సుమారు పది రోజులు ఎక్కువ. పంట కాలంలో ముఖ్యంగా గుర్తించవలసింది పూత దశ. ఈ దశలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే పూత మాడిపోతుంది. గింజ తయారవడం కష్టం. కంకులు ఏర్పడి, ఎక్కడన్నా ఒకటి అర గింజ తయారై ఉన్నా పెద్దగా ఉపయోగం ఉండదు. దీంతో పంట చేతికి రావడం కష్టమవుతుంది. రైతులు దీన్ని దృష్టిలో ఉంచుకొని విత్తనం నాటే సమయానికి నిర్ణయించుకోవడం అన్ని విధాలా మంచిదని సంబంధిత శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం: ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చిరుధాన్యాలపై రైతుల్లో అవగాహన, శిక్షణ కల్పించడం, నాణ్యమైన నిత్తనం అందించడం, క్షేత్రస్థాయి సందర్శన ద్వారా రైతులకు సాగులో వచ్చేటటువంటి సందేహాలను నివృత్తి చేయడం, రైతులకు అండగా మేమున్నామని భరోసా కల్పించడం వెనుక వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల కృషి కూడా ఎంతో ఉంది. డాక్టర్‌ టి.ఎస్‌.ఎస్‌.కె.పాత్రో వంటి శాస్త్రవేత్తలు విత్తన కొరత లేకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ఉత్తరాంధ్ర జిల్లాల రైతులకే పరిమితం కాకుండా, విజయనగరం పరిశోధనా స్థానంలో అభివృద్ధి చేస్తున్న రాగులు, సజ్జలు, కొర్రలు మొదలగు చిరుధాన్యాల విత్తనాలు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల రైతల నుండి కూడా మంచి డిమాండ్‌ ఏర్పడుతున్నట్లు తెలిపారు. రాగులు (చోళ్ళు) బి.ఆర్‌. 847 రకాన్ని అభివృద్ధి చేసి శ్రీవరి మాదిరిగా రాగులు శ్రీరాగి పద్ధతిలో సాగు చేయడం ద్వారా ఎకరాకు 12 నుండి 13 క్వింటాళ్ళ పంట దిగుబడి సాధించడం జరిగిందని ఆ ప్రాంత రైతులు చెప్పడం విశేషం.
అండుకొర్రల సాగు విధానం: ఎగుడు దిగుడు భూములు, కొండ ప్రాంతాలు, ఎటువంటి నేలలోనైనా పంటను పండిరచవచ్చు. చిరుధాన్యాలు ఏ కాలంలోనైనా నాటుకోదగినవి. జనవరిలో వేసిన రాగి విత్తనం మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్‌ మొదటి వారంలో పంట చేతికి వస్తుంది. వేసవి దుక్కులు అనంతరం ఆవుపేడ, ఆవుమూత్రం, బెల్లం, శనగపిండి, పుట్టమట్టితో కలిపి తయారు చేసుకున్న ఘనజీవామృతం ఎకరాకు సుమారు 400 కిలోల చొప్పున చిమ్ముకోవాలి. ఘనజీవామృతం చిమ్మిన తర్వాత కలియ దున్ని నేలను శుభ్రం చేసుకోవాలి. మే నెలలో వేసవి జల్లులు పడితే అండుకొర్రలు విత్తనం నాటుకోవచ్చు. నీటి వసతి ఉన్నట్లయితే మే రెండో వారంలో విత్తనం నాటుకోవడం మంచిది. ఎకరాకు 3 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనం మరీ ఒత్తుగా చిమ్మడం మంచిది కాదు. విత్తనం నాటిన 5 నుండి 7 రోజుల్లో మొలక వస్తుంది. మొక్క మొలిచిన 20 రోజులకు జీవామృతం నీటితో పాటు పారించవచ్చు లేదా పంటపై పిచికారి చేయవచ్చు. ఆ విధంగా 45 రోజులకు, 65 రోజులకు మొత్తంగా పంట కాలంలో మూడుసార్లు జీవామృతం అందిస్తాం. ఎప్పటికప్పుడు కలుపు లేకుండా శుభ్రం చేసుకోవాలి. అదును పదును చూసి విత్తనం నాటిన తరువాత నెలకోసారి చెదురుమదురు జల్లులు కురిస్తే అదృష్టం. లేనిపక్షంలో పంట కాలంలో రెండు లేదా మూడు తడులు అందిస్తే మంచిది. పొట్టదశలో ఏ విధంగా అయినా ఒక్క తడి తప్పనిసరిగా అందాల్సి ఉంటుంది. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులతో పని ఉండదు. చీడపీడల బాధ చిరుధాన్యాల పంటలకు ఉండదనే చెప్పవచ్చు.
వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడి చీడపీడలు సోకినప్పుడు వేప, సీతాఫలం, కానుగ వంటి ఆకుల కషాయాలను పైమందుగా ఉపయోగించి పంటను రక్షించుకోవడం జరుగుతుంది. రైతులతో పాటు క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించినప్పుడు ఒక గింజ విత్తనం ద్వారా దుబ్బు పిలకల నుండి 14 వెన్నులు రావడం గుర్తించడం జరిగింది. పంటకాలం పూర్తయిన తర్వాత కోతకు వస్తుంది. వెన్నులు కోసి గోనెసంచుల్లో రెండు రోజులు ఉంచాలి. అనంతరం సంచుల్లో నుండి తీసిన వెన్నులు ట్రాక్టరుతో తొక్కించడం లేదా కర్రలతో కొట్టి విత్తనం వేరు చేయడం జరుగుతుంది. వెన్నులు కోసి సంచుల్లో ఉంచడం వలన ఆవిరికి వేడి పుడుతుంది. దీంతో వెన్నుల నుండి విత్తనం త్వరగా వేరుచేయడం సాధ్యపడుతుందని వారి అనుభవాన్ని వివరించారు. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి కాలం కలిసి వస్తే ఎకరాకు పంట దిగుబడి ఏడు క్వింటాళ్ళకు తగ్గదు.
ఎకరా విస్తీర్ణంలో అండుకొర్రలు పంట ఖర్చు, ఆదాయ వివరాలు:
దుక్కి దున్ని నేలను చదును చేయడం 3,200
400 కిలోలు ఘనజీవామృతం 500
3 కిలోలు విత్తనం ఖరీదు 600
200 లీటర్ల చొప్పున 3 సార్లు జీవామృతం వినియోగం 700
కలుపుతీత 2,000
కోత కూలి 2,400
నూర్పిడి 600
మొత్తం పంట ఖర్చు 10,000.00
అండు కొర్రలు పంట దిగుబడి ఎకరాకు 7 క్వింటాళ్ళ వరకు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌ ధర క్వింటాలు అండుకొర్రలు రూ.3,000 వరకు ఉంది. ఆ విధంగా ఏడు క్వింటాళ్ళకు లెక్కగడితే ఆదాయం రూ.21,000 వరకు వస్తుంది. దీనిలో నుండి పంట ఖర్చు రూ.10,000 తీసివేయగా నికర ఆదాయం రూ.11,000 వరకు వస్తుంది.
‘సబల’ మహిళా శక్తి: విజయనగం జిల్లా, లక్కవరపుకోట మండలం, లచ్చంపేట గ్రామం, అలాగే కొత్తవలస మండలం చీడివలస, దేవాడ, దెందేరు గ్రామాల రైతులను ప్రకృతి నేస్తం ప్రత్యేక ప్రతినిధి పలకరించి చిరుధాన్యాల సాగు విధానం, వాటి
ఉపయోగాలు, ఈ పంటలు మీకు ఏ విధంగా సహాయపడుతున్నాయని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ముఖ్యంగా అక్కడి మహిళా రైతులు ఎంతో ఆసక్తితో ముందుకు వచ్చారు.
గ్రామంలో పది పదిహేను మంది రైతులు గ్రూపుగా ఏర్పడి, వారికున్న సొంత భూమిలో వరి పంటతో పాటు ఏదో ఒక చిరుధాన్యాల పంటను సాగుచేయడం జరుగుతోంది. వేసవి దుక్కుల అనంతరం ఎరువులు చిమ్ముకొని తొలకరిలో జూన్‌ మాసంలో గంటిలు (సజ్జలు) నాటుకోవడం జరుగుతుంది. పంట ఇంటికి రాగానే తదుపరి పంట వరి లేదా ఇతర పంటకు కావలసిన విత్తనం లేదా నారును సిద్ధం చేసుకుంటాం. ఆ విధంగా సంవత్సరంలో కనీసం మూడు పంటలు పండిరచే విధంగా నేలను తయారు చేయడం జరుగుతుంది.
మన పూర్వీకులు టిఫిన్‌ గురించి ఆలోచన చేయలేదు. రాత్రి వండిన అన్నం ఉదయం సద్దె అన్నంలో మజ్జిగ కలుపుకొని తినడం. గంజి అన్నం, అంబలి, రాగులు, సజ్జలు, జొన్నలు ఉపయోగించి తయారు చేసుకున్న ఆహారమే తీసుకునేవారు. వాటితోనే పిండివంటలు చేసుకొనేవారు. చక్కగా హుషారుగా పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వయసు మళ్ళినా ఆరోగ్యంగానే ఉండేవారు. గత 30 సంవత్సరాల కాలంలో జీవన విధానం, ఆహార శైలి పూర్తి భిన్నంగా ఉండడంతో వాతావరణంలో మార్పులు రావరడం, చిన్నవయసు పిల్లలే అనారోగ్య బారిన పడటం జరుగుతోంది. ఈ క్రమంలోనే పంటలు లేక గ్రామాలకు గ్రామాలు వలస వెళ్ళడం ఎంతో ఆందోళనకు గురిచేసింది. ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపిన ‘సబల’ సంస్థ మా జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. పూర్వీకులు జీవన విధానం, ఆహారపు అలవాట్లే మేము ఆచరిస్తున్నాం.
ఎలా బ్రతకాలో చిరుధాన్యాల సాగు నేర్పింది: చిరుధాన్యాల పంటలతో పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని ఏ విధంగా రక్షించుకోవచ్చో, సాగుచేసి వాటిని వినియోగించడం ద్వారా తెలుసుకోగలిగాం. మంచి వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మేము తీసుకొంటూ మా గ్రామ ప్రజలకు అందజేయగలుగుతున్నాం. రాగులు, సజ్జలు, జొన్నలతో తయారుచేసిన వివిధ రకాల వంటలు పిల్లలు కూడా ఇష్టంగా తినడంతో మేము చేసే పని ఎంతో సంతృప్తినిస్తోంది. కషాయాలు తయారు చేయడం, సాగు విధానంపై అవగాహన, శిక్షణ కల్పించడం, చిరుధాన్యాలతో తయారుచేసిన ఉత్పత్తులు ఏ విధంగా మార్కెట్‌లో విక్రయించుకోవాలి, ముఖ్యంగా పండిరచిన పంటకు సంబంధించిన విత్తన కొరత లేకుండా ఎలా భద్రపరచుకోవాలి, విత్తనబ్యాంకు ద్వారా విత్తనాలను సమయానికి తోటి రైతులకు ఎలా అందించాలి, ఈ విధంగా ప్రతి విషయంలోనూ సబల సంస్థ ముందుండి నడిపిస్తోంది. దీనికి తోడు సంస్థలో పనిచేసే యువతీ, యువకులు ఈశ్వరరావు, గోవిందరావు, జానకి వంటి వారు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ, అన్నివిధాల సహకరిస్తున్నారు. అంతేకాదు శాస్త్రవేత్తల బృందం ఎప్పటికప్పుడు అందించే సూచనలు, సలహాలు పాటించడం ద్వారా పంట పండిరచగలమనే నమ్మకంతో పాటు చేసే పని సంతృపితనిస్తోంది. దీంతో చిరుదాన్యాలాగు ద్వారా రైతులు ధైర్యంగా నిలబడగలరనే భరోసా ‘సబల’ సంస్థ కల్పించగలిగిందని కొత్తవలస మండలం, చీడివలస గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆ ప్రాంత రైతులు ఉషారాణి, రాములమ్మ, సన్యాసమ్మ, మహాలక్ష్మి, రామలక్ష్మి, లక్ష్మమ్మ, పార్వతమ్మ, దేవుడమ్మ, లచ్చంపేట గ్రామానికి చెందిన దేవుడుబాబు,కృష్ణ, దేవడమ్మ, లక్ష్మమ్మ, దెందేరుకు చెందిన వరలక్ష్మి, ఈశ్వరమ్మ, ఉత్తరాపల్లికి చెందిన కనకమహాలక్ష్మి మొదలగు రైతులు పాల్గొని వారి అనుభవాలను వివరిస్తూ, ఇంతకంటే జీవితంలో కావలసిందేముందంటూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
సిరిధాన్యాలతో అంతర్జాతీయ గుర్తింపు: సబల సంస్థ చేస్తున్న కార్యక్రమాలు, చిరుధాన్యాల పంటల ద్వారా రైతులను చైతన్యపరచటం, సిరిధాన్యాల ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేసి మార్కెట్‌ కల్పించడంతో పాటు నిరుద్యోగం యువతకు ఉపాధి కల్పించడంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన భారత చిరుధాన్యాల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్‌లోని సబల సంస్థను గుర్తించడం జరిగింది.
స్వీడన్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పర్యావరణం, ఆరోగ్యం, భూతాపాన్ని తగ్గించడం, పిల్లలు, మహిళల్లో పోషకాల లోపంతో వచ్చే ఆరోగ్య సమస్యలకు చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహారం తీసుకోవడం వలన ఉపయోగాలు, ఇతరత్రా అంశాలపై ఆ సదస్సులో చర్చిండం జరిగింది ఈ సదస్సులో సబల సంస్థ పాల్గొనే అవకాశం కలిగింది. 15 సంవత్సరాల నుండి సబల సంస్థ అంకితభావంతో చేస్తున్న కృషికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఆ ప్రాంత రైతులు, సంస్థలో పనిచేసే సభ్యులు, శాస్త్రవేత్తలు ప్రతి ఒక్కరూ సహకరించడం వలనే సంస్థ ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపబడిరది. దీనికి తోడు ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో సిరిధాన్యాలపై ఖాదర్‌వలి గారితో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు పట్టణాల నుండి పల్లెల వరకు ప్రజల్లో విస్తృత ప్రచారం జరగడంతో చిరుధాన్యాల ప్రాముఖ్యత మరియు వాటి వినియోగం పెరిగింది. దీన్ని గుర్తించిన విద్యావంతులు, యువ రైతులు చిరుధాన్యాలు సాగుచేయడానికి ముందుకు రావడంతో ఆరోగ్య భారత దేశానికి అడుగులు పడుతున్నాయి. మహిళ అబల కాదు సబల అని మరొక్కసారి నిరూపించారు. చిరుధాన్యాల సాగు పద్ధతులు, ఆరోగ్య సిరిధాన్యాల ఉత్పత్తులు, విత్తనాలకు సంబంధించిన సమాచారం కోసం సబల సంస్థ ముఖ్య కార్యనిర్వాహణాధికారిణి సరస్వతి ఫోన్‌ 8639277205 నెంబరు ద్వారా సంప్రదించగలరు.
(ప్రకృతి నేస్తం పుస్తకం నుంచి….)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.