పణ్రుటిలో లక్ష్మి కట్టిన ఇల్లు -అపర్ణ కార్తీకేయన్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

ప్యాసింజర్‌ రైళ్ళలో పసనపండ్లను అమ్మడంతో మొదలుపెట్టి తమిళనాడులోని పణ్రుటిలోని మండీలలో వ్యాపారం చేసేవరకు లక్ష్మి చేసిన ప్రయాణంÑ తోటల నుండి, మండీల నుండి, స్థానిక మార్కెట్‌ల వరకు సాగే పనస పండు ప్రయాణంలాగే విభ్రాంతి కలిగించేంత అనిశ్చితితో సాగింది.

అదొక వీరుని ప్రవేశం లాంటి శ్రేష్టమైన దృశ్యం. రవాణా, భారీ బరువులెత్తడం, ఇంకా అందులో ఇమిడి ఉండే ప్రమాదాలన్నింటి దృష్ట్యా పనసపండ్ల వ్యాపారం మహిళలకు తగినది కాదని ఆరుగురు పురుషులు నొక్కి వక్కాణించిన ఐదు నిమిషాలకు లక్ష్మి ఆ దుకాణంలోకి ప్రవేశించారు. పసుపుపచ్చని చీర ధరించిన ఆమె, నెరసిన జుట్టుని ముడి చుట్టుకున్నారు. ఆమె ముక్కుకీ, చెవులకీ బంగారు నగలున్నాయి. ‘‘వ్యాపారంలో ఈమె చాలా పేరెన్నికగన్న మనిషి’’ అంటూ ఒక రైతు ప్రకటించారు.
‘‘మా పంటకు ధర నిర్ణయించేది ఆమే.’’
పణ్రుటిలో పనసపండ్ల వ్యాపారంలో ఉన్న ఏకైక మహిళ 65 ఏళ్ళ లక్ష్మి. అదేవిధంగా వ్యవసాయోత్పత్తుల వ్యాపారంలో ఉన్న అతి కొద్దిమంది సీనియర్‌ మహిళలలో ఆమె కూడా ఒకరు.
తమిళనాడులోని కడలూరు జిల్లా, పణ్రుటి పట్టణం పనసపండ్లకు ప్రసిద్ధి చెందినది. సీజన్‌లో వందలాది టన్నుల పనసపండ్ల కొనుగోళ్ళూ, అమ్మకాలూ జరుగుతాయిక్కడ. ప్రతి సంవత్సరం పట్టణంలోని పనసపండ్ల మండీలలో ఉన్న 22 దుకాణాల్లో అమ్మకాలు జరిగే వేలాది కిలోల పనసపండ్లకు ధరను లక్ష్మి నిర్ణయిస్తారు. అందుకు ఆమెకు అమ్మేవారి దగ్గర నుంచి వెయ్యి పండ్లకు రూ.50 చొప్పున కొద్దిపాటి కమీషన్‌ లభిస్తుంది. రైతులు ఇష్టమైతే ఆమెకు మరికొంత కమిషన్‌ కూడా ఇస్తుంటారు. పంట కాలంలో ఆమె సంపాదన రోజుకు రూ.1000 నుండి రూ.2000 వరకూ ఉంటుంది.
దీన్ని సంపాదించటం కోసం ఆమె 12 గంటల పాటు పనిచేస్తారు. అర్థరాత్రి ఒంటిగంటకే ఆమె పని మొదలవుతుంది. ‘‘చాలా ఎక్కువ సరుకు ఉన్నప్పుడు నన్ను తీసుకువెళ్ళేందుకు వ్యాపారులు చాలా పెందలకడనే మా ఇంటికి వస్తారు’’ అని లక్ష్మి వివరించారు. తెల్లవారురaాము మూడు గంటలకే ఆమె ఆటో రిక్షాలో మండీకి చేరుకుంటారు. అప్పటి నుంచి ఆమె పని ‘దినం’ రాత్రి 11 గంటలవరకూ సాగుతుంది. ఆ తర్వాతనే ఆమె ఇంటికి వెళ్ళి భోజనం చేసి, తిరిగి మార్కెట్‌కు వెళ్ళేంతవరకూ విశ్రాంతి తీసుకుంటారు.
‘‘పనస పంటను పండిరచటం గురించి నాకు పెద్దగా తెలియదు’’ రోజంతా గంటలకు గంటలు మాట్లాడుతూ, పెద్ద గొంతుకతో అరుస్తూ ఉండటం వల్ల బొంగురుపోయిన గొంతుకతో ఆమె నాకు చెప్పారు. ‘‘అయితే వాటిని అమ్మడం గురించి నాకు కొద్దిగా తెలుసు’’ అంటారు లక్ష్మి వినయంగా. గత మూడు దశాబ్దాలుగా ఈ వ్యాపారంలో ఉన్న ఆమె అంతకు ముందు 20 ఏళ్ళపాటు రైళ్ళలో పనసపండును అమ్మేవారు.
ఆమెకు పన్నెండేళ్ళ వయసప్పుడు పనసపండుతో ఆమె ప్రయాణం మొదలయింది. ఓణీ వేసుకున్న చిన్నారి లక్ష్మి తమిళంలో పలాపళమ్‌గా పిలిచే కొన్ని పనసపండ్లను తీసుకొని ఆవిరి యంత్రంతో నడిచే కరి వండి (పాసెంజర్‌ రైళ్ళు)లలో అమ్మేది. ఇప్పుడు 65 సంవత్సరాల వయసున్న లక్ష్మి, ముఖద్వారంపై లక్ష్మీ విలాస్‌ అని ఆమె పేరే రాసి ఉన్న ఇంటిలో నివసిస్తున్నారు.
అదే లక్ష్మి కట్టిన ఇల్లు… ప్రపంచంలోని అతి పెద్ద పండ్లలో ఒకటైన పనసపండునున అమ్మడం, దానితో వ్యాపారం చేయడం ద్వారా.
… … …
పనసపండు పంట కాలం సాధారణంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొదలై పూర్తి ఆరు నెలల కాలం కొనసాగుతుంది. 2021 ఈశాన్య ఋతుపవనాల సమయంలో కురిసిన భారీ, అకాల వర్షాలు పనసపంట పూతనూ, కాపునూ ఎనిమిది వారాలపాటు ఆలస్యం చేశాయి. దాంతో పణ్రుటి మండీలోకి ఈ పండ్లు ఏప్రిల్‌లో రావటం మొదలై ఆగస్టుకల్లా పంట కాలం ముగిసింది.
వాడుకగా ‘జాక్‌’ అని పిలిచే ఈ పండు దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలకు చెందిన పంట. మలయాళ భాషలోని ‘చక్కా’ నుండి ఈ పేరు వచ్చింది. దీని పూర్తి శాస్త్రీయ నామం: ఆర్టోకార్పస్‌ హెటెరోఫైలస్‌.
PARI, 2022, ఏప్రిల్‌ నెలలో రైతులనూ, వ్యాపారులనూ కలిసేందుకు మొదటిసారి పణ్రుటిని సందర్శించింది. రైతు, కమీషన్‌ ఏజెంట్‌ కూడా అయిన ఆర్‌.విజయకుమార్‌ (40) మమ్మల్ని తన దుకాణంలోకి సాదరంగా ఆహ్వానించారు. గట్టిగా ఉన్న మట్టి నేల, పైకప్పుతో పాటు అన్నివైపులా గడ్డితో కట్టిన గోడలతో ఉన్న దుకాణం ఒక సాధారణ నిర్మాణం. ఆయన ఆ దుకాణానికి ఏడాదికి రూ.50,000 అద్దె చెల్లిస్తారు. ఒక బెంచీ, కొన్ని కుర్చీలు మాత్రమే అక్కడున్న విలాసవంతమైన సౌకర్యాలు.
అక్కడ, ఏనాటివో ఒక వేడుకకు సంబంధించిన కొన్ని జెండాలు, దండ వేసి ఉన్న ఆయన తండ్రిగారి ఫోటో, ఒక బల్ల, పనసపళ్ళ గుట్టలు ఉన్నాయి. 100 పండ్లతో ప్రవేశ ద్వారం వద్ద ఉన్న గుట్ట చిన్నపాటి పచ్చని కొండలా కనిపిస్తోంది.
దాని విలువ రూ.25,000 అని విజయ్‌కుమార్‌ వివరించారు. చివరగా ఉన్న గుట్టలో ఇద్దరు వ్యాపారులకు అమ్మినది, చెన్నైలోని అడయార్‌ ప్రాంతానికి వెళ్తున్నది… 60 పండ్లున్న గుట్ట. దాని విలువ దాదాపు రూ.18,000.
పనసపళ్ళను అక్కడికి 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నైకు న్యూస్‌పేపర్‌ వ్యానుల్లో పంపిస్తారు. ‘‘అవి మరింత తూర్పు వైపుకు వెళ్ళేట్టయితే, వాటిని మేం టాటా ఏస్‌ ట్రక్కుల్లో పంపిస్తాం. మా పనిదినాలు చాలా దీర్ఘంగా ఉంటాయి. ఈ పంటకాలపు రోజుల్లో ఉదయం 3 లేదా 4 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకూ మేమిక్కడే ఉంటాం’’ అంటారు విజయ్‌కుమార్‌. ‘‘ఈ పండుకు చాలా డిమాండ్‌ ఉంది. దీన్ని అందరూ తింటారు. చివరకు మధుమేహ రోగులు కూడా నాలుగు సొళైలు (తొనలు) తింటారు’’ అని నవ్వుతూ ‘‘మాకే వీటిని తినీ తినీ విసుగు పుట్టింది’’ అన్నారు.
పణ్రుటిలో 22 హోల్‌సేల్‌ దుకాణాలు ఉన్నాయని విజయ్‌కుమార్‌ వివరించారు. అతని తండ్రికి దాదాపు 25 సంవత్సరాలుగా అదే స్థలంలో ఒక దుకాణం ఉంది. తండ్రి మరణం తర్వాత గత 15 ఏళ్ళుగా విజయ్‌కుమార్‌ ఆ దుకాణాన్ని నడుపుతున్నారు. ప్రతి ఒక్క దుకాణం రోజుకు 10 టన్నుల వ్యాపారం చేస్తుంది. ‘‘తమిళనాడు మొత్తమ్మీద పణ్రుటి బ్లాక్‌లోనే అత్యధిక సంఖ్యలో పనసపండ్లు ఉంటాయి’’ అని విజయ్‌కుమార్‌ చెప్పారు. అక్కడే కొనేవారి కోసం ఎదురుచూస్తూ బల్లమీద కూర్చొని ఉన్న రైతులు కొందరు ఆయన మాటలకు తలలూపుతూ, తాముకూడా సంభాషణలో పాల్గొన్నారు.
పురుషులు వేష్టిలను లేదా లుంగీలనూ, చొక్కాలనూ ధరించి ఉన్నారు. అక్కడ ఆ వ్యాపారంలో ఉండే అందరూ అందరికీ తెలిసినవాళ్ళే. సంభాషణలు బిగ్గరగా, రింగ్‌టోన్లు ఇంకా బిగ్గరగా, అటుగా వెళ్తున్న లారీలు చేసే శబ్దం మరింత బిగ్గరగా సాగుతున్నాయి. ఆ లారీల హారన్‌లు ఒక్కసారిగా చెవులు చిల్లులుపడేలా అరుస్తున్నాయి.
తాను చేస్తున్న పనసపంట సేద్యం గురించి కె.పట్టుసామి (47) తన అనుభవాలను పంచుకున్నారు. పణ్రుటి తాలూకా, కాట్టాండికుప్పం గ్రామానికి చెందిన ఈయన సొంతానికి 50 పనసచెట్లు ఉన్నాయి. మరో 600 చెట్లను గుత్తకు తీసుకున్నారు. ఇప్పుడు నడుస్తోన్న ధర ప్రతి 100 చెట్లకు రూ.1.25 లక్షలు. ‘‘నేను పాతికేళ్ళుగా ఈ వ్యాపారంలో ఉన్నాను. ఇందులో అనేక అనిశ్చితులుంటాయని నేను చెప్పగలను’’ అన్నారాయన.
పంట చాలా ఎక్కువగా వచ్చినప్పటికీ, ‘‘పది పండ్లు పాడైపోతాయి, ఒక పది పగిలిపోతాయి, ఇంకో పది రాలి కింద పడిపోతాయి, మరో పదింటిని జంతువులు తింటాయి’’ అని అంటారు పట్టుసామి.
మిగలపండిన పండ్లను తీసేస్తే అవి జంతువులకు ఆహారమవుతాయి. సరాసరిన 5 నుంచి 10 శాతం పండ్లు వ్యర్థంగా పోతాయి. ఈ సరాసరి నష్టం, మంచి పంట కాలంలో ఒక రోజుకు, ఒక్కో దుకాణానికి దాదాపు సగం టన్ను లేదా ఒక టన్నుకు మధ్య ఉండేది. ఈ వ్యర్థమైన పంటలో ఎక్కువ భాగం పశువులకు ఆహారంగా మాత్రమే పనికొస్తుందని రైతులు చెబుతున్నారు.
పశువులకు లాగానే చెట్లు కూడా పెట్టుబడే. గ్రామీణ ప్రాంతాల జనాభా దీన్ని నిల్వగా పరిగణిస్తారు. సాధారణంగా వీటి విలువ పెరుగుతుంటుంది కనుక మంచి లాభానికి అమ్ముకోవచ్చు. పనసచెట్టు కాండం 8 చేతుల వెడల్పు, 7 నుంచి 9 అడుగుల పొడవు పెరిగాక, ‘‘కేవలం దాని కలప నుంచే రూ.50,000 వస్తాయి’’ అని విజయ్‌కుమార్‌, అతని స్నేహితులు చెప్పారు.
సాధ్యమైనంత వరకూ రైతు చెట్లను నరికెయ్యడని పట్టుసామి చెప్పారు. ‘‘మేం చెట్ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తాం. కానీ, ఏదైనా వైద్యపరమైన ఎమర్జెన్సీ వచ్చినప్పుడో, కుటుంబంలో పెళ్ళి వంటి శుభకార్యం జరిగితేనో, మేం కొన్ని పెద్ద చెట్లను ఎంపికచేసి వాటిని కలప కోసం అమ్ముతాం’’ అని ఆయన చెప్పారు. ఇలా అమ్మితే ఆ రైతుకు ఓ రెండు లక్షల రూపాయలొస్తాయి. ఆ డబ్బు అప్పటికి ఆ ఆపద నుంచి గట్టెక్కడానికో, ఇంట్లో జరిగే పెళ్ళి కోసమో సరిపోతుంది.
‘‘ఇలా రండి’’ దుకాణం వెనుక వైపునకు వెళ్తున్న పట్టుసామి నన్ను పిలిచారు. ఇంతకు ముందిక్కడ డజన్లకొద్దీ పనస చెట్లుండేవని ఆయన వివరించారు. అయితే మాకక్కడ కనిపిస్తున్నది పలా కండ్రు (పనస మొక్కలు) మాత్రమే. అక్కడ ఉండే పెద్ద పెద్ద చెట్లని ఖర్చులకు డబ్బుల కోసం ఆ భూమి యజమాని అమ్మేశారు. ఆ తర్వాత మరో విడత పనస మొక్కలను అక్కడ నాటారు. ‘‘వీటి వయసు కేవలం రెండేళ్ళే’’ పొట్టిగా, లేతగా ఉన్న మొక్కలవైపు చూపిస్తూ చెప్పారు పట్టుసామి. ‘‘ఇంకొన్ని ఏళ్ళు పెరిగిన తర్వాతనే పనస చెట్టుకు కాపు వస్తుంది.’’
ప్రతి ఏడాదీ పంట కాలంలో వచ్చే మొదటి కాపును జంతువులు తినేస్తాయి. ‘‘కోతులు నోటితో పండ్లను చీల్చి, చేతులతో తొనలు తీసుకుని తినేస్తాయి. ఉడతలు కూడా వాటిని చాలా ఇష్టపడతాయి.’’
చెట్లను గుత్తకు ఇవ్వడం అందరికీ ఉపయోగకరమే అంటారు పట్టుసామి. ‘‘చెట్ల యజమానులకు ప్రతి ఏడాదీ ఒక్క మొత్తంగా డబ్బు లభిస్తుంది. చెట్టునుండి అక్కడొకటీ ఇక్కడొకటీ పండ్లను కోసి, సమయానికి మార్కెట్‌కు తీసుకువెళ్ళే పని ఉండదు. పెద్ద సంఖ్యలో చెట్లను సంరక్షించే నాలాంటివాడికైతే… నేను ఒక్కసారే 100 నుంచి 200 వరకూ పండ్లను కోసి మండీకి తీసుకుపోగలను’’. చెట్లు సక్రమంగా ఉన్నంతవరకూ, వాతావరణం సరిగ్గా ఉన్నంతవరకూ ఇది అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతి.
విచారించాల్సిన విషయం ఏంటంటే, అవన్నీ జరిగినా కూడా ఇప్పటికీ రేటును నిర్ణయించే అధికారం రైతుకు లేదు. వారది చేయగలిగి ఉంటే, ధరలో ఇంత తీవ్రమైన, మూడు రెట్లు వ్యత్యాసం ఉండదు. 2022లో ఒక టన్ను పనస పండు ధర రూ.10,000 నుండి రూ.30,000 మధ్య పలికింది.
‘‘ధర ఎక్కువ పలికినప్పుడు ఇందులో చాలా డబ్బు ఉన్నట్టుగా కనిపిస్తుంది’’ తన చెక్కబల్ల సొరుగు వైపు చూపిస్తూ అన్నారు విజయ్‌కుమార్‌. ఇరుపక్షాల రైతుల నుంచి ఆయనకు ఐదు శాతం కమీషన్‌ లభిస్తుంది. ‘‘కానీ, ఒక్క క్లయింట్‌ మోసం చేసినా మొత్తం పోతుంది. మనం మొత్తాన్నీ ఖాళీ చేయాల్సి ఉంటుంది’’ సొరుగు మీద తడుతూ ఆయన భుజాలెగరేశాడు. ‘‘అయితే, రైతుకు డబ్బు చెల్లించాలి. మనకొక నైతిక బాధ్యత అనేది ఉంటుంది కదా?’’
పనస పండిరచే రైతులు, ఉత్పత్తిదారులు కలిసి 2022 ఏప్రిల్‌ నెల ప్రారంభంలో ఒక సంగం… ఒక కమిటీని ఏర్పాటు చేశారు. విజయ్‌కుమార్‌ ఆ కమిటీ కార్యదర్శి. ‘‘ఇది పెట్టి ఇంకా పది రోజులే అయింది. మేమింకా దీన్ని రిజిస్టర్‌ చేసుకోలేదు’’ అన్నారాయన. వారికి ఈ కమిటీపై చాలా ఆశలున్నాయి. ‘‘మేమే ధరను నిర్ణయించాలనుకుంటున్నాం. తర్వాత జిల్లా కలెక్టర్‌ను కలిసి రైతులకూ, పరిశ్రమకూ సహాయం చేయాలని అడుగుతాం. ఉత్పత్తిదారుల కోసం కొన్ని ప్రోత్సాహకాలు… ప్రధానంగా పండ్లను భద్రం చేసేందుకు ఒక శీతల గిడ్డంగి (కోల్డ్‌ స్టోరేజ్‌) వంటి సౌకర్యాల కోసం అడగాలనుకుంటున్నాం. మేం సంఘటితమైనప్పుడు మాత్రమే వెళ్ళి ఇలాంటివన్నీ అడగగలం, కదా?’’
ప్రస్తుతం వాళ్ళు ఎక్కువలో ఎక్కువగా ఐదు రోజులు మాత్రం పనసపండ్లను నిల్వ ఉంచగలుగుతున్నారు. ‘‘వాటిని మరింతకాలం నిల్వ ఉంచే విధానం మాక్కావాలి’’ అంటారు లక్ష్మి. ఆరు నెలలపాటు నిల్వ ఉంచగలిగితే చాలా బాగుంటుందని ఆమె ఆలోచన. కనీసం అందులో సగం రోజులైనా ఉంచగలిగితే బాగుంటుందని విజయ్‌కుమార్‌ కోరుకుంటున్నారు. ఇప్పటికైతే, అమ్ముడుపోని పండ్లను కొన్ని రోజుల్లోనే చెత్తలో పారేయాల్సి వస్తోంది, లేదా చిల్లర వ్యాపారులకు ఇవ్వవలసి వస్తోంది. వాళ్ళు ఆ పండ్లను కోసి, తొనలను అమ్ముకుంటారు.
… … …
‘‘ప్రస్తుతానికి పనసపండ్ల కోసం శీతల గిడ్డంగి ఉండాలనే ఆలోచన కేవలం భావనాపరమైన కోరిక మాత్రమే. మనం బంగాళాదుంపలనో, ఆపిల్‌నో ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చు. కానీ పనసపండుపై ఎలాంటి ప్రయోగాలు లేవు. పనసకాయ చిప్స్‌ కూడా పంట కాలం తర్వాత రెండు నెలల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి’’ అని విశిష్ట కన్నడ వ్యవసాయ పత్రిక ‘అడికే పత్రికే (అరేకా పత్రిక)’ జర్నలిసు, సంపాదకులు పడ్రే చెప్పారు.
‘‘ఏడాది పొడవునా కనీసం ఒక డజను పనస ఉత్పత్తులను అందుబాటులో ఉంచగలిగితే ఇప్పుడున్న పరిస్థితులు మారవచ్చు’’ అని ఆయన చెప్పారు.
ూARI తో జరిగిన టెలిఫోన్‌ ఇంటర్వ్యూలో పడ్రే పనసపంట సాగుపై అనేక ముఖ్యమైన, లోతైన అంశాలను చర్చించారు. మొ దటగా, పనసపంటకు సంబంధించిన వివరాలేవీ మన వద్ద లేవని ఆయన అన్నారు. ‘‘ఈ అంకెలను విశ్లేషించడం కష్టం, గందరగోళంగా ఉంటుంది. సుమారు 10 సంవత్సరాల క్రితం వరకూ కూడా ఇది నిర్లక్ష్యానికి గురైన, అక్కడక్కడా మాత్రమే పండిరచే పంట. పణ్రుటి ఒక్కటే ఒక అద్భుతమైన మినహాయింపు.’’
పనస ఉత్తత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని పడ్రే అభిప్రాయపడ్డారు. ‘‘పనస చెట్టు ప్రతిచోటా ఉంటుంది. కానీ ప్రపంచపు విలువ జోడిరపు పటంలో మనం దీన్ని ఎక్కడా గుర్తించలేం’’. మన దేశంలో కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలు ఈ పంటకు కొంత విలువను జోడిస్తుండగా, తమిళనాడులో ఇది ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న పరిశ్రమ.
అనేక ఉపయోగాలున్న ఈ పండు గురించి సరైన వివరాలు లేకపోవడం చాలా విచారించే విషయమని పడ్రే చెప్పారు. ‘‘పనస గురించి జరగవలసినంత పరిశోధన జరగలేదు. ఒక పెద్ద చెట్టు దిగుబడి సామర్థ్యం ఒక టన్ను నుంచి మూడు టన్నుల మధ్య ఉంటుంది’’. అదనంగా, ప్రతి చెట్టులో ఐదు శక్తివంతమైన మూలకాలు ఉన్నాయి. మొదటిగా లేత పనసకాయ. తర్వాత కూరగాయగా ఉపయోగించే కొద్దిగా పెరిగిన కాయ. ఆ పైన అప్పడాలు, చిప్స్‌ తయారు చేసేందుకు ఉపయోగించే ఇంకా పక్వానికి రాని పండు. నాల్గవది ప్రసిద్ధి చెందిన పనసపండు. చివరగా పనస విత్తనం.
‘‘దీన్ని ‘సూపర్‌ఫుడ్‌’ అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయినా ఇప్పటికీ దీని గురించి ఎలాంటి పరిశోధనా కేంద్రం గానీ, శిక్షణా కేంద్రం గానీ లేదు. అరటికీ, బంగాళాదుంపలకూ ఉన్నట్టు పనసపండు శాస్త్రజ్ఞులు కానీ, కన్సల్టెంట్లు కానీ లేరు.
ఒక పనసపండు కార్యకర్తగా పడ్రే ఇటువంటి ఖాళీలన్నిటినీ పూరించే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘గత పదిహేనేళ్ళుగా నేను పనసపండు గురించి రచనలు చేస్తున్నాను, సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాను, ప్రజలకు ప్రేరణనిస్తున్నాను. ఇది మా పత్రిక ‘అడిగే పత్రిక’ ఉనికిలోకి వచ్చిన దానిలో (34 సంవత్సరాలు) దాదాపు సగం సమయం. మేం మా పత్రికలో కేవలం పనసపండు పైనే 34 కవర్‌ స్టోరీలు చేశాం.’’
పనసపండు గురించి సానుకూల కథనాలనే హైలైట్‌ చేయడానికి పడ్రే ఆసక్తిగా ఉన్నప్పటికీ ఆయనతో సంభాషణా సమయంలో భారతదేశంలో తయారయ్యే రుచికరమైన పనసపండు ఐస్‌క్రీమ్‌లతో సహా పలు కథనాలను చెప్పుకొచ్చారు. ఆయన దానికి ఉన్న సమస్యలను గురించి దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు. ‘‘ఇందులో విజయం సాధించడానికి దారిగా శీతల గిడ్డంగిని గుర్తించడం ముఖ్యమైనది. పనసపండును ఏడాది పొడవునా గడ్డకట్టిన రూపంలో మార్కెట్‌లో అందుబాటులో ఉంచడం మొదటి ప్రాధాన్యం. రాకెట్‌ సైన్స్‌ అంత వేగంగా ఈ పని చేయడం సాధ్యం కానప్పటికీ, మేం ఆ దిశగా ఇంకా తప్పటడుగులు కూడా వేయలేదు.’’
విశ్లేషించి ఈ పండుకే ఉన్న మరో సమస్య, బయటికి కనిపిస్తున్న దాన్ని బట్టి నాణ్యత గురించి అంత సులభంగా చెప్పలేకపోవడం. పనస పంటను శ్రద్ధగా పండిస్తున్న, ఈ పండ్లకు ఖచ్చితమైన మార్కెట్‌ ఉన్న పణ్రుటిలో మినహాయించి, పనసను పండిస్తున్న మరే ప్రాంతంలోనూ వాటికి మార్కెట్‌ సిద్ధంగా లేదు. రైతుకు అనుకూలమైన సరఫరాలు చేసే గొలుసుకట్టు మార్గాలూ లేవు. ఫలితంగా ఇది పుష్కలంగా పంట వృథా కావటానికి దారితీస్తుంది.
ఈ వృథాని అరికట్టడానికి మనమేం చేస్తున్నాం అని పడ్రే అడుగుతారు. ‘‘ఇది మాత్రం ఆహారం కాదా? మనం బియ్యానికి, గోధుమకీ మాత్రమే అంత ప్రాథాన్యాన్ని ఎందుకిస్తున్నాం?’’
వ్యాపారం మెరుగుపడాలంటే, పణ్రుటి పనసపండు ప్రతి రాష్ట్రానికీ, ప్రతి దేశానికీ… ఇలా ప్రతి చోటకీ చేరాలని విజయ్‌కుమార్‌ అంటారు. ‘‘దీనికి మరింత ప్రచారం ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు మంచి ధర వస్తుంది’’ అంటారాయన.
చెన్నైలోని విశాలమైన కోయంబేడు హోల్‌సేల్‌ మార్కెట్‌ సముదాయంలో ఉండే అన్నా పండ్ల మార్కెట్‌కి చెందిన వ్యాపారులు కూడా శీతల గిడ్డంగి, మరింత మెరుగైన ప్రాంగణం (యార్డ్‌) వంటి సౌకర్యాల గురించే అడుగుతున్నారు. ఇక్కడి వ్యాపారుల ప్రతినిధి సి.ఆర్‌.కుమరవేల్‌ మాట్లాడుతూ, పనస పండు ధరలో చాలా హెచ్చుతగ్గులు ఉంటున్నాయనీ, ఒక్కో పండు ధర రూ.100 నుంచి రూ.400 పలుకుతుందని అన్నారు.
‘‘కోయంబేడులో మేం పండ్లను వేలం వేస్తాం. పండ్ల సరఫరా ఎక్కువగా ఉన్నప్పుడు సహజంగానే ధర పడిపోతుంది. దానికితోడు 5 నుంచి 10 శాతం వరకూ వ్యర్థంగా పోతుంది. మనం పండ్లను నిలువ చేసి, అమ్మగలిగితే మంచి ధర వచ్చి రైతులకు లాభం వస్తుంది.’’ అక్కడున్న పది దుకాణాలలో ఒక్కరోజుకు కనీసం 50 వేల రూపాయల వ్యాపారం జరుగుతుందని కుమరవేల్‌ అంచనా వేస్తున్నారు. ‘‘అయితే ఇదంతా కేవలం పంటకాలంలోనే`ఏడాదిలో ఐదు నెలలు.’’
తమిళనాడు వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ వారి 2022`23 పాలసీ నోట్‌, పనస పంట పెంపకందారులకు, వారికి అనుబంధంగా ఉండే వ్యాపారులకు ప్రయోజనాన్ని కలిగించే కొన్ని తీర్మానాలను తీసుకుంది. పాలసీ నోట్‌లో ‘‘పనస పెంపకం, ప్రాసెసింగ్‌ రంగాలలో ఉన్న అపారమైన అవకాశాలను ఉపయోగించుకోవడానికి ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో కడలూరు జిల్లా పణ్రుటి బ్లాక్‌, పణిక్కన్‌కుప్పం గ్రామంలో ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు’’ పేర్కొంది.
‘‘ప్రపంచ మార్కెట్‌లో మరింత ఎక్కువ విలువను సాధించేందుకు’’ పణ్రుటి పనసపండుకు భౌగోళిక సూచిక (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌`జిఐ) గుర్తింపును పొందడానికి చర్యలు కొనసాగుతున్నట్లు కూడా ఈ నోట్‌లో పేర్కొన్నారు.
లక్ష్మి మాత్రం ‘‘చాలామందికి పణ్రుటి ఎక్కడ ఉందో కూడా తెలియదు’’ అని కొట్టిపారేస్తారు. 2002లో వచ్చిన తమిళ చిత్రం సొల్ల మఱంద కదై (ఒక మరచిపోయిన కథ) తన పట్టణానికి పేరు తెచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘దర్శకుడు తంకర్‌ బచ్చన్‌ ఈ ప్రాంతానికి చెందినవాడు. నేను కూడా ఈ సినిమాలో కనిపిస్తాను’’ అంటూ కనిపించని అతిశయంతో చెప్తారు లక్ష్మి. ‘‘షూటింగ్‌ జరుగుతున్న సమయంలో చాలా వేడిగా ఉంది, కానీ ఆసక్తికరంగా ఉంది.’’
… … …
మంచి పంట కాలంలో లక్ష్మికి బాగా గిరాకి ఉంటుంది. పనసపండు ప్రియుల స్పీడ్‌ డయల్‌లో ఆమె ఫోన్‌ నంబర్‌ ఉంటుంది. ఆమె తమకు ఉత్తమ ఫలాలనే అందజేస్తారని వారికి తెలుసు.
లక్ష్మి నిజానికి అదే చేస్తారు. ఆమెకు పణ్రుటిలోని 20కి పైగా మండీలతో అనుసంధానం కలిగి ఉండటమే కాకుండా వాటికి పండ్లను సరఫరా చేసే చాలామంది రైతుల గురించి కూడా ఆమెకు బాగా తెలుసు. అందువల్ల వారి పంట ఎప్పటికి సిద్ధమవుతుందో కూడా ఆమెకు తెలుస్తుంటుంది.
వీటన్నిటినీ ఆవిడ ఎలా తెలుసుకుంటారు? ఈ ప్రశ్నకు లక్ష్మి జవాబు చెప్పరు. ఇది స్పష్టంగానే ఉంది, ఆమె దశాబ్దాలుగా ఈ పనిలో ఉన్నారు. తెలుసుకోవడం ఆమె పని, ఆమె అదే చేస్తున్నారు.
ఇటువంటి పురుషాధిపత్య రంగంలోకి ఆమె ఎలా వచ్చారు? ఈసారి ఆమె నాకు సమాధానం చెప్పారుÑ ‘‘మీలాంటి వాళ్ళు తమకోసం పండ్లు కొనమని నన్ను అడుగుతాం ు. మంచి ధరకు కొని, నేను వారికి అందజేస్తాను.’’ ఇందులో వ్యాపారి లాభం గురించి కూడా చూస్తానని ఆమె స్పష్టం చేస్తారు. వ్యాపారులు, రైతులు ఆమె తీర్పును గౌరవిస్తారని దీనివల్ల స్పష్టమవుతోంది. వారామెను స్వాగతిస్తారు, ఆమె గురించి గొప్పగా చెప్తారు కూడా. ఆమె నివాసముండే ప్రాంతంలో ఆమె ఇల్లెక్కడని ఎవరిని అడిగినా చెప్తారు. ‘‘కానీ నాది కేవలం సిల్లరై వ్యాపారం (చిన్న వ్యాపారం) మాత్రమే. కాకపోతే నేను అందరికీ మంచి ధర అందేలా చూస్తాను’’ అంటారామె. మండీకి వచ్చిన ప్రతి పనసపండు లోడ్‌నూ లక్ష్మి పరిశీలించి పండు ధరను నిర్ణయిస్తారు. అందుకు ఆమెకు కావలసింది ఒక కత్తి. పండుపై కొద్దిసార్లు తట్టటంతోనే అది పండిరదా, ఇంకా పచ్చిగానే ఉందా, లేదా మరుసటి రోజుకు తినేందుకు పనికొస్తుందా అనేది ఆమెకు తెలిసిపోతుంది. తన అంచనా మీద తనకే సందేహం కలిగినప్పుడు మాత్రం ఆమె పండుకు కొద్దిగా కోతపెట్టి ఒక తొనను బయటికి లాగి పరీక్షిస్తారు. ఇలా చేయటం అత్యధిక ప్రమాణం కలిగిన పరీక్షే అయినప్పటికీ, పండుకు కోత పెట్టవలసి రావడం వలన అది చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది.
‘‘గత ఏడాది రూ.120 ధర పలికిన ఇదే సైజు పలా, ఇప్పుడు రూ.250 ధర పలుకుతోంది. ఇప్పుడు ధర ఇంత ఎక్కువగా ఉన్నది ఎందుకంటే, ఈసారి ఋతుపవనాల వాన పంటకు చాలా నష్టం కలిగించింది’’. ఇంకో రెండు నెలల్లో (జూన్‌) ప్రతి దుకాణంలోనూ 15 టన్నుల పండ్లు ఉంటాయనీ, అందువల్ల పండ్ల ధర పడిపోయే అవకాశముందనీ ఆమె ఊహిస్తున్నారు.
తాను ఈ వ్యాపారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటికి పనస పండ్ల వ్యాపారం బాగా పెరిగిపోయిందని లక్ష్మి అంటారు. ఎక్కువ చెట్లు, ఎక్కువ పండ్లు, మరింత ఎక్కువ వ్యాపారం. అయితే రైతులు ఎప్పుడూ తమ ఉత్పత్తులను ఒక నిర్దిష్ట కమీషన్‌ ఏజెంట్‌ వద్దకు మాత్రమే తీసుకొస్తారు. ఆ ఏజెంటుపై ఉండే విశ్వాసం ఒక కారణమైతే, ఆ నిర్దిష్ట ఏజెంట్‌ వారికి ఇచ్చే రుణాలు మరొక కారణం. వార్షిక పంటకు సంబంధించి రూ.10,000 నుండి లక్ష రూపాయల వరకు వారు అప్పు తీసుకుంటారని లక్ష్మి వివరించారు. అమ్మకాల సమయంలో ఈ అప్పును ‘సర్దుబాటు’ చేసుకుంటారు.
ఆమె కొడుకు రఘునాథ్‌ ఇంకో విధమైన వివరణ ఇచ్చారు. పలామరం ఎక్కువగా పండిన రైతులు కేవలం పండ్లను మాత్రమే అమ్మకూడదని నిర్ణయించుకున్నారని, వాటికి కొంత విలువను జోడిరచి లాభాలను పెంచుకోవాలనుకుంటారని, పనస నుంచి వాళ్ళు చిప్స్‌, జామ్‌లు తయారు చేస్తారని ఆయన చెప్పారు. వీటికి తోడు, పనసకాయని కూరగా, మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా వండుకుంటారు.
‘‘తొనలను ఎండబెట్టి పొడిచేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ పొడిని ఉడికించి జావగా చేసుకుని కూడా తింటారు. పండుతో పోలిస్తే ఈ రకమైన ఉత్పత్తులు అంతగా ప్రాచుర్యం పొందలేదు కానీ కాలం గడిచే కొద్దీ అవి కూడా జనంలోకి వెళ్తాయని ఫ్యాక్టరీ యజమానులు నమ్ముతున్నారు’’ అన్నారు రఘునాథ్‌.
లక్ష్మి కట్టుకున్న ఇల్లు మొత్తంగా పనసపండ్లు సమకూర్చిన డబ్బుతో కట్టినదే. ‘‘ఈ ఇంటికి ఇరవయ్యేళ్ళు’’ నేలను చేతి మునివేళ్ళతో తాకుతూ అన్నారు లక్ష్మి. అయితే, ఈ ఇల్లు రాకమునుపే ఆమె భర్త మరణించారు. ఆమె కడలూరు నుంచి పణ్రుటికి రైళ్ళలో ప్రయాణిస్తూ పనస తొనలు అమ్మే రోజుల్లో ఆయన పరిచయమయ్యారు. ఆయనకక్కడ ఒక టీ కొట్టు ఉండేది.
ఆమెది ప్రేమ వివాహం. పణ్రుటికి చెందిన ఒక కళాకారుడిని పురమాయించి ఆమె గీయించిన అందమైన చిత్రాలలో ఆ ప్రేమ ఇప్పటికీ అలా నిలిచే ఉంది. తన భర్త బొమ్మను చిత్రించేందుకు ఆమె రూ.7,000 ఖర్చు చేశారు. వారిద్దరూ ఉన్న మరొక బొమ్మ రూ.6,000. గరగరలాడుతున్నా, శక్తితో నిండి ఉన్న స్వరంతో ఆమె నాకు చాలా కథలు చెప్పారు. తన కుక్క గురించి ఆమె చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ‘‘చాలా విధేయత, చాలా తెలివైన, తను చాలా మిస్‌ అవుతున్న’’ కుక్కట.
అప్పటికే మధ్యాహ్నం రెండు గంటలవుతోంది. కానీ లక్ష్మి ఇంకా భోజనం చేయలేదు. తింటాను, తింటానంటూనే అలా మాట్లాడుతూనే ఉన్నారు. పనస పంట కాలంలో ఇంటి పని చేసేందుకు ఆమెకు సమయం చిక్కదు. ఆమె కోడలు కయల్‌విళియే ఆ పనులన్నీ చక్కబెడుతుంది.
పనసతో ఏయే వంటలు చేయవచ్చో వాళ్ళిద్దరూ నాకు చెప్పారు. ‘‘పనస గింజలతో మేం ఉప్మా చేస్తాం. ఇంకా పండని తొనల పైతోలు తీసేసి, వాటిని పసుపు వేసి ఉడికించి, రోటిలో వేసి మెత్తగా దంచాలి. తర్వాత ఉళుత్తం పరుప్పు (మినప్పప్పు)తో తాళింపు వేసి, చివరగా కొంచెం కొబ్బరి తురుము చల్లాలి. తొనలు మరీ పిండిపిండిగా ఉంటే, వాటిని కొంచెం నూనెలో వేయించి కారప్పొడి చల్లి తినవచ్చు’’. గింజలను సాంబారులో, పండని పచ్చి తొనలను బిర్యానీలో వేయొచ్చు. పలాతో చేసే వంటలు ‘‘అరుమై (అద్భుతంగా)గానూ, రుచిగానూ ఉంటాయి’’ అని లక్ష్మి చెప్పారు.
సాధారణంగా లక్ష్మికి తిండి గురించి పెద్ద పట్టింపు ఉండదు. ఆమె టీ తాగుతారు, దగ్గరలో ఉన్న ఏదైనా తినుబండారాల శాలలో భోజనం చేస్తారు. ఆమెకు హై బీపీ, మధుమేహం ఉన్నాయి. ‘‘నేను సమయానికి భోజనం చెయ్యాలి. లేదంటే నాకు మైకం వస్తుంది’’ అన్నారామె. ఆ ఉదయం ఆమెకు తలతిప్పటంతో, విజయ్‌కుమార్‌ దుకాణం నుంచి ఆమె త్వరగా వెళ్ళిపోయారు. ఎక్కువ సమయం, రాత్రులు ఎక్కువ పనిగంటలు పనిచేయాల్సి వస్తున్నా ఆమెకదేమీ బెదురు పుట్టించలేదు. సమస్యేమీ లేదని అంటారామె.
దాదాపు 30 ఏళ్ళ క్రితం లక్ష్మి పనసపండ్లు అమ్ముతూ ఉండే కాలంలో, ఒక పనసపండు ధర పది రూపాయిలుగా ఉండేది. (ప్రస్తుతం దాని ధర 20 నుంచి 30 రెట్లు పెరిగింది) అప్పట్లో కంపార్టుమెంట్లు పెట్టెల్లాగా ఉండేవని లక్ష్మి గుర్తు చేసుకున్నారు. ఒక పెట్టె నుంచి ఇంకో పెట్టెకు లోపలినుంచి వెళ్ళే వీలుండేది కాదు. మాటలతో చెప్పుకొని ఒక ఒప్పందంలో భాగంగ ా ఒక అమ్మకందారు మాత్రమే పెట్టెలో ఉండేవారు. వాళ్ళు దిగిపోయిన తర్వాత మాత్రమే, మరొకరు లోపలికి వెళ్ళేవారు. ‘‘అప్పటి టిక్కెట్‌ ఎగ్జామినర్లు ఛార్జీల గురించీ, టిక్కెట్ల గురించీ పట్టుబట్టేవారు కాదు. స్వేచ్ఛగా ప్రయాణించేవాళ్ళం’’ అంటూ ఆమె తన స్వరాన్ని కొంత తగ్గించి ‘‘మేం వారికి కొంత పనసపండు ఇచ్చేవాళ్ళం’’ అని చెప్పారు.
అవి ప్రయాణీకుల రైళ్ళుÑ నెమ్మదిగా నడిచేవి. చిన్న చిన్న స్టేషన్లన్నింటిలోనూ ఆగేవి. రైలు ఎక్కేవాళ్ళూ, దిగేవాళ్ళూ కూడా పనసపండు కొనేవాళ్ళు. ఆమె సంపాదన తక్కువగానే ఉండేది. ఒక్క రోజులో సరిగ్గా ఎంత సంపాదించేవారో ఆమెకు స్పష్టత లేదు కానీ, ‘‘అప్పట్లో వంద రూపాయలంటే చాలా పెద్ద మొత్తం అన్నట్టు’’ అని ఆమె చెప్పారు.
‘‘నేను బడికి వెళ్ళలేదు. నేను చాలా చిన్నపిల్లగా ఉండగానే నా తల్లిదండ్రులు మరణించారు.’’ జీవనం కోసం ఆమె చిదంబరం, కడలకూరు, చెంగల్పట్టు, విల్లుపురం వంటి అనేక రైళ్ళ లైన్లలో పనసపండ్లు అమ్ముతూ ప్రయాణించారు. ‘‘భోజనం కోసం స్టేషన్లలో ఉండే క్యాంటీన్లలో పులిహోర కానీ, పెరుగన్నం కానీ కొనుక్కునేదాన్ని. అవసరమైనప్పుడు నా పనస తొనల ట్రేని సామాన్లు పెట్టుకునే అరలో పెట్టి, రైలు పెట్టెలో ఉన్న మరుగుదొడ్డిని ఉపయోగించుకునేదాన్ని. అప్పటి పని చాలా శ్రమతో కూడుకున్నది. కానీ నాకింకేం అవకాశముంది?’’
ఇప్పుడామెకు ఎంచుకునేందుకు అవకాశముంది. పనస పంట కాలం ముగిసిన తర్వాత ఆమె తన ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటారు. ‘‘నేను చెన్నై వెళ్ళి రెండు వారాల పాటు కొన్ని రోజులు అక్కడా, మరికొన్ని రోజులు ఇక్కడా అన్నట్టు నా బంధువులతో గడుపుతాను. మిగిలిన సమయాల్లో, నేను నా మనవడు సర్వేష్‌తో కలిసి ఉంటాను’’ అంటూ తన పక్కనే ఆడుకుంటున్న చిన్నపిల్లవాడిని చూపించి నవ్వుతూ చెప్పారు. కయల్‌విళి మరిన్ని వివరాలు చెబుతూ ‘‘ఆమె తన బంధువులందరికీ సహాయం చేస్తుంది. వారికి నగలు కొనిస్తుంటుంది. ఎవరైనా సహాయం కోసం అడిగితే ఆమె ఎన్నడూ కాదని చెప్పదు…’’
లక్ష్మి తన కెరీర్‌ ప్రారంభంలో ‘లేదు’ అనే పదాన్ని చాలాసార్లు వినే ఉండాలి. ‘‘సొంద ఉళైప్పు (స్వయంకృషి)’’తో తన జీవితాన్నే మార్చుకున్న వ్యక్తి ఆమె. ఆమె కథ వింటుంటే పనసపండు తిన్నట్టే ఉంటుంది. ఇంతటి మధురానుభూతిని మీరు ఊహించి ఉండరు. కానీ విన్న తర్వాత అది అలాగే గుర్తుండిపోతుంది.
ఈ పరిశోధనా అధ్యయనానికి అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం తన పరిశోధనా నిధుల కార్యక్రమం 2020లో భాగంగా నిధులు సమకూరుస్తుంది.
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/en/articles/the-house-that-lakshmi-built-in-panruti/ పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా (ruralindiaonline.org) అక్టొబర్‌ 19, 2022 లో మొదట ప్రచురితమైనది.) `
కవర్‌ ఫోటో : ఎమ్‌.పళని కుమార్‌, అపర్ణ కార్తీకేయన్‌

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.