కౌన్ ఆయా, యే కౌన్ ఆయా
కర్ కే యే సోలా సింగార్, కౌన్ ఆయా
ఆంఖోం మే రంగీన్ బహారే లియా, లూట్ లియా
లూట్ లియా యే కిస్ నే దిల్ కా కరార్
మేరే దిల్ కా కరార్, తన్ మన్ మే ఛాయా ప్యార్
ప్రేమ ధవన్ రాయగా, ఖేమ్‌చంద్ ప్రకాశ్ బాణీ కుదిర్చిన ఈ పాట 1948లో విడుదలైన సినిమా ‘జిద్ది’లోని యుగళగీతం. దేవానంద్ హీరోగా నటించిన తొలి సినిమా ఇది. కామినీ కౌశల్ నాయిక. ఈ సినిమాలోని మొత్తం తొమ్మిది పాటలలో లత ఆరు పాటలు పాడిరది. ‘చందారే జారె’ పాట ఈనాటికీ వినిపిస్తూ శ్రోతలను పరవశులను చేస్తుంది. ఈ సినిమాతో కిషోర్ కుమార్ సినీరంగ ప్రవేశం చేశాడు. ‘మర్‌నే కీ దువాయే క్యూం మాంగూ’ అంటూ దేవానంద్ స్వరంగా నిలిచాడు. ఈ సినిమాలో కిషోర్ కుమార్, లతల ప్రథమ యుగళగీతం ‘యే కౌన్ ఆయా’ ఓ రకంగా సినీ ప్రపంచం లత గురించి పాడిన పాట అనిపిస్తుంది. ఈ పాట రికార్డింగ్ వెనుక ఓ కథ ఉంది.
ఆ కాలంలో లతా మంగేష్కర్‌కు ఓ అలవాటుండేది. ఎవరైనా తన దగ్గర ఉన్న ఏదైనా వస్తువు ‘చాలా బాగుంది’ అని పొగిడితే ‘ఇది మీరు ఉంచుకోండి’ అని ఆమె వాళ్ళకు ఆ వస్తువు ఇచ్చేసేది. ఆ కాలంలో ‘నక్షాబ్ జర్చవి’ అనే గేయ రచయిత ఉండేవాడు. ‘జర్చవి’ అన్నది ఉత్తరప్రదేశ్‌లో ఆయన జన్మస్థలం. ఆయన 1940లో బొంబాయి వచ్చాడు. 1945లో ‘జీనత్’ సినిమాలోని ఖవ్వాలి సూపర్ హిట్ కావడంతో ఆ ఖవ్వాలి రచయితగా ‘నక్షాబ్’ మంచి పేరు సంపాదించాడు. ‘మహల్’లో ‘ఆయేగా ఆనేవాలా’ పాటల రచయితగా ఆయన చిరకీర్తినార్జించాడు. 1946 నుండి 1950 నడుమ ఈయన అయిదు సినిమాల్లో రాసిన పదమూడు పాటలను లత పాడిరది.
మహల్ పాట రాయక ముందటి సంఘటన ఇది.
నక్షాబ్ రాసిన పాట పాడేందుకు లత రిహార్సల్స్ చేస్తోంది. అప్పుడప్పుడే లత పేరు సినీరంగంలో వినబడుతోంది. లత సంగీత దర్శకుడు హన్స్‌రాజ్ బహల్ వద్ద పాట నేర్చుకుంటుండగా పక్కనే ఉన్న ‘నక్షాబ్’, మాటిమాటికీ లత వద్ద ఉన్న పార్కర్ పెన్‌ను పొగడడం ఆరంభించాడు. ఆ పెన్ మీద లత పేరు చెక్కి ఉండేది. అతడు పొగుడుతుంటే, అలవాటు ప్రకారం ‘మీకు అంత నచ్చితే పెన్ను మీరు ఉంచుకోండి’ అని లత అతనికి ఆ పెన్ను ఇచ్చేసింది. దానిపై తన పేరు ఉన్న విషయం మర్చిపోయింది. లత ఇచ్చిన పెన్ను తీసుకున్న నక్షాబ్ దాన్ని అందరికీ చూపుతూ తనకూ, లతకూ నడుమ ఎంతో సాన్నిహిత్యం ఉందని అందరికీ చెప్పడం ప్రారంభించాడు. లత పేరున్న పెన్ను అతని దగ్గర ఉంది. అది లతను ఇబ్బందిలో పడేసింది. ఎవ్వరూ వేలెత్తి చూపకుండా తన వ్యక్తిత్వాన్ని ఆమె కాపాడుకుంటూ వస్తోంది. పైగా, ఒక్కసారి ఆమె గురించి సినీ ప్రపంచంలో దురభిప్రాయం ఏర్పడిరదంటే ప్రతి ఒక్కరూ వెర్రి వేషాలు వేయటం తమ హక్కనుకుంటారు. (ఇది కేవలం సినీ రంగంలోనే కాదు, ఏ రంగమయినా ప్రతి మహిళకూ ఇది వర్తిస్తుంది) పైగా లత అప్పుడప్పుడే పేరు సంపాదిస్తోంది. ఆయన అప్పటికే పేరు పొందిన గీత రచయిత. ఆ కాలంలో సినిమాలలో పనిచేసే వారిపై మంచి అభిప్రాయం అంతగా ఉండేది కాదు.
సాదత్ హాసన్ మాంటో రాసిన Stars of another Sky’ చదివితే ఆ కాలంనాటి సినీ కళాకారులంటే ఎందుకంత మంచి అభిప్రాయం ఉండేది కాదో అర్థమవుతుంది. మాంటో రచనలో కూడా ఒక ‘చులకన అభిప్రాయం’ కనిపిస్తుంది. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన జెర్రీ పింటోIt is equality difficult to tell from the pieces where Minto stood on the issue of women. The male gaze is deployed time and again, sometimes slyly, some times directly’ అనకుండా ఉండలేకపోయాడు.
ఉదాహరణకు నూర్జహాన్ గురించి రాస్తూAnd Finally Saadat Hasan Manto who cannot stand the sight of her awful brassiere, what beauty she sees in her upturned front bumpers and why Syed Shaukat Hassan Rizvi permits this gross violation of taste, I am unable to say’ అంటూ తేలిక భావన కలిసేలా రాస్తాడు మాంటో. ‘మల్లికా`ఎ`తరన్నుమ్’గా అందరి మన్ననలు అందుకుంటూ, వివాహమై, పిల్లలున్న నూర్జహాన్ గురించి ఓ ప్రఖ్యాత రచయిత ఈ రకంగా ఆలోచిస్తే ఇంకా పేరు పొందని 16`17 ఏళ్ళ యువతి గురించి, ఓ పేరు పొందిన గేయ రచయిత ఎలా ఆలోచిస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో ఊహించటం కష్టం కాదు. ఎంత గొప్పదైనా సినీరంగంలో స్పాట్ బాయ్ నుంచి సామాన్య ప్రేక్షకుడి వరకూ ‘మహిళ’ అంటే చులకన అన్నది కాదనలేని చేదు నిజం. అయితే ఎవరెంత చులకన చేసినా తన ప్రవర్తన మహిళకు రక్షణ, గౌరవం అన్నదీ కాదనలేని సత్యం.
తమ గురించి లేనిపోని సాన్నిహిత్యం ఉందని కథలు కల్పిస్తూ, చెప్తూ తిరుగుతున్న నక్షాబ్‌ను లత మౌనంగా భరించింది. ఇంకా స్థిరపడకముందే చెడ్డపేరు (సినీ రంగంలో మహిళ చెడ్డపేరును ప్రత్యేకంగా నిర్వచించనవసరం లేదు) సంపాదించటం, జీవితం కోసం సినిమాలపై ఆధారపడిన తనకు కూడదని భావించింది లత. ఓసారి నౌషాద్ దర్శకత్వంలో నక్షాబ్ పాట రికార్డవుతోంది. అది ప్రేమ గీతం. నక్షాబ్ విజృంభించాడు. అందరిముందు ప్రేమను పాటలో ఎలా ఒలకబోయాలో నేర్పించటం మొదలుపెట్టాడు. పాటలోని పంక్తులలోని శృంగార రసాన్ని అత్యంత ఆనందంగా వివరిస్తూ ‘నువ్వు నాలాంటి వాడినెవరినో గాఢంగా ప్రేమిస్తున్న నీ అనుభవంలోని రసాన్ని చిలకరించాలి’ వంటి భావం వచ్చేలా మాట్లాడాడు. స్టూడియోలో అందరి ముందూ గొడవ ఎందుకని అతని పిచ్చిమాటలను భరిస్తూ లత రికార్డింగ్ పూర్తి చేసింది. కొన్నాళ్ళకు అతను చెప్పాపెట్టకుండా లత ఇంటికి వెళ్ళాడు. అప్పుడు లత వాళ్ళు ‘నానాచౌక్’లో రెండు గదుల ఇంట్లో ఉంటున్నారు. వరండాలో చెల్లెళ్ళతో ఆటలాడుతున్న లత, చెప్పాపెట్టకుండా ఊడిపడ్డ నక్షాబ్‌ను చూసింది. సినిమా కలుషిత వాతావరణం నుంచి తన కుటుంబాన్ని దూరంగా ఉంచాలన్నది మొదటినుంచి లత నిర్ణయం. అందుకే రికార్డింగులకు ఆమె ఒంటరిగా వెళ్ళేది. నిజం చెప్పాలంటే, లతకు తోడుగా రికార్డింగులకు వెళ్ళేందుకు ఎవరూ లేరు. అది కూడా లత పట్ల కొందరికి చులకన అభిప్రాయం కలగటానికి కారణం. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సినిమాల్లో మహిళా కళాకారుల వెంట సాధారణంగా ఎవరు ఒకరు తోడుగా ఉంటారు. శంషాద్ బేగం వెంట ఆమె చాచా వెళ్ళేవాడు. గీతాదత్ వెంట ఆమె తండ్రి వెళ్ళేవాడు. లత ఒంటరిగా వెళ్ళి వచ్చేది.
ఇంటికి వచ్చిన నక్షాబ్‌ను ఆమె ఇంటికి దూరంగా తీసుకువెళ్ళింది. కొంగు నడుములో దోపి, రోష కషాయిత నేత్రాలతో… ‘ఆప్ నే ముర్a సే పూఛే బగైర్ యహాన్ ఆనే కీ హిమ్మత్ కౌసే కీ? అగర్ దొబారా యహాన్ నజర్ భీ ఆయే తో టుక్డే టుక్డే కర్వాకే ఇసీ నాలీమే ఫేక్ దూంగీ, జాన్తే హో న, మై మరాఠా ఔరత్ హు’ అంది. లత మాటల్లోనే చెప్పాలంటే ‘నా అనుమతి లేకుండా ఇక్కడికి వచ్చే ధైర్యం ఎలా చేశారు? ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే ముక్కలు ముక్కలు చేసి ఈ నాలాలో పారేయిస్తాను. తెలుసు కదా, నేను మరాఠా మహిళను’ అంది. (లతా దీదీః అజీబ్ దాస్తాన్ హై యే దీవ హరీష్ భిమానీ పేజీ నంబర్. 214)
ఈ కథ ఇంతటితో అయిపోలేదు. లత ఒంటరిగా స్టూడియోకి వచ్చేటప్పుడు, రికార్డింగులు పూర్తి చేసుకుని రైలులో ఇంటికి వెళ్ళేటపుడు ఆమెని వెంబడిరచేవాడు నక్షాబ్. ఆమె ఎదురుగా కూర్చుని ఏదో ఒకటి మాట్లాడుతుండేవాడు. ప్రేమ కవితలు వినిపించేవాడు. చివరికి ఒకరోజు ఈ విషయం ఖేమ్‌చంద్ ప్రకాశ్‌కు చెప్పింది. అది వింటూనే ఖేమ్‌చంద్ ప్రకాశ్ కోపం పట్టలేకపోయాడు. నక్షాబ్‌ను చెడామడా తిట్టాడు. అతడి దగ్గర నుంచి పెన్ను లాక్కుని లతకు ఇచ్చేశాడు. అంతేకాదు, ఆ రోజు నుంచి లతను రికార్డింగ్ కోసం ఇంటినుంచి స్టూడియో వరకూ తీసుకు రావడం, రికార్డింగ్ పూర్తయిన తర్వాత ఇంటి దగ్గర దిగబెట్టే బాధ్యతను భోలా శ్రేష్ఠ (శుష్మ శ్రేష్ఠ తండ్రి)కు అప్పగించాడు ఖేమ్‌చంద్ ప్రకాశ్. నక్షాబ్ నుంచి తన పెన్ను తన దగ్గరకు రాగానే లత ఆ పెన్నును సముద్రంలోకి విసిరేసింది. అంతేకాదు, ఆ తర్వాత ఆమె జీవితాంతం పార్కర్ పెన్నును కొనలేదు, వాడలేదు. ఈ నక్షాబ్ తర్వాత నిర్మాత కూడా అయ్యాడు. పాకిస్తాన్ వెళ్ళి అక్కడ సినిమాలు నిర్మించాడు. ఈయన ‘నౌషాద్’ అనే సంగీత దర్శకుడిని కూడా పాకిస్తాన్‌కు రప్పించుకున్నాడు.
ఓ రోజు అనుకోకుండా లత ఒంటరిగా రైలులో ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ రోజు ఆమెను ప్లాట్‌ఫారం పై నుంచి ఓ యువకుడు వెంబడిరచాడు. రైలులో ఆమె ఎదురుగా కూర్చున్నాడు. రైలు దిగిన తర్వాత టాంగా ఎక్కింది లత. అతనూ టాంగాలో వెంబడిరచాడు. లత గబగబా స్టూడియోలోకి వెళ్ళింది. ఆ యువకుడూ స్టూడియోలోకి వెళ్ళాడు. లత తిన్నగా ఖేమ్‌చంద్ ప్రకాశ్‌కు ఫిర్యాదు చేసింది. దాంతో ‘ఇతడెవరో కాదు, మన స్టూడియో యజమానుల్లో ఒకరైన అశోక్ కుమార్ సోదరుడు కిషోర్ కుమార్. ఇతడే నీతో ఈ రోజు యుగళగీతం పాడేది’ అని పరిచయం చేశాడు ఖేమ్‌చంద్ ప్రకాశ్. కిషోర్ కుమార్ తన వెనుక పడ్డాడని భ్రమించేందుకు లతకు అంతకుముందు నక్షాబ్‌తో ఉన్న చేదు అనుభవమే కారణం. (ఈ సంఘటనను ఓ తెలుగు పత్రిక లత ప్రేమకథగా భావించింది.)
‘నక్షాబ్’ ఉదంతాన్ని ధృవీకరిస్తూ నౌషాద్ మరో సంఘటనను చెప్తాడు. ‘చాందినీ రాత్’ అనే సినిమాకు నౌషాద్ సంగీత దర్శకుడు. ఆ సినిమాలో లత ప్రఖ్యాత గాయకుడు దుర్రానీతో పాట పాడాల్సి ఉంది. గులామ్ ముస్తఫా దుర్రానీ, జి.ఎం.దుర్రానీగా పేరుపొందిన గాయకుడు. సైగల్ లాంటి గాయకుడి సమకాలికుడై కూడా తనదైన గాన సంవిధానాన్ని నిలుపుకున్నాడు దుర్రానీ. ప్రఖ్యాత గాయకుడు మహమ్మద్ రఫీకి ఆదర్శం జి.ఎం.దుర్రానీ. దుర్రానీని అనుసరిస్తూ తన గాన శైలిని రూపొందించుకున్నాడు రఫీ. అంత ప్రఖ్యాతి పొందిన దుర్రానీతో, కొత్త గాయని లత పాట పాడాలి. ఆ కాలంలో రెండే మైకులుండేవి. ఒకటి వాయిద్యకారులకు, రెండోది గాయనీ గాయకుల కోసం. యుగళగీతం పాడాలంటే గాయనీ గాయకులు ఎదురు బదురుగా ఉండి పాడేవారు. కొత్త అమ్మాయిని చూస్తూనే దుర్రానీ అల్లరి ప్రారంభించాడు. తన వంతు పాట పాడేసి లత పాడే సమయంలో అల్లరి చేసేవాడు. ‘కొత్త అమ్మాయి. నువ్విలా చేస్తే అమ్మాయి భయపడుతుంది. సరిగ్గా పాడలేదు. నీ వంతు పాడేసి నిశ్శబ్దంగా కదలకుండా నిలబడు. కళ్ళు దించుకో’ అని నౌషాద్ అతడికి సలహా ఇచ్చాడు. కానీ దుర్రానీ నౌషాద్ మాటలను పట్టించుకోలేదు. అల్లరి చేస్తూనే పోయాడు. చివరికి లత దుస్తులపై కూడా వ్యాఖ్యానించాడు. ‘లతా! రికార్డింగ్‌కి వచ్చేటప్పుడు కాస్త సంతోషాన్ని సూచించే బట్టలు వేసుకుని రావాలి. తెల్లటి ధోతీ చుట్టుకుని రొమాంటిక్ పాటలు పాడటానికి వస్తే ఎలా?’ అన్నాడు. ఒకటి దుస్తులపై వ్యాఖ్యానించాడు, రెండు ఏకవచన ప్రయోగం చేశాడు. ‘ఇతనికి పాటతో పనా? నా బట్టలతో పనా?’ అనుకుంది లత. ఇక అతనితో కలిసి పాడకూడదని నిశ్చయించుకుంది. ఆ కాలంలో లత అప్పుడప్పుడే పైకి వస్తున్న గాయని. దుర్రాని ఎంత ఫేమస్ అంటే, అతనికి మూడు కార్లుండేవి. అందులో ఒక కారు ‘మొబైల్ బార్’లాంటిది. అలాంటి వాడితో ఇక పాటలు పాడనని ప్రకటించటం అంటే ఆత్మహత్య చేసుకున్నట్లే. కానీ లత స్వాభిమానం తనకు మర్యాదనివ్వని వాడితో కలిసి పాటలు పాడనివ్వలేదు. నౌషాద్ ఆమెకు ఎంతగానో నచ్చచెప్పాలని చూశాడు. ‘ఇంకా నీ కెరీర్ ఆరంభంలోనే ఉంది. నువ్వు ఈ రంగంలో స్థిరపడిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఇష్టం వచ్చిన వారితో పాడు, లేనివారికి పాడకు. కానీ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం మంచిది కాదు. కాస్త ఓపిక పట్టు’ అని ఎంతగానో చెప్పాడు. కానీ ‘నౌషాద్ నా తండ్రిలాంటి వాడు’ అంటూనే లత తన నిశ్చయాన్ని మార్చుకోలేదు. చివరికి నౌషాద్ పాట రికార్డింగ్‌ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.
లత ఈ నిర్ణయం తీసుకున్న సమయంలో దుర్రానీ అగ్రస్థాయి నేపథ్య గాయకుడు. సైగల్ మరణంతో తిరుగులేని గాయకుడిగా ఎదిగాడు దుర్రానీ. ఆ కాలంలో దుర్రానీ పాట పాడటానికి రావటం మహాభాగ్యంగా భావించేవారు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు స్టూడియోకి వచ్చేవాడు. అలాంటి వాడితో ఇంకా పాటల ప్రపంచంలో సరిగ్గా అడుగు కూడా పెట్టని అమ్మాయి పాడకూడదని నిర్ణయం తీసుకోవటం ‘ఆత్మాభిమానం’ అని సమర్థించాలని ప్రయత్నించినా ‘మూర్ఖత్వం’ లాంటిదే. కానీ లతా మంగేష్కర్ నిర్ణయం తీసుకుంది. అతనితో పాటలు పాడలేదు. అయితే భవిష్యత్తులో లత అగ్రశ్రేణి గాయనిగా ఎదిగింది. దుర్రానీతో కలిసి ‘కోరస్’లో పాడటమే ‘మహాభాగ్యం’లా భావించిన యువగాయకుడు మహమ్మద్ రఫీ, కొన్నాళ్ళకి అగ్రశ్రేణి గాయకుడయ్యాడు. దుర్రానీకి పాటలు పాడే అవకాశాలు లభించక కనుమరుగయ్యాడు. కొన్నాళ్ళకి చిన్న చిన్న వేషాలు వేసే స్థితికి దిగజారాడు దుర్రానీ. చివరి దశలో ‘వరలీ నాకా’ దగ్గర బీడీ తాగుతూ రోడ్డుమీద నించుని కనిపించేవాడు. హిందీ సినీ పరిశ్రమలో దుర్రానీ పాడిన చివరి పాట ‘హమ్ సబ్ చోర్ హై’ సినిమాలో ‘హమ్ కో హస్తే దేఖ్ జమానా జల్తా హై’. ఈ పాటను దుర్రానీ, రఫీతో కలిసి పాడాడు. మరో సంఘటనః శ్యాం సురిందర్ అనే సంగీత దర్శకుడు ఆ కాలంలో ఎంతో ఫేమస్. రఫీని బొంబాయి ఆహ్వానించింది ఈయనే. ఈయనకు తాగుడు అలవాటుండేది. తాగి మ్యూజిక్ సిట్టింగుల్లో కూర్చునేవాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు. అతని ధోరణి నచ్చక లత అతనికి పాడనని బయటికి వచ్చేసింది. కెరీర్ ఆరంభంలోనే లత ఎవ్వరికీ లొంగదని, పిచ్చి వేషాలు సహించదన్న ఇమేజిని సాధించింది. ఈ ఇమేజివల్ల ఆమె అంటే అందరికీ గౌరవం పెరిగింది. ఆ గౌరవాన్ని ఆమె నిజాయితీ పెంచింది. ఆమె స్వరం ఇనుమడిరపచేసింది. ఇలాంటిదే మరో సంఘటనః ఖుర్షీద్ అన్వర్ అనే సంగీత దర్శకుడు ఉండేవాడు. ఆయన ఆలిండియా రేడియోలో పనిచేస్తూ సినిమాల్లోకి వచ్చాడు. 1943లో ‘ఇషారా’ సినిమాతో హిట్ సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందాడు. తర్వాతి కాలంలో పేరు పొందిన సంగీత దర్శకుడు రోషన్ ఈయన సహాయకుడు. శంకర్ జైకిషన్ ద్వయంలోని శంకర్ ఈయన వద్ద పనిచేశాడు. అలాంటి ఖుర్షీద్ అన్వర్ నుంచి లతకు పిలుపు వచ్చింది. అప్పటికి ‘మహల్’ వంటి సినిమాల విడుదల చాలా దూరంలో
ఉంది. ఖుర్షీద్ అన్వర్ పిలుపునందుకొని అతని దగ్గరకు వెళ్ళేసరికి అతను గదిలో లేడు. ఆ గదిలో ఇద్దరే ఉన్నారు. ఒకరు హార్మోనియంతో, మరొకరు సారంగితో. వారిలో హార్మోనియం అతను లతను కూర్చోమన్నాడు. కూర్చోగానే ‘పాట నేర్పుతా’నన్నాడు. మీరు ‘ఖుర్షీద్ సాహెబ్ గారా?’ అనడిగింది లత. ‘ఖుర్షీద్ సాహెబ్ బాణీ తయారుచేసి ఇస్తాడు. అతడికి హార్మోనియం వాయించటం రాదు. పాట పాడటం రాదు. నేర్పించటం రాదు. అతడికి సహాయకుడిని నేను. పాటను నేను నేర్పిస్తాను’ అన్నాడు.
‘పాటను వాయిద్యంపై వినిపించి కానీ, పాడి కానీ నేర్పించని సంగీత దర్శకుడి పాటలు నేను పాడను’ అంటూ లేచి వచ్చేసింది లతా మంగేష్కర్ మరో మాటకు ఆస్కారం లేకుండా. ఇది స్వాభిమానమా? స్వేచ్ఛా ప్రవర్తననా? అహంకారమా? మూర్ఖత్వమా? లత విజయం సాధించి అగ్రశ్రేణి గాయనిగా నిలిచింది కాబట్టి, లత ప్రవర్తనను ఆత్మాభిమానంగా పరిగణించాల్సి వస్తుంది. కానీ లత విజయం సాధించక పోయి ఉంటే ఈ ప్రవర్తనను అహంకారంగా, మూర్ఖత్వంగా భావించి ఉండేవారు. అయితే లత కానీ, మహమ్మద్ రఫీ కానీ 1947 తర్వాత నుంచి ఉత్తమ శ్రేణి గాయనీ గాయకులుగా గుర్తింపు పొంది, అచిరకాలంలోనే అగ్రశ్రేణి గాయనీ గాయకులుగా ఎదగటానికి కారణాలు 1940`50 నాటి సినీ రంగంలోని పరిస్థితులు, అప్పటి గాయనీ గాయకులు, సంగీత దర్శకులతో సహా పరిశీలిస్తే స్పష్టమవుతాయి. ఒక రకంగా సినీ రంగం ఈ ఇద్దరు విజయం సాధించడం కోసం పరిస్థితులను సిద్ధం చేసిందనిపించింది. ఇప్పుడు వెనుతిరిగి చూస్తే అప్పటి పరిణామాలను పరిశీలిస్తే… హిందీ సినిమాలలో పాటలు ప్రజాదరణ అందుకుంటున్న సమయంలో, కొల్హాపూర్‌లో నాలుగేళ్ళ లత, బంధువు ఇందిర వద్ద హిందీ నేర్వటం అరంభించింది. లత ఇంట్లో విఠల్ అనే సేవకుడు మరాఠీ నేర్పిచటం ప్రారంభించాడు. అయితే తండ్రితో డ్రామాలలో తిరుగుతుండటం వల్ల ఆమె చదువు సక్రమంగా సాగలేదు. బొంబాయి చేరుకున్న తర్వాత, మాస్టర్ వినాయకరావు పిల్లలకు హిందీ నేర్పే మాస్టర్ లేకరాజ్ శర్మనే లతకు హిందీ నేర్పాడు. హిందీని లత తప్పనిసరిగా నేర్చుకోవాలని మాస్టర్ వినాయక్ ఆదేశించాడు. ప్రఫుల్ల పిక్చర్స్‌లోని డైరెక్టర్ రామ్ గబాడే లతకు ఇంగ్లీష్ నేర్పించాడు. హిందీ, ఇంగ్లీష్ సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించాడు. తర్వాత ‘హర్దీకర్’ అనే పూజారి వద్ద లత సంస్కృతం నేర్చుకుంది. సంస్కృతం నేర్పటం వల్ల ఏ భాష పదాన్నయినా స్పష్టంగా, సరిగ్గా
ఉచ్ఛరించే వీలు కలుగుతుంది. దీనికితోడు లత ఉర్దూ భాషలో ప్రావీణ్యం సాధించేందుకు దారితీసిన సంఘటన పలువురు ఉదహరిస్తారు. సంగీత దర్శకుడు అనిల్ బిశ్వాస్‌తో లత రైలులో ప్రయాణిస్తున్నప్పుడు, ఆ రోజు వారి ఎదురుగా దిలీప్ కుమార్ ఉన్నాడు. బిశ్వాస్ లతను దిలీప్‌కు పరిచయం చేశాడు. లత మరాఠీ అమ్మాయి అని తెలుసుకున్న దిలీప్ కుమార్ చులకనగా ‘మరాఠీ అమ్మాయి ఉర్దూ ఏం పాడుతుంది? వీళ్ళ ఉర్దూలో పప్పన్నం (దాల్ భాత్) వాసన వస్తుంది. ఉర్దూ పరిమళం వీళ్ళకి ఏం తెలుస్తుంది?’ అన్నాడు అహంకారం ఉట్టిపడుతుండగా. ఆ సమయంలో లత మౌనంగా ఉండిపోయింది.