చాట, చీపురుతో బయటికి పోతూ ‘‘ఆ అయ్యవారు అట్ల వదుర్తడు… నాకైతే ఏమీ మంచిగనిపియ్యలే’’ మొహమంతా చిట్లించుకుంటూ అన్నది యాదమ్మ. ఎవరి గురించి మాట్లాడుతోందో అర్థం కాలేదు.
వాకిలి ఊడ్చి వస్తున్న యాదమ్మను అడిగా.
‘‘పెద్ద చదువులు చదివినోళ్ళ ముందు నోరిప్పితే మంచిగుండదని ఊకున్న కానీ లేకుంటేనా…’’ ఆమె గొంతులో పొంగుతున్న ఆవేశం. అసలు ఏం జరిగిందో… ‘‘ఆ మూలింటి పెద్ద మేడం కాశీ యాత్రకు పోయొచ్చింది గద. ఇంట్లో పూజకు అయ్య వారిని పిలిచింది. ఆ అయ్యవారి మాటలు వింటుంటే ఒళ్ళంతా మండిపోయింది. ఆడోళ్ళను ఎట్లాంటే అట్ల మాట్లాడుతున్నడు. ఆ మాటలు ఇంటే ఒంటిమీద బొంతపురుగు పారినట్టున్నది. లాగి చెంప మీద ఒక్కటిచ్చు కోవాలనిపిచ్చింది’’ ఆవేశపడిరది యాదమ్మ.
‘‘ఏమన్నాడేంటి?’’
బయటికి పోతున్న పెద్ద మేడం బిడ్డను వంకర టింకర చూసుకుంట ‘‘మగవాళ్ళు రెచ్చిపొమ్మంటే రెచ్చిపోరూ… పొందిగ్గా, బిగువుగా ఉన్న అవయ వాలు ఎరేసే ఆడవాళ్ళను చూసి… ఇక అత్యాచా రాలు అయ్యాయంటే అవవూ… ఇలా వేసుకుంటే ఎవడో ఒకడు తీసుకెళ్ళి రేప్ చేసి చంపుతారు…’’ అంటూ ఒక వెకిలి నవ్వు నవ్వాడమ్మా.
‘‘ఒక్కరు… ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు మెదపలేదమ్మా… పైగా ఆ అయ్యోరి నవ్వులో జత కలిశారమ్మా… థూ… ఇజ్జత్ లేదు…’’ తన నిరసన అంతా నడకలో చూపుతూ పోయి పనిలో పడిరది యాదమ్మ. మొన్నా మధ్య అనుకోకుండా మిత్రురాలి ఇంటికి వెళ్ళినపుడు విన్న మాటలు గుర్తొచ్చాయి. ఏదో పూజ జరుగుతోంది. ఆ ఇంటి చుట్టుపక్కల అమ్మలక్క లంతా అక్కడే ఉన్నారు. పూజ మధ్యలో వచ్చిన గ్యాప్‌లో అమ్మలక్కలు పక్కవాళ్ళతో ముచ్చట్లు పెడుతున్నారు.
‘‘ఏంటీ సీరియళ్ళు చెప్పుకుంటున్నారా. మొగుడికి అన్నం పెట్టడం కూడా మర్చిపోతారు. పొయ్యిమీద అన్నం మండిపోతున్నా సోయి
ఉండదు. కానీ సీరియళ్ళు మర్చిపోరు…’’ అంటూ ఏదో గొప్ప జోక్ వేసినట్టు నవ్వాడు పంతులు. అక్కడ కూర్చున్న ఆడవాళ్ళు ఆ నవ్వుతో జత కలిపారు.
వచ్చిన మహిళల్లో ఒకర్ని దొంగ చూపులు చూస్తూ ‘‘ఇదివరకు ఆడవాళ్ళు నిండుగా కప్పుకుని ఉండేవారు. ఇప్పుడంతా బట్టబయలే. ఒళ్ళు ఎంత కనిపిస్తే అంత నాగరికత… హ్హా హ్హా…. వెనక వీపులు చూడటానికి కిటికీల్లా బ్లౌజులు చండా లంగా… ఏం తల్లులమ్మా… నిండుగా బట్టలుం డొద్దూ… అందాలను దాచు కోవద్దూ… ఇక పిల్లలకేం నేర్పుతారు’’ అంటూ క్లాసు పీకాడు. ‘‘సంప్రదాయాన్ని చట్టబండలు చేస్తున్నారు. ఆధునిక అనాగరికులుగా తయార య్యారు’’ అంటూ తెగ బాధపడిపోయాడు.
అతనికి వంత పలుకుతూ ‘‘ఆదిమ మానవుడు ఒకటి రెండు ఆకులు కట్టుకునే వాడట. ఇప్పటి వాళ్ళు అది ఫాలో అవుతున్న ట్టున్నారు’’ అన్నాడు ట్రైనీ పూజారి.
‘‘మగవాళ్ళు గోచి పంచె కట్టుకోక, పిలక జుట్టు పెట్టుకోక ఆధునిక వస్త్రధారణ ఏమిటని అనరు. బుద్ధి గడ్డి తినకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొమ్మని చెప్పరు. నీతులన్నీ ఆడవాళ్ళకి చెప్పడానికే’’ అంటున్న నాకేసి కొరకొరా చూస్తూ… ‘‘ఆపమ్మా… డబ్బా గొంతు పీపా’’ అంటూ బాడీ షేమింగ్. ఒక్కరు కూడా నోరెత్తి మాట్లాడలేదు. అతన్ని తప్పు పట్టలేదు.
అతను రెచ్చిపోతూ ‘‘ఆ జుట్టు విరబోతలు, అందాల ఆరబోతలు ఎవరిని ఆకర్షించ డానికి…? ఈ ఆడాళ్ళవి పీత బుర్రలు… ఎన్నిసార్లు చెప్పినా వినరు’’ సంస్కృతీ సాంప్రదా యాల్ని కాపాడే గురుతర బాధ్యత తనది అన్నట్లుగా ఫోజు పెడుతూ అన్నాడు. సంస్కృతి పరిరక్షకులు దేవాలయాల్లో బట్టలు లేని బూతు బొమ్మల గురించి నోరు మెదపరెందుకు?
కొందరు భౌతికంగా అత్యాచారం చేస్తే ఇంకొందరు మాటలతో, చూపులతో చేస్తారు. అదీ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారని గౌరవించే వాళ్ళు చేస్తే…?! క్రాఫ్‌లో ఉన్న యువతిని చూస్తూ, ‘‘వీరబ్రహ్మేంద్ర స్వామి ముందే చెప్పారు కదా ఆడవారికి, మగవారికి తేడా తెలీకుండా పోయే వేషాలు వేస్తారని’’ అన్నాడు గురువును అనుసరించే ట్రైనీ పూజారి.
ఘనాపాటీలు అనుకునే గరికల ప్రభావ పైత్యం ప్రకోపించి మాట్లాడుతున్నారని అర్థమయింది. ఇక అక్కడ ఉండలేక లేచి వచ్చేశా. ప్రతివాడూ సందు దొరికితే చాలు ఆడవాళ్ళు ఎలా ఉండాలో చెప్పేవాడే, ఎలా బతకాలో చెప్పేవాడే. కానీ వాళ్ళకు మాత్రం స్త్రీలను గౌరవించే సభ్యత, సంస్కారం ఉండదు.
భారతీయ సమాజంలో పూజారి ఒక గౌరవ స్థానంలో ఉన్న వ్యక్తి. దేవుడికి, భక్తుడికి మధ్య అనుసంధాన కర్తగా సమాజం గౌరవించే వ్యక్తి. నలుగురిలో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎంత హుందాగా, పెద్దరికంతో మాట్లాడాలి.
అవాకులు, చెవాకులు పేలుతూ వెకిలి మాటలతో ఆడవాళ్ళని కండిషనింగ్ చేస్తూ…
భక్తిని వ్యాపారం చేసి, స్త్రీని అంగడి సరుకుగా మార్చి ఘనాపాటీలు అనుకుంటూ సుద్దులు చెప్పే వాళ్ళ సంస్కారం పరమ రోతగా ఉంది. అది ఆడవాళ్ళకు అర్థం కాకపోవడం ఆశ్చర్యంగా
ఉంది. పరమ నిష్టాపరులైన పురుషుల్ని వస్త్ర ధారణతో తప్పుదోవ పట్టించేది స్త్రీ అని తప్పు పట్టడాన్ని సహించలేక పోతోంది ఏ మాత్రం చదువు సంధ్య లేని యాదమ్మ. ఆధునిక వేషధారణతో పోటీపడే మహిళ అది సహించడం, అర్థం చేసుకోకపోవడం ఏంటి?
డ్రామా, మసాలా దట్టించి ఆడవాళ్ళంటే గౌరవం లేకుండా చిన్నచూపు చూస్తూ అది సంప్రదాయం అని బోధించేవారిని బాయ్‌కాట్ చేయకపోవడం వల్లనే ఇళ్ళల్లో హింస పెరిగిపోతోంది. ఆడవాళ్ళ బట్టల మీద, వాళ్ళ నడవడిక మీద పెత్తనం పెరిగిపోతోంది. చెత్త వాడుగు వాగే వాళ్ళ వల్లే ఆడవాళ్ళపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి.
పసిపిల్లలపై, పండు ముసలిపై జరిగే అత్యాచారాలకు కొదవ లేదు ఈ దేశంలో. అందుకు కారణం వాళ్ళు విడిచేసి తిరగడమేనా?
ప్రవచన కారులు అని గంగిగోవు తోలు కప్పుకుని తిరిగేవాళ్ళు, పనీపాట లేకుండా సొల్లు, సోది చెప్తూ బ్రతికేసే చవకదారు మనుషులు ఈ సమాజంలో చాలామందే ఉన్నారు. చాదస్తపు ఛానళ్ళు వీళ్ళను పట్టుకొచ్చి జనం మీద రుద్దుతున్నాయి. మెదళ్ళలో విషం నింపుతున్నాయి. అలాంటివాళ్ళను నెత్తిన పెట్టుకుని ఊరేగే జనాలది, అటువంటి నోటిదూలగాళ్ళకి, దురదపాటిలకు గొప్ప పురస్కారాలు ఇచ్చే ప్రభుత్వాలది పెద్ద తప్పు.
ఆడవాళ్ళని అలాగే ఉండాలని, ఇలాగే
ఉండాలని శాసించే హక్కు వారికి ఎవరిచ్చారు?
గడ్డిపరక విలువ చేయని వారి మాటలు వినడానికి మందలు మందలుగా ఎగబడిపోయి, తమను తాము గౌరవించుకోవడం, ప్రేమించు కోవడం మర్చిపోతున్నారు.
మహిళా కమిషన్‌తో సహా స్త్రీలు సంప్రదా యాలు, ఆచారాలు అంటూ సంకెళ్ళు తగిలించు కుని భయాలు, భ్రాంతిలో బతుకుతున్నారు స్త్రీలు.
ఇంటిముందు మురుగు కంపు కొడుతున్నది. వాసన భరించడం కష్టంగా ఉంది.
అప్పుడు ఏం చేస్తాం? ఆ మురుగు తీసి
శుభ్రం చేస్తామా… ముక్కుకు అడ్డు పెట్టుకుని పక్కకు తప్పుకుపోతామా… కంపు అలాగే భరిస్తామా… మురుగు కంపు కొట్టే ఆలోచనా సంస్కృతిని అదే చెయ్యాలి.