‘‘నాన్నా, శిరి ఇంటికి వచ్చిందా?’’ నిరంజన్ కంగారుగా ఫోన్ చేశాడు.
‘‘ఇంకా రాలేదురా. ఏం ఎందుకలా అడుగుతున్నావు’’ ఆదుర్దాపడ్డాడు తండ్రి.
‘‘అదేమీ అమీన్‌పూర్ వైపు వెళ్ళలేదు కదా?’’
‘‘అటెందుకెళ్తుందిరా?’’
‘‘ఏం చెప్పగలం. అక్కడేదో అఘాయిత్యం జరిగిందిట. శిరి ఫోన్ స్విచ్చాఫ్ అని వస్తోంది. చెల్లి ఫ్రెండ్స్ నెంబరుండాలి. కనుక్కుంటాను గాని, మీరేం కంగారు పడకండి’’
ఒక్కసారిగా డీలా పడి సోఫాలో కూలబడ్డారు జగన్నాధం.
నిన్నగాక మొన్న దిశ గొడవ. మళ్ళీ ఇప్పుడు… ఎటు పోతోందీ సమాజం?
‘‘ఎవర్తో మాట్లాడుతున్నారు? అబ్బాయితోనా?’’ సుభద్రమ్మ అడిగింది.
‘‘శిరి వచ్చిందా అంటూ చేశాడు. ఎక్కడో ఏదో జరిగిందిట. భయపడుతున్నాడు’’
‘‘మరింకా అలా కూర్చున్నారేం. అమ్మాయికి ఫోన్ చెయ్యండి. కాలేజీలో ఉండకుండా ఎక్కడెక్కడ తిరుగుతోందో ఏమో. ఈ చదువులూ చట్టుబండలూ ఎందుకండీ, హాయిగా పెళ్లి చేసి పంపించేద్దామంటే మీరూ వినరు. అబ్బాయీ వినడు!’’ నిష్ఠూరంగా అంది.
భర్త మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తోంటే, వచ్చి ఆ ప్రక్కనే ‘ముళ్ళ’ మీద కూర్చుంది. ‘‘లిఫ్టు చెయ్యట్లేదా?’’
తల అడ్డంగా ఊపారు.
‘‘రోజూ ఈ పాటికి వచ్చేసేది. ఏ పెత్తనాల కెళ్ళిందో!’’
‘‘ముందుగా చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళదే’’ భయం తొలుస్తున్నా బింకం ప్రదర్శించారు.
‘‘మరెందుకు గాభరా పడుతున్నారు?’’ గుండె వేగం పెరుగుతోంటే అడిగింది.
‘‘ఎంతైనా ఆడపిల్ల కదే. కాలు బయటపెట్టినప్పట్నుంచి, ఇంటికి క్షేమంగా తిరిగొచ్చేదాకా మనకి టెన్షన్‌గానే ఉంటుంది’’
నిరంజన్ మళ్ళీ చేశాడు.
‘‘ఇంకా రాలేదురా. శిరి ఫ్రెండ్స్‌ని అడిగావా?’’
‘‘ఆ అమ్మాయి ఇవాళ కాలేజీకి వెళ్ళలేదుట. వచ్చేస్తూ వుంటుందిలే. మీరేం ఆందోళన పడకండి’’ కంగారుగా చెప్పాడు.
‘‘అసలు దీనికేం పోయేకాలం వచ్చింది. ఆలస్యమవుతుందని ఫోన్ చేసి చెప్పొద్దూ!’’ రుస రుసలాడుతూ వీధిలోకెళ్ళి చూస్తూ నిలబడిరది సుభద్రమ్మ. ఆవిడ మనస్సు కీడుని శంకించడం మొదలుపెట్టింది!
మరి భరించలేక అంది. ‘‘నాకెందుకో భయంగా ఉంది. మీరో మాటు కాలేజీ కెళ్ళిరండి’’
అంతకంతకూ అనుమానాలు సెలవేస్తోంటే, అదే మంచిదని లేచి చెప్పులు తొడుక్కున్నారు జగన్నాధం.
రోడ్డు మీదకెళ్ళి ఆటో కోసం చూస్తోంటే, శిరీష వస్తూ కన్పించింది. గుండెల మీంచి పది టన్నుల బరువు దిగిపోయినట్లు అనుభూతించారు.
తండ్రిని చూసి మోపెడ్ ఆపింది శిరీష.
‘‘ఇంత ఆలస్యం అయ్యిందేం తల్లీ’’
‘‘రోజూ వచ్చే టైంకే వచ్చాను. ఎందుకలా ఆదుర్దాపడుతున్నారు?’’
‘‘అహ ఏం లేదులే. పద పద….’’ మోపెడ్ వెనకాల కూర్చుంటూ అన్నారు.
‘‘మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు….’’
‘‘నువ్వింకా రాలేదని నీకోసం వెదుకుతూ…’’
ఆమె మోము మ్లానమయ్యింది. ‘‘నేను చిన్నపిల్లనా నాన్నా’’
‘‘ఆడపిల్లవి’’
మరి మాట్లాడలేకపోయింది.
వారిని చూస్తూనే ‘హమ్మయ్య’ అనుకుంది సుభద్రమ్మ. ‘‘వచ్చేశావా. వుండుండు దీష్టి తీస్తా. ఎన్ని పాపిష్ఠి కళ్ళు పడ్డాయో ఏమో!’’
‘‘నీదంతా చాదస్తం’’
‘‘చాదస్తమూ చట్టుబండలూ కాదు. ముందస్తు జాగ్రత్త. ధైర్యం!’’ ఇంత ఉప్పు దిష్టి తీసేసింది.
పక్కింటి అంకుల్ ఇంట్లోకి తొంగి చూసి, ‘‘క్షేమంగా వచ్చేశావు కదా. థాంక్ గాడ్. ఇందాకట్నుంచి మీ అమ్మ కంగారు పడుతుంటే, నాకూ బీపీ పెరిగిపోయింది’’ అన్నాడు.
నిరంజన్‌కి ఫోన్ చేసి చెప్పగా, ఎంతో రిలీఫ్‌గా ఫీలయ్యాడు.
అతడు ఆఫీసు నుంచి వస్తూనే చెల్లెలి ఫోన్ తీసుకుని, ‘హాక్ ఐ’ యాప్ డౌన్‌లోడ్ చేశాడు. ‘‘అవసరమైనప్పుడు దీన్లోని ఎస్‌ఓఎస్ అంటే సేవ్ మై సోల్ బటన్ నొక్కితే చాలు క్షణాల్లో నువ్వు ఆపదలో ఉన్నావనే సమాచారం పోలీసులకు వెళ్తుంది. పోలీసు కంట్రోలు రూం నెంబరు 100 కూడా ఫేవరైట్స్‌లో సేవ్ చేసుకో…’’
తలాడిరచింది శిరీష.
‘‘కరాటే నేర్పిద్దామంటావేమిట్రా అబ్బాయ్’’ జగన్నాధం సాలోచనగా అన్నారు.
‘‘బాగానే ఉంటుంది గాని, మళ్ళీ ఆ క్లాసులకి వెళ్ళొచ్చేసరికి రాత్రి ఎనిమిదో తొమ్మిదో అయిపోతుంది’’
‘‘చీకటి పడ్డాక ఎక్కడికీ పంపేది లేదు. నా మాట విని పెళ్లి సంబంధాలు చూడండ్రా.
ఆ నాలుగక్షింతలూ వేసేస్తే ఎంతో నిశ్చింతగా ఉంటుంది’’ తల్లి అంది.
‘‘భలే దానివమ్మా. పెళ్లైనంత మాత్రాన నిశ్చింతగా ఎలా ఉండగలం!’’
ఆవిడ నిర్ఘాంతబోయి చూసింది. ‘‘అవునవును. ఆడదా ఆడబొమ్మా అన్నదే చూడటం లేదు. మాయదారి కాలం వచ్చిపడిరది. మనం చేయాల్సిందల్లా మన జాగ్రత్తలో మనం ఉండటమే. అన్నిటికీ
ఆ భగవంతుడే ఉన్నాడు’’
‘‘ఇది పురాణకాలం కాదే, పరుగున వచ్చి వస్త్రాపహరణం ఆపడానికీ’’ అన్నారు జగన్నాధం.
సంభాషణంతా శిరీష చెవిన పడుతూనే ఉంది కాని ఉదాసీనంగా ఉండిపోయింది.
భోంచేశాక నలుగురూ టీవి వార్తలు చూస్తూ కూర్చున్నారు.
వివిధ ప్రాంతాల్లో స్త్రీల మీద జరిగిన హత్యాచారాల బ్రేకింగ్ న్యూస్‌లు చూడలేక ఛానల్ మార్చారు. కొత్త కోడల్ని చంపడానికి అత్త, తోడి కోడలు విడివిడిగా కుట్రలు పన్నే సీరియల్ అది.
లేచి వెళ్ళిపోయింది శిరీష.
‘‘వీళ్ళ దుంప తెగ. సినిమాల్లో మగాళ్ళు విలన్లైతే, సీరియల్స్‌లో ఆడవాళ్ళు విలన్లు. చంపడాలూ, చావడాలూ తప్ప, బతకడం బతికించడం నేర్పే సీరియళ్ళు తీయరేంట్రా!’’ సుభద్రమ్మ అడిగింది.
‘‘ఇలాంటి వాటినే ఆడవాళ్ళు చూస్తున్నారమ్మా. వాళ్ళ వల్లే రేటింగ్ పెరుగుతుంది గనుక అలాంటివే తీస్తున్నారు. ఏళ్ళ తరబడి సాగదీస్తున్నారు’’ అన్నాడు నిరంజన్.
‘‘ఇవి చూడలేం గాని పాత సినిమా ఏదైనా పెట్టరా’’ అడిగారు జగన్నాధం.
మర్నాడు రోజూలానే టిఫిన్ తిని, లంచ్ బాక్సు తీసుకుని కాలేజీ కెళ్ళడానికి సిద్ధమైంది శిరీష. హ్యాండ్ బ్యాగ్‌లోని డబ్బు చెక్ చేసుకొంటోంటే రెండు స్ప్రే బాటిల్స్ కొత్తగా కన్పించాయి.
‘‘అమ్మా, ఇందులో ఏవో బాటిల్స్ పెట్టావేంటి’’
‘‘కారప్పొడీ, మిరియాల పొడీనూ. పక్కింటి ఆంటీ చెబితే ఆ అంకుల్ చేత తెప్పించాను. ఎవడైనా దొంగవెధవ నీ జోలికొస్తే కళ్ళల్లో కొట్టు, బాధతో ఛస్తాడు వెధవ’’ కసిగా అంది.
‘‘నేను వెళ్తోంది కాలేజీకమ్మా, యుద్ధానికి కాదు’’
‘‘ఆడది పట్టపగలైనా సరే వీధిలో కెళ్ళడమంటే పద్మవ్యూహంలో అడుగు పెట్టడం లానే ఉంది తల్లీ. మన జాగ్రత్తలో మనం ఉండకపోతే తిన్నగా బతకనివ్వరు’’ పమిట కొంగుతో కళ్ళొత్తుకుంది తల్లి.
గుమ్మం దాటుతోంటే, ‘‘సెల్‌లో చార్జి పూర్తిగా ఉంది కదా! కొత్త యాప్ చెక్ చేసుకున్నావు కదా’’ అడిగాడు నిరంజన్.
తలాడిరచి, మోపెడ్ దగ్గరికెళ్ళింది. తండ్రి టైర్లలోగాలి చెక్ చేసి, శుభ్రంగా తుడిచి ఉంచాడు.
‘‘బండి కండిషన్‌లోనే ఉంది. ఒకవేళ మధ్యలో ట్రబులిస్తే అక్కడే ఓ పక్కన పెట్టి తాళం వేసి, ఏ ఆటోలోనో వచ్చేయ్. చీకటి పడితే మాత్రం ఆటోల జోలికి వెళ్ళకు. జనం బాగా వున్న సిటీ బస్సెక్కి రా. రెండు మూడు బస్సులు మారినా ఫరావాలేదు. ఎక్కడా ఒంటరిగా ఎక్కువసేపు నిలబడొద్దు. జనం ఎక్కువగా వున్న చోటే ఉండు సుమా’’ జాగ్రత్తలు చెప్పారు జగన్నాధం.
బండి స్టార్ట్ చేసింది. ఆ చప్పుడు విని పక్కింటి అంకుల్ బయటికొచ్చాడు. ఆమె ధరించిన పంజాబీ డ్రస్స్ చూసి తల పంకించాడు. ‘‘ఈ డ్రస్సు బాగుందమ్మాయ్. జీన్సూ, టైట్సూ తొడుక్కోకు, మగాళ్ళు రెచ్చిపోవచ్చు’’ఉచిత సలహా ఇచ్చాడు.
‘దిశ నిండుగా చీర కట్టుకునే వుందంకుల్. అయినా వదిలారా మృగాళ్ళు?’ అని అడగలేదు. లోపలనుకుంది శిరి.
‘‘కాలేజీలో స్టార్టవ్వగానే రింగ్ ఇయ్యి’’ వెనక నుంచి అరిచారు జగన్నాధం.
లంచ్ టైంలో శిరీష, ఆమె నలుగురు స్నేహితులూ ఒక టేబుల్ దగ్గరికి చేరారు. బాక్సులు తెరవబోతోంటే ఆపింది హిమ. ‘‘తిండి కన్నా ముందు ఈ కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ పంపిస్తున్నా. తర్వాత మన ఇళ్ళ నెంబర్లూ, మన ముఖ్య బంధువుల స్నేహితుల నెంబర్లూ ఫీడ్ చెయ్యండి. అత్యవసర పరిస్థితుల్లో పానిక్ బటన్ నొక్కితే చాలు అందరికీ మెస్సేజ్ వెళ్ళిపోతుంది. లొకేషన్నీ షేర్ చేస్తుంది’’
అంతా డౌన్ లోడ్ చేసుకున్నాక అంది చాముండేశ్వరి. ‘‘నౌ ఉయార్ సేఫ్!’’
నిర్వికారంగా ఉండిపోయింది శిరీష.
లాస్ట్ పీరీయడ్ జరుగుతోంది. అయిదు నిమిషాలకోసారి తండ్రి, అన్నయ్య ఫోన్లు చేస్తున్నారు. వైబ్రేషన్‌లో ఉన్నా సరే ఎంతో ఇబ్బందిగా, ఎంబరాస్సింగా ఫీలయ్యింది శిరీష. లెక్చర్ మీద దృష్టి పెట్టలేకపోయింది.
క్లాసైంది. ‘బ్రతికాంరా దేవుడా’ అనుకుంటూ ఇంటికి ఫోన్ చేసింది.
‘‘అదే పనిగా అన్నిసార్లు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తారేంటి నాన్నా’’ విసుగ్గా అంది.
‘‘మా భయాలు మావి. ఇంతకూ బయల్దేరావా లేదా?’’
‘‘ఇప్పుడే క్లాసైంది. అయిదు పది నిమిషాల్లో స్టార్టవుతా’’
ఆ వెంటనే నిరంజన్ చేశాడు. అతడికీ అదే జవాబిచ్చింది. ‘‘ఇంకెక్కడా ఆగొద్దు. తిన్నగా ఇంటికెళ్ళిపో. మన కాలనీలోని నీ ఫ్రెండ్స్ అందరూ కలిసికట్టుగా వెళ్ళండి’’
‘‘ఓకే అన్నయ్యా’’
తర్వాతి రోజు బారెడు పొద్దెక్కేక లేచింది శిరీష. తాపీగా కాఫీ త్రాగుతూ వార్తాపత్రిక తిరగేస్తోంటే చూసి బుగ్గలు నొక్కుకుంది తల్లి.
‘‘అదేవిటే ఇంకా అలాగే కూర్చున్నావు! ఇవాళ కాలేజీ లేదూ!’’
‘‘ఉంది గాని వెళ్ళను’’
తండ్రి, అన్నగారు తల తిప్పి ఆమె వంక చిత్రంగా చూశారు.
‘‘కొత్త సినిమాకి ప్లాన్ చేశారేంటి’’ నవ్వాడు నిరంజన్.
‘‘బర్త్‌డే పార్టీ వుందేమో’’ జగన్నాధం అన్నారు.
‘‘ఇక చదువూ గిదువూ మానేస్తున్నాను. ఉద్యోగం గిద్యోగం కూడా చెయ్యను’’
పక్కన బాంబు పేలినట్టు తుళ్ళిపడ్డారు. ఆ పైన అంతా కలవరపడ్డారు.
‘‘అవేం మాటలే. చూస్తోంటే నిన్నేదో పురుగు కుట్టినట్టే వుంది!’’ అని తల్లి ఆశ్చర్యబోతే, ‘‘కొంపతీసి ఎవర్నీ ప్రేమించటం లేదు కదా?’’ అనుమానిస్తూ అన్నాడు తండ్రి.
‘‘క్లాసులు బాగా చెప్పడం లేదా? ఇంకో కాలేజీకి మారతావా?’’ నిరంజన్ అడిగాడు సంశయంగా చూస్తూ.
‘‘నాలుగ్గోడల మధ్య ఉంటేనే నాకు రక్షణ ఉంటుందని, ఇక ఇంట్లో మగ్గటానికే డిసైడైపోయాను’’
సంభ్రమంగా చూశారు. వింతగా చూశారు. అపనమ్మకంగా చూశారు.
‘‘ఇప్పుడేమైందనీ…’’ వెంటనే అడిగారు జగన్నాధం.
‘‘ఏమీ కాకూడదనే’’
‘‘చాలు చాల్లే. మేం ఆకాశంలో సగం కాదు, ఆకాశమంతా మాదే అంటూ మహిళలు ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతోంటే, నువ్వు ఇంట్లో కూర్చుని అంట్లు తోముతావా? సిగ్గు లేదూ ఆ మాటనడానికి?!’’ కస్సుమన్నాడు నిరంజన్.
‘‘నేను భయపడినంతా అయ్యింది. ఇదేదో కాని పని చేసింది’’ సుభద్రమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకొంటోంటే, కసిరారు జగన్నాధం.
శిరీషతో అనునయంగా అన్నారాయన ‘‘డిగ్రీ పూరైతే మంచి సంబంధం వస్తుందమ్మా. ఉద్యోగం చేస్తే కట్నమూ తగ్గుతుంది. ఇంకొక్క ఏడాదిలో చదువవ్వబోతోంటే, ఇప్పుడు అర్థాంతరంగా అస్త్రసన్యాసం చేస్తానంటావేమిటి చెప్పు?’’
‘‘చదువు మీద నాకు ఆసక్తి పోయింది నాన్నా’’ నిర్లక్ష్యంగా అంది.
‘‘నోర్మూసుకుని వెళ్ళి రెడీ అవ్వు, కాలేజీ కెళ్దువుగాని’’ కోపంగా అన్నాడు నిరంజన్.
‘‘నిజమే చెబుతున్నాను అన్నయ్యా. ఇంక చదవను’’
‘‘ఏం ఎందుకు? అంత బలీయమైన కారణం ఏమొచ్చిపడిరది నీ మీద?’’గద్దించాడు.
‘‘బయటి కెళ్ళాలంటే చాలు ఎంతో ఎంబరాస్సింగా, నిరాశగా, అవమానంగా, ఆందోళనగా ఉంటోంది అన్నయ్యా!’’
శిరి మాటలకు అయోమయంగా చూశారు ముగ్గురూ.
‘‘ఎవరికీ లేని ఇబ్బంది నీకేమొచ్చిందే? నీ తోటివాళ్ళు లక్షణంగా చదువుకోవడం లేదూ?’’మూతి తిప్పుతూ సాగదీసింది సుభద్రమ్మ.
‘‘అసల్నీ అభ్యంతరాలేంటి శిరీ’’ నిరంజన్ అడిగాడు.
‘‘ప్రకృతి స్త్రీ, పురుషులకు సమాన జీవనావకాశాలు కల్పించింది. కాని ఇంటా బయటా మమ్మల్ని వేరు చేసి చూస్తున్నారు. వేరుగా చూస్తున్నారు. అబ్బాయిలకు లేని ఆంక్షలన్నీ మా నెత్తిన రుద్దుతున్నారు’’ ఉక్రోషపడిరది శిరీష.
తేలిగ్గా నవ్వేశారు జగన్నాధం. ‘‘ముల్లొచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా నష్టపోయేది ఆకేనమ్మా. అందుకే ఆడవాళ్ళు అధిక జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం అటు ఇటు అయితే…!’’
‘‘అయితే? ఏం జరుగుతుంది? మా శీలం పోతుంది. అంతేనా? శీలం ఆడవాళ్ళకే ఉంటుందా నాన్నా? మగవాళ్ళకి శీలం
ఉండదా ? ఎలా తిరిగినా, ఎందర్తో తిరిగినా మగవాళ్ళ శీలం పవిత్రంగానే ఉంటుందా? లేక వాళ్ళకి శీలం అనేది అవసరమే లేదా?’’
‘‘ఇదెక్కడి వితండవాదమే!’’ బుగ్గలు నొక్కుకుని నేల మీద కూలబడిరది సుభద్రమ్మ.
చెల్లెలి మనస్సులో జరుగుతోన్న సంఘర్షణ మెల్లమెల్లగా అర్థమవుతోంది నిరంజన్‌కి. సాభిప్రాయంగా, సానుభూతిగా చూస్తుండిపోయాడు.
‘‘పెద్దలు చేసిన కట్టుబాట్లని అనుసరిస్తేనే అందరికీ క్షేమం. సంతోషం’’ ఇంకేమనాలో తోచక అన్నారు జగన్నాధం.
‘‘ఆడది నవ్వకూడదు. గడప దాటకూడదు. పది మందిలో ఊరేగకూడదు. మొగుడ్నీ పిల్లల్నీ చూసుకుంటూ ఇంటికే పరిమితమై పోవాలి. పూర్వం ఇలాంటి ఆంక్షలెన్నో ఉండేవి. అవన్నీ దాటి చాలా దూరం వచ్చేశాం. కానిప్పుడు కొత్త ఆంక్షలు కొత్త ముసుగులు వేసుకొస్తున్నాయ్. బయటి కెళ్ళాలంటే ఎన్నో రకాల రక్షణాయుధాలతో, యుద్ధ సన్నద్ధతతో వెళ్ళాలి. ఎప్పుడు ఏ క్రూర మృగం పంజా విసుర్తుందో, ఎటు నుంచి ఎప్పుడు వేటాడుతుందో, ఇంకెలాంటి పన్నాగం పన్నుతుందో అన్న భయాందోళనలతో అనుక్షణం మేం భయబ్రాంతులం అవ్వాలి. ఇక్కడ మా శత్రువులెవరనుకున్నారు? ఒక మహిళ ప్రాణాలకు తెగించి కన్న బిడ్డలే! రక్తాన్ని పాలగా మార్చి పట్టివ్వగా తాగి కండలు పెంచిన వాళ్ళే! ఎంత దారుణమో చూడండి. అసలు ఆడవాళ్ళ మీద మగాళ్ళు అత్యాచారాలు ఎందుకు చేస్తున్నారు? తమ బలం, మగ దురహంకారం చాటుకోడానికి! అంటే నాగరిక సమాజం కాస్తా ఆటవిక రాజ్యమైపోయింది. మేం ప్రాణాలు అరచేత బట్టుకుని బిక్కు బిక్కుమని భీతహరిణుల్లా ఉండాల్సొస్తోంది. అందుకనే అసలు బయటికే వెళ్ళనంటున్నాను’’
‘‘ఇంట్లో 100% రక్షణ వుందంటావ్? అదేగా నీ అర్థం?’’ నిలదీశాడు నిరంజన్.
తల అడ్డంగా ఊపింది శిరీష. ‘‘దుండగులు ఇంట్లోకీి దూసుకొస్తున్నారు లేదా ఇంట్లోనూ తయారవుతున్నారు. కాదంటే కొంతలో కొంతైనా నాలుగ్గోడలూ రక్షణగా నిలబడతాయని చిరు ఆశ. ఈ జడ సమాజాన్ని నమ్మే కన్నా గోడల్ని విశ్వసించడం బెటర్ కదా!’’
‘‘అంతా నీలాగే ఆలోచించి, నీలాగే ఆచరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?’’ తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు నిరంజన్.
‘‘సగం స్కూళ్ళు, ఆఫీసులు, పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్థలు, వ్యవసాయక్షేత్రాలు మూతపడతాయ్. పడనీ. ఇద్దరి పనీ మగవాళ్ళే చేస్తారేమో, ఇద్దరి శ్రమా మగవాళ్ళే పడతారేమో, ఇద్దరి సంపాదనా మగవాళ్ళే సంపాదిస్తారేమో, ఇద్దరి బాధ్యతలూ మగవాళ్ళే నిర్వర్తిస్తారేమో చూద్దాం. మొదట మా ఆడవాళ్ళు సేఫ్‌గా ఉంటారుగా, అది మాకు చాలదూ! మేం జీవశ్చవాలం కానక్కర్లేదు. ఏసిడ్ దాడులు ఎదుర్కోనక్కర్లేదు. పెట్రోలు మంటల్లో కాలక్కర్లేదు. చిత్రహింసలు అనుభవించక్కర్లేదు. హత్యాకాండకు సమిధలవ్వక్కర్లేదు. మా కన్నీ హ్యాపీసే కదా అన్నయ్యా!’’ జీవం లేని శుష్కహాసం శిరీష పెదాలమీద కదిలింది.
తన కూతురు, కళ్ళ ముందే అమాంతం పెద్దదై పోయినట్టు అన్పించి, కళ్ళప్పగించి చూస్తూండిపోయింది సుభద్రమ్మ.
దిమ్మెరబోయి చూడసాగారు జగన్నాధం. ఆయనకంతా అయోమయంగా ఉంది.
చిన్నారి పొన్నారి చెల్లెలి మస్తిష్కంలోని మథన, గుండెల్లో రగులుతోన్న వేదన అర్థమయ్యాయి. ఇదెక్కడికి దారి తీస్తుందోనని భయపడ్డాడు నిరంజన్.
‘‘అలా నిరాశపడొద్దు శిరీ. మెల్ల మెల్లగానే అయినా పరిస్థితి మారుతోంది. జనం చైతన్యవంతులవుతున్నారు. కళ్ళెదుట అకృత్యాలు జరుగుతుంటే నిలదీస్తున్నారు. ‘దోషుల్ని మా కప్పగించండి, చంపేస్తాం’ అని గర్జిస్తున్నారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ప్రభుత్వం కొత్త చట్టాలు చేయడమే కాదు, సత్వర న్యాయం అందివ్వడానికి పూనుకుంది. పరిస్థితి నువ్వూహిస్తున్నంత ఘోరంగా లేదు శిరీ. ధైర్యంగా ఉండు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్’’
‘‘మరైతే ఈ పెప్పర్ స్ప్రేలని విసిరెయ్యనా? హ్యాక్ ఐడిని డిలీట్ చెయ్యనా?’’
తూటాలా వచ్చిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాడు నిరంజన్. కళ్ళు దించుకున్నాడు.
‘‘ఉపన్యాసాలిస్తారు తప్ప ఎవరిలోనూ చిత్తశుద్ధిలేదన్నయ్యా. అందుకే దేశానికి స్వాతంత్య్రం వచ్చినా మాకింకా రాలేదు. మేమింకా మగవారి బానిసల్లానే ఉన్నాం. మా స్వేచ్ఛ రాజ్యాంగ పుస్తకాలకే పరిమితమైపోయింది. మేం ఎప్పటికీ వీకర్ సెక్షనే. ఎప్పటికీ మా మీద వివక్ష కొనసాగుతూనే ఉంటుంది…!’’ బరస్టయ్యింది శిరీష.
‘‘ఆందోళన పడొద్దు శిరీ’’ దగ్గరికెళ్ళి భుజం మీద చెయ్యేసి అనునయించారు. కన్నీళ్ళు తుడిచారు.
‘‘మనుషులంతా ఒకే రకంగా ఉండరు. ఒకే రకంగా ప్రవర్తించరు. ఇన్ని కోట్ల జనం
ఉన్నప్పుడు అప్పుడప్పుడూ అక్కడక్కడా కొన్ని విషాద సంఘటనలు జరుగుతుంటాయి. వాటిని భూతద్దంలో చూసి బెంబేలు పడకూడదు. ఎదిరించి నిలవడానికి సర్వసన్నద్దం కావాలి’’
‘‘మమ్మల్ని మేం రక్షించుకోడానికే, మా భద్రత మేం చూసుకోడానికే మా సగం శక్తిని వినియోగించాలంటావు? అంతే తప్ప, ఈ సమాజం మాకెలాంటి భద్రతా కల్పించదు. ఈ ప్రభుత్వం మాకు రక్షణ ఇవ్వదు అంతేనా అన్నయ్యా?’’
‘‘ఇవ్వకపోతే పరిస్థితి ఇలా ఉండదు…’’
కన్నీళ్ళు ధారలు కడుతోంటే నవ్వుతూ తప్పట్లు కొట్టింది శిరీష.
‘‘ఆటవిక రాజ్యం, ఆది మానవుల కాలం వచ్చేదంటావు, చాలా కరెక్టుగా ఎస్సెస్ చేశావన్నయ్యా’’
‘‘శిరీ!’’
‘‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలున్నాయి. మిలిటరీ, పారామిలిటరీ, పోలీసు బలగాలు ఉన్నాయి. అయినా మాకేం రక్షణ, మా స్వాతంత్య్రానికేం భద్రత, మా స్వేచ్ఛా జీవనానికేం భరోసా కల్పిస్తున్నాయి? చెప్పు అన్నయ్యా. పొగ తాగడం క్యాన్సర్ కారకం అంటారు కాని సిగరెట్లు నిషేదించరు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు. రహదార్ల పక్కన యధేచ్ఛగా అమ్మెస్తారు. ఇలా రెండు నాల్కల ధోరణి ఎందుకు? నిజంగా ప్రభుత్వం తలచుకుంటే చిత్తశుద్ధితో కృషిచేస్తే మగాళ్ళలో మార్పు తీసుకురావడం అసాధ్యమా అన్నయ్యా? స్త్రీలను గౌరవించాలని రోజూ స్కూళ్ళల్లో మగపిల్లల చేత ప్రతిజ్ఞ చేయించలేరా? తల్లిదండ్రులను చైతన్యపరచి మగపిల్లల సంస్కారాన్ని పెంచలేరా? మగవాళ్ళ మైండ్ సెట్ మార్చలేరా? సినిమాల్లో టీవీల్లో మహిళా వేధింపులు జరిగినప్పుడల్లా ‘ఇది నేరం. శిక్షార్హం’ అని పెద్ద పెద్ద అక్షరాల్లో చూపించలేరా? హత్యాచార నిందితులను మూడు నెలల్లో శిక్షించలేరా? వారిని పబ్లిగ్గా ఉరి తీసి, ఆ ఘటనని వీడియో తీసి, సామాజిక మాధ్యమాల ద్వారా దుండగులకు హెచ్చరిక పంపలేరా? ఆడవారిపై దౌర్జన్యం జరుగుతుంటే చూస్తూ వూరుకోవడం, వీడియో తీస్తూ పళ్ళికిలించడం కూడా ఘోర నేరాలేనని మెస్సేజ్ పౌరుల బుర్రల్లోకి పంపలేరా? ప్రజా భాగస్వామ్యంతో ఎక్కడికక్కడ మృగాళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట వేయలేరా? ఆడవారు సురక్షితంగా తిరిగేలా చెయ్యలేరా? అలా చేసిన రోజునే ఆడది అర్థరాత్రి ఒంటరిగా నిర్భయంగా నడుస్తుంది. గాంధీజీ స్వప్నాన్ని సత్యం చేస్తుంది. మగాడితో సమానంగా భుజం భుజం కలిసి ముందడుగు వేస్తుంది….’’
ఎన్నో ఏళ్లుగా గడ్డ కట్టిన ఆవేదన, అణచివేత, ఆక్రోశం, నరక హింసలన్నీ ఒక్కుమ్మడిగా అగ్నిపర్వతంలా బ్రద్దలైంది. శిరీష నోటి ద్వారా లావాలా ఉప్పొంగి వచ్చింది.
నిశ్చేష్టులయ్యారు. నిర్విణ్ణులయ్యారు. నిర్ఘాంతబోయి చూశారు.
మంచు కరుగుతోంది. మౌనం బ్రద్దలవుతోంది. సహనం సంకెళ్ళు తెంచుకుంటోంది.
మీటూలు లోలోపలి వ్యథ కక్కుతున్నాయి. స్పీకప్‌లు గొంతు సవరించుకుంటున్నాయి. ఎక్కడ అత్యాచారం జరిగినా వేల లక్షల గళాలు గర్జిస్తున్నాయి. పిడికిళ్ళు బిగిస్తున్నాయి. నిర్భయ నిందితుల్ని త్వరగా ఉరి తీయమని డిమాండ్ చేస్తున్నాయి.
అత్యాచార అసురులు ‘చస్తే’ జనం పండుగ చేసుకుంటున్నారు.
నిశ్శబ్ద విప్లవం పురుడు పోసుకుంటోంది!