గమనమే గమ్యం -ఓల్గా

ఆ రోజు విజయవాడ వీథులన్నీ స్త్రీలతో నిండిపోయాయి. పెద్ద ప్రదర్శన. జెండాలు, తోరణాలు, బ్యానర్లు వీటితో నినాదాలిచ్చుకుంటూ సాగుతున్నారు మహిళలు. మెల్లి, సూర్యావతి, శారదాంబలు ముందర నిలబడి అందరినీ నడిపిస్తున్నారు. వెనకాల వందల సంఖ్యలో స్త్రీలు.

గవర్నరుపేట రాగానే ఏదో సంచనలం. పోలీసులు, పోలీసులు అనే కేకలు. కొందరు వెనకాలు ఉన్నవారు సందులలోకి తెరిచి ఉన్న ఇళ్ళలోకి తప్పుకున్నారు. పోలీసులు భాష్పవాయువు ఒదిలారు. చాలామందికి అది ఎలా పనిచేస్తుందో తెలియదు. కళ్ళు మండి కనపడక కంగారు పడి కేకలు పెట్టారు. కానీ ప్రదర్శన ఆగలేదు. పోలీసులు అడ్డుగోడలా నిలబడి ఆపారు. శారదాంబ గర్జించింది. 144వ సెక్షన్‌ ఉందన్నారు పోలీసులు. స్వతంత్ర భారతదేశంలో బ్రిటిష్‌వాడు పెట్టిన సెక్షన్లను వాడుకుని ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపటానికి సిగ్గులేదూ అని అంటూ పోలీసు దౌర్జన్యాలు నశించాలనే నినాదమిచ్చింది. అనేక గొంతులు జత కలిశాయి. పోలీసులు పకడ్బందీగానే వచ్చారు. గబగబా దొరికిన వాళ్ళను దొరికినట్లు అరెస్టు చేసి వ్యానెక్కించారు. జనం గుంపులుగా చేరారు. ఇంతమందిని, ఆడవాళ్ళను అరెస్టు చేస్తారా? ఎంతకు తెగించింది ప్రభుత్వం అనుకుంటున్నారు.
మహిళా సంఘం కార్యకర్తలు దాదాపు అరవై మందిని రెండు వ్యాన్లలో ఎక్కించారు. స్త్రీలు ప్రతిఘటించినా బలవంతంగా వ్యాన్లలోకి తోసేశారు. ఇదంతా జరిగి వ్యాన్లు బయల్దేరేసరికి సాయంత్రమయింది. స్టేషన్‌కు తీసుకెళ్తారు, రిమాండ్‌కు పంపుతారు, బెయిల్‌ తీసుకోవాలి అనుకున్నారు శారద, సూర్యావతి. కానీ వ్యాన్లు ఏ పోలీసు స్టేషన్‌ దగ్గరా ఆగటం లేదు. బెజవాడ పొలిమేరలకు చేరుతున్నాయి. చీకటి పడుతోంది అప్పుడే.
‘‘ఎక్కడికి తీసుకుపోతున్నారు మమ్మల్ని? చెప్పండి?’’
శారద అరుపులకు సమాధానం లేదు.
కొందరి ముఖాలలో అలజడి గమనించి శారద ‘‘కోటేశ్వరమ్మా, రాజమ్మా పాటలు అందుకోండోయ్‌’’ అన్నది.
ఉద్రిక్తతతో ఉన్న వాళ్ళ గొంతులు మరింత తీవ్రంగా మార్మోగాయి. అందరూ గొంతు కలిపారు.
పాటలు పాడి దాహంతో గొంతులు అలిసిపోతున్నాయి గానీ వ్యాన్లు అలసట లేకుండా పోతూనే ఉన్నాయి. చీకట్లు దట్టమయ్యాయి. సమయం ఏడుగంటలయింది. ఆకలి, దాహం.
‘‘నా చిన్నతల్లి… దానికి పాలెట్లా’’ అని రాజమ్మ ఏడుస్తోంది.
కొందరు చిన్నపిల్లలను తీసుకొచ్చారు. వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు. పెద్దలెలాగో ఓర్చుకోగలరు. కానీ చిన్నపిల్లలు వారికేం తెలుస్తుంది. రాత్రి తొమ్మిది గంటలకు వ్యాను ఆగింది.
అందరూ కిందికి దిగారు. చూస్తే అది నందిగామ సబ్‌జైలు.
బెజవాడ నుంచి నందిగామ తెచ్చారా? అని విస్తుపోయారు. అందరికీ ఆకలి, దాహం.
శారద జైలర్‌ దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడి నీళ్ళు తెప్పించింది. ఆ రాత్రివేళ మరి భోజనం గానీ, పాలు గానీ దొరకవన్నాడు జైలరు.
శారద జైలరు టేబిల్‌ ఎదురుగా కుర్చీలో కూర్చుని ‘‘వాట్‌ నాన్సెన్స్‌ ఆర్‌ యు టాకింగ్‌. యూ డోంట్‌ నో దట్‌ 60 ఉమెన్‌ ఆర్‌ కమింగ్‌ యాజ్‌ ప్రిజనర్స్‌’’
‘‘నిజంగా నాకు తెలియదు డాక్టరు గారు’’ అన్నాడు జైలరు భయపడుతూ. అతనికి శారద గురించి తెలుసు.
‘నీ ఫోను వాడుకుంటాను’ అని ఫోను తీసుకుని ఎవరికో ఫోన్‌ చేసింది.
‘‘తమ్ముడూ లక్ష్మణా… మా మహిళా సంఘం వాళ్ళని 60 మందిని అరెస్టు చేసి మీ ఊరు తెచ్చారోయ్‌. చిన్నపిల్లలున్నారు. అర్జంటుగా పావుగంటలో పాలు కావాలి. మా అరవై మందికీ ఒక గంటలో భోజనాలు కావాలి. పంపిస్తావు గదోయ్‌. సరే… త్వరగా, త్వరగా పంపు. వీలేతై ముందు పాలు పది నిమిషాల్లో పంపు. మంచినీళ్ళు కూడా రెండు బిందెలు పంపు’’. ఫోన్‌ పెట్టేసి అందరి దగ్గరికి వెళ్ళి ఏం ఫరవాలేదు, అన్నీ వచ్చేస్తాయి అని ధైర్యం చెప్పింది. పదిహేను నిమిషాల్లో చిన్న పాల బిందెలో గోరువెచ్చని పాలు, రెండు బిందెల నీళ్ళు, అరటి గెలలు, పనస తొనలు వచ్చేశాయి. తల్లులు పిల్లలకు ముఖాలు కడిగి పాలు తాగించి అరటి పళ్ళు తినిపించారు. తర్వాత తామూ తిన్నారు. గంటయ్యేసరికి అన్నాలొచ్చాయి. బీరకాయ కూర, చారు, పెరుగు, ఒక గిన్నెలో గట్టి జున్ను పంపారు. అందరూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ, వడ్డించుకుంటూ భోజనాలు చేశారు. జైలరు విస్తుపోయి చూస్తున్నాడు. శారదంటే ఆయనకు తెలుసు గానీ మరీ ఇంత సాహసవంతురాలనుకోలా? ఇంత పలుకుబడి ఉందనుకోలా. ఈవిడను ఈ జైల్లో నేనుంచాలా? అంత ఖర్మ నాకు పట్టాలా? ఏం చేస్తాం. గాంధీగారు ఏళ్ళ తరబడి జైల్లో ఉన్నారు. ఆ జైలర్ల ఖర్మ. ఆ మహానుభావుడిని తమ పెత్తనంలో ఉంచుకున్నారు, లేక అది వాళ్ళ అదృష్టమో. ఇదీ తన అదృష్టమేనేమో…
వాళ్ళందరినీ ఆ చిన్న జైల్లో సర్దడానికి ఆయనకు సిగ్గేసింది. అందరూ అలాగే అవస్థలు పడుతూ నాలుగైదు రోజులు ఉన్నారు. స్నానాలకూ, దొడ్డికీ మరీ ఇబ్బందిగా ఉంది. శారదాంబ నాయకత్వంలో అందరూ ప్రతి విషయానికీ జైలరు మీద తిరగబడుతున్నారు. పోలీసులను లెక్కచేయటం లేదు. నాలుగో రోజు శారదకు కబురందింది. పోలీసులు తన హాస్పిటల్‌ను ధ్వంసం చేశారు. సూర్యం, పద్మ పిల్లలను తీసుకుని విశాఖపట్నం వెళ్ళారు. సుబ్బమ్మ ఒక్కతే ఇంట్లో ఉంది. ఎన్నడూ ముఖంలో దిగులు, బాధ కనిపించని శారద ముఖంలో బాధ చూసి అంతా ఆమె చుట్టూ మూగారు. హాస్పిటల్‌లో ఒక్కొక్క వస్తువునీ ఎలా విరక్కొట్టి ముక్కలు చేసిందీ వివరంగా రాసి రహస్యంగా జైలుకి పంపారు శారద బంధువొకాయన. అది చదివి శారద మిగిలిన వాళ్ళనూ చదవమని ఇచ్చింది.
‘‘డాక్టర్‌గారి హాస్పిటల్‌నే ఒదలలేదంటే ఇక మన ఇళ్ళ సంగతేమిటి?’’ అనే ప్రశ్న అందరిలో వచ్చింది.
శారద అందరికీ ధైర్యం చెప్పింది.
ఇంతలో ఉమాదేవికి మరెవరో ఒక ఉత్తరం తెచ్చిచ్చారు. ఉమాదేవి ఆ ఉత్తరం చదివి మాటా పలుకూ లేకుండా
ఉండిపోయింది.
‘‘నీ సమాచారాలేంటోయ్‌’’ అంది శారద.
‘‘ఏం లేదు డాక్టరు గారు. అంతా బాగున్నారు’’ అంది ఉమ తడబడుతూ.
‘‘అంత పెద్ద ఉత్తరం నిండా అదే రాశారేమిటి. మీ ఆయన ప్రేమలేఖ రాసి ఉంటాడు అంతేనా?’’
ఉమాదేవి ముఖం పాలిపోయింది. మిగిలిన వాళ్ళంతా నవ్వారు. ఆ రోజు సాయంత్రానికి అందరూ గంభీరమై పోయారు.
‘‘ఏంటోయ్‌… దిగులు పడుతున్నారు. ఆడుకుందాం రండి’’.
ఎవరూ మాట్లాడలేదు. తలలు దించుకున్నారు. అందరి కళ్ళల్లో భయం. తనతో ఎవ్వరూ మధ్యాహ్నం నుంచీ మాట్లాడలేదని శారదకు అనిపించింది. ఏమైంది వీళ్ళకి? ఉమాదేవికి ఉత్తరం వచ్చింది. అది ఒకరిద్దరు చదువుతుండగా తాను చూసింది. ఉమాదేవి తనకు చూపించలేదు. అప్పట్నుంచీ వీళ్ళు తనతో మాట్లాడలేదు. ఏం ఉత్తరమది?
తను ఢల్లీి నుంచి వచ్చాక పార్టీకి ఉత్తరం రాసి పంపింది. ‘‘కంటికి కన్ను పంటికి పన్ను’’తో తను ఏకీభవించటం లేదనీ, నెహ్రుని కలిస్తే ఆయనిలా అన్నారనీ, అంతా వివరంగా రాసింది. అది చూసి పార్టీ ఎలా స్పందిస్తుందా, ఏం సమాధానం ఇస్తుందా అని సందేహంగా ఉంది. దాని గురించి వీళ్ళకు రాశారా? తన వాదనను పార్టీ వ్యతిరేకం అనుకున్నారా, తనమీద క్రమశిక్షణ చర్య తీసుకుంటారా? తీసేసుకున్నారా? అది వీళ్ళకా ఉత్తరంలో తెలియజేశారా? వీళ్ళు దానికేం చేయాలో తెలియక భయపడుతున్నారా?
శారద ఆలోచనలో పడి గంభీరంగా కూచుంది. నవ్వులతో, అరుపులతో, శారద ఖంగుమంటూ చెప్పే రాజకీయ పాఠాలతో కళకళలాడే వాతావరణం నిశ్శబ్దమైంది. జైల్లో పనిచేస్తున్న వారంతా ఆశ్చర్యపోయారు. రాత్రి ఎనిమిదవబోతోంది. జైలర్‌ పిలుస్తున్నారని వార్డర్‌ వచ్చి శారదాంబను పిల్చుకెళ్ళాడు. అందరిలో ఉద్రిక్తత. ఏం జరగబోతోంది. శారదనొక్కదానినే ఎందుకు పిల్చారు?
పదిహేను నిమిషాల్లోపే శారద వచ్చింది. అందరినీ దగ్గరగా పిల్చింది. చుట్టూ మూగేవారు ఆరడుగుల దూరంలో నిలబడ్డారు.
‘‘కామ్రేడ్స్‌… నన్ను వెల్లూరు జైలుకి పంపుతున్నారు. వెంటనే బయల్దేరి బెజవాడలో మద్రాసు రైలెక్కాలి. నే
వెళ్తున్నాను.’’
అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. కోటేశ్వరమ్మ ముందుకు రాబోతే ఉమాదేవి ఆమె చెయ్యిపట్టి వెనక్కు లాగింది. అది మిగిలినవాళ్ళకు సంకేతమయింది. శిలల్లా నిలబడ్డారు. నలుగురైదుగురి ముఖాలు దీనంగా ఉన్నాయి గానీ మిగిలిన వారు రాతిముఖాలతో నించున్నారు. శారదాంబకు అర్థమైంది. గలగలా నవ్వింది.
‘‘ఏంటోయ్‌… బొమ్మల్లా అలా నిలబడ్డారు? వెల్లూరు వెళ్ళి మళ్ళీ బెజవాడ వచ్చేస్తాగా. రాజమ్మా పిల్ల జాగ్రత్త. శేషమ్మా… నేనిచ్చిన మందులు వాడటం మానకు. నీ ప్రసవం నేనే చేస్తా. ఏం భయం లేదు. ఏంటోయ్‌, మాట్లాడరా… టైమవుతోంది. నే వెళ్తున్నా.’’
గిరుక్కున వెనక్కి తిరిగి హుందాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కోటేశ్వరమ్మ, రాజమ్మ, సత్యవతి వంటి నలుగురైదుగురు కళ్ళనీళ్ళు నింపుకుని అలాగే శారద వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నారు.
వెల్లూరు జైల్లోకి అడుగు పెడుతూనే శారదకు హరి బాబాయి గుర్తొచ్చాడు. హరిసర్వోత్తమరావు బ్రిటిష్‌ వాళ్ళకు వ్యతిరేకంగా పత్రికా సంపాదకీయం రాసినందుకు గాను వెల్లూరు జైలుకి పంపబడ్డ తెలుగువాళ్ళలో మొదటివాడు. శారద చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచీ ఆయన దగ్గరనుంచి ఆ జైలు జీవితం గురించి ఎన్నోసార్లు విన్నది. మొదట్లో ఇంగ్లీషు వాళ్ళమీద కోపంతో వినేది. కొన్నిసార్లు కుతూహలంతో వినేది. కొన్నిసార్లు కుతకుత ఉడుకుతూ వినేది. సహాయ నిరాకరణలో పాల్గొని తానూ జైలుకి వెళ్ళాలని అనుకున్న రోజులలో హరి బాబాయి కథలను ఉడుకెత్తే రక్తంతో గుర్తుకు తెచ్చుకునేది. కానీ స్వయంగా హరిబాబాయే ఆమెను ఉద్యమంలోకి వెళ్ళకుండా ఆపాడు. ఉప్పు సత్యాగ్రహ సమయంలో తన స్నేహితులెందరో వెల్లూరు జైల్లో ఉన్నారు. వారిలో అన్నపూర్ణ, దుర్గ దగ్గరి స్నేహితులు. శారద వెళ్ళి అన్నపూర్ణను చూసి వచ్చింది. అప్పుడు ఆ జైలు గేటు దాటుతుంటే ఒళ్ళు పులకరించింది శారదకు. ఎందరెందరో త్యాగాలు, శౌర్యాలు, రక్తము, కన్నీళ్ళూ ఒక్కసారి శారద రక్తంలోకెక్కి పోటెత్తాయి ఆనాడు. అప్పుడు చెరసాలలో ఉన్న తన మిత్రులందరినీ తల్చుకుని గర్వంతో ఉప్పొంగుతున్న హృదయంతో అడుగుపెట్టింది వెల్లూరు జైలులో. కానీ ఈనాడు… భారతదేశం స్వతంత్రమైన తర్వాత, మనది అనుకున్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రెండేళ్ళన్నా నిండని స్వత్రంత్ర దేశంలో వెల్లూరు జైలు తననాహ్వానించింది.
ఇది అదృష్టమా దురదృష్టమా తేల్చుకోలేకపోయింది శారద. అన్యాయం ఎవరు చేసినా ప్రశ్నించాల్సిందే. ప్రతిఘటించాల్సిందే. న్యాయం కోసం అడగవలసిందే. దానికి తన పర అనే భేదాల్లేవు. కానీ తనకెందుకో ఆ సమరోత్సాహం లేదు. ఇప్పుడు తనకు జైల్లో మగ్గాలని లేదు. దేశ భవిష్యత్తుని నిర్మించాలని ఉంది. ప్రజలలో, ప్రజలతో ఉండాలని ఉంది. వాళ్ళని నడిపించాలని ఉంది. వాళ్ళను సేవించాలని ఉంది. వాళ్ళకు కావలసింది వాళ్ళు కనుగొనేందుకు చేయూతనివ్వాలని ఉంది. ఈ క్షణంలో ఈ ఒంటరితనం తను కోరుకోవటం లేదు. ఐనా తప్పదు. తప్పనప్పుడు నవ్వుతూ నవ్వుతూ ఈ కాలాన్ని నడిచెయ్యాలి.
శారద వెళ్ళిన రెండు రోజులకు సూర్యావతిని కూడా వెల్లూరు జైలుకి పంపారు.
వెల్లూరు జైలులోకి సూర్యావతి వచ్చాక శారదకు తన ఒంటరితనం ఎలాంటిదో అర్థమైంది. సూర్యావతి శారదతో మాట్లాడటం లేదు. తనకు అత్యంత ఆప్తురాలు, పరమ మిత్రురాలు తననొక ద్రోహిలా చూసి ముఖం తిప్పుకుంటే శారద నివ్వెరపోయింది. ఎందుకలా ఉండాలి. ఉన్నదేదో ముఖాన మాట్లాడుకోవచ్చు. ‘నీ నిర్ణయం, ఆలోచనలు నాకు నచ్చటం లేదు’ అనవచ్చు. కానీ మౌనంతో హింసించటం ఎందుకు? వెలివేసినట్లు చూడటం ఏమిటి? భిన్నత్వానికి చోటులేకపోతే ఎట్లా. తన అభిప్రాయాలు చెప్పినందుకు పార్టీ ఇంత తీవ్రవైఖరి తీసుకుంటే తను ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తారు? సస్పెండా? బహిష్కరణా?
మూర్తిని కూడా అరెస్టు చేసి వెల్లూరు తీసుకొచ్చారనే వార్త తెలిసి శారద మరింత వేదనకు గురయింది. అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. మిగిలినవాళ్ళంతా విశాఖపట్నంలో బంధువుల ఇంట్లో ఉన్నారు. సూర్యం అప్పుడప్పుడు వచ్చి తల్లి యోగక్షేమాలు కనుక్కుని వెళ్తున్నాడు. అమ్మని చూసుకోటానికి మనుషులున్నారు గానీ తన గురించి ఈ వయసులో బెంగపడుతోంది. ఇవన్నీ లోపలి ఆలోచనలు. పైకి ఉత్సాహంగా గలగలా మాట్లాడుతూనే ఉంటుంది శారద. ఖైదీలకు వైద్య సదుపాయాలెలా ఉన్నాయో పరిశీలించి రిపోర్టు రాస్తోంది. తోటి ఖైదీలతో మాట్లాడుతూ నవ్వుతూనే తిరుగుతోంది. రాత్రివేళ మాత్రం అనంతమైన వేదన ఏదో గుండెల్లోకి వచ్చి కూర్చుంటుంది. పార్టీతో ఎడం ఏర్పడుతుందా
రాత్రి నల్లని రాతి పోలిక
గుండె మీదను కూరుచుండగ
అన్న శ్రీ శ్రీ కవిత్వ వాక్యాలు అనుభవమవుతున్నాయనుకుంది శారద.
మూర్తి వచ్చిన వారం రోజులకు శారద ఇంటర్వ్యూ సంపాదించాడు. ఒకరినొకరు చూసుకోగానే ఇద్దరికీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. శారద కంట్రోల్‌ చేసుకుని నవ్వుతూ
‘ఎలా ఉన్నావోయ్‌’ అని అడిగింది.
మూర్తి పేలవంగా నవ్వాడు.
‘నీతో కూడా ఎవరూ మాట్లాడటం లేదా’ అన్న శారద ప్రశ్నకు ఆశ్చర్యంగా చూశాడు.
‘అంటే…’
‘నేనిక్కడికి వచ్చేముందు నందిగామ జైలువాళ్ళు దాదాపు మాటలు ఆపేశారు. ఇక్కడ సూర్యావతీ మాట్లాడటం లేదు. మన అభిప్రాయాలు పార్టీకి తెలిశాయి. మనం అభిప్రాయాలే తెలియజేశాం. వాళ్ళు నిర్ణయం తెలియజేస్తున్నట్లున్నారు’
‘ఏంటా నిర్ణయం?’
‘బహుశ మనల్ని పార్టీ నుంచి బహిష్కరిస్తారు’ ఎంత మామూలుగా చెప్పబోయినా శారదకు దుఃఖం తన్నుకొచ్చింది.
మూర్తి మాట్లాడకుండా కూర్చున్నాడు.
జైల్లోకి వార్తలొస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో చైతన్యవంతులైన యువతరం, పాతిక ముప్ఫై సంవత్సరాల వయసున్న యువతరం ప్రాణాల్ని వదులుతోంది. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు. ముఖ్యమైన కార్యకర్తలను కోల్పోతున్నా నాయకులకు ప్రమాదం ఎందుకు అర్థం కావటం లేదనే ప్రశ్న శారదను వేధిస్తోంది. ఈ సమయంలో, ఈ సందర్భంలో చేయదగిన పోరాటం ఇది కాదనే విషయం గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళను శత్రువులుగా ఎందుకు చూస్తున్నారు. పైనుంచి కిందివరకూ చర్చించటం లేదెందుకని? పోరాటం ఆపమన్న వాళ్ళను ప్రాణత్యాగాలకు భయపడే పిరికివాళ్ళలా చూసే ధోరణిని పెంచుతున్నదెవరు? సమాధానం లేని ప్రశ్నలు.
ప్రదర్శనలో అరెస్టు చేసిన వారిలో పదహారుమంది మీద కేసులు పెట్టి మిగిలిన వారిని షరతులతో విడుదల చేశారు. శారదను, సూర్యావతిని వెల్లూరు పంపి మిగిలిన వారిని బెజవాడలోనే ఉంచారు. కేసు విచారణ బెజవాడలోనే. విచారణకు బెజవాడ వెళ్ళేరోజు కోసం తహతహలాడుతూ ఒంటరితనంలో మగ్గిపోతోంది శారద.
బెజవాడలో కేసు విచారణకు ముందురోజే శారదను, సూర్యావతిని అక్కడికి చేర్చారు. ప్రయాణమంతా మౌనమే. ఇద్దరు మంచి మిత్రులు శత్రుత్వం లేకుండా మాట్లాడుకోకపోవటం శారదకు ఇంతవరకూ అనుభవంలో లేదు. శత్రువులతో సహితం మాట్లాడి వాళ్ళను ఎదిరించటమో, ఒప్పించటమో, మందలించటమో చేసే స్వభావం శారదది. బెజవాడలో శారదకు ప్రత్యేకంగా ఒక గది ఇచ్చారు. వద్దని అందరితో పాటు ఉంటానని అన్నా వినలేదు. తన గదిలోకి వెళ్తూ మిగిలినవారి వంక ఆశగా చూసింది శారద. అందరూ తలలు పక్కకు తిప్పుకున్నారు. శారద గుండెలో నొప్పి మొదలయింది. ఆ రోజు తిండీ నిద్రా లేకుండా నీళ్ళు కూడా రాని కళ్ళతో జైలు గోడలను చూస్తూ గడిపింది శారద. మర్నాడు పదిగంటల ప్రాంతంలో అందరినీ వ్యాను ఎక్కించారు. అందరినీ నవ్వుతూ పలకరించబోయింది శారద.
‘ఎలా ఉన్నారోయ్‌, అందరూ చిక్కిపోయారు. ఇక్కడి తిండి మీకెవరికీ సరిపడటం లేదల్లే
ఉంది. పిల్లలకు పాలైనా ఇస్తున్నారా జైలు వాళ్ళు’ అంటే కోటేశ్వరమ్మ ‘లేదు’ అని చిన్నగా అందో లేదో ఉమాదేవి ‘అనవసరమైన ప్రశ్నలకు ఎవ్వరూ జవాబివ్వక్కర్లేదు’ అని గట్టిగా అరిచింది. అందరి ముఖాలూ నల్లబడ్డాయి. శారదకు మొహం తిప్పేసి కూర్చున్నారు. గుండెల్లోకి రాబోతున్న కుంగుబాటుని బలంగా వెనక్కు నెట్టి ‘‘మీరు చేస్తున్నది సరి కాదోయ్‌’’ అని తనూ బైటికి చూస్తూ కూర్చుంది. కోర్టు విచారణ రొటీన్‌గా జరిగింది. నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వాయిదా. ఆ నాలుగు రోజులూ శారదకు, ఆమె స్నేహపూరిత స్వభావానికీ సవాలు.
సుబ్బమ్మ చూస్తానికి వస్తానంటే ఒద్దంది. హాస్పిటల్‌లో పనిచేసిన మంగమ్మ, సుందరమ్మ వచ్చారు.
శారదను చూసి ఒకటే ఏడుపు. వారిని సముదాయించటం శారదకు కష్టమైపోయింది. నవ్వించి, బతిమాలి, బెదిరించి వాళ్ళ ఏడుపుని ఆపి విషయాలన్నీ కనుక్కుంది.
సుబ్బమ్మ ఆరోగ్యం బాగోలేదు. కానీ ఆమె ధైర్యంగానే ఉంది. పోలీసులు హాస్పిటల్‌ మొత్తం ఎట్లా ధ్వంసం చేశారో చెప్తూ మళ్ళీ ఏడవసాగారు. వాళ్ళను సముదాయించి పంపి జైలర్‌తో మాట్లాడాలని బయటికి వచ్చింది.
సూర్యావతికి ఆరోగ్యం బాగోలేదనీ, హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలనీ నలుగురు జైలరు చుట్టూ చేరి అడుగుతున్నారు. జైలరు వాళ్ళ మాట వినిపించుకోకుండా ‘అవసరమైనప్పుడు మేం తీసుకువెళ్తాం మీరు చెప్పాల్సిన అవసరం లేద’ని తీసి పారేసినట్లు మాట్లాడుతున్నాడు.
‘మిస్టర్‌… వీళ్ళంతా సమాజంలో గౌరవంగా బతికే కుటుంబాల నుండి వచ్చినవాళ్ళు. మీరు ఎట్లా అంటే అట్లా మాట్లాడితే మీ సంస్కారమే బయటపడుతుంది. గౌరవం ఇచ్చి పుచ్చుకోవటం తెలియదా మీకు? నేను డాక్టర్‌ని. ఆమెను ముందు నేను చూసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలో లేదో చెబుతాను’ అంటూ సూర్యావతిని ఉంచిన గదిలోకి వెళ్ళింది. కోటేశ్వరమ్మ, రాజమ్మ, కమల, సుగుణ ఆమె వెనకాలే వెళ్ళారు.
‘‘ఉమాదేవి లేదు నయం. ఉంటే గొడవ చేసేది. సూర్యావతిని చూడనిచ్చేది కాదు’’ అంది రాజమ్మ.
మిగిలినవాళ్ళు ఔనన్నట్లు తలలూపారు.
శారద సూర్యావతి దగ్గరకు వెళ్ళేసరికి ఆమె ఒళ్ళు తెలియకుండా నిద్రపోతోంది. నుదుటి మీద చెయ్యివేసి చూస్తే వేడిగా ఉంది. తన గదిలోకి వెళ్ళి థర్మామీటర్‌ తెచ్చి రాజమ్మకిచ్చి ‘‘నిద్ర లేచాక టెంపరేచర్‌ చూడండి. జ్వరం ఉంది. ఈ మందు వేసి నుదుటి మీద తడిగుడ్డ వేస్తూ ఉండండి. ముందు తడిగుడ్డ వేయండి. మెలకువ వచ్చాకనే చెప్పినట్లు చేయండి. మందు పడిన గంటలో జ్వరం తగ్గకపోతే నాకు చెప్పండి. హాస్పిటల్‌కి పంపి రక్తపరీక్షలు చేయిద్దాం’’ అని పదడుగులు వేసి మళ్ళీ వెనక్కు వచ్చి ‘‘సూర్యావతికి నేను వచ్చి చూశానని చెప్పకండి. జైలరు డాక్టర్‌ని పిలిపించాడని చెప్పండి’’ అని వెళ్ళిపోయింది.
మరుసటి వాయిదా రోజు కూడా శారదతో ఎవరూ మాట్లాడలేదు. కోర్టు దగ్గర వ్యాను దిగుతుంటే రాజమ్మ కూతురు విమలను ఎవరో తీసుకొచ్చారక్కడికి. రాజమ్మ కూతుర్ని ఎత్తుకుని ముద్దులు పెట్టి, ఏడుస్తున్న పిల్లను సముదాయించి గుండెలకు హత్తుకుంది. అందరి మనసుల్నీ కలచివేసింది ఆ దృశ్యం. శారదే రాజమ్మకు పురుడు పోసి ముందుగా ఆ పాపను హత్తుకుంది. ఆ వాత్సల్యం పొంగుకొచ్చింది శారద గుండెల్లో. ‘‘రాజమ్మా, నీ కూతురెంత బాగుందే. ఇలా ఇవ్వు’’ అంటూ చేతులు సాచింది.
రాజమ్మ సంతోషంగా పాపను శారద చేతులకందించింది. శారద ఆ పాపను గుండెలకు హత్తుకుని ముద్దుపెట్టి ‘రాజమ్మా’ అని ఏదో చెప్పబోతోంది. ఇంతలో ఉమాదేవి ఎక్కడినుంచి వచ్చిందో డేగలా వచ్చి శారద చేతిలోంచి పాపను లాక్కుని రాజమ్మ చేతుల్లో పెట్టి
‘‘రాజమ్మా నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా. అడ్డమైన వాళ్ళతో రాసుకు పూసుకు తిరుగుతావు. మనవాళ్ళు మనకు ఆదేశాలు పంపించారా లేదా? వాటి ప్రకారం నడుచుకుంటారా లేదా? లేకపోతే ద్రోహులతో కలిసిపోతారా? ఇంకోసారి ఇట్లాంటివి జరిగితే పార్టీకి రిపోర్టు చెయ్యాల్సి వస్తుంది’’ అని చరచరా అవతలి వైపుకి వెళ్ళిపోయింది. అందరూ నిర్ఘాంతపోయారు. కోటేశ్వరమ్మ కళ్ళవెంట నీళ్ళు కారాయి.
‘‘డాక్టర్‌గారి వయసు, అనుభవం, ఆమె మనసు, మంచితనం… ఎందులోనూ సమానం కాలేని ఉమాదేవి ఇట్లా మాట్లాడొచ్చా. పిల్లను ఎత్తుకున్నంత మాత్రాన కొంపలంటుకుంటాయా? ఉమాదేవికి ఇంత అధికారం ఎవరికిచ్చారు?’’ అంది రాజమ్మకే వినిపించేటట్లు.
‘‘ఎవరూ ఇవ్వలేదు. పార్టీ పేరుతో అధికారం చెలాయిస్తోంది. అట్లా చలాయించే వారే పార్టీకి అసలైన ప్రతినిధులని పార్టీ అనుకున్నంత కాలం ఉమాదేవి ఇట్లాగే మాట్లాడుతుంది’’ అంది రాజమ్మ.
శారద మనసు పూర్తిగా విరిగిపోయింది. ముక్కలు ముక్కలయింది.
మాట్లాడకుండా కోర్టు లోపలికి వెళ్ళి తన స్థానంలో కూర్చుంది.
ఈసారి విచారణ కొంత బాగానే సాగింది. నెల తర్వాత తీర్పు ఇస్తానన్నాడు మేజిస్ట్రేటు.
మళ్ళీ వెల్లూరు ప్రయాణం కమ్మన్నారు శారదను, సూర్యావతిని. సూర్యావతి జ్వరంతో నీరసించి ఉంది. ప్రయాణం చేయలేననీ, కొన్నాళ్ళు బెజవాడలోనే ఉంటాననీ అడిగితే అధికారులు ఒప్పుకోలేదు. జైల్లో ఉన్న స్త్రీలందరూ సూర్యావతికి అడ్డుగా నిలబడ్డారు. జైలు సిబ్బంది వాళ్ళను నెడుతూ, తిడుతూ సూర్యావతిని ముందుకు లాగుతున్నారు. శారద ప్రయాణానికి సిద్ధమై వచ్చింది. ఇదంతా చూసి ఆవేశంతో అటు పరిగెత్తింది. జైలు సిబ్బందిని అటూ, ఇటూ లాగి సూర్యావతికి అడ్డంగా నిలబడి, ‘‘ఖబడ్దార్‌, మా వాళ్ళమీద చేయి వేశారంటే మీరు ఉద్యోగాలలో ఉండరు. ఆవిడ నాలుగు రోజుల్నుంచీ జ్వరంతో ఉంది. మీరు హాస్పిటల్‌కి కూడా పంపలేదు. నేను మందులిచ్చి ఈ మాత్రం నిలబడేలా చేశాను. మీరామెను చంపదల్చుకున్నారా? నీరసించి ఉన్న రోగిని బెజవాడ నుంచి వెల్లూరు దాకా ప్రయాణం చేయమంటారా? దారిలో జ్వరం తిరగబెడితే, ఎమర్జెన్సీ వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? మీరు మనుషులేనా? మీకు మంచి మాటలు చెప్పిన వాళ్ళను కొడతారా? తిడతారా? రండి నన్ను కొట్టండి. నన్ను దాటి వచ్చి సూర్యావతి గారిని తీసుకెళ్ళండి.’’
శారద మాటలకు సిబ్బందంతా భయపడిపోయారు. అక్కడ్నుంచి వెళ్ళి జైలరుతో ఏం చెప్పారో మొత్తానికి సూర్యావతిని మరో నాలుగు రోజులు బెజవాడలో ఉంచేందుకు ఒప్పుకున్నారు.
సూర్యావతికి పాలు, పళ్ళు, మెరుగైన ఆహారం ఇస్తే తప్ప నాలుగు రోజులకైనా ఆమె కోలుకోదని చెప్పి ఇవ్వవలసిన ఆహారం, మందులు వేళ ప్రకారం కాగితాల మీద రాసి ఒక కాగితం జైలరుకి, ఒక కాగితం రాజమ్మకు ఇచ్చింది.
‘‘ధైర్యంగా ఉండండోయ్‌. సూర్యావతికొచ్చింది మామూలు జ్వరమే. కాస్త బలమైన తిండి పడితే నీరసం తగ్గిపోతుంది’’ అని చెప్పి తను వెళ్ళి వ్యానులో కూర్చుంది.
ఇది జరిగినంత సేపూ ఉమాదేవీ, మరో నలుగురూ చిటపటలాడుతూ ఉండటం శారదతో సహా అందరూ గమనించారు.
నర్సు లక్ష్మి, మంగమ్మలు సుబ్బమ్మను రైలు స్టేషన్‌కి తీసుకుని వచ్చారు.
తను కళ్ళనీళ్ళు పెట్టుకుంటే శారద తట్టుకోలేదనీ, ఎట్టి పరిస్థితులలోనూ తను ఏడవకూడదనీ సుబ్బమ్మ గట్టిగా నిర్ణయించుకుని వచ్చింది.
‘‘ఎట్లా ఉన్నావమ్మా’’ అని అడిగిన శారదకు
‘‘నాకేం. శుభ్రంగా తిని తిరుగుతున్నాను. నువ్వెట్లా ఉన్నావు. అక్కడి తిండీ, నీళ్ళూ సరిపడినట్లు లేవు. చిక్కిపోయావు, నల్లబడ్డావు.’’
‘‘జైలుకి వెళ్ళినవాళ్ళు చిక్కిపోకపోతే చాలామంది జైళ్ళకెళ్తారమ్మా. తిండి మరీ అన్యాయంగా లేదులే. అక్కడ నువ్వు లేవుగా’’.
‘‘నేను లేకపోతే ఏం. మన వాళ్ళంతా ఉన్నారుగా. వెల్లూరులో సూర్యావతి ఉందంటే నేనున్నట్టు కాదూ? ఇక్కడ అందరూ
ఉండనే ఉన్నారు. మీ పాటలు, మీటింగులు, సరదాలు దేనికీ లోటుండదని నాకు తెలుసులే’’.
‘‘అమ్మా! నటాషా, లావణ్య, పద్మ అందరూ ఎలా ఉన్నారు?’’
‘‘అక్కడ విమలత్త పిల్లలు ఈ పిల్లల ఈడు వాళ్ళేగా. అందరూ బాగున్నారు. జతగా జట్టుగా బడికెళ్తున్నారు. బాగా చదువుతున్నారట. మొన్కొక రోజు ఫోనులో మాట్లాడి నటాషా ‘అమ్మమ్మా అమ్మ వచ్చిందా? శలవల్లో నేనొచ్చేసరికి అమ్మని రమ్మని చెప్పు’ అంది. పిచ్చితల్లి, దానికేం తెలుసు మీ గొడవలు? మూర్తి కూడా వెల్లూరేగా?’’
‘‘ఆ… వారం వారం ఇంటర్వ్యూ దొరుకుతోంది. బాగానే ఉన్నాడు.’’
‘‘పాపం పార్టీ కుర్రాళ్ళంతా చచ్చిపోతున్నారే’’ అంటూ ఇక ఆపుకోలేక పెద్దగా ఏడ్చింది సుబ్బమ్మ.
‘‘తల్లిని రెండు చేతుల్తో దగ్గరకు తీసుకుని శారదా ఏడ్చింది.
‘‘బంగారం లాంటి కుర్రాళ్ళు. ఆడవాళ్ళనూ కాల్చేస్తున్నారు. ఇది మంచికి రాలేదు. ఇంతకింతా అనుభవిస్తారు ఈ కాంగ్రెస్‌ వాళ్ళు.’’
‘‘ఊరుకోమ్మా. అంతా సరవుతుంది. మేమంతా బైటికి వస్తాం. సరేనా?’’
‘‘సరేనమ్మా సరే. ఆరోగ్యం జాగ్రత్త. నా గురించీ, నటాషా గురించీ దిగులు పెట్టుకోకు. నువ్వన్నచోట నవ్వులే తప్ప దిగులుండదని నాకు తెలుసులే’’ అని బలవంతంగా నవ్వబోయి విఫలమైంది సుబ్బమ్మ.
రైలు కదిలే టైమయింది. ఎక్కమన్నారు పోలీసులు. మరొకసారి తల్లీ కూతుళ్ళు ఒకరినొకరు కళ్ళారా చూసుకున్నారు.
శారద వెళ్ళి రైలెక్కింది. లక్ష్మి, మంగమ్మ, సుబ్బమ్మకు చెరోవైపు నిలబడి నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్ళారు.
శారద వెల్లూరు చేరింది.
ఒంటరితనం. చుట్టూ మనుషులు లేని ఒంటరితనం కాదు. తనవాళ్ళంటూ ఎవరూ లేని ఒంటరితనం. మానసికమైన ఏకాకితనం.
వెలి ఎలా ఉంటుందో శారదకు ప్రత్యక్షంగా అనుభవమైంది. బ్రాహ్మణ కులంలో వెలి వెయ్యటం, ప్రాయశ్చిత్తాలు జరపటం, మళ్ళీ కలుపుకోవటం వీటి గురించి చిన్నప్పుడు తండ్రి చెప్పారు. పెద్దయ్యాక పుస్తకాల్లో చదివింది. రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మను వెలివేశారు బంధువులందరూ. వీరేశలింగం తాతయ్య వితంతు వివాహాలు చేయించేటప్పుడు అందరూ వెలివేశారు. ప్రాణ స్నేహితులు కూడా సమాజానికి భయపడి దూరమయ్యారు. ఎలా భరించారు వాళ్ళు ఆ దుర్మార్గమైన ఫ్యూడల్‌ పద్ధతిని. అదే పద్ధతిని కమ్యూనిస్టు పార్టీ ఎలా ఆచరిస్తోంది? వెలి… కులంతో వేళ్ళూనుకుని, ముడిపడిన పద్ధతి. తమ కులానికున్న ఏ మూర్ఖపు కట్టుబాటుని ప్రశ్నించినా, ఎదిరించినా, ఆచరించక పోయినా, తాము గీసిన లక్ష్మణ రేఖలలో ఏ రేఖను దాటినా కులపెద్దలు వెలి వేస్తారు. ఆ కుల ముద్ర పద్ధతిని కమ్యూనిస్టులూ అమలు చేయటమేమిటి? తన అభిప్రాయాలు రాసి పంపించింది. అవి పొరపాటైతే పొరపాటని మాట్లాడవచ్చు. సంభాషణ కొనసాగితే గదా మంచిచెడ్డలు బైటికొచ్చేది. పొరబడితే ఏవెలేనా? తనే సరిగా ఆలోచిస్తున్నదనీ, వారిది పొరపాటనీ తేలితే ఏం చేస్తారు? ప్రాయశ్చిత్తం ఎలా చేసుకుంటారు? ఏ బ్రాహ్మణ కులాచారం అమలుచేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు? తమ తోటి స్త్రీలను ఈ పొరపాటు అభిప్రాయాలతో ప్రభావితం చేస్తానని భయపడుతున్నారా? తన అభిప్రాయాలు చెప్పినంత మాత్రాన వాళ్ళు మారిపోతారా? రెండోవైపు ఒకటుందని తెలియకుండా చూపే విధేయతకో, కట్టుబాటుకో విలువేముంటుంది?
ఈ విషయాల గురించి వాళ్ళతో చర్చించవద్దని తనకు సూచించవచ్చు. అలా కాకుండా శారద ద్రోహి అనీ, ఆమెతో మాట్లాడవద్దనీ, తాకవద్దనీ తన సహచరులను ఆజ్ఞాపించటం ఏ విలువల ఆధారంగా జరిగింది? ఇందులో కరడుగట్టిన కులాచారం తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడుంది? శారద మనసు భగభగ మండుతోంది.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.