ఇక్కడ లత స్వభావంలో ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆమెకు తన పనిలో ఎవరయినా తప్పు చూపించే అవకాశం ఇవ్వటం ఇష్టముండదు. తన పనిలో తప్పు చూపించటం అంటే, తన తండ్రి శిక్షణలో లోపాన్ని ఎత్తి చూపించటం. అది తండ్రికి అవమానం. అందుకని
ఆమె తప్పు చేయకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది.”Sometimes I think people like Lataji, Ghalib, Beethoven and Shakespeare are far removed from the normal chain of human civilization. If they were first role models how come no one was able to achieve an iota of their perfection! They are intruders of the rule of mediocrity that prevails. Lathaji belog to a different league” అంటాడు జావేద్ అక్తర్ ఎలాంటి పొరపాట్లు లేకుండా, ఒకరు వేలెత్తి చూపించే అవకాశం లేకుండా పాడాలన్న లతా మంగేష్కర్ తపన, ఫలితంగా గానంపై సాధించిన సంపూర్ణమైన పట్టు గురించి.
ఆ కాలంలో హిందీ సినిమాలలో ఉర్దూ వాడకం అధికంగా ఉండేది. ఉర్దూ పదాలు సంభాషణల్లోనూ, పాటల్లోనూ అధికంగా వాడేవారు. అందుకే వాటిని ఉర్దూ, హిందీల కలగలుపు ‘హిందుస్తానీ’ సినిమాలు అనేవారు. అంతకుముందు ‘బడీ మా’ షూటింగ్ సమయంలో రచయిత జియా సర్హదీ, ఉర్దూ ఉచ్ఛారణను సరిచేసుకోమని ‘బేటా! జరా ఆప్ తలప్ఫుజ్ ఠీక్ కరో! తుమ్ మేరీ పాస్ ఆకర్ బైఠా కరో, మై తుమ్హే సహీ జుబాన్ సిఖావూంగా’ అన్నాడు. కానీ అప్పుడు అతని దగ్గర ఉర్దూ నేర్చుకునే తీరిక లతకు చిక్కలేదు. ఇప్పుడు దిలీప్‌కుమార్ అదే ప్రస్తావన తెచ్చి హేళన చేయడంతో లతకు పట్టుదల పెరిగింది. అదే రోజు సంగీత దర్శకుడు మహమ్మద్ షఫీ దగ్గరకు వెళ్ళి ఉర్దూ నేర్పించమని అడిగింది. ఆ సమయంలో అనిల్ బిశ్వాస్, నౌషాద్‌లకు మహమ్మద్ షఫీ సహాయ సంగీత దర్శకుడిగా
ఉండేవాడు. షఫీ లతకు మౌల్వీ ఉస్తాద్ మహబూబ్‌ను పరిచయం చేశాడు. ఆయన ఉర్దూ సాహిత్యాన్ని, షేర్ షాయరీని, గజళ్ళను లతకు పరిచయం చేశాడు, నేర్పించాడు. రికార్డింగ్‌కు, రిహార్సల్స్‌కు రైళ్ళలో వెళ్ళేటపుడు లత హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ సాహిత్యం చదువుతూ వెళ్ళేది. ఆ రకంగా, లత ఎటువంటి పాఠశాల చదువు, డిగ్రీలు లేకుండానే హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. శాస్త్రీయ సంగీతం, లలిత గీతాలు, సాహిత్యంలలో ప్రావీణ్యం సంపాదించడం లతను ఒక రకంగా ఇతర సమకాలీన గాయనీ గాయకుల కన్నా కొన్ని అడుగుల ముందు ఉంచిన అంశం.
1946లో ‘సుభద్ర’ అనే సినిమాకు లత పనిచేస్తుండేది. ఆ సినిమాలో నాయిక శాంతా అప్టే. ఆమె మాటలలో తాను తమిళ భాషలో పాటను రికార్డు చేశానని లతకు చెప్పింది. అప్పటికి లతకు పదిహేను, పదహారేళ్ళుంటాయి. శాంతా ఆప్టే మాటలు లత హృదయంలో తిష్ట వేసుకున్నాయి. భవిష్యత్తులో తానూ పలు భాషలలో పాటలు పాడాలని కోరిక కలిగింది. ఫలితంగా ఆమె దాదాపుగా 36 భాషలలో పాటలు పాడిరది. ఈ రకంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం, నిరంతరం దానికోసం శ్రమించటం, ఆ లక్ష్యసాధన కోసం సర్వశక్తులను కేంద్రీకరించి, ఇతర విషయాలన్నింటినీ విస్మరించటం లత విజయం సాధించటానికి ఎంతగానో దోహదపడిన అంశం.
లత సినీరంగంలో అడుగుపెట్టే నాటికి నేపథ్య గానం అభివృద్ధి చెందుతోంది. కానీ నటీనటులు తమ పాటలు తామే పాడుకోవడం పూర్తిగా అంతరించలేదు. ఎందుకంటే నేపథ్య గానానికి సౌకర్యం
ఉన్నా పాడేందుకు సరైన గాయనీ గాయకులు లేరు. అప్పటి గాయనీ గాయకులకు పాటలు పాడటంలో శిక్షణ అవసరమయ్యేది. మైకు ముందు నుంచుని పాడటం నేర్పించాల్సి వచ్చేది. గాయనీ గాయకులకు స్వరం బాగున్నా స్వరంపై నియంత్రణ ఉండేది కాదు. స్వరం భావాలు పలికినా పాట స్థాయిని పెంచే రీతిలో అలంకారాలు వేయగలిగేవారు కారు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ లేకపోవటం వారిలో ప్రధాన లోపం. దాంతో సంగీత దర్శకులు బాణీల సృజనలో పలు ప్రతిబంధకాలను ఎదుర్కొనేవారు. పలు సందర్భాలలో సంగీత దర్శకులు తామే పాటలు పాడేవారు. గాయకులు పాడిన పాటలు వారికి సంతృప్తినిచ్చేవి కావు.
అనిల్ బిశ్వాస్‌కు గాయకుడిగా ముకేష్ పరిచయమయ్యాడు. అతడికి అవకాశమివ్వాలని అనిల్ బిశ్వాస్ ప్రయత్నించాడు. కానీ ముకేష్ పాడిన పాట అతనికి సంతృప్తినివ్వలేదు. దాంతో ఆ పాటను తానే పాడాలనుకున్నాడు. అది ముకేష్‌కు నిరాశను కలిగించింది. ‘ఇక సంగీత దర్శకులే పాటలు పాడుకుంటే మాలాంటి నేపథ్య గాయకులకు అవకాశాలు ఎవరిస్తారు?’ అన్నాడు. అప్పటికే సంగీత దర్శకుడు సి.రామచంద్ర, చితల్కర్ పేరుతో పాటలు పాడుతున్నాడు. ముకేష్ అన్న మాటలు అనిల్ బిశ్వాస్‌కు సమంజసం అనిపించాయి. దాంతో నిర్మాత మాటను కాదని ‘పహలీ నజర్’ సినిమాలో ముకేష్‌తో ‘దిల్ జల్తా హై తో జల్నేదో’ అనే పాటను పాడిరచాడు. ఈ పాట ముకేష్‌కు గాయకుడిగా గుర్తింపునిచ్చింది. అంటే, అప్పటికే నేపథ్య గానం సినీరంగంలో ప్రవేశించినా, తమ పాటలు తామే పాడుకునే నటీనటులు అగ్రస్థానంలో ఉండడంతో నేపథ్య గానం అంతగా ప్రాచుర్యం పొందలేదు. సురయ్య ఆరంభంలో నేపథ్యంలో ఒక పాట పాడినా (మహ్తాబ్ అనే నటికి) తన పాటలు తానే పాడుకునేది. సురయ్య, నూర్జహాన్, సైగల్, సురేంద్ర, అశోక్ కుమార్ వంటి నటీనటులు అగ్రస్థాయికి చెందినవారు. తమ పాటలు తామే పాడుకోవటంతో నేపథ్య గాయనీ గాయకులకు అంతగా ప్రాధాన్యం లేని పరిస్థితి నెలకొని ఉండేది. అందుకే అప్పుడు రికార్డులపై గాయనీ గాయకులు పేర్లు ఉండేవి కావు.
1936లో రేడియో పనిచేయడం ప్రారంభించింది. గ్రామఫోన్ కంపెనీల గ్రామఫోన్లు సామాన్యులు కొనలేకపోయేవారు. వారికి రేడియోల్లోని పాటలు వినటమో, సినిమా మళ్ళీ మళ్ళీ చూడటమో తప్ప గత్యంతరం ఉండేది కాదు. రేడియోల్లో కూడా సినిమా పాటలను ప్రసారం చేయటం పాట ప్రాధాన్యం పెంచింది. పాటలు విని సినిమాలు చూడాలని తహతహలాడటం పాటల వ్యాపార విలువను పెంచింది.
లతా మంగేష్కర్‌కు రేడియో కొనాలని ఎంతో కోరికగా ఉండేది. రేడియో కొని ఆ రేడియోలో పాటల ప్రకటనలో తన పేరు వినాలని, తన గొంతు రేడియోలోంచి వస్తుంటే వినాలని ఆమెకు ఎంతో కోరికగా ఉండేది. అతి కష్టం మీద డబ్బులు జమ చేసుకుని రేడియో కొన్నది. ఎంతో ఆశగా రేడియో పెట్టుకుని పాటలు విందామనుకున్న లతా మంగేష్కర్‌కు రేడియోలో ప్రథమంగా వినిపించింది సైగల్ మరణవార్త. దాంతో ఆమెకు రేడియోపై ఆసక్తి చచ్చిపోయింది. ఎక్కువ ధర పెట్టి కొన్న రేడియోను మరుసటి రోజు తక్కువ ధరకు అమ్మేసింది. మళ్ళీ రేడియో ప్రసక్తి తేలేదు. అయితే సైగల్ మరణంతో, నేపథ్య సంగీతంకి ఉన్న పెద్ద అడ్డు తొలగిపోయింది. గాయకులకూ అవకాశాలు మెరుగయ్యాయి. కొత్త కొత్త నటీమణులు రంగ ప్రవేశం చేస్తుండడంతో గాయనిలకూ అవకాశాలు పెరిగాయి.
మారుతున్న ట్రెండ్‌ను సూచిస్తూ తన పాటలు తానే పాడుకునే నటిగా రంగప్రవేశం చేసిన అమీర్ బాయి కర్ణాటకి నటనకు స్వస్తి చెప్పి నేపథ్యగానం వైపు దృష్టి పెట్టింది. ఈమె నర్సీ భగత్ సినిమాలో, శంకర్‌రావ్ వ్యాస్ సంగీత దర్శకత్వంలో ‘వైష్ణవ జనతో…’’ పాట పాడి మహాత్మా గాంధీ ప్రశంసలు పొందింది.
‘రతన్’ సినిమాలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో హిట్ పాటలు పాడి ‘జొహ్రాబాయి అంబా లేవాలి’ హిట్ గాయనిగా పేరు పొందింది. రాజ్‌కుమారి కూడా ఆరంభంలో తన పాటలు తానే పాడుకుంటూ సినీరంగ ప్రవేశం చేసింది. ఈమె అంజాద్‌ఖాన్ తండ్రి జఖారియా ఖాన్ (జయంత్)తో కలిసి పలు చిత్రాలలో నటించింది. అయితే అందంగా, సన్నగా కనిపించేందుకు కష్టాలు పడటం నచ్చక నటన మాని నేపథ్య గానంపైనే దృష్టి కేంద్రీకరించింది రాజ్ కుమారి.
ఇలా, నటనతో సినీ జీవితం ఆరంభించిన వారు నేపథ్యగానం వైపు మళ్ళుతోంటే, శంషాద్ బేగం వంటి వారు ‘నేపథ్యగానం’ కోసమే సినీరంగంలో ప్రవేశించారు. నూతన గాయనీ గాయకులు ఇలా ఒకరొకరుగా సినిమా రంగంలో అడుగుపెడుతున్న సమయంలోనే భవిష్యత్తులో సినీ సంగీత ప్రపంచాన్ని రూపాంతరం చెందించే సంగీత దర్శకులు, గేయ రచయితలు, వాయిద్య కారులు ఒకరికొకరు తెలియకుండా ఒకరికొకరు పరిచయం లేకుండా సినీ రంగం వైపుకు వచ్చారు.
లత సినీరంగంలో అడుగు పెట్టేసరికి నౌషాద్ ‘అన్‌మోల్ ఘడీ’, ‘రత్తన్’ వంటి సూపర్ హిట్ సినిమాలతో అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందాడు. గులామ్ హైదర్, అనిల్ బిశ్వాస్, ఖేమ్‌చంద్ ప్రకాశ్ వంటి వారు సంగీత రంగంలో తన ప్రతిభను ప్రదర్శించి స్థిరపడ్డారు. దీనానాథ్ మధోక్, కిదార్ శర్మ, కవి ప్రదీప్ వంటి వారు గేయ రచనలో తమ ప్రతిభను ప్రదర్శించి అగ్రశ్రేణి గేయ రచయితలుగా పరిగణించబడుతున్నారు. వీరిలో కేదార్ శర్మ కవిగానే కాక, స్క్రిప్టు రచయితగా, దర్శకుడిగా కూడా గొప్ప పేరు పొందాడు. ‘చిత్రలేఖ’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు కేదార్ శర్మ. ఈ రకంగా ‘తొలి తరం’ సంగీత దర్శకులు, గేయ రచయితలు 1940 నుంచి 1950 వరకూ రాజ్యం చేశారు. వీరు రాజ్యం చేస్తున్న కాలంలోనే నూతన తరం రంగ ప్రవేశం చేసింది.
1943లో ఖేమ్ చంద్ ప్రకాశ్ ‘తాన్‌సేన్’ సినిమా పాటలతో సినీ ప్రపంచం ఉలిక్కిపడేటట్లు చేశాడు. ‘తాన్‌సేన్’ సినిమాకు ప్రతిధ్వని లాంటి సినిమా 1953 లోని ‘బెజుబావరా’. 1944లో సజ్జూద్ హుస్సేన్ ‘దోస్త్’ సినిమాతో సంగీత దర్శకుడిగా పేరు సంపాదించాడు. తొలి చిత్రంతోనే ’నూర్జహాన్’తో హిట్ పాటలు పాడిరచి అగ్రశ్రేణి సంగీత దర్శకుడి స్థాయి పొందాడు. అయితే సజ్జాద్ హుస్సేన్‌కి నూర్జహాన్ తర్వాత తన పాటకు ప్రాణం పోసేందుకు సరైన స్వరం లభించలేదు. దాంతో అతను సరైన నేపథ్య గాయని అన్వేషణలో
ఉన్నాడు, లత గొంతు విప్పే సమయానికి. 1942లో ‘సుఖీ జీవన్’ సినిమాతో స్వతంత్ర దర్శకుడిగా ఎదిగిన సి.రామచంద్ర సంప్రదాయ పద్ధతుల్లో ఒదగని వాడు. పాట హిట్ అవటానికి ప్రాధాన్యం తప్ప, అది ఏ రాగంలో ఉంది, రాగం ఎంత శుద్ధమైనది, పాశ్చాత్య బాణీతో కలిసిందా అన్నది సి.రామచంద్రకు అనవసరం. అలాగే పాటలో పదాలతో కూడా పట్టింపు లేదు ఆయనకు, ఆయన ఎవరి మాటా వినేవాడు కాదు. సి.రామచంద్రకు కె.ఎల్.సైగల్‌తో పాటలు పాడిరచే అవకాశం వచ్చింది. కానీ సైగల్ రీతి నచ్చక ఆ సినిమా వదిలేశాడు రామచంద్ర. ‘ఆయన సైగల్ అయితే నేను సి.రామచంద్రను’ అని వ్యాఖ్యానించాడు. అలాగే ‘షెహనాయి’ సినిమాలో ‘ఆనా మేరీ జాన్ సండే కి సండే’ పాటను మీనాకపూర్, శంషాద్ బేగంలతో పాడిరచాడు. ఆ పాట విని పాశ్చాత్య బాణీని హిందీ సినిమాల్లో వాడటాన్ని పలువురు నిరసించారు. సి.రామచంద్ర గురువు అనిల్ బిశ్వాల్ ఫోన్ చేసి నిరసన వ్యక్తపరుస్తూ ‘ఇదేమిటి?’ అనడిగితే ‘సూపర్‌హిట్ పాట’ అని సమాధానమిచ్చాడు. గులామ్ హైదర్ వద్ద సహాయ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నప్పుడు లత పాట విన్నాడితడు. భవిష్యత్తులో లత ఉత్తమ గాయనిగా స్థిరపడటంలో ప్రధాన పాత్ర పోషించాడు సి.రామచంద్ర.
1934లో ‘హీరేన్ బోస్’ సహాయంతో బొంబాయిలో అడుగుపెట్టిన అనిల్ బిశ్వాల్, 1935లో ‘ధరమ్ కీ దేవి’ సినిమాతో స్వతంత్ర సంగీత దర్శకుడయ్యాడు. 1937లో మహబూబ్ ఖాన్ సినిమా ‘జాగీర్దార్’తో హిట్ సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఔరత్ (1940), బహెన్ (1042) లతో అగ్రశ్రేణి సంగీత దర్శకుడయ్యాడు. 1943లో ‘కిస్మత్’ పాటలతో సినీ సంగీతంలో కొత్త ట్రెండ్ సృష్టించాడు. ముకేష్, తలత్ మహమద్ వంటి గాయకులకు మార్గదర్శనం చేశాడు. లతా మంగేష్కర్ అత్యుత్తమ గాయనిగా ఎదగటంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించాడు. ఇంతవరకూ ప్రస్తావించిన సంగీత దర్శకులు లతకన్నా ముందు సినీరంగంలో స్థిరపడ్డారు. వీరు లత స్వర మాధుర్యాన్ని గుర్తించి, భవిష్యత్తులో లత ఉత్తమ గాయనిగా ఎదగగలదన్న విశ్వాసంతో ఆమెకు అవకాశాలు ఇచ్చినవారు. మైకు ముందు నిలుచుని సరిగ్గా పాడటం దగ్గరనుంచి, భావాలను పలకటం, శబ్దం రాకుండా ఊపిరి పీల్చటం, పల్లవిని సరిగ్గా ఎత్తుకోవటం, పదాలను విరవటం, అలంకారాలు వేయటం వంటివి నేర్పినవారు. అంటే వజ్రాన్ని సానపెట్టి ధగధగ మెరిసేట్టు చేసినవారన్నమాట వీరు.
ఈ అత్యుత్తమ సంగీత దర్శకులు స్వేచ్ఛగా తమకు నచ్చిన గాయనిని ఎంచుకుని, తమకు నచ్చిన విధంగా బాణీలు రూపొందించి, తమకు నచ్చినట్టు పాటలను రూపొందించటంలో తోడ్పడిన ప్రధానమైన అంశం స్టూడియో పరిస్థితి తొలగి ఆ స్థానాన్ని డిస్ట్రిబ్యూటర్ల పద్ధతి ఆక్రమించటం. స్టూడియో పద్ధతిలో సంగీత దర్శకుడి స్వేచ్ఛ పరిమితం. ఒకోసారి స్టూడియోతో ఒప్పందంలో ఉన్న ఇతర సంగీత దర్శకులు కూడా జోక్యం చేసుకునేవారు. పైగా ప్రతీదీ స్టూడియో పెద్ద అనుమతి పొందాలి. కానీ స్టూడియో పద్ధతి పోయి పంపిణీదార్లపై ఆధారపడే వ్యవస్థ రావటంతో పంపిణీదారులను ఒప్పించి, పెట్టుబడి సాధించగల ప్రతివాడూ సినిమా నిర్మించే వీలు చిక్కింది. దాంతో స్టూడియోలకు కాంట్రాక్టు వల్ల బద్ధులైన సంగీత దర్శకులు స్టూడియోలను వదిలి స్వేచ్ఛగా, స్వతంత్ర సంగీత దర్శకులయ్యారు. అంటే ‘ఫ్రీలాన్స్’ సంగీత దర్శకులన్నమాట. ఇప్పుడు తమకు నచ్చిన వారిని ఎంచుకుని పాడిరచే స్వేచ్ఛ సంగీత దర్శకులకు లభించింది. ఎందుకంటే ఏ కళాకారుడికి ‘మార్కెట్’ ఉందో, ఆ కళాకారుడు ఉంటే పంపిణీదార్లు సులభంగా పెట్టుబడులు పెడతారు. దాంతో 1940 దశకం చివరలో అనేక నిర్మాణ సంస్థలు ఆరంభమయ్యాయి. కేదార్ శర్మ, అనిల్ బిశ్వాస్ వంటి వారు అంతవరకూ పనిచేస్తున్న స్టూడియోలను వదిలి ‘ఫ్రీలాన్స్’ సంగీత దర్శకులయ్యారు.
ఇలా కళాకారులు ‘ఫ్రీలాన్స్’ అవ్వటం వల్ల అందరికన్నా అధికంగా లాభం పొందింది లతా మంగేష్కర్. ఆమెకు ఏ స్టూడియోతో ఒప్పందం చేసుకోవలసిన అవసరం పడలేదు. స్టూడియోతో ఒప్పందం ఉంటే, ఆ స్టూడియోలోని సంగీత దర్శకులకే పరిమితమవ్వాల్సి వచ్చేది. కానీ ‘ఫ్రీలాన్స్’ అవ్వటంతో ఇప్పుడు ఏ సంగీత దర్శకుడితోనైనా కలిసి పనిచేసే అవకాశం లభించింది. డిస్ట్రిబ్యూటర్ల పద్ధతి వల్ల లాభం ఏమిటంటే, పాటలు ఎంత హిట్ అయితే, ఆ సంగీత దర్శకుడికి, గేయ రచయితకు, గాయనీ గాయకులకు అంత విలువ పెరుగుతుంది. వారుంటే పెట్టుబడులు సులభంగా వస్తాయి. ఎవరైనా గెలుపు గుర్రం మీదనే పందెం పెడతారు. ఆ కాలంలో ఇతరులెందరున్నా ‘గెలుపు గుర్రం’ గాయనిలు ఎవరో అందరికీ తెలుసు. అప్పటికే పాటల్లో సూక్ష్మ అంశాలను త్వరగా గ్రహిస్తుందని, బాణీని త్వరగా పడుతుందని, భావాలు అద్భుతంగా పలుకుతుందని, ఆమె స్వరం అందమైన నాయకుల ఆకారాలకు ఉద్దీపననిస్తుందని, ఆమె పాటలో ఇతరుల పాటల్లో లేని ప్రత్యేకమైన ఆకర్షణ ఏదో ఉందని అందరూ గ్రహించారు. అంతేకాదు ఆమె స్వరంలోని స్వచ్ఛత, తేనెలు చిలికే మాధుర్యం, అమృతమయమయిన భావం, స్వచ్ఛం, ఉత్తమం అయిన భారతీయ నారి ఆలోచనకు అతి దగ్గరగా ఉన్న భావన కలిగిస్తుంది. దాంతో ప్రతి పంపిణీదారు లత స్వరం ఉంటే పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంతో లతకు లాభించింది.
ఇంతలో పృథ్వీరాజ్ కపూర్ పెద్ద కొడుకు రాజ్ కపూర్ తన రెండవ సినిమా ‘బర్సాత్’ నిర్మాణం తలపెట్టటం, ఆ సినిమాకు సంగీత దర్శకులుగా శంకర్`జైకిషన్ అనే కొత్త సంగీత జంటను ఎంచుకోవటం, వీరిలో శంకర్`హుస్నలాల్ భగత్ రామ్ దగ్గర వాయిద్యకారుడిగా పనిచేస్తున్నప్పుడు లత స్వరం వినటం వల్ల ‘బర్సాత్’ పాటలు పాడేందుకు శంకర్`జైకిషన్‌లు లతను పిలవటంతో హిందీ సినీ గేయప్రపంచంలో ఒక ఉజ్వల సంగీత శకానికి నాందీ ప్రస్తావన జరిగింది. ఒక దశాబ్దం పాటు శంకర్`జైకిషన్, లతల కలయికలో పరమాద్భుతమైన సంగీత రస ప్రవాహం సినీ సంగీత ప్రపంచాన్ని ముంచెత్తింది, ఉర్రూతలూగించింది, స్వర్ణయుగంపై తెరతీసింది.
లతను అత్యుత్తమ సంగీత శిఖరాలు అధిరోహింపచేసి తాము అత్యున్నత సంగీత శిఖరాలు అధిరోహించారు శంకర్`జైకిషన్. అయితే ఇదంతా సాధ్యమయింది 1946 నుంచి 1949 వరకు లతతో పాటలు పాడిరచి ఆమె శిఖరారోహణకు శిక్షణనిచ్చి మార్గం సుగమం చేసిన సంగీత దర్శకుల వల్ల కాబట్టి 1946 నుండి 1949 వరకు లత పాడిన పాటలను విశ్లేషించాల్సి ఉంటుంది. ఇందులో కొట్టొచ్చినట్టు కనబడేదేమిటంటే ‘లత’ స్వరంలా అనిపించని ‘లత’ స్వరం. లత ఆరంభ పాటలు వింటే ఈ స్వరంలో గొప్పదనాన్ని గుర్తించటమే కాక, సినీ ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోగలిగే శక్తిని గుర్తించిన గులామ్ హైదర్‌కు నీరాజనాలర్పించాలనిపిస్తుంది. గులామ్ హైదర్ ఎంపికపై విశ్వాసముంచి లతకు అవకాశాలిచ్చి తమ సృజన విహంగాలతో లత స్వరాన్ని అలంకరించి వినీల విశాల విహాయసంలో విశృంఖలంగా విహరింపచేసిన ఖేమ్‌చంద్ ప్రకాశ్, అనిల్ బిశ్వాస్, హన్స్‌రాజ్ బహెల్ వంటి వారికి శతకోటి ప్రణామాలర్పించాలనిపిస్తుంది. ఒక శిల అందమైన శిల్పంగా రూపుదిద్దుకున్నట్టు నిరంతర సాధనతో, నిజాయితీతో, పరిశ్రమతో, నిత్యం విద్యార్థిలా లత ఒక్కో పాటతో ఒక్కో మెట్టు ఎదిగి, 1949 కల్లా ఇతర గాయనిలందరినీ క్రిందకు విడిచి అందనంత ఎత్తులకెదిగిన విధానాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. 1946 నుండి 1949 వరకూ లత పాడిన పాటలను విమర్శించాల్సి ఉంటుంది.
మేరీ నావ్ చలే ధీరే ధీరే
మేరా బాపు ఖేవియా, మేరా భయ్యా ఖేవియా
హో, మేరీ నావ్ చలే ధీరే ధీరే…
‘ప్రేమ్ నాథ్’ సంగీత దర్శకత్వంలో ‘చాంద్ సితారే’ సినిమాలో లత పాడిన సూపర్ హిట్ పాట ఇది. పాట బాణీ అత్యంత మధురంగా ఉంటుంది. అలలపై ఓ పడవ అతి నెమ్మదిగా ప్రయాణిస్తున్నట్టుంటుందీ పాట వింటుంటే. ఈ పాట 1948లో విడుదలయింది. పాట లతా మంగేష్కర్ పాడిరదని గుర్తుపట్టటం కష్టం కాదు. కానీ పాట వింటుంటే, లత స్వేచ్ఛగా కాక, మరెవరిలాగానో పాడాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. పాట వింటుంటే ఆ కాలం నాటి ఇతర గాయనీలు పాట పాడే విధానం గుర్తుకు వస్తుంది. పదాలు పలకటం, రాగాలు తీయటం, వాక్యం ముగించే విధానం వంటి విషయాలలో హఠాత్తుగా నూర్జహాన్ గుర్తుకు వస్తుంది, శంషాద్ బేగంలా అనిపిస్తుంది. రాజ్ కుమారి, కానన్ దేవిలు పాడినట్టు పాడాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది.
సినిమా విడుదలయిన తేదీ ఆధారంగా పాటను పాడిన సంవత్సరాన్ని నిర్ణయిస్తారు. 1948లో పాట ‘చాంద్ సితారే’ సినిమాలో పాడిరదని అంటారు. కానీ ఈ పాట అంతకు ఓ సంవత్సరం, రెండు సంవత్సరాల ముందు రికార్డయి ఉండవచ్చు. సాధారణంగా, మన సినిమాలలో పాటలు ముందే రికార్డయిపోతాయి. స్క్రిప్టు తయారీ దశలోనే పాటలు ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తారు. అక్కడి నుంచీ గేయ రచయిత, సంగీత దర్శకుడి పని ప్రారంభమవుతుంది. సందర్భాన్ని, నటీనటులను ఆధారంగా చేసుకుని బాణీలు సృజించి పాటను ఎవరు పాడితే బాగుంటుందో నిర్ణయిస్తారు. గాయనీ గాయకులను నిర్ణయించటంలో అనేక అంశాలు పరిగణనలోకి వస్తాయి.