అంతః సౌందర్యం, బాహ్య సౌందర్యం బెల్‌ హుక్స్‌

అనువాదం:ఎ. సునీత
స్త్రీల శరీరాల పట్ల సమాజంలో ప్రబలిపోయిన సెక్సిస్టు ఆలోచనా తీరుని సవాలు చేయటంలో సమకాలీన స్త్రీ వాద ఉద్యమం ప్రభావశీల పాత్ర పోషించింది. స్త్రీ విముక్తి ఉద్యమం రాక ముందు ఆడవాళ్ళందరూ… వయసులో ఉన్నవాళ్ళుÑ వయసు మీద పడిన వాళ్ళు,

అందరూ… కేవలం శరీర రూపం, ముఖ్యంగా మగవాళ్ళ కళ్ళకి అందంగా కనిపిస్తారా, లేదా అన్న విషయంపై మాత్రమే స్త్రీల విలువ ఆధారపడుతుందనే సెక్సిస్టు విలువలోనే పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఆరోగ్యకరమైన ఆత్మ విశ్వాసం, తమపై తాము ప్రేమ పెంచుకోకపోతే స్త్రీలకి విముక్తి అసాధ్యం అన్న విషయం అర్థమైన స్త్రీ వాద ఆలోచనా పరులు మన శరీరాల గురించిన మన అనుభూతులు, ఆలోచనలను విమర్శనాత్మకంగా పరిశీలించి మార్పు కోసం అవసరమైన నిర్మాణాత్మక వ్యూహాలను రూపొందించారు.
బ్రా వేసుకోవటం సౌకర్యంగా ఉంటుందా లేదా అన్న దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు అని నేర్చుకున్న 30 ఏళ్ళ తర్వాత నేను తిరిగి చూసుకుంటే అసలు అటువంటి సందర్భం రావటమే ఎంత మహత్తర విషయం కదా అని అనిపిస్తుంది. అప్పటివరకూ స్త్రీల శరీరాల్ని స్వేచ్ఛగా కదలకుండా కట్టిపడేసిన బ్రాలు, బెల్టులు, కోర్సెట్లు వంటి అనేక అనారోగ్యకరమైన, అసౌకర్యమైన, బట్టలను వదిలించుకోవటం చాలా రాడికల్‌ మార్పు. స్త్రీలు ఈ క్రమంలో పితృస్వామ్య నియంత్రణ నుండి తమ ఆరోగ్యాన్ని, శరీరాలని తిరిగి తమ నియంత్రణ లోనికి తెచ్చుకుని కొత్త కొత్త ఆచారాలతో మళ్ళీ వాటికి జీవం పోసారు. అనారోగ్యకరమైన, అసౌకర్యమైన బట్టలు మాత్రమే వేసుకుంటూ పెరిగి పెద్దయిన అనుభవం లేని ఈ తరం స్త్రీలకి ఇదంతా అర్థం కాకపోవచ్చు కానీ అప్పటి తరం స్త్రీలకి తమ శరీరాల్ని తిరిగి తమ నియంత్రణ లోనికి తెచ్చుకోవటం ఒక మహత్తర ఘటనేనని మేము చెప్పినప్పుడు మమ్మల్ని నమ్మండి.
అన్ని సందర్భాల్లో స్త్రీలు సౌకర్యవంతమయిన బట్టలు వేసుకోవటం స్త్రీ వాదం ద్వారా కొత్త ఆచారమయింది. తమ విధుల్లో భాగంగా ఎప్పుడూ వంగి పనిచేయాల్సిన స్త్రీలకి ప్యాంట్లు వేసుకోగలగటం ఒక అద్భుతంగా అనిపించింది. డ్రస్సులు, స్కర్టులతో ఎప్పుడూ సౌకర్యవంతంగా మెలగని స్త్రీలకి ఈ మార్పులు కొత్త ఉత్తేజాన్నిచ్చాయి. చిన్నప్పటి నుంచి ఏది కావాలంటే అది వేసుకునే స్వేచ్ఛ అనుభవించిన ఈ తరం అమ్మాయిలకి ఇదంతా చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ అప్పుడు స్త్రీ వాదాన్ని రెండు చేతులతో అందుకున్న అనేకమంది వయోజనులైన స్త్రీలు నడకలో తీవ్ర అసౌకర్యం కలిగించే ఎత్తు మడమల చెప్పుల్ని వేసుకోవటం మానేశారు. త్వరలోనే చెప్పుల కంపెనీలు తక్కువ ఎత్తుతో, సౌకర్యవంతంగా ఉండే చెప్పుల్ని తయారు చేయటం మొదలు పెట్టాయి. ముఖానికి తప్పనిసరిగా మేకప్‌ వేసుకోవాలనే సెక్సిస్టు ఆచారాన్ని తుంగలో తొక్కి అద్దంలో కనిపించే తమ ముఖాన్ని ఉన్నదున్నట్లు అంగీకరించటం నేర్చుకున్నారు.
స్త్రీ వాదులు బట్టలు, శరీరం గురించి తెచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రకృతి సిద్ధంగా లభించిన తమ శరీరాన్ని సహజ స్థితిలో ఇష్టపడొచ్చని, ప్రేమించవచ్చని స్త్రీలకి తెలియచేశాయి. ఒక స్త్రీ తనంతట తాను కోరుకుంటే తప్ప ఆమె శరీరానికి వేరే అలంకరణలేవీ అవసరం ఉండవని నేర్పాయి. ఫ్యాషన్‌, కాస్మొటిక్‌ పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టిన మదుపుదారులు ఈ స్త్రీ వాదం తమ బిజినెస్‌నంతా పాడు చేసేస్తుందేమోనని భయపడ్డారు. స్త్రీ వాదులంటే పెద్ద సైజులో, మగవాళ్ళలా కనిపించే ఆడవాళ్ళని, లేదా చూడడానికి అసహ్యంగా ఉండే ముసలి వాళ్ళని ప్రచారం చేస్తూ స్త్రీ విముక్తి ఉద్యమాన్ని నీరుకార్చటానికి పెద్ద ఎత్తున మీడియా దాడి ప్రారంభించారు. వాస్తవానికి స్త్రీ వాద ఉద్యమంలో పాల్గొన్న స్త్రీలందరూ అనేక రకాల సైజులు, షేపుల్లో ఉండేవాళ్ళు. వారిది భిన్నత్వం, వైవిధ్యంతో కూడిన ఒక గుంపు. ఒకరితో ఒకరు పోటీ పడకుండా, ఒకరి మీద ఒకరు తీర్పులిచ్చుకోకుండా భిన్నత్వాన్ని ఆస్వాదించగలగటం ఎంతో ఉద్వేగాన్నిచ్చేది. స్త్రీ వాద ఉద్యమం ప్రారంభంలో అనేకమంది కార్యకర్తలు ఫ్యాషన్‌, శరీర రూపం విషయంలో ఆసక్తిని వదిలేసుకున్నారు. కానీ వాళ్ళు మేకప్‌, కుచ్చుల బట్టల్లో ఆసక్తి కనపరిచే స్త్రీలని భయంకరంగా విమర్శించేవాళ్ళు. ఆ సమయంలో అనేకమంది స్త్రీలకి అసలిలా ఎంపిక చేసుకునే అవకాశం ఉండటమే ఉత్తేజాన్నిచ్చేది. అవకాశం వస్తే హాయిగా, సౌకర్యంగా ఉండటానికే ఇష్టపడేవాళ్ళం. అయితే సౌందర్యాభిలాష, దుస్తుల స్టైల్‌ పట్ల ఉండే ఆసక్తి, అలాగే సౌకర్యం, సౌలభ్యం కావాలనే కోరిక రెండిరటినీ కలపటం స్త్రీలకి అంత సులభతరం కాలేదు. ఫ్యాషన్‌ పరిశ్రమని భిన్న రకాల దుస్తుల్ని తయారుచేయాలని (అప్పటికి పూర్తిగా పురుషాధిపత్యంలో ఉన్న పరిశ్రమ అది) డిమాండు చెయ్యాల్సి వచ్చింది. స్త్రీల పత్రికలూ మారాయి (స్త్రీ వాద కార్యకర్తలు గంభీరమైన విషయాల గురించి మరిన్ని రచనలు రావాలని, రచయిత్రులు ఉండాలని డిమాండ్‌ చేశారు.) మన దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి స్త్రీలు వినియోగదారులుగా తమకున్న డాలర్ల శక్తిని గురించి, దాన్ని స్త్రీలకు అనుకూలమైన మార్పుల కోసం వాడొచ్చని గుర్తించారు.
సెక్సిస్టు ఫ్యాషన్‌ పరిశ్రమని సవాలు చేసిన సమయంలోనే మన శరీర రూపం పట్ల మనకుండే తీవ్ర నిమగ్నత (అబ్సెషన్‌) బాధాకరమయిన రుగ్మత (అడిక్షన్‌) స్థాయిలో ఉంటోందని, అది జీవితేచ్ఛనే నమిలేస్తోందనే విషయాన్ని గుర్తించి, పరిశీలించుకునే సందర్భం కూడా మొదటిసారి ఏర్పడిరది. స్వయం నియంత్రణ లేకుండా తినటం, అలాగే పొట్ట మాడ్చుకోవటం రెండూ పెద్ద ఎత్తున జరుగుతున్నాయనే విషయం బయటికొచ్చింది. ఇవి రెండూ రెండు రకాల శరీర రూపాలని తయారు చేసినప్పటికీ, ప్రాణాంతకమైన ఈ వ్యసనాలకు మూలం ఒక్కటే. సెక్సిస్టు వైద్య వ్యవస్థ ఈ రెండు సమస్యలని పట్టించుకునేలా స్త్రీ వాద ఉద్యమం కృషి చేసింది. మొదట్లో వైద్య వ్యవస్థ ఈ స్త్రీ వాద విమర్శని పక్కన పడేసింది. కానీ స్త్రీ వాదులు స్వంతంగా ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించి స్త్రీలే కేంద్రంగా, వారికి అనుకూలించే ఆరోగ్య సేవలందించడం మొదలు పెట్టినపుడు, ఫ్యాషన్‌ పరిశ్రమకు పట్టిన గతే తమక్కూడా పడుతుందని ఆరోగ్య వ్యవస్థకి అర్థమయింది. డాలర్లు ఖర్చు పెట్టగలిగిన మహిళా వినియోగదారులు తమ శరీరాలను గౌరవంతో, శ్రద్ధతో చూసుకుని మెరుగైన సంరక్షణ, సౌలభ్యం లభించే ఈ ఆరోగ్య కేంద్రాలకు పెద్ద ఎత్తున మళ్ళే అవకాశం ఉందనే అవగాహన వైద్య వ్యవస్థకి కలిగింది. స్త్రీ వాద ఉద్యమం వల్లే స్త్రీల శరీరాలు, ఆరోగ్య సంరక్షణ గురించి వైద్య వ్యవస్థలో అనుకూల మార్పులు వచ్చాయి. స్త్రీలకందించాల్సిన వైద్య సేవల గురించి, స్త్రీల శరీరాల్ని, ఆరోగ్య సమస్యలని శ్రద్ధగా పట్టించుకోవటం గురించి ఇప్పటికీ స్త్రీలు వైద్య పరిశ్రమని సవాలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో స్త్రీ వాద రాజకీయాలకి పెద్ద ఎత్తున సామాన్య స్త్రీల మద్దతు కూడా లభించింది. వారిలో చాలామంది స్త్రీవాదాన్ని సమర్థించే వాళ్ళు కారు. గైనకాలజీ సమస్య గురించి, ముఖ్యంగా స్త్రీలని బాధించే కాన్సర్‌ల గురించీ (రొమ్ము కాన్సర్‌), ఇటీవల కాలంలో గుండె జబ్బుల గురించీ వైద్య వ్యవస్థని బాగానే కదిలించింది. స్త్రీలలో ఉండే తిండి గురించిన రుగ్మతల్ని రూపుమాపటానికి జరపాల్సిన యుద్ధం స్త్రీ వాదం ఇప్పటికీ ఆపలేదు. ఎందుకంటే మన దేశంలో అన్ని వయసుల స్త్రీలనీ శరీర రూపాన్ని బట్టి విలువకట్టే రుగ్మత ఇప్పటికీ బలంగానే ఉంది. మన సాంస్కృతిక కల్పనా శక్తిని అది తన గుప్పెట్లో పెట్టుకుంది. 1980లకు అనేకమంది స్త్రీలు స్త్రీ వాదం నుండి దూరం జరగటం మొదలుపెట్టారు. స్త్రీవాద ఉద్యమాల ప్రయోజనాలు అందరికీ అందుతున్నప్పటికీ, చాలామంది స్త్రీలు మళ్ళీ సెక్సిస్టు భావజాల పరిధిలోని శరీర సౌందర్య భావనల వైపు మళ్ళటం మొదలుపెట్టారు. స్త్రీ వాద ఉద్యమం ప్రారంభంలో 20ల వయసులో ఉన్న స్త్రీలు 1980లు వచ్చేటప్పటికి 40లు, 50ల వయసులోకి వచ్చారు. స్త్రీ వాద ఉద్యమం వయసు మళ్ళటాన్ని కొంతమేరకు వారికి అనుకూల అనుభవంగా మార్చింది కానీ పితృస్వామ్య వ్యవస్థలో వయసు మళ్ళటం, ముఖ్యంగా పిల్లలని కనే వయసు దాటిపోవటం వంటి వాస్తవాలు వారికి కూడా కఠినంగా పరిణమించి పాత సెక్సిస్టు భావజాల పరిధిలోని స్త్రీ సౌందర్య భావనల వైపు తిరిగారు.
మన దేశ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా అనేకమంది 40ల వయసులో ఉన్న స్త్రీలు పురుష భాగస్వామ్యం లేకుండా జీవిస్తున్నారు. పురుషులని ఆకర్షించటం కోసం వాళ్ళు తమకంటే చిన్నవాళ్ళయిన యువతులతో పోటీ పడవలసి వస్తోంది. ఆయా యువతులు స్త్రీ వాదులు కారు, కాబోరు కూడా. పురుషులని ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే సెక్సిస్టు భావజాలంలో రూపొందిన సౌందర్య ప్రమాణాలను వాళ్ళు కూడా అనుకరించటం మొదలుపెట్టారు. తెల్ల జాత్యహంకార పెట్టుబడిదారీ పితృస్వామ్య ఫ్యాషన్‌, కాస్మొటిక్‌ పరిశ్రమకి ఈ రకమైన సెక్సిస్టు సౌందర్య ప్రమాణాలను మళ్ళీ గ్లామరైజ్‌ చేయడం బాగానే పనికొచ్చింది. మాస్‌ మీడియా కూడా ఈ ధోరణులనే అనుకరించింది. సినిమాలు, టెలివిజన్‌, బహిరంగ ప్రకటనల్లో పుల్లల్లాంటి, సన్నటి, పచ్చటి రంగు జుట్టుతో ఉన్న స్త్రీల (ఒక్కసారి కూడా మంచి భోజనం తిని ఎరుగని మొహాలు) బొమ్మలు అందమైన స్త్రీల శరీరానికి ప్రతినిధులయ్యాయి. ఇరవయ్యేళ్ళ క్రిందట స్త్రీ వాద ఉద్యమం తెచ్చిన ప్రగతి, మార్పునంతా వెనక్కి తిప్పుతామంటూ సెక్సిస్టు సౌందర్య ప్రమాణాలను కసిగా ప్రాబల్యంలోకి తెస్తున్నాయి.
ఆడవాళ్ళకి తిండి గురించిన రుగ్మతల పట్ల అవగాహన ముందటి కంటే బాగానే పెరిగింది కానీ ఇప్పటికీ చిన్నవయసు వారి నుండి, వృద్ధులైన ఆడవాళ్ళ వరకూ ఇటువంటి రుగ్మతలతో బాధపడే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇప్పుడు అనొరెక్సియా అందరికీ తెలిసిన జబ్బు. పుస్తకాలలో, సినిమాలలో దీని గురించిన చర్చ ఉంటోంది. కానీ వీటిల్లో ఏవీ కూడా ఆడవాళ్ళని తమ యోగ్యత, విలువ, అందం అన్నీ కూడా తామెంత సన్నగా ఉన్నామనే దానిమీద ఆధారపడుతాయనే నమ్మకం నుండి బయట పడెయ్యలేకపోతున్నాయి. ఇప్పుడు ఫ్యాషన్‌ మ్యాగజైన్లు పాఠకులకి అత్యంత సన్నగా ఉండే యువ శరీరాలు మాత్రమే అందం, ఆకర్షణకి ప్రతీకలని బలంగా చూపిస్తూ, అనొరెక్సియా తెచ్చే ప్రమాదం గురించి ఒక వ్యాసం కూడా ప్రచురిస్తున్నాయి. ఇటువంటి గందరగోళ సందేశాలు స్త్రీవాద రాజకీయాలతో ఏ పరిచయం లేని ఆడవారికి అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఈ మధ్యనే మళ్ళీ మొదలైన కొన్ని స్త్రీ వాద ప్రయత్నాలు స్త్రీల శరీరాలు సహజసిద్ధమైన అందాన్ని కలిగుంటాయని చెప్పటం మొదలుపెట్టాయి. తమ శరీరం విషయంలో ఇప్పటి బాలికలు, తరచుగా స్త్రీ వాద ఉద్యమం రాకముందు స్త్రీలలో నిండిపోయి ఉన్న ఆత్మ ద్వేషాన్ని కనబరుస్తున్నారు. స్త్రీ వాద ఉద్యమం స్త్రీల కోసం అనేక రకాల మ్యాగజైన్లు ముందుకు తెచ్చినప్పటికీ, ఏ స్త్రీ వాద ఫ్యాషన్‌ మ్యాగజైన్‌ కూడా సెక్సిస్టు సౌందర్య ప్రమాణాలకు ప్రత్యామ్నాయంగా ఆడవాళ్ళందరి కోసం సౌందర్యం గురించిన ప్రమాణాలను తయారు చేయలేకపోయింది. సెక్సిస్టు సౌందర్య ప్రమాణాలను విమర్శించి ఆ తర్వాత ప్రత్యామ్నాయాలను తయారు చేయకుండా వదిలేస్తే మన ప్రయత్నం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. విమర్శ చేసినంత మాత్రాన మార్పు రాదు. నిజం చెప్పాలంటే శరీర సౌందర్యం పట్ల వచ్చిన స్త్రీ వాద విమర్శ ఆరోగ్యవంతమైన శరీరమంటే ఎలా ఉండాలి అనే విషయం గురించి ఆడవాళ్ళని కొంత గందరగోళంలో పడేసింది.
మధ్య వయస్కురాలైన నేను ఈ మధ్య విపరీతంగా బరువు పెరుగుతున్నాను. నా శరీరం పట్ల సెక్సిస్టు భావజాలం ప్రేరేపించే ఆత్మ ద్వేషం పెంచుకోకుండా బరువు తగ్గాలనుకుంటున్నాను. చీపురు పుల్లల్లా ఉండే బాలికల కోసం రూపొందించిన ఫ్యాషనబుల్‌ బట్టలు మాత్రమే మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉండడంతో, వయసుతో సంబంధం లేకుండా స్త్రీలందరూ తమ శరీరాల గురించి తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు. తమ ఎముకలపై ఏ మాత్రం మాంసం ఉన్నా వారికది పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. కొన్ని దుకాణాలు అన్ని సైజుల్లో ఉండే స్త్రీలకి బట్టలు రూపొందిస్తున్నప్పటికీ, అవి మార్కెట్లో లభించే చవక బట్టల కంటే ఖరీదెక్కువ ఉంటున్నాయి. ఈ రోజుల్లో ఫ్యాషన్‌ మ్యాగజైన్లు మళ్ళీ మా చిన్నప్పటి రోజుల్ని గుర్తుకు తెస్తున్నాయి. వాటిల్లో రాసే వాళ్ళందరూ మగవాళ్ళే. స్త్రీ వాద దృక్పథంతో రాసేవి వెతికినా కనిపించట్లేదు. అన్ని ఫ్యాషన్లు సెక్సిస్టు ఆలోచనలకి లోబడే ఉంటున్నాయి. మనం ఈ మార్పులని బహిరంగంగా గుర్తించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే పరిపక్వత వచ్చిన అనేకమంది స్త్రీ వాదులు స్వేచ్ఛగా తమకు కావలసిన జీవితాన్ని ఎంచుకుని, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ సౌందర్య నమూనాలని వెతుక్కుంటున్నారు. అయితే మనం సెక్సిస్టు సౌందర్య ప్రమాణాలను పూర్తిగా అంతమొందించే ప్రయత్నాన్ని వదిలేస్తే ఇంతవరకూ మన శరీరాల్ని, మనల్ని ఉన్నదున్నట్లు ప్రేమించగలగటానికి మనం చేసిన ప్రయత్నాలన్నీ మట్టికొట్టుకు పోతాయి. ఆడవాళ్ళందరికీ స్తీల శరీరాల పట్ల సెకిస్టు సౌందర్య ప్రమాణాల వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలిసినప్పటికీ, ఆయా ప్రమాణాలను తుడిచి పెట్టటానికి, ఆ ప్రమాదాల్ని నివారించటానికి, ప్రత్యామ్నాయాలను సృష్టించటానికి మనం తగినన్ని ప్రయత్నాలు చెయ్యట్లేదు.
పితృస్వామ్య విలువలతో నిండిపోయిన సౌందర్య పరిశ్రమ ప్రాబల్యాన్ని మనం పట్టించుకోకుండా వదిలేశాం కాబట్టి, స్త్రీ వాద ఆలోచనాపరులు కూడా అందం, అలంకారం రెండిరటి విలువలనీ గుర్తిస్తారని ఈ తరంలోని చిన్న వయసు అమ్మాయిలకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఆడవాళ్ళకి అందంగా కనబడాలని ఉండే ఇచ్ఛని తృణీకరించిన కొన్ని కరడుకట్టిన స్త్రీ వాద ధోరణుల వల్ల, స్త్రీ వాద రాజకీయాలు దెబ్బతిన్నాయి. ఈ ధోరణి ఇప్పటి స్త్రీ వాదుల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ, మీడియా మాత్రం ఈ ధోరణినే స్త్రీ వాద ఆలోచన అని ప్రచారం చేస్తోంది. స్త్రీ వాదులు తిరిగి ఫ్యాషన్‌, సౌందర్య పరిశ్రమపై దృష్టి సారించి, ఈ రంగంలో మళ్ళీ కొనసాగగలిగే విప్లవ ధోరణులను సృష్టించగలిగితేనే మన స్వేచ్ఛ కూడా మనకి దక్కుతుంది. లేకుంటే మన శరీరాల్ని ఎలా ప్రేమించుకోవాలో తెలుసుకోగలిగే అవకాశాలన్నీ కోల్పోతాం.

`

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.