వ్యవసాయంలో మహిళలపై హింస – మకాం, ఫెమినిస్ట్‌ పాలసీ కలెక్టివ్‌ అధ్యయనం -మకాం

భారతదేశంలో వ్వవసాయ రంగంలో మహిళలు గణనీయమైన భాగంగా పనిచేస్తున్నారు, కానీ వారికి రైతులుగా గుర్తింపు లేదు, ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయము అందటం లేదు. మహిళా రైతుల భాగస్వామ్యం, దోహదం ఎక్కువగా ఉన్నప్పటికీ వారు నిత్యం వివక్ష, హింస, వేధింపులను ఎదుర్కొంటున్నారు. వేతనాలలో స్త్రీ, పురుషుల మధ్య తీవ్రమైన

వివక్ష, భూమి హక్కులు, నీటి హక్కులు, సంస్థాగత రుణాలు, వ్యవసాయ ఉత్పాదకాలు, మార్కెట్లు, విస్తరణ సేవలు… ఇలా అన్నింటిలోనూ వివక్ష కొనసాగుతోంది. దీంతో పాటు వారు పని స్థలంలో సర్వత్రా వేధింపులు, హింస ఎదుర్కోవలసి వస్తోంది. అది వారి సామాజిక, ఆర్థిక సంక్షేమం పైన ప్రతికూల ప్రభావం కలిగిస్తోంది, అవకాశాలు అందకుండా అడ్డుకుంటోంది. పని స్థలాలలో మహిళలపై లైంగిక హింస చట్టం, 2013 వచ్చి దాదాపు పది సంవత్సరాలు గడుస్తున్నా దాని గురించి కొంతవరకు పట్టణ ప్రాంతాలలో సంఘటిత రంగంలో (కార్యాలయాలలో) అవగాహన ఏర్పడి అమలు జరుగుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలలోనూ, అసంఘటిత రంగంలోనూ అమలు కావడం లేదనే చెప్పాలి.
అందుకే మహిళా రైతులు, వ్యవసాయ కూలీలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న హింస, వేధింపుల గురించి, ఆ హింస రూపాలను, వాటిని పరిష్కరించటానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ వ్యవస్థల గురించి స్థూలంగా అర్థం చేసుకోవటానికి, మహిళా రైతుల హక్కుల వేదిక (మకాం), ఫెమినిస్టు పాలసీ కలెక్టివ్‌ (ఎఫ్‌పిసి) కలిసి ఒక అధ్యయనం చేశాయి. ఈ అధ్యయనం 2021లో మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణలలోని ఏడు జిల్లాలలో జరిగింది. తెలంగాణలో ఈ అధ్యయనం జనగామ, నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో జరిగింది. ఇంటితో మొదలై వ్యవసాయ భూములు, మార్కెట్లు, పశువులను మేపే భూములు, పనికి వెళ్ళే దారులు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు వంటి వివిధ పని స్థలాలలో మహిళా రైతులు ఎదుర్కొంటున్న హింసపై ఈ అధ్యయనం కేంద్రీకరించింది. అసంఘటిత రంగమైన వ్యవసాయంలో పని స్థలంలో జరిగే హింసను అరికట్టడానికి ప్రస్తుతమున్న ప్రభుత్వ వ్యవస్థల పనితీరును పరిశీలించి అందుకు పరిష్కారాలను కూడా కొంతవరకు సూచించింది. మహిళా రైతులు… అంటే సాగుదారులు, వ్యవసాయ కూలీలు, పశుపెంపకందారులు, అడవులపై ఆధారపడి జీవనోపాధి పొందే ఆదివాసీ మహిళలు, మత్స్యకారులు, వలస వెళ్ళే మహిళా కూలీలు అనే విస్తృత అర్థంలో వారిని లక్ష్యంగా చేసుకుని ఈ అధ్యయనం సాగింది.
అధ్యయనం ఉద్దేశం, పరిధి, పద్ధతి:
ఈ అధ్యయనం ఈ క్రింది పరిశోధనా అంశాలను కేంద్రంగా చేసుకుని వ్యవసాయంలో మహిళలు వివిధ పనులు చేయటంలోనూ, గౌరవప్రదంగా జీవించటానికి అడ్డంకిగా ఉన్న వేధింపులను, హింసను విస్తృత అర్థంలో నిర్వచించటానికి ప్రయత్నించింది. దీనిలో భూమి వంటి వనరులపై హక్కులు, పనిస్థలం సురక్షితంగా లేకపోవడం వంటివి కూడా వస్తాయి.
1. వ్యవసాయ రంగంలో పనిస్థలాన్ని మహిళలు ఎట్లా నిర్వచిస్తారు?
2. పనిస్థలంలో ప్రతినిత్యం అనుభవించే హింస స్వభావం, రూపాలు ఏమిటి?
3. హింసకు పాల్పడుతున్న నేరస్థులు ఎవరు?
4. మహిళా రైతుల జీవితాలలో, పనిలో, ఇంటిలో ఈ వేధింపులు/హింస కలిగిస్తున్న ప్రభావం ఏ విధంగా ఉంది?
5. ప్రస్తుతమున్న ప్రభుత్వ పరిహార వ్యవస్థల అందుబాటు, అనుభవాలు ఏమిటి? మహిళలు న్యాయం పొందటానికి ఈ సేవలు వీలు కలిగిస్తున్నాయా?
ప్రాథమిక పరిశోధన మూడు పద్ధతులలో జరిగింది.1) కీలకమైన సమాచారం ఇవ్వగలిగిన వారితో ఇంటర్వ్యూలు, 2) మహిళలతో గ్రూపు చర్చలు, 3) మహిళలతో వ్యక్తిగత ఇంటర్వ్యూలు.
అధ్యయనంలో తెలిసిన ముఖ్యాంశాలు:
పని స్థలాలు: వ్యవసాయ రంగంలో నిర్వచించబడని ప్రమాదకరమైన పనిస్థలాలను దృష్టిలో పెట్టుకుని ఈ అధ్యయనం ముందుగా వ్యవసాయ పని స్థలాలను నిర్వచించటంపై కేంద్రీకరించింది. ఆ ప్రయత్నంలో ఈ క్రింది అంశాలు ముఖ్యంగా బయటికి వచ్చాయి.
వ్యవసాయంతో పాటు వేతనం లేని సంరక్షణ పని: వ్యవసాయంలో పని చేస్తున్న మహిళలు రెట్టింపు పని భారాన్ని మోయవలసి వస్తున్నది. ఇంటి పని చేయటం, పెద్దవాళ్ళను, పిల్లలను సంరక్షించే పని… ఇవి రెండూ వేతనం లేని పనులు కాగా పొలాలలో శ్రమతో కూడిన అనేక రకాల పనులు చేస్తారు. దీంతో వారు ఆదాయాన్ని గడిరచటానికి చేసే పనులు పరిమితమవుతున్నాయి. వారి కుటుంబ భూమిలో చేసే వ్యవసాయ పనికి కూడా వేతనం లభించదు. దాంతో వారిని ప్రభుత్వం అధికారికంగా శ్రామికులుగా గుర్తించదు.
సుదీర్ఘమైన పని గంటలు`నిర్వచనం లేని పని ఒప్పందాలు: మహారాష్ట్రలోని చెరుకు నరికే మహిళా కూలీలు రోజుకు 12`14 గంటలు పనిచేస్తారు. వారికి సెలవు రోజులు కూడా ఉండవు. వాళ్ళు తమ భర్తలతో ఇతర ప్రాంతాలకు వలస వచ్చి చెరకు తోటలకు దగ్గరలో తాత్కాలికంగా చిన్న గుడిసెలు వేసుకుని ఉండి పనిచేస్తారు. దీంతో వాళ్ళు మరింత ఎక్కువ ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. లైంగిక హింసను కూడా ఎదుర్కొంటారు.
శ్రమ తీవ్రత ఎక్కువ ఉండే పని: మహిళలు అనేక రకాల పనులు చేయాల్సి రావటమే కాకుండా ఈ పనులన్నీ అధిక శ్రమతో కూడుకుని ఉంటాయి. చెరకు నరికే మహిళా కూలీలు నీళ్ళు, వంట చెరకు మోసుకుని రావటంతో పాటు నరికిన చెరకును కట్టలు కట్టి లారీలలోకి ఎక్కించటం కూడా చేయాల్సి ఉంటుంది. ఈ మహిళలు తెల్లవారుజామున మూడు గంటలకు నిద్రలేచి పని మొదలు పెడతారు. ఇది వారి ఆరోగ్యానికి కూడా హానికరంగా ఉంటుంది. పని భారం కారణంగా గర్భిణీలైన కూలీలలో గర్భస్రావాలు జరిగినట్లు కూడా ఈ అధ్యయనంలో తేలింది.
అప్పులను తీర్చటానికి చేసే పని: అధిక అప్పులు గల పేద వ్యవసాయ కుటుంబాల వారు ఆర్థికంగా దుర్భర స్థితిలో ఉండి కాంట్రాక్టర్ల దగ్గర ముందుగానే అప్పు తీసుకుంటారు. కాబట్టి వారు చెప్పిన పని ముగిసేవరకు ఎదురు చెప్పకుండా చేయాల్సి ఉంటుంది. స్వంతంగా ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉండదు.
అనేక పనులు… ప్రయాణాలు: వ్యవసాయంలో ఉత్పాదకత తక్కువగా ఉండి సంక్షోభం నెలకొన్న కారణంగా మహిళలు కుటుంబానికి ఆదాయం అందించటానికి అనేక పనులు చేయాల్సి వస్తున్నది. వ్యవసాయ కూలీ, ఉపాధి హామీ పని, రైస్‌ మిల్లులో పని, భవన నిర్మాణ పని, ఇటుక బట్టీలలో పని మొదలైనవి. దీంతోపాటు పొరుగు ఊళ్ళలో పని కోసం మహిళలు ప్రతిరోజు 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల వాళ్ళ పని దినం సుదీర్ఘంగా ఉండటమే కాక పని భారం కూడా పెరుగుతుంది.
పని స్థలంలో పిల్లల సంరక్షణ: ఎక్కువ గంటలు పని చేయాల్సి రావటం, వేతనాలు తక్కువగా ఉండటం, పిల్లల సంరక్షణ సదుపాయాలు లేకపోవటం కారణంగా మహిళలు పనికి వెళ్ళేటపుడు చిన్న పిల్లలను తమతో పాటు తీసుకువెళ్తుంటారు. పని స్థలంలో వారు పిల్లలను చూసుకుంటున్నపుడు వారిని యజమానులు అవమానకరమైన మాటలు, తిట్లతో వేధిస్తారు. అంతేకాదు, ఈ పని స్థలాల్లో పిల్లలకు సురక్షితం కాదు. వారి ఆరోగ్యం, చదువు కూడా దెబ్బ తింటాయి.
కుటుంబ భూమిలో పని: స్వంత ఊరిలో కుటుంబానికున్న స్వంత భూమిలో పనిచేయటం అన్నిటికంటే సురక్షితమైన పని స్థలంగా ఈ అధ్యయనంలో తేలింది. అది వారికి ఇరుగు పొరుగు మహిళలతో సంఫీుభావాన్ని ఏర్పరుస్తుంది. వారు ఇంట్లో ఒక్కరే కూర్చునే కంటే ఇతర మహిళలతో కలిసి పనిచేయటం వల్ల మానసికంగా కుంగిపోకుండా కాపాడుతుంది.
పొలాలలో సురక్షితం కాని పని స్థలాలు: మహిళా రైతులు పనిచేసే స్థలాలు… పొలాలు, అడవులు, ఉమ్మడి భూములు, మార్కెట్లు, ఇళ్ళు. వీటిలో ఏ పని స్థలమూ వారికి సురక్షితం కాదు. అంతేకాదు ఈ పని స్థలాల్లో వారికి మరుగుదొడ్లు ఉండవు, పరిశుభ్రత ఉండదు, చుట్టూ పురుషులు తిరుగుతూ ఉంటారు, వారు తాగి ఉంటారు, మహిళలను తదేకంగా చూస్తూ వారిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.
వలస వెళ్ళిన మహిళా కూలీలపై పరివ్యాప్త హింస: ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన అనేకమంది మహిళా కూలీలు అక్కడి భూ యజమానులు తమపై చేసిన దాడులు, లైంగిక హింస గురించిన అనుభవాలను చెప్పారు. వలస వ్యవసాయ కూలీలు పొలాల్లోనే ఉంటారు. ఒక్కొక్కసారి చాలా ఎక్కువమంది కలిసి చిన్న పాకలో ఉండాల్సి ఉంటుంది. కొన్నిచోట్ల ప్లాస్టిక్‌ షీట్లతో చిన్న గుడిసెల్లాంటివి వేసుకుని ఊరికి దూరంగా ఉంటారు. భూ యజమానులు రాత్రిపూట వచ్చి మగవాళ్ళను పొలాలకు నీళ్ళు పెట్టటానికి పంపించి ఒంటరిగా ఉన్న మహిళలపై లైంగిక దాడులు చేస్తారు. ఈ విషయం బయటికి చెపితే పనిలో నుండి తీసివేసి వెనక్కు పంపించేస్తామని బెదిరిస్తారు.
వేధింపులు, హింస… స్వభావం, రూపాలు :
మహిళలపై ప్రతి నిత్యం జరిగే వేధింపులు వారికి మౌలిక సదుపాయాలు లేకుండా చేయటంతో మొదలుపెట్టి అవమానించటం, శారీరక మానసిక దాడులు, వ్యక్తిత్వ దూషణ, శీలాన్ని శంకించటం, లైంగిక అవసరాలు తీర్చమని అడగటం, భూమిపై హక్కులు నిరాకరించటం, పనిలో మహిళల సలహాలను పాటించటానికి నిరాకరించటం వరకు విస్తృత పరిధిలో ఉంటాయి.
ఈ హింస వ్యక్తీకరణలు, వాటి ప్రభావం మహిళల శారీరక, మానసిక సంక్షేమంపైన ప్రత్యక్ష ప్రభావం కలిగించటంతో పాటు పరోక్షంగా వారి పనిలో ఉత్పాదకత తగ్గటం, పంట దిగుబడి తగ్గటం వంటి ప్రభావాలు కూడా ఉంటున్నాయి.
మహిళా రైతులు, వ్యవసాయ కూలీలపై జరిగే వివిధ రకాల హింస రూపాలు:
1. ఒంటరి మహిళలు, రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళలపై కుటుంబ సభ్యుల హింస: భర్తను కోల్పోయిన మహిళలు వారి ‘ఒంటరి’ స్థితి కారణంగా పని స్థలంలో అత్యధికంగా హింసకు పాల్పడే పరిస్థితిలో ఉంటారు. కుటుంబంలో కూడా వారిపై అనేక వేధింపులు జరుగుతున్నాయి. వారి భర్తలకు కుటుంబ భూమిలో రావాల్సిన వాటాను వారికి ఇవ్వకుండా అత్త మామలు, బావలు, మరుదులు వారిని వేధిస్తున్నారు. అత్తగారి తరపు కుటుంబాలు ఈ మహిళలను అక్కరలేని వారిగా చూస్తూ, కుటుంబ భూమిని కాజేసేవారిగా పరిగణిస్తున్నాయి. రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలలో మహిళలు భూమిలో వాటా అడిగినప్పుడు వేధింపులు ఎదుర్కొంటున్నారు. వారి బావలు, మామల నుండి లైంగిక వేధింపులను కూడా అనుభవిస్తున్నారు. కొన్ని కుటుంబాలలో ఈ మహిళలకు భూమిని పంచి ఇవ్వటం కాదు కదా వారిని తమ భూమిని సాగు చేసుకోనివ్వటం లేదు, ఇంటినుండి కూడా వెళ్ళగొడుతున్నారు.
2. లైంగిక హింస: లైంగిక హింస, వేధింపులు పని స్థలంలో ఉండే ప్రమాదకరమైన వ్యవస్థీకృతమైన అంశాలు భౌతిక అంశాలు, వసతులతో సంబంధం కలిగి ఉంటాయి. ఉదాహరణకు, పొలాలలో పనిచేస్తున్నప్పుడు పురుషులు తప్పుడు దృష్టితో తదేకంగా చూడటం, లైంగికంగా అంగీకారం కాని వ్యాఖ్యానాలు, కించపరచటం, లైంగిక అవసరాలు తీర్చమని కోరటం, ప్రేరేపించటం, డిమాండ్‌ చేయటం మొదలైనవి.
3. మహిళా రైతులపై గృహ హింస: పని స్థలంలో వేధింపులు అనుభవించిన మహిళా రైతులపై గృహ హింస ఎక్కువగా ఉన్నట్లు వాటి మధ్య ఒక ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. పనికి వెళ్ళి ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడు మాత్రమే కాక పని స్థలంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నప్పుడు దానికి బాధ్యత మహిళలపైనే వేసి వారిని నేరస్థులుగా చూసి ఇంట్లో వేధింపులు పెరుగుతాయి. ఇంటి బయట మహిళలు చేసే పనిలో భాగంగా మధ్య దళారులు, డ్రైవర్లు, గార్డులు వంటి పురుషులతో మాట్లాడినప్పుడు కూడా గృహ హింస పెరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలు ఒక చక్రంలాగా ఉంటాయి. బయట వేధింపులు జరిగినప్పుడు ఇంటిలో హింస పెరుగుతుంది. ఇంటిలో హింస జరిగినప్పుడు పని స్థలంలో సరిగ్గా పనిచేయలేకపోయి అక్కడ అవమానాలు, వేధింపులు ఎదుర్కోవలసి వస్తుంది.
4. మహిళలపై కుల ఆధారిత హింస: అణగారిన కులాలకు, మైనారిటీ సమూహాలకు చెందిన మహిళలు ప్రత్యక్షంగా వ్యవస్థీకృత హింసను ఎదుర్కొంటున్నారని ఈ అధ్యయనంలో ప్రముఖంగా బయటకు వచ్చింది. తెలంగాణలో దళిత మహిళా వ్యవసాయ కూలీలు, మహారాష్ట్రలో అణగారిన కులాలకు చెందిన చెరకు నరికే కూలీలు, గుజరాత్‌లో ఆదివాసీ మహిళలు ఆధిపత్య కులాల పురుషుల ద్వారా దోపిడీ హింసలను ఎదుర్కొన్నారని స్పష్టంగా తెలిసింది. కాంట్రాక్టర్లు, ఉప కాంట్రాక్టర్లు, మధ్య దళారులు, డ్రైవర్లు, ప్రధానంగా ఆధిపత్య కులాలకు చెందిన వారు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళలు ఫిర్యాదులు చేశారు. అంటరానితనం కూడా ఉండటంతో ఈ సెక్షన్ల మహిళలు వారిపై ఫిర్యాదు చేయటం సురక్షితంగా భావించలేదు.
పని స్థలంలో మహిళా రైతులపై దాడులు, అత్యాచారాలు చేసి చంపేసిన నిర్దిష్ట సంఘటనలు కూడా ఈ అధ్యయనంలో తెలియవచ్చాయి.
హింసకు పాల్పడే నేరస్థులు
వివిధ సెక్షన్ల మహిళా రైతులపై బలవంతంగా హింసకు పాల్పడే నేరస్థుల గురించి విడిగా అడిగినప్పుడు ప్రధానంగా ఈ క్రింది నాలుగు రకాల నేరస్థుల గురించి తెలిసింది.
1. కుటుంబంలో పురుషులు పాల్పడే హింస: భర్తలు కొట్టడంతో పాటు రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలలో ఒంటరి మహిళలపై బావలు, మామలు, మరుదులు లైంగిక హింసకు పాల్పడటమే కాక వారికి భూమిలో, ఆస్తిలో వాటా ఇవ్వకుండా, బయట ఎవరితో మాట్లాడినా శీలాన్ని శంకిస్తూ వేధిస్తున్నారని తెలిసింది.
2. పనికి నియమించే యజమానుల హింస: వ్యవసాయంలో పనిచేస్తున్న మహిళలు తరచుగా వారిని పనిలో పెట్టుకునే యజమానులు, సూపర్‌వైజర్ల నుండి వేధింపులకు గురవుతున్నారు. చాలా సందర్భాలలో వాళ్ళు తమ కింద పనిచేసే మహిళలను తమ మాట వినకపోతే వారి పనినుండి తొలగించే అధికారం కలిగి ఉంటారు. ఆ విధంగా అధికారం కలిగిన వాళ్ళు తమ దగ్గర పనికోసం వచ్చే మహిళలను లైంగిక అవసరాలు తీర్చమని అడిగినప్పుడు వారు అంగీకరించకపోతే వారి శీలం మంచిది కాదని పుకార్లు లేపటం, తిట్టటం, శారీరకంగా హింసించటం, ‘చేతబడి’ చేస్తారని నిందవేసి వారిని స్వంత భూమినుండి వెళ్ళగొట్టటం కూడా జరిగినట్లు తెలిసింది. ఎత్తుగా పెరిగిన మొక్కజొన్న చేలలో పనిచేస్తున్న మహిళలను భూ యజమానులు వారికి అదనపు పని అప్పచెప్పి మిగిలినవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది.
3. భూస్వాముల హింస: భూస్వాములు కూడా మహిళా రైతులను దోపిడీ, వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. పేద మహిళలు భూమిని కౌలుకు తీసుకున్నప్పుడు వారి ఆర్థిక పరిస్థితిని ఆసరా చేసుకుని వారిని వెంబడిరచటం, అవసరం లేకున్నా మాటల్లోకి దింపటం, వారి గురించి ఇతరుల దగ్గర అవహేళనగా తమకు లొంగిపోయినట్లుగా ప్రచారం చేసినట్లు తెలిసింది. కొంతమంది మహిళా వ్యవసాయ కూలీలు పేదరికంలో ఉన్నప్పటికీ భూస్వాముల వేధింపులు భరించలేక అతని దగ్గర పని మానేసిన సంఘటనలు కూడా తెలియవచ్చాయి.
4. ప్రభుత్వ అధికారులు, ఇతర వ్యక్తుల హింస: వడ్డీ వ్యాపారులు, బ్యాంకు అధికారులు, మండల అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, ఫారెస్ట్‌ గార్డులు, ఏజెంట్లు మొదలైన అధికారం గల పురుషులు కూడా మహిళలకు పని ప్రదేశాలను సురక్షితం కాకుండా చేస్తున్నారు. మహిళా రైతులు తమ పంటను అమ్మినప్పుడల్లా వడ్డీ వ్యాపారులు అవసరం లేకున్నా తమ ఇళ్ళకు రావటం తమకు ఇబ్బందిగా ఉన్నట్లు మహిళలు చెప్పారు. అప్పులు తీర్చాలనే ఒత్తిడి ఎక్కువై కొన్ని కుటుంబాలలో మహిళా రైతులు కొంత భూమిని, నగలను అమ్మి అప్పు చెల్లించారు. వారి ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోకపోవడమే కాకుండా గ్రామ పెద్దలను తీసుకురమ్మని తిప్పి పంపించారు. ఈ విధంగా ఫిర్యాదు చేసినప్పుడు ఆ మహిళలను పని నుండి తీసివేయటం లేదా వేతనాలు చెల్లించకుండా ఎగ్గొట్టటం జరిగింది.
మహిళల జీవితాలపై హింస ప్రభావం
శారీరక, మానసిక ప్రభావం: పనిస్థలాలలో హింస కారణంగా మహిళా రైతులు అనేక రకాల ప్రతికూల భావోద్వేగాలను అనుభవిస్తున్నట్లు చెప్పారు. భయం, కోపం, అవమానం, అపరాధ భావన, నిస్సహాయత, గందరగోళం, ఆందోళన వంటి భావాలు వారు ఎదుర్కొంటున్న వేధింపులకు తోడై తమకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడకుండా చేస్తాయి. తమపై జరిగిన వేధింపుల గురించి మాట్లాడితే సామాజిక, వృత్తిపరమైన పరిణామాల దృష్ట్యా వాటి గురించి ఫిర్యాదు చేయకుండా ఉండిపోతున్నారు. ఫలితంగా వారిని మరింత ఒంటరివాళ్ళను చేస్తోంది. ఆ విధంగా ఫిర్యాదు చేసిన వాళ్ళు కూడా కోర్టు నుండి సరిపడినంత నష్టపరిహారాన్ని అందుకోలేదు, వారికి న్యాయం జరగలేదు. పైగా కేసులకు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. పని స్థలంలో హింసను ఎదుర్కొన్న మహిళలు తిరిగి ఆ చోటికి పనికోసం వెళ్ళటం మానేసిన సంఘటనలే ఎక్కువ. దీంతో ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు.
వృత్తిపరమైన/ఆర్థిక ప్రభావం: చాలా సందర్భాలలో మహిళలు వేధింపులు ఎదురైన పని స్థలంలో పనిని వదిలేసినట్లు తెలుస్తున్నప్పటికీ కొంతమంది ఉపాధి కోల్పోతామనే భయంతో అక్కడే కొనసాగుతున్నట్లు కూడా తెలిసింది. ఆర్థిక అభద్రత అనేది ఇక్కడ వారికి ఆ హింసను భరించే అంశంగా మారుతోంది. మహిళలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు వారికి సమాజం నుండి మద్దతు అందకపోగా వారు ఉపాధి అవకాశాలు కోల్పోవలసి వస్తోంది.
సామాజిక ప్రభావం: పని స్థలంలో లైంగిక హింస సామాజిక మద్దతు వ్యవస్థలను నాశనం చేసిన కారణంగా చాలామంది మహిళలు తమకు జరుగుతున్న వేధింపుల గురించి కుటుంబ సభ్యులకు, ప్రత్యేకించి భర్తలకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. మహిళపై జరిగిన హింస వార్త వ్యాపించినప్పుడు ఆమె మరింత ఎక్కువ వేధింపులకు గురైనట్లు చెప్పారు. సామాజికంగా ఒత్తిడి పెరిగి తిరిగి ఆమెనే నేరస్థురాలిగా చూడటం జరుగుతోంది. భర్తలు చనిపోయిన, ఒంటరి మహిళల విషయంలో లైంగిక హింస, వేధింపులు అనేవి వారి గురించి పుకార్లు వ్యాపించటానికి దారితీసి వారి తల్లిదండ్రులు, అత్తమామలు ఆమెనే తప్పుపట్టి పనికి వెళ్ళకుండా అడ్డుకుంటారు. కొన్ని కేసులలో వేధింపులు జరగలేదని చాటి చెప్పటానికి అక్కడే పనిని కొనసాగించాలని వారు ఒత్తిడి చేసిన సంఘటనలు తెలియవచ్చాయి.
ప్రభుత్వ పరిష్కార/పరిహార వ్యవస్థలు:
పరిహార వ్యవస్థల గురించి అవగాహనా లోపం: గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పని స్థలంలో లైంగిక వేధింపుల పరిష్కారానికి ఉన్న ప్రభుత్వ పరిహార వ్యవస్థల గురించి చాలామంది మహిళలకు కనీస అవగాహన కూడా లేదు. జిల్లా స్థాయిలో ఉండే లోకల్‌ కంప్లైంట్స్‌ కమిటీ (ఎల్‌సిసి) లాంటి వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోవటం, వాటి గురించి తగినంత ప్రచారం లేకపోవటం ప్రధాన సమస్యగా ఉన్నట్లు తెలిసింది.
హింస పట్ల మహిళల వ్యక్తిగత, సామూహిక స్పందన: తమ జీవితాలలో ప్రతి నిత్యం ఎదురయ్యే వేధింపులను తట్టుకోవటానికి మహిళలు తెలివిగా అనేక పద్ధతులను అనుసరిస్తున్నట్లు వారితో జరిపిన ఇంటర్వ్యూలలో తెలిసింది. మహిళా కూలీలందరూ కలిసి పనికి వెళ్ళటం, ఒంటరిగా లేకుండా చూసుకోవటం, పిల్లలను తోడు తీసుకెళ్ళటం వంటివి చేస్తారు. ఫిర్యాదు చేయటానికి అధికారిక వ్యవస్థలు లేని చోట్ల, ఉదాహరణకు వలస వెళ్ళే చెరకు నరికే కూలీలు అనేక ఎత్తుగడలు కనిపెట్టారు. తమ రక్షణ కోసం అనధికార మద్దతు వ్యవస్థల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఫిర్యాదు చేయటంలో అడ్డంకులు: ఫిర్యాదు చేస్తే తమను చుట్టుపక్కల వాళ్ళు విశ్వసించరనే భయం, తిరిగి తమనే తప్పుపట్టి నేరస్థులుగా చూస్తారనే భావనతో ఫిర్యాదు చేయటం లేదు.
పోలీసుల నుండి సరిపడినంత స్పందన లేకపోవటం: పని స్థలంలో హింస గురించి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ వారి నుంచి సరైన స్పందన రాలేదని ఇంటర్వ్యూలో పాల్గొన్న మహిళలు చెప్పారు. చాలా సందర్భాలలో నేరం చేసినవారిపై పోలీసులు చర్యలు తీసుకోలేదని, తాము ఫిర్యాదు చేయటానికి వెళ్ళినపుడు కనీస సానుభూతి కూడా కనబరచలేదని, పైగా అవమానకరంగా, తమ శీలాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారని మహిళలు చెప్పారు.
సలహాలు`సూచనలు: వ్యవసాయంలో పనిచేసే మహిళలపై పని స్థలంలో హింస, వేధింపులు అనేవి ప్రతినిత్యం జరిగే విధంగా ఉన్న కారణంగా వాటిని అరికట్టటానికి, పరిష్కరించటానికి ఈ అధ్యయనం కొన్ని సలహాలు, సూచనలు చేసింది:
1. స్త్రీ వాద పరిశోధనా పద్ధతులలో వ్యవసాయంలో మహిళలపై హింస ప్రభావం, పరిధి గురించి మరింత విస్తృతమైన అధ్యయనం చేసి గణాంకాలను సేకరించాలి. కొన్ని సెక్షన్ల మహిళా రైతులపై హింస ఎక్కువగా జరగటానికి కారణమైన వివిధ అంశాలను నిర్దిష్టంగా గుర్తించి వాటి గురించి బలమైన రుజువులను నమోదు చేయటం చాలా అవసరం.
2. అసంఘటిత రంగంలో పని స్థలంలో వేధింపులను అరికట్టటానికి, లైంగిక వేధింపుల నిరోధక (POSH) చట్టం, 2013 గురించి ప్రత్యేకించి వ్యవసాయంలో మహిళలపై హింస గురించి విస్తృత స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు చెప్పటానికి వీలుగా మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ తదితర ప్రభుత్వ శాఖలకు బడ్జెట్‌ కేటాయించాలి. మహిళలకు సురక్షితమైన పని స్థలాలను, మౌలిక వసతులను, వ్యవస్థలను కల్పించటానికి బడ్జెట్‌ కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
3. పని స్థలాలలో హింస గురించి మహిళలకు అవగాహన పెంచటం, సురక్షితమైన పని స్థలాల్లో ఉండాలని డిమాండ్‌ చేయటం అత్యవసరం. మహిళలు సంఘాలుగా ఏర్పడి ఇటువంటి డిమాండ్లు చేయటానికి, పని స్థలాలలో హింస గురించి చర్చించటానికి వేదికలను సృష్టించటానికి వీలు కల్పించటం, ఆ దిశగా వారిని ప్రోత్సహించటం కూడా అత్యవసరం.
గ్రామ పరిపాలక వ్యవస్థలకు ప్రత్యేక సూచనలు:
1. మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ అన్ని గ్రామ పంచాయతీలలో లోకల్‌ కంప్లైంట్స్‌ కమిటీ (ఎల్‌సిసి)ల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలను క్రియాశీలంగా చేపట్టాలి. పరిహార వ్యవస్థల గురించి, సంప్రదించవలసిన ఫోన్‌ నంబర్లను గ్రామ స్థాయిలో మహిళలకు తెలిసేటట్లు సమాచారం అందించాలి.
2. అంగన్‌వాడి వర్కర్లు, గ్రామైక్య సంఘాలకు స్థానిక మహిళలపై హింస కేసులలో స్పందించి చర్యలు తీసుకునేలా శిక్షణలు ఇవ్వాలి.
3. గ్రామ పంచాయతీలు తమ పరిధిలో మహిళలపై వేధింపులు (వలస కార్మికులతో సహా) నివారించటానికి, అవి జరిగినప్పుడు ఫిర్యాదు చేసే బాధ్యత అప్పగించాలి. ఈ విషయంలో వార్డు మెంబర్లకు, సర్పంచ్‌కు అవగాహన కల్పించి వాళ్ళు కీలకమైన పాత్ర పోషించేలా చూడాలి.
4. స్థానిక స్థాయిలో మహిళా సంఘాలు, సమాఖ్యలను పనిస్థలంలో మహిళలపై వేధింపుల కేసులను చేపట్టే విధంగా బలోపేతం చేయాలి.
5. అసంఘటిత రంగంలో మహిళలపై పని స్థలాల్లో వేధింపుల గురించి పోలీసులకు అవగాహన కల్పించటానికి శిక్షణలు ఏర్పాటు చేయాలి.
6. పరిహార వ్యవస్థల గురించి విస్తృతంగా ప్రచారం చేసి బాధ్యతను ఎల్‌సిసిలకు అప్పచెప్పి వారు వ్యవసాయంలోనూ, అసంఘటిత రంగాల్లోనూ పనిచేస్తున్న మహిళల వద్దకు సమాచారం చేరవేయటానికి క్రియాశీలంగా చర్యలు తీసుకునే తప్పనిసరి బాధ్యత అప్పగించాలి.
ముగింపు: ఈ అధ్యయన నివేదిక వ్యవసాయ సంక్షోభం నేపథ్యంలో మహిళా రైతులపై ప్రతినిత్యం జరుగుతున్న హింస, వేధింపుల స్వభావం, వాటి ప్రభావం గురించి స్థూలంగా వివరించటానికి ప్రయత్నం చేసింది. కష్టమైన పని వాతావరణంతో పాటు, తక్కువ వేతనాలు, వలస, వైవాహిక స్థితి, కుల దురహంకారం, గృహ వసతి కొరత, ప్రమాదకరమైన పని పరిస్థితులు మొదలైనవి మహిళలకు పని స్థలాలను సురక్షితంగా లేకుండా చేయటానికి కారణమవుతున్నాయని ఈ అధ్యయనం వెల్లడిరచింది.
ఈ అధ్యయనం, వ్యవసాయంలో మహిళలు పనిస్థలంలో హింసను ఎదిరించటంలో కొన్ని విజయవంతమైన ఉదాహరణలను కూడా పొందుపరిచింది. స్థానిక కార్యకర్తలు, రైతుల కోసం పనిచేసే సామాజిక వేదికలు, మహిళా సంఘాలు మహిళా రైతులకు మద్దతును అందించి వారు సమిష్టిగా పనిచేయటానికి వారి నాయకత్వాన్ని పటిష్టం చేయటానికి తీసుకున్న చర్యల గురించి కూడా నమోదు చేసింది. మహిళా రైతులు, నాయకులు తమ గొంతులను పెంచి ఇతర మద్దతు వ్యవస్థలను కూడగట్టడానికి ఉన్న అవకాశాల గురించి ఎత్తి చూపింది. స్త్రీ వాద పరిశోధనా పద్ధతులకు ఉన్న శక్తిని, దాని విలువలను కూడా గుర్తించింది.
చివరగా, కొన్ని అనుకూల చర్యలు అమలు జరుగుతున్నట్లు సూచనలు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అసంఘటిత రంగంలో మహిళలపై హింసను అరికట్టటానికి ఉద్దేశించిన చట్టాలను, విధానాలను అమలు చేయటంలో అనేక సవాళ్ళు ఉన్నట్లు గుర్తించింది.
రాగల రెండు, మూడు సంవత్సరాల్లో ‘మకాం’, ఇతర సంస్థలతో కలిసి దేశంలోని వివిధ రాష్ట్రాలలో వ్యవసాయంలో పనిచేస్తున్న మహిళా రైతులు వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలలో ఉత్పాదకంగా పాల్గొనకుండా అడ్డుకుంటున్న హింస రూపాలను, స్వభావాన్ని, వ్యక్తీకరణలు, పరిణామాలను మరింత లోతుగా, విస్తృతంగా అర్థం చేసుకోవటానికి, సరైన పరిష్కార మార్గాలను విధాన స్థాయిలో వచ్చే విధంగా ఒక విస్తృత అధ్యయనాన్ని చేపట్టాలని భావిస్తోంది. మహిళా రైతులపై జరిగే హింసను అరికట్టటానికి దృఢమైన సాక్ష్యాల ఆధారంగా వ్యూహాలను రూపొందించాలని ఆశిస్తున్నది.

Share
This entry was posted in అధ్యయనం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.