ఆమె చాలా స్ట్రాంగ్‌ -వి.శాంతి ప్రబోధ

‘‘అమ్మా… నాకు తెలియక అడుగు తున్న… కోపం కాకు…’’ యాదమ్మ ఎప్పుడూ ఇంతే. మనసు లోతుల్లో తచ్చాడే ప్రశ్నలు నా మీదకు వదిలి ఊపిరి తీసుకుంటుంది. కోప్పడొద్దని ముందు కాళ్ళకు బంధం వేస్తుంది.

‘‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమే జీవించుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యమూ… అదే స్వర్గము’’ పాట వింటున్న నేను విషయమేంటో చెప్పమన్నట్టు చూశాను. ‘‘ఒంటరితనం శాపమా… వరమా అమ్మా’’ బాంబ్‌ పేల్చినట్టు అన్నదామె.
‘‘ఏమంటున్నావ్‌…’’
‘‘అదేనమ్మా… ఆ బూడిద రంగు అపార్ట్‌ మెంట్‌లో ఐదో ఫ్లోర్‌లో వచ్చిన మేడం దగ్గర పనిచేస్తున్న కద. ఆమెని చూసి ఇరుగుపొరుగు ఆడవాళ్ళు చెవులు కొరుక్కుంటున్నరు. కుటుంబాల నడుమ ఒక్కతే ఉంటున్నది, మొగుళ్ళని కాపాడుకోవాలి అంటున్నరు. పాపం, ఆమె ఒక్కతే ఉంటది. ఏకాకి బతుకు. నాతోని అక్క లెక్క ముచ్చట పెడ్తది.
లగ్గం ఎప్పుడు చేస్కుంటవ్‌ ఎప్పుడు జరిగేటి ముచ్చట అప్పుడే కావాలె అంటే, నాకు లేని ఆరాటం నీకెందుకే… ఏ బాదరబాందీ లేకుండా హాయిగా ఉన్న. నన్నిట్టా బతకనీవా అన్నదమ్మా ఆ మేడం. పెళ్ళి పెటాకులు లేకుంట అంత ఫుర్సత్‌ ఎట్ల ఉంటరమ్మా? చచ్చోపుచ్చో ఓ తోడు ఉండాలె కద’’ అంటూ తన పనిలో పడిరది యాదమ్మ.
మా యాదమ్మదే కాదు మనలో చాలా మంది అభిప్రాయం కూడా అటుఇటుగా అదే.
ఆలోచిస్తూ ‘‘పెళ్ళితో అందరూ సుఖంగా
ఉన్నారా? తోడు లేకపోతే బతకలేరా?’’ ప్రశ్నించా.
‘‘నా మొగుడికి కోరిక కలిగితే మీద పడి ఆగం ఆగం చేస్తడు. నాకు కావాలని ఉన్నదో లేదో చూడడు. ఆడు ఆడినట్టు ఆడాలి. నాకు కోరిక కలిగితే మాత్రం వాడికి పట్టదు. ఏందీ ఈ వేషాలు సానిదానిలాగా అంటడు. వాడు నాలుగు దిక్కుల పక్క చూపులు చూస్తడు. నేను చూడకపోయినా చూస్తనేమోనని అనుమానపడతడు. నా ఒళ్ళు హూనం చేస్తడు. సదువు గిదువు లేని నా మొగుడే కాదు బాగా సదుకున్న మొగుళ్ళు కూడా అంతే ఉన్నరు. ఆలోచిస్తుంటే ఆయమ్మ అన్నట్టు ఒంటరి బతుకే నయమేమో…’’ మనసులో తలపోసింది చీపురుతో వాకిలి ఊడుస్తున్న యాదమ్మ.
ఒంటరితనం అంటే పెళ్ళి చేసుకోకుండా జతగాడు లేకుండా ఒక్కరే ఉండటమా… ఒంటరి తనం బాహ్యంగానా? అంతరంగం లోనా? సంసా రులుగా కనిపించిన వాళ్ళందరి బంధాలు డబ్బు తోనో, కులంతోనో, మతం తోనో, అధికారంతోనో, అహంకారంతోనో, అవసరంతోనో, అవకాశంతోనో ముడిపడిన బంధాలు కదా… మనసుతో ముడి పడని ఆ బంధాల్లో ఒకరికొకరై ఉంటున్నారా? నూటికి తొంభై కేసుల్లో లేదనే జవాబు వస్తుంది. అటువంటప్పుడు తోడు ఉన్నట్లా లేనట్లా…? ప్రశ్నల పరంపర.
ఒక ఆడ, ఒక మగ పెళ్ళి పేరుతో జత కట్టి ఒక కప్పు కింద ఉన్నంత మాత్రాన వారిలో ఒంటరితనం లేదని అనలేం. వారిలో గూడుకట్టు కున్న ఏకాకితనం బయటకు కనిపించదు అంతే. పెళ్ళి తోడు లేని ఆడవాళ్ళని సమాజం ఎందుకు అదోరకంగా చూడాలి? వాళ్ళని తప్పు చేస్తున్న
వాళ్ళుగానో, మరో విధంగానో ఎందుకు చూడడం?
ఆమె ఒంటరి తనానికి కారణాలు అనేకం. ఏదైనా కారణంతో భర్త విడిపోవడం లేదా భర్త చనిపోవడం లేదా బిడ్డలు పుట్టకపోవడం లేదా భర్త ఇల్లొదిలి పోవడం లేదా ఉద్యోగానికి ప్రాముఖ్యతనిస్తూ పెళ్ళికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం వంటి కారణాలు ఎన్నో… అది ఆమెకు గత్యంతరం లేక కావచ్చు లేదా ఐచ్ఛికంగా కావచ్చు.
… … …
ఆర్థికపరమైన కారణాలు లేదా కుటుంబ కారణాలు, బాధ్యతలు లేదా విచ్ఛిన్నమైన కుటుంబాలు, అహంకారం ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ఒంటరిగా నిలబెడుతున్నాయి. అయితే మగపిల్లలపై లేని సమాజపు ఒత్తిడి ఆడపిల్లపైనే ఉంటున్నది, కనిపిస్తుంది.
ఏదేమైనా స్వతంత్ర జీవనం నేరమో ఘోరమో కాదు కదా. అది ఆమె వ్యక్తిగతం. ఆమె స్వేచ్ఛ, స్వతంత్ర జీవితంలో తృప్తిగా, హాయిగా ఉన్నదేమో … ఆనందంగా గడుపుతున్నదేమో?! లేదా, తోటి మహిళలు చేసే వ్యాఖ్యానాలు ఆమె మనసును కుంచింపచేస్తాయేమో?! మనుషుల ప్రేమరాహిత్యం ఒంటరి జీవితం పట్ల దిగులు కలిగిస్తాయేమో?!
ఏది ఏమైనా సానుకూలంగా వ్యవహరించ లేమా? ఆమె బతుకు ఆమెను బతకనీయకుండా ఆమె మెడలో మంగళసూత్రం, కాళ్ళకు మెట్టెలు, నుదుట సింధూరం ఉన్నాయా లేదా అని వెతకడం ఎంత అనాగరికం? తోటి మహిళలు కూడా ఆమెను అర్థం చేసుకోకుండా రకరకాల వ్యాఖ్యలతో హింసించడానికి కారణం ఏమై ఉండొచ్చు. ఒంటరి జీవితంలో ఎవరిపై ఆధారపడని వ్యక్తిత్వాన్ని చూసి తోటి మహిళలు జెలసీనా లేక తమ మొగుళ్ళు ఆమె వైపు చూస్తారేమోనన్న భయమా…
ఆమెపై నిఘా పెట్టి ప్రతిక్షణం జడ్జి చేయడానికి వీళ్ళంతా ఎవరు? ప్రతిదాన్ని భూతద్దంలో చూడాల్సిన పని వాళ్ళకేంటి? ఒంటరిగా ఉండే పురుషులు కూడా సమాజంలో కొల్లలు. వాళ్ళకు లేని అగ్ని పరీక్షలు, వ్యక్తిత్వ హననం ఆడవాళ్ళకే ఎందుకు? ఆడైనా, మగైనా జీవితంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకాలి. వేలెత్తి చూపడానికి మనం ఎవరం? ఆ వేలెత్తి చూపే వాళ్ళంతా గొప్పవాళ్ళా?
వాలెంటైన్స్‌ డే సమయంలో వచ్చిన మెసేజ్‌ మదిలో మెదిలింది. ‘మీరు ఒంటరిగా ఉన్నారా… మీతో మాట్లాడటానికి, మీ మనసు ఊసులు వినడానికి, మీతో సమయం గడపడానికి సిద్ధంగా ఉన్నాను. మీ గోప్యతకి ఎటువంటి ఇబ్బంది కలగదు’ అంటూ. ఆ తర్వాత కూడా ఇటువంటి మెసేజ్‌లు చాలా చూశాను. ఒంటరితనం కూడా యాప్‌ల వ్యాపారం అవకాశంగా మారిపోయింది.
నచ్చిన వ్యక్తితో బతికే అవకాశం అందరికీ ఉండదు. ఉండకపోవచ్చు. కానీ నచ్చినట్లు బతికే అవకాశం ఉంది కదా. మరి సమాజం, కుటుంబం, పని ప్రదేశం, సంప్రదాయాలు ఎందుకు ఆమెను టార్చర్‌ చేస్తున్నాయి. ఆవిడెందుకు పెళ్ళి చేసుకోలేదు అంటూ భూతద్దంలోంచి చూడడానికి ప్రయత్నిస్తారు. ఒంటరిగా వెళ్ళి కాఫీ షాప్‌లో కాఫీ తాగినా తప్పే. ఒంటరిగా ఇల్లు కొనాలన్నా, ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా తిప్పలే. వారిపట్ల అపోహలే… ఊహాగానాలే… అనుమానాలే… తప్పులు వెతకడమే…
ఆమె జీవిత లక్ష్యం పెళ్ళి అంటుంది సమాజం. అతని తోడు ఆమెకు రక్షణ అనుకుంటారు. అందుకు భిన్నంగా ఒంటరిగా ఉన్న మహిళ సమాజానికి చేటు అంటారు. ఆమెను పండుగలు, ఫంక్షన్స్‌లో టార్చర్‌ పెడతారు. ఇంట్లో ఎమోష నల్‌గా సపోర్టు లేకపోగా ఆమెపై తీవ్ర ఒత్తిడి… అది ఆర్థికంగా, వృత్తిపరంగా, కుటుంబపరంగా, సామాజికంగా కావచ్చు. భవిష్యత్తు పట్ల ఆందోళన ఆమెను మరింత ఒత్తిడికి, అలజడికి లోను చేస్తున్నాయి. అది ఆమె ఛాయిస్‌ అని అర్థం చేసుకోరు. మామూలుగా అందరు మహిళల్లాగే చూడరు. ఆమె లక్ష్యం అతని సేవల్లో తరించడం కంటే తన కెరీర్‌ నిర్మించుకోవడం అయి ఉండ వచ్చు. ఆమె గమ్యం మరేదైనా కావచ్చు. ఆర్థిక స్వావలంబన ఆమెను ఏ విధంగా ఉండాలో నిర్దేశిస్తూ ఉండవచ్చు.
సామాజిక ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్‌ ఆశలు ఆమెను ఒంటరిగా నిలబెట్టినప్పటికీ ఈనాటి ఒంటరి మహిళ సమాజం నుంచి చీదరింపులు, ఏవగింపు ఎదుర్కొంటూనే విజయవంతంగా ముందుకు పోతున్నది. మనిషికి ఉన్నది ఒకే జీవితం. కాలాన్ని సద్వినియోగం చేసుకున్నంత వరకు ఒంటరితనం శాపం కాదని, ఎదురయ్యే సమస్యలు, సవాళ్ళు గుర్తిస్తూ తనదైన గమ్యానికి మార్గం సుగమం చేసుకుంటున్నది. అది తనకు ఉన్న మంచి అవకాశంగా గుర్తిస్తూ ఒకరి ఆధీనంలో ఉండవలసిన, ఆధారపడవలసిన అవసరం లేదని ఆమె పక్కన ఆమె మాత్రమే ఉంటున్నది.
ఆమె చాలా స్ట్రాంగ్‌.

Share
This entry was posted in కిటికీ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.