‘‘నిశ్శబ్దం, నిశ్శబ్దంగా ఉండండి జడ్జిగారు వస్తున్నారు’’
తలమీద ఎర్రటోపీ, చేతిలో దండంతో వచ్చిన బంట్రోతు అరిచాడు. జడ్జిగారు వేంచేశారు. కోర్టులో అందరూ లేచి నిలబడ్డారు. ఒళ్ళో పిల్ల నిద్రపోయింది. గోదావరి వెంటనే లేవలేకపోయింది. జడ్జిగారు కూర్చున్నాక అందరూ కూర్చున్నారు. లేచి నిలబడే ప్రయత్నం
విరమించుకుని గోదావరి కూర్చునే ఉండిపోయింది.
కేసు తర్వాత కేసు నడుస్తోంది. లాయర్లు జడ్జి దగ్గరకెళ్ళి మాట్లాడుతున్నారు. అటొకాయన, ఇటొకాయన నిలబడి మాట్లాడుతున్నారు. జడ్జి తన ముందున్న కాగితాలు చూస్తూ అప్పుడప్పుడూ తలెత్తి లాయర్లు చెప్పేది వింటున్నారు. ఇలా ఓ గంట గడిచిపోయింది. తన లాయర్ ఇంకా రాలేదెందుకో అనుకుంది గోదావరి. డబ్బిచ్చి లాయర్‌ని పెట్టుకునే స్థోమత లేకపోవడంతో ప్రభుత్వం వారిచ్చే ఉచిత లాయర్ తన కేసు వాదిస్తున్నాడు. తను ఈ కోర్టుకు రావడం ఇది పన్నెండోసారి. లాయర్ వస్తాడు. జడ్జి దగ్గరకెళ్ళి ఏదో చెబుతాడు. అంతే కేసు వాయిదా. ఒక నాటకంలాగా ఉంటుంది.
ఒళ్ళో నిద్రపోతున్న పాప లేచింది. దానికి ఆకలేస్తొంది. దానికే కాదు తనకీ ఆకలేస్తోంది. పిల్ల ఏడిస్తే బయటికి పంపేస్తారు. జాకెట్ హుక్స్ తీసి పాలివ్వడంతో పాప మళ్ళీ నిద్రపోయింది. తన వెనక కూర్చున్నవాళ్ళు తనని గమనిస్తున్నారని తెలుసు. తన పక్కన కూర్చున్నవాడు తనవైపు చూస్తూనే ఉన్నాడు. తన లాయర్ కోర్టులోకి వస్తూ కనబడ్డాడు. హమ్మయ్య వచ్చాడు అనుకుంది.
తనవైపు చూశాడు. దణ్ణం పెట్టింది. లాయర్లు కూర్చునే దగ్గర కూర్చున్నాడు. గోదావరి ఆలోచిస్తోంది. ఈ రోజైనా ఏమైనా జరుగుతుందా? తనకూ, పిల్లకూ రావాల్సిన మనోవర్తి డబ్బులేమైనా వస్తాయా? ఎప్పటిలాగే వాయిదా వేసేస్తారా? ఆమెకు ఏడుపు తన్నుకొస్తోంది. ఛార్జీలకు డబ్బుల్లేకపోయినా, తిండి లేకపోయినా కోర్టుకు వస్తూనే ఉంది. ఆశగా ఎదురుచూస్తూనే ఉంది. మొన్న మీటింగులో ఏం చెప్పారు. తనలాంటి ముప్ఫైమంది తమ కేసుల్ని, బాధల్ని, లాయర్ల వైఖరుల్ని గురించి ఏడుస్తూ చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. కొంతమంది లాయర్లు తమని కోర్టు బయటే నిలబెట్టి, వాయిదా తీసుకుని వెళ్ళిపోతారని చెప్పిన విషయం, అలాంటపుడు మీరే కోర్టులోకెళ్ళి జడ్జిగారికి చెప్పుకోవచ్చు అని మీటింగుకి వచ్చిన ఒక మేడమ్ చెప్పిన విషయం గుర్తొచ్చింది. మీ కష్టం, మీ సమస్య న్యాయమూర్తికి చెప్పుకోవచ్చు, తప్పకుండా వింటారు, ఈసారి కోర్టుకెళ్ళినప్పుడు ప్రయత్నించండి అని గట్టిగా చెప్పిందావిడ.
గోదావరికి బాగా ఆకలేస్తోంది. పొద్దున్న ఏమీ తినకుండానే టీ తాగి బయలుదేరింది. బస్సులు మారి కోర్టుకు రావాలి. ఆటోలో వచ్చే స్థోమత లేదు. పన్నెండు దాటుతోంది. బెంచిమీద కూర్చున్న గోదావరికి కునికిపాట్లొస్తున్నాయి. ఆకలి పెరిగిపోతోంది. కేసుల మీద కేసులు వింటోంది జడ్జి అన్నీ వాయిదాలే.
చూస్తుండగానే లంచ్ టైమైపోయింది. జడ్జి ఠక్కున బెంచి దిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఉస్సూరుమనిపించింది గోదావరికి. కోర్టు నుంచి బయటికొచ్చింది. పాప భుజం మీద నిద్రపోతోంది. గంటక్కానీ కోర్టు మొదలవ్వదు. ఏం చెయ్యాలి? ఎదురుగా క్యాంటీన్ ఉంది. తన దగ్గర సరిపడా డబ్బుల్లేవు. క్యాంటీన్‌కి వెళ్ళి తింటే బస్సు కిరాయికి తక్కువ పడతాయి. అంత దూరం నడిచి వెళ్ళలేదు. తన లాయర్ ఎదురుగా వస్తున్నాడు.
‘‘ఏమైంది సార్, ఈ రోజు కేసు వస్తుందా?’’ ‘‘వస్తుంది. తర్వాత నంబర్ మనదే’’ అంటూ వెళ్ళిపోయాడు.
మెల్లగా క్యాంటీన్ వైపు నడిచింది. ఏదైనా తింటే కానీ ప్రాణం నిలిచేట్టు లేదు.
‘‘గోదావరీ! ఈ రోజు నీ కేసుందా?’’ అంటూ ఎవరో పిలిచారు. వెనక్కి తిరిగి చూస్తే పోలీస్‌స్టేషన్‌లో తనకు కౌన్సిలింగ్ ఇచ్చి తనని మొన్నటి మీటింగ్‌కి తీసుకెళ్ళిన మేడమ్.
‘‘అవును మేడం. పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాను. కేసు మధ్యాహ్నం వస్తుందట. తిందామని క్యాంటీన్‌కు పోతున్నా’’ అంది.
‘‘అవునా! నేను ఒక కేసు కోసం వచ్చాను. పద నేనూ క్యాంటీన్‌కే పోతున్నా’’ అంది.
‘‘సరే మేడం’’ ఇద్దరూ క్యాంటీన్‌కు వెళ్ళారు. గోదావరి కడుపునిండా దోశ తిన్నది. ఆకలి శాంతించింది.
‘‘ఇంకేమన్నా తిందామా. ఇక్కడ పెరుగన్నం బాగుంటుంది. తిందాం’’ అంది కౌన్సిలర్.
‘‘మేడం! నా దగ్గర డబ్బుల్లేవు. బస్సు టిక్కెట్టుకు సరిపోతాయి. పాపకి పాలిప్పించండి చాలు’’ అంది.
‘‘ఫర్వాలేదు. డబ్బులు నేనిస్తానులే’’ అని పెరుగన్నం, పాలు ఆర్డర్ చేసింది.
‘‘మేడం! మీ పేరు మర్చిపోయాను. ఇంకో మేడం పేరు గుర్తుంది.’’
‘‘సుభద్ర నా పేరు’’ పెరుగన్నం తెచ్చాడు. తిను గోదావరి. మళ్ళీ కోర్టుకు టైమవుతోంది. నేను వేరే కోర్టుకు వెళ్ళాలి’’ అని చెప్పి డబ్బులిచ్చేసి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ ‘‘ఆ కోర్టులో తొందరగా పనైపోతే నీ దగ్గరకు వస్తానులే’’ అంది.
‘‘అలాగే మేడం. చాలా థాంక్స్’’ అంది గోదావరి. సుభద్ర నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
… … …
కోర్టు లోపలికొచ్చి బెంచి మీద కూర్చుంది గోదావరి. ముందు బంట్రోతు, వెనక జడ్జి కోర్టులోకొచ్చారు. ఇద్దరు లాయర్లు అటూ, ఇటూ నిల్చుని ఏదో చెబుతున్నారు. జడ్జి కోపంగా ముఖం పెట్టి ఏదో అంటోంది. తనకి వినబడటం లేదు. షరా మామూలు. కేసు వాయిదా. ఆ కేసుకు సంబంధించిన ఆమె కాబోలు నెత్తి కొట్టుకుంటూ కోర్టులోంచి బయటికి నడిచింది.
గోదావరి కేసు పిలిచారు. లాయర్ రాలేదు. మళ్ళీ పిలిచారు. పరుగెత్తుకుంటూ వచ్చాడు కానీ ఏమీ చెప్పకుండానే వాయిదా అడిగాడు. అప్పుడు గోదావరి లేచి నిలబడిరది. లాయర్ ఆమెను కూర్చోమని సంజ్ఞ చేశాడు. అలాగే నిలబడిరది. పాప నిద్రబోతోంది. బెంచిమీద పడుకోబెట్టింది.
‘‘అమ్మా! నేనే గోదావరిని. నేను మీతో మాట్లాడాలి’’ అంది. ఆమె లాయర్ ఆమెను కూర్చోమని గద్దించాడు.
‘‘మీరాగండి, ఇటొచ్చి మాట్లాడమ్మా’’ అని దగ్గరకు పిలిచింది జడ్జి. కోర్టులో అందరూ అలర్ట్ అయ్యారు. లాయర్లు వాదించడమే కానీ ఎప్పుడూ వాది మాట్లాడటం చూడలేదు.
గోదావరి పక్కన కూర్చున్నామెకు పాపని చూడమని చెప్పి ముందుకెళ్ళింది. మీటింగులో మేడం చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుంది.
‘‘అమ్మా! నమస్కారం. నా పేరు గోదావరి. అక్కడ నిద్రపోతున్న పాపకి సంవత్సరం దాటలేదు. కోర్టుకు రావడం ఇది పదమూడోసారి. నాకు, నా బిడ్డకు న్యాయం జరుగుతుందనే ఆశతో కోర్టుకొస్తున్నాను. వచ్చినప్పుడల్లా బస్సు కిరాయికి కూడా డబ్బులుండవు. కోర్టుకొచ్చిన రోజు నాకు పస్తే. నేను ప్రేమ పెళ్ళి చేసుకున్నాను. కులాంతరమని మా పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు నన్ను గెంటేశారు. నా మొగుడు కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు. ఏదో కంపెనీలో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు. పసిగుడ్డును, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ కులంలో అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని తెలిసింది. నాకు ఎవరూ లేరు. మా పుట్టింటికి వెళ్ళలేను. చచ్చిపోదామనుకున్నాను. కానీ పసిపిల్లను వదలలేక బతుకుతున్నాను. ఎవరో చెబితే పోలీస్‌స్టేషన్‌కి వెళ్ళాను. వాళ్ళు నన్ను, నా పాపని ఒక హోమ్‌లో పెట్టారు. నీలాంటి ఆడవాళ్ళ కోసం ఒక చట్టముంది, రెండు నెలల్లో నీకు, పాపకి మనోవర్తి వస్తుందని చెప్పి కేసు పెట్టించారు. నాకు లాయర్‌ని పెట్టుకునే స్థోమత లేదు. ప్రభుత్వం నీకు న్యాయ సహాయం చేస్తుందని ఈ లాయర్‌కి నా కేసు ఇచ్చారు. ఇప్పటికి పన్నెండు సార్లు కోర్టుకొచ్చాను. నా మొగుడు ఒక్కసారి కూడా రాలేదు. తప్పు చేసినవాడిని పిలిపించరా అమ్మా! నాకు ఏ ఆధారం లేకుండా చేసి, నన్ను వదిలేసినోడికి మీరు ఏ శిక్షా వెయ్యరా? నన్ను, నా బిడ్డని పోషించుకోలేక నేను నానా కష్టాలు పడుతుంటే నన్ను మోసం చేసి వేరే పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయినవాడికి మీరు బుద్ధి చెప్పరా? చట్టం ప్రకారం రావలసిన పరిహారాలు నాకిప్పించరా?
ప్రేమ పెళ్ళి చేసుకున్నానని నా తల్లిదండ్రులు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు. పుట్టింటి నుంచి నాకు రావలసినవేవీ రాలేదు. మా అన్నదమ్ములతో పాటు నాకూ ఆస్తి రావాలి కదా! అలా ఇచ్చి ఉంటే ఈ రోజు నా పరిస్థితి ఇలా అయ్యుండేది కాదుకదా!’’
‘‘అమ్మా! నన్ను మీరు పన్నెండుసార్లు పిలిపించారు. నా మొగుడ్ని ఒక్కసారి కూడా పిలవరెందుకు? అతను రావడం లేదని మీరు వాయిదాలేస్తున్నారు కానీ దిక్కుమొక్కు లేని నాలాంటి వాళ్ళ గురించి ఆలోచించరా! రెండు నెలల్లో నీకు మనోవర్తి వస్తుందని పోలీస్ స్టేషన్‌లో చెప్పారు కానీ ఆరు నెలలైంది…’’
‘‘గోదావరీ! ఇంక ఆపు. కోర్టు వారి సమయం వృధా చేస్తున్నావ్’’ అంటూ అరిచాడు లాయర్. అప్పటికే ఆ కోర్టులో కొచ్చిన సుభద్ర, గోదావరి వైపు చూస్తూ మాట్లాడమని ధైర్యం చెప్పింది మౌనంగానే.
లాయర్‌ని వారించింది జడ్జి. ఆమె మొదటిసారి వాది చెప్పింది వింటోంది. లాయర్లు మెకానికల్‌గా చెప్పింది విని వాయిదాలిచ్చేసే ఆమె గోదావరి చెబుతున్న దాన్ని ఆసక్తిగా వింటోంది. బహుశా ఆమెకు వేరే కేసులు కూడా లేకుండొచ్చు.
‘‘అమ్మా! నేను చెప్పింది వినండమ్మా! నేను పెద్దగా చదువుకోలేదు. ఏదో సూపర్ బజార్‌లో చిన్న ఉద్యోగం చేసుకునేదాన్ని. మా అమ్మా, నాన్నకు నేనూ, మా తమ్ముడూ ఇద్దరమే. ప్రేమించానని నా మొగుడు నా వెంటపడి గుళ్ళో పెళ్ళి చేసుకున్నాడు. పాప పుట్టాక వదిలేసి పోయాడు. మా అత్తింటికి వెళ్తే కొట్టి పంపేశారు. పుట్టింటివాళ్ళు కూడా వదిలేశారు. నేనెలా బతకాలి. చనిపోవాలని ఎన్నోసార్లు అనిపించింది కానీ పాప కోసం ఆ పనీ చెయ్యలేకపోయాను. ఎవరో సలహా చెబితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. కేసు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను.
‘‘అమ్మా! నా గోస కూడా ఇనండి. నాకు ముగ్గురు పిల్లలు. మమ్మల్ని వదిలేసి నా మొగుడు ఇంకో పెళ్ళి చేసుకుని మమ్మల్ని బయటకు గెంటేశాడు. మేమెలా బతకాలి. నేను రెండేళ్ళుగా ఈ కోర్టుకొస్తున్నాను. మమ్మల్ని తిప్పుతున్నారు కానీ నా మొగుడ్ని పిలిచి బుద్ధి చెప్పరా! నాకు రావాల్సిన డబ్బులు ఇప్పించరా’’ హఠాత్తుగా లేచిన మరొకామె ఏడుస్తూ మాట్లాడుతోంది.
‘‘ఆర్డర్, ఆర్డర్’’ జడ్జిగారు సుత్తితో కొట్టారు.
కాసేపు నిశ్శబ్దం. ఇంకొకామె లేచి మాట్లాడసాగింది. కోర్టు బయట ఉన్నవాళ్ళందరూ లోపలికొచ్చేశారు.
గోదావరి మళ్ళీ మాట్లాడసాగింది. ‘‘అమ్మా! చూడండి. ఇంతమందిమి మీ తీర్పుల కోసం సంవత్సరాలుగా పుట్టెడు కష్టాలతో ఎదురు చూస్తున్నాం. బతకడానికి నానా గడ్డీ తింటున్నాం. పులి మీద పుట్రలాగా ఏమీ రాకపోయినా కోర్టు ఖర్చులు, బస్సు ఛార్జీలు తప్పడం లేదు. ఆకలికి నకనకలాడుతూ కోర్టు బెంచీల మీద ఎంతో ఆశతో ఎదురుచూస్తూ కూర్చుంటున్నాం. తమరేమో వాయిదాల మీద వాయిదాలేస్తున్నారు. నా మొగుడు రాకపోతే మీరేం చెయ్యలేరా? పోలీసులు అతన్ని పట్టుకురాలేరా! నా మొగుడు రాకపోయినా మీరు తీర్పు ఇవ్వొచ్చని మొన్న మీటింగులో చెప్పారు. మీతో డైరెక్టుగా మాట్లాడమని కూడా ఆమే చెప్పారు. లేకపోతే నాకింత ధైర్యం ఎక్కడిది? అదేదో పేరు చెప్పింది. నాకు గుర్తు రావడంలేదు’’ తల కొట్టుకుంటూ అంది.
‘‘ఎక్స్‌పార్టీ ఆర్డర్’’ సుభద్ర చెప్పింది.
‘‘ఆ.. అదేనమ్మా! అదివ్వొచ్చట కదా. అదిగో ఆ మేడమే నాకీరోజు ఇంత తిండి పెట్టించింది. మా బతుకులిలా అయిపోయాయి. కరుణించండి అమ్మా’’ కళ్ళల్లోంచి నీళ్ళు కారుతున్నాయి.
పాప లేచి ఏడుస్తోంది. సుభద్ర పాపను ఎత్తుకుంది. గోదావరి భయపడుతూ బెంచిమీద కూర్చుండిపోయింది. తానేనా ఇలా మాట్లాడిరది. ఆశ్చర్యంగా ఉంది.
కోర్టునిండా గృహ హింస బాధితులున్నారు. పెళ్ళి పేరుతో మోసపోయిన వాళ్ళు, పెళ్ళి తర్వాత అన్నీ కోల్పోయిన వాళ్ళు, అర్థాంతరంగా భర్తల చేత ఇళ్ళల్లోంచి వెళ్ళగొట్టిన వాళ్ళు, ఇల్లూ వాకిలీ లేదు, నిలువ నీడ లేదు, పిల్లలతో కోర్టులిచ్చే భిక్ష ‘మనోవర్తి’ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు.
జడ్జి ‘‘ఆర్డర్, ఆర్డర్’’ అంటున్నా వినకుండా చాలామంది తమ దుఃఖాలను వినిపించారు. బిగ్గరగా ఏడ్చారు.
పిల్లలు, పెద్దల ఏడ్పులతో కోర్టు హాలు మారుమోగిపోయింది. జడ్జి తలపట్టుకుని కూర్చుంది. ఆమెకీ కన్నీళ్ళొస్తున్నాయి. ఇంతమంది బాధితులు, దుఃఖితులు రోజూ తన కోర్టుకొచ్చి నిరాశతో వెళ్ళిపోతున్నారా? కోర్టు బెంచీలన్నీ కన్నీళ్ళతో తడిసిపోయి ఉంటాయి.
లాయర్ల యాంత్రికమైన వాదనల్లో తామూ కొట్టుకుపోతున్నారా? ‘వాయిదా’ అనే ఉరితాడుని రోజూ వాళ్ళ మెడకి బిగిస్తున్నామా? ఉక్కిరి బిక్కిరై, ఊపిరాడక ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో! వీళ్ళ బతుకుల్ని చిందర వందర చేసిన వాళ్ళని పోలీసులు గానీ, న్యాయ వ్యవస్థ కానీ ఉదాశీనంగా వదిలేయడం వల్లనే కదా! ఎలాంటి భయం లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. వాయిదా మీద వాయిదా అడుగుతున్నారు, కానీ వాళ్ళెందుకు రావడం లేదో ఏ రోజైనా తాను ఆలోచించిందా? తనకున్న అధికారాలను ఉపయోగించి తీర్పులు చెప్పింది. తానూ యాంత్రికంగానే ఆలోచించింది. ఇంతమంది బాధితులకు లేశమంత కూడా ఉపశమనం ఇవ్వలేకపోయింది. తలపట్టుకున్న జడ్జి తలలో ఈ ఆలోచనలన్నీ తిరుగుతున్నాయి.
‘‘గోదావరి కేసు చెప్పండి’’ అంటూ లాయర్‌ని అడిగింది. లాయర్ నీళ్ళు నములుతూ ‘‘గోదావరి భర్త వాయిదాలకు రావడం లేదు. నోటీసులకు స్పందించడం లేదు. అందుకే వాయిదా అడిగాను’’ అన్నాడు.
ఎక్కడినుంచో హఠాత్తుగా ఊడిపడ్డాడు గోదావరి భర్త తరపు లాయర్. ‘‘నా క్లయింట్ ఆరోగ్యం బాగోలేదు. అందుకే రాలేదు’’ అన్నాడు. ‘‘పదమూడుసార్లు ఆరోగ్యం బాగాలేదా? కోర్టంటే లెక్కలేదా?’’
‘‘ఈసారి తప్పకుండా వస్తాడు మేడం’’ అన్నాడు లాయర్.
ఆ మాటలేవీ వినిపించుకోకుండా గోదావరికి, పాపకి ఇంత మెయింటెనెన్స్ ఇవ్వాలని ‘‘ఎక్స్‌పార్టీ ఆర్డర్’’ ఇచ్చేసింది జడ్జి. వెంటనే బెంచి మీద నుండే ఆర్డర్ డిక్టేట్ చేసేసింది.
‘‘ఈసారి అతను రాకపోతే అరెస్ట్ వారెంట్ ఇష్యూచేస్తా, కోర్టుకొచ్చి తన వాదన వినిపించమనండి’’ అంది జడ్జి.
గోదావరి పాపనెత్తుకుని ‘‘ధన్యవాదాలమ్మా! నా పాపను బతికించారు’’ అంది దణ్ణం పెడుతూ.
ఆర్డర్, ఆర్డర్ అంటూ జడ్జి బెంచ్ దిగి లోపలికెళ్ళిపోయింది.
కోర్టులో అందరి ముఖాలు విప్పారాయి. తమకి కూడా న్యాయం దొరుకుతుందని ఆశ కలిగింది. సుభద్ర, గోదావరి కలిసి కోర్టు బయటికి నడిచారు. గోదావరిలో గొప్ప ఆత్మవిశ్వాసం కనబడిరది సుభద్రకు.
‘‘బాగా మాట్లాడావు గోదావరీ. నీ బాధని జడ్జిగారికి అర్థమయ్యేట్టు చెప్పగలిగావ్. నీ వల్ల అందరికీ మేలు జరుగుతుంది’’ అంది సుభద్ర గోదావరిని అభినందిస్తూ. ‘‘మీరిచ్చిన ధైర్యమే మేడం. ఆ రోజు ఆ మీటింగుకి రాకపోతే నాకన్ని విషయాలు తెలిసేవి కావు. జడ్జి గారితో మాట్లాడొచ్చని తెలియదు. నా మొగుడు కోర్టుకి రాకపోయినా ఆవిడ తీర్పులివ్వొచ్చని తెలియదు. అంతా మీ చలవే’’ అంది గోదావరి. ‘‘అదేం కాదులే. మీకున్న హక్కుల గురించి వివరించి చెప్పడమే మా పని. నా బండి మీద మీ ఇంటి దగ్గర దింపేస్తాను. పాప ఏడుస్తోంది కూడా’’ అంది సుభద్ర.
‘‘సరే మేడమ్’’ అంది గోదావరి.
సుభద్ర బండి మీద గోదావరి ఇంటికి బయలుదేరింది. వచ్చినపుడు ఏడుస్తూ వచ్చింది. వెళ్ళేటప్పుడు ధైర్యంగా ఇంటికి వెళుతోంది. జడ్జికి మనస్సులోనే నమస్కారం చెప్పుకుంటోంటే పెదవుల మీదకి నవ్వొచ్చింది.