స్పందన – జ్వలిత

‘హితురాలు భూమిక’
భూమికతో నా అనుభవం నా జీవితంలా ఎంతో చిత్రమైంది. 1975లో పదో తరగతిలో పెళ్ళితో ఆగిపోయిన నా చదువు, ఇద్దరు సంతానం తర్వాత ఇంటర్‌ లేకుండా 1985లో

హైదరాబాద్‌లో డాక్టర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ డిగ్రీతో తిరిగి మొదలయింది. తెలుగు పండిట్‌ ట్రైనింగ్‌ పూర్తిచేసి 1995లో నా 35వ ఏట ప్రభుత్వ ఉపాధ్యాయినిగా హైదరాబాద్‌ నుండి సత్తుపల్లి చేరాను. చాలా పెద్ద ఆవరణ, పెద్ద పెద్ద చెట్లతో, విశాలంగా సిమెంట్‌ రేకుల షెడ్లతో, అధిక సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులున్న చారిత్రాత్మక పాఠశాలది. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం. విద్యార్థులు కూడా సింగరేణి కార్మికుల పిల్లలే. ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలే ఎక్కువ. ఒక్క శాతం మిగిలిన వారి పిల్లలు. విచిత్రమైన వాతావరణం. రాత్రిళ్ళు అధిక చలి, పగలు భయంకరమైన వేడి. మండే ఎండలు, వదలని ముసురు, వణికించే చలి అన్నీ ఎక్కువే. వాతావరణం వలెనే అక్కడి మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలలో కూడా మిగిలిన ప్రాంతాల్లో కంటే భిన్నంగా ఉండేవి.
ఒకే తండ్రి ముగ్గురు, ముగ్గురు తల్లుల సంతానం ఒక తరగతి గదిలో విద్యార్థులుగా, బద్ధ శత్రువులుగా ఉండేవారు. కౌమార దశలో ఉన్న వారి మానసిక స్థితి, కుటుంబ నేపథ్యం, పిల్లలు చాలా ఒత్తిడికి లోనయ్యేవారు. మంచి తెలివైన వారైనా ఆ స్థితిలో గందరగోళంగా ఉండి, మా టీచర్లకు ఒక సవాల్‌గా ఉండేవారు. కొందరు ఉపాధ్యాయులు జీతం కోసమే పనిచేస్తారు. కొందరు వృత్తిపరమైన విలువల కోసం పనిచేస్తారు. ఇతర అవకాశాలున్నా అప్పటికే ఎల్‌.ఎల్‌.బి., పీజీ పూర్తి చేసి 15 సంవత్సరాలు ప్రైవేట్‌ పాఠశాలలో పనిచేసి ఉన్న నేను కేవలం వృత్తిపట్ల గౌరవంతో కుటుంబాన్ని హైదరాబాద్‌లో వదిలి ఒంటరిగా ప్రభుత్వ ఉపాధ్యాయినిగా ఉద్యోగంలో చేరాను. చిన్నప్పటి నుండి ఉన్న పుస్తకాల పిచ్చి, అదనంగా లభించిన ఏకాంత సమయం, బళ్ళో ఉన్న పెద్ద గ్రంథాలయం. మరొకసారి రోజుకు ఆరు గంటలు సాహిత్యం చదివే అవకాశం వచ్చింది. చదివినవి, చూస్తున్నవి దశాబ్దాల కాలాంతరాల్లో అక్షర రూపం దాల్చింది. కవుల పరిచయాలకు అవకాశం కలిగింది. కవి సమ్మేళనాలకు పిలిచినా, పిలవకపోయినా హాజరయ్యేదాన్ని. సాహిత్యాంశాలకు నిజజీవితాలను అంచనా వేసుకునేదాన్ని. 2000 సంవత్సరంలో విజయవాడలో జరిగిన సభలో భూమిక పత్రిక ఇచ్చారు. ఎవరో గుర్తులేదు. స్త్రీల కోసం పత్రిక మొదటిసారి చదివాను. చాలా నచ్చింది. అందులోని విషయాలను విద్యార్థులతో పంచుకున్నాను. అప్పటినుంచి నేను భూమిక పాఠకురాలిని. అప్పటికే ఎం.ఎస్‌.సి. సైకాలజీ మొదలుపెట్టాను. ఫ్యామిలీ కౌన్సిల్‌ మెంబర్‌గా కొత్తగూడెంలో ఆహ్వానం పొందాను. చలం, రంగనాయకమ్మ రచనల ప్రభావంతో పాటు భూమిక పత్రిక స్త్రీల చట్టాల గురించి, స్త్రీల సమస్యల గురించి, బాలల హక్కుల గురించి అందించే సమాచారం, ధైర్యం నాకు చాలా ఉపయోగపడిరది. 2005లో ‘పారా లీగల్‌ వాలెంటీర్‌’గా శిక్షణ పొందడానికి స్ఫూర్తినిచ్చింది కూడా భూమికే.
మా కుటుంబంలో స్త్రీలెవ్వరూ ఇంతకుముందు చెయ్యని పనులు కవిత్వం రాయడం, లాయర్లు, డాక్టర్లు, పోలీస్‌ వారితో కలిసి ఎవరో కుటుంబ సమస్యలకు పరిష్కారం కోసం నేను పనిచెయ్యడం నా కుటుంబంలో కొన్ని సమస్యలు, కొన్ని అపోహలు సృష్టించింది. అందుకు స్త్రీ వాద రచయితలు కూడా కారణమయ్యారు.
2006లో భూమిక నిర్వహించిన కథ, కవిత, వ్యాస రచనల పోటీలో నేను రాసిన ‘మాయమవుతున్న మనసు’ కథ తృతీయ బహుమతి పొందింది. అబ్బూరి ఛాయాదేవి, భార్గవి రావు, కొండవీటి సత్యవతి గార్ల చేతులమీదుగా బహుమతి అందుకున్నాను. ఆ సంఘటన నా సాహిత్య జీవితాన్ని నిర్దేశించింది. నా జీవితానికి కొత్త ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చింది. అప్పటి నుండి ఎందరో బాధితులకు భూమిక నంబర్‌ ఇచ్చేదాన్ని. భూమిక రచయితల క్షేత్రస్థాయి పర్యటనలలో పాలు పంచుకునే అవకాశం రాలేదు. కానీ భూమిక నిర్వహించిన అనేక వర్క్‌షాపులకు హాజరయ్యాను. 2006లో సత్యవతి గారితో పరిచయమైనా 2008 తర్వాత వారితో మాట్లాడగలిగాను.
2007లో పరివ్యాప్త సంకలనం కోసం పని చేస్తున్నప్పుడు, స్థానిక ప్రజా ప్రతినిధి ఒకరు నన్ను పిలిపించి ‘భర్తలకు వ్యతిరేకంగా భార్యలను రెచ్చగొడుతూ ఏదో పుస్తకం రాస్తున్నారట. మీకెందుకండీ? పిల్లలకు పాఠాలు చెప్పేవాళ్ళకు అవసరమా?’ అంటూ సలహా వంటి హెచ్చరిక చేశాడు. మా పాఠశాలలో ఉపాధ్యాయ వర్గం… అందులో మహిళా ఉపాధ్యాయినులు కూడా వారింటి చుట్టూ తిరుగుతుంటారని తర్వాత తెలిసింది. అయినా వదలకుండా జిపిఎఫ్‌ లోన్‌ తీసుకుని చేసిన సంకలనాన్ని, సాహిత్యలోకం పక్కకు పెట్టింది. కానీ ‘పరివ్యాప్త’పై శిలాలోలిత గారు రాసిన వ్యాసాన్ని భూమిక ప్రచురించింది. నాకెంతో ఆనందమనిపించింది.
2009లో బదిలీతో ఖమ్మం చేరాను. అనేకమంది బాధితులకు తెలంగాణ మాత్రమే కాదు తెలంగాణేతర కేసులకు కూడా సత్యవతిగారి సహాయం తీసుకున్నాను. నా సొంత సమస్యలకు భయం కలిగినా, బాధితులకు ధైర్యం చెప్పే క్రమంలో నేను కూడా ఊరట పొందాను. పాఠశాలలో టోల్‌ఫ్రీ నంబరు విద్యార్థులకు అందుబాటులో ఉంచేదాన్ని. టోల్‌ఫ్రీ నంబర్‌ లైబ్రరీ గోడకు అంటించాను. ‘పాము కాటెయ్యకున్నా స్వీయ రక్షణ కోసం బుస కొట్టాలె’ అనే సూత్రం విద్యార్థులకు ఉపయోగపడేది. నేను గొంగళి పురుగుగా చీదరించబడుతున్నప్పటి నుండి నన్ను నేను మలచుకుని రెక్కలు మొలిపించుకుని ‘బహుళ’ రూపధారినై, సీతాకోకచిలుకనై విభిన్న వర్ణాలలో, విభిన్న రంగాలలో పనిచేస్తున్నా. ‘బహుళ పత్రిక’ నిర్వహణకు ఎంతో ప్రేరణ, ప్రోత్సాహాన్నందించింది భూమిక. నా వంటి ఎందరికో వెన్ను పూసలో మూలుగవలె పైకి కనిపించకుండా జీవితాలను నిలబెడుతుంది భూమిక. 30 ఏళ్ళ భూమిక ప్రయాణంలో దాదాపు 23 ఏళ్ళ నుండి భూమిక నాకు హితురాలిగా భుజం తడుతూ వచ్చింది. భూమిక నుండి తీసుకున్నదే ఎక్కువ. ఇచ్చిందేమీ లేదు. ఇటువంటి పత్రికకు మన వంతు సహకారం అందించడం కూడా సాహితీ లోకం బాధ్యత.
` జ్వలిత

Share
This entry was posted in స్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.