భూమికకు హార్దిక శుభాకాంక్షలు
ముప్ఫయి సంవత్సరాల పుట్టినరోజు జరుపుకుంటున్న భూమికకు ముందుగా హార్దిక శుభాకాంక్షలు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ స్థిరంగా నిలబడి, మరెందరో మహిళలకు ఆపన్న హస్తం అందిస్తున్న భూమిక ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని
ఆశిస్తున్నాను.
భూమిక ఏం చేసింది? ఇంకా ఏమేమి చేయాలి? అనే విషయాలు చాలామంది రాస్తారు. అందుకని ఆ విషయాల్లోకి వెళ్ళకుండా నాకు, మా బడి పిల్లలకు ‘భూమిక’తో ఉన్న అనుబంధాన్ని మాత్రమే రాస్తాను. ఇదొక మహాసముద్రం కాబట్టి, అందరికీ అవకాశం
ఉండాలి కనుక వ్యాసం కూడా సంక్షిప్తంగానే రాయదలచుకున్నాను. భూమికతో అనుబంధం ప్రత్యక్షంగా కొంత, పరోక్షంగా మరింత కొనసాగుతూ ఉంది. 2002 సంవత్సరంలో అనుకుంటా… నేను లాలాపేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న రోజులు. కౌమార దశలో ఉన్న ఆడపిల్లలకు భూమిక పత్రికలను పరిచయం చేయాలని గాఢంగా అనిపించింది. అప్పటికే సత్యవతి గారితో కొంత పరిచయం ఉండటం వలన నేరుగా భూమిక ఆఫీసుకు వెళ్ళి తనతో విషయం చెప్పాను. తను చాలా సంతోషించింది. అది మొదలు పాఠశాలకు పత్రిక వచ్చేది. మా పిల్లలు దానికోసం ఆతృతగా ఎదురు చూసేవారు. పిల్లలతో పాటు ఉపాధ్యాయులు కూడా చదవడానికి పోటీపడేవారు. దానివలన స్త్రీ వాదంతో పెద్దగా పరిచయం లేకపోయినా భూమిక వాళ్ళమీద తన ప్రభావం బాగానే వేసిందని చెప్పొచ్చు. నా సహోద్యోగిని తన మొదటి కవిత భూమికలో వచ్చిందని చాలా గర్వంగా చెప్పుకుంటుంది. ఇక్కడ ఒక సంఘటనను ప్రస్తావించాలి. తమ పాఠశాలను పక్కనే ఉన్న బాలుర పాఠశాలలో కలిపి వేయడానికి ప్రభుత్వం పూనుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా రాస్తారోకోలు చేసి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు 500 పోస్టుకార్డులు రాసి ఆ ప్రయత్నాన్ని విరమింపచేశారు. తమ పాఠశాలను కాపాడుకున్నారు. అప్పట్లో అక్కడ చదువుకున్న ఆడపిల్లలందరూ ఈనాడు ఆర్థికంగా, సామాజికంగా బాగా స్థిరపడ్డారు. వ్యక్తిత్వం రూపుదిద్దుకునే దశలో భూమిక లాంటి పత్రిక వాళ్ళ చేతికి అందడం ప్రధాన కారణమని ఖచ్చితంగా చెప్పగలను.హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు వెళ్ళడం, అక్కడ భూమిక స్టాల్‌ను దర్శించడం చేసేవారు.
రచయితలతో భూమిక నిర్వహించిన ప్రయాణాలలో నా మటుకు నాకు వాకపల్లి, గంగవరం పోర్టు బాధితులను కలవడం మరచిపోలేని విషయం. అప్పుడు నాతోపాటు వచ్చిన నా స్నేహితురాలు సీతామహాలక్ష్మి ఇప్పటికీ భూమిక అభిమాని. ఒకసారి భూమికతో పరిచయం ఏర్పడితే వదిలిపెట్టడం సాధ్యం కాదు… అని చెప్పడానికి ఈ విషయం రాశాను.
ఇదంతా రాయడంలో నా ఉద్దేశ్యం… కౌమార దశలోని ఆడపిల్లల్లోకి కనుక భూమిక దూసుకువెళ్తే అద్భుతమైన ఫలితాలు
ఉంటాయని చెప్పటానికే. అలాగే పల్లె స్త్రీలలో కూడా వెళ్తే బాగుంటుంది.
` గిరిజ పైడిమర్రి