– డా. ఎస్వీ సత్యనారాయణ
మాయమాటలు నమ్మి చెల్లెమ్మా! – నువ్వు
మోసపోవద్దింక చెల్లెమ్మా!
పొగుడుతున్నారనీ చెల్లెమ్మా!- నువ్వు
పొంగిపోవద్దింక చెల్లెమ్మా! ||మాయ||
ఆడదానివి- అబల-సుకుమారివన్నారు
వంట ఇంటికి నిన్ను అంకితం చేశారు
చెయ్యి పడితే చాలు షడుచ్రులు అన్నారు
చేతినే ఒక గరిటె, గిన్నెగా మార్చారు
వండుతూ, వడ్డిస్తూ చెల్లెమ్మా! – నువ్వు
వంటిల్లువయ్యావు చెల్లెమ్మా! ||మాయ||
అందమున సిరిలొలుకు ఆదిలక్ష్మన్నారు
ధనధాన్యలక్ష్మి – సంతానలక్ష్మన్నారు
సకల సంపదలకూ పుట్టిల్లువన్నారు
సంతకానికి నిన్ను పరిమితం చేశారు
కనుసైగతో నడిచె చెల్లెమ్మా! – నువ్వు
కీలుబొమ్మయ్యావు చెల్లెమ్మా! ||మాయ||
వీణబట్టిన వాగ్దేవిగా పొగిడారు
వాఙ్మయానికి నిన్ను దూరమే పెట్టారు
మగువ స్వాతంత్ర్యానికర్హమే కాదంటు
మనుధర్మశాస్త్రాల రాతలే రాశారు
చదువుకే దూరమై చెల్లెమ్మా! – నువ్వు
చట్టుబండయ్యావు చెల్లెమ్మా! ||మాయ||
ఇక్కట్లు దాటుతూ స్కూలు మెట్లెక్కావు
ఇంటిపనితో పాటు చదువుతానన్నావు
పండుగలు పబ్బాలు – పెళ్ళి పేరంటాలు
విందులు వినోదాలు – ఆనంద సమయాలు
చిరునవ్వుగా మారి చెల్లెమ్మా! – నువ్వు
చితికిపోతున్నావు చెల్లెమ్మా! ||మాయ||
స్కూలు విద్యేచాలు- పై చదువులెందుకని
చేతులెత్తేస్తున్న పెద్దలను ఒప్పించి
అష్ట కష్టాలతో కాలేజికొచ్చావు
కష్టపడి చదవడం ఇష్టమని అన్నావు
రాగింగు టీజింగు చెల్లెమ్మా! – నువ్వు
ఆట బొమ్మయ్యావు చెల్లెమ్మా! ||మాయ||
అనుభవించిన తీవ్ర అవమానములు చాలు
కుమిలిపోయిన గుండెగాయాలు ఇక చాలు
ఆకసానా సగం- అవనిలో సగమంటు
లోకమంతా స్త్రీల చైతన్యమొచ్చింది
కళ్ళెర్రజేయవే చెల్లెమ్మా! – నువ్వు
కాళివై గర్జించు చెల్లెమ్మా! ||కళ్ళెర్ర||
(మార్చి 8- అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని….)