– పంతం సుజాత
తనిఖీ కొచ్చిన తాసిల్దారులా వస్తున్న హెడ్మిసెస్ని చూసి
చదువుతున్న వారపతిక్రను తిరగేసి దాచిన జాణతనం
టీచరొస్తున్న అలికిడై గార్డెన్లో కోసిన ముద్దబంతిని
యూనిఫాంలో దాచుకున్న గడుసుతనం ఏమైపోయిందో తెలీదు!…
వయసొస్తున్న కంగార్లో నా బాల్యాన్ని
ఎక్కడో ఒలకబోసేసుకున్నాను
కొంగల బారుని చూస్తూ పరిగెడుతుంటే
రాయి తగిలి పడిపోయిందో
కార్తీకమాసపు చలిలో తడికొంగుతో తడబడుతుంటే
గుడిమెట్లమీద జారిపోయిందో
కొబ్బరాకుల్లోంచి చందుణ్ణ్రి చూస్తుంటే
చీకటికి బయపడి పారిపోయిందో తెలీదు
ఎంతని వెతకను, ఎక్కడని చూడను
కలైన గతాన్ని కళ్ళాపు జల్లుకుంటూ, కాళ్ళరిగేలా తిరుగుతుంటే
‘కో’ అంటూ ఓ కేక… చూస్తే
స్కూలు ఆవరణలో ‘కో.కో’ ఆడుతున్న పసితనం
బడిలో నా బాల్యం బంతులాడుతోంది.
గేటు కివతల నా గుండె గెంతులాడుతోంది.