కులమతాల కుచ్చుటోపీలలో
శిరసు వుంచి, శిరమువంచి
సలాములు కొడుతూ సంకుచిత ఆలోచనలతో
అన్యాయానికి పట్టం కట్టే
చీకటి రాత్రులకు వెలుగు రేఖలు అందేది ఎన్నడో
అహమే అంకురమై
ఉచితానుచితాలు మరచి
ఎదుటివాన్ని వేలెత్తిచూపిస్తూ
తనలొసుగులు మరిచే లోకం పోకడకు వెలుగురేఖలందేదెప్పుడో
మారుతున్నకాలంతో మారక
కుక్కతోకలా బుద్దులుమారని
ప్రబుద్దులున్న సమాజంలో
ఆంక్షలందించి అంతుచూసే ఆగడాలకు వెలుగు రేఖలందేదెప్పుడో
బద్దకమే బంధువుగా
బాధ్యతలను వీడి
శ్రమను మరచి ఉచితాల ఉల్లాసంలో పెత్తనాల బెత్తంతో
కడుపునింపుకునే నీచ నికృష్టుల ఆగడాలకు వెలుగురేఖలందేదెప్పుడో
చీకటిని చీల్చుకొని వెలుగువైపు పయనిస్తూ
అడ్డొచ్చిన కంటకాలను ఆదిలోనె తుంచుతూ
మునుముందుకు సాగుతున్న
‘ముదితల’ తపనలను కాలరాచే కాలాంతక, కాలయముల పాశాలకు అందకుండా పయనమైనా
అడడుగున ఆటంకపరిచే
మానసిక ఉన్మాదుల వలలో చిక్కి వంచనకు గురౌతు
బతుకును బలిచేసుకుంటున్న
మగువలకు వెలుగురేఖలందేదెప్పుడో