సమకాలీన స్త్రీవాద సాహిత్యం ` అనిశెట్టి రజిత – డాక్టర్‌ కరిమిండ్ల లావణ్య

సామాజిక అభ్యున్నతి లక్ష ్య సాధనే తన జీవిత ధ్యేయంగా మొదలై, సామాజిక ఉద్యమాలలో తన పాత్రను నిర్వహిస్తూ ఎంతో మంది సాహిత్య పిపాసకులకు, సామాజిక కార్యకర్తలకు దగ్గరై, మానవీయ కోణ దృక్పథాన్ని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్న వాస్తవికవాద, నిరసనవాద రచయిత్రి, కవయిత్రి, గాయకురాలు, సామాజిక కార్యకర్త అనిశెట్టి రజిత.

‘‘గతం నాది నాస్తి కాదు నేస్తం అది జ్ఞాపకాల ఆస్తి’’ అనిశెట్టి రజిత హృదయాంతరంలో సాహిత్యమే జాస్తి. మహిళా చైతన్యం, సంస్కరణం జరిగితే ఇక అన్నీ వాస్తే. సమసమాజ నవ సమాజ నిర్మాణానికి నాంది పలికే భావజాలంతో అవకాశమొస్తే ఎంతైనా తెగించి పని చేసే తత్త్వం సామాజిక సాహిత్యకార్యశీలి అయిన అనిశెట్టి రజితది. 1970`80 ల్లో అభ్యుదయ, విప్లవ కవిత్వాలు సాహిత్య వీధుల్లో కరతాళ ధ్వనుల మధ్య సాగుతున్న తరుణంలోనే, అదే పంథాలో సాగిన, సాగుతున్న కవిత్వం వీరిది.
సమకాలీన సాహిత్యంలో స్త్రీ వాదం అనే పేరు వినిపించని కాలం నుండి స్త్రీ అణచివేతకు నిరసనగా స్త్రీ స్వాతంత్య్రానికి సంబంధించిన సాహిత్యాన్ని పాఠకలోకానికి అందించింది. అంతకు ముందు కాలంలో స్త్రీ జనోద్ధరణకు కృషిచేసిన సామాజిక సాహిత్య వైతాళికుల సంఘసంస్కర్తల రచనలూ ఆచరణల ప్రభావం ఈ రచయిత్రి మీద బలంగా ఉన్నది. చలం, శ్రీ శ్రీ, దాశరథి, సినారె, బైరాగి, తిలక్‌, రావిశాస్త్రి, రంగనాయకమ్మ, కాళోజీ తదితరుల అభ్యుదయ, విప్లవ భావాలు తన సాహిత్య అధ్యయనం ద్వారా అనిశెట్టి రజిత భావజాలంలో మిళితమయ్యాయని ఆమె సాహిత్యాన్ని పరిశీలించినపుడు అర్థమైంది.
స్త్రీ వాదంతో వెలువడిన అనిశెట్టి రజిత రచనలు సాటి స్త్రీలను ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. అనిశెట్టి రజిత స్త్రీని అభ్యుదయ పంథాలో నడవమని తన రచనల ద్వారా చెబుతుంది, స్త్రీలను చైతన్యపరుస్తుంది, అన్ని రంగాల్లోముందుండమని ప్రోత్సహిస్తుంది. కేవలం రచనల ద్వారానే కాదు సామాజిక కార్యకర్తగా నినదిస్తుంది. ప్రత్యేకంగా స్త్రీ స్వాతంత్య్ర వాదాన్ని పైకి తీసుకొని రావడంలో ప్రముఖ పాత్రవహించి, ముందుకు సాగుతుంది. ఈ కాలంలో, లోకంలో స్త్రీ ఒంటరిది అనే భావనను తిరస్కరిస్తూ ఒక చేయిని వందల వేల చేతులుగా మార్చి, చేయూతనిస్తూ, సమతా పథంవైపు, అందరినీ నడిపిస్తుంది.
అనిశెట్టి రజిత సాహిత్యంలో స్త్రీ వాద, దళితవాద, బహుజనవాద, ప్రాంతీయ వాదాలు, మానవతా వాద భావాలు సృజిస్తాయి. నిస్వార్థపూరిత, నిష్కల్మష జీవితానికి నిలువుటద్దం రచయిత్రి అనిశెట్టి రజితది. అందుకే తను వివిధ సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేస్తూ బాధితులను చైతన్య పరిచే ప్రయత్నం చేస్తున్నారు. సాహిత్య రంగంలో దూసుకెళ్తూ, అత్యాధునిక ధోరణులను ప్రకటిస్తున్నారు. తన రచనలైన ‘‘గోరంత దీపాలు’’, ‘‘గులాబీలు జ్వలిస్తున్నాయి’’, ‘‘నేనొక నల్లమబ్బునవుతా’’, ‘‘అనగనగా కాలం’’, ‘‘ఉసురు’’, ‘‘దస్తఖత్‌’’, ‘‘చెమటచెట్టు’’, ‘‘ఓ లచ్చవ్వ’’, ‘‘నన్హే ఓ నన్హే ’’, ‘‘తదితర కవితా’’, ‘‘నానీ’’, ‘‘హైకూ’’ దీర్ఘ కవితా సంపుటాలు, ‘‘మట్టి బంధం’’ కథా సంపుటాలు పీడిత ప్రజలను చైతన్యపరిచే విధంగా ఉన్నాయి. తెలంగాణా గేయ సంపుటాలైన ఆనుగర్రలు,తెలంగాణ మట్టిపాటల్లో
ఉద్యమగేయాలు రాసారు, పాడారు. వారి వివిధ సంకలనాలైన ఊపిరి, వెతలే… కథలై, గాయాలే.. గేయాలై, సోయి తెలంగాణ
ఉరుములు ` మెరుపులు, తెలంగాణ జంగ్‌లో ఉన్న కవితలు, కథలు పర్యావరణ స్త్రీ వాదం గురించి, స్త్రీ చైతన్య వాదం గురించి, తెలంగాణా ఉద్యమ వాదం గురించి చెబుతున్నాయి.
వీరి రచనలను పరిశీలించినపుడు రెండు ప్రధాన వస్తువులు కనిపిస్తాయి. అవి 1. స్త్రీ చైతన్యం, స్వాతంత్య్రం 2. ప్రాంతీయ వాద చైతన్యం. వాటిని సంక్షిప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.
స్త్రీ శక్తికి నిదర్శనం ` నేనొక నల్ల మబ్బునవుతా
బానిసలై బతుకీడుస్తున్న స్త్రీల అభద్రతను, అమానవీయ విలువలను, స్త్రీల పరాయీకరణను, స్త్రీ పట్ల పురుషులు ప్రదర్శిస్తున్న విచక్షణా రాహిత్యపు చర్యలను సమాజంలో ప్రత్యక్షంగా చూసిన కవయిత్రి వాటిని నిరసిస్తూ, తనకవిత్వంలో స్పందించింది. స్త్రీ శక్తిని, సృజనాత్మకతను రాహిత్యంలోకి నిర్వీర్య పరుస్తున్న పురుష స్వామ్య ఆధిపత్యాన్ని ధిక్కరించే సాహసం స్త్రీని చేయమని ప్రోత్సహిస్తుంది. సామాజిక గమనంలో స్త్రీ జన వాద ఉద్యమాలకు సమాజంలో 1986లో స్త్రీలకు నిర్వహించిన అందాల పోటీలను వ్యతిరేకిస్తూ విమర్శనాత్మకంగా రాసిన పత్రికా లేఖపై ఒక దినపత్రికలో నెల రోజులపాటు విస్తృత చర్చ జరిగింది. 1986 లో రాసిన ‘‘ముళ్ల కిరీటం’’ కవితలో స్త్రీల అందం అంగడి వస్తువుగా మారద్దని అన్నది.
స్త్రీల పట్ల కట్టుబాట్లకు నిరసన
స్త్రీని బానిస కట్టుబాట్లకు, సంప్రదాయాలకు ప్రతిరూపాలుగా చూపిస్తూ, ఆమె మాట మీద, మనసుమీద, నడకమీద, నవ్వుమీద ఆంక్షలు విధించే ప్రయత్నం చేసిందీ సమాజం. దానికి నిరసనగా ‘‘శతాబ్దాల శృంఖలాలు’’ కవితలో స్త్రీల బానిసత్వాన్ని, వరకట్న పీడనాన్ని నిరసిస్తూ, పురుషాధిక్య ప్రపంచాన్ని ప్రశ్నిస్తూ, జండర్‌ అసమానతలకు అంతంపలకాలని కోరుతుంది కవయిత్రి. ‘‘పాతివ్రత్యం, సహనం, శాంతం, క్షమా/ త్యాగం, అబలత్వం, అణకువ/ బానిసకొక బానిసగా/ బానిస సంస్క ృతిలో / బతుకు వెళ్ళమారుస్తున్న స్త్రీకి/ భర్తే దైవమనీ జీవితమనీ/ మొగుడు పోయిన స్త్రీలను మంటల్లోకి తోసారు/ బాల్య వివాహాల ఆచారంతో/ పసిపిల్లల్ని అంగట్లో అమ్ముకున్నారు’’. ఇలా స్త్రీలకు తరతరాలుగా సమాజంలో జరుగుతున్న అన్యాయాల విస్తృతత్త్వాన్ని ఎత్తిచూపుతున్నారు. వైధవ్యం అనుభవించే స్రీల వేదన, కట్న కానుకల దురాచారాలతో కాలరాస్తున్న సమాజం పోకడ, రాచరికపు భూస్వామ్యంలో అలంకారపు బొమ్మగా స్త్రీని వాడుకున్న లోకపు తీరు, స్త్రీని కామ క్రీడా సాధనంగా ఉపయోగించుకునే నీచత్వం, ఒక్కటేమిటి రకరకాల ఆత్మఘోషలకు ముగింపు మొదలైంది. కదన రంగంలోకి కత్తిపట్టి కాలూనే సమయం ఆసన్నమైందనే సూచన వీరి కవితల్లో కనిపిస్తుంది. ‘‘రాజీలేని మార్గం’’ కవితలో ‘‘మీరు నడచిన బాటల్లోనే నడిచి/ మీరు పాడుకున్న పాటల స్వరాలనే పాడుకుంటూ/ మీరు చేరిన గమ్యాన్నే నన్నెందుకుచేరమంటారని’’ ప్రశ్నిస్తుంది.
స్త్రీల మీద అమలయ్యే హింసా రూపాలు
స్త్రీల మీద అమలయ్యే హింసల రూపాలు ‘‘ఒక ఆడపిల్ల జన్మించిన వేళ’’, ‘‘ఆట బొమ్మలు’’, ‘‘ఆమెచెట్టు’’, ‘‘ముళ్ళ కిరీటాలు’’, ‘‘వాంగ్మూలంలో పాతివ్రత్యం’’, ‘‘అన్నాలం! అన్నాలం’’, ‘‘ఎంతకాలమే చెల్లెలా’’..? కవితల్లో స్త్రీల బతుకు దోపిడీకి ఎలా గురవుతుందో చెప్పింది. స్త్రీ పుట్టేటపుడు ఒక మనిషిగానే పుడుతుంది కానీ ‘‘గొడ్డు చాకిరీకి నడుము వంగేలా/ ప్రత్యేక శిక్షణలో తర్ఫీదు ఇవ్వబడుతుంది’’. ‘‘వండి వార్చడాలూ/ పెంటలెత్తడాలూ/ కళ్ళువాల్చి నోరెత్తకుండా/ తల ఊపడం గూర్చిన హుకుంలు’’. ఇవన్నీ స్త్రీ చేసే ఇంటి చాకిరీకి చెందిన వివిధ దశలు. స్త్రీ త్యాగశీలి, సహనశీలి అంటూ నోరెత్తకుండా తయారుచేస్తుందీ సమాజం. ప్రతీ ఇంట్లో అనేక పాత్రలను నిర్వహించేది స్త్రీ. కాని, సమానత్వ విషయానికొచ్చేసరికి నోరునొక్కి చెవులు మూస్తుంది పురుషాధిక్య సమాజం.
మన అంగట్లో అన్నీ దొరుకుతాయి. అందులో ఆకలి తీర్చే సరుకులూ, ఆడవాళ్ళ శరీరాలూ, పశు మాంసపు వ్యాపారంలాగే పడతులను ఎగుమతి చేసే వ్యాపారం జరుగుతుంది. ఎంతో మంది స్త్రీల జీవితాలను మోసపూరితంగా వంచించిన పురుషులు ా మాకేం తెలియదు తప్పంతా వ్యవస్థదే అంటూ అఘోరిస్తారు. వేద భూమిగా, కర్మభూమిగా, పవిత్ర భూమిగా పేరొందిన భారతావనిలో స్త్రీల అణచివేతకు ముగింపు పలకాలనే అభిలాషను కవయిత్రి వ్యక్తం చేసింది.
అనిశెట్టి రజిత సాహిత్యాన్ని అధ్యయనం చేసే కొద్ది లోతులను స్పృశించిన ఆమె దృక్పథం తెలియవస్తుంది. అక్షరం ముక్కరాని లక్షలాది మంది స్త్రీల పరిస్థితి ఏమిటనే ఆవేదన కనిపిస్తుంది. గ్రామాల్లోని స్రీల పరిస్థితి ఒక విధంగా ఉంటే, ఉద్యోగాలు చేస్తున్న మధ్యతరగతి స్త్రీల పరిస్థితి మరో విధంగా ఊబిలో కూరుకుపోయింది.వాళ్ళ మెదళ్ళకు పట్టిన అజ్జానపుతుప్పు ఎవరు వదిలిస్తారు. ఈ ఆధునిక కాలంలో పెనుతుఫానులా ఎగిసిపడుతున్న అస్తిత్వ ఆత్మ గౌరవ ఉద్యమాలు స్త్రీ జీవితంలో మార్పును తీసుకొస్తాయా? అంటూ ‘‘నేనెరిగిన మేధావులు’’ కవితలో ‘‘నిష్ఠగా మడి కట్టుకొని / పొందిగ్గా గదుల్లో కూర్చొని / టీలు, బిస్కట్లు సేవిస్తూ / లంచ్‌లూ కిల్లీలు దంచేస్తూ / లెక్కలు కట్టి దేశ దారిద్య్రాన్ని / దేశసౌభాగ్యాన్ని చర్చించే విషయం’’/ సామాన్యులకేం తెలుస్తుందని కవయిత్రి అంటుంది.
ఆడపిల్లకు పెండ్లి చేసి చేతులు దులుపుకునే తల్లిదండ్రులు తన బిడ్డ మరో ఇంట్లోకి గానుగెద్దులా పని చేయడానికి వెళ్తుందని గ్రహించరు. గ్రహించినా అది సర్వ సామాన్యమైన విషయంగా భావిస్తారు. ‘‘వంటింట్లో వడ్డింపులకీ/ తిరిగే గానుగెద్దులా స్త్రీని సమాజం తయారు చేస్తుంది’’. ‘‘అంట్లు తోముతూ/ బట్టలుతుకుతూ/ అరగదీసుకుపోయే శ్రీ గంధపు చెక్కవుతుంది స్త్రీ’’. అందర్ని అక్కున చేర్చుకొనే ఆత్మీయ బంధువు అవుతుంది. లోకానికే ఆత్మీయ బంధువైన స్త్రీ ఉనికిని కాపాడాల్సిన అవసరం సమాజంపై ఉందనే వాస్తవాన్ని ఎరుక పరుస్తుంది కవయిత్రి.
‘‘ఆకాశంలో సగం, భూమ్మీద సగం, ఉత్పత్తిలో సగమైన ఆడవాళ్ళ అణచివేతలని, సూక్ష ్మమైన అణచివేత రూపాలను అవగతం చేసుకొవడమే గాక సమస్త శృంఖలాల నుండి స్త్రీలు విముక్తమవ్వాలని, సహజీవన సహన సహచర్యలు పునాదిగా కొత్త సమాజం పుట్టుకురావాలనే ఆకాంక్ష రజిత కవిత్వానికి పునాదని కొండవీటి సత్యవతి ‘‘నేనొక నల్ల మబ్బునవుతా’’ కవితా సంపుటి ముందుమాటలో చెబుతుంది. ఇంకా, స్త్రీ జనవాద ఉద్యమానికి ఈ కవితా సంపుటి చిరుకానుక అవుతుందన్నారు.
‘‘చెప్పు చెల్లె’’ కవితలో సంతానం కోసం వరాలు పడుతూ, సంక్రాంతి జాతరలో చలికి చనిపోయిన ముగ్గురు యువతుల అంతం, మూఢనమ్మకాల ముసుగులో కమ్ముకుపోయిన స్త్రీల అజ్ఞానం, అమాయకత్వం, ఆత్మ క్షోభల ప్రస్తావన కనిపిస్తుంది. మూఢనమ్మకాల ముసుగులో దాక్కున్న స్త్రీల ఆక్రోశం, ఆవేదన, ఆత్మక్షోభ శవాలుగా తేలిన విధానం తెలుస్తుంది. ‘‘యెందో నీ యెడ్డేషం గని/ రాల్లకు రప్పలకు వరాలు బడ్తె/ పానాలు బోతాయిగని పిల్లలు పుడ్తరా/ ముక్కోటి దేవుల్లకు ముడుపులు గడితె/ సంతానం గలుగుతదా చెప్పు చెల్లే’’ అని సూటిగా ప్రశ్నిస్తుంది కవయిత్రి. పిల్లలుకలుగకపోతే కూడ స్త్రీదే తప్పు అని భర్త, కుటుంబం, సమాజం హింసిస్తే, వేదిస్తే ఆ వేదింపులను తట్టుకోలేక తన గోడును వెళ్ళబోసుకుంటుంది పీడిత మహిళ. 1986 లో రాయబడ్డ ఈ కవితలో కవయిత్రి ‘‘నిన్ను నీవు తెలుసుకోవాలె చెల్లె/ నిన్ను నువ్వు రచ్చించుకోవాలె/ ఇక గొర్రెల తీర్గ బొందలవడకు/ నిన్ను తొక్కెటోళ్ళను ఎదిరించు/ చెల్లే నా మాటిను’’ ` అంటూ తన చేయి ఇచ్చి వారి చేయి పట్టి బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంది.
వివాహ వ్యవస్థ స్త్రీల పాలిట ఉచ్చుగా మారిపోయిందని ‘‘వాంగ్మూలంలో పాతివ్రత్యం’’ కవితలో వాపోతూ కవయిత్రి, కుటుంబంలో రేగిన అలజడులను భరించలేక బలవంతంగా తననుతాను దహించుకున్న లేదా దహించబడిన ఇల్లాల్ని మళ్లీ కాల్చడానికి తీసుకొని
వెళ్తున్నారని విసురుగా చెబుతుంది. అనాధలైపోయిన ముగ్గురు పిల్లల సాక్షిగా భర్త చంపలేదని వాంగ్మూలం ఇస్తుంది. చనిపోతూ కూడా తన కుటుంబ మర్యాద కోసం అబద్ధం చెప్పే స్త్రీ ప్రాతివ్రత్యాన్ని చూసి ఏమని ఏడవాలో, చావు బ్రతుకుల మధ్యన ఉండి బిక్క చచ్చిపోయిన ‘‘కాగితం మీద పులులు’’ కవితలో పీడిత స్త్రీ రక్షణకు చేసిన చట్టాలు మన కాగితాల మీదనే పులుల్లా కనిపిస్తాయి తప్ప అవి నేరస్తులకే చుట్టాలుగా పని చేస్తాయని మన చట్టాల అమలు తీరును వివరిస్తుంది.
‘‘అన్నాలం ! అన్నాలం’’ కవితలో ‘‘తెల్లారక ముందే లేసి ఇంటి చాకిరి చేసి కూలికిపోయి, పనికి పోయిన దగ్గర దొరతో మాటలుపడి, ఇంటికి వచ్చిన తరువాత తాగొచ్చిన మొగుడితో బాధలు పడాలి’’ ‘‘తెల్లార్తె ఇంట్ల ఆడ్దిలేంది గడువదాయె’’. జర ఇంటి ఇల్లాలిని మనిషోలిగె సూడమనే ఘోష కవయిత్రి గుండె నుండి వెలువడిరది. ఉదయం నుండి రాత్రి వరకు స్త్రీకి అడుగడుగునా చాకిరి, హింసలతో ఇంటా బయటా నలిగిపోవడం అన్యాయమని ఉక్రోషపడుతుంది.
‘‘స్త్రీ’’ కవిత స్త్రీ జీవితానికి నిదర్శనం. అవిద్యకూ, అజ్ఞానానికీ, అనామకతకూ, అంధవిశ్వాసాలకూ, అణచివేతకూ, బానిసత్వానికి, బండ చాకిరీకి, గుండె బరువుకూ బలి అయిన స్త్రీ. ఒక తల్లికి బిడ్డ, ఒక భర్తకు భార్య, ప్రియురాలు, అమృతరాగ, త్యాగమయి, ప్రాకృతికశక్తిjైున స్త్రీ పురుషులతో సమాన హక్కులు పొందాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా సమాజంలో హక్కుల విస్మృతి జరుగుతుంది. ఎదిగే పరిస్థితుల మార్పుకై సంఘర్షించాలంటుంది.
స్త్రీ అణచివేత ప్రతీకాత్మక కవిత్వం
కవయిత్రి కవిత్వమంతా తన ఆత్మక్షోభకు సాక్షిగా నిలుస్తుంది. ‘‘నా కళ్ళు’’, ‘‘రాజీలేని మార్గంలో’’, ‘‘ప్రశ్న’’, ‘‘ సిద్ధంగా ఉండు’’, ‘‘కల్లోలాలు’’, ‘‘రాజుకోవాలి’’, ‘‘రాహిత్యంలోంచి’’, ‘‘ధ్వనిస్తోంది’’, ‘‘విచ్చుకున్న నేత్రాలు’’ కవితలు మనిషి లోని మానవీయ కోణాన్ని కదిలించే విధంగా ఉన్నాయి. కవితా శీర్షికను చూడగానే కవిత్వంలోని భావన సూటిగా స్ఫురిస్తుంది.
‘‘అన్నాలం ! అన్నాలం’’ కవితలో ‘‘గాల్లు ఎగిలిబారంగలేసి ఇంటి చాకిరి జేసి/ పొద్దెక్కంగ కూల్కి నాల్కి పొలాలెంట బోయి/ సుక్కలు బొడిసెదాన్క అంచిన నడుములు ఎత్తకుంట/ ఎండకు మాడుకుంట ఆనకు తడుసుకుంట/ ఈరాము లేకుంట పనిపాట జేసి’’. ఏ విధంగా చూసినా స్త్రీ జీవితం గొడ్డు చాకిరీలో నిస్సారం అయిపోతూ పరిస్థితులకు లొంగి పోయి తన జీవితాన్ని తానే క్రుంగదీసుకుంటుంది.
స్త్రీ చైతన్య సందేశాత్మక కవిత్వం
అనిశెట్టి రజిత రాసే ప్రతి కవితా వాక్యం ఒక చైతన్య సందేశాన్ని స్త్రీకి అందించే విధంగా ఉంటుంది. ‘‘నేనొక నల్లమబ్బునవుతా’’ కవితలో ఒక కోకిలవలె, ఒక కెరటంవలె, అవమానిత స్త్రీ ఎదురింపుని, తెగింపుగా చేసుకోమని చెబుతుంది. ఎరుపెక్కిన కళ్ళతో ఎక్కుపెట్టిన నా చూపులు తిరుగుబాటును సంధించడానికి సిద్ధంగా ఉన్నాయంటుంది. అవి దుష్టుల గుండెలు స్తంభించేలా చేస్తాయి. సమస్త స్త్రీల అభ్యున్నతికి తన జీవిత పర్యంతం పనిచేస్తానంటుంది. సమాజాన సంఘజీవివైౖ నందుకు అప్రమత్తమై ఉండమని స్త్రీని హెచ్చరిస్తుంది. నీ బతుకు నీవు బతికేందుకు, నీ ఉనికి నీవు సార్థకం చేసుకునేందుకు సిద్ధంగా ఉండు. ఎంతకాలమే చెల్లెలా త్వరలోనే మంచిరోజులొస్తాయనే ఆశాభావాన్ని వ్యక్త పరుస్తుంది. ప్రపంచ పీడిత మహిళలంతా ఏకం కావాలని ఆశిస్తుంది. మహిళల హక్కులను కాలరాస్తున్న సమాజం, ప్రభుత్వం, పితృస్వామ్యం, భూస్వామ్య ఆగడాలు అంతమయ్యే రోజు వస్తుందనే ధైర్యాన్ని స్త్రీలకు ఇస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద పీడిత వర్గమైన స్త్రీ జాతి పక్షాన సమరభేరిని మ్రోగిస్తుంది. నూతన పంథాలో పురోగమిస్తూ, బ్రతుకు స్వేచ్ఛ కోసం ఉద్యమించాలనే చైతన్యాన్ని తన కవిత ద్వారా ఇంజెక్ట్‌ చేస్తుంది.
‘‘విచ్చుకున్న నేత్రాలు’’ కవితలో ఆవేదనావేశంతో కూడిన సందేశాల్ని స్త్రీ జాతికి అందిస్తుంది. ‘‘అవునండీ మేము ఇపుడున్న పాత రోతనంతా/ విచ్ఛిన్నం చేయాలని నిర్ణయానికొచ్చినవాళ్ళం/ మాకు నోళ్ళున్నాయి మాట్లాడడానికి/ మాకు మెదళ్ళున్నాయి /కదిలీ కదిలించడానికి/ మాకు కళ్ళున్నాయి కుళ్ళును పసిగట్టడానికి/ మాకు చేతులున్నాయి ఆయుధాలు చేపట్టడానికి’’… అంటూ ఈ కుటిల దురహంకార వ్యవస్థలో ధిక్కరించాలని, ఆశిస్తుంది.
అందుకే కొండవీటి సత్యవతి కవయిత్రిని ఉద్దేశించి ఇలా చెబుతుంది. ‘‘సమాజంలోని అసమానతల్ని, అన్యాయాల్ని ప్రశ్నించడమే పనిగా పెట్టుకొంది రజిత. అక్షరాల్ని ఆయుధాలుగా మలచుకొని, నల్ల మబ్బుల దండై సమరభూమిని చదును చేయాలని ఆవేశపడుతుంది. ఈ ఆవేశం, ఆవేదన స్త్రీని సమాజంలో ముందుకు నడిపించే విధంగా ఉంటుంది.’’
‘‘మార్కెట్‌ స్మార్ట్‌ శ్రీమతి’’ దీర్ఘ కవితలో ఆధునిక స్త్రీ జీవన విధానంలో వస్తు వినియోగాన్ని సొమ్ము చేసుకునేందుకు వెలువడే వ్యాపార ప్రకటనలను నిరసిస్తుంది కవయిత్రి. స్త్రీ జీవన చైతన్యం కోల్పోయి మర బొమ్మల్లా, యంత్రాల్లా తయారు కావడాన్ని నిరసిస్తూ వివిధ ప్రకటనల ద్వారా ఆకర్షించే హాస్యాస్పద దృశ్యీకరణను, నూతన పంథాలో స్త్రీ తనంతట తానుగా తెలివిలోకి వచ్చి, సమాజంలో ఉత్పత్తి దాయకమైన వ్యక్తిగా ఎదగాలని ఆశిస్తుంది.
అనిశెట్టి రజిత కవిత్వంలో ప్రాంతీయత
‘‘నేనొక నల్లమబ్బునవుతా’’ కవితా సంపుటి నుండీ ‘‘అనగనగా కాలం’’ సంపుటి వరకు ఎన్నో కవితలను, వ్యాసాలను, కథలను, గేయాలను ప్రాంతీయ వాదానికి ఊపిరిగా రచించి, ప్రాంతీయచైతన్య స్పూర్తిని నెలకొల్పింది రచయిత్రి. 1971 నుండే వారి కవితల్లో ప్రాంతీయ వాద ధోరణి కనిపిస్తుంది. తనకు ప్రేరణగా సమకాలీన సమాజంలో వివిధ వర్గాల వ్యక్తులు, ఉద్యమాలు వీరి సాహిత్యంలోని వస్తువులు. ‘‘ఈ గడ్డ మీద కళ్ళు తెరిచిన బిడ్డగా ఉద్యమాల పాటల్ని, విప్లవ డప్పుల మోతల్ని వింటూ పెరిగానని ఒక సందర్భంలో చెబుతుంది. అందుకే తెలంగాణ ప్రాంత అస్తిత్వవాద నేపథ్యం వారి రచనల్లో ప్రతిఫలిస్తుంది.
‘‘కల్లోలితాలు’’ కవితలో రాజ్యహింసను ప్రస్తావిస్తూ ఇలా తెలుపుతుంది. ‘‘ఉక్కు పాదాల సవ్వళ్ళకూ/ ఊపులూదే పాట పల్లవి పిలుపులకూ/ ఉలిక్కి పడుతూ బిక్క చస్తుంటాయని’’ జనజీవితంలోని కల్లోలాలను చిత్రిస్తుంది కవయిత్రి. పోరాటమే తన ఊపిరిగా బతికే రచయిత్రి ‘‘స్త్రీ, దళిత, బహుజన, ప్రాంతీయ’’ వాదాలలో భావజాల ఉద్యమాన్ని ప్రకటిస్తారు. తెలంగాణలో మొలిచిన గడ్డిపోచ కూడ ఒక ధిక్కార ఆయుధమేనని, ప్రాణాలకు తెగించి పోరాడాలని, ప్రజాతంత్ర ప్రజాస్వామిక ఉద్యమాల చైతన్యంతో సంఘర్షించడం తెలంగాణ సంస్కృతీ సంప్రదాయమనీ నినదిస్తుంది. ‘‘కదనం చేసిన సమ్మక్క సారక్క/ బిడ్డలం కాకతి రుద్రమ్మ నగారాలం పాట మన ఆయుధం/ మాట మన శాస్త్రం శస్త్రం/ శ్రమా ఆటా పాటా మన అస్త్రం/ మన నేపథ్యం ఉద్యమం అంటుంది.
‘‘ఏకోలొచ్చి’’ కవితలో అన్నం పెట్టిన తల్లిని ఆకలి తీరిన తరువాత ‘‘మొరటుది’’ అని అనడం వెనుక ఉన్న ఆంతర్యం ఇంకా వెనుకకు తోసేద్దామని చూసే వలస పాలకుల కుట్రను బహిర్గత పరుస్తుంది. అందుకే ఆర్తితో, ఆత్మక్షోభతో రజిత ఇలా అంటారు. ‘‘కొత్త ప్రేమలు కలబోసుకుందామని/ కుత్తుకలు కోసే ఎత్తుగడలేస్తున్నరు/ నడిరట్ల తిష్టేయాలనుకుంటున్నారు/ ఇసం గలిపిన మన్ను బుక్కిస్తున్నారు/ ఛీ పొమ్మని ఛీత్కరించినా బంకోలె అతుక్కుంటాండ్రు/ మీ జిమ్మడ ఏకోలొచ్చి మేకై దిగబడితిరి గదర’’…అంటూ ‘తెగింపయిన కవిత’ ద్వారా తెలియపరుస్తుంది.
ఈ ప్రపంచీకరణ యుగంలో మనిషి స్థానికత కోసం తపిస్తున్నాడు. ఎందుకంటే మనిషి మూలాలు స్థానికతలో నీళ్ళూనుకొని ఉంటాయి. అస్తిత్వంలో తన ఉనికిని గుర్తించకపోతే అది సహించలేక ప్రాంతీయవాదం బలంగా ముందు కొస్తుంది. తల్లికుండ, అమ్మో నల్లమొగులు, తల్లి సాపెన, రెచ్చపట్టలు, రాజ్జెం రావాల్నని, మావ్వబడి, ఉసురు, తౌటం కవితల్లో అస్తిత్వచింతన కన్పిస్తుంది. ‘‘లెక్క తెలవని ముడుతలు పడ్డ అవ్వ పెయి మీన/ చిల్లులు పడ్డ చీకి చీర/సమురంటని చిప్పిరి నెత్తి/ సుక్కనీళ్ళు లేని బాయి బొందల తీరకండ్లు/ సొప్పకట్టెలోలిగె సన్నగ కాల్జేతులు/ అవ్వ ఎన్నడన్న కడుపు నిండ బువ్వ దిన్నదో లేదో/’’ ఎన్నడైనా దూపారగా మంచినీళ్ళు తాగిందో లేదోనంటూ తెలంగాణ తన్లాటను ‘‘‘అవ్వ’’ ను ప్రతీకగా చేసుకొని చెప్పింది.
‘‘ఉసురు’’ కవితాసంకలనంలో’’ ఉచ్చ నీచ పనులు ఎత్కులాడుకుంట/ ఊల్లు బట్టి బత్కబోవుడేనాయే ఉసురుముసురు బెట్టి ఉప్పసల్లేని బతుకయ్యె’’ / అంటూ తెలంగాణలో పేరుకుపోయిన క్షామం కారణంగా పల్లెల వలసల గురించి చెపుతుంది కవయిత్రి. వలస బాధలు భరించి, భరించి ‘‘ఇగసోయిల కొత్తాన్లు మనోల్లు/ పొడుసుకొచ్చె పాటలు పాడుకుంట/ ఉడుకుబుట్టె సబలు రాజేస్తన్లు’’… అని తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తున్న కారణం చెబుతుంది.
నానీల కవిత్వం
‘‘గోరంత దీపాలు’’,‘‘నన్హే ఓ నన్హే’’ నానీల సంపుటిల్లో సమస్త సామాజిక అంశాల సృజన కనిపిస్తుంది. ‘‘చైతన్యాన్ని/ భయపెట్టడమా/గూడుపుఠానీలతో/ గూండాల రాజ్యమా’’/ ‘‘ఎటు చూసినా/ కరువు దాడులు/ ఆకలి నేరాలు/ తిప్పలూ తప్పులూ/ బువ్వపెట్టే రైతుకు/ అప్పులూ ఆకలీ/ చావులు/ అయ్యో అన్నపూరా’’్ణ/ అంటూ నేరసమాజం, క్షామం, కార్మికులు, కర్షకులు, కరువుల, …. గురించి తెల్పుతుంది.
గోరంత దీపాలు నానీల కవిత్వం
విశాల, సామాజిక సారాంశం నేపథ్యంలో రచింపబడిన ఈ నానీలు స్త్రీ వెతలను గురించి తెల్పుతాయి.
‘‘గెలిస్తే బత్కుతుంది/ ఓడితే చస్తుంది / పెళ్ళనే యుద్ధంలో/ ఆడపిల్ల’’ … ‘‘ఇంట్లో / ఇంటి చుట్టూ నీళ్ళే / వానా వరదా కాదు/ కొత్త కోడలి కన్నీళ్ళు’’… ‘‘ప్రాతివ్రత్యం చెర/ శీలం వధ/ బలి పీఠం పైన / స్త్రీల వ్యథ’’ అంటూ ఉటంకిస్తుంది.
ప్రాంతీయ అవగాహనతో ‘‘తల్లుల దుఃఖం / పిల్లలది / పిల్లల దుఃఖం/ తెలంగాణది’’… అని చెప్పడంలో తన ప్రాంత పరిస్థితిని లోతైన భావంతో వెల్లడిస్తుంది. గోరంత దీపాలుగా ఉన్న ఈ నానీల్లో అనంత లోకార్థాలు స్ఫుర్తిస్తాయి.
నహ్హే ఓ నహ్హే వైవిధ్య భరిత చరిత్ర గ్రంథం
జండర్‌, ప్రాంతం, సంబంధించిన ఎన్నో విషయాలను ప్రస్తావించిన నహ్హే ఓ నహ్హే. ‘‘నల్ల రేగటి సాల్లల్ల / నల్ల పొద్దులు / మొలవాలె / అవ్వ రాజ్జెం రావాలె’’… ‘‘దళిత స్త్రీ / సాధికారతా సాధనకై / సత్యంగా / నేనొక / నల్ల మబ్బునవుతా’’… ‘‘మనువుల రాజ్జెంలో / విస్తృతులు / స్త్రీలు / పేదలూ / పురుషత్వమే నీతి’’ అంటూ ప్రముఖ కవుల పుస్తకాల పేర్లతో, కవుల పేర్లతో వైవిధ్య భరితంగా విస్తృతార్థంలో వ్రాయబడిన నానీలకవిత్వం ‘‘నహ్హే ఓ నహ్హే’’ నానీల కవితా సంపుటిలో కనిపిస్తుంది. ‘‘సమతను ఆచరిస్తూ / స్త్రీని / గౌరవిస్తారట ఒహ్హో ` మాజానుభావులు’’`వంటి జండర్‌ అంశాలను ‘‘తెలంగాణమంటే / భయమెందుకోయ్‌ / ఆత్మ గల్ల తల్లి / మాయమ్మే నోయి’’.. ‘‘చిరకాలపు కళ కోసం / సాగే లడాయి / ధూం…ధాం / మనదే జయం’’… అంటూ స్త్రీల సాధికారత, వ్యవస్థ అసమనీతిని, ప్రాంతీయ ఉద్యమ చైతన్యాన్ని ప్రకటిస్తుంది.
‘‘దస్తఖత్‌’’ ` హైకూల సృజన క్షేత్రం
నానీల కన్నా చిన్న పదాల వరుసలో వ్యక్తీకరింపబడే విభిన్న సాహిత్య ప్రక్రిjైున ఈ హైకూ కవిత్వం ద్వారా గాఢ భావనల రచన చేసినది. ‘‘దేశానికొచ్చింది స్వాతంత్య్రం / అర్థనారికేది / భాగస్వామ్యం?’’… అని 63 యేండ్ల స్వాతంత్య్ర భారత సమాజాన్ని ప్రశ్నిస్తుంది. ‘‘శ్రమ క్షేత్రాలు / క్షమ నేత్రాలు / మహిళోత్తములు’’ ‘‘స్వేదాంకురాలు / నారీమణులు / దీప పరిమళాలు’’ అంటూ స్త్రీ శ్రమశీలతను, క్షమ హృదయాన్ని ఆవిష్కరిస్తుంది కవయిత్రి. ఇంకా, ‘‘ఒక్క ` / ఎదురీత / ఒంటరి స్త్రీ’’…. ‘‘బరువు బాధ్యతల / బతుకు / పాపం తల్లులది’’… అంటూ అటు సమాజంలో ఒంటరి స్త్రీ బతుకు ఎదురీతనూ, ఇటు పిల్లల తల్లి బతుకు, బరువు నిర్వహణ కష్టాలను సూచిస్తుంది.
తన ప్రాంతంలోనే కరువు పరిస్థితి తెలిసిన మనిషిగా ‘‘కాలం కన్నుల్లో / కర్కష దస్తఖత్‌ / కరువు’’… అని వాపోతూ అప్పుల ఊబిలో పడిన పత్తి రైతుల ఆత్మ హత్యలకు చలిస్తూ ‘‘అప్పుల తిప్పలు / ఆత్మ హత్య / రైతే రాజట’’ అని రైతు పట్ల పాలకుల నిర్లక్ష్యాన్ని చెబుతుంది. ‘‘పాలకుల నిర్లక్ష్యం / విధాన వైఫల్యం / రైతు బలి’’…. అని సృష్టం చేస్తుంది. అటు నానీ కవిత్వం, ఇటు హైకూ కవిత్వం ద్వారా పీడిత పక్ష పాతిగా పేదల, స్త్రీల బాధలను,ప్రాంతీయ దురన్యాయాలను సంక్షిప్త పదాల్లో వ్యంగ్యంగా ఆక్షరీకరించింది.
పాట ` తెలంగాణ నేపథ్యం
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన వివిధ గేయ సంకలనాల్లో వ్రాసిన పాటల్లో ‘‘పాట పూచిన చెట్టురా నా తెలంగాణ గట్టురా’’ అంటూ ఉద్యమాన్ని బలపరుస్తూ పాట, తెలంగాణ వేరు కాదు ఒక్కటే అన్న భావనతో గేయంరాసింది అనిశెట్టి రజిత. తెలంగాణ ప్రాంత విశిష్టత, సంస్క ృతి విశిష్టత, మనుషుల ప్రాధాన్యత, కళా సంపద మనుషుల్లోఉన్న ప్రేమ, శ్రమ జీవన నేపథ్యంతో పాటు అణచివేతకు గురై, ఇక్కడి ప్రజల్లో వచ్చిన చైతన్యం ఈ గేయంలో వివరించింది. నినదించింది ` తెలంగాణ జీవన్మరణ సమస్యలపై, విధ్వంసాలపై పేరున్న రచయితలతో పాటు వర్ధమాన రచయితలు రాసినపాటలతో ‘‘తెలంగాణ మట్టి పాటలు’’ సంకలనం వరంగల్లు సంఘం వెలువరించింది. అందులో రచయిత్రి గేయం ‘‘మట్టిపూల పాట’’. ‘‘కన్నీటికి వీడ్కోలని తెలంగాణమా / నీవు కదనానికే / కదిలినావా తల్లీ తెలంగాణమా / నా మల్లెల మాగాణమా’’.. మరో పాట ‘‘పాట పూచిన చెట్టు రా ` నా తెలంగాణ గట్టు రా’’ ఈ పాటలు తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, ప్రాంతీయ సాంస్కృతిక విశిష్టతను, శ్రామికుల ఉద్యమ త్యాగాలను తెలుపుతున్నాయి. ‘‘అమ్మ నీకు దండమే’’ పాటలో ‘‘ఉగ్గు పాలతో త్యాగ గాథలు ` ఉగ్గడిరచి చెప్పినావు’’ జాతి పౌరుషం నూరి పోసి ` పోరు బిడ్డగా చేసినావు. అంటూ తెలంగాణ జాతి పౌరుషాల్ని, త్యాగ గాథల్ని ఈ పాటలో తెలిపింది. మరో పాటలో ‘‘మము గన్న మాతల్లి ఉయ్యాలో / తెలంగాణ తల్లి ఉయ్యాలో / ఆత్మగల్ల తల్లి ఉయ్యాలో / మాయమ్మ తెలంగాణ ఉయ్యాలో’’ అంటూ తెలంగాణ సమస్త తెలంగాణ ప్రజల గోడు, గోస, బస్తర్‌ అడవుల ప్రస్తావన చేసింది.
మట్టి బంధం కథలు
‘‘మట్టి బంధం’’ కథల సంపుటి సాంఘిక, సామాజిక అంశాల నేపథ్యంతోనే రాయబడిరది. పేదలు, స్త్రీలు సమస్యలతో నలిగిపోవడాన్ని, ఒత్తిళ్ళకు గురికావడాన్ని ఈ కథలు చెప్పాయి. స్త్రీలు తమ అస్తిత్వానికై చేసిన సంఘర్షణ ఈకథల్లో కనిపిస్తుంది. స్త్రీ వాదాన్ని, ప్రాంతీయ వాదాన్ని బలంగా ఆవిష్కరిస్తాయి ఈ కథలు. తెలంగాణ ప్రాంత భాష, సంస్క ృతి, సంప్రదాయాలు, చైతన్యాలు, మట్టి బంధం కథా వస్తువులు. ‘‘నాయినమ్మ ` నేను’’ కథలో రచయిత్రి తన బాల్యాన్ని గురించి చెప్తూ నాయనమ్మతో తనకున్న అనుబంధంలోని ఆత్మీయ పార్శ్వాన్ని చెప్పారు. ‘‘మా నాయినమ్మ రోజూ తెల్లారగట్ల నాలుగింటికే గంట గొట్టినట్లు లేసి వాకిలూడ్చి చల్లేది. గోచికట్టు బోసి మా బర్ల పెండ దెచ్చి బకీటు నీళ్ళలోనో, మట్టి గోలెంలోనో కలిపి చెంబుతోటి అలుకు చల్లుతుంటే ఆ నీల్లు చిలికే తీరు, నీళ్ల సప్పుడు తోటి నాయినమ్మ ‘‘అచ్చి అచ్చి’’ అనికుంట వాకిలి తడిపే తీరు గమనించి నేనుగూడ పెద్ద దాన్ననిపించుకోవాలని గట్ల చేయబోతే అస్సలు చేయరాకపోయేది’’. ఈ వాక్యాల్లో తెలంగాణ భాష, సంస్క ృతి, సంప్రదాయాలజీవన వైవిథ్యం స్వచ్ఛంగా కనిపిస్తుంది.
‘‘బుచ్చెమ్మ’’ కథలో తెలంగాణ పల్లెనుండి గల్ఫ్‌ దేశాలకు వలసబోయిన ఒక అందమైన పల్లె యువతి అక్కడ అనుభవించిన దుర్భర జీవితం, స్వదేశం తిరిగొచ్చి పడిన కష్టాలు, చివరికి ఎయిడ్స్‌తో అకాల మరణం హృద్యంగా చెప్పింది.
‘‘రాజవ్వ’’ కథలో బొంబాయి దగ్గరి భీమండికి బతుకు తెరువుకు భర్తతో పోయిన రాజవ్వ ముగ్గురు పిల్లల తల్లి అయిన తర్వాత భర్త మరో పెళ్ళి చేసుకోవడం వల్ల తిరస్క ృత అయి తన పల్లెకు తిరిగొచ్చి ఎవ్వరినీ నొప్పించకుండా, ఎవరిని నిందించకుండా, నిస్పృహకు లోనుకాకుండా స్వయంశక్తితో జీవనమార్గం ఎంచుకునే ప్రయత్నం చేయడం చిత్రించింది. ‘‘కొత్తపాట’’లో చితికిన చేనేత బతుకులో ఒక స్త్రీ సంఘర్షణకు లభించిన చిన్న అభయహస్తం, చేయూతను చిత్రించింది. ‘‘మట్టిబంధం’’ కథ పల్లె పట్నానికి వలసబోయిన జీవితపు కథ.. మనిషికున్న మట్టిబంధం తెంపుకోవడం అనేది ఎంతటి దుర్భరమైన విషయమో ` ఒక వేరును కొత్త ప్రదేశంలో నాటితే అది కుదురుకోవడం ఎంత కష్టమో.. వలస జీవితాలు కొత్త ప్రారంభాలను చేయడం అనేది కూడా కష్టభరితం అని చెప్తుంది రచయిత్రి.
‘‘రాణీ చిన్నమ్మ’’ కథలో తెలంగాణా ప్రాంతపు అట్టడుగు కులానికి చెందిన శ్రామిక స్త్రీ చిన్నమ్మ. ఉత్పత్తి జీవనం మొదలుకొని సామాజిక ` కుటుంబ జీవితంలో జరిగిన విస్తరణ దశాబ్దాల కాలం గడిచినా మారలేదనేది రచయిత్రి అభిప్రాయం.
‘‘వానమ్మ ` వానమ్మ’’ కరువు ప్రాంతంలో ఒక పద్నాలుగేళ్ళ మారుమూల పల్లెటూరి పిల్లగాడు తన జీవితంలో ఎప్పుడూ వర్షాన్ని చూడకపోవడం అనే విషాద ఘటనను ఆధారం చేసుకుని రాసిన హృద్యమైన కథ.
‘‘త్రినేత్ర’’ ‘‘అనేక ఖండిత’’ కథల్లో మ్యాజికల్‌ రియలిజమ్‌ టెక్‌నిక్‌ను కొంత ఉపయోగించి కథనాన్ని నడిపించింది. ఈ రెండు కథల్లోనూ ప్రత్యక్ష, పరోక్ష వీక్షణల్లో నిత్యం స్త్రీలు అనుభవిస్తున్న చిత్రహింసలు, దాడులు, మోసాలు, శ్రమ దోపిడీలు, పరాయికరణలను సృజించింది. స్త్రీలు నిత్యం అనేక ఒత్తిళ్లు, హింసల వల్ల ఖండితలవుతున్నారనీ కానీ వారి నిరసనాగ్రహాలు పెల్లుబికి విస్ఫోటించి నిప్పుల ప్రవాహంలో అనేక ఖండితలై కొట్టుకుపోతూ కూడా కొత్తగా మళ్ళీ ఫీనిక్స్‌ పక్షుల్లా కొత్త రెక్కలాడిస్తూ వస్తారనీ ఆత్మవిశ్వాసాలతో కూడిన భవిష్యత్‌ కార్యక్రమాన్ని ప్రకటించింది.
‘‘పాలకూనలు’’, ‘‘నానిగాడు’’ కథల్లో స్త్రీ హృదయ మార్దవం, ఆర్ద్రతతో నిండిన ఇతర అమాయక ప్రాణుల పట్ల మానవీయతను ఆవిష్కరిస్తే, ‘‘వేపచెట్టు’’ కథలో పర్యావరణ బాధ్యత, మానవ జాతికి ఊపిరినిచ్చే ప్రాణ వాయువు పట్ల ప్రేమదృక్పథం కనిపిస్తుంది. ‘‘కుతికె’’ చిన్న కథ 1969 నాటి ‘‘జై తెలంగాణ’’ ఉద్యమాన్ని నేటి 2009 తెలంగాణ ఉద్యమాన్ని సంధానం చేసిన నిజ గాథ. ‘‘సోపతి’’ కథ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో స్నేహ కర్తవ్యాన్ని, తెలంగాణ ఉద్యమ ఘటనలను చిత్రించిన వాస్తవిక చరిత్రా కథనం.
ప్రాంతీయ అస్తిత్వ వాదం ప్రతిఫలించిన వ్యాసాలు
‘‘త్యాగాల చరిత తెలంగాణం మన ప్రాణం’’ అనే వ్యాసంలో ‘‘ఘనీభవించిన బతుకుయాతనంతా నేడు తెలంగాణ ఉద్యమ జాతరగా కరిగి ప్రవహిస్తున్నది. వివక్షలు విస్ఫోటన ఆత్మగౌరవపు లావాలై ముప్పు తెచ్చిన ముంపు రాజకీయాలను ముంచెత్తుతున్నాయి. మరో ఎనాన్‌ పోరాటంతో పోల్చదగిన 1953 నాటి వీర తెలంగాణ పోరాటం నెత్తుటి తడి ఆరక ముందే 1969 తెలంగాణ రైతాంగ పోరాటం. 2009`10 నాటి ఉద్యమాలకు ఊపిరిగా కొనసాగింది. తొవ్వల నిండా త్యాగాల పువ్వులు పరుచుకుంటున్నదే తెలంగాణ చరిత్ర’’ అంటూ ప్రాంతీయ అస్తిత్వవాదాన్ని బలంగా తెలిపింది. విగ్రహాల కూల్చివేతకు నిరసన రూపంగా, సమానత్వం మనిషికి అవసరం కానీ సమైక్య జపంతో కాదు, ‘‘ప్రత్యేక రాష్ట్రం ` ప్రజా ఉద్యమం’’, ‘‘దీవెనార్తుల అన్నపూర్ణ హైద్రాబాద్‌’’ సామాజిక చైతన్యం, సాహిత్య వారసత్వం, ‘‘తొలి తరం తెలంగాణ రచయిత్రి, పండితురాలు డా॥ పాకాల యశోద రెడ్డి జ్ఞాపకాల వెల్లువలు’’, ‘‘డా॥ జయశంకర్‌ సార్‌ కారణ జన్మత’’, ఇలా సాహిత్య, సామాజిక వ్యాసాల ద్వారా తన వేదన, సంవేదన ఆత్మక్షోభతో విశ్లేషణ, వివేచన చేసింది.
సాహిత్య పిపాసిగా, సామాజిక కార్యకర్తగా, ప్రాంతీయ పోరాట శీలిగా, స్త్రీల పక్షంలో నిలబడి, సమస్యలను ఎదుర్కోవాలని ధైర్యాన్నిచ్చే ధీశాలిగా ఈ రచయిత్రి నేటి, రాబోయే తరాలకు సాహిత్య స్ఫూర్తిగా, సామాజిక ప్రేరణ శక్తిగా నిలిచింది.
అనిశెట్టి రజిత రచనలు
1. గులాబీలు జ్వలిస్తున్నాయి ` 1984
2. నేనొక నల్ల మబ్బునవుతా ` 1997
3. చెమట చెట్టు ` 1999
4. ఉసురు ` 2002
5. ఓ లచ్చవ్వ ` 2005
6. గోరంత దీపాలు ` 2005
7. దస్తఖత్‌ ` 2005
8. నన్హే ఓ నన్హే ` 2005
9. అనగనగా కాలం ` 2005
10. మట్టి బాధం ` 2007
11. మార్కెట్‌ స్మార్ట్‌ శ్రీమతి ` 2010
అనిశెట్టి రజిత సహ సంపాదకత్వంలో వెలువడిన రచనలు
1. ఊపిరి ` 2010
2. వెతలే.. కథలై ` 2011
అనిశెట్టి రజిత ` గేయాలు
1. ఆనుగర్రలు ా తెలంగాణా ఉద్యమ గేయాలు ` 2010
2. తెలంగాణ మట్టి పాటలు ` 2010
వివిధ పత్రికల్లో, మ్యాగజైన్‌లలో వచ్చిన కవితలు,
వ్యాసాలు, కథలు, గేయాలు..
1. తెలంగాణ జంగ్‌ ` 2009
2. తెలంగాణ జంగ్‌ ` 2010
3. తెలంగాణ జంగ్‌ ` 2011

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.