స్త్రీ వాద ఉద్యమం ముందుకు వచ్చిన తరువాత, స్త్రీలు తమ చుట్టూ కంచెలు పాతిన అన్ని వ్యవస్థలను గుర్తించి, ప్రశ్నించారు. పితృస్వామ్య సమాజం స్త్రీలనియంత్రణ కోసం ఏర్పాటు చేసిన కట్టుబాట్లను స్త్రీవాదులు బలంగా ఢీ కొట్టారు. వాటిలో ప్రధానమైంది కుటుంబ వ్యవస్థ.
భారతీయ సమాజంలో అత్యంత ప్రాధాన్యత కల్గిన సామాజిక ఏర్పాటు %–% ‘కుటుంబం’. పితృస్వామ్య వ్యవస్థ, మతం, వివాహవ్యవస్థ అన్నీ కలగలిసి స్త్రీని కుటుంబానికి బాధ్యురాలిని చేసాయి. ఇంటికి దీపం ఇల్లాలని చెప్పి వ్యవస్థ స్త్రీని ఇంటికి పరిమితం చేసింది. కుటుంబ వ్యవహారాలకు, కుటుంబ గౌరవానికి, కుటుంబ ఉన్నతికి స్రీ ఆలంబనయ్యింది. పిల్లలను కనడం, పెంచడం మొదలుకొని ఇంటిల్లిపాది బాధ్యతలు స్త్రీకి అంటగట్ట బడ్డాయి. కుటుంబ వ్యవస్థలో స్త్రీ పురుష సంబంధాలు ప్రేమ సంబంధాలుగా కాకుండా యజమాని, బానిస సంబంధాలుగా బలపడి స్త్రీలు పురుషుడికి సేవకులనే భావన సమాజంలో స్థిరపడిరది. దీనివలన కుటుంబంలో స్త్రీలు నిరంతర అణిచివేతకు, హింసకు గురవుతున్నారు. కుటుంబ వ్యవస్థ మోపిన ఇంటిని చక్కదిద్దుకునే బాధ్యతలు, పిల్లల సంరక్షణా బాధ్యతలను పితృస్వామ్య వ్యవస్థ అందమైన కథలుగా అల్లింది. ఆ అందమైన కథల ‘మిత్’ లో స్త్రీలు భాగమై తర తరాలుగా కుటుంబ వ్యవస్థని మోస్తు వస్తున్నారన్నది స్త్రీ వాదుల అభిప్రాయం.
కుటుంబ వ్యవస్థలో నెలకొన్న ఈ అణచివేతను ప్రశ్నిస్తూ స్రీ వాదులు కవిత్వం రాశారు. స్త్రీలకు రెండు ఇళ్ళు. ఒకటి పుట్టినిల్లు రెండవది మెట్లినిల్లు. పుట్టినయింట్లో తల్లి తండ్రులతో, అన్నలు తమ్ముళ్ళు, అక్కలు చెల్లెళ్లతో, బాల్య స్నేహితులతో కలసి పెరిగిన స్త్రీలు, పెళ్ళయ్యాక సొంత వూరు, ఇల్లు వదిలి, ఎక్కడో దూరంగా కొత్త ఇంట్లో అత్తమామలు, బావమరుదులు, ఆడపడుచులు లాంటి కొత్త వ్యక్తుల మధ్య కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి వస్తుంది. ఒక చోట భూమిలో పుట్టి ఆ వాతావరణాన్ని తనదిగా చేసుకొని భూమిలోకి వేళ్లూని శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక చెట్టులాంటి స్త్రీని ఇరవయ్యేళ్ల తర్వాతో, పాతికేళ్లతర్వాతో పెళ్లి పేరుతో – వేళ్లతో సహా పెకిలించి ఇంకో స్థానంలో నాటినట్లే స్త్రీలు తమను తాము ఒక కొత్త ఇంట్లో నాటుకొని, ఒక మొక్కలా ఎదిగి తిరిగి చిగురించి, పూలు పూసి కాయలు కాస్తారు. ఆ ఇంటిని తమదిగా చేసుకొని, ఇంటిని నిలబెడతారు.తమ సంతోషాలను, సుఖాలను త్యాగం చేసి తాము నిలబెట్టే ఆ ఇంటికి, కుటుంబానికి యజమాని భర్త. స్త్రీలకి సంరక్షణ ఇస్తుందని చెప్పే ఆ కుటంబం లేదా ఈ చాలామంది స్త్రీలకి మాత్రం జైలులాంటిదని స్రీ వాదుల అభిప్రాయం. ఈ విషయాల కవిత్వం రాసిన వారిలో కె. వరలక్ష్మి, కె. గీత, కొండేపూడి నిర్మల ముఖ్యులు.
స్రీకి ఇల్లు జైలు లాంటిదని, ఆ భవబంధాలు – ‘‘కంటికి కనిపించవుకానీ / ఏనుగు గొలుసులంత బలమైన శృంఖలాలివి’’ అని సంకెళ్లతో పోలుస్తారు. ‘‘ఎడాపెడా తగిలించుకున్న ఈ సంకెళ్లు నన్ను కదలనిస్తాయా’’ అని ఇల్లు/కుటుంబ వ్యవస్థ తనకు సంకెళ్లు వేసిందని చెబుతారు. ‘‘ఏ అదృశ్యశక్తి పగల కొట్టలేని గోడలివి’’ అని ఇల్లు అనే అంశం చుట్లూ ఎంత కట్లుదిట్లమైన సంప్రదాయగోడలు స్రీ చుట్టూ నిర్మించబడ్దాయో చెబుతారు.
‘‘ఆ ఇంట్లోనే’’ అనే మరొక కవితలో తాను పుట్టిల్లు వదిలి మరొక ఇంటికి వెళ్లడం వలన తనని జ్ఞాపకాల వెచ్చని మంటలు చుట్టుముట్టాయని చెబుతారు. శారీరకంగా పుట్టిల్లు వదలి మెట్టినింటికి వెళ్ళినా స్రీలు తాము పుట్టిపెరిగిన ప్రదేశాలను, సంఘటనల అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటారు. ఒకరకమైన మానసిక సంఘర్షణకు లోనవుతారు. పుట్టిల్లు మారని పురుషులకు ఈ గొడవేలేదు. ఇదే వస్తువుమీద వచ్చిన మరో కవిత ‘‘బంగాళా ఖాతం’’ కె. గీత రాసారు. ఉన్నతవర్గ గృహిణికి ఇల్లు ఎంత నిర్బంధమో చెప్పే కవిత ఇది. వ్యక్తిగత సమస్యల్ని రాజకీయం చేస్తున్నారనే విమర్శలకి ‘సినిమాకైనా బయటికి తీసుకెళ్ళని పనికిమాలిన స్టేటస్సు’’ అంటుంది. స్త్రీలకు వారి కుటుంబ స్థాయిని బట్టి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు వేటికవి ప్రత్యేకం. వసంతా కన్నాబిరాన్ రాసిన ‘గృహమే కదా స్వర్గసీమ’ కవిత కూడా ఇటువంటి ప్రత్యేక సమస్యల గురించి రాసిందే.
కుటుంబ వ్యవస్థలో కీలకమైన మరొక వ్యవస్థ వంట. వంట చేయటం, వంట రావటం, వంట గది నిర్వహించటం వివాహ, కుటుంబ వ్యవస్థలో భాగం. స్త్రీల చాకిరీకి అది పెద్ద కేంద్రం వంటిల్లు. అటువంటి వంటింటి మీద విమల రాసిన ‘వంటిల్లు’ కవిత స్త్రీవాద, మార్కిస్టు దృక్పథం గల కవిత.
స్రీ విముక్తికి ఆటంకాలుగా నిలిచేవి కుటుంబంలో వంట, పిల్లల సంరక్షణ. ఈ రెండిరటినీ సామాజికీకరణం (సోషలైజేషన్) చెయ్యాలని మార్కిస్టు ఫెమినిస్టుల దృక్పథం. శ్రమ విభజనలో సహజ శారీరక బలహీనతను ఎత్తిచూపి దానిని లోపంగా చెప్పి ఏమాత్రం ఉత్పాదక విలువలేని వంటింటి వరకూ ఆమె సామర్థ్యాన్ని పరిమితం చేసిందీ పురుషస్వామ్యం.
‘‘మా అమ్మ మా అమ్మమ్మ / ఇంట్లో అమ్మలంతా ఇక్కడే స్త్రీలయ్యారట’’ శరీరం ఆధారంగా కాక జెండర్ ఆధారంగా స్రీలు స్త్రీలుగా మారటాన్ని అద్భుతంగా మలిచారు విమల. ‘‘ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి / అయినా చివరకు వంటింటి గిన్నెలన్చింటి పైనా మానాన్న పేరే’’ అని స్త్రీలకి వంటిల్లే ప్రధాన సామ్రాజ్యమని చెబుతూనే వ్యంగ్యార్థంలో చాకిరంతా స్రీది పెత్తనమంతా పురుషునిది అని చెప్పడానికి చివరి వాక్యాలు చెప్పారు.
ఎన్ని తరాలు మారినా స్రీ జీవితంలో మార్చురాలేదని, ఏదన్నా మార్పువస్తే నాగరికత ప్రసాదించిన సాంకేతికమైన అభివృద్ధే. అంతేగాని స్రీ వ్యక్తిత్వ వికాసమో, పురుషాధిపత్యం సన్చగిల్లడమో కాదంటారు. అందుకే ‘‘అదృష్టవశాత్తూ నేనో మంచి వంటింట్లో పడ్డానన్నారంతా! / గ్యాసు, గ్రైండర్లు, సింకులు, టైల్సు .. / అమ్మలా గారెలు, అరిసెలు గాక/ ఇప్పుడు కేకులు పుడ్జింగులు చేస్తున్నాను నేను /ఇంకా గిన్నలపై పేర్లు మాత్రం నా భర్తవే ’’ కాలం ఎంత మారినా స్త్రీల పాత్రలో మార్పు లేదని చెపుతారు. అసలు స్త్రీలూ వంటగది వేర్వేరు కాదని తెలుస్తారు కవయిత్రి. అందుకే – ‘‘అసలు మా అమ్మే నడుస్తున్న వంటగదిలా ఉంటుంది’’ అంటారు. పురుషులు స్త్రీలను వంటింటి కబుర్లు చెప్పుకునే వారిగా చిత్రీకరించి, వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తుంటారు. స్త్రీలను అలాంటి స్థితికి నెట్టివేసి, గరిట తిప్పడమే వారి అంతిమ కర్తవ్యంగా తయారుచేసింది పురుషాధిపత్యమే. అందుకే ఆ వ్యవస్థను ధ్వంసం చేయాలని పిలుపునిస్తారు కవయిత్రి. ‘‘ఇక గిన్నెలపై ఎవరి పేర్లూ వద్దూ / వేరువేరు స్వంత పొయిలను / పునాదులతో సహా తవ్వి పోద్దాం రండి’’ అన్నపుడు వంటపనిని సోషలైజ్ చేయాలనే మార్కిస్ట్ ఫెమినిస్టుల దృక్పథం కన్పిస్తుంది.
ఇంటి చాకిరీ స్త్రీల నిత్య జీవితంలో ఒక భాగం చేసింది కుటుంబ వ్యవస్థ. ‘‘ఇల్లు చూసి ఇల్లాల్సి చూడాలి’’ అనే సామెత స్రీ ఇంటి చాకిరికి సంబంధించినది. వంటకోసం, బట్టలుతకటం కోసం, ఇంటిశుభ్రం కోసం తన సమయాన్ని మొత్తాన్ని కేటాయిస్తుంది స్రీ. ఇంటిపని అనుత్పాదక శ్రమ. ఓల్గా రాసిన ‘‘గృహలక్ష్మి’’ కవిత స్త్రీల ఇంటి చాకిరీ వెనక వున్న మతలబు చెబుతుంది.
‘‘అలుగుడ్డల పీతిబట్టల / పరిమళంలో పునీతమవుతున్నా /
జీవితం ఎందుకో ఎప్పుడూ / కాటు వాసనే వేస్తుంటుంది’’
అంటారు. ఇంటిపనిలో అసంతృప్తి చిరాకు ఉన్నాయనేది ఇందులో వ్యక్తమవుతుంది.
వసంతాకన్నభిరాన్ రాసిన – ‘గృహమేకదా స్వర్గసీమ’’ కవిత కూడా ఈ వ్యవస్థ స్త్రీలను ఇంటి చాకిరీలో మునిగీ పోయేలా ఎలా మౌల్డ్ చేసిందో చెబుతారు
‘‘తళతళలాడే సింకులలో / మిలమిలలాడే బండలలో /
తెల్లగా తోమిన గిన్నెలలో / నున్నగా తుడిచిన గచ్చులో /
శుభ్రంగా స్మానమాడిస్తే / సువాసనలీనే పాపాయిలలో /
నా హృదయం / మెరిసిపోతూ మురిసిపోయింది. ’’
అని అంటారు. స్రీలు ఇంటిపనిని, పిల్లల శుభ్రతని తమ జీవితాశయంగా చూస్తూ ఎలా సంబరపడతారో ఆడబతుకే మధురమనీ, గృహమేకదా స్వర్గసీమ అనే మిత్‌లోకి ఎలా తోయబడ్డారో పై వాక్యాలు చెబుతాయి.
‘‘నేను తుడిస్తే తళుక్కుమన్న / గచ్చుమీద నువ్వు నడుస్తుంటే /
నేను రుద్దీరుద్దీ మెరిపించిన / దొడ్లల్లో నువ్వు ఉచ్చపోస్తే /
నేను రుచిగా వండినవి తిని త్రేనిస్తే / నేను కనిపెంచిన చిన్చారులను / నువ్వు అవలీలగా ఎత్తుకుంటే’’ అన్నపుడు వంటపని, ఇంటిపని, పిల్లల సంరక్షణ, ఇంటిశుభ్రం అన్న అన్ని పనులు స్రీలే చేస్తున్నారు. ఇది జీతం లేని పని. విలువలేని పని. సమయపాలన లేని పని, తాము దోచుకోబడుతున్నామన్న స్పృహ కూడా లేకుండా మధ్య తరగతి స్రీలు ఎంతగా మభ్య పెట్టబడ్డారో –
‘‘అదే జీవిత పరమార్థమని / నేను నా ఆనంద సంద్రంలో /మునిగి పోయాను’’ అంటారు. ఇంతకాలం అణిచివేయబడ్డామనే వాస్తవస్థితిని స్రీలు ఇప్పుడు గ్రహిస్తున్నారని చెబుతారు కవయిత్రి.
మందరపు హైమవతి ‘‘గాస్ పొయ్యి మంటల్లోనే / నీలాల గగనాన్ని చూస్తాను / కుక్కర్ విజిల్‌లోనే మనోజ్ఞ సంగీతాన్ని వింటాను’’ అంటారు. ఉద్యోగానికని బయలుదేరినప్పుడు ‘‘నన్ను చూచి అందరూ / పొద్దున్నే చక్కగా తయారై / టింగురంగామంటూ బయల్దేరుతుంది /ఇస్త్రీ మడత నలక్కుండా తిరిగొస్తుంది ఎంత అదృష్టం అనుకొంటారు’’ స్రీలు బయట శ్రమలు చేస్తూ ఇంటి శ్రమని కూడా పూర్తిగా తమ బాధ్యతగానే చెయ్యడం అంటే ఆ స్రీలు రెండు రకాల పూర్తి శ్రమలు చేస్తున్నారని అర్థం. ఆర్థిక స్వాతంత్య్రం స్త్రీవిముక్తికి మొదటి మెట్టు అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. నిజానికి అది రెట్టింపు శ్రమ చేయడం. కానీ స్త్రీలు తప్పని పరిస్థితిలో ఇంటి చాకిరీ తో పాటు బయట పని కూడా చేయక తప్పని స్థితి.
కుటుంబంలో స్త్రీ ఎదుర్కొనే శారీరక మానసిక హింసమీద కూడా స్త్రీవాద కవయిత్రులు చాలా కవిత్వం రాశారు. తుర్లపాటి రాజేశ్వరి రాసిన ‘‘ఊసరవెల్లి, బి. పద్మావతి ‘గుక్కపట్టిన బాల్యం, కవయిత్రి తిలక స్వరూపరాణి రాసిన ‘చంద్రగ్రహణం’ లాంటి కవితలు చెప్పుకోదగినవి.
‘‘గుక్కపట్టిన బాల్యం’’ కవితలో తండ్రి వలన తల్లి ఎలాంటి శారీరక హింసకు గురవుతుందో, దానిని చూసిన పిల్లలు ఎంత మానసిక హింస అనుభవిస్తారో, తిరిగి మగ పిల్లలు ఎం నేర్చుకుంటారో చెపుతుంది కవయిత్రి. ‘‘నాన్న అమ్మని కొడతాడు / అమ్మకొడుకూ అమ్మని కొడతాడు’’ కుటుంబంలో స్త్రీని హింసించే వారిలో భర్త, కొడుకు, తండ్రి ఎవరైనా పురుషుడే. కన్నా కొడుకు కూడా చెయ్యిచేసుకుంటాడు.
భార్యాభర్తల మధ్య ప్రేమ సంబంధాలు కాకుండా అధికార అమబంధాలు, ఆర్థిక సంబంధాలు వున్న పరిస్థితిని, దాంపత్య సంబంధాల్లోని లొసుగులను స్త్రీవాద కవయిత్రులు చాలా తీవ్ర స్వరంతో, కొన్ని చోట్ల అసహ్యంతో ప్రశ్నించారు. అటువంటి కవితల్లో మందరపు హైమావతి రాసిన ‘సర్ప పరిష్వంగం, కె. గీత రాసిన ‘పరపరాగ విరాగం’ జయప్రభ రాసిన ‘స్పర్శాను రాగాన్ని ఆలపిస్తూ’ పాటిబండ్ల రజనీ రాసిన ‘రాజీవనాలు’ శివలెంక రాజేశ్వరి రాసిన ‘రంగులు వెలసి రాగాలు వినిపించినవేళ’ ఓల్గా ‘దాంపత్యం’ వర్రెరాణి ‘కొండచిలువ’ లాంటి కవితలలో స్రీ పురుషుల మధ్య ఉన్న సంబంధాలలోని అంతరాలను, ఆర్థిక వ్యత్యాసాలను, పురుషులు అవలంభించే నిరంకుశ ధోరణిని, తామనుభవిస్తున్న బానిసత్వాన్ని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు.
కుటుంబం పేరిట స్త్రీలను జీతం లేని, విలువ లేని బానిసలుగా చూసే పురుషాధిపత్యాన్ని, పితృస్వామిక వ్యవస్థని, మతం పేరిట ఏర్పాటుచేసిన అనేక కట్టు బాట్లను స్త్రీవాదులు ధిక్కరించారు. నిలదీశారు. అలాగని కుటుంబ వ్యవస్థని గానీ, వివాహ వివాహ వ్యవస్థనిగానీ స్త్రీవాదం నిర్ద్వంద్వంగా తిరస్కరించలేదు. కుటుంబ వ్యవస్థలో, వివాహ వ్యవస్థ లో ఇప్పటికీ నెలకొని వున్న స్త్రీ పురుష సంబంధాల్లోని పురుషాధిపత్యాన్ని, పితృస్వామిక హింసని మాత్రమే ధిక్కరించారు. కుటుంబంలో ఆధిపత్య సంబంధాలు కాకుండా ప్రేమ సంబంధాలు నెలకొనాలని కోరుకున్నారు. విలువని, సమానత్వాన్ని, మనిషిగా గుర్తింపుని కోరుకున్నారు.