తెలుగులో సాహిత్య, సామాజిక విమర్శ రంగంలో కృషి చేస్తున్న స్త్రీల సంఖ్య చాలా తక్కువ. బహుజన దృక్పథం నించి విమర్శ రాస్తున్న రచయిత్రుల సంఖ్య మరీ తక్కువ. అంబేడ్కరిస్టు దృక్పథం నించి సామాజిక సాహిత్య విమర్శ చేస్తున్న ఎస్. సి., ఎస్. టి. బి. సి. కులాల
స్త్రీల సంఖ్యను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. స్రీలు విమర్శనా, విశ్లేషణా రంగంలోఉన్నా వారు బహుజన భావజాలం కన్నా మెజారిటీ భావజాలంవైపు నిలబడుతున్నారు. ఇందులో దళిత కులాల నించి వస్తున్న వారు కొంత దళిత, బహుజన, అంబేడ్కరిస్టు దృక్పథం వున్నా బీసీల నుంచి మాత్రం బహుజన దృక్పథం గల స్త్రీలు విమర్శ రంగంలో ఇంకా కృషి చేయవలసినది చాలా వుంది.
బహుజనవాదం, దళితవాదం బలపడటానికి గత ముప్పై ఏళ్లుగా కృషి చేస్తున్న బహుజన వాదుల్లో బి.ఎస్. రాములు, ఉ. సాంబశివరావు, జి. లక్ష్మీనరసయ్య, కో.ప్ర., బండి నారాయణ స్వామి, సంగిశెట్టి శ్రీనివాస్ వంటి రచయితలున్నారు.వీళ్లంతా బీసీ సామాజికా వర్గం వారు. దళిత వాదాన్ని, ఫూలే, అంబేద్కరిస్టు దృక్పథం నించి బలపరచడంతోపాటు, బి.సి. ఎస్. సి. ఎస్. టి. మైనారిటీ ఐక్య సామాజిక దృక్పథాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తున్నవారు. వీళ్లు దళిత బహుజన దృక్పథం నుంచి సామాజిక విశ్లేషణకుఇ సాహిత్య విమర్శకు కొంత మేరకు మార్గం సులభతరం చేశారు. అయితే ఈ దృక్పథంనించి రాసే బీ.సి. స్త్రీలు చాలా తక్కువ. అనిశెట్టి రజిత లాంటి ఒకరిద్దరు తప్ప లేరు. బీసీ స్త్రీల నుంచి ఇంకా సామాజిక సాహిత్య విశ్లేషకులు ఎదిగి రావలసిన అవసరం వుంది. నిజానికి బీసీ స్త్రీల దృక్పథాన్ని ప్రతిబింబించే రచనల అవసరం ఎంతో వుంది. అయితే జ్వలిత కొంత మేరకు ఈ లోటుని పూడ్చే ప్రయత్నం చేశారు. వివిధ సామాజిక సాహిత్య అంశాలమీద జ్వలిత రాసిన వ్యాసాల సంకలనం ‘జ్వలితార్ణవాలు’ ఒక మంచి ప్రారంభం. వెనుకబడిన కులాల స్త్రీల ఆలోచనలకు ఈ వ్యాసాలు కొత్త స్ఫూర్తిని అందిస్తున్నాయి.
బహుజన సమాజం కోసం పనిచేసిన ఎందరో మహానుభావుల కథలు వెలుగు చూడకుండా మరుగున పడిపోయాయి. ఈ సమాజం కింది తరగతి ప్రజలకు సంబంధించిన మంచి ఏదైనా వుంటే దాని మీద బురద జల్లుతుంది, లేదంటే దాన్ని ప్రజలు మరిచిపోయేలా మాయ చేస్తుంది. బహుజన, దళిత వాదాలు ముందుకు వచ్చాక పరిస్థితి మారింది. దళిత బహుజన సామాజిక, సాంస్కృతిక విషయాలను లోతైన చర్చ చేస్తూ భావజాల వ్యాప్తి చేస్తున్నారు. అయితే బహుజన స్త్రీల కోణం నించి ఇటువంటి చర్చ మరింత జరగాల్సిన అవసరం వుంది. జ్వలిత అటువంటి చర్చను లేవనెత్తింది.
మహామాత సావిత్రిబాయి పూలే, డా. బి. ఆర్. అంబేద్కర్ లాంటి గొప్ప దార్శనీకులను బహుజన స్త్రీ దృక్పథానికి మార్గదర్శకులుగా ఎంచుకుంది జ్వలిత. బ్రాహ్మణేతర కులాల స్త్రీల ఆలోచనలను నిర్దేశించే మనువాద మూలాలను అర్థం చేసుకోవలసిన తీరును ఈ వ్యాసాల ద్వారా జ్వలిత స్పష్టం చేస్తుంది. ఆధిపత్యం కింద తలదించుకొని బతికేలా నిరంతరం ప్రచారం లో వుండే సాంస్కృతిక వ్యవహారాల పట్ల బహుజన స్త్రీలను అప్రమత్తం చేస్తుంది. బహుజన కులాల స్రీలు ఆధిపత్య సాంస్కృతిక అనుకరణ లో పడిపోయి తమవైన సొంత మూలాలను గుర్తించడంలో వెనుకబడుతున్నారని జ్వలిత అభిప్రాయం. అలా తమను తాము మరచి పోయిన బహుజన స్త్రీలకు తమ మూలాల ఘనతను జ్ఞాపకం చేయడం కోసం ‘సావిత్రీబాయిని’’ స్ఫూర్తిగా చూపిస్తుంది. సత్యదీక్షతో అసత్యవాదులందరినీ ఎదిరించి నిలబడి, అజ్ఞానంతో వచ్చిన బానిసత్వాన్ని రూపుమాపే దిశగా పోరాటం చేసిన సావిత్రీబాయి ఈనాటి సమాజానికి అవసరం, ఆదర్శం చెబుతుంది. దళిత బహుజన కులాల స్త్రీలకు చదువు అవసరమని గుర్తించి వారి కోసం తొలిపాఠశాల నెలకొల్పిన మహాత్ముడు పూలే, సావిత్రీబాయిలు ఎన్నో రకాలుగా వివక్షను ఎదుర్కొన్నారు. సావిత్రీబాయి దళిత బహుజన స్త్రీలకు చదువు చెప్పడానికి వెళ్తుంటే నాటి అగ్రకులాల వాళ్లు సావిత్రీబాయి మీద పేడనీళ్లు, పేడముద్దలు విసిరేవాళ్ళు. అయితే సావిత్రిబాయికి పూలే ఆమెను పాతచీర కట్టుకొని వెళ్లి అక్కడికెళ్లాక చీర మార్చుకొమ్మని చెప్పాడు తప్ప చేసే పని ఆపమనలేదు. ఇలా బ్రాహ్మణీయ తీవ్రవాదాన్ని వీరు ఎంతగా ఎదుర్కొన్నారో చెప్పడం ద్వారా ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా ఒక లక్ష్యం కోసం నిలబడి వెనుకడుగు వేయని సావిత్రీబాయిపూలే ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని జ్వలిత పరిచయం చేస్తుంది. బీ.సీ.లకున్న సాంస్కృతిక తాత్విక ప్రతీకలు చాలా తక్కువ. అవి హిందూత్వ చట్రంలో ఎటూ కదలలేని విధంగా ఇమిడి ఉండటాన బహుజన బీ.సీ.ల్లో నుంచి ఎదిగి వచ్చిన తాత్విక మూర్తులు బ్రాహ్మణ సమాజం నించి చాలా వివక్షను, దాడిని ఎదుర్కొన్చారు. బహుజన తాత్వికుల జ్ఞానాన్ని బోధనలనూ బ్రాహ్మణత్వం పూచిక పుల్లగా తీసి పారేసే ప్రయత్నం చేసింది. ఎంత తొక్కేసినా పోతులూరి వీరబ్రహ్మం వంటి తత్వవేత్తలు అన్నిటికీ ఎదురొడ్డి నిలిచారు. అటువంటి వారి గురించి సరైన పరిశోధనలు జరగక పోవడం వెనుక కుల సమాజపు కుట్ర ఉన్నది. ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో పరిశోధన చేసి పుస్తకం ప్రచురించే సందర్భంలో కూడా పోతులూరి లాంటి తాత్వికుడిని కులవివక్ష వెంటాడటాన్ని, ఆయన చుట్టూ అబద్దాల ఊహా చరిత్ర నిర్మించే ప్రయత్నం జరగడాన్ని జ్వలిత ప్రశ్నించడమే అస్తిత్వ చైతన్యం. అటువంటి అస్తిత్వ చైతన్యంతోనే జ్వలిత తప్పుడు రాతలను ప్రశ్నిస్తుంది.
అస్తిత్వ రచయితలకు ఎంతో బాధ్యత వుంది. సమాజానికి తెలియని బహుజన, దళిత జాతుల సాంస్కృతిక, చారిత్రక కథలను ప్రపంచానికి తెలియజేయవలసిన పని ఎంతో వుంది. ఎన్నో కులాల, ఎందరో కళాకారుల చరిత్రలు నమోదు కాకుండా కాలగర్భంలో కలిసిపోయాయి. అవి పరిశోధించి వెలికి తీయాలి. ప్రపంచానికి తెలియని అటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర వున్న ‘రుంజ’ కుల ముఖచిత్రాన్ని ఈ పుస్తకం ద్వారా పరిచయం చేసింది జ్వలిత. విశ్వబ్రాహ్మణ ఉప కులమైన రుంజ వారి సాంస్కృతిక చరిత్రను, వారి కళా నైపుణ్యాలను, వారు చెప్పే పౌరాణిక కథలను గురించి, ఇంకా రుంజ కులస్తుల గురించి సమాజానికి తెలియని ఎన్నో విషయాలను జ్వలిత ఈ వ్యాసాలలో నమోదు చేసింది జ్వలిత. ‘‘రుంజ’’ ఒక కులమే కాదు ఆ పేరుతో ఒక వాయిద్యం వుంది. ఇలాంటి ఒక వాయిద్యం ఉన్నట్టు, ఇది విశ్వబాహ్మణ / విశ్వకర్మ కులస్తులు మోగిస్తారని తప్ప అంతకు మించి చాలామందికి తెలియదు. ఈ వ్యాసంలో విశ్వకర్మలు వారి ఉపకులాల గురించి, వారి చారిత్రక, పౌరాణిక గాథలు, వృత్తి కళానైపుణ్యాల గురించి వివరించారు.
బహుజనులు, దళితులు, స్త్రీలు ఎవరి చరిత్రలో, మరెవరి కథలో రాయడం కాదు, ఎవరికి వారు వారి చరిత్రలు, వారి కథలే రాయాలి. వారి చరిత్రలోని వాస్తవాలను పరిశోధించి బయటకు తీయాలి. పుక్కిటి పురాణాలు, కాల్పనిక కథలు దాటి వాస్తవాలను ప్రపంచం ముందుంచాలి. ఇది మా చరిత్ర, ఇది మా సంస్కృతి, ఇది మా జీవన విధానం అని ప్రతి కులం, ప్రతి ఉపకులం గుర్తించాలి. అందులోని శ్రమ సౌందర్యాన్ని కళా సౌందర్యాన్ని బయటకు తేవడమే కాదు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, అణిచివేతలు, వివక్షలు అన్నిటిని బహిరంగ చర్చకు పెట్టాలి. కావల్సిన వాటిని తీసుకొని అవసరం లేని వాటిని విసిరిపారేయాలి. జ్వలిత ఆ పని మొదలు పెట్టింది. ముందు ముందు ఇంకా అవసరమైన అనేక కథల్ని మరుగున పడిన కుల రహస్యాలను తవ్వి వెలికి తీస్తుంది. జ్వలిత రాసిన చాలా వ్యాసాల్లో స్రీ ప్రధాన వస్తువు. అయితే ఈ స్రీ అగ్రవర్ణ స్త్రీ కాదు. బహుజన స్త్రీ. శ్రమలో నిమగ్నమై శ్రమ జీవితమైన స్త్రీ నిరంతరం అభద్రతతో బతుకుతున్న స్త్రీ. మహిళలుగా ఎదుర్కొన్న వివక్షను, బహుజన , దళిత మహిళ అస్తిత్వంతో ఎదుర్కొంటున్న వివక్షను మూల గదుల్లోకి నెట్టి వేయబడుతున్న మహిళా రచయితలు… ఇలా అన్ని కోణాల్లోంచి విస్మరణకు గురైన మహిళల సమస్యలను జ్వలిత ప్రధాన ఎజండాలోకి తెచ్చింది. అనేక సామాజిక అంశాలను కులాధిక్య పురుషాధిక్య స్వభావాలను, రాజకీయాలను, బాధితులను విస్మరించే ప్రభుత్వాలను, సమాజాన్ని, ఉద్యమాల లోపాలను ఈ వ్యాసాలలో విమర్శించింది జ్వలిత.
ఈ వ్యాసాలలో ఒక వైపు సామాజిక చర్చ చేస్తూనే మరోవైపు సాహిత్య చర్చను కూడా చేసింది జ్వలిత. కొత్త కవిత్వాన్ని పరామర్శించడం, ప్రోత్సహించడంతో పాటు, విస్మరణకు గురైన దళిత స్రీల సాహిత్యాన్ని తెలంగాణ రచయిత్రులు, బహుజన రచయిత్రుల గురించి మాట్లాడిరది. ఈ వ్యాసాలన్నింటిలోనూ జ్వలిత అంతర్జతంగా అంబేద్కరిస్టు భావజాలంతో ఉన్నట్లు స్పష్టమవుతుంది. నిజానికి బీ.సి. కులాల్లో అదీ రిజర్వేషన్ పొందుతున్న కులాలు కూడా ఇంకా అంబేద్కర్ పట్ల కాస్త దూరం పాటిస్తూనే ఉండటం వాస్తవం. బహుజన, శ్రామిక, సేవక కులాల వారందరూ బీసి రిజర్వేషన్ పొందుతున్నారు. అంబ్మేదర్ వారికి రిజర్వేషన్లు కల్పించడం కోసం అగ్రకులాల వారి నుంచి ఎన్నో అవమానాలు పొందాడు. కానీ ఈనాటికీ అగ్రకులాల పట్ల వారి హిందూత్వం పట్ల విశ్వాసం ప్రకటిస్తున్న బీసీల్లో చాలామంది అంబేద్కర్ విషయంలో అంటరానితనం పాటించడం బాధాకరం. అయితే భావజాల స్పష్టత ఉన్న మేధావులు, విద్యావంతులు చాలా ఏళ్ళుగా బీసీల చైతన్యం కోసం, బీ.సీ. ఎస్.సీ., ఎస్.టి . ఐక్యత కోసం, పూలే, అంబేద్కర్ భావజాల వ్యాప్తి కోసం, అంబేద్కర్ చైతన్యాన్ని బీ.సీ.లకు అర్థం చేయించడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ కోవలోనే జ్వలిత కూడా తన వ్యాసాల్లో అంబేద్కర్ను అంతర్లీన ప్రవాహం చేయడం ద్వారా బీసీ స్త్రీలను అస్తిత్వ చైతన్యం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తుంది.
జ్వలితలో ఆగ్రహం ఉంది. నచ్చని విషయమైనా, నచ్చిన విషయమైనా టక్కున స్పందించి తక్షణం సమాధానం చెప్పే గుణం ఉంది. నిజాయితితో కూడిన స్పందన ఉంది. అవసరమైన విషయాలు పట్టుకునే విజ్ఞత ఉంది. బహుజన స్త్రీవాదానికి అండగా నిలిచే పరిపక్వత వుంది. ఈ వ్యాస సంకలనం ద్వారా తన సామాజిక, రాజకీయ అవగాహనను చాలా స్పష్టంగా ప్రకటించింది జ్వలిత. జ్వలిత రాసిన వ్యాసాలు బహుజన స్త్రీవాదానికి బలాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి.