‘‘నోట్లో సారా చుక్కేసి; ఆడ శిశువును చంపేస్తారా?; తండాలకూ ; గుండె లేదా!’’ (పుటః 19)
నేడు తండాల్లో జరుగుతున్న అమానవీయ సంఘటనల్ని ఎవరు చెప్పగలరు? ఈ దృశ్యాల్ని ఎవరు చూపగలరు? గిరిజన తండాల్లో పుట్టిన బంజారా బిడ్డ సూర్యామ్మ తప్ప మరెవరు చెప్పగలరు. ఆమె రాసిన
మొట్టమొదటి కవితా సంపుటి ‘‘బంజారా నానీలు’’ ఆమె తన తండాల్లో చూసిన దృశ్యాల్ని, సంఘటనల్ని హృదయాంతరాల్లో దాచుకొని, దాచుకొని ఒక్కసారిగా నానీల రూపంలో మలచటం ఆమె ప్రతిభకు నిదర్శనం.
‘‘పచ్చ బొట్లు ; పిచ్చి గీతలు కావు ; అవి కళ్ళలోంచి రాలే ; జ్ఞాపకాల బొట్లు!’’ (పుటః 27)
బంజారా స్త్రీలు ముఖంపై పచ్చబొట్లు పొడిపించుకోవడం వారి ఆచారం. అలా పొడిపించుకుంటున్నప్పుడు వారి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అయితే అవి కన్నీళ్ళు కావు. అవి సంతోషంతో తమ సంస్కృతిని భావి తరాలకు చూపే తేనె చుక్కలు అంటారు ఆవిడ.
‘‘కట్టెల మోపుకే ; పైసలిచ్చారు ; మరి అంతదూరం ; మోసుకొచ్చినందుకు?’’ (పుటః 20)
నేటికీ బంజారాలకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కట్టెలు కొట్టి అమ్ముకోవడమే జీవనోపాధి. స్వాత్రంత్యం సిద్ధించి కొన్ని దశాబ్దాలైనా ఈ దృశ్యాలు చూసి కవయిత్రి చలించడం ఈ నానీ ద్వారా తెలుస్తుంది.
‘‘లంబాడీ ఆడపిల్ల ; చంప్లీ ; చంపకండిరా ; అది రేపటి ఛాంపియన్’’ (పుటః 23)
బంజారాలు తమ ఆడబిడ్డల్ని పురిట్లోనే వరి గింజల్ని నోట్లో వేసి చంపుతున్న దృశ్యాల్ని దశాబ్దాలుగా మాధ్యమాల్లో చూస్తున్నాం. ఇలాంటి సంఘటనల్ని రూపుమాపడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నించింది. అయినా ఇలాంటి సంఘటనలు జరగడాన్ని చూసి రచయిత్రి ‘అలా చంపకండిరా నా బిడ్డల్ని! వాళ్ళే రేపటి ఛాంపియన్ మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన ‘‘మాలావత్ పూర్ణ’’లౌతారు’ అని తీవ్రస్వరంతో చెప్పడం జరిగింది.
‘‘డాంబర్రోడ్డు ; అద్దంలా మెరుస్తుంది ; లంబాడీల ; చెమటలో తడిసి’’ (పుటః 26)
లంబాడీలు (బంజారా) సహజంగా కష్టజీవులు. వారి కష్టాలు వారివే. ప్రభుత్వం అప్పుడప్పుడు చేసే మంచి పనుల్లో రోడ్లు వేయడం. లంబాడీల చెమటతో తడిసినవి కావడం వల్లే అవి మెరుస్తున్నాయని కవయిత్రి భావనగా ధ్వనిస్తుంది.
‘‘బాయి ; ఏ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చదివావ్? ; నీ ఫేట్యా డిజైన్ ; వెరీ వెరీ ఫైన్’’ (పుటః 25)
ఈ కవితలో బంజారా స్త్రీల వస్త్రధారణను గురించి చెప్పడం జరిగింది. సహజంగా బంజారా స్త్రీల వస్త్రధారణ చాలా బాగుంటుంది. ‘‘ఫేట్యా’’, ‘‘కాళీ’’, ‘‘టూక్రి’’… ఈ మూడూ ప్రధానంగా వారు వేసుకునే వస్త్రాలు. వాటిపై వారు చేసే అల్లికలు చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది. అందుకే వారిని ఏ కాలేజీల్లో చదువుకున్నారు అని సంబోధించడం జరిగింది.
‘‘ఇప్పపూల అందం ; నిజంగా ఇంపు ; కానీ అవి వెదజల్లేది ; సారా కంపు’’ (పుటః 38)
ఈ నానీ ద్వారా రచయిత్రి ఆవేదన ఎంత హృదయ విదారకంగా ఉందో అర్థమౌతుంది. ఇప్పపూలు అందంగా ఉండొచ్చు కానీ, ఆ అందం బంజారా కుటుంబాల్లో సారా కంపై, వేలాది స్త్రీలు విధవరాళ్ళై దుర్భర జీవనాన్ని గడుపుతున్న దృశ్యం ఇంకా కళ్ళముందు కనిపిస్తుందేమో!
‘‘పచ్చబొట్లు ; పిచ్చిగీతలు కావు ; అవి కళ్ళల్లోంచి రాలే ; జ్ఞాపకాల బొట్లు’’ (పుటః 27)
సహజంగా లంబాడీలు తమ ఒంటిపై పచ్చబొట్లు పొడిపించుకోవడం ఆచారం. అలా పొడిపించుకున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతాయట! అవి నీటి చుక్కలు కావు, ఆచారపు జ్ఞాపకాలు అని అంటారు రచయిత్రి.
‘‘బొడ్రాయిపాలెం ; ‘‘ఘుగర’’ అంటే ఇష్టం ; అది నా బాల్యలోకంలో ; తీపి జ్ఞాపకం’’
‘‘ఘుగర’’ అంటే బంజారా కన్యలు కాళ్ళకు ధరించే గజ్జెలు. బహుశా రచయిత్రి తన చిన్నప్పుడు ‘‘ఘుగర’’ ధరించారేమో! అన్న సందేహం కలుగుతుంది.
‘‘ఇప్పపూల అందం ; నిజంగా ఇంపు ; కానీ! అవి వెదజల్లేది ; సారా కంపు’’ (పుటః 38)
సారా తయారీలో ఇప్పపూల పాత్ర ముఖ్యమైనది. వారు బాల్యంలో ఇప్పపూల అందాల్ని తిలకించియున్నారు. అవే ఇప్పపూలు తదనంతర కాలంలో సారా కంపు అయిందని ఆశ్చర్యపడటం సహజం.
‘‘సంతలో కలిస్తే ; అంతులేని శోకం ; మానవ వేదనకు ; అభివ్యక్తి రాగం’’ (పుటః 46)
ప్రయాణ సౌకర్యం లేని రోజుల్లో తమ కూతుళ్ళను ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఇచ్చి పెండ్లి చేసేవారు. తరచూ కలుసుకునే వీలుండేది కాదు, మాట్లాడుకునే వీలుండేది కాదు. ఏ పండక్కో ఎప్పుడో కానీ కలుసుకునే వీలు కాదు. అందువల్ల సంతలో సరుకులు తీసుకోవడానికి వచ్చినప్పుడు కనిపిస్తే చాలు టక్కున వారి వారి దుఃఖాలు, బాధలు అన్నింటినీ ‘‘మళేరో’’ (దుఃఖపూరిత రాగాలాపన) ద్వారా వారి సాధక బాధకాలను వ్యక్తపరచుకుంటారు.
‘‘ఆమె కదిలొచ్చే ; కళాఖండం ; ఆ డ్రస్సు కుట్టిన ; యాడీని మొక్కాలి’’ (పుటః 33)
లంబాడీలు తమ డ్రస్సులు తామే కుట్టుకునే దర్జీలు. వాటిని అద్భుతమైన కళా నైపుణ్యంతో కుట్టుకుంటారు. కానీ, నేడు క్రమంగా అంతరించే స్థితికి చేరుకోవడం పట్ల రచయిత్రి కలత చెంది ఉంటారేమో అనిపిస్తుంది.
‘‘కట్టెలమ్ముకునే ; అడవి వీరులు ; కడుపమ్ముకోవడం ; ఏం ఖర్మమో!’’ (పుటః 38)
ఒకప్పుడు లంబాడీలు తమ బతుకుదెరువు కోసం అడవికెళ్ళి కట్టెలు కొట్టుకుని పట్టణాల్లో అమ్ముకొని జీవనం సాగించేవారు. అయితే, నేడు బతుకు భారమై, పుట్టిన బిడ్డల్ని అమ్ముకునే దీనస్థితిని ఈ నానీ ద్వారా రచయిత్రి తన ఆవేదనను తెలియచేస్తారు.
ఇవే కాకుండా ఇంకా అనేకమైన దృశ్యమాలికల్ని మనముందుంచారు. బంజారాల జీవన తరంగాల్ని ఈ ‘‘బంజారా నానీలు’’ ద్వారా చూపించడం నిజంగా అభినందనీయం.