స్త్రీ అంతరంగాన్ని, స్త్రీల భావనలను ఆవిష్కరించిన శృంగార ప్రబంధం ముద్దుపళని కావ్యం ‘రాధికా సాంత్వనము’ – ముకుంద రామారావు

18వ శతాబ్దపు ముద్దుపళని (1730`1790), ఆ కాలం నాటి దక్షిణాపథ ప్రభువైన ప్రతాపసింహమౌళితో వలపు, ఆ రాజు, ఆమె సపత్నులకు మధ్య నడిచిన శృంగారం, నిస్సంకోచంగా తన 585 గద్యపద్యాల ‘రాధికాసాంత్వనము’ కావ్యంలో వర్ణించిన తొలి కవయిత్రి.

రాధాకృష్ణుల ప్రణయ సన్నివేశాలుగా వాటిని చూపించగలిగింది.
మధుర`తంజావూరులలో రాయల సేనాధిపతులు, కోశాధ్యక్షులు అయిన విశ్వనాథ నాగమ నాయకుల అరాచక కాలంలో ముద్దుపళని జీవించింది. 1739 నుంచి 1763 వరకు తంజావూరును పాలించిన ప్రతాపసింహుడి ఆస్థానంలో కొలువు చేసిన రాజ్యనర్తకి ముద్దుపళని. ఆస్థాన కవయిత్రి కూడా. ఆ రాజు ప్రాజ్ఞుడు. కవి పండిత పోషకుడు, సంగీత కళాభిమాని. ముద్దుపళనిని ఆదరించాడు. దేవదాసి కుటుంబంలో పుట్టిన ముద్దుపళని తల్లి పోలిబోటి, నాయనమ్మ తంజానాయకి ఇద్దరూ కూడా కవయిత్రులే. తండ్రి పేరు ముత్యాలు. సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం పేరు ‘పళని’. ముద్దుగా ఉన్న బిడ్డకు ఆ పుణ్యక్షేత్రం పేరు జోడిరచి ‘ముద్దుపళని’ అని పేరుపెట్టారు. ముద్దుపళని గురువు వీరరాఘవదేశికుడు. తాను నాట్యకత్తెననీ, శరీర కాంతిలో రత్నం వంటిదానిననీ, లలిత సకల కళా ఫ్రౌడితో వెలసినట్లు, పండితులకు సన్మానాలు చేసినట్లుగా కూడా ఆమె చెప్పుకుంది. దక్షిణాంధ్ర యుగపు తంజావూరు, తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొని వాద వివాదాలకు గురైన ఆమె కావ్యం పేరు ‘రాధికా సాంత్వనము’. ఈ శృంగార ప్రబంధం, ఆనాటి దక్షిణ దేశపు శృంగార కావ్యాల కోవకు చెందినది. స్త్రీ అంతరంగాన్ని స్త్రీల భావనలను ఆవిష్కరించిన కావ్యం ఇది.
చిన్నికృష్ణుడు తన కలలో కనిపించి తనకు అంకితంగా ఒక కావ్యాన్ని రాయమని అడిగినట్లు ముద్దుపళని ‘రాధికా సాంత్వనము’ అవతారికలో చెప్పుకుంది. తన గురువు, ఇతర పండితులకు తన స్వప్నాన్ని చెప్పుకొని, వాళ్ళ అనుమతితో ‘రాధికా సాంత్వనము’ రచన ప్రారంభించింది. ఈ కావ్యానికి ‘ఇళా దేవీయము’ అని మరో పేరు కూడా ఉంది. 584 పద్య గద్యాలతో ఉన్న నాలుగు ఆశ్వాసాల ఈ శృంగార కావ్యాన్ని శుక మహర్షి ముఖతా జనకునికి చెప్పించింది. గొప్ప సంగీత, సాహిత్యవేత్త అయిన ఆమె, విశష్టమైన శృంగార కావ్యాన్ని రాయాలనే తలంపుతో ‘రాధికా సాంత్వనము’ రచనను చేపట్టింది.
బ్రౌన్‌ దొర అనుచరుడు వెంకటనరుసు తొలిసారిగా 1887లో ఈ కావ్యాన్ని ప్రచురించాడు. కానీ, మూలప్రతిలోని ముఖ్యమైన భాగాలు, పద్యాలను ఉద్దేశ్యపూర్వకంగా తొలగించాడు. అయినా సరే, కొందరు పెద్దలు, పండితులు అప్పటినుంచి ఈ కావ్యాన్ని తీవ్రంగా విమర్శించారు. అయితే బెంగుళూరుకు చెందిన నాగరత్నమ్మ (1878`1952), ఆ కావ్యం యొక్క తాటాకుల ప్రతిని సంపాదించి దాని పరిష్కరణకు పూనుకొంది. ఎంతమంది వద్దన్నా వావిళ్ళ ప్రచురణలు ధైర్యంగా ఆ పరిష్కృత కావ్యాన్ని 1910లో ప్రచురించింది. అయితే, ఓ రెండు డజన్ల పద్యాల్లో వర్ణన హద్దు మీరిందన్న కారణంతో 1911లో బ్రిటిష్‌ ప్రభుత్వంతో ఆ పుస్తకాన్ని నిషేధింపచేయడమే కాకుండా, ఆ కావ్య ప్రతులను తగలబెట్టించగలిగారు. ‘రాధికా సాంత్వనము’ ఆ రోజుల్లో అశ్లీలత పేరుమీద ఎక్కువగా ప్రచారమైన గ్రంథం కావడంతో, చాలామంది ప్రజలు ఆ కావ్యాన్ని రహస్యంగా చదివారు. 1911లోనే నిషేధానికి గురైనా బ్రిటిష్‌ ప్రభుత్వం 1927 దాకా దాని ప్రచారాన్ని అరికట్టలేకపోయింది.
1947లో స్వాతంత్య్రం వచ్చాక, రాధికా సాంత్వనము మీద ఆ నిషేధాన్ని తొలగిస్తూ అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఇలా అన్నారు ` ‘జాతి నగలోంచి జారిపోయిన ముత్యాలను తిరిగి చేర్చగలిగాం’. 18వ శతాబ్దపు కావ్యం అసలు ప్రతి 20వ శతాబ్దంలోనే అలా వెలుగు చూడగలిగింది. మరోవైపు తెలుగు కావ్యాలు ఇతర భాషల్లోకి, ముఖ్యంగా ఆంగ్లంలోకి అనువాదమవడం అరుదు. అలాంటిది ‘రాధికా సాంత్వనము’ ‘‘aజూజూవaంవఎవఅ్‌ శీట Raసష్ట్రఱసa’’ అనే పేరుతో ఆంగ్ల భాషలోకి అనువదించబడిరది. సంధ్యా మూల్చందాని చేసిన అనువాదాన్ని, ప్రముఖ ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్‌’ ప్రచురించింది.
ఈ కావ్యంలోని ఇతివృత్తానికొస్తే, నంద యశోదల పెంపుడు కొడుకు కృష్ణుడు. నందుడి ముద్దుల చెల్లెలు రాధ. ఆమె వివాహితే అయినా, కాపురానికి పోకుండా అన్నగారి ఇంటనే ఉండిపోయింది. కృష్ణుడికీ, ఆమెకీ మధ్య ప్రేమ బంధం తెలియనిదెవరికి. కానీ కృష్ణునికి పిన్నవయసులోనే మేనమామ కుంభకుని కూతురు ఇళతో వివాహమైంది. మేనత్త యశోద ఇంటనే ఇళ గోముగా రాధతోనే పెంచబడిరది. ఇళ యవ్వనవతి ఎప్పుడు అవుతుందో అని ఎదురుచూసిన రాధ ఇళ యవ్వనవతి అయ్యాక తన కృష్ణుని తనకు కాకుండా చేస్తోందని ఇళ మీద అక్కసు పెంచుకుంది. అయినా ఇళా కృష్ణుల ఏకాంతానికి తానే మార్గం సుగమం చేసేది. అంతలోనే కృష్ణుడు ఇళకు అమ్ముడుపోయాడని విలపించేది. ఇళా కృష్ణుల పెళ్ళయిన కొన్నాళ్ళకు, కొత్తల్లుడు కృష్ణుడ్ని, కూతురు ఇళను మిథిలలోని తమ ఇంటికి విందుకు తీసుకువెళ్ళాడు కుంభకుడు. మిథిలకు వెళ్ళిన కృష్ణుని విరహాన్ని రాధ తట్టుకోలేకపోయింది. ఆ బాధను ముద్దుపళని విపులంగా వర్ణించింది. చిలుకను దూతగా పంపి కృష్ణుని రప్పించుకుంది. పంతం నెగ్గించుకొని సుఖించిన ఆనందాన్ని, శృంగారసేవని రాయడానికి ఎక్కడా సంకోచించలేదు ముద్దుపళని. స్థూలంగా కథా వస్తువు ఇది.
ఆరుద్ర మాటల్లో చెప్పాలంటే ‘‘ఓసారి రాధ అలిగింది. ఆ అలుక పెరగడం, మనసు విరగడం, అవమానం కలగడం, అంతరంగం మరగడం, కృష్ణుడు రాగానే చెడామడా చెరగడం, చివరికి అతని కౌగిలిలో కరగడం’’ ఇదే రాధికా సాంత్వనము కావ్య గాధ. తాను ‘సాహిత్య విద్యా విశారద శారద’నని, ‘లలిత కళా విభవంబులు/వల నొప్పగ మేటి ముద్దుపళని వధూటి’నని గర్వంగా చెప్పుకున్న కవయిత్రి. పురుషాధిక్య శృంగారానికి ఒక ధిక్కారంగా, ముద్దుపళని తన స్త్రీ దృక్పథాన్నీ, మనసునీ ఆవిష్కరించిన కావ్యం ఇది. ఆనాటి తెలుగు ఆచార వ్యవహారాలు, నమ్మకాలను కళ్ళకు కట్టినట్లు చూపించింది.
అయితే పదహారేళ్ళ ప్రాయంలో మధుర నాయక సామ్రాజ్యానికి రాజైన, విజయరంగ చొక్కానాథుడు (1706`1732) తెలుగులోనే గ్రంథాలు రాసిన కవి, కవులను ఆదరించిన వాడు కూడా. అతని దగ్గర సైన్యాధికారి, సముఖం వెంకట కృష్ణప్ప నాయక అతని ఆస్థానంలోనే ముఖ్యమైన కవి. అతను అహల్యా సంక్రందనము, రాధికా సాంత్వనం అను పద్యకావ్యాలు, జైమినీ భారతం అనే వచన కావ్యాలు రాశాడు. అందులో రాధికా సాంత్వనం ఏకాశ్వాస శృంగార ప్రబంధం. ఇందులోని పద్యాలు ముద్దుపళని తన నాలుగు అశ్వాసాల కావ్యంలో వాడుకుందని అంటారు.
బహుభాషా కోవిదురాలైన ముద్దుపళని విష్ణు భక్తురాలు. ఆండాళ్‌ తిరుప్పావైను మొదటిసారి తెలుగులోకి తెచ్చింది. గోదాదేవి రచించిన తిరుప్పావైలోని 30 పాశురాలలో పదింటిని అనువదించి సప్తపది అని నామకరణం చేసింది. వైఫ్ణవులు ధనుర్మాసంలో సప్తపదిని పఠిస్తారు. ఏది ఏమైనా అలతి అలతి పదాలు, సామెతలు, పలుకుబడులతో మృదు మధుర వర్ణనలతో సాగే ఈ కావ్యంలోని ‘అశ్లీలత’ ఆనాటి కాలస్వభావమో ఆమె అనుభవసారమో కావచ్చు. ‘నీ కృతిని సత్కవులు లెక్కలోకి తీసుకుంటారా’ అని తనను తాను ప్రశ్నించుకుని ‘భళి! కయికొంద రెట్లనిన’ అని చెబుతూ ‘పద్మాలలోని మకరందాన్ని ఆస్వాదించిన తుమ్మెదలు, ఇతర పుష్పాలలోని తేనెను తాగవా? అంటే తాగుతాయ’న్న ముద్దుపళని మాటల్లో కూడా ఇంతే మాధుర్యం ఉంది! తనకే సొంతం అనుకున్న ప్రియుడు ఇంకెవరు స్వాధీనపరచుకున్నా భరించలేనితనం ఇందులో అడుగడుగునా కనిపిస్తుంది.
చెలువుగ బూర్వసత్కవులు చేసినకబ్బము లెన్నో యుండగా, జెలిమిని నీకృతిన్‌ గణన నేతురె సత్కవులందు రేమొకో, భళి కయికొందు రెట్లనిన బద్మపుదేనియ నాను తుమ్మెదల్‌, పులిసి హసించకే యితర పుష్పమరందము లొలింగ్రోలవే.` రాధికా సాంత్వనము పీఠిక`7. తలప నేధీర నీమేర దాతయార్యు / పాదముల వ్రాలె మది నెంచి ప్రస్తుతించి / కలరె నీసాటి ముత్యాలుకన్న మేటి / ప్రబలగుణపేటి శ్రీముద్దుపళనిబోటి ` రాధికా సాంత్వనము పీఠిక`32.
ఇళకు కూడా అంతర్లీనంగా ఉన్న అసూయ, అమాయకత్వం బయటపడుతూనే ఉంటుంది.
శిరిని గని రాధ చనుగుత్తు లివిగొ కొ / మ్మన లేవె తన కింత యను నిళయును / మురవైరి గని రాధ మోవిపండిదుగొ
కొ / మ్మన లేదె తన కింత యను నిళయును / వరుని గన్గొని రాధ నెరిపించ మిదిగొ కొ / మ్మన లేదె తన కింత యను నిళయును / బద్మాక్షు గని రాధ పలుకెంపు లివిగొ కొ / మ్మన లేవె తన కింత యను నిళయును ` రాధికా సాంత్వనము 1`56
హరిని గని రాధ యలయాట లాడుదాము / పడుకటింటికి రమ్మని తొడరి పిల్వ / నాడ నేగూడ వచ్చెద నను నిళయును
నవ్వి రాధికామాధవుల్‌ రవ్వ సేయ ` రాధికా సాంత్వనము 1`57
ఇళను కృష్ణుని చేతిలో పెడుతున్నట్టు రాధ ఎంత పెద్దరికం చూపించుకుంటున్నా, లోలోన దహించుకుపోతూనే
ఉంటుంది. మగనికి ఇంకొక పెళ్ళి అని మక్కువ పడిరదే కాని, సవతి అనుభవం తట్టుకోలేకపోయింది రాధ. ఆ బాధ తెలియనంతవరకు ఇళను ప్రేమించిన తీరు వేరు, తెలిశాక తీరు పూర్తిగా వేరు.
వగలు గైసేసి చెలి యుండు సొగసు జూచి / దృష్టి పై దృష్టి తీసుక తెఱవ నాదు / సవతి వౌదువె యని చెక్కు జఱచి మోము
మోమున గదించి నూఱాఱు ముద్దు లిడును ` రాధికా సాంత్వనము 1`62.
సొమ్ము లియ్యవచ్చు సొమ్మంద మియవచ్చు / నియ్యరాని ప్రాణ మియ్యవచ్చు / దనదువిభుని వేరుతరుణి చేతికి నిచ్చి
తాళ వశమె యెట్టిదాని కైన ` రాధికా సాంత్వనము 1`116.
కనలేదో వినలేదో / కనులారా న్వీనులార గాంతుల్‌ కాంతల్‌ / ఘనవిరహాగ్నిని స్రుక్కగ / గన విన లే దిట్టివలపు కంజదళాక్షా ` రాధికా సాంత్వనమ 1`139. కృష్ణుడు లేని తన విరహాన్ని, బాధని, కోరికల్ని, ఆశల్ని, ఊహల్ని, పశ్చాత్తాపాల్ని వ్యక్తపరచలేకుండా
ఉండలేక పో తుంది రాధ. కావి గా దది విడికెంపుదీవి గాని / దీవి గా దది యమృతంపుబావి గాని / బావి గా దది కపురంపుతావి గాని / తావి గా దది శౌరికెమ్మోవి గాని ` రాధికా సాంత్వనము 2`42.
తేటలుగా జిగిముత్యపు / పేటలుగా బంచదార పేటులుగా బూ / దోటలుగా రాచిలుకల / మాటలుగా గంసవైరిమాటలు దనరున్‌ ` రాధికా సాంత్వనము 2`43.
ఇల రాయరాయ లగు మా / యల రాయల నెంచి యూచ కాచక మదిలో / నలరాయల నెలరాయల / వలతాయల నెన్న దృష్టిపాత్రలు గారే ` రాధికా సాంత్వనము 2`57.
కనుగవ హరిమోము గనుగొననే కోరు / వీనులు హరిమాట వినగ గోరు / నాసిక హరిమేని వాసనల్గొన గోరు / నధరంబు హరిమోవి యాన గోరు / జెక్కిలి హరిగోటినొక్కు టెక్కులె కోరు / గుబ్బలు హరిఱొమ్ము గ్రుమ్మ గోరు / గరములు హరి నెంతో కౌగలింపగ గోరు / మేను శ్రీహరిప్రక్క మెలగ గోరు
నిన్ని యొక్కటే కోరు నిదిగొ నాదు / మనసు గోరెడికోరికెల్‌ మట్టులేవు / మర్మ మెందుకు మదనసామ్రాజ్య మిచ్చి / నెగడుహరియె యాయుర్దాయ మగుట శుకమ ` రాధికా సాంత్వనము 2`62.
నాకృష్ణ దేవుని నా ముద్దుసామిని / నా చక్కనయ్యను నాదుహరిని / నానోముపంటను నారాజతిలకుని / నారాముతమ్ముని నాదువిభుని / నామనకాంతుని నానందతనయుని / నా ప్రాణనాథుని నాదుప్రియుని / నామోహనాంగుని నానీలవర్ణుని / నావిటోత్తంసుని నాది సఖుని తేరి కన్నులకఱ వెల్ల దీర గాంచి / చాల నడిగితి మ్రొక్కితి గేలు సాచి / కౌగలించితి గరములు కనుల జేర్చు / కొంటి రమ్మంటి మది వేడుకొంటి ననుమి ` రాధికా సాంత్వనము 2`72. కలలో నైనను బాయక / కలకాలము నున్న విభుడె కసుగాయకు నై / పలచన చేసె నటన్నం / జెలియా మగవారిచనవు చెడ్డదు సుమ్మీ ` రాధికా సాంత్వనము 3`36.
ఎల్లవారికి శకునంబు లెల్ల బలికి / బల్లి తాబోయి తోట్టిలో బడినరీతి / నొకరి నన నేల తా జేసికొనినపనికి / వెనుక జింతించు టెల్లను వెఱ్ఱితనము ` రాధికా సాంత్వనము 3`46.
హద్దుముద్దుమీఱి యాడుది మగడంచు / గూడి మాడి యాడ జూడ దలచి / బలిమి విందు బెట్టి పగగొన్న చందాన / బెండ్లిచేసి నేనె బేలనైతి ` రాధికా సాంత్వనము 3`47. ఇళ వలపులో ఉన్న కృష్ణునితో ఇక ముందు ఎలా సాగుతుందో అన్న అనుమానం, వేదన రాధను అనవరతం తింటూనే ఉంది. తలకెక్కిన వలపున హరి / యల యిళ దాసానుదాసుడై మెలగంగా / గలవె యిక నేటియాసలు / కలి పోసిన వెనుక నట్టి కనుగొనుమాడ్కిన్‌ ` రాధికా సాంత్వనము 3`54.
నను గాదు పొమ్మని నాతి జేరినవాని / నేనెట్లు పిలుతునో నెలతలార / నాపేరు నావగ నాతి కిచ్చినవాని/ మోమెట్లు చూతునో ముదితలార / బాసలెన్నో చేసి పద్దు దప్పినవాని / పలుకెట్లు విందునో పణతులార / సరివారిలో నన్ను జౌక చేసినవాని / చెలిమెట్లు చేతునో చెలియలార ` రాధికా సాంత్వనము 4`35. తెలియగా జెప్పు మనియెదు తెలిసి తెలిసి / యందు కేమాయె నేనందు కనగలేదు / దెలిపి మునుపలె నిక గూర్ప నలవి యగునె / తారి తేఱని నారి నేదారినైన ` రాధికా సాంత్వనము 4`37.
ఎంత అలిగి రాధ త్రోసిరాజన్నా, ఇళను నువ్వే పెంచావు కదా, నువ్వే నా చేతిలో పెట్టావు కదా, నువ్వే మేమిద్దరం ఎలా ఆనందాన్ని అనుభవించాలో నేర్పావు కదా, నువ్వే ఇప్పుడిలా అని కృష్ణుడు రాధను అనునయించే అన్ని ప్రయత్నాలూ చేస్తూ పోయాడు, విజయం సాధించే వరకూ… పెంచినదానవు దాని గ / దించినదానవును నీవె తెగి మమ్మటకుం / బంచినదానవు నీవే / మంచిది మఱి నీవె యలుగ మర్యా దటవే ` రాధికా సాంత్వనము 4`52.
ఎవ్వరు పిల్చి రిచ్చటికి నెందుకు వచ్చితి నేమి కార్యమే / మెవ్వతె నీ వెవండ విక నెవ్వరి కెవ్వరు దేని కేది మీ / జవ్వని విన్న రవ్వ లిడు జాల్తడ వాయెను వచ్చి లేచి పో / నవ్వెద రెల్లవారలును నన్నును నిన్నును గోపశేఖరా !` రాధికా సాంత్వనము 4`69.
నీదు ముద్దులగుమ్మ నీమోవి నొక్కితే / కటకటా నామది కంద నేల / నీ ప్రాణనాయిక నీచెక్కు గీటితే / కనలి నామది చుఱుక్కనగ నేల / నీదు చక్కెరబొమ్మ నిన్నెంచ కాడితే / పొగిలి నామది చిన్నవోవ నేల / నీదుపట్టపుదేవి నిను చాల నెనసితే / యుడుగక నామేను బడల నేల ` రాధికా సాంత్వనము 4`86

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.