రైతు బతుకు వెతలపై సాధికారిక కథలు – గొల్లపల్లి వనజ

రాయలసీమ అగ్రశ్రేణి కథా రచయితల్లో ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ఒకరు. ఈయన రాయలసీమ, ముఖ్యంగా కడప ప్రాంత ప్రజలు కరువు వలన పడే కష్టాలను, వారి బాధలను, ఆవేదనలను తన కథల్లో చిత్రించాడు. సీమలో ప్రజలకు ప్రకృతి నుంచి వచ్చిన కష్టాలు కొన్నయితే, బలమైనవాడు బలహీనత కలిగిన వాడిని పెట్టే కష్టాలు

కొన్ని. ఇలాంటి సమస్యలన్నింటినీ అభ్యుదయ దృక్పథం కలిగిన కేతు విశ్వనాథరెడ్డి గారి కథల్లో చూడవచ్చు. రాయలసీమ రైతుల బతుకు వెతలపై ఆయన రాసినవి సాధికారికమైన కథలు. ఆయన నేరుగా వ్యవసాయంతో సంబంధం కలిగి ఉండటం, జీవితాంతం శ్రామిక ప్రజలతో కలిసి ఉండడం వల్ల ఆ అనుభవాలు ఆయన రాసిన కథలను సజీవవంతం చేశాయి.
‘సానుభూతి’ కథలో ‘‘కష్టాలంటే ఏమిటో, కష్టాలు ఎంత క్రూరమైనవో నాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు. ఆస్తిపాస్తులున్న వాళ్ళకు తెలుసు. అవి పోతున్నవాళ్ళకు తెలుసు. ఒట్టి కసిగాళ్ళకేం తెలుసు?’’ అనుకుంటాడు కథానాయకుడు. ఒకవైపు దాయాదుల గొడవలు, పట్టాలను చూపించి భూములు మావని తిరగబడిన మాదిగలను గురించి కథానాయకుడు తన క్లాస్‌మేట్‌ రామకృష్ణతో కష్టాలను చెప్పుకుంటాడు. ‘‘మీరు కాబట్టి ఇన్ని కష్టాలను తట్టుకున్నారు. మరొకళ్ళయితేనా…’’ అని సానుభూతి చూపిస్తాడని ఆశిస్తాడు కథానాయకుడు. అంతా విన్న రామకృష్ణ ‘‘మీ ఇంటి కథ తెలుగు సినిమా కథకు సరిపోతుంది. సినిమాలో కన్నీళ్ళూ, సినిమా తీసిన వాళ్ళకు డబ్బులూ, బుద్ధీ జ్ఞానం ఉన్నవాడెవడూ మీ ఏడ్పులకు బాధపడడు. మీవేం కష్టాలు? తెచ్చిపెట్టుకున్న కష్టాలు. నిజమైన అవస్థలంటే మీ ఊళ్ళో హరిజనులు పడే అవస్థల్లాంటివి. వాళ్ళ గోడుకు వాళ్ళు కారణం కాదు, మీరూ, కావలసినంత సొంత ఆస్తులున్న మీలాంటివాళ్ళూ. వాళ్ళకు అవసరం ప్రేమా, సానుభూతీ. మీకెందుకూ?’’ అని గట్టిగా బుద్ధి చెప్తాడు. ఈ కథలో అమాయకులైన మాదిగల భూములను కబ్జా చేసిన భూస్వాములపై మాదిగల తిరుగుబాటు ధోరణి కన్పిస్తుంది.
‘‘పైవాడు చెప్పినట్లల్లా ఆడేవాళ్ళున్నంతవరకూ, రేచుకుక్కల్లా జనం వెంటబడి తరుముకోనంతవరకూ ఈ పిల్లాటలే అమ్మలదీ, అయ్యలదీ, వాళ్ళ పిల్లలదీ, బంధువులదీ కూడా…’’ అని ‘అనధికారం’ కథలో డిప్యూటీ కమిషనర్‌ భార్య సుధారాణి పెట్టే ఇబ్బందులకు కానిస్టేబుల్‌ సుబ్బన్న మాటలు నిస్సహాయతను, తిరుగుబాటు ధోరణిని తెలియజేస్తాయి. ఈ కథ 1978 ఆగస్టులో జనసుధ మాసపత్రికలో అచ్చయ్యింది. 1985 అక్టోబర్‌లో బెంగాలీలోకి అనువాదమైంది.
చదువుకుని ఉద్యోగాలు లేక, వ్యవసాయం చేద్దామంటే వానలు పడక, మెట్టభూముల్లో పంటలు పండక డబ్బు కోసం యువత చెడు మార్గాన్ని ఎంచుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్న విధానాన్ని కేతు విశ్వనాథరెడ్డి ‘విశ్వరూపం’ కథలో చెప్పారు. ఈ కథలో పార్థూ మేథమెటిక్స్‌ చదువుకున్న నిరుద్యోగి. పార్థూ బావ కృష్ణయ్య ప్రోద్భలంతో పార్థూకి మట్కా అనే జూదం మీద మనసు మళ్ళుతుంది. చివరికి కృష్ణయ్య మట్కా కంపెనీ పెడదామని ఉన్న డబ్బు పోగొట్టుకుని పిచ్చివాడైపోతాడు. మట్కా కోసం డబ్బును అప్పు తెచ్చి అప్పుల పాలైపోయిన పార్థూ విషాదంలో కూరుకుపోయి తన క్లాస్‌మేట్‌ చెన్నకేశవులకు తన గోడును చెప్పుకుంటాడు. ‘‘చదువుకున్న వాళ్ళం. మనమైనా కొంత ఆలోచించకపోతే ఎట్లా? నిన్ను తప్పులు పడుతున్నానని అనుకోకు. ఇంతమంది మట్కా నిప్పులగుండంలో ఎందుకు నడుస్తున్నారంటావు, పీర్లపండగలో నడిచినట్లు? ఏదో ఒరుగుతుందని ఆశ. ఎట్లా ఒరుగుతుంది, ఈ వ్యవస్థే మనుషుల్ని తగలబెట్టే నిప్పులగుండం అయితే? మనకు ఉద్యోగాలు ఎట్లాగూ ఇప్పట్లో రావు. వచ్చినా బతుకు మారుతుందని అనుకోకు. ఆలోచించవలసింది అదృష్టం మీద ఆధారపడని బతుకు కోసం’’ అని చెప్పిన చెన్నకేశవుల ఆవేదనను మొదటిసారిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు పార్థూ.
రైతు పోలీసులపై తిరుగుబాటును ప్రకటించే కథ ‘ఆ రోజులే వస్తే’. ఈ కథలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బన్నను కమలాపురం తాలూకా గంగిరెడ్డి పల్లె స్టేషన్‌ నుంచి ఎస్పీ బద్వేలు తాలూకా మామాపురం పోలీస్‌స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తాడు. వానలు పడక, పంటలు పండక కడుపు నింపుకోవడమే కష్టంగా ఉన్న ప్రజలకు ఖూనీ, కొట్లాటలు వంటి వాటికి తావు లేకుండా పోతుంది. ఒకవైపు ఆశ్వయుజం వచ్చినా చినుకుల్ని రాలనీయకుండా పల్లెలనూ, పొలాలనూ, వాటిని నమ్ముకున్న రైతుల బతుకులనూ నిలువునా కాలుస్తున్న ఎండ అయితే, కొట్లాటలు, ఖూనీ కేసులు ఏమీ లేకపోవడంతో పై ఆదాయం ఏమీ లేకపోవడంతో ఎండకంటే తీవ్రంగా, ఎదురుపడ్డ జీవినల్లా మాడ్చేటట్లు సుబ్బన్నకు మనసెండ! ఆ సమయంలో చుట్టాల ఊరి నుండి ఎద్దుల బండిలో తిండికి జొన్నలు వేసుకుని వస్తున్న సోమయ్యపై ఎస్‌.ఐ. సుబ్బన్న కన్ను పడుతుంది. రైటరు కాశీం, సుబ్బన్న రెండు మూటల జొన్నలు దించిపొమ్మంటారు. ‘‘అమ్ముకోడానికి అనుకుంటున్నారా? అంత రాతా? మాకు కూటికే సాలటం లేదో భగవంతుడా అనుకుంటా వస్తున్నా’’ అని సోమయ్య చివరికి స్టేషన్‌ దగ్గర మూటలు దించకనే వెళ్ళిపోతాడు. ఆ తరువాతి సంవత్సరం వానలు బాగా కురవడంతో పొలాలను నమ్ముకున్న రైతులు అరకలను పొలాల్లో దింపుతారు. సుబ్బన్న తన దందా మొదలు పెడతాడు. అందరితో పాటు సోమయ్య కూడా దున్నడం ప్రారంభిస్తాడు. సోమయ్య స్టేషన్‌లో జొన్నలు దించలేదన్న విషయం మనసులో పెట్టుకున్న సుబ్బన్న సోమయ్య పొలంలో గంజాయి గింజలను చల్లించి కేసులో ఇరికించాలని చూస్తాడు. కేసు తప్పుకోవాలంటే ఐదువందల జరిమానా కట్టమంటాడు. అది విన్న సోమయ్య అక్కడే కూలబడిపోతాడు. సోమయ్య గురించి తెలిసిన ఆ ఊరి ధర్మశాసనాధిపతి బ్రహ్మంరెడ్డి ఆ సొమ్మును తాను కడతానని ఒప్పుకుంటాడు. అందరూ వెళ్ళిపోతుండగా సుబ్బన్న సోమయ్య దగ్గరికి వచ్చి ‘‘ఆ రోజు ఒక్క మూట జొన్నలడిగితేనే అమాయకం మొగం పెట్టినావు. ఇప్పుడేమైంది? పోలీసోళ్ళతో వ్యవహారమంటే ఇప్పుడన్నా తెలిసిందా?’’ అంటాడు. సోమయ్య సుబ్బన్న వైపు కొన్ని క్షణాలు చూసి ముళ్ళకర్రతో ఎద్దును వెర్రిగా బాదుతూ, ‘‘ఆకాశం బతకనీదు. మనుషులూ బతకనీరు. నువ్విట్లా! నీయమ్మ… నిన్ను నాటుకట్టెల్తో కొట్టాల్నే’’ అని తిట్టడం ప్రారంభిస్తాడు. దాంతో సుబ్బన్న సోమయ్య కడుపుమంట గ్రహించి ‘‘ఆ ముళ్ళకర్ర తనను బాదే రోజులొస్తే! ఎక్కడొస్తాయి? ఎప్పుడొస్తాయిలే… వస్తే!!’’ అనుకుంటూ తొందర తొందరగా వెళ్ళిపోతాడు.
‘‘దప్పిక’’ కథలో కొందరు ధనికులు పైకి మంచివారిగా నటిస్తూ రైతులకు అవసరానికి డబ్బిచ్చి అదను చూసుకొని వారి ఆస్తిని కాజేసి, తమ ఆస్తులను పెంచుకుని దాని చూసుకొని మురిసిపోతున్న దృశ్యాన్ని రచయిత చిత్రీకరించారు. ఈ కథలో కథకుడు రిటైరైన అరవయ్యేళ్ళ ప్రభుత్వ ఉద్యోగి. ప్రకృతి సౌందర్య పిపాసి. టౌనుకు దగ్గర్లోని పల్లెటూరులో పొలం కొని, గంగన్న అనే రైతు సహాయంతో బావి తవ్వించి, మోటారు పెట్టించి, ఆ బావి నీరుని గంగన్నకు అప్పుగా ఇస్తాడు. ఊళ్ళో రైతులకు కూడా వడ్డీలకు ఇచ్చేవాడు. గంగన్నకు, అతని కొడుకుకు ఆస్తి పంపకాల తీర్పులో తనకు రావలసిన బాకీకి పొలం మొత్తం వశం చేసుకుని మిగిలింది గంగన్నకు, గంగన్న కొడుక్కి చెరొక వెయ్యి రూపాయలు ఇచ్చి వారిని వీథిపాలు చేస్తాడు. గంగన్నకు ఏదో సాయం చేశాననుకుని, కొన్న పొలాన్ని మొత్తం కలిపి పచ్చని సౌందర్యాన్ని చూసి ఆనందిస్తూ ఆ ఆనందాన్ని తన యువ స్నేహితుడైన సోమశేఖరంతో పంచుకుంటాడు. అది విన్న సోమశేఖరం ‘‘మీ సౌందర్య దాహం, మంచితనం, స్నేహం సంగతేమో నాకు తెలియదు. కరెంటూ, నీళ్ళూ, డబ్బూ మీ చేతుల్లో ఉన్నాయి. ఉండబట్టే గంగన్న కుటుంబం వీథుల్లో పడిరది. ఇంకా కొన్నాళ్ళు పోతే మీ దెబ్బతో చాలా కుటుంబాలు వీథిన పడతాయి’’ అని సోమశేఖరం కథకుడు చేస్తున్న మోసాన్ని గుర్తు చేస్తాడు. సోమశేఖరం మాటలు కథకుడ్ని ఆలోచింపచేస్తాయి.
‘‘పీర్లసావిడి’’ కథలో రాజకీయ స్వార్థం కనిపిస్తుంది. ఓట్ల కోసం అమాయకులైన ప్రజలను మోసం చేసి, వారి అవసరం తీరిపోయాక వారి స్థాయిని గుర్తుచేసి, వారిని మోసం చేసి ఎన్నికలప్పుడు ఖర్చయిన డబ్బుకంటే రెండిరతలు ప్రజల దగ్గర లాగడం వంటి దుస్థితిని ఈ కథలో చూడవచ్చు. కరువు రోజుల్లో ప్రభుత్వం ఎప్పుడో ఒకసారి స్పందించి పశువులకు గడ్డిని సరఫరా చేస్తే ఆ గడ్డిని పేదవారి వరకు రానివ్వకుండా అధికారులు అన్యాయంగా మాయం చేయడాన్ని ‘గడ్డి’ కథ వివరిస్తుంది. ఈ కథలో అచ్చమ్మ పాత్ర ద్వారా కన్నబిడ్డల్లా చూసుకుంటున్న పశువులకు గడ్డి దొరక్కపోవడంతో ఆమె పడే బాధను, ఆక్రోశాన్ని, ఆవేశాన్ని రచయిత ఆవిష్కరించారు. అచ్చమ్మ అధికారులను ప్రశ్నించి నిలదీసే ధైర్యసాహసాలు గల పాత్రగా విశ్వనాథరెడ్డి చిత్రీకరించారు.
చిన్న రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో క్రమంగా వారు కూలీలుగా మారుతున్న పరిస్థితిని ‘నమ్ముకున్న నేల’ కథలో చూడవచ్చు. ఈ కథలో వీరన్న కరువుకు భయపడి వ్యవసాయం చేసే ధైర్యం లేక భోగం మేళంలో కూలీగా చేరతాడు. తర్వాత భోగం మేళం కంపెనీని స్వయంగా తానే పెడదామనుకుంటాడు. భోగం మేళంలో రాణించే చాకచక్యం, సామర్థ్యం తనకు లేదని గ్రహించి సిమెంటు ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తూ జీవనాన్ని గడుపుతాడు. ఈ కథలో కథకుడు ఊర్లో ఉన్న పొలాన్ని అమ్మితే డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో కూతురి పెళ్ళి చేయాలని ప్రొద్దుటూరి నుంచి సొంత ఊరికి వస్తాడు. కానీ ఆ ఊర్లో కరువు విలయతాండవం చేస్తుండడంతో అతి తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
‘అన్నదాతలు’ కథలో తమ సంస్థలలో పనిచేసే కార్మికుల శ్రమను దోచుకుంటూ వారి కష్టాలను పట్టించుకోకుండా ఎంతసేపూ కీర్తి, ప్రతిష్టల కోసం తాపత్రయపడే పెత్తందారుల స్వభావాన్ని రచయిత చిత్రీకరించారు. ఈ కథలో రమణయ్య తోటి శ్రామికుడు చనిపోవడంతో అతనికి న్యాయం జరగాలని యజమాని అయిన రంగయ్యను నిలదీస్తాడు. అందుకు రంగయ్య ‘మీరు పెట్టే చెయ్యిని కరిచేవాండ్ల’ని రమణయ్యను దూషించి మిల్లును మూసివేస్తాడు. శ్రామికుల కష్టాలను పట్టించుకోని రంగయ్య కొత్త సంస్థను ఏర్పాటు చేసి, ఆ సంస్థ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి ముందు ఒక అనాధ బాలుర అన్నదానం మందిరం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి ప్రశంసలను అందుకుంటాడు. మిల్లు మూతపడడంతో వేలాది కార్మికులు, వారి కుటుంబాలు పొట్ట చేత్తో పట్టుకుని వస్తారు. అయితే, వారు వచ్చింది అన్నదానం కోసం కాదుÑ న్యాయం కోసం.
పొట్టకూటికి ప్రాంతం, కులం, మతం… ఇవేమీ అడ్డు కాదనే విషయం ‘శృతి’ కథలో తెలుస్తుంది. ఈ కథలో సిమెంటు ఫ్యాక్టరీ అధికారులు తమ స్వార్థం కోసం ప్రాంతాలను, మతాలను, కులాలను అడ్డుపెట్టుకుని కార్మికులను విడదీస్తే స్టైక్‌ వీగిపోతుందనుకుంటారు. కానీ ప్రాంతం, కులం, మతం ఇవన్నీ పక్కనపెట్టి రెండు రూపాయల కూలీ పెంచమనడం కోసం కూలీలందరూ ఏకమై ‘కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి’ అని నినాదం చేస్తారు. ఎంత స్నేహితులైనా అధికారం, హోదా పెరిగేకొద్దీ స్వార్థంతో కులాలు, ప్రాంతాలు, మతాలు గుర్తుకొస్తాయనే విషయాన్ని కథకుడు గుర్తిస్తాడు.
సమ సమాజాన్ని కోరుకునే విశ్వనాథరెడ్డి గారు సమాజంలో ప్రేమ రూపం ఎలా ఉందో తన కథలలో తెలియజేశారు. ప్రేమించిన వ్యక్తికి హెచ్చు కులగోత్రాలు, డబ్బు వంటివి లేకపోవడంతో వేరే పెళ్ళికి సిద్ధమైన వైనాన్ని విశ్వనాథరెడ్డి ‘ఎవరు మీరు?’ కథలో చిత్రించారు. ఈ కథలో కథకుడికి మోహన్‌, సురేఖ ఇద్దరూ ఒకేసారి పరిచయమవుతారు. సురేఖ లైబ్రరీలో పుస్తకాల పురుగు అయితే మోహన్‌ కథా రచయిత… ఒక పత్రికలో ప్రూఫ్‌ రీడర్‌గా పనిచేసేవాడు. సురేఖ మోహన్‌ రచనలన్నీ చదువుతూ అతడి ప్రేమలో పడుతుంది. మోహన్‌ కూడా ఆమెను ఇష్టపడతాడు. మోహన్‌కి డబ్బు లేకపోవడం, కులమతాలు వేరు కావడంతో సురేఖ, మోహన్‌ విడిపోతారు. మోహన్‌ కంపోజిటర్‌గా పనిచేస్తున్న అమ్మాయిని ఇష్టపడి పెళ్ళి చేసుకుంటాడు. సురేఖకు ఒక ఇంజనీరుతో, ఐదు లక్షల కట్నం ఇచ్చి పెళ్ళి నిశ్చయమవుతుంది. ఇదంతా దగ్గర్నుండి గమనించిన కథకుడికి సురేఖ, మోహన్‌ ‘‘ఏ రకం ఖాతాదారులు జీవితంలో? ప్రేమలో?’’ అనుకుంటాడు. ‘ప్రేమరూపం’, ‘మన ప్రేమ కథలు’ కథలు కూడా ఈ కోవకే చెందుతాయి. ప్రేమ ప్రకటించడానికి కూడా స్థోమత, డబ్బు ఉండాలనే స్థితికి సమాజం ఎలా దిగజారిందో ‘దూరం’ కథలో చూడవచ్చు. ఎంత ప్రేమ ఉన్నా డబ్బు లేకపోతే మనిషికి మనిషికి దూరం పెరుగుతుందనే వాస్తవాన్ని రచయిత ఈ కథ ద్వారా తెలియజేశారు. భక్తిలో కూడా పేద, ధనిక తారతమ్యాలని చూపడాన్ని ‘ఎస్‌2 బోగీ’ కథలో చూడవచ్చు. ఉన్న వాస్తవాలను దాచిపెట్టి తమ కీర్తిని పెంచుకోవడానికి చరిత్రను కల్పించి రాస్తున్న చరిత్రకారులను ‘ఖడ్గాలూ కాటుక పిట్టలు’ కథలో చిత్రీకరించారు.
కేతు విశ్వనాథరెడ్డి చాలావరకు కడప గ్రామీణ ప్రాంత జీవితాన్ని చిత్రీకరించారు. కూలీల దీనస్థితిని, వానలు లేకపోవడం వలన ఏర్పడిన కరువుతో రైతులు పడే ఆవేదనను, దాంతో నాశనమవుతున్న వారి జీవితాలను చిత్రీకరించారు. భూస్వాములు చిన్నకారు రైతులను, కూలీలను చేసే మోసాలను ఎండగట్టారు. కేతు విశ్వనాథరెడ్డి 1939 ఆగస్టు 10వ తేదీన కడప జిల్లా కమలాపురం తాలూకా రంగసాయిపురంలో కేతు పెద్ద వెంకటరెడ్డి, నాగమ్మ దంపతులకు జన్మించారు. ‘‘జప్తు’’ (1974), ‘‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’’ (1991), ‘‘ఇచ్ఛాగ్ని’’ (1996) కథా సంపుటాలను వెలువరించారు. ‘‘వేర్లు’’, ‘‘భోది’’ (1994) అనే నవలికలు కూడా రాశారు. ‘‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’’ సంపుటానికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, 1996లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించాయి. కేతు విశ్వనాథరెడ్డి కథకునిగానే కాక పరిశోధకుడిగా, విమర్శకుడిగాను ప్రసిద్ధి గాంచారు. ‘‘కడప ఊళ్ళపేర్లు’’ ఈయన పరిశోధనా గ్రంథం. సాహిత్యానికి సంబంధించిన అనేక విషయాలను చర్చిస్తూ ‘‘దృష్టి’’ అనే పేరుతో 1998లో వ్యాస సంపుటిని వెలువరించారు. ఈయన సాహిత్యానికి చేసిన కృషికి గాను భారతీయ భాషా పరిషత్తు పురస్కారం, రావిశాస్త్రి పురస్కారం, రితంబరీ పురస్కారం, పులుపుల వెంకట శివయ్య సత్కారం, తుమ్మల వెంకట రామయ్య బంగారు పతకం, అజో విభో పురస్కారం, గోపీచంద్‌ సాహిత్య సత్కారం… ఇలా ఎన్నో పురస్కారాలు లభించాయి. ఈయన మొదట పాత్రికేయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత కడప, తిరుపతి, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో అధ్యాపకులుగా పనిచేశారు. డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అనేక పాఠ్య పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ఆయన 2023 మే 22న కన్నుమూశారు.
(సాహిత్య ప్రస్థానం పుస్తకం నుంచి….)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.