కథా మార్గదర్శి కేతు విశ్వనాథరెడ్డి – సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి

ప్రసిద్ధ రచయిత, సాహిత్య విమర్శకులు కేతు విశ్వనాథ రెడ్డి భౌతికంగా మననుంచి దూరమయ్యారు. ఒక ఆకు రాలినట్టు తన స్థానానికి సంబంధించిన స్పష్టమైన గుర్తును వదిలిపెడుతూ చప్పుడు చేయకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. ఎన్నో చిగురుటాకులకు మార్గదర్శకంగా నిలిచినవాడు, ఒక సంక్లిష్టమైన ప్రాంతీయతను సాహిత్యం

చేసినవాడు, కరువులు తాండవించే నేలల మీదుగా, కక్షల సుడిగాలులు చెలరేగే గ్రామాల వీథుల మీదుగా పయనించి కథా వస్తువుల్ని ఏరుకున్నవాడు… చెప్పాపెట్టకుండా దాటుకొన్నాడు. అపోహలకు, అపార్థాలకు గురై, దగా పడిన ఈ సీమ నేల మట్టి గుండెల చప్పుళ్ళను నిజాయితీగా వినిపించినవాడు, ఎవరూ పట్టించుకోని దృశ్యాల్ని కూడేసుకుని, ఎవరూ వినేందుకు ఇష్టపడని మూలుగుల్ని గొంతుకలో మోసుకొని కథలుగా చెప్పినవాడు, వెనుదిరిగి చూడకుండా కనుమరుగయ్యాడు.
ఏమి మనిషని ఆయన… ఎండిన కొమ్మల్ని తాళ్ళుగా పేనిన వాడు, పొడి మట్టితో పూలను చేసినవాడు. ఏమి మనిషని ఆయన… నెత్తురూ కన్నీళ్ళని కలిపి వాక్యాల్ని చేసినవాడు, ఆకలీ ఆవేశాన్ని కలిపి సంఘటనలు కూర్చినవాడు. ఏమి మనిషని ఆయన… కాసిని నవ్వులు మరికొన్ని ఏడుపులు ఇంకొన్ని ఆవేశాలు చాలేన్ని చెమట చుక్కలు కలిపి కథలను వండినవాడు. ఏమి మనిషని ఆయన… మన చుట్టూ ఉండే మనుషుల్నే పాత్రలుగా మార్చి మన గుండెల్లో ప్రతిష్టించి వెళ్ళినవాడు. కథలంటే అవేవో బ్రహ్మపదార్థాలనుకునేవాళ్ళం. చిన్న చిన్న వ్యవసాయ కష్టాలు, కొట్లాటలు, రోజూ చూసే పార్టీల గొడవలు కథలుగా రాసి చూపించాడు. ఆయన కథలు చదివిన తర్వాత ఎవరికైనా సరే తమ చుట్టూ ఉన్న పరిసరాలను కథలుగా మలచుకొనే రహస్యం ఏదో తెలిసిపోతుంది. సింగమనేని, కె.సభా, పి.రామకృష్ణ, మధురాంతకం రాజారాం, పులికంటి, వైసివి లాంటి వాళ్ళతో కలిసి సీమ ప్రాంతాన్నంతా కథాసాహిత్యంగా మార్చివేశాడు. మా తరం వాళ్ళకు కేతు విశ్వనాథరెడ్డి గారు సాహిత్య గురువు. దారి దీపం. ఆత్మీయ నేస్తం. తప్పుదారుల నడవకుండా హెచ్చరించే చూపుడు వేలు. అక్షరాలను ఆలంబనగా చేసుకుని పయనించిన కథక ఋషి. సాహిత్య విమర్శకుడు. వివిధ కథాసంకలనాల, పత్రికల సంపాదకుడు. పాఠ్యపుస్తకాల ప్రణాళికా కర్త. ఉపన్యాసకుడు. ఆయన మరణం సాహిత్య లోకానికి తీరని లోటు. రాయలసీమ ఆధునిక సాహిత్య వటవృక్షాలు ఇద్దరు… సింగమనేని నారాయణ గారు రెండేళ్ళ క్రితం, కేతు విశ్వనాథరెడ్డి గారు ఇప్పుడు రాలిపోవడం సాహిత్య లోకం చేసుకున్న దురదృష్టం.
నాకు చెరోవైపు నిల్చొని వీపుతట్టి ప్రోత్సహించిన వారు ఇద్దరూ. నా కథల సంపుటాలకు ఒకరు ముందుమాట రాస్తే, మరొకరు వెనుక అట్ట మీద రాసి నా పట్ల తమ ఆప్యాయతను చాటుకొన్నారు. ఎన్నో రాత్రిళ్ళు సాహిత్య చర్చల్లో కూర్చున్నాను. ఆహ్వానమున్నా, లేకున్నా వాళ్ళు పాల్గొనే సాహిత్య సభలకు విధిగా హాజరయ్యేవాడ్ని. కేవలం వాళ్ళ ఉపన్యాసాలు వినడానికి, వాళ్ళతో కలిసి సాహిత్య సమయాల్లో గడపడానికి వెళ్ళేవాడ్ని. కేతు గారు ఇక లేరనే విషయం జీర్ణం కాకుండా ఉంది. నిన్నటిదాకా ఎదురుగా ఉన్నవాడు, ఈరోజు జ్ఞాపకం అయ్యాడు. మాటలుగా వినిపించేవాడు కాస్తా అక్షరాలుగా మారిపోయాడు. రాయలసీమ పల్లె మట్టి పొత్తిళ్ళలో కళ్ళు తెరిచినవాడు. ఆ మట్టి వేదనల్ని అక్షరాలకెత్తి భవిష్యత్తరానికి కథల పాతర్లు నింపినవాడు. అచ్చమైన కడప మాండలికాల్ని సాహిత్యపు గాదెలకు పోసినవాడు. కర్కశమైన పల్లె జీవితాల్లోని ఎగుడు దిగుడుల్ని పుస్తకాల గరిసెలకు ఎత్తినవాడు. అంతటి నిపుణుడైన సాహిత్య కృషీవలుడు ఇకపై కడపలో కనిపించడనే విషయం భరించరానిదిగా ఉంది. ఆయన ఆచార్యుడైనా, డాక్టరేట్‌ సంపాదించిన విద్యాధికుడైనా నాకెప్పుడూ పల్లెటూరి రైతులాగే కనిపించేవాడు. అదే కష్టజీవనం, అదే దాతృగుణం. ఆయన గొప్ప సాహిత్యకారుడైనా, ఉపన్యాసకుడైనా నాకెప్పుడూ పల్లె జీవితాల్ని గొంతెత్తి పాడే జానపద కళాకారుడిలాగే కనిపించేవాడు. అదే పట్టుదల, అదే అంకిత భావం. గ్రామ నామాల గుట్టు బైటపెట్టిన అరుదైన పరిశోధకుడైనా, విద్యార్థుల తల వెలిగేలా పాఠ్యపుస్తకాల్ని నిర్మాణం చేసిన భాషా శాస్త్రవేత్త అయినా నాకెప్పుడూ ఒక మాండలిక పదాల కుప్పలా కనిపించేవాడు. సంకోచపడని అదే యాస, అదే పలుకుబడి.
రాయలసీమ జీవితాల్ని అనేక కోణాల్లో ఒడిసిపట్టి కథలుగా మలిచిన సాహిత్యకారుడు మరొకడు లేడనడం అతిశయోక్తి కాదు. సీమ జీవితం చాలా సంక్లిష్టమైంది. మూడు నాలుగేళ్ళు వరుసగా కరువులు వాలి, తినడానికి తిండి తాగడానికి నీళ్ళు దొరక్క వరిటించి వరిటించి మొద్దు చింతమానుల్లాగా మొదళ్ళలో పానాలు నిలుపుకొని, ఒక్క వాన కురిస్తే చాలు ఒళ్ళంతా చివురులు తొడిగి బతికి పోవడం వాళ్ళకే తెలుసు. అంతటి కరువుల్లో కూడా ఆధిపత్యం కోసం మీసాలు మెలేసి గుంపును వెంటేసుకొని ఒకరినొకరు నరుక్కోవడం కూడా వాళ్ళకే తెలుసు. బాటసారులు రాత్రిళ్ళు అరుగుల మీద కనిపిస్తే, గంప చేతబట్టుకుని ఇల్లిల్లూ తిరిగి అన్నం ముద్దలు సేకరించి వాళ్ళ ఆకలి తీర్చటం, మాట పట్టింపు వస్తే కసి పెంచుకొని జీవితాంతం పగలు ప్రతీకారాలతో రగిలిపోవటం వాళ్ళకే తెలుసు. ఇంతటి సంక్లిష్టమైన జీవితాల్ని ప్రాంతీయ అవగాహనతో అర్థం చేసుకొని కథల్లోకి తీసుకురావడం అంత సులభమైన విషయమేమీ కాదు. వాళ్ళ ప్రవర్తనే కథయితే అదొక గొప్ప వైఫల్యం. దాని వెనక ఆర్థిక, సామాజిక, రాజకీయ కోణాలను విశ్లేషించినప్పుడే గొప్ప కథవుతుంది. కేతు గారు అందులో సఫలమయ్యారు కాబట్టే గొప్ప కథకులు కాగలిగారు. ముడి విప్పలేని సంక్లిష్ట విషయాల్ని సైతం అలవోకగా కథలుగా మార్చిన నైపుణ్యం ఆయనది. మేమంతా సులభంగా నడిచేందుకు దారులు ఏర్పరచిన మార్గదర్శకుల్లో అగ్రగణ్యులు ఆయన.
ఈ పెద్దాయన కోపగించుకుని మాట్లాడటం నేనెప్పుడూ చూడలేదు. ఎప్పుడైనా ఎవరికైనా ఆయన నవ్వు మొహంతోనే కనిపించేవాడు. హాస్య చతురత ఆయన స్వంతం. ఎంతటి గంభీరమైన వాతావరణాన్నైనా ఒక చతురు మాటతోనో, ఒక నవ్వు సంఘటనతోనో తేలికపరిచేవాడు. ప్రతి మనిషిని గుండెలోతులు స్పృశించేలా పలకరించేవాడు. నన్నందరూ ‘సన్నపురెడ్డి’ అని పిలిచినా, ఆయన మాత్రం ‘వెంకట్రామ్‌’ అంటూ ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని వీపు తట్టేవాడు. రచయితగా నా గమనాన్ని సునిశితంగా పరిశీలించి సలహాలిచ్చేవాడు. పొగడ్తలకు పొంగకుండా, తెగడ్తలకు కుంగకుండా నా పని నేను చేసుకుపోయే స్థితప్రజ్ఞత సింగమనేని గారు, కేతు గారి వల్లనే నాకబ్బింది. రాయలసీమకు సంబంధించిన అన్ని సమస్యల మూలాల్ని వెదికి పరిష్కారాల్ని సూచించిన నిఖార్సయిన ప్రాంతీయ కథకులు కేతు విశ్వనాథరెడ్డి. ప్రాంతీయ జీవితాన్ని చిత్రిస్తూనే, ప్రాంతాలకు అతీతమైన సంస్కారాన్ని చైతన్య స్ఫూర్తిని భావోద్వేగాలను రగిలిస్తూ మానవ స్వభావాల్ని సమర్థవంతంగా ఆవిష్కరించిన అరుదైన కథకులు.
(సాహిత్య ప్రస్థానం పుస్తకం నుండి…)

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.