స్వాతంత్య్రానంతర కాలంలో తెలుగు స్త్రీల పత్రికలు: అబ్బూరి ఛాయాదేవి ‘వనిత’ (ఏప్రిల్‌`డిసెంబర్‌ 1956)-డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

బ్రిటిష్‌ వలస పాలనాకాలంలో రూపుదిద్దుకున్న మహిళోద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ భారతీయ భాషల్లో స్త్రీల పత్రికలు వెలువడ్డాయి. దిగజారిపోయివున్న తమ పరిస్థితుల్ని మెరుగుపరచుకోవడానికీ, హక్కుల సాధనకూ

తెలుగునాట మహిళోద్యమకారులు చేపట్టిన క్రియాశీలక బౌద్ధిక కార్యాచరణకు అద్దంపడుతూ వలసాంధ్రలో ఇరవైకి పైగా స్త్రీల పత్రికలు ప్రచురితమయ్యాయి. వాటిలో సతీహితబోధిని, తెలుగు జనానా, గృహలక్ష్మి మొదలైనవి పురుషుల సంపాదకత్వంలో వెలువడగా హిందూసుందరి, సావిత్రి, వివేకవతి, అనసూయ, ఆంధ్రలక్ష్మి, ఆంధ్రమహిళ మొదలైనవి స్త్రీల సంపాదకత్వంలో వెలువడ్డాయి. వలస పాలనా కాలంలో ప్రారంభమైన హిందూసుందరి, గృహలక్ష్మి, ఆంధ్రమహిళ మొదలైన పత్రికలు భారత రాజకీయ స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగడం విశేషం. వలసాంధ్రలో వెల్లివిరిసిన మహిళాచైతన్యానికి దర్పణం పట్టే స్త్రీల పత్రికలు మహిళోద్యమాన్ని నిర్మించడంలోనూ, దాన్ని నిరంతరాయంగా కొనసాగించడంలోనూ గణనీయమైన పాత్రను పోషించాయి.
1947లో పాలకులు మారినారు గానీ పరిస్థితులేం మారలేదుÑ స్త్రీల పరిస్థితులు మెరుగైందేమీ లేదు. దీన్ని చక్కగా గ్రహించారు కాబట్టే స్త్రీలు తమఉద్యమాన్ని కొనసాగించారు. స్త్రీల సమస్యల పట్ల సమాజాన్ని చైతన్య పరచడానికి అక్షరాల్ని ఆయుధాలుగా మలచుకున్నారు. వలస పాలనా కాలంలో ప్రారంభమైన స్త్రీల అక్షరోద్యమానికి కొనసాగింపుగానే స్వాతంత్య్రానంతరం తెలుగులో కొన్ని స్త్రీల పత్రికలు ప్రచురించబడ్డాయి. కమ్యూనిస్టు స్త్రీల సంఘమైన ‘ఆంధ్రరాష్ట్ర మహిళా సంఘం’ ఆంధ్ర వనిత అనే పత్రికను మార్చి /ఏప్రిల్‌ 1948లో ప్రచురించింది. రెండే రెండు సంచికలు వచ్చిన తర్వాత ఈ పత్రికను కాంగ్రెస్‌ ప్రభుత్వం దుర్మార్గంగా నిషేధించింది. దరిశి చెంచయ్య రెండవ భార్య అయిన దరిశి సుభద్రమ్మ దీనికి సంపాదకురాలుగా వుండినారు. వనితా విహార్‌ అనే పత్రిక 1949లో రాజమండ్రి నుండి వెలువడిరది. సత్యవతీదేవి, రాజ్యలక్ష్మి, మహాలక్ష్మి అనే ముగ్గురు స్త్రీలు దీనికి సంపాదకత్వం వహించారు. నారీలోకం అనే పత్రిక కె. రంగమ్మరెడ్డి సంపాదకత్వంలో విజయవాడ నుండి వెలువడిరది.
ఈ చారిత్రక నేపథ్యంలో అబ్బూరి ఛాయాదేవి సంపాదకత్వంలో ఏప్రిల్‌ 1956 నుండి వెలువడనారంభించిన వనిత ఆ సంవత్సరాంతం వరకు కొనసాగింది. వనితను పాఠకులకు పరిచయం చెయ్యడమే ఈ వ్యాసం ఉద్దేశం. సంపాదకురాలైన అబ్బూరి ఛాయాదేవిది పరిచయం అవసరం లేని పేరు. వనిత ‘ఆంధ్ర యువతీ మండలి’ అనే మహిళా సంఘం తరపున ప్రచురించబడిరది. ‘ఆంధ్ర యువతీమండలి’ 1935లో హైదరాబాదులో నెలకొల్పబడిరది. ‘భారతదేశం యావత్తూ బానిసత్వం అనుభవిస్తున్న కాలంలో ఆనాటి సాంఘిక దురాచారాలనూ, నిరక్షరాస్యతనూ రూపుమాపి, దేశ స్వాతంత్య్రానికి పాటుపడాలనే ఆకాంక్షతో, ఆంధ్ర వనితలలో నిద్రాణమై ఉన్న వివిధ శక్తులను వికసింపజేసి, వారి అభిరుచులను ప్రోత్సహించి, వారి సాంఘిక జీవనంలో అభ్యుదయం తేవాలనే ఆశయంతో… ఆనాడు స్త్రీలకున్న శతసహస్ర నిర్బంధాలలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి’ శ్రీమతి యల్లాప్రగడ సీతాకుమారి, శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి ఈ సంస్థను స్థాపించారు. వారికి బూర్గుల అనంతలక్ష్మీదేవి, రంగమ్మ ఓబుల్‌రెడ్డిలు ‘సర్వ విధాల’ తోడ్పడ్డారు. శ్రీమతులు మాడపాటి మాణిక్యమ్మ, టి. వరలక్ష్మమ్మ, సరోజిని యస్‌.యన్‌. రెడ్డి మొదలైనవారు సంస్థ అభివృద్ధికి పాటుపడ్డారు. రాణి సరళాదేవి, గద్వాల్‌ రాణి, పాపన్నపేట, పాల్వంచ, గుడుగుంట సంస్థానాధీశ్వరులు ఆర్థికంగా సహాయం చేశారు. స్త్రీలు ఇందులో సభలూ, సమావేశాలూ, పండుగలూ జరుపుకొనేవారు. స్త్రీలలో విజ్ఞానాభివృద్ధికై ప్రముఖులతో ఉపన్యాసాలిప్పించేవారు. ‘యువతీ మండలి’ నిర్వహించిన గ్రంథాలయం స్త్రీలకుపయుక్తంగా ఉండేది. స్త్రీలలో కళలను ప్రోత్సహించడానికి ప్రత్యేక తరగతులను నిర్వహించేవారు. బాలబాలికలకు ఉచితంగా విద్యనందించడానికి ఒక పాఠశాలను స్థాపించారు. 1954 నాటికి ‘యువతీ మండలి’కి విశాలమైన సొంత భవనం యేర్పడిరది. 1956 నాటికి ఇందులో 300 మంది సభ్యులుండేవారంటే గొప్ప విశేషమే! మహిళాభ్యుదయం కోసం అంకితమైన ‘ఆంధ్ర యువతీమండలి’ వనితను ప్రచురించింది.
మాసపత్రిక అయిన వనితలో సుమారు 64 పుటలుండేవి. సంవత్సర చందా మూడు రూపాయలు. పత్రిక సర్క్యులేషన్‌ ఎంతుండేదో ఖచ్చితంగా తెలియదు. 2012 జనవరి 15న ఛాయాదేవిగారు ఈ వ్యాసకర్తకు యిచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం సుమారు 1000 మంది దాకా చందాదారులుండేవారు. వనిత స్త్రీల రచనలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. పురుషుల రచనలు దాదాపుగా లేవనే చెప్పాలి. నాయని కృష్ణకుమారి, యల్లాప్రగడ సీతాకుమారి, నందగిరి ఇందిరాదేవి, అబ్బూరి ఛాయాదేవి, ఉన్నవ విజయలక్ష్మి, తెన్నేటి హేమలతాదేవి, జ్ఞానకుమారి హెడా, లక్ష్మీ భాగ్యనగర్‌, వల్లభనేని రంగాదేవి, డాక్టర్‌ కొండా శకుంతలాదేవి, డాక్టర్‌ యస్‌. శ్రీదేవి, యం. జానకీరాణి, అడవికొలను రుక్మిణి, శ్రీపాద వెంకటరమణమ్మ, మర్రి సావిత్రీదేవి, రాజేశ్వరి, కె. విశాలాక్షి మొదలైన రచయిత్రులు వనితలో తమ రచనల్ని ప్రచురించారు. ‘ఆంధ్ర యువతుల అభ్యున్నతి నిమిత్తమై ‘‘వనిత’’ అనే ప్రతిక వెలువడుతున్నందుకు పరిపరివిధాల నేను సంతోషపడుతున్నాను. స్త్రీజాతి అభ్యుదయానికి దోహదం చేసే ఆదర్శాలను, సమాచారాన్ని అందజేయటానికి కంకణం కట్టుకున్న పత్రిక ఈ రోజుల్లో అత్యంత వాంఛనీయం. ఆంధ్ర యువతీమండలి వారు నడుపుచున్న ఈ పత్రిక నాలుక్కాలాలపాటు నిలచి ఆంధ్ర మహిళా లోకానికి ఎల్లవేళల్లోనూ వెలుగు అందిస్తూ ఉండగలదని ఆశిస్తున్నాను’ అని వనిత ప్రారంభ సంచికలో దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ శుభాకాంక్షలందజేసింది. అప్పటికామె 1944లో ప్రారంభించిన ఆంధ్ర మహిళ వెలువడుతూనే వుంది. అయినా వనితను పోటీగా భావించక ప్రోత్సహించడం విశేషం. ‘ఈ పత్రిక మూలమున తెలంగాణములోని మహిళలలో చక్కని ప్రబోధము, విజ్ఞాన ప్రసారము కలుగునట్లు దైవమనుగ్రహించుగాక!’ అని మాడపాటి హనుమంతరావు ఆశీర్వదించాడు. వనిత వెలువడే నాటికి చట్టపరంగా స్త్రీల స్థితిగతుల్లో అత్యంత ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వంనుండే మహిళోద్యమకారులు గట్టిగా కోరుతున్న కొన్ని చట్టాలను భారత పార్లమెంటు పాస్‌ చేసింది. ‘హిందూకోడ్‌ బిల్‌’గా పిలువబడి, తీవ్రంగా చర్చించబడి, ఛాందస గార్ధభాలు గట్టిగా వ్యతిరేకించిన కొన్ని హక్కులు స్త్రీలకు లభించాయి. వివాహం, విడాకులు, ఆస్తిహక్కు, దత్తత మొదలైన విషయాల్లో స్త్రీల హక్కులు పరిరక్షించబడ్డాయి. అయితే అవి చాలావరకు వాస్తవరూపం దాల్చలేదన్నది నిక్కమైన నిజం.
మొదటి సంచికలోని సంపాదకీయంలో వనిత లక్ష్యాల్ని చాలా స్పష్టంగా ఈ క్రింది విధంగా నిర్వచించింది సంపాదకురాలు: ‘స్త్రీని వంట యిల్లు అనే చీకటి పరిధినుంచీ ఆమెను వెంటాడుతున్న ప్రతిబంధకాలనుంచీ తప్పించి ఆరుబయట ఆకాశం క్రింద ఏం జరుగుతున్నదో తెలియచెప్పటానికి, చుట్టూరా విస్తరించుకుని ఉన్న విశాల ప్రపంచంలో అనునిత్యం సాగే జీవన సంఘర్షణలో స్త్రీ ఉనికి, స్త్రీ భాగస్వామ్యం, ఆమె నిర్వహించవలసిన పాత్ర ` ఇత్యాది విషయాలను ప్రబోధించటానికి ఎక్కువ మహిళా పత్రికలు అత్యంతావశ్యకం… ఇల్లు చక్కబెట్టుకోవటం ఒక్కటే కాదు, దేశాన్ని చక్కబెట్టవలసిన బాధ్యత కూడా యీనాడు స్త్రీ పైనే ఉన్నది. అయితే, ఈ ద్వంద్వ బాధ్యతను మన వనితలు ఎంతవరకు గుర్తించగలుగుతారన్నదే ప్రస్తుత సమస్య. పురుషునితోపాటు సమాన హక్కులను సాధించాలన్న విషయాన్ని గుర్తించినప్పటికి, ఆ లక్ష్యసాధనలో స్త్రీ ఎంతవరకు కృతకృత్యురాలౌతున్నది? అసలు ఆ లక్ష్యసాధనకు అవసరమైన సాధన సామగ్రి ఎటువంటిది? దేశ జనాభాలో ఈనాడు సగం మంది స్త్రీలే. కానీ, వారిలో అనేకమంది అవిద్యావంతులు. ఆర్థికంగా పరాధీనులు. మౌఢ్యం, నిరంతర కుటుంబ భారం వీరిని అనేక విధాలుగా క్రుంగదీస్తున్నది. అంతేకాదు, ఈనాడు మన కుటుంబ జీవితాల్లో కానవచ్చే నైరాశ్యానికి, నిట్టూర్పులతో రోజులు వెల్లబోసుకోవటానికీ ఇదే హేతువు. ఇక కట్నాలు, వివాహాలు మొదలైన సమస్యలను ఎత్తుకున్నామంటే అదంతా ఒక అగాధం. ఈ విపత్తుల నుంచి తనకు తానై తప్పుకోగలగటానికి ఆమెలో సహజంగా నిద్రాణమై ఉన్న అంతఃశ్శక్తిని, చైతన్యాన్నీ మేలుకొలపటానికి స్త్రీజాతిలో నేడు కొత్త ఆలోచనలు ప్రవేశించటం అన్నది తప్పనిసరిగా రావలసిన పరిణామం. నిద్రాణమై ఉన్న మన వనితలలో యీ అవసరాన్ని గుర్తింపజేసి వారిలో జాగృతిని కలిగించి దేశ పునరుద్ధారణకి, శాంతి సౌభాగ్యాల ఆవిర్భావానికీ విస్తృతమైన వేదికను నిర్మించటం కోసమై ‘‘వనిత’’ పత్రిక అవతరిస్తున్నది. ఈ కర్తవ్య నిర్వహణలో నిరంతర కృషి కొనసాగించడమే ‘‘వనిత’’ పరమావధి.’
వనితలోని సంపాదకీయాలు విశిష్టమైనవిÑ అభ్యుదయకరమైనవి. మొట్టమొదటి సంచికలోని సంపాదకీయం మహిళాభ్యుదయానికి స్త్రీల పత్రికల ఆవశ్యకతను నొక్కిచెప్పింది. 15.5.1956 నాటి సంపాదకీయం (‘వనితా సమాజాలు’) మహిళా సంఘాల అవసరాన్ని తెలియజేసింది. పల్లెటూరి స్త్రీలతో పోలిస్తే పట్నవాసపు స్త్రీలలో ‘సమిష్ఠి భావం శూన్యం’ అనీ, ‘సంకుచితత్వం, సోమరితనం అలవరచుకోవడం నాగరిక లక్షణం కాదు. నలుగురితో కలిసినప్పుడే సభ్యత అలవడుతుంది’ అనీ, ‘గృహనిర్వహణతోబాటు, సంఘ జీవనం కూడా స్త్రీకి ముఖ్యం’ అనీ తెలియజేసి, ‘విద్యావంతులు, అనుభవజ్ఞులూ అయిన వనితలు ప్రత్యేకంగా సమాజాలను స్థాపించి వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూ వనితల పురోభివృద్ధికి పాటుపడవచ్చును’ అని సూచించింది. 15.6.1956 నాటి సంపాదకీయం గ్రామ పంచాయతీల నిర్వహణలో స్త్రీలు పాల్గొనడానికి సంబంధించింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో పాల్గొనే అవకాశం స్త్రీలకు కల్పించిందనీ, ‘వనితాభ్యుదయాన్ని కాంక్షించే ప్రతివారూ ఆంధ్ర ప్రభుత్వాన్ని అభినందించి’ తీరుతారనీ ఆశించింది. ‘ఈ వైజ్ఞానిక యుగంలో మన సాంఘిక జీవన సంస్కారానికీ, అభివృద్ధికీ, మహిళల సహకారం అత్యంత ముఖ్యమని యీనాటికి అందరూ’ గుర్తించారనీ, ‘అయితే, మహిళల విషయంలో ప్రభుత్వంకానీ, ప్రజాభ్యుదయానికి పాటుపడే నాయకులు కానీ నిష్పక్షపాతంగా వ్యవహరించవలసి ఉంటుంది’ అనీ నిష్కర్షగా ప్రకటించింది. 15.7.1956 నాటి సంపాదకీయం (‘వనితాభ్యుదయం’) రెండు అంశాలను చర్చించింది. సరోజినీ నాయుడు, మార్గరెట్‌ కజిన్స్‌ల స్మృతిచిహ్నాల యేర్పాటుకు సంబంధించిన నిర్ణయాన్ని గూర్చి తెలియజేస్తూ ‘ఈనాడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం, హక్కులూ, ఆనాటి వారిరువురి నిరంతర కృషి, స్వార్థత్యాగం మూలాన్నే లభ్యమయినాయి’ అని స్పష్టం చేసింది. వారి స్మృతిచిహ్నాలను నెలకొల్పడంలో అఖిల భారత మహిళాసభ (‘ఆల్‌ ఇండియా వుమెన్స్‌ కాన్ఫరెన్స్‌, స్థాపన సం. 1927)కు తోడ్పడడం ‘తన ప్రధాన కర్తవ్యమని ప్రతి భారత మహిళా గుర్తించా’లని కర్తవ్య ప్రబోధ చేసింది. అదే సంపాదకీయంలో ‘పతిత’ స్త్రీలకోసం కేంద్ర సాంఘిక సంక్షేమ సంఘం ద్వారా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 430 పునరావాస గృహాలను యేర్పాటు చేసిందనీ, వాటిలో వారికి అగ్గిపెట్టెలూ, చాపలూ మొదలైన వాటిని తయారు చేయడం నేర్పిస్తే వాళ్ళు తమ కాళ్ళపై తాము నిలబడగలరనీ, దానికోసం ప్రత్యేకంగా రెండవ పంచవర్ష ప్రణాళికలో పదిన్నర కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందనీ దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ తెలియజేసినట్లు వివరించారు. ‘అంత పెద్ద మొత్తాన్ని స్త్రీ జనాభ్యుదయం కోసం వినియోగించదలచినందుకు’ భారత ప్రభుత్వాన్ని ప్రతి స్త్రీ అభినందించాలని కోరారు. డిసెంబరు 1956 నాటి సంపాదకీయం కూడా ‘పతిత’ స్త్రీలకు సంబంధించిందే. ‘పతిత’ స్త్రీలను ఉద్ధరించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి శ్లాఘనీయమైనదైనప్పటికీ పరోక్షంగా అది వారిని అవినీతికి పాల్పడేటందుకు ప్రోత్సహిస్తోందనీ, కాబట్టి సమాజంలో ‘అవినీతిని నిర్మూలించే మార్గాలను అనుసరించడం’ ముఖ్యమనీ హెచ్చరించింది. ‘వేశ్యాగృహాలను రూపురేఖల్లేకుండా చేయడానికి, అన్నిరకాల అవినీతిని నిర్మూలించడానికి పోలీసు శాఖలో స్త్రీలను నియమించడం సమంజసమే. అవినీతి మార్గాలను అరికట్టడం సంకుచితత్వం కాదు. అవినీతికరమైన పనులు చేయడమే నాగరికతకు లక్షణమనే దురభిప్రాయాన్ని పోగొట్టే బాధ్యత హిందూ వైవాహిక సంప్రదాయాలను మన్నించే ప్రతి స్త్రీపైనా ఉన్నది’ అని వివరించింది. 15.8.1956 నాటి స్వాతంత్య్రదినోత్సవ సంచికలో భారత స్వాతంత్య్రోద్యమం కోసం పోరాడిన మహిళల్ని గుర్తుచేసుకొమ్మని పిలుపునిచ్చారు. ‘స్త్రీ జనాభ్యుదయం కోసం పోరాడిన వనితలలో ప్రజానీకానికి తెలిసినవారు కొద్దిమంది మాత్రమే. వారిలో ఎంతమంది అజ్ఞాతంగా ఉండి కృషి చేశారో, ఎంతమంది పేర్లు చరిత్రలో అట్డడుగున పడిపోయాయో ` వారందరినీ భారతదేశ స్వాతంత్య్రదినోత్సవ శుభ సమయంలో సంస్మరించుకుని వారికి జోహారులర్పించడం మన విధి’ అని పాతతరం మహిళా స్వాతంత్య్ర సమరయోధులపట్ల భావితరాల బాధ్యతను గుర్తు చేసింది. 15.9.1956 నాటి సంపాదకీయం ‘ఆడపిల్లను అదుపులో ఉంచడం’ గూర్చి. ‘ఆధునిక పద్ధతుల్లో’ అలంకరించుకుంటూ, మహిళా సభల్లో ఉపన్యాసాలిస్తూ, పత్రికల్లో కథలూ, వ్యాసాలూ రాసే ‘అభ్యుదయ’వాదులైన ఆడవాళ్ళు సైతం ఆడపిల్లల విషయానికొచ్చేటప్పటికి ఏవిధంగా ‘పద్దెనిమిదవ శతాబ్దం’ నాటి భావజాలం కలిగి ఉంటున్నారో బట్టబయలు చేసింది. ‘ఆధునికురాలై’న ఒకావిడ ఆరుగంటలకు వస్తానన్న తన చదువుకున్న కూతురు ఎనిమిదైనా రాకపోవడంతో ‘అసలు ఆడపిల్లలు అంత స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరగడం పనికిరాదు’ అంటుంది. ‘సమాన హక్కులుండాలండీ’ అంటే, ‘నాకు నచ్చవు అలాంటి హక్కులూ గిక్కులూనూ` ఈ విషయంలో నాకు పద్దెనిమిదవ శతాబ్దంలోనే నమ్మకం ఉంది సుమండీ’ అంటుంది. అభ్యుదయవాదాన్ని ఒక నైతిక అంకితభావంతో (ఎశీతీaశ్రీ షశీఎఎఱ్‌ఎవఅ్‌) కాకుండా, పేరుకోసం, ఫేషన్‌ కోసం బయటికి ప్రదర్శిస్తూ జీవించే ప్రదర్శనాత్మక అభ్యుదయవాదులపై రaులిపించిన కొరడా ఈ సంపాదకీయం.
వనితలో కవితలూ, కథలూ, వ్యాసాలూ ప్రచురించబడ్డాయి. ‘ఉజ్వల వనిత’ అనే కవితలో (15.4.1956, పు. 27`29) యల్లాప్రగడ సీతాకుమారి ‘సర్వశక్తులు వినియోగించి సమానత్వము సంపాదింపగా’ ముందుకు సాగమని భారత మహిళలకు పిలుపునిచ్చింది. ఆ కవితలోని కొన్ని భాగాలు:
వనితలో కవితలూ, కథల కన్నా వ్యాసాలు ఎక్కువగా ప్రచురింపబడ్డాయి. ‘స్త్రీలు`ఉద్యోగాలు’ అనే వ్యాసంలో (15.5.1956, పు. 24`27) ఎస్‌. రాజ్యలక్ష్మి స్త్రీని ఇంటికి మాత్రమే పరిమితం చేసే అసహజమైన పితృస్వామ్య జెండర్‌ విభజనని విమర్శించి, స్త్రీలు
ఉద్యోగాల్లో (బహిరంగ కార్యక్షేత్రంలో) ప్రవేశించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. స్త్రీలు ‘మార్దవం’ కలవారు కాబట్టి వాళ్ళు విద్యా, వైద్య, శాంతిస్థాపనా రంగాల్లో బాగా రాణించగలరని భావించింది. ‘ఈనాటి మానవ సంఘంలో వచ్చిన మార్పులననుసరించి మన సాంఘిక జీవనం కూడా స్త్రీదృష్ట్యా పునర్వ్యవస్థీకరింపబడాలి’ అని స్త్రీ దృక్పథం నుండి సమాజాన్ని పునర్మించాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పింది. ‘విద్యావంతులైన స్త్రీలు గొప్ప ఉద్యోగుల భార్యలై కేవలం వారి ప్రతిబింబాలుగాను మర్యాద చిహ్నాలుగాను మారి స్వంత బాధ్యతలను మరుస్తున్నా’రని హెచ్చరించి, ‘ఆత్మగౌరవమున్న ప్రతి స్త్రీ స్వీయక్షేత్రంలో స్వయం ప్రకాశమానురాలు కాగోరుతుంద’నీ, ‘అటువంటి పవిత్ర లక్ష్యాన్ని (ఉద్యోగాలు చేసి సంపాదనాపరులవడాన్ని) ధన వ్యామోహమని దూషించేవారు సంఘంలో స్త్రీ బాధ్యతను గుర్తించలేని’ గుడ్డివారుగా భావించాలనీ స్పష్టపరిచింది.
ఎస్‌. రాజ్యలక్ష్మి రాసిన ‘ఉపాధ్యాయ వృత్తిలో స్త్రీ’ అనే వ్యాసంలో (15.4.1956, పు. 9`13) ‘స్త్రీలో సహజంగా ఉండే మాతృప్రేమ, ఓర్పు, మానవత్వం మొదలైన విద్యాబోధనకనుకూలమైన ఉత్తమ లక్షణా’లుండడంవల్ల ఆమె ఉపాధ్యాయవృత్తికి బాగా సరిపోతుందని తేల్చింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న స్త్రీలకు ఆయాదేశాలు (ఉదాహరణకు ఫ్రాన్సు, రష్యా, ఫిలిప్పీన్సు, యుగోస్లేవియా) కల్పించిన వివిధ రకాలైన ప్రోత్సాహక సౌకర్యాలను గూర్చి ` అంటే జీతభత్యాలు, ప్రీ`నాటల్‌ అలవెన్స్‌, మెటర్నిటీ అలవెన్స్‌ మొదలైనవి` తెలియబరచింది. హైదరాబాదు రాష్ట్రంలో కూడా ఉపాధ్యాయినులకు ‘కొన్ని మంచి సౌకర్యాలు’ ఉన్నాయనీ, వేతనాల విషయంలో స్త్రీ`పురుష వివక్ష లేదనీ, ‘పురిటి సమయంలో రెండు మాసాల వరకు నిండు జీతంపైన సెలవు దొరికే అవకాశం’ ఉందనీ, అయితే స్త్రీల సంఖ్యకు తగ్గట్లు ‘తగినన్ని స్థానాలుగాని అవకాశాలుగాని’ లేవనీ తెలియజేస్తూ, ‘అవి కూడా మున్ముందు లభించవచ్చును’ అని ఆశించింది.
‘స్త్రీలు`నర్సింగ్‌’ అనే వ్యాసంలో (15.4.1956, పు. 21`26) డాక్టర్‌ కొండా శకుంతలాదేవి నర్సింగ్‌ వృత్తి ప్రాశస్త్యాన్ని వేనోళ్ళ కొనియాడి, స్త్రీలు ఈ వృత్తిలో ప్రవేశించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. ‘సంసార స్త్రీలు, అవివాహిత స్త్రీలు కూడా ఈ వృత్తిని స్వీకరించి (ఫ్లారెన్స్‌) నైటింగేల్‌ లాగనే అపారకీర్తిని సంపాదించుకోవచ్చు. కీర్తికన్నా కూడా సార్థకతను, చిత్తశాంతిని కలిగించే ఈ సేవారంగంలో
ఉన్న తృప్తి గమనించతగినది’ అని స్త్రీలను నర్సింగ్‌వైపు ప్రోత్సహించింది.
‘వరకట్నాలు`మధ్య తరగతి కుటుంబాలు’ అనే వ్యాసంలో (15.7.1956, పు. 4`9) నందగిరి ఇందిరాదేవి నాడు పెచ్చరిల్లుతున్న వరకట్న సమస్యను సుదీర్ఘంగా చర్చించింది. ఈ వ్యాసం ‘కోడెకు ఎంత ధర వొచ్చింది అత్తయ్యా?’ అనీ, ‘నిజంగా వరుల కనిష్ట ధర మెట్రికులేటుకు రెండు వేలు, రేడియోలో చెప్పినట్టు గరిష్ఠ ధర మూడు వేలు. బజార్లో ప్రకటించడమే బాకీగానీ దీ.A., (బి.ఏ.,) వీ.A., (యం.ఏ.,)ల రేట్లు రోజురోజుకూ వేల జాబితాలలో పెరిగిపోతున్నాయి. ఇట్లు కట్నమేగాక ఆడబడుచుల లాంఛనాలు, అప్పగింతలు, వెండి చెంబులు, పట్టు బట్టలు మగపెళ్ళివారికి సమర్పించుకోవటంతో పాటు పెళ్ళి ఖర్చు కూడా వేలు దాటుతుంది` ఆడపిల్లల తండ్రులకు’ అనీ మొదలౌతుంది. ముఖ్యంగా ఎక్కువ మంది ఆడపిల్లలున్న మధ్యతరగతి వారిని వరకట్న దురాచారం ఎంత తీవ్రంగా పీల్చిపిప్పి చేసేదో ఈ వ్యాసం కళ్ళకు కట్టినట్లు వివరించింది. ‘మధ్యతరగతి కుటుంబాలవాళ్ళు ఈ దోపిడి భరించటం కష్టమయిపోతున్నది’ అని వాపోయింది. ‘కొన్నిసార్లు కొడుకుల భవిష్యత్తు కూడా గమనించక నలుగురు ఆడపిల్లలున్న తండ్రి నాలుగేసి వేలు గుమ్మరించి దివాలా తీసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తమకు చదువులు, సంగీతాలు చెప్పించిన ఖర్చుతోబాటు కట్నాలు కూడా ఇవ్వవలసి వచ్చిన తండ్రి కష్టాలను (చూసి) భరించలేక ఎంతోమంది ఆడపిల్లలలు ఆత్మహత్యలకు గురికావటం కూడా కొత్తకాదు’ అని నిజాన్ని నిష్ఠూరంగా వెల్లడిరచింది. యువకులు యువతుల్ని కాకుండా ‘డబ్బునే పెళ్ళాడటం నిజంగా శోచనీయం’ అనీ, ఇస్తానన్న కట్నంలో ఏకొంచెం తక్కువైనా సిగ్గులేకుండా పెళ్ళి పీటల మీదనుంచి లేచిపోతున్నారనీ, లాంఛనాలు సరిగా జరపకపోతే యేడాది తిరిగేలోపే యింకో పెళ్ళికి సిద్ధమౌతున్నారనీ వాపోయింది. వరకట్న సమస్య సమసిపోవాలంటే కేవలం శాసనం ద్వారా నిషేధించడమో లేక సామాజిక ఉద్యమకారులు దానికి వ్యతిరేకంగా కృషి చేయడమో సరిపోవనీ, నిజంగా దాన్ని ఎదుర్కోవాలంటే మొదట స్త్రీకి ఉన్నత విద్య చెప్పించడంతోపాటు తనకు నచ్చిన వరున్ని ఎన్నుకొనే స్వేచ్ఛనివ్వాలని పరిష్కార మార్గాన్ని సూచించింది. ‘వరనిర్ణయ స్వేచ్ఛ’వల్ల అవినీతి ప్రబలిపోతుందనిగానీ, ఃషతీశీఅస్త్ర ంవశ్రీవష్‌ఱశీఅః (రాంగ్‌ సెలెక్షన్‌) జరుగుతుందని గానీ భావించడం కేవలం ‘అనుభవం లేని భయాలు’ మాత్రమే అని తేల్చిచెప్పింది. వరకట్న సమస్యను ఎదుర్కొనడానికి ‘ధైర్యసాహసాల’తో ముందుకు వెళ్ళాలనీ, ‘భయపడుతూ ఒడ్డున కూర్చుంటే ఈత ఎన్నటికీ రాదు. దూకాలి మరి!’ అనీ వెన్నుతట్టి ప్రోత్సహించింది.
‘సమాన ప్రాతినిథ్యం’ అనే వ్యాసంలో (15.8.1956, పు. 52`54) ఎస్‌. రాజ్యలక్ష్మి మహిళా దృక్పథాన్ని చాలా బలంగా ప్రతిపాదించింది. 1947 ఆగష్టు 15న వచ్చింది కేవలం రాజకీయ స్వాతంత్య్రమేననీ, ఓటు వేయడానికి మినహా ఈ స్వాతంత్య్రం అర్థం లేనిదనీ, ‘ఇక స్త్రీల స్థితి చూస్తే స్వాతంత్య్రం యొక్క అర్థం సన్నగిల్లిపోతుంది’ అనీ, ‘ఏ విషయంలో చూచినా వీరి పురోభివృద్ధికి ఎన్నో ఆటంకాలు కనబడతాయి’ అనీ బల్లగుద్ది చెప్పింది. పార్లమెంటులో హిందూ స్త్రీల వారసత్వపు హక్కుకు సంబంధించిన చర్చ కేవలం ‘సానుభూతి’ దృక్పథంతో జరిగిందనీ, అదే ‘పార్లమెంటు సభ్యులంతా స్త్రీలే అయితే . . . సానుభూతి కోసం యాచించకుండా ఒక సహజమైన హక్కుకోసం వారు చర్చించి ఉందురని నిస్సందేహంగా భావించవచ్చు’ అని స్పష్టం చేసింది. దీన్నిబట్టి చూస్తే పార్లమెంటులో చేసే నిర్ణయాలు కేవలం స్త్రీలే చేసినట్లైతే స్త్రీలకు సంబంధించిన విషయాల్లోనే కాకుండా మిగిలిన విషయాల్లో కూడా అవి పురుషపుంగవుల దృక్పథానికి తప్పకుండా భిన్నంగా ఉంటాయని సరిగ్గా వాదించింది. స్త్రీలు నిర్ణయాత్మక, విధాన నిర్మాణ స్థానాల్లో వుంటే ప్రపంచం ఎలా భిన్నంగా వుండగలదో తెలియజేయడానికి ఒక ఉదాహరణ యిచ్చింది. ‘అంతర్జాతీయ సమావేశాలన్నిటిలోనూ యుద్ధ విషయాలు కేవలం స్త్రీలే నిర్ణయించినట్లయితే శాంతి అవకాశాలు సహస్ర విధాల ఎక్కువవుతాయని నమ్మవచ్చును’ అని ప్రగాఢంగా ప్రకటించింది. అందుకే దేశ జనాభాలో స్త్రీలెంతమంది ఉన్నారో అదే నిష్పత్తిలో చట్టసభల్లో వారి ప్రాతినిథ్యం ఉండాలని వాంఛించింది. కానీ మనిషి రక్తం రుచి మరిగిన పులుల్లా ‘రాజకీయాధికారాలు మరిగిన పురు(గు)షులు’ ‘స్త్రీలు వెనుకబడి ఉన్నారు’, వారికి ‘ప్రాపంచికానుభవం తక్కువ’ మొదలైన ఆక్షేపణలు చేసి స్త్రీలకు సమాన ప్రాతినిథ్యం యివ్వనిరాకరిస్తారనీ, కానీ యిలాంటి వాదనల్లో ‘నైతికబలం’ లేదనీ, ఆంగ్ల వలసవాదులు కూడా స్వాతంత్య్రానికి పూర్వం యిలాంటి నీతిరాహిత్య వాదనలతోనే భారతీయులకు స్వాతంత్య్రం నిరాకరింపజూశారనీ తెలిపి మగానుభావులు వెలగబెట్టే నిర్వాకాన్ని నిర్భీతిగా బట్టబయలు చేసింది. అందుకే ‘శాసనసభలో కనీసం సగం స్థానాలు స్త్రీలకు ప్రత్యేకింపబడడం స్త్రీజాతికి కనీసం న్యాయం చేయడం అన్నమాట’ అని ఘంటాపథంగా ప్రకటించింది. కానీ ఈనాటికీ ఆమె ఆకాంక్ష నెరవేరకపోవడం పెను విషాదం. అంతా మగానుభావులు సాధించిన ఘనకార్యం!
అడవికొలను రుక్మిణి వ్యాసం ‘ఎందుకు? ఎవరికోసం?’ (నవంబరు 1956, పు. 37) పొద్దున నిద్రలేచినప్పటినుండీ రాత్రి నిద్రపోయేదాకా విశ్రాంతి అనేదే లేకుండా ఇంట్లో స్త్రీలు చేసే బండ చాకిరీ మీద చేసిన పదునైన విమర్శ. ఏదైనా చదువుకోవడానిక్కూడా తీరిక దొరకని జీవితంతో సతమతమయ్యే బి.ఏ. చదువుకొన్న గృహిణి ‘నిజమే, తనకి సుఖం, ఎదుటి మనిషికి ప్రయోజనం లేని తన డిగ్రీ యెవరికోసం? ఎందుకు?’ అని నిస్పృహ చెందుతుంది. నవంబరు 1956 సంచికలో ‘మహోజ్వల మహిళ అనీబిసెంట్‌’ అనే వ్యాసం ప్రచురితమైంది (పు. 16`17). ఇందులో అనీబిసెంట్‌ సాధించిన విజయాల్నీ, ఆమె కృషినీ కొనియాడారు. జ్ఞానకుమారి హెడా వ్యాసం ‘కాంగ్రెసు పార్టీలో మహిళలు’ (నవంబరు 1956, పు. 30`32) కాంగ్రెస్‌ సంస్థను పునరుద్ధరించడంలో స్త్రీలు పోషించాల్సిన పాత్రను వివరించింది. 15.5.1956 నాటి సంచికలో గౌతమబుద్ధుడి మీద ఒక వ్యాసం, బౌద్ధ మహిళల మీద యింకో వ్యాసం ప్రచురించబడ్డాయి. అదే సంచికలో మర్రి సావిత్రీదేవి ‘బమ్మెర పోతన’పై ఒక వ్యాసం ప్రచురించింది. 15.8.1956 నాటి సంచికలో రాజేశ్వరి ‘వీరవనిత’ శీర్షికతో రaాన్సీ రాణి అయిన లక్ష్మీబాయిపై ఒక వ్యాసం ప్రచురించింది.
వనితలో చాలా కథలు ప్రచురించబడ్డాయి. సంపాదకురాలైన అబ్బూరి ఛాయాదేవి ‘గోదావరి’ అనే పెద్ద కథను రాసింది. ఈ కథ 1956 జులై నుండి డిసెంబరు వరకు ధారావాహికగా వెలువడిరది. సత్యవతి అనే అనాథ స్త్రీ బాధాతప్త జీవితం యిందులో వర్ణించబడిరది. సత్యవతికి గ్రుడ్డివాడైన తమ్ముడుంటాడు. అతన్ని కన్నాక తల్లి చనిపోతుంది. పెళ్ళయ్యాక సత్యవతికి ఒక కొడుకూ, ఒక కూతురూ కలుగుతారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసుకోబోయిన భర్త చనిపోగా సత్యవతి అనాథ అవుతుంది. భర్త తరపు బంధువులెవరూ ఆమెను ఆదుకోవడానికి ముందుకు రారు. గత్యంతరం లేక తన పిల్లల్ని ఒక అనాథశరణాలయంలో చేర్పిస్తే అక్కడి బావిలోపడి కొడుకు మరణిస్తాడు. అది చూసిన కూతురికి విపరీతమైన జ్వరం వస్తుంది. కొడుకు మరణవార్త ఆలస్యంగా తెలిసిన సత్యవతి కనీసం కూతుర్నైనా చూసి వెల్దామని వస్తుంది. కానీ విపరీతమైన జ్వరం కారణంగా ఆమె ఒళ్ళోనే కూతురు చనిపోతుంది. తన దీనగాథని ఒక రైలు ప్రయాణంలో సత్యవతి కథకురాలితో చెప్పగా, ఆమె జాలిపడి తనతో రమ్మని తన ఇంటికి ఆహ్వానిస్తుంది. చదువుకొని తర్వాత ఏదైనా
ఉద్యోగం చేసుకోవచ్చని ధైర్యాన్నిస్తుంది.
కథలో భాగంగా కథకురాలు స్త్రీలకు సంబంధించిన అనేక విషయాలను చర్చించింది. బి.ఏ. పాసైన కథకురాలు ఉద్యోగం చెయ్యకుండా ఇంట్లోనే ఎందుకుందని ప్రశ్నించిన సత్యవతితో ‘అబ్బే, ఆయనకిష్టం లేక కాదు. ఆ మాటకొస్తే అసలు వివాహానంతరం నేను ఉద్యోగంలో చేరడానికి అభ్యంతరం చెప్పరన్న వాగ్దానం తీసుకున్న మీదటే వివాహానికి సమ్మతించాను. ఆ రోజుల్లో నా అభిప్రాయాలే వేరు! భర్త భార్యను లోకువగా చూడటానికీ, ఆమెపైన అధికారం చెలాయించడానికీ, ఆమె అశక్తతకూ మూలకారణం ఆర్థికంగా ఆమె పరాధీన కావటమేననుకునేదాన్ని. అంచేత ఆడది కూడా విద్యాభ్యాసం చేసి ఉద్యోగంలో చేరి ధనాన్ని ఆర్జించినట్లయితే ఆమె ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోగలుగుతుంది. భార్యాభర్తలు తరతమభేదాలు లేకుండా సమాన స్థాయిలో ఉండగలుగుతారు అనుకునేదాన్ని. అసలు వివాహమే చేసుకోకూడదు అనుకునేదాన్ని కొన్నాళ్ళు’ అని కాలేజీలో చదువుకొనే రోజుల్లో తనకుండిన అభిప్రాయాలను తెల్పుతుంది. కథలో భార్యల్ని అనుమానించే భర్తల్ని తీవ్రస్వరంతో నిరసించిన కథకురాలు అలాంటి మగాళ్ళ నోట్లో గడ్డి పెట్టాలంది. (గొడ్లు కదా, గడ్డిపెట్టడమే సరైంది!). ఈ విధంగా కథాంతర్భాగంగా సమాజంలో స్త్రీలెదుర్కొంటూండిన అనేక సమస్యల్ని చర్చకు పెట్టింది అబ్బూరి ఛాయాదేవి. ప్రఖ్యాతిగాంచిన ఆస్ట్రియన్‌ రచయిత స్టీఫాన్‌ జ్విగ్‌ కథ ఆధారంగా అబ్బూరి ఛాయాదేవి ‘అశ్విని’ అనే కథను కూడా రాసింది. అది 1956 ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు ధారావాహికగా వెలువడిరది.
రెండు సంచికల్లో ప్రచురితమైన రుక్మిణీ గోపాల్‌ కథ ‘ఆదర్శమా, అభ్యుదయమా?’ (15.8.1956, పు. 6`14 మరియు 15.9.1956, పు. 5`14) ఆదర్శవాది అయిన బ్రాహ్మణ పురుషుడికీ, వంచితురాలైన దళిత స్త్రీకీ పెళ్ళి జరగడానికి సంబంధించిన కథ. బి.ఏ. రెండవ సంవత్సరం చదువుతున్న కథానాయకుడు సుందరం ఆదర్శభావాలు కలిగి ఉండి ఎల్లప్పుడూ ఏదో ఒక గొప్ప పని చేయాలనే అశాంతితో ఉంటాడు. చదువు వంటబట్టని అతని అన్న అయిన వెంకట్రావు ఇంట్లోనే ఉండి పొలం పనులు చూసుకుంటుంటాడు. వారిది బాగా కలిగిన కుటుంబం. వాళ్ళ తండ్రికి పేరాశ. పెద్దమొత్తంలో కట్నం ఆశించి ఎన్ని సంబంధాలొచ్చినా పెద్ద కొడుకు పెళ్లి దాటవేస్తుంటాడు. ‘డబ్బుతోపాటు చదువుకూడా ఉన్నందుకు’ చిన్న కొడుకైన సుందరాన్ని ‘పెద్ద ధరకు’ అమ్మాలని ఉంటాడు.
దుర్మార్గుడైన వెంకట్రావు తమ పొలంలో పనిచేసే దళితుడైన నూకాలు కూతురైన లక్ష్మిని మోసగించి గర్భవతిని చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తమ్ముడు సుందరం అన్నతో లక్ష్మిని పెళ్ళి చేసుకొని చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోమంటాడు. ‘స్వచ్ఛమైన బ్రాహ్మణ వంశంలో పుట్టి మాలపిల్లని చేసుకోమంటావా? నాన్నకీ విషయం తెలిస్తే ఇంకేమన్నా ఉందా?’ అన్న వెంకట్రావు తండ్రి చూసిన యింకో సంబంధం చేసుకోవడానికి సిద్ధమౌతాడు. ఈ విషయం తెలిసిన లక్ష్మి మ్రాన్పడిపోతుంది. ‘సెడిపోయినదాన్ని, పెళ్ళికాకుండా కడుపు తెచ్చుకున్నాను. నన్నెవరు సేసుకుందుకు ఇష్టపడతారు. నన్నెవరుద్ధరిస్తారు’ అని సుందరం ముందు వాపోతుంది. ఆమె దయనీయమైన పరిస్థితిని గమనించిన సుందరం తనే ఆమెను పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడి, తన వల్లనే లక్ష్మి గర్భవతి అయిందనీ, తను లక్ష్మిని పెండ్లాడతాననీ ఇంట్లో చెబుతాడు. ఇది విన్న అతని తండ్రి రామయ్య ‘ఇన్ని వేలు ఖర్చు చేసి చదువు చెప్పించినందుకిదా ఫలితం. గొప్ప ఉద్యోగం దొరుకుతుందని, పేరు ప్రతిష్టలు తెస్తావని నేను చదువు చెప్పిస్తే చివరకు నువ్వు చదివింది ఈ మాల చదువా?’ అని అగ్నిహోత్రావధానుల్లా రంకెలేస్తాడు. సుందరం మేనమామ అయిన సోమనాథం ‘ఒక మాలపిల్ల కోసం కులం పోగొట్టుకుంటావా?’ అని ఈసడిస్తాడు. కులాహంకారంతో ఇంటిల్లిపాదీ లక్ష్మిని పలురకాలుగా దూషిస్తుంటే భరించలేకపోయిన సుందరం ‘ఒక స్త్రీకి అన్యాయం చేసి వదిలెయ్యమంటారా? ధర్మశాస్త్రాలు ఇలాగే చెబుతున్నాయా?’ అని ఎదురు ప్రశ్న వేస్తాడు. ఎంత చెప్పినా సుందరం వినకపోయేసరికి చిర్రెత్తుకొచ్చిన తండ్రి ఇంట్లోంచి వెళ్ళిపొమ్మంటాడుÑ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కదని బెదిరిస్తాడు. అయినా ఖాతరు చెయ్యని సుందరం తన ఆదర్శం కోసం, అభ్యుదయం కోసం ముందడుగు వేసి ఇంట్లోంచి బయటకు వస్తాడు.
‘పట్టుదల’ భార్యల ఆకాంక్షల్ని భర్తలు ఎలా త్రుంచివేస్తారో తెలిపే కథ (డిసెంబరు 1956, పు. 16`17Ê20). రచయిత్రి శిరుగూరి రత్నమ్మ. ఇందులో రామారావు, రాధలు భార్యాభర్తలు. స్కూలు ఫైనలు పాసైన రాధ పెండ్లి అయిన తర్వాత డిగ్రీ సాధించాలని భావించినా, కనీసం ఎఫ్‌.ఏ. చదువుకొనేందుకు కూడా (యం.సి.పి. అయిన) భర్త అంగీకరించడు. ఆమె ‘వూరిలో ఉన్న సంస్థలన్నిటిలోనూ మెంబరవ్వాలనీ వీలయితే సెక్రటరీదాకా కావాలనీ అనుకుంటూండేది. భర్తకు ఇవేమీ ఇష్టంలేదు. స్త్రీ పురుషునికి ఆనందాన్నిచ్చే యంత్రసాధనమని అతని
ఉద్దేశము. తాను పంజరములో చిలకలాగు బంధింపబడ్డానే అని రాధ అస్తమానం అసంతృప్తితో బాధపడుతోండేది.’ ఒక రోజు వీధి చివరనున్న హైమావతమ్మగారు కొత్తగా మహిళా సంఘం యేర్పాటు చేశామని తెలియజేసి అక్కడికి రమ్మని రాధను ఆహ్వానిస్తుందిÑ రాధ వస్తానని వాగ్దానం చేస్తుంది. మహిళా సంఘంలో మెంబరుగా చేరుతానని రాధ భర్తని అడిగితే అతను ఆమె అభ్యర్థనను తిరస్కరిస్తాడు. హైమావతమ్మతో వస్తానని చెప్పాను, కనీసం ఈ ఒక్కరోజైనా మహిళా సంఘానికి వెళ్ళిరావడానికి అనుమతి యివ్వమని అడిగిన భార్యతో ‘అదేం వల్లకాదు. ఆడది తిరిగి చెడిరది, మగవాడు తిరక్క చెడాడు అంటారు పెద్దలు … హాయిగా నీ యింట్లో నీ యిష్టమొచ్చినట్లుండు. నిన్నెవరూ అనేవారు లేరు. ఇల్లు దాటి వెళ్ళడానికి ఎంత మాత్రం వల్లకాదు’ అని కట్టడి చేస్తాడు భర్త. స్త్రీల జీవితంలో అడుగడుగునా లక్ష్మణరేఖలే, అప్పుడూ, ఇప్పుడూ!
ఉన్నవ విజయలక్ష్మి కథ ‘వక్రరేఖ’ సెప్టెంబరు 1956 సంచికలో ప్రచురితమైంది (పు. 24`33). పదేళ్ళ వయసులో తల్లిని పోగొట్టుకున్న శాంతమ్మను ముగ్గురు తమ్ముళ్ళతో కలిపి చాలా గారబంగా పెంచుతాడు తండ్రి. పద్దెనిమిది సంవత్సరాల వయసులో పెళ్ళైన శాంతమ్మకు త్వరలోనే భర్త చనిపోగా విధవగా మిగిలిపోతుంది. తమ్ముళ్ళ సహాయంతో చదువుకొని మెట్రిక్యులేషన్‌ పరీక్షా, సంగీతంలో హైయర్‌ గ్రేడ్‌ పరీక్షా పాసవుతుంది. పొరుగింటాయనతో పరిచయం కాస్తా అతి చనువుకు దారితీసి శాంతమ్మ గర్భవతి అవుతుంది. బాధ్యతనుండి తప్పించుకోవడానికి ఆ పంది రెండు నెలలు సెలవుపెట్టి పుట్టింటికెళ్ళిన భార్య దగ్గరికి పోతుంది. కుంగిపోయిన శాంతమ్మ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని మద్రాసు చేరి సముద్రంలో పడుతుంది. వంచితులైన స్త్రీలకోసం శరణాలయాన్ని నడిపే ఒక ‘‘నాన్నగారు’’ ఆమెను కాపాడతాడు. ఆ శరణాలయంలోనే ఆమె కొడుకుని కంటుంది. ఆ పసికందుని తనకప్పగించి కావాలంటే మళ్లీ పెళ్లి చేసుకోమని సలహా యిస్తాడు ‘‘నాన్నగారు’’. కానీ శాంతమ్మ పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోకుండా ఏదైనా ఉద్యోగం యిప్పించమనీ, కొడుకుని తనే పెంచుకుంటాననీ చెప్పడంతో అతడు టీచరు ఉద్యోగం యిప్పిస్తాడు. వంచితులైన స్త్రీలకు ఆత్మహత్యే శరణ్యం కాదనీ, స్త్రీలు చదువుకొని ఉంటే క్లిష్టసమయాల్లో వారిని ఆదుకొంటుందనీ చాలా బలంగా చెప్పింది రచయిత్రి.
యం. జానకీరాణి కథ ‘శోభించని క్షమాబుద్ధి’ (నవంబరు 1956, పు. 49`53) లో నారాయణరావు, సుభద్రలు భార్యాభర్తలు. ఒకనాడు సుభద్రకు విపరీతమైన జ్వరం వచ్చి నిద్రలో చంద్రం అనే అతన్ని గూర్చి కలవరిస్తుంది. పెళ్ళి కాకముందు ఆమెకు అతనితో సన్నిహిత సంబంధం ఉంటుంది. చంద్రం పేరును కలవరించగా విన్న ఆమె భర్త సహించలేకపోయి చంద్రం ఎవరని అడుగుతాడు. ఆమె వివరాలన్నీ చెబుతుంది. ఇది విన్న భర్త ఎలా స్పందిస్తాడో అని తీవ్రంగా భయపడ్తుంది. దీంతో ఆమె జ్వరం మరింత తీవ్రమౌతుంది. కానీ అతడు ‘క్షమించాను’ అంటాడు. దీంతో ఆమె షాక్‌కు గురౌతుంది. జ్వరం మరింత ఎక్కువై చనిపోతుంది.
నాయని కృష్ణకుమారి నాటిక ‘చెఱగని గుర్తులు’ (ఏప్రిల్‌ 1956, పు. 14`20) కనీసం ఒక్కటంటే ఒక్కసారన్నా భార్యని ప్రశంసించకుండా ‘అడుగడుక్కీ సూదుల్లాంటి మాటల్తో మనస్సు జల్లెడ’ చేసే ‘పేచీకోరు’ అయిన భర్తకూ, ‘భర్త దగ్గర నుండి మన్ననలు మూటగట్టుకుందామని’ భావించే అమాయకమైన భార్యకూ సంబంధించింది. ఇందులో శ్రీధర్‌, లక్ష్మి భార్యాభర్తలు. శ్రీధర్‌ తిండి దగ్గర బాగా నస పెట్టే రకం. కంచం దగ్గర్నుండీ చేసిన వంట వరకూ ప్రతిదానికీ వంకపెట్టేవాడు. భర్తకు బాగా యిష్టమని చెప్పి వంకాయ కూరా, పప్పుచారూ ఎంతో యిష్టంగా చేస్తుంది భార్య. కానీ నిత్యషంతోషి అయిన అతడు పెదవి విరుస్తాడు. దీంతో నిరాశ చెందిన భార్య ‘నువ్వొక్కడివి తప్ప ఈ ప్రపంచంలో అందరూ నన్ను మెచ్చుకొనేవాళ్ళే. చివరకు నా బ్రతుకు నీకు కాకుండా పోయింది’ అని వాపోతుంది. చివరకు తన తప్పు గ్రహించిన భర్త ‘కాదు, నేనే నిన్ను హింసిస్తున్నాను. నా అలవాట్లు నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి… నేనేం చేసినా నన్ను క్షమించు’ అంటాడు. దీంతో ఉదార హృదయురాలైన భార్య అతన్ని గుండెలకు హత్తుకుంటుంది.
ఎం. జానకీరాణి కథ ‘మనుష్యులు మంచివాళ్ళే ` కానీ . . .’ (డిసెంబరు 1956, పు. 37`39) లో కథకురాలు స్కూలు టీచరు. తన ఇంట్లో పనిచేసే కుర్రాడు రాముడు కూరగాయలు కొనడంలో అణా, బేడా దొంగలిస్తున్నాడేమో అని అనుమానిస్తుంటుంది. అయినా మనుష్యులంతా ప్రాథమికంగా మంచివాళ్ళేననే సిద్ధాంతానికి చెందిన ఆమె పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనుషులు తప్పు చేసినా క్షమించడం మానవధర్మం అనే నమ్మకం కలది. ఒక రోజు స్కూల్‌లో జరిగే ఫంక్షన్‌కు వెళ్తూ మెళ్ళోని బంగారు గొలుసు తీసి కర్ఛీఫ్‌లో చుట్టి టేబుల్‌పై పెట్టి వేరే నగ మెళ్ళో వేసుకొని స్కూలుకి వెళ్తుంది. తిరిగి వచ్చాక చూసుకుంటే టేబుల్‌పై పెట్టిన నగ కనిపించదు. ఇంటి నుండి బజారు దాకా ఎక్కడ వెతికినా ప్రయోజనం వుండదు. ‘స్కూలులో పడిపోయిందేమో… ప్యూనులకి దొరికినా యివ్వరు. ఈ నౌకరు వెధవలు అణా బేడల కోసమే లోభిస్తారు, నాలుగు సవరసుల గొలుసు చేదా?’ అనుకుంటుంది. మరుసటి రోజు రాముడు వచ్చి ఆ గొలుసు యిస్తాడు. ఇంటి బైట మెట్ల దగ్గర పడి ఉండిరదని చెబుతాడు. అప్పుడు ‘నా చెవులని నేను విశ్వసించలేకపోయాను. ఎఱ్ఱబారిన ఆ రాముడి కళ్ళు, శుష్కించిన ఆ వేళ్ళలోని నా ‘సొమ్ము’! ఏమిటిదంతా? నా విజ్ఞానం, నా సంస్కారం, నేను అన్నీ వంచించుకొని, సూక్ష్మీకరించుకుని, శూన్యత్వంలోకి పోతున్నట్టు అనిపించింది నాకు’ అంటుంది కథకురాలు. అయిదు రూపాయల నోటు యివ్వబోతుంది రాముడికి. కానీ ఆ అబ్బాయి అంత డబ్బు నాకు వద్దు. పండక్కి టపాకాయలు యిప్పించండిÑ నా తమ్ముళ్లూ, చెల్లెల్లూ కాల్చుకుంటారు అంటాడు. దీంతో ‘కూరలు, వెచ్చాలు, అణాలు కాజేయడాలు, నా అపోహలు అన్నీ గిర్రున నా ముందు తిరిగాయి’ అని తన తప్పుడు ఆలోచనల పట్ల అపరాధ భావానికి గురౌతుంది. మానవ మనస్తత్వంలోని వర్గాహంకార స్వభావాన్ని రచయిత్రి బాగా విడమర్చి చెప్పింది.
‘రెండు నాలుకలు’ అనే ‘వాక్చిత్రం’లో (15.9.1956, పు. 34`36) రచయిత్రి రాజేశ్వరి స్త్రీల ఆర్థిక పరాధీనతనూ, ఒక తరానికి చెందిన స్త్రీలకూ, ఇంకొక తరానికి చెందిన స్త్రీలకూ మధ్య అంతరాన్నీ, ఒక తరంలో స్త్రీలు కోరుకున్నవి (ఉదా: ఆర్థిక స్వాతంత్య్రం) మరొక తరం వారికి దొరికేటప్పటికి భరించలేకపోవడాన్నీ చక్కటి వ్యంగ్యంతో తెలియజేసింది. కలెక్టరు భార్య అయినప్పటికీ ‘కరివేపాకు వీధిలోకి అమ్మొస్తే కొందాఁవంటే కానీ ఉండ’ని పరిస్థితిలో ఉన్న అత్తగారు ‘ఆడదాన్ని అర్థానికి ఆమడ దూరంలో ఉంచాలన్న సిద్ధాంతం ఏమిటి?’ అని బాధపడ్తుంది. తన చేత్తో కాణి కూడా భార్య చేతికివ్వని తన ఆడబిడ్డ భర్త గూర్చి తలచుకుంటుంది. అయినా ఆమె ఆడబిడ్డ గడుసైంది కాబట్టి ‘ఆయన జేబులో డబ్బులు తీసుకొని వాడుకొంటుందిట.’ కానీ తాను అలా ఎప్పుడూ చేయలేదనీ, ‘అసలాయన డబ్బు ఎక్కడ దాచుకుంటారో కూడా నాకింతవరకు తెలియదు’ అనీ వాపోతుంది. అయినా ఆయనకు చెప్పకుండా ఖర్చుపెడితే ఊరుకోడనీ, చంపేస్తాడనీ భయపడ్తుంది. కానీ తన కొడుకు తరం వచ్చేసరికి అతడు జీతం మొత్తం తెచ్చి భార్యకిచ్చేసే రకం. తన ఖర్చులకోసం కూడా భార్యనడుగుతాడు. అత్తగారిలా కాకుండా కోడలు తన భర్తను డబ్బులు ‘ఎందుకండీ’ అని ప్రశ్నించగలదు. అంతేకాకుండా, అతను ఎక్కడికైనా వెళ్తుంటే ‘ఎక్కడికెళ్తున్నారు? ఎందుకెళ్తున్నారు?’ అని కూడా ఆరా తీయగలదు. ఇవన్నీ గమనిస్తున్న అత్తగారికి ‘ఆయనకీ, అబ్బాయికీ పోలీకే’ లేదనీ, అబ్బాయి ‘పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోవడం పోయి దానిముందు (బొత్తిగా) పిల్లి అయిపోతున్నాడేఁవిటి?’ అనిపిస్తుంది. అంటే తన కోడలు కూడా తనలాగే ఉండాలనీ, తన కొడుకు కూడా తన భర్తలా ఉండాలనీ భావిస్తుంది. కానీ ఒకప్పుడు తాను ఆర్థిక స్వాతంత్య్రం కోసం వగచిన విషయాన్ని మాత్రం పూర్తిగా మరచిపోయి ‘రెండు నాలుకల్ని’ కనబరుస్తుంది. ఒక తరం స్త్రీలు తమకు లభించని వెసులుబాట్లు తమ తర్వాతి తరం వారికి దొరికితే భరించలేకపోతున్న సామాజిక వాస్తవాన్ని రచయిత్రి చక్కగా చిత్రించింది. ఇలాంటి రచనలు ఆ కాలంలో చాలా ఎక్కువగా వచ్చాయి.
వనితలో ‘ఆరోగ్య వేదిక’, ‘వనితావనము’, ‘శిశువిహారం’ మొదలైన కాలమ్స్‌ ఉండేవి. ‘ఆరోగ్య వేదిక’ కాలమ్‌ కింద నిర్వహించిన ‘సౌందర్యపోషణ’ శీర్షిక ద్వారా డాక్టర్‌ కొండా శంకుతలాదేవి స్త్రీల సౌందర్యాన్ని ఇనుమడిరపజేయడంలోనే కాకుండా ఆరోగ్యాభివృద్ధిలో కూడా శారీరక వ్యాయామం పోషించే బృహత్తర పాత్రను కూలంకశంగా వివరించింది. ‘మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొనలేకపోవడం అంటే మన మృత్యువును మనం కోరి పిలుచుకోవడమే’ అని ఖరాకండిగా ప్రకటించిన శకుంతలాదేవి భారతదేశ స్త్రీల సగటు జీవన ప్రమాణం తక్కువగా ఉండడానికీ (పాతిక సంవత్సరాలు), పాశ్చాత్య స్త్రీల జీవన ప్రమాణం ఎక్కువగా ఉండడానికీ కారణం వివిధ రకాల వ్యాయామాలు చేయడానికి పాశ్చాత్య స్త్రీలకుండే స్వేచ్ఛేనని తేల్చిచెప్పింది. ‘మనదేశంలో (మాత్రం) స్త్రీలు బాల్యవివాహమనే రాక్షసికి బలిjైు (చాలా తొందరగా) సంసారమనే అంధకారంలో పడి, స్వేచ్ఛారహితులయి, చీకటి జైళ్ళకంటే అన్యాయమైన వంటశాలల్లో మ్రగ్గడమే యింత శీఘ్రంగా మృత్యువుకి గురికావడానికి కారణం’ అని చక్కగా విశ్లేషించింది. గర్భిణీ స్త్రీలు యింటినుండి బయటికి కదలకూడదనడం వట్టి ‘అపోహ’ మాత్రమే అని తేల్చిచెప్పింది. వాళ్ళు ‘సామాన్యంగా యింట్లో చేసుకొనే పనులు చేస్తూనే వుండాలి’ అని అర్థవంతమైన సలహా యిచ్చింది. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనీ, ‘సౌందర్య పోషణకు (సైతం) ఆరోగ్యం అవసరం’ అనీ, ‘ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అత్యవసరం’ అనీ ఘంటాపథంగా చెప్పింది. ‘డాక్టరుగారితో’ శీర్షికన సంభాషణ రూపంలో చేసిన రచనలో (15.6.1956, పు. 43`48) గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసింది. వారు కట్టుకునే బట్టలు, తినే ఆహారం, వ్యాయామం, మూత్రం, విరేచనం, విశ్రాంతి, రక్తం, స్తనాలు, ఇతర జబ్బులు, మానసిక ఆరోగ్యం, సంభోగం, ప్రయాణం, గాలి మొదలైన భాగాలుగా విభజించి చేసిన ఈ రచనలో గర్భిణీ స్త్రీలు విధిగా పాటించాల్సిన వివిధ నియమాలను సులభంగా అర్థమయ్యేలా వివరించింది. 15.8.1956 నాటి సంచికలో ‘ఆహారం తీసుకోవడం ఎందుకు’ అనే వ్యాసం రాసింది (పు. 15`20). ఈ విధంగా వనిత స్త్రీల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ చూపించింది.
‘వనితా వనము’ అనే కాలమ్‌ క్రింద లక్ష్మీభాగ్యనగర్‌ తోటపని గూర్చీ (15.5.1956, పు. 51`53), జాజిపువ్వుల్లోని రకాలను గూర్చీ (15.5.1956, పు. 51`53) తెలియజేసింది. ‘శిశువిహారం’ అనే కాలమ్‌ క్రింద ప్రచురితమైన ‘పిల్లలు`చదువులు’ అనే సంక్షిప్త వ్యాసంలో (15.6.1956) ఛాయ (బహుశా అబ్బూరి ఛాయాదేవి) పిల్లలకు విద్య నేర్పించాల్సిన పద్ధతిని వివరించింది. ‘విద్యావిధానం పిల్లలకు శిక్షణనివ్వాలేగాని శిక్ష కాకూడదు’ అని నిక్కచ్చిగా ప్రకటించిన ఛాయ విద్య పిల్లల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీసే విధంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కివక్కాణించింది. ‘పిల్లలు`పత్రికలు’ అనే చిరువ్యాసంలో (15.6.1956) అబ్బూరి ఛాయా జానకి (ఛాయాదేవి) బాలల పత్రికల అవసరాన్ని విశదపరచింది. ‘బాలలచేతనే కథలూ వ్యాసాలూ పద్యాలూ వ్రాయించినట్లయితే వారికి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మహాకవులనబడే వారు పెద్దల మెప్పుకోసం రాయకుండా, భావిభారత పౌరులు అయిన బాలలను దృష్టిలో ఉంచుకొని రాయాలి. బాలల భావాలు సంకుచితం కాకుండా విశాలంగా ఉండేటట్లు బాలలను దృష్టిలో పెట్టుకొనే వారి రచనలు సాగించాలి. ఇందుకు పత్రికలు, ప్రభుత్వము, సంఘమూ కూడా ప్రోత్సహించాలి’ అని కోరింది. ఎంతో దూరదృష్టితో చేసిన అమూల్యమైన సూచన యిది. కానీ, ఈ విషయంలో తెలుగువారిది యిప్పటికీ మందగమనమే! ‘మంచి పుస్తకం’ లాంటివి ఒకింత ఓదార్పు.
బ్రిటిష్‌ పాలనా కాలంలో తెలుగు మహిళా మేధావులూ, మహిళోద్యమకారులూ ప్రారంభించిన అక్షరోద్యమాన్ని స్వాతంత్య్రానంతరం కొనసాగించడానికి వనిత గట్టిగా ప్రయత్నించింది. కానీ, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆశించినట్లుగా ‘నాలుక్కాలాలపాటు నిలచి’ ఆంధ్ర మహిళాలోకంలో మరిన్ని వెలుగుల్ని విరజిమ్మకుండానే ప్రారంభమైన సంవత్సరానికే వనిత తన ప్రయాణాన్ని విరమించడం తెలుగువారి దురదృష్టం. మహిళోద్యమానికి వాటిల్లిన తీరని నష్టం.
కృతజ్ఞతలు: 2012 జనవరి 15న అబ్బూరి ఛాయాదేవిగారిని బాగ్‌లింగంపల్లిలోని వారి యింట్లో కలిశాను. చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నాను. వనిత కాపీలను చూపించడంతోపాటు ఫొటోకాపీ చేసుకోవడానికి దయతో అంగీకరించారు. వనిత పత్రిక ఎలా ప్రారంభించారో చెప్పడంతోపాటు, 1950ల నాటి మహిళోద్యమానికి సంబంధించిన అనేక విషయాలను చర్చించారు. వనిత కాపీలను తానే చందాదారులకు పోస్ట్‌ చేసేవారని చెప్పారు. అంతేకాకుండా, ఆమె జె.యన్‌.యు.లో వున్నప్పటి పరిస్థితుల్నీ వివరించారు. తనవీ, తన భర్తవీ కొన్ని పుస్తకాలను ఆదరంతో బహూకరించారు. కీ.శే. అబ్బూరి ఛాయాదేవిగారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.