నదులలోని మత్స్యసంపద తగ్గిపోవడంతో, సుందరవనాలలోని మత్స్యకారులు నిరంతర పులుల భయంతోనే మడ అడవుల లోలోపలికి వెళ్ళవలసి వస్తోంది. ‘‘నా భయాన్ని ఏమని చెప్పేది? భీతితో నా గుండె దడదడలాడుతుంటుంది. ఎప్పుడెప్పుడు తిరిగి వెల్లడి ప్రదేశానికి వెళ్ళగలనా అనేదానిమీదే నా ఆలోచనలన్నీ
తిరుగుతుంటాయి’’ అంటారు 41 ఏళ్ళ పీతలను వేటాడే జాలరి మహిళ పరుల్ హల్దార్. సుందరవనాలలోని దట్టమైన మడ అడవులలోకి పీతలను పట్టుకోవడానికి వెళ్ళినపుడు తనకు కలిగే భయాలను గురించి ఆమె ఇక్కడ వివరిస్తున్నారు. పీతల వేట జరిగే కాలంలో ఆమె మడ అడవులలోని ఏరుల్లోనూ, నీటి కయ్యాలలోనూ ఒక పడవను నడుపుకుంటూ, నక్కి ఉండే పులుల గురించి ఎంతో మెలకువతో ఉంటూ వెళ్తుంటారు.
లక్స్‌బాగన్ గ్రామంలో నివాసం ఉంటున్న పరుల్, తన చెక్క పడవను గరళ్ నదిలోకి నడిపిస్తూ, మరీచ్‌రaాపి అడవికి ఇవతలగా ఉన్న గజిబిజి అల్లికల కంచె వైపు చూపు సారించారు. దక్షిణ 24 పరగణాల జల్లా, గోసాబా బ్లాక్‌లోని ఆమె గ్రామానికి సమీపంలో ఉన్న ఈ అడవిలోనే పరుల్ భర్త ఇషార్ రణజిత్ హల్దార్‌ను ఏడేళ్ళ క్రితం పులి చంపేసింది. దహించే ఆ మండు వేసవి రోజున ఆమె, ఆమె తల్లి లొక్ఖి (లక్ష్మి), మండల్ (56) ప్రయాణించి వచ్చిన ఆ పడవ అంచులకు ఆమె తెడ్లను ఆనించి పెట్టింది. తన కూతురిలాగే లక్ష్మి కూడా ఒక జాలరి మహిళే. ఇషార్‌ను పెళ్ళి చేసుకునేటప్పటికి పరుల్ వయసు కేవలం 13 ఏళ్ళు. ఆమె అత్తవారి కుటుంబం పేద కుటుంబమే అయినప్పటికీ, వాళ్ళెప్పుడూ చేపలను, పీతలను పట్టడానికి అడవికి వెళ్ళినవారు కాదు. ‘‘నేనతనికి నచ్చచెప్పి ఈ అడవికి తీసుకువచ్చాను. పదిహేడేళ్ళ తర్వాత అడవిలోనే అతను చనిపోయాడు’’ ఆమె గుర్తు చేసుకున్నారు.
ఆ జ్ఞాపకాలతో పరుల్ నిశ్శబ్దంలోకి జారిపోయారు. తమ నలుగురు కుమార్తెల పెంపకాన్ని పరుల్‌కు వదిలేసి 45 ఏళ్ళ వయసులోనే ఇషార్ చనిపోయారు. పరుల్, లక్ష్మిలు చెమటలు కక్కుతూ తిరిగి బరువుగా ఉన్న తెడ్లను వేస్తున్నారు. ప్రస్తుతం చేపలు పట్టడాన్ని నిషేధించిన మడ అడవులకు సురక్షితమైన దూరంలో ఆ మహిళల్దిదరూ పడవను నడుపుతున్నారు. చేపలు వృద్ధి అయ్యే వీలు కల్పిస్తూ, మడ అడవుల్లో ఏప్రిల్ నుండి జూన్ వరకూ మూడు మాసాల పాటు చేపలు పట్టడాన్ని ఆపేశారు. చేపలను పట్టే కాలానికి విరామం పలికినపుడు, జీవనం గడవటం కోసం పరుల్ తన సొంత చెరువులోని చేపలనే అమ్ముతుంటారు.‘‘అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి’’ సుందరవనాలలో ఉన్న పులులు చేసే దాడుల గురించి చెప్తూ అన్నారు పరుల్. ప్రపంచంలో ఒక్క సుందరవనాల మడ అడవుల్లోనే పులులున్నాయి. ‘‘అడవుల్లోకి అనేకమంది జనం ప్రవేశించడంతోనే ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. అటవీ అధికారులు మమ్మల్ని అడవిలోకి రానివ్వకపోవడానికి ఉన్న కారణాలలో ఇది కూడా ఒకటి’’. సుందరవనాలలో పులుల దాడుల్లో మరణాలు సంభవించడం, ప్రత్యేకించి చేపలు పట్టే కాలంలో, అసాధారణమేమీ కాదు. సుందరవనాల టైగర్ రిజర్వ్ 2018 నుంచి 2023 జనవరి వరకూ పులుల దాడుల్లో మరణించిన వారి సంఖ్య 12 మాత్రమే అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, స్థానిక ప్రజలు చెప్తోన్న దాడుల సంఘటనలు చూస్తే మరణాల సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుందరవనాలలో 2022 నాటికి 100 పులులు నివసిస్తునాష్ట్ర్నయి. 2018లో వీటి సంఖ్య 88గా ఉండేది. పరుల్ తనకు ఇరవై మూడేళ్ళ వయసప్పటి నుంచీ చేపలు పడుతున్నారు. చేపలు పట్టడాన్ని ఆమె తన తల్లి నుంచి నేర్చుకున్నారు. లక్ష్మి ఏడేళ్ళ వయసులో ఉన్నప్పటినుంచీ తన తండ్రితో కలిసి అడవికి వెళ్తూ చేపలు పట్టడం నేర్చుకున్నారు. ఆమె భర్త సంతోష్ మండల్ (64) 2016లో పులితో పోరాటం చేసి కూడా సజీవంగా ఇంటికి తిరిగి రాగలిగారు.
‘‘ఆయన చేతిలో ఒక కత్తి ఉండటం వలన పులితో పోరాటం చేశాడు. కానీ ఆ సంఘటన తర్వాత ఆయన ధైర్యం దిగజారిపోవటంతో ఇక అడవికి వెళ్ళేందుకు ఒప్పుకోవడంలేదు’’ అన్నారు లక్ష్మి. ఆమె మాత్రం అడవికి వెళ్ళటం ఆపలేదు. భర్త అడవికి వెళ్ళడం మానేయడంతో ఆమె పరుల్‌తోనూ, అల్లుడు ఇషార్‌తోనూ కలిసి అడవిలోకి వెళ్ళటం మొదలు పెట్టారు. తర్వాత ఇషార్ పులి దాడిలో చనిపోయారు. ‘‘నాకు ఎవరితోనూ కలిసి అడవికి వెళ్ళే ధైర్యం లేదు. అలాగని పరుల్‌ను ఒంటరిగా వెళ్ళనివ్వలేను. నేను జీవించి ఉన్నంతవరకూ, ఆమెకు తోడుగా ఉంటాను’’ చెప్పారామె. ‘‘నీ సొంత రక్తం మాత్రమే నిన్ను అడవిలో రక్షించగలదు.’’ ఒకరితో ఒకరు మాట్లాడుకోనవసరం లేకుండానే ఆ ఇద్దరు మహిళలు సామరస్యంతో పడవను నడుపుతుంటారు. పీతల వేట చేసే కాలం మొదలవ్వగానే, అటవీ శాఖ నుంచి వారు అనుమతి పత్రాన్ని తీసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత అడవిలోకి వెళ్ళేందుకు ఒక పడవను అద్దెకు తీసుకోవాలి.
పడవ కోసం పరుల్ రోజుకు రూ.50 అద్దె చెల్లిస్తారు. మామూలుగా మరో మహిళ కూడా వారితో కలుస్తారు. ఆ ముగ్గురు మహిళలు అడవిలో 10 రోజులపాటు తప్పనిసరిగా ఉండాలి. ‘‘మేం తినటం నిద్రపోవడమంతా ఆ పడవపైనే. వంట కూడా అక్కడే చేసుకుంటాం. మేం మాతోపాటు బియ్యం, పప్పులు, డ్రమ్ములలో మంచినీళ్ళు, ఒక చిన్న స్టవ్ తీసుకువెళ్తాం. మేం ఎట్టి పరిస్థితులలోనూ, చివరకు మరుగుదొడ్డికి వెళ్ళేందుకు కూడా, మా పడవను విడిచిపెట్టి వెళ్ళరాదు’’, పెరిగిపోతున్న పులి దాడుల సంఘటనలే ఇందుకు ప్రధాన కారణమని పరుల్ చెప్పారు.
‘‘పులులిప్పుడు పడవల మీదకు కూడా ఎక్కి మనుషులను ఎత్తుకుపోతున్నాయి. నా భర్తపైన దాడి కూడా ఆయన పడవ మీద ఉండగానే జరిగింది.’’ చేపల వేట సాగించిన పదిరోజులూ, వర్షం వచ్చినా కూడా, ఈ మహిళలు ఆ పడవమీదే నివసిస్తారు. ‘‘పీతలు ఒక మూలన, మనుషులు ఒక మూలన, మూడో మూలన వంట చేసుకోవడం’’ అని లక్ష్మి వివరించారు. అడవులలోకి ఎక్కువగా వెళ్ళే తమ మగవారిలాగానే, చేపలు పట్టేందుకు వెళ్ళే మహిళలు కూడా పులుల దాడులకు గురవుతుంటారు. అయితే, మానవ`జంతు సంఘర్షణకు నిలయంగా పరిగణించే సుందరవనాలలో ఎంతమంది మహిళలు చంపబడ్డారో అంచనాలు లేవు.
‘‘నమోదైన మరణాలలో అత్యధికంగా పురుషులవే ఉన్నాయి. మహిళలు కూడా పులుల దాడికి గురయ్యారు కానీ వివరాలు సేకరించి లేవు. మహిళలు కూడా అడవులకు వెళ్తారు, కానీ పురుషులతో పోల్చితే తక్కువ సంఖ్యలో ఉంటారు’’ అని చిన్న తరహా చేపలవేట కార్మికుల జాతీయ వేదిక కన్వీనర్ ప్రదీప్ ఛటర్జీ చెప్పారు. అడవికి దగ్గరగా ఉండటం ఒక ముఖ్యమైన అంశం. అడవికి చాలా దూరంలో ఉన్న గ్రామాలకు చెందిన మహిళలు అడవులకు వెళ్ళరు. తోడుగా వెళ్ళేందుకు తగినంత మంది ఇతర మహిళలు కూడా ఉన్నప్పుడు మాత్రమే వారు కూడా అడవికి ప్రయాణం కడతారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 4,504 మంది జనాభా ఉన్న పరుల్, లక్ష్మిల స్వగ్రామమైన లక్స్‌బాగన్‌లో, దాదాపు 48 శాతం మంది మహిళలు ఉన్నారు. దాదాపు ప్రతి ఇంటినుండి, గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరీచ్‌రaాపి అడవికి వెళ్ళే మహిళలు ఉన్నారు.
ఇంత ప్రమాదకరమైన పని చేయడానికి ప్రధానమైన కారణం, పీతలు మంచి ధరలకు అమ్ముడుపోవడం. ‘‘చేపలమ్మితే నాకు డబ్బులు ఎక్కువగా రావు. పీతలే ప్రధానంగా డబ్బులు తెచ్చిపెడతాయి. అడవికి వెళ్ళిన రోజున నేను రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకూ సంపాదించగలను’’ అన్నారు పరుల్. పెద్ద పెద్ద పీతలు కిలో రూ.400`600 వరకూ ధర పలుకుతాయి. చిన్న పీతలు కిలో రూ.60`80. ఒక్కో ప్రయాణంలో ఈ ముగ్గురు మహిళలు కలిసి పట్టుకునే మత్స్య సంపద 20 నుంచి 40 కేజీల వరకూ ఉంటుంది.
పులలు వల్ల జరిగే ప్రమాదమే కాకుండా, సుందరవనాలలో పీతలు పట్టేవారు ఎదుర్కొనే పెద్ద సవాలు తరిగిపోతున్న పీతల సంఖ్య. ‘‘పీతలను పట్టుకోవటానికి చాలామంది జనం అడవికి వస్తున్నారు. ఇంతకుముందు పీతలు పుష్కలంగా ఉండేవి, ఇప్పుడు వాటిని కనిపెట్టడానికి మరింత కష్టపడాల్సి వస్తోంది’’ అని పరుల్ చెప్పారు. పీతల సంఖ్య తగ్గిపోవడంతో జాలరి మహిళలు అడవుల లోలోపలికి వెళ్ళవలసి వస్తోంది, దాంతో పులి దాడిచేసే ప్రమాదం కూడా పెరుగుతోంది. ఈ ప్రాంతంలో చేపలవేట చేసేవాళ్ళు కావలసినన్ని చేపలనూ, పీతలనూ పట్టుకోవడం కోసం మడ అడవుల లోలోపలికి చొచ్చుకుపోవడం వలన వాళ్ళు పులుల దాడులను ఎదుర్కోవలసి వస్తోందని ఛటర్జీ చెప్పారు. ‘‘అటవీ అధికారులు కేవలం పులుల సంరక్షణ మీదనే దృష్టి కేంద్రీకరిస్తారు. కానీ చేపలు ఉండకపోతే పులులు కూడా బతికి ఉండలేవు’’ అంటారు ఛటర్జీ. ‘‘మానవ`వన్యప్రాణుల మధ్య సంఘర్షణ నదులలో మత్స్య సంపద వృద్ధి చెందినప్పుడే తగ్గుముఖం పడుతుంది.’’ నది నుండి తిరిగి వచ్చాక, పరుల్ మధ్యాహ్నం భోజనం తయారుచేస్తారు. తన చెరువు నుంచి పట్టుకొచ్చిన చేపలను వండుతారు. అన్నం వండి, మామిడికాయ పచ్చడిలో పంచదార కలుపుతారు.
తనకు పీతలను తినడం ఇష్టముండదని ఆమె చెప్పారు. ఇంతలో ఆమె తల్లి లక్ష్మి కూడా సంభాషణలో జతకలిశారు. ‘‘నేను గానీ నా కూతురు గానీ పీతలను తినం’’ అన్నారామె. ఎందుకలా అని అడిగితే ఆమె వివరాలు చెప్పలేదు కానీ, తన అల్లుడు ఇషార్ మరణానికి సూచనగా ‘‘ప్రమాదాలు’’ అన్నారామె. పరుల్ నలుగురు కూతుళ్ళయిన పుష్పిత, పరొమిత, పాపియా, పాప్రీలలో ఎవరూ అడవిలో పనికి వెళ్ళరు. పుష్పిత, పాపియాలు పశ్చిమ బెంగాల్‌లోని ఇతర జిల్లాలో ఇళ్ళల్లో పనులు చేస్తుంటారు. పరొమిత బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. అందరికన్నా చిన్నదైన 13 ఏళ్ళ పాప్రీ లక్స్‌బగన్‌కు దగ్గర్లోనే ఉన్న ఒక హాస్టల్‌లో ఉంటోంది కానీ ఆమె అనారోగ్యంతో ఉంది. ‘‘పాప్రీకి టైఫాయిడ్, మలేరియా జ్వరాలు వచ్చాయి. ఆమె చికిత్స కోసం నేను రూ.13,000 ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇంకా ఆమె ఉండే హాస్టల్‌కు ప్రతినెలా రూ.2,000 రుసుము చెల్లిస్తాను’’ అని చెప్పారు పరుల్.
పరుల్‌కు కూడా ఆరోగ్యం సరిగా లేదు. ఆమెకు ఛాతీలో నొప్పిగా ఉండటంతో ఈ ఏడాది చేపలు పట్టడానికి గానీ, పీతల వేటకు గానీ వెళ్ళలేదు. ఇప్పుడామె తన కుమార్తె పరొమితా మిస్త్రీతో కలిసి బెంగళూరులో నివాసముంటున్నారు. ‘‘రూ.40,000 ఖరీదు చేసే ఎంఆర్‌ఐ స్కాన్‌లు చేయించుకోమని కోల్‌కతాలోని ఒక డాక్టర్ చెప్పాడు. నా దగ్గర అంత డబ్బు లేదు’’ అన్నారు పరుల్. ఆమె ఆ దక్షిణాది నగరానికి వెళ్ళి, అక్కడ ప్రైవేటు కంపెనీలలో పనిచేస్తున్న తన కూతురు, అల్లుడితో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. పరుల్ బెంగళూరులో కూడా ఒక డాక్టర్‌ను కలిశారు. ఆయన ఆమెకు ఆరు నెలల కోసం కొన్ని మందులు రాసి, విశ్రాంతి తీసుకొమ్మని చెప్పారు. ‘‘నేను నిరంతరం అనుభవించే భయం వల్ల, ముఖ్యంగా అడవికి వెళ్ళినపుడు నా ఛాతీలో నొప్పులు మొదలయ్యాయని నేను అనుకుంటున్నాను. నా భర్తను పులి చంపింది, మా నాన్నపై కూడా దాడి చేసింది. అదే నా ఛాతీలో నొప్పికి కారణమైంది’’ అని ఆమె చెప్పారు.
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/en/articles/hunting-for-crabs-in-the-shadow-of-the-bengal-tiger జూన్ 17, 2023 లో మొదట ప్రచురితమైనది.)