సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం లతా మంగేష్కర్‌ – కస్తూరి మురళీకృష్ణ

(గత సంచిక తరువాయి…)
సినిమా పాట వినేవారిలో అధిక సంఖ్యాకులకు సంగీతం తెలియదు. వారికి రాగాలు, తాళాలు తెలియవు. సినిమా పాట పాడటంలో కళాకారుడికి బోలెడన్ని పరిమితులుంటాయి. సినిమా పాట నిడివి మూడున్నర నిమిషాలు. ఈ మూడున్నర నిమిషాలలో కళాకారుడు, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు మూడు గంటల గానం ద్వారా కలిగించిన

ప్రభావాన్ని కలిగించాలి. అంతేకాదు, శాస్త్రీయ విద్వాంసుడు తన కోసం పాడుకుంటాడు. సినీ గాయకుడు సినిమాలో సందర్భాన్ని, సందర్భంలోని భావనను, ఆ భావనను తెరపై ప్రదర్శించే కళాకారుడిని దృష్టిలో ఉంచుకుని పాడాలి. అంటే, తాను వేరేవారిలా భావించుకుని, వీలైతే వేరేవారయిపోయి, ఆ వేరే వ్యక్తి భావనలను తాను అనుభవిస్తూ తన స్వరంలో పలికించాలి. అత్యంత క్లిష్టమైన ప్రక్రియ ఇది. పైగా, శాస్త్రీయ సంగీత విద్వాంసుడిలా శృతి చూసుకునేందుకు, రాగాలు తీసేందుకు సినీ గాయకుడికి సమయముండదు. మొదటి పదం చివరి పదం వరకూ గాయకుడు పాట మూడ్‌లో ఉండాలి. మొదటి పదం నుంచే భావాన్ని పలికించటం ఆరంభించాలి. ఇప్పటి భాషలో చెప్పాలంటే, శాస్త్రీయ సంగీతం పాడటం అయిదురోజుల క్రికెట్‌ మ్యాచ్‌ లాంటిదయితే, సినిమా పాట పాడటం 20`20 క్రికెట్‌ పోటీ లాంటిది. మొదటి బంతి నుంచి చివరి బంతి వరకూ బాదుతూనే ఉండాలి. ఒక్క బంతి వ్యర్థమైనా అంతా వ్యర్థం. ఇది అర్థమైన తర్వాత లతా మంగేష్కర్‌ వెనుతిరిగి చూడలేదు అంతేకాదు, సినిమా పాటలలోనే శాస్త్రీయ సంగీతాన్ని వెతుక్కుని సంతృప్తి పడే వీలు చిక్కింది. రోజూ సాధన చేయటం లేదన్న బాధ తీరింది.
‘‘రోజూ ఉదయం లేచి సాధన చేయటం ఆపినా, సినిమా పాటలు పాడటం ఒక రకమైన సాధన అని అర్థమయింది. రోజంతా వేర్వేరు కళాకారులు సృజించిన వేర్వేరు రాగాలు, వేర్వేరు భావాలు పలుకుతూ పాడటం కూడా ఒక రకమైన సాధనే’’. ఇది అర్థమయిన తర్వాత రోజూ సాధన చేయటం లేదన్న బాధ తగ్గిందని అంటుంది లత.
గులామ్‌ హైదర్‌ తర్వాత అనిల్‌ బిశ్వాస్‌ లత అనే వజ్రాన్ని సానపెట్టిన వ్యక్తి. మైకు ముందు నిలిచి ఊపిరి పీలుస్తున్నట్లు తెలియకుండా ఊపిరి పీల్చటం, పదాలను విరవటం, ఎక్కడ ఆగాలో, ఎక్కడ సాగాలో తెలియటం వంటివి అనిల్‌ బిశ్వాస్‌ నుంచి నేర్చుకున్నానంటుంది లత. గులామ్‌ హైదర్‌ ఎక్కువ కాలం జీవించలేదు. అతను లేని లోటును అనిల్‌ బిశ్వాస్‌ భర్తీ చేశాడు.
నూర్జహాన్‌, గులామ్‌ హైదర్‌లు పాకిస్తాన్‌ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫోన్‌ ద్వారా వారితో సంబంధాన్ని కొనసాగించింది లతా మంగేష్కర్‌. ఫోన్‌లో పాటల గురించి చర్చించటం, ఒకరు కొత్తగా పాడిన పాటలను మరొకరికి వినిపించటంతో పాటు గులామ్‌ హైదర్‌ నుండి సలహాలు తీసుకోవటం వంటివి చేసేది లత. అయితే దేశవిభజన విద్వేషాలు తీవ్రంగా ఉన్న సమయం కావటంతో లత క్రమం తప్పకుండా పాకిస్తాన్‌ కళాకారులతో మాట్లాడుతుండటం వివాదాస్పదమయింది. నెమ్మదిగా టెలిఫోన్‌ సంభాషణలు తగ్గిపోయాయి. అయితే విదేశాలలో లత, నూర్జహాన్‌లు కలుస్తుండేవారు. ఒకసారి ఇద్దరికీ కలవాలని తీవ్రంగా అనిపించినప్పుడు అమృత్‌సర్‌ దగ్గర వాఘా సరిహద్దు వద్ద ‘‘no man’s landµ’’లో కొన్ని నిమిషాల కోసం కలిశారు.
సజ్జాద్‌ హుస్సేన్‌ కూడా లత పాటకు మెరుగులు దిద్దాడు. ఆమె గురువు అమానత్‌ అలీఖాన్‌కూ సజ్జాద్‌ హుస్సేన్‌కూ మంచి దోస్తీ. అమానత్‌ అలీఖాన్‌ తన శిష్యురాలి గురించి సజ్జాద్‌ హుస్సేన్‌కు చెప్పాడు. లత స్వరాన్ని పరిశీలించేందుకు సజ్జాద్‌ హుస్సేన్‌ లతను పిలిచాడు. సజ్జాద్‌ హుస్సేన్‌ అత్యంత సృజనాత్మక సంగీత దర్శకుడు. అయితే ఎవరికీ ఒదిగి ఉండే వ్యక్తి కాదు. ఎవరి మాటా వినే వ్యక్తి కాదు. తన సంగీత ప్రతిభ మీద అపారమైన విశ్వాసం గలవాడు సజ్జాద్‌ హుస్సేన్‌. అతడి అభిప్రాయం ప్రకారం హిందీ సినీ ప్రపంచంలో పాడటం తెలిసిన గాయనిలు ఇద్దరే ఇద్దరు. ఒకరు నూర్జహాన్‌, రెండు లతా మంగేష్కర్‌. గాయకులలో పాడటం తెలిసింది ఒక్క మహమ్మద్‌ రఫీకే. లత, తలత్‌ మహమూద్‌తో చక్కని పాటలు పాడిరచినా తలత్‌ మహమూద్‌ను గలత్‌ మహమూద్‌ అనేవాడు సజ్జాద్‌ హుస్సేన్‌. సజ్జాద్‌ హుస్సేన్‌కు లతా మంగేష్కర్‌ నచ్చటంలో ప్రధానంగా తోడ్పడిరది… లత చెప్పింది చెప్పినట్లు నేర్చుకోగలగటం.
1917లో మధ్యప్రదేశ్‌లోని ‘సీతామౌ’లో జన్మించిన సజ్జాద్‌ హుస్సేన్‌ 1937లో బొంబాయి వచ్చాడు. 1944లో స్వతంత్ర సంగీత దర్శకుడయ్యాడు. నూర్జహాన్‌తో ‘దోస్త్‌’ సినిమాలో అద్భుతమైన పాటలు పాడిరచాడు. కానీ, ఆమె భర్తతో పడకపోవడంతో నూర్జహాన్‌, సజ్జాద్‌ హుస్సేన్‌కు ఎక్కువ పాటలు పాడలేదు. ఇతర గాయనిలు పాటలు పాడే విధానంతో అసంతృప్తితో ఉన్న సజ్జాద్‌కు లత స్వరం కన్నా ఆమె నిజాయితీ, చిత్తశుద్ధిలు నచ్చాయి. సజ్జాద్‌ హుస్సేన్‌ కోపిష్టి. నోటికి వచ్చిన మాటలంటాడు. కానీ పర్ఫెక్షనిస్టు. అందరూ పర్ఫెక్టుగా ఉండాలన్న పట్టుదల, అలా లేరన్న అసహనంలోంచి ఆయన కోపాన్ని, అసంతృప్తిని ప్రదర్శించేవాడు. ఇది సినీ పరిశ్రమలో ఎవ్వరూ మెచ్చరు. అందుకే 34 సంవత్సరాల సినీ జీవితంలో కేవలం పధ్నాలుగు సినిమాలకు మాత్రమే సంగీత దర్శకత్వం వహించాడు. కానీ ప్రతి పాటను వజ్రంలా చెక్కాడు. ప్రతి పదాన్ని, ప్రతి స్వరాన్నీ వజ్రంలా చెక్కటంతో ప్రతి పాట వజ్రాల శిల్పంలా మెరుపులు మెరిసేది.
సజ్జాద్‌ హుస్సేన్‌ శతాబ్ది ఉత్సవాలలో లతా మంగేష్కర్‌ ‘Sajjad Sahab was a misunderstood artist. People defamed him saying he is temperamental, but he was a perfectionistµ’’ అని వ్యాఖ్యానించింది. తన జీవితంలో తాను పాడిన మరపురాని మధురగీతాలు కొన్ని సజ్జాద్‌ హుస్సేన్‌ రూపొందించినవేనని చెప్పింది. సజ్జాద్‌కు గాయకులు కానీ, వాయిద్యకారులు కానీ తాను ఎలా చెప్తే అలా, ఎంతవరకు చెప్తే అంతవరకే తమ కళను ప్రదర్శించాలి తప్ప స్వతంత్రాన్నివ్వడు. ఇళయరాజా కూడా దాదాపుగా ఇంతే. అయితే ఎవ్వరు ఏ మాత్రం తప్పు చేసినా సహించేవాడు కాదు. గాయనీ గాయకులు తాను చెప్పినట్టు సరిగ్గా, ఖచ్చితంగా పాడేవరకు వదిలేవాడు కాదు. అందుకే సజ్జాద్‌ హుస్సేన్‌ పాటలు పాడమంటే తాను భయపడేదాన్ననీ, ఎంతో పరిశ్రమించేదాన్ననీ లత చెప్పింది.
ఒకసారి ఓ పాట రికార్డింగ్‌ సమయంలో ఓ వాయిద్యకారుడు సజ్జాద్‌ చెప్పినట్లు వాయించలేకపోతున్నాడు. దాంతో సజ్జాద్‌కు కోపం వచ్చింది. కోపం పట్టలేక ‘‘ఫో… బయటకు పో… నీకు వాయించటం రాదు. వాయించటానికి ఎందుకు వచ్చావు?’’ అని అరిచాడు. బయటకు వెళ్ళబోతున్న వాయిద్యకారుడికి అడ్డుగా నిల్చుని ‘‘ఇటునుంచి కాదు, కిటికీలోంచి బయటకు దూకు. ఇక్కడ లత ఉంది. ఆమె ఎదురుగా వస్తే, ఆమె మూడ్‌ పాడవుతుంది. నేను అది ఎట్టి పరిస్థితుల్లోను కానివ్వను’’ అని ఆ వాయిద్యకారుడిని కిటికీలోంచి బయటకు తోసేశాడట. Times of India 15.6.2017, article by bella jaisingnani)..
సజ్జాద్‌ సంగీత దర్శకత్వంలో లత కేవలం 14 పాటలు పాడిరది. కానీ ఆ పధ్నాలుగు పాటలు పధ్నాలుగు ఆణిముత్యాలు. 1950లో ‘‘ఖేల్‌’’ సినిమాలో ‘జాతే హోతో జావో’’ పాటతో మొదలైన వీరి సంబంధం 1963లో ‘రుస్తుమ్‌ సోహ్రాబ్‌’లో ‘‘ఏయ్‌ దిల్‌ రుబా నజ్రేమిలా’’తో సమాప్తమయింది. ప్రతి ఒక్క పాటలో లత భిన్నంగా, ప్రత్యేకంగా వినిపిస్తుంది. ప్రతి పాట పాడేందుకు ఎంతో శ్రమ పడినా, ‘ఏయ్‌ దిల్‌ రుబా’ పాటకు పడ్డంత శ్రమ మరే పాటకూ పడలేదంటుంది లత. ఈ పాటను తాను పాడిన అత్యుత్తమ పాటల జాబితాలో పేర్కొంది లత.
నిజానికి అమానత్‌ఖాన్‌ సాహెబ్‌ లత గురించి చెప్పగానే ‘హల్‌చల్‌’ సినిమాలో ‘ఆజ్‌ మేరే నసీబ్‌ మే’ అన్న పాటను లతతో రికార్డు చేశాడు సజ్జాద్‌. కానీ నిర్మాతతో గొడవలు వచ్చి ఆ సినిమాను సగంలో వదిలేశాడు. దాంతో సినిమాలో ఆ పాటను వాడలేదు. సజ్జాద్‌కు నౌషాద్‌ అంటే పడేది కాదు. అందుకని లత ఎప్పుడు తన కోసం పాడే పాటలో పొరపాటు చేసినా ‘యే నౌషాద్‌ మియాకే గానా నహీ హై. థోడీ ఔర్‌ మెహనత్‌ కర్నీ పడేగీ’ అని తిట్టేవాడు. సంగీత దర్శకులందరిలో సహాయ సంగీత దర్శకుడిని వాడనిది సజ్జాద్‌ హుస్సేన్‌ ఒక్కడే. అన్నీ తానే చూసుకునేవాడు. ఏ పాటనూ చులకనగా తీసుకోకూడదని, ప్రతి పాటనూ జీవన్మరణ సమస్యగా తీసుకుని పాడాలని సజ్జాద్‌ నుంచి నేర్చుకున్నానంటుంది లత.
లతా మంగేష్కర్‌ గాన సంవిధానాన్ని తిరుగులేని రీతిలో ప్రభావితం చేసినవాడు ఖేమ్‌చంద్‌ ప్రకాశ్‌. ‘మహల్‌’ సినిమాలో ‘ఆయెగా ఆనేవాలా’తో లత సినీ సంగీత జీవితం శిఖరారోహణ ఆరంభమయింది.
ఖేమ్‌చంద్‌ ప్రకాశ్‌ సృజించిన ‘ఆయెగా ఆనేవాలా’తో పోటీగా సూపర్‌ హిట్‌ అయి, వీథివీథినా, వాడవాడలా లత స్వరం మార్మోగేట్టు చేసిన మరో పాట ‘లారలప్ప లారలప్ప’. మీనాశౌరిపై చిత్రితమైన ‘ఏక్‌ థీ లడ్కీ’ (1949) సినిమాలోని ఈ పాటను రూపొదించింది సంగీత దర్శకుడు వినోద్‌. వినోద్‌ అసలు పేరు ఎరిక్‌ రాబర్ట్స్‌. ఈయన, గులామ్‌ హైదర్‌, బులో సి రాణి, హన్స్‌రాజ్‌ బహల్‌, శ్యామ్‌ సుందర్‌, హుస్న్‌లాల్‌ భగత్‌రామ్‌ వంటి సంగీత దర్శకులంతా పంజాబీ సంగీత దర్శకులు. వీరిలో ఒకరు ఒక గాయనిని వాడితే మిగతా వారంతా ఆ గాయనీ గాయకులను వాడేవారు. అలా గులామ్‌ హైదర్‌ లతను గాయనిగా ఉపయోగించి చూడమని వినోద్‌కు చెప్పటంతో, వినోద్‌ లతతో పంజాబీ సినిమా ‘చమన్‌’లో రెండు పాటలు పాడిరచాడు. శంషాద్‌ బేగం పాటలకన్నా లత పాడిన రెండు పాటలు హిట్‌ అయ్యాయి. దాంతో వినోద్‌ లతతో పాడిరచటం ప్రారంభించాడు. వినోద్‌కు నిర్మాత రూప్‌ శౌరితో మంచి దోస్తీ. ఆయన వినోద్‌ను బొంబాయికి ఆహ్వానించాడు. అలా ‘ఏక్‌ థీ లడ్కీ’ సినిమాకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం వినోద్‌కు లభించింది. ఆ సినిమా నాయిక మీనాశౌరీ స్వయంగా చక్కని గాయని. కానీ ఆమె ఈ సినిమాలో లారలప్ప పాటను లతతో పాడిరచమని వినోద్‌ను కోరింది. ఫలితంగా లారలప్ప లత సూపర్‌హిట్‌ పాటల్లో ఒకటిగా నిలిచింది. కోరస్‌తో కలిసి పాడటం, పంజాబీ పదాలను సరిగ్గా ఉచ్ఛరించటం, పంజాబీ జానపద గీతాల లయకనుగుణంగా స్వరాన్ని పరుగులెత్తించటాన్ని లత, వినోద్‌, బులో సి రాణి, హుస్న్‌లాల్‌ భగత్‌రామ్‌, హన్స్‌రాజ్‌ బహల్‌ల పాటలు పాడుతూ నేర్చుకుంది. వినోద్‌ లతతో పాడిరచే సమయానికి ఆమె స్వరంలో ఇప్పటి పరిపక్వత లేదు. ఇది గమనించిన వినోద్‌ వయొలిన్‌, తబలా, హార్మోనియం వంటి వాయిద్యాలను అత్యంత సృజనాత్మకంగా వాడుతూ, ఆ వాయిద్యాల నాదాల నడుమ తీగలా లత స్వరం వినిపించే రీతిలో సంగీతాన్ని రచించాడు. తర్వాత ఎందుకో వినోద్‌ లత స్వరాన్ని వాడలేదు. వినోద్‌కు హాస్య చిత్రాల సంగీత దర్శకుడని ముద్రపడటం అతని కెరీర్‌ను దెబ్బతీసింది. తర్వాత తుప్పుపట్టిన బ్లేడ్‌తో షేవింగ్‌ చేసుకుంటుండగా చర్మం తెగి టిటానస్‌ శరీరమంతా వ్యాపించి 37 ఏళ్ళ వయసులో వినోద్‌ మరణించాడు. లతతో భేదాభిప్రాయాల వల్ల 1950 తర్వాత వినోద్‌ లతతో పాటలు పాడిరచలేదు. ఇది అతని కెరీర్‌పై ప్రభావం చూపించింది. ఎందుకంటే 1950 నుండి హిందీ సినీ ప్రపంచంలో లత యుగం ప్రారంభమయింది. అతని పాటలు అంతగా హిట్‌ కాలేదు. ప్రొడ్యూసర్లు హన్స్‌రాజ్‌ బహెల్‌కు ప్రాధాన్యం ఇవ్వటంతో వినోద్‌కు సినిమాలు రావటం తగ్గిపోయింది. కానీ ఈనాటికీ ‘లారలప్ప’ పాటలతో వినోద్‌ చిరంజీవిగా మిగులుతాడు. దులారీ, మహల్‌, అందాజ్‌, బర్సాత్‌ వంటి సినిమాలు విడుదలైన సంవత్సరమే విడుదలై ఆ సూపర్‌హిట్‌ సినిమాలకు ధీటైన సంగీతం సృజించిన వాడిగా ఆయెగా ఆనేవాలా, ఉఠాయేజా ఉన్‌కే సితమ్‌, జియా బేకరార్‌ హై వంటి పాటలతో సమానమైన హిట్‌గా ‘లారలప్ప’ను లతకు అందించినవాడిగా వినోద్‌ను సినీ సంగీత ప్రపంచం ఈనాటికీ గుర్తుంచుకుంటుంది.
లతతో తక్కువ పాటలు పాడిరచినా లత సినీ సంగీత ప్రపంచంలో ఒక శక్తిగా నిలవడంలో తన వంతు పాత్ర పోషించిన మరో సంగీత దర్శకుడు హన్స్‌రాజ్‌ బహెల్‌.
పృథ్వీరాజ్‌ కపూర్‌ రికమెండేషన్‌తో 1946లో ‘పూజారి’ సినిమాతో స్వతంత్ర సంగీత దర్శకుడైన ఈయన నటి మధుబాల బేబీ ముంతాజ్‌గా ఉన్నప్పుడు ‘భగవాన్‌ మేరీ జ్ఞాన్‌ కే దీపక్‌ కో జలాలే’ అనే పాటను పాడిరచాడు. ఆరంభంలో ఈయన ముకేష్‌తో అద్భుతమైన గీతాలు పాడిరచాడు. శంషాద్‌ బేగం, ఇతర గాయనిలతో పాడిరచాడు కానీ, లత స్వరం వాడటంపై ఎలాంటి ఉత్సాహం చూపించలేదు. 1948లో ‘చునరియా’ సినిమాలో తొలిసారిగా లత, రఫీలను వాడాడు. ఈ సినిమాలోనే ఆశాభోంస్లేతో తొలి సోలోను పాడిరచాడు. అయితే 1949లో లతతో ‘చకోరా’ సినిమాలో ‘హాయ్‌ చందా గయే పర్‌దేశ్‌’ పాటతో చక్కని గుర్తింపు సాధించాడు. 1949లోనే ‘రాత్‌ కీ రానీ’ సినిమాలో రఫీతో ‘జిన్‌ రాతోమే నీంద్‌ నహీ ఆతీ’ పాటను పాడిరచాడు. లత, రఫీల స్వరాల ఆధారంగా గుర్తింపును సాధించినవాడు హన్స్‌రాజ్‌ బహెల్‌. అయితే ఈయన రఫీను అధికంగా వాడాడు కానీ లతను తన సంగీతంలో ప్రముఖ గాయనిగా ఎన్నడూ భావించలేదు. కానీ 1958లో ‘మిలన్‌’ సినిమాలో లతతో పాడిరచిన ‘హాయ్‌ జియ రోయే’ పాట లత పాడిన అత్యుత్తమ పాటలలో అగ్రశ్రేణి పాటగా నిలుస్తుంది. దర్బారీ రాగంలో దృత లయలో రూపొందించిన ఈ పాట కేవలం బాన్సూరీ, సారంగీ, లత స్వరాలు మాత్రమే వాడి, విన్న ప్రతి ఒక్కరూ ‘మెలోడీ లోకం’లో కళ్ళు తెరిచే రీతిలో ఈ పాటను రూపొందించాడు. ‘చునారియా’ సినిమాలో ‘ఆంఖ్‌ మేరీ లడ్‌ గయీరే’ అన్న పాటను పాడిరచేకన్నా ముందు లతను కశ్మీర్‌ తీసుకువెళ్ళి ఈ పాటకు ప్రేరణ అయిన కశ్మీర్‌ జానపద గీతాన్ని స్వయంగా విని, బాణీలోని లయను అర్థం చేసుకోమన్నాడు. ఇలా ఒక పాట పాడేముందు పాటను తనలోకి ఆహ్వానించి ఆ పాటే తానైపోవటం హన్స్‌రాజ్‌ బహెల్‌ నేర్పించాడు. అయితే ఇతను లతకన్నా అధికంగా ఇతర గాయనిలను వాడటం ముఖ్యంగా ‘మధుబాల రaావేరీ’ అన్న గాయనితో అధికంగా పాటలు పాడిరచటం ఇతని కెరీర్‌ను దెబ్బతీసింది. లత, రఫీలు పాడిన పాటల వల్లే ఈనాటికీ హన్స్‌రాజ్‌ బహెల్‌ను సినీ ప్రపంచం గుర్తుంచుకుంటుంది. తొలి పాటనే కాదు, తొలి సోలో తనతో పాడిరచినా ఆశాభోంస్లే హన్స్‌రాజ్‌ బహెల్‌ ప్రస్తావన చేయదు. ‘మొహబ్బత్‌ జిందా రహితీ మె’ౖ (చెంగిజ్‌ ఖాన్‌) ‘జహ డాల్‌ డాల్‌ పర్‌ (సికందర్‌`ఎ`ఆజామ్‌), ‘జిందగీ హర్‌ గమ్‌ జుదాయీ’ (మిస్‌ బాంబే) వంటి రఫీ పాటలతో పాటు లత పాడిన ‘హాయ్‌ జియా రోయ్‌’ పాట వల్ల ఈనాటికీ హన్స్‌రాజ్‌ బహెల్‌ను గుర్తుంచుకుంటుంది సినీ సంగీత ప్రపంచం.
వినోద్‌, హన్స్‌రాజ్‌ బహెల్‌ వంటి సంగీత దర్శకుల కోసం తాను ఎక్కువ పాటలు పాడలేదనీ, ప్రశ్నలు అడిగేవారు హిట్‌ పాటల గురించి అడుగుతుంటారనీ, కానీ జవాబు ఇచ్చేవారికి ఆ పాటలు గుర్తుకు రాకపోవటం ఇబ్బందిగా ఉంటుందని తనను అధికంగా వాడని సంగీత దర్శకుల గురించి అడిగిన ప్రశ్నకు లత ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చింది. హన్స్‌రాజ్‌ బహెల్‌ గురించి ప్రత్యేకంగా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘నేను హన్స్‌రాజ్‌ బహెల్‌కు ఎన్నో పాటలు పాడాను. కానీ ఇప్పుడు అవన్నీ గుర్తులేవు. ఆరంభంలో అతనికి చక్కని పాటలు పాడాను. ‘నాలే లమ్మీ తే నాలే కాలీ హోయ్‌’ అనే పంజాబీ పాట గుర్తొస్తోంది. ‘మిలన్‌’లో హాయె జియా రోయ్‌ పాట, ‘చకోరీ’లో పాటలు గుర్తొస్తున్నాయి’ అని సమాధానమిచ్చింది.
లత హన్స్‌రాజ్‌ బహెల్‌ను గుర్తుంచుకోకపోవటం వెనుక కారణం ఉంది. లతా మంగేష్కర్‌ అవకాశం కోసం సంగీత దర్శకుల చుట్టూ తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆమెని పాట పాడమనేవారు. పాట పాడిన తరువాత స్వరం బలహీనంగా ఉందో, నాయికకు సరిపోదనో, ఉచ్ఛారణ సరిగ్గా లేదనో ఏదో ఒక వంకతో ఆమెను తిరస్కరించేవారు. ఇది లత మనస్తత్వంపై తీవ్రమైన ప్రభావం చూపింది. వ్యక్తిగతంగా దీనానాథ్‌ మంగేష్కర్‌ తనయగా, దైవదత్తమైన అత్యద్భుతమైన స్వరం పొందిన గాయనిగా లతకు అత్యంత ఆత్మవిశ్వాసం
ఉండేది. కానీ తప్పనిసరిగా ఎదుర్కొంటున్న తిరస్కృతులు లత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. అందుకని అప్పటి హిట్‌ గాయనిలను అనుకరించే ప్రయత్నం చేసింది. తన స్వరం మెచ్చి దాని ఆధారంగా గుర్తింపు పొందిన తర్వాత కూడా తనని ఆదరించని సంగీత దర్శకులతో తాను అగ్రశ్రేణికి చేరిన తర్వాత లత పనిచేసేందుకు ఉత్సాహం చూపలేదు. ‘చకోరీ’తో హిట్‌ సాధించిన హన్స్‌రాజ్‌ బహెల్‌, తర్వాత లత కన్నా శంషాద్‌ బేగం, సురయ్య వంటి ఇతర గాయనిలకు అధిక ప్రాధాన్యమిచ్చాడు. 1949 తర్వాత నెంబర్‌వన్‌గా నిలిచిన లత ఏ సంగీత దర్శకుడి పాటలు పాడేందుకు అంతగా ఉత్సాహం చూపలేదో, వారి కెరీర్‌ ప్రమాదంలో పడుతుంది. కారణం ఏమిటంటే అప్పటికి డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడి పెట్టే వ్యవస్థ వచ్చింది. పంపిణీదార్ల దృష్టి వ్యాపార లాభాలపైనే ఉంటుంది. లత పాట ఉంటే సినిమా విలువ పెరుగుతుంది. కాబట్టి లత పాట ఉన్న సినిమాలకు పెట్టుబడులు సులభంగా లభించేవి.
హన్స్‌రాజ్‌ బహెల్‌ను లత అంతగా ప్రస్తావించకపోవడానికి వ్యక్తిగత కారణం ఇంకోటి ఉందని అంటారు. తన స్వరం ఆధారంగా లత కుటుంబాన్ని పోషిస్తోంది. ఆ సమయంలో కుటుంబంలోని ఇతర సభ్యులు తనతో సహకరిస్తారని వాంఛించటం సహజం. మానసిక శాస్త్రవేత్తల ప్రకారం, యుక్తవయస్సు రాకముందే ఇంటి బాధ్యతలు తలకెత్తుకున్న వారి మానసిక వ్యవస్థ అల్లకల్లోలంగా ఉంటుంది. న్యూనతా భావం, అభద్రతా భావాలు అలాంటి వారిలో తీవ్రంగా చెలరేగుతూ వారి ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. కుటుంబ బరువు ఒకవైపు ఒత్తిడి పెంచుతుంటే, నిరాశాజనకం, అంధకారమైన భవిష్యత్తు అణచివేస్తుంటే, వర్తమానంలోని తిరస్కృతులు భయపెడుతుంటే, నిరాశా నిస్పృహలు అలముకొని వ్యక్తిని మానసికంగా దిగజారుస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో లత తనని తాను కూడగట్టుకొని ఆత్మవిశ్వాసం పెంచుకుంటూ అనుక్షణం పోరాటం సాగిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తుంటే, ప్రతి తిరస్కృతి ఒక సుత్తిదెబ్బలా మనస్సును క్రుంగదీస్తుంది, బాధ కలిగిస్తుంది. అందుకే తనను తిరస్కరించిన వారిని కానీ, తన స్వరాన్ని అధికంగా వాడని వారిని కానీ లత క్షమించలేదు. వారు ఎంత గొప్ప సంగీతం అందించినా అధికంగా వారిని ప్రస్తావించలేదు. ఇలా లత సినీరంగంలో నిలద్రొక్కుకోవటం కోసం పోరాడుతున్న సమయంలో అండగా నిలవవలసిన సోదరి ఆశా భోస్లే, గణపతిరావు భోస్లే అనే అతడితో పారిపోయి వివాహం చేసుకుంది. ఇది లత మనస్తత్వంపై ప్రభావం చూపించింది. సాధారణంగా ఇంట్లో ఒకరు ఇలా పారిపోయి ప్రేమ వివాహం చేసుకుంటే ఇంట్లో మిగిలిన వారికి ప్రేమ పట్ల విముఖత కలుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రేమ వివాహం వల్ల ఇంట్లో తల్లిదండ్రులకు దుఃఖం కలిగితే అది ఆ దుఃఖం కలిగించిన వారి పట్ల ద్వేషభావంగా ప్రకటితమవుతుంది. ఓ వైపు ఇంట్లో వారు జీవిక కోసం నిరంతరం పోరాడుతుంటే, వారితో కలిసి పోరాడాల్సిన వ్యక్తి తన స్వార్థం చూసుకుని అందరినీ వదిలివెళ్తే ఆ సంఘటన వల్ల కలిగిన గాయం జీవితాంతం మనసులో మానని గాయంలా మిగిలి బాధను కలిగిస్తుంటుంది. కాలం మాన్పలేని గాయాలలో ఇదొక గాయం. తర్వాత ఎంత ప్రయత్నించినా వారి సంబంధాన్ని ఈ గాయం ప్రభావితం చేస్తూనే ఉంటుంది. అభద్రతా భావంతో తాను తన జీవితంలో భద్రత సాధించేందుకు అందరినీ గాయపరచి వెళ్ళిన వ్యక్తి ప్రయత్నం విఫలమైతే అది మరో రకమైన వేదనను కలిగిస్తుంది. అలా వెళ్ళిన వ్యక్తి కుటుంబం కోసం పోరాడుతున్న సోదరితోనే పోటీకి వస్తే, అది ఆ బంధాన్ని శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది.
లత సోదరి ఆశా, గణపతిరావు భోస్లేను ప్రేమ వివాహం చేసుకోవటం, అతడు ఆమెను ఇంట్లో వారితో కలవనివ్వక పోవటం, హింసించటం చివరికి సోదరి లత లాగా పాటలు పాడి ఇంటిని పోషించమని సినిమాలవైపు తరమటం… ఇవన్నీ లత ఆలోచనలను ప్రభావితం చేశాయి. అందుకే ఆశకు ప్రోత్సాహమిచ్చి పాటలు పాడిరచిన హన్స్‌రాజ్‌ బహెల్‌ను లత అంతగా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగించదు. లత నిస్వార్థం, ఆశా భోస్లే స్వార్థం వారి వారి కెరీర్లను ప్రభావితం చేయటమే కాదు, లత వెంట సమస్త కుటుంబం నిలవటం, ఆశాతో వారు కలిసినా, లత పట్ల కనబరచిన శ్రద్ధ, భక్తిభావం, విశ్వాసం ఆశా పట్ల కనబర్చకపోవడానికి కారణం. కుటుంబంలో లతకు లభించిన గౌరవాభిమానాలు ఆశాకు లభించక పోవటానికి లత జీవితాంతం కుటుంబంతో జీవించటం, ఆశా తన స్వార్థం చూసుకోవటం ప్రధాన కారణం. భోస్లేతో వివాహం విఫలమయిన తర్వాత ఆశాను కుటుంబం ఆదరించినా, కెరీర్‌ పరంగా నిలద్రొక్కుకోవటానికి లత ఆశాకు ఏ రకంగానూ సహాయం చేయకపోవటం గమనార్హం. ఆశాను కూడా లత సహ గాయనిగానే చూడటం కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు. లత తన కుటుంబం కోసం పాడుతుంది, ఆశా ఆమె కుటుంబం కోసం పాడుతుంది. ఎలాగైతే ఇతర గాయనిలు వారి వారి కెరీర్ల కోసం వారి వారి కుటుంబాల కోసం పాడుతున్నారో, ఆశా కూడా అంతే! అయితే ఆశా సినీ సంగీత రంగాన్ని ఆధారంగా చేసుకునే నాటికి లత గాయనిగా స్థిరపడటమే కాదు, తనదైన పద్ధతిలో ఇమేజిని కూడా సంపాదించుకుంది. మరోవైపు గీతారాయ్‌ తనదైన ప్రత్యేక గానసంవిధానంతో ఇమేజీని సాధించింది. సినీ గీతాల ప్రపంచాన్ని లత గీతాలు ఆక్రమించగా, ఇతర గాయనిలు మిగిలిన రకమైన పాటలను పాడాల్సిన పరిస్థితి 1950కల్లా సినీ ప్రపంచంలో నెలకొంది. దాంతో ఆశా భోస్లేకు దొరికిన పాట దొరికినట్టు పాడితే కానీ పాటలు దొరకని పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘ఆ సంగీత దర్శకుడికి పాడను’, ‘ఈ గాయకుడితో పాడను’, ‘ఇలాంటి పాటలు పాడను’ అనే అవకాశం ఆశాకు దక్కలేదు. లత పాడే పాటలు ఆశా పాడలేదు. గీతారాయ్‌ను కదపలేదు. దాంతో అవకాశం దొరికిన పాటనల్లా పాడేయటంతో ఆశాభోస్లే కెరీర్‌ ఆరంభంలోనే తప్పుదారి పట్టింది. చివరికి గీతారాయ్‌, గీతాదత్‌ అయ్యి తన కెరీర్‌ను తానే స్వయంగా నాశనం చేసుకునేవరకూ ఆశా భోస్లే సినీ రంగంలో నిలద్రొక్కుకోలేకపోయింది. చివరికి ఓ.పి.నయ్యర్‌ సంగీత ప్రపంచంలో, గీతా స్థానాన్ని ఆక్రమించే వరకూ ఆశా ఒక గుర్తింపును సాధించలేకపోయింది. కానీ ఓపీతో ఆశా సాన్నిహిత్యం లతకు నచ్చలేదు. ఇది ఓపీ నయ్యర్‌, లతల నడుమ ఉద్విగ్నతగా పరిణమించింది. ఇదంతా భవిష్యత్తు. అయితే ఆరంభం నుంచీ లత ఆశాను సోదరిగా ఆత్మీయంగా చూసింది కానీ గాయనిగా, మరో గాయనిగానే చూసింది తప్ప సోదరిగా చూడలేదు. వ్యక్తిగతంగా సోదరి, సినీరంగంలో గాయని. ఈ విచక్షణ ఇతరులతో లత వ్యవహరించిన తీరులోనూ కనిపిస్తుంది. తనను గౌరవించి, ఆదరించిన వారితో తానూ అభిమానంగా, గౌరవంగా వ్యవహరించింది. వారు ఏ మాత్రం పొరపాటు చేసినా వారికి దూరమైంది, వారిని లెక్కచేయలేదు. తన ఆత్మన్యూనతా భావాన్ని, అభద్రతా భావాన్ని ఆత్మగౌరవంగా, ఆత్మవిశ్వాసంగా రూపాంతరం చెందించటంలో లత ప్రయత్నంలో భాగమే ఈ ప్రవర్తన.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.