సామాజిక సమస్యలు ముఖ్యంగా మహిళా సమస్యల దృష్టికోణంలో కథలు, నవలలు రాస్తున్న రచయిత్రి సోమంచి శ్రీదేవి నవల ‘సంగమం’. పితృస్వామ్య భావజాలం వేళ్ళూన ఉన్న భారతీయ సమాజంలో ఒక వితంతు మహిళ పునర్వివాహం, దాని పర్యవసానాలు ఇతివృత్తంగా సాగిన నవల సంగమం. ఆచారాల పేరిట స్త్రీలను అన్నింటా
అవమానపరుస్తూ, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ హింసించడం మన సంస్క ృతా ? ఇదేనా సంప్రదాయమంటే ? భార్య చనిపోయిన మగవాడికి లేని ఆంక్షలు, కట్టుబాట్లు, ఆక్షేపణలు భర్తను కోల్పోయిన స్త్రీకి మాత్రం ఎందుకు ? అంతేకాదు ఆ స్త్రీ భర్తలేడన్న కారణంగా ‘వితంతువు’ అనే ప్రత్యేక పదంతో పిలవబడుతూ ఈ సమాజం నుండి పరాయీకరించబడటం అన్యాయమేగా. ఈ సమస్యను సామాజిక కోణం నుండి చూసి ఆ భావజాలాన్ని ప్రశ్నిస్తూ సమాజాన్ని చైతన్యీకరించే బాధ్యత మనందరిపైనా లేదా ? ఇలాంటి ప్రశ్నలతో కూడిన ఆలోచనలను రేకెత్తించే అనేక అంశాలు ‘సంగమం’ నవలలో చిత్రీకరించబడ్డాయి.
ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలి అనే ఒప్పందాలతో ఏర్పరచుకున్న కొన్ని కట్టుబాట్ల అంతిమ రూపమే ‘పెళ్ళి’ అంటూ మొదలైన ఈ నవలలో ప్రధాన పాత్ర కిరణ్మయి చిన్నవయసులోనే పెళ్ళయి, భర్తను కోల్పోయి పరిస్థితుల ప్రభావంతో పునర్వివాహం చేసుకున్న కిరణ్మయి చుట్టూ అల్లుకోబడిన అనేక సమస్యలు, సంఘటనలు, సంవేదనలు, సంఘర్షణలు, భయాలు, ఆందోళనలు మొదలైనవన్నీ ప్రస్పుటంగా కళ్ళముందుంచే విధంగా నవలను సృజియించారు రచయిత్రి కాలేజీలో చదువుకుంటున్న ఒక సాదాసీదా అమ్మాయికి పెళ్ళవుతుంది. ఆ తర్వాత సంవత్సరానికే ఆమె భర్త యాక్సిడెంటయి కాలును కోల్పోయి, ఆ బతుకును ఊహించి తట్టుకోలేననే భయంతో ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటికే ప్రెగ్నెంట్ అయిన కిరణ్మయినీ, ఆమె కడుపులో పెరుగుతున్న ప్రాణినీ తమ మాటలతో చేతలతో హింసిస్తూ ఉంటారు బంధువులూ, చుట్టుపక్కలవాళ్ళూ. ఈ పరిస్థితి మన సమాజంలోని అమానవీయ ఆలోచనా విధానానికి అద్దంపడుతుంది. కిరణ్మయికి పుట్టిన పాపపేరు శాంతి. అందరూ ఆమెను నష్టజాతకురాలంటూ అవమానిస్తుంటారు. శాంతి తల్లి రెండో పెళ్ళి కారణంగా ఆమెను ద్వేషిస్తూ శాంతి రెండేళ్ళ పిల్లగా ఉన్నప్పుడే తండ్రి తరపువాళ్ళు ఆమెను తెచ్చుకొని, పెంచి ఇంటర్ వరకు చదివించి భాస్కర్ అనే అతనితో పెళ్ళి చేస్తారు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. అయితే శాంతి తల్లి భర్త చనిపోయిన తరువాత మళ్ళీ పెళ్ళి చేసుకున్నదన్న నిజాన్ని దాచి ఆమె చనిపోయిందన్న అబద్ధంతో పెళ్ళి జరుగుతుంది. అసలు విషయం తెలిసిన భాస్కర్ అతని కుటుంబం శాంతినీ, ఆమె తల్లినీ సూటీపోటీ మాటలంటూ బాధించి ఆమెనక్కడే వదిలి వెళ్తారు. వీళ్ళెవరూ ఆమోదించని పెళ్ళి శాంతి తల్లిది. అంత తెగించిన దాన్ని ఎక్కడా చూడలేదు. అంటూ దూషిస్తారు. ఈ సంఘటనతో శాంతి మనసులో రకరకాల ఆలోచనలు ` తను పుట్టకముందే తండ్రి చనిపోయాడటు తల్లిని తనెప్పుడూ చూడలేదు. ఆమె జీవితాన్ని ఆమె సరిదిద్దుకుందేమో కానీ తనపట్ల చేసింది మాత్రం తప్పే. తప్పు ఆమెదైతే శిక్ష మాత్రం తనకు చిన్నప్పుడే పెదనాన్న ఇంటికి చేరిన తను అక్కడ అనుభవించిన ఆర్తీ, ఆప్యాయతలూ ఏమీలేవు. అందరూ ఉన్నా అనాధలా పెరిగింది. ఇంకోవైపు ఎవరెన్ని రకాలుగా చెప్పినా వినిపించుకోడు భాస్కర్. అతని తల్లి ‘‘ఆడవాళ్ళు రెండోపెళ్ళి చేసుకోవడం ఎక్కడా వినలేదు. పెళ్ళే చేసుకుందో, చేసుకుందని చెప్పుకుంటున్నారో అన్నీ సవ్యంగా ఉంటేనే ఆడవాళ్ళకు పెళ్ళిళ్ళు అవడంలేదు. అలాంటిది భర్తపోయినదాన్ని, పిల్ల తల్లిని చేసుకునే వాళ్ళెవరు ? అదీ ఆ రోజుల్లో ? ఎలాంటి బతుకు బతుకుతోందో ? ఛీ… ఛీ… ఎంత పరువు తక్కువ, అలాంటి తల్లికి పుట్టిన పిల్ల మనింటి కోడలంటే’’ ` అంటుంది. ఇట్లా అనేవాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు మార్పునసలే ఒప్పుకోరు.
ఒక వితంతువైన మహిళపట్ల సమాజ ధోరణి, కుటుంబ సభ్యుల ఆలోచనలు ఆమె పునర్వివాహాన్ని చూసే దృష్టికోణాలు, విభిన్న అభిప్రాయాలు ఈ నవలలో వివిధ పాత్రల ద్వారా మనకు కనిపిస్తాయి. ఒకవైపు భర్తలేడన్నీ బాధను అనుభవిస్తూ ఇంకోవైపు అత్తగారింట్లో ఆచారాలు, సంప్రదాయాల పేరుతో జరిపే తంతులన్నీ ఆమెను మానసిక క్షోభకు గురిచేస్తాయి. ఆమెనలా చూసి తట్టుకోలేని పుట్టింటివారు ఆమె జీవితాంతం వైధవ్యాన్ని అనుభవిస్తూ బతకాల్సిన అవసరం లేదని భావించి కిరణ్మయిని, పాపను వాళ్ళతో తీసుకెళ్తారు. ఆమె దృష్టిని మళ్ళీ చదువువైపు మళ్ళించడానికి కిరణ్మయి అన్న స్నేహితుడైన గోపాలకృష్ణను ఇంట్లోనే ట్యూటర్‌గా పెడతారు. భార్యనూ, కూతురినీ కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న గోపాలకృష్ణ జీవితంపై బాగా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి అతను బాధలో ఉన్న కిరణ్మయిని ఓదార్చుతూ, ‘‘పెళ్ళి విఫలమైతే మరో ప్రయత్నం చేయవచ్చు కిరణ్. ఇంత దు:ఖం నీకు మంచిది కాదు. నీ చుట్లూ ఉన్నవారితో సంబంధాలను చెడగొడుతుంది. తర్వాత నీ మానసిక ఆరోగ్యాన్ని, ఆ మీదట నీ శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీసి నిన్ను అగాధంలోకి తోస్తుంది. ఇందులోంచి బయటకు రావడానికి ప్రయత్నించు బాగా చదువుకో. వ్యక్తిత్వాన్ని పెంచుకో. మంచి ఉద్యోగం సంపాదించుకో. నీ కాళ్ళ మీద నీవు నిలబడు. నీకు చేయూతనిచ్చేవాళ్ళు ఎదురైతే పెళ్ళి చేసుకో’’ అంటాడు. దానికి కిరణ్మయి నాకు మళ్ళీ పెళ్ళేమిటి ? ఒకసారి పెళ్ళైంది పాప కూడా పుట్టింది. నా ప్రాప్తం ఇంతే అంటుంది. ఈ సందర్భంలో ఇక్కడ ‘‘వైధవ్య దు:ఖాన్ని సమాజం స్త్రీ మీద వేసి రుద్దుతోంది కాబట్టి ఆమెను అందులోంచి బయటకు రానివ్వరు కాబట్టి బతికున్నంత కాలం ఏడుస్తోంది. వంటికి గాయమైతే మందులు రాసి దాన్ని నయం చేసుకుంటాం. మనసుకు గాయం అయితే దాన్ని కెలుక్కొని కెలుక్కొని మనని మనమే హింసించుకునే మనుషులం. అది అవతలి వారి గాయమైతే మరీ సు:ఖం మనకి. కిరణ్మయి, ఆమె మనస్థితీ చీకట్లో కొట్టుమిట్టాడుతుంటే ఈ సమాజం తమాషాగా చూస్తుంది కానీ చీకట్లోంచి ఇవతలికి రావడానికి దారి చూపించదు సమాజాన్ని అది తన మీద రుద్దిన వైధవ్యాన్ని మినహాయించుకొని చూస్తే తనకు మళ్ళీ పెళ్ళి ఎందుకో కిరణ్మయికి అర్థమవుతోంది’’ కిరణ్మయిలోని ఈ ఆలోచనా విధానం కథలో తరువాత మలుపులకు పునాది అవుతుంది. ఆమె మనసును అర్థం చేసుకున్నవాళ్ళుగా ఆమె తల్లి, తండ్రి, అన్నదమ్ములు, నాయినమ్మ ఇతర కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆమె పెద్దన్నయ్య కిరణ్మయికి గోపాలకృష్ణతో పెళ్ళి చేస్తే ఆమె జీవితం చక్కబడుతుందని భావించి ఆ ప్రతిపాదన ఆమె ముందుంచుతారు. దానికామె లోకం గురించీ వాళ్ళు దానిని వక్రీకరించే ధోరణి గురించీ ఆలోచిస్తుంది. నిజానికి అదే జరుగుతుంది. కిరణ్మయి, గోపాలకృష్ణల గురించి గోపాలకృష్ణ పనిచేసే కాలేజిలో వేరేగా మాట్లాడుకుంటారు. దానికి కిరణ్మయి, గోపాలకృష్ణ ఏమిటి ఈ లోకం ? కాస్త చనువుగా మాట్లాడుకోగానే పెడార్థాలు తియ్యడమేనా అని బాధపడతారు. మరో భావం లేకుండా మగవాడితో మాట్లాడితేనే తప్పుపట్టే సమాజంలో పుట్టినందుకు కూడా చాలా బాధపడుతుందామె.
తర్జన భర్జనలు జరిగిన మీదట ఇంట్లో అందరూ సంయమనంతో, ముందుచూపుతో ఆలోచించి గోపాలకృష్ణతో ఆమె పెళ్ళి చేయడమే సరైన నిర్ణయమనుకుంటారు. మళ్లీ పెళ్ళి పట్ల చుట్టాలూ పక్కాలూ ఏమనుకుంటారు ముఖ్యంగా తన రెండేళ్ళ కూతురు శాంతి భవిష్యత్తేమిటి అని పరి పరి విధాలుగా ఆలోచిస్తుంది కిరణ్మయి. అయితే ఆమె మనసు గోపాలకృష్ణ తన కూతురి పట్ల చూపించే అభిమానం కొంత సానుకూలంగా ఆలోచించమంటుంది. అది ఆమెను సంఘర్షణకు గురి చేస్తుంది. కుటుంబ సభ్యులందరూ ఆ విషయంలో ఆలోచించే తీరు ఆమెను ప్రభావితం చేస్తుంది. ‘ఆడది కూడా మనిషే మగవాడికిలాగే ఆమెకు కూడా రక్తమాంసాలుంటాయి. అవి ఉన్నాయి కాబట్టి కోరికలు కూడా ఉంటాయి. కోరికలంటే కామం ఒక్కటేనని అనుకోకు తనకూ ఒక ఇల్లు ఉండాలని, తన బ్రతుకు తాను బతకాలనీ, అందరిలాగే నవ్వుతూ తిరగాలనీ ఉంటుంది. కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే స్త్రీని పోయినవాళ్ళతో మనం కూడా పోతామా అని ధైర్యం చెప్పి మళ్ళీ తల్లి కావడానికి సంసిద్ధురాలిని చేస్తారు. ఆ సమస్య కేవలం ఆమెకు మాత్రమే పరిమితం భర్త పోయిన స్త్రీ విషయంలో అలా కాదు ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ఆమె పిల్లలు అనాధలై సమాజానికి బరువౌతారేమోనని భయం ఉంటుంది. చనిపోయిన వాడి ఆస్తి లావాదేవీలు ఉంటాయి. అందుకే ఆమెను అణిచేస్తారు తల్లీ ! ఇవి జగన్నాథ రధ చక్రాలు. కదలాలంటే కొందరు వాటి కింద పడి నలిగిపోవాలి. ఇప్పుడు రోజులు మారాయంటున్నారు. మగవాడి ఆలోచన కూడా ఉదారమైందని చెప్తున్నారు. అతడు శాంతి బాధ్యత కూడా తీసుకుంటానన్నాడు అంటూ పాపపు పనేమోనని ఒకవైపు పీకుతున్నా మరోవైపు నీ ముఖం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది, అంటూ ఆమె నాయినమ్మ పాత్రతో అనిపించడం పాతకాలం భావాలు ఉన్న మనిషే అయినా తన అనుభవంతో మనవరాలిని ఒప్పించే ప్రయత్నం ఆలోచింపజేసే విషయాలు.
కూతురుకు చేసే రెండో పెళ్ళి వల్ల బంధువుల నుంచి తిరస్కారాలు వస్తాయనీ, ఇంకా అనేక సవాళ్ళకు ఎదుర్కోవలసి ఉంటుందనీ ఊహిస్తూనే ముందుకెళ్ళాలని అనుకుంటాడు ఆమె తండ్రి ఆ నిర్ణయం వల్ల అతని రెండో కూతురి పెళ్ళి ఆగిపోతుంది. చివరకు తమ కాబోయే కోడలికి కిరణ్మయి కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలి అనే ఒప్పందంతో ఆ పెళ్ళవుతుంది. ఆ పెళ్ళి సందర్భంగా జరుగుతున్న పెళ్ళి పనులు చూస్తుంటే కిరణ్మయి అంతరాంతరాల్లో ఎక్కడో చిన్న కదలిక చిన్నదే గానీ గడిచే జీవితపు క్షణక్షణంలో రక్తపు అణువణువులో వేళ్ళు నాటుకుపోయి విస్తరించుకున్న సాంప్రదాయమనే మహావృక్షాన్ని కూకటివేళ్ళతో సహా పెకిలించి వేయగలంత మౌలికమైన కదలిక అది. ఆ కదలిక భావంతోటే రచయిత్రి కథను ముందుకు నడిపిస్తుంది. ఎన్నో ఆలోచనల అలజడిలో ఉన్న కిరణ్మయిని ‘అలా తిరగబోకమ్మా! అందరికీ ఎదురురాకు అన్న ఒక బంధువు మాట ఎంత చిత్రవధకు గురిచేస్తుందో ఊహించవచ్చు. ఆమెకా బాధ కలిగించడం ఇష్టంలేని కుటుంబ సభ్యులు ఆమెను గోపాలకృష్ణతో ఎక్స్‌కర్షన్‌కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తారు. అది పెళ్ళింట్లో చాలా సంచలనాన్ని రేపుతుంది. అక్కడే ఉండి చెల్లెలి పెళ్ళి చూడకూడదంటే బాధపడుతుంది. ‘రెండోయేడు పందిట్లో ఒకవార కూర్చోపెడదామన్నా కుదరదు’ అని మళ్ళీ అక్కడ ఆచారాలను చర్చించుకొని ఆమెను గోపాలకృష్ణతో పంపించడానికి సిద్ధమవుతారు. కూతురు శాంతిని కూడా తనతో తీసుకెళ్ళాలనుకున్న కిరణ్మయి తల్లి వద్దనడంతో ‘తనంటే విధి వంచితురాలు వేడుకల్లో స్థానం లేదు. దానికేం’ అనుకోవడం భరించరానిదే అయినా సంప్రదాయం కనుక భరించాలి అన్న భావనతో కూడిన దురాచార సంస్క ృతిని ఎత్తి చూపించారు రచయిత్రి ఎక్స్‌కర్షన్‌కు వెళ్ళినచోట తను పెళ్ళి గురించి ఆందోళన పడుతున్న ఆమెతో గోపాలకృష్ణ అనే మాటలు సమాజంలో మగవాళ్ళలో కూడా కొంతమంది సంస్కారంతో ఆలోచించే వాళ్ళుంటారని అర్థమవుతుంది. మాటల మధ్యన ఆమె అతనితో ‘సాంప్రదాయానికి ఎదురీదినందుకు నన్నెప్పుడూ అవమానించనని మాటివ్వండి’ అనడంలో ఆమె ఆత్మగౌరవం కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ దండలు మార్చుకున్నాక ఆమె మనసులో రేగే అలజడులు, అంతర్మధనం కిరణ్మయిలాంటి స్త్రీలందరి ఆవేదనకు ప్రతిరూపం.
పెళ్ళి తర్వాత కిరణ్మయి ఆందోళలను, ఆశయాలను అర్థంచేసుకున్న గోపాలకృష్ణ కిరణ్మయి అన్న చందూ మాటలను చెప్తూ ‘కొడిగట్టిన దీపంలా ఆరిపోయే బదులు మరో దీపాన్ని వెలిగించవచ్చు కదా ! అది నీకు కూడా వెలుగునిస్తుందేమో అని, నువ్వలా వితంతువుగా ఉండడం తనకు ఇష్టం లేదు అన్నాడని, వితంతువు అన్న పదానికి అతనిచ్చిన నిర్వచనం ` వితంతువు అంటే తంతువు తెగి ఉండటం.. తెగిన వీణలా, నువ్వు అట్లా ఉండొద్దని’ మా అందరి అభిప్రాయం అంటాడు. తను కూడా భార్యనూ, కూతురునూ ఎలా కోల్పోయాడో చెప్తాడు. తరువాత తల్లి రెండో పెళ్ళి కారణంగా ఆ కుటుంబంలో ముఖ్యంగా ఆమె కూతురు శాంతి జీవితంలో వచ్చిన పెనుమార్పులలో భాగంగా పెదనాన్న ఇంట్లో ఉన్న శాంతి తల్లి దగ్గరకు చేరడం, గోపాలకృష్ణ కూడా ఆమెనాదరించడంతో ఆమె ఆ కుటుంబంలో ఒక సభ్యురాలిగా కలిసిపోతుంది. వాళ్ళందరి సహకారంతో చదువు కొనసాగించి, ఉద్యోగం సంపాదించి ఆత్మగౌరవంతో బతకాలనుకోవడం సానుకూల పరిణామం. తల్లి మళ్ళీ పెళ్ళి కారణంగా శాంతిని వద్దనుకున్న భర్త తన తప్పు తెలుసుకోవడంతో శాంతి జీవితం చక్కబడుతుంది. అంతేకాదు కిరణ్మయి, శాంతిల చుట్టూ ఉన్న వాళ్ళందరి తప్పుడు అభిప్రాయాలు క్రమేణా మారడం పురోగామి అంశం. అనాదిగా సమాజం పెట్టిన నియమ నిబంధనలలో చిక్కుకున్న కొన్ని జీవితాలు ముఖ్యంగా ముగ్గురి జీవితాల్లో రేగిన కల్లోలం, దాంట్లో నుండి బయటపడడానికి వాళ్ళు జరిపిన జీవన పోరాటం. అందులో భాగంగా చుట్టూ ఉన్న వారిని చైతన్యకరించడంలో ఎదురయ్యే అవమానాలు, వైఫల్యాలు, సత్పలితాలతో కూడిన అనేక వాస్తవాలు ‘సంగమం’ నవలలో ప్రస్తావించబడతాయి.
భారతదేశంలో వితంతు వ్యవస్థ తీరుతెన్నులతోపాటు మానవ వ్యక్తిత్వాలు, భావోద్వేగాలు, బంధాలు, బాధ్యతలను ఎత్తిచూపుతూనే ద్వంద్వ నీతిని అనుసరిస్తున్న మన సమాజం ముందు ప్రశ్నలను, సవాళ్ళను ఉంచి తట్టి లేపే ప్రయత్నం చేశారు రచయిత్రి ‘భర్త చనిపోయిన స్త్రీకి తనకు నచ్చిన పద్ధతిలో జీవించే హక్కు ఉంటుంది. ఉండి తీరాలి అన్నదే ‘సంగమం’ నవల సారాంశం. పుట్టినందుకు సంతోషంగా బతకడానికి అవసరమయ్యే అన్ని అవకాశాలనూ అందరూ అందుకొని ప్రస్ధానించాలి’. అంటూ ముగించబడిన ‘సంగమం’ నవలలోని ఇతివృత్తాన్ని సాహిత్యాంశంగానే కాక సామాజికాంశంగా కూడా గుర్తించి ‘వితంతువు’ అనే పదం లేకుండా చెయ్యాల్సిన బాధ్యత మనందరిదీ.