ఏగిలివారక ముందే
శుద్ధి కార్యక్రమం మొదలు
పెట్టాలనీ
నిదుర కళ్ళతోనే
చీపురుని ఆశ్రయిస్తుంది అమ్మ
అప్పుడు మా వాకిలి
లాలపోసుకునేందుకు
అమ్మ కాళ్ళపై ఒదిగి కేరింతలు
కొడుతున్న పసిపిల్లే…!
చీపురుతో
సుతారంగా జరుపుతున్న
రాలిన ఆకుల దేహాలన్నీ
అంతిమయాత్రకి తరలిపోతున్న
పార్థివ దేహాల్లా
ఉన్నాయి…!
నిన్నటి ముగ్గును
చెరిపెయ్యాలని చీపురుకూ ఉండదు
నేనే కొత్త ముగ్గును
చిత్రించాలనే ఉత్సాహంలోంచి
నిర్దయగా ఊడ్చేస్తాను…!
ఊడుస్తున్నప్పుడు వచ్చే
మెత్తని శబ్దం
పసిప్రాయం నుంచే నాకు అలారం
తెల్లారింది లెమ్మంటూ
తట్టి లేపే శుభ్రమిత్రుడు…!
ఈ పుల్లలు
ఏ గట్టున పుట్టినయో
మరే గుట్టన మొలిచినయో
మన ఊడిగం కోసమే
వాటి జీవితాన్ని
అర్పించుకుంటున్నయ్…!
ఇల్లంతా ఊడ్చి ఊడ్చి
వెలివేసినట్టు
ఓ మూలన నిలబడుతుంది
మా చేష్టలను చూస్తూ
నిశ్చేష్టగా…!
ఒక్క పుల్లతో
పెద్ద ప్రయోజనం లేదు గానీ,
పిడికెడు పుల్లల కట్టని
పట్టుకొని చూడండి
ఆ ఐక్యతా రాగానికి
అబ్బురపడతాం
అందుకేనేమో అరవింద్ వారు
ఆమ్ ఆద్మీ చిహ్నంగా
చీపురునే ఎంచుకున్నారు…!
చీపురు కట్టపై
ఆడోళ్ళ పేర్లే ఉంటాయనుకుంటారు
కొందరు పనికిమాలినోళ్ళు
దుమ్మూ ధూళిలోనైనా
పవళిస్తారు కానీ
పొరపాటునైనా చీపురుని తాకరు
పురా చాంధసులు
ఇన్నీ చేస్తున్న చీపురుని
చిన్న చూపు చూస్తారు కొందరు
అదే లేకుంటే
ఇల్లంతా చిరాకే, మనసంతా చికాకే
మీరెన్నన్నా చెప్పండి
భూమాతను శుద్ధి చేసి
సరిదిద్దే ఈ బ్యూటీషియన్ అంటే
నా కత్యంత గౌరవమే
అది నాకు కవిత్వమే..!