ఆడదాన్ని వివస్త్రను చేసి
అవమానించామని
సంబరపడతారు వాళ్ళు.
తమాషా చూడటానికి
ఏముందిరా అక్కడ??
నీకు పాలిచ్చి పెంచిన
పాలిండ్లు తప్ప.
నిన్ను కనడానికి
రక్తమోడ్చిన
జన్మ స్థానం తప్ప.
ఆమెను
నిందించడానికి నానారకాల
బూతుమాటల ఛందస్సులను
రచిస్తారు వాళ్ళు.
కానీ…!
పలికిన మొదటి మాట
అమ్మ అన్నది గుర్తెరగరు.
నేడు
తలదించుకోవాల్సింది
ఆడతనం కాదు.
అమ్మతనాన్ని
నడివీథిలో ఊరేగించిన
ఈ దేశం కన్న కొడుకులు.
సిగ్గుతో చచ్చిపోవాల్సింది
వాళ్ళే కదా…!
ఇప్పుడిక
ఏ ముఖం పెట్టుకుని
అంటారురా…!
భారత్ మాతా కీ జై అని.
(మణిపూర్ దుర్ఘటనకు నిరసనగా)