తెలంగాణ కథాసాహిత్యంలో యశోదారెడ్డి కథలు ` వైవిధ్యం – డా॥ రాగ్యా నాయక్‌ అడావతు

తెలంగాణ యాస భాషలకు పట్టం కట్టిన రచయిత్రి, కవయిత్రి పాకాల యశోదారెడ్డి. ఆమె రాసిన ‘మా ఊరి ముచ్చట్లు’ ఎందరినో ఆకట్టుకుంది. మా ఊరి ముచ్చట్లు కథా సంపుటిలో 1920`40 మధ్యకాలం నాటి తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని చిత్రించారామె. ఆమె ‘ఎచ్చమ్మ కథలు’ పేరుతో కథా సంపుటిని 1999లో వెలువరించారు.

ఈ కథా సంపుటిలోని కథలు 1950`70 మధ్యకాలం నాటి తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచాయి. ‘ధర్మశాల’ కథా సంపుటిని 2000 సంవత్సరంలో వెలువరించారు. ఈ సంపుటిలో 1980`90 మధ్యకాలం నాటికి తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పులను చూపించారు. ఆమె దాదాపు వంద కథలు రాశారు. ఈ కథలలో తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని, తెలంగాణ సామాజిక జీవితాలను చూపించారు. ఆమె రాసిన చాలా కథల్లో పాలమూరు జిల్లా మాండలికాన్ని ఉపయోగించారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పాకాల యశోదారెడ్డి ఆగస్టు 8, 1929న పాలమూరు జిల్లా (నేటి నాగర్‌ కర్నూల్‌ జిల్లా) బిజినేపల్లి గ్రామంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు, సంస్కృతంలో ఎం.ఎ డిగ్రీలు పొందారు. ఆమె 1955లో లెక్చరర్‌గా వృత్తిలోకి ప్రవేశించి ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. యశోదారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ‘తెలుగులో హరివంశాలు’ అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్‌.డి పొందారు. 1990`93 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా సేవలందించారు. ఆమె చేసిన సాహిత్య కృషిని గుర్తించి ఆగ్రా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. భాగవత సుధ, నారదీయం వంటి రచనలు ఆమె కీర్తిని రెండిరతలు చేశాయి. ఆమె భర్త పాకాల తిరుమల రెడ్డి చిత్రకళా రంగంలో పేరుగాంచారు. యశోదారెడ్డి పిహెచ్‌.డి పూర్తయిన తర్వాత అలీఘర్‌ విశ్వవిద్యాలయం నుంచి డి.లిట్‌ అందుకున్నారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూ, కన్నడ భాషలలో ప్రావీణ్యంతో పాటు జర్మన్‌ భాషలో డిప్లొమా పొందారు. యశోదారెడ్డి కథలతో పాటు ఎన్నో వ్యాసాలు రాశారు. అలాగే
ఉగాదికి ఉయ్యాల, భావిక వంటి వచన కవితా సంపుటాలను వెలువరించి ప్రతిభ చాటుకున్నారు. ఆమె నిత్య అధ్యయనశీలిగా ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను నిశితంగా, పరిశీలనా దృష్టితో అధ్యయనం చేశారు. ఆమె కొంతకాలం కల్పనాశ్రీ పేరుతో రచనలు చేశారు. ఆమెపై ఆమె గురువు ఆచార్య దివాకర్ల వేంకటావధాని ప్రభావముంది. ఆమె సాహిత్య విమర్శలో నిక్కచ్చితనంగా వ్యవహరించేవారు. ఆమె రచనలలో తెలంగాణ పలుకు బళ్ళు, సామెతలు ఉపయోగించేవారు.
ఆమె పరిశోధన గావించిన ‘తెలుగులో హరివంశాలు’ వంటిది మరొకటి లేదు. ఈ గ్రంథం ఉత్తమ పరిశోధనా గ్రంథంగా పండితులచే ప్రశంసలందుకుంది. ‘‘మా ఊరి ముచ్చట్లు’’ పేరుతో వెలువరించిన కథా సంపుటిలోని కథలన్నీ దక్కన్‌ రేడియో లోను, ఆలిండియా రేడియో లోను ప్రసారమయ్యాయి. ఆమె కథను ప్రారంభించే తీరు, కథను నడిపించే తీరు, ముగింపు అన్నీ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ‘‘గంగిరేగి చెట్టు’’ అనే కథను ఇలా ప్రారంభిస్తారు యశోదా రెడ్డి.
ఎచ్చమ్మ నుదుటిన దేవుడు రాత సరిగ్గా రాయలేదని అందరూ అనుకునేవారు. ఆ పిల్ల పుట్టడమే పాడు నక్షత్రంలో పుట్టింది. పుట్టాక తల్లిని కబళించింది. తండ్రి కాశీరెడ్డికి అందుకనే కూతురంటే రోత, అసహ్యం, భయం. కానీ తన కడుపునేగా పుట్టింది, అందుకనే బావిలో పడేయలేక పాలమూరులో తెలిసిన వాళ్ళు పెంచుకుంటామంటే ఇచ్చాడు. ఇంకో పెళ్ళి చేసుకున్నాడు. బిజినేపల్లిలో పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడు. ఇలా ప్రారంభించి కథను నడిపిస్తారు. ప్రతి సంక్రాంతికి కాశిరెడ్డి చెల్లెలు ముత్యాలమ్మ తన కొడుకు రఘునాథరెడ్డిని తీసుకొని వచ్చి నెలరోజులు అన్న ఇంట్లోనే ఉండిపోతుంది. వచ్చిన ప్రతిసారీ ‘అన్నా! మనది రక్తసంబంధం. ఈ సంబంధం కొనసాగాలె. నీ బిడ్డల్లో ఒకదాన్ని నా కొడుక్కి ఇవ్వు’ అంటుంది.
ఎచ్చమ్మకు తొమ్మిదేళ్ళు వచ్చేసరికి తండ్రి నోట్లోంచి ఊడిపడినట్లు తయారైంది. ఈసారి వచ్చినప్పుడు ఏమనుకుందో ఏమో పిల్ల తండ్రి దగ్గరకు వెళ్ళి భుజాలు పట్టుకొని ఊపుతూ నాయనా… అని ప్రేమగా పిలిచింది. అంతే తండ్రి మనసు నీరయింది. ఇంక నిన్ను వదిలి ఉండనమ్మా ఎచ్చాలు అని వెంట తెచ్చుకున్నాడు. చెల్లెలు కొడుక్కి ఎచ్చమ్మనిస్తే బాగుంటుందని అనుకున్నాడు. చెల్లెలు ఈ నిర్ణయానికి మొదట కలవరపడిరది. పాడు నక్షత్రంలో పుట్టిన పిల్లను నా కొడుక్కి ఇచ్చి చేస్తానంటున్నాడేంది కాళి రెడ్డన్న అనుకుంది మనసులో. కానీ అన్న అధికారంతో, డబ్బు, హోదాతో తనకు పని, పిల్లతో ఏం పని సర్ది చెప్పుకుంది. ఎచ్చమ్మ పాలమూరులో ఇంగ్లీషు చదువుకుంది. ఎచ్చా నాకు అంగ్రేజీ నేర్పవే అని బావ అడుగుతాడు. మొదట కొడుకు ఇంగ్లీషు నేర్చుకుంటుంటే సంబరపడిరది ముత్యాలమ్మ. అంతలోనే అనుమానమొచ్చింది. వేలెడంత లేదు పోరి అని కలవరపడిరది. అన్నా! నీకు, నీ సంబంధానికి దండం, నీ సంబంధం మాకొద్దు అని కొడుకును తీసుకుని వెళ్ళిపోయింది ముత్యాలమ్మ. కాశిరెడ్డి మనసు విరిగిపోయింది. దీంతో ఎచ్చమ్మను మళ్ళీ పాలమూరు పంపడానికి నిర్ణయించుకుంటాడు. ఈ సంబంధం వద్దు, ఎచ్చాల్ని మళ్ళీ పాలమూరు పంపించెయ్యి అని భార్యకు చెప్పి కాశిరెడ్డి బయటకు పోతాడు. అలాగని నిర్ణయం అయిపోయింది. అయితే ‘ఆ ఒక్క నిర్ణయంతో ఆ పిల్ల భవిష్యత్తులో శుభోదయం’ అంటూ కథను ముగిస్తారు యశోదారెడ్డి. ఇలా ఒక పద్ధతి ప్రకారం కథను నడపడంలో ప్రతిభ చూపించారామె.
తెలంగాణ కథా సాహిత్యంలో బండారు అచ్చమాంబ, సురవరం, వట్టికోట, భాస్కరభట్ల, నెల్లూరు కేశవస్వామి, బూర్గు రంగనాధరావు, నందగిరి ఇందిరాదేవి, ఇల్లెందుల సరస్వతి, సురమౌళి, జి.రాములు, గూడూరు సీతారాం… ఇలా ఎందరో కథానిక రచనల్లో విశిష్టతను గడిరచారు. వీరిలో పాకాల యశోదారెడ్డి తన కథాసాహిత్యంతో పుట్టిన నేల రుణం తీర్చుకున్నారు. వీరి కథానికల్లో తెలంగాణ మాండలిక భాష అన్నిటా కనిపిస్తుంది.
యశోదారెడ్డి కథారచన 1950 దశకంలో ఆరంభమై 1956 తర్వాత 1960, 70 దశకాల్లోనే ఎక్కువగా సాగిందని చెప్పాలి. ఆమె మొదటి కథల సంపుటి ‘‘మా ఊరి ముచ్చట్లు’’ 1973లో అచ్చయింది. ఆ తర్వాత 1999లో ‘‘ధర్మశాల’’, 2000లో ‘‘ఎచ్చమ్మ కతలు’’ అచ్చయ్యాయి. పబ్లిషర్లు ఎక్కువగా మార్కెటున్న నవలలను అచ్చు వేసినట్లుగా కథలను వేయటానికి ముందుకు రాలేదు. ఆమె సొంతంగానే కథలను అచ్చు వేసుకోవలసి వచ్చింది. కాబట్టి, ఆమె కథలు తెలంగాణా కథకులందరి కథల్లాగానే ఆలస్యంగానే పుస్తక రూపంలో వచ్చాయి. కానీ రేడియోలో చదవటం చేత, ఆంధ్రప్రభ, జ్యోతి, స్వాతి, ప్రజాతంత్ర వంటి పత్రికల్లో ఆమె కథలు అంతకుముందే అచ్చు కావటం చేత, 1960ల నాటికి ఆమె కథా రచయిత్రిగా పేరు సంపాదించుకుంది. ‘‘మా ఊరి ముచ్చట్లు’’, ‘‘ఎచ్చమ్మ కతలు’’లోని కథల్లో కథనం, సంభాషణలు అంతా మాండలికంలో ఉన్నాయి. ‘‘ధర్మశాల’’ కథలు ప్రామాణిక భాషలో ఉన్నాయి. ఆమె ‘‘విచ్చిన తామరలు’’ మాండలికంలో వ్రాయలేదు, ఆ కథలో మాండలికం వాసనలు లేవు. కానీ, 1956 నుంచి ఆమె కథలను ఆద్యంతం అచ్చమైన తెలంగాణ మాండలికంలోనే వ్రాశారు.
యశోదారెడ్డి రచించిన కథల్లో వస్తువు ఇతివృత్తం కన్నా కథనం పాఠకుల్ని ఎక్కువ ఆకర్షిస్తుంది. కథలో ఒక్కొక్కసారి వస్తువుకు ప్రాధాన్యం లేదన్నట్లనిపిస్తుంది. కథలో వస్తువు ఉన్నా సన్నివేశాలు, సంఘటనలు తక్కువగా ఉంటాయి. కథనం, వర్ణనలు ఎక్కువగా
ఉంటాయి. పాత్రల మనోగత భావాల వర్ణనలు, స్వగతాలు చాలా దీర్ఘంగా ఉంటాయి. కథల్లో కథనం ఎక్కువగా రచయిత్రి చెప్పటమే, అంటే సర్వసాక్షి కథనమే ఎక్కువగా ఉన్నా ‘‘ముమ్మైకత’’ వంటి కొన్ని కథల్లో పాత్రల ఆలోచనల స్వగతం రూపంగా, కథనం సాగించటం కనిపిస్తుంది. ‘‘కోడలమ్మ ఎతలు’’ కథలో ఇంట్లో కోడలికి స్వాతంత్య్రం, స్వేచ్ఛ, తనదైన వ్యక్తిత్వం, తనవైన ఆలోచనలు ఉండవు. ఏది చేసినా ఇంట్లోవాళ్ళు తప్పు పట్టారు. ఈ కథ కోడలమ్మ ఆలోచనలు స్వగతం రూపంగా కూసుంటె నడిచింది. కోడలు తన పరిస్థితిని గురించి ఇట్లా అనుకుంటుంది, ‘‘తప్పులేస్తే తప్పు అయ్యో! దేవుడా! కూసున్మం లేస్మం అట్లవెట్టి నానెత్తి నేను దువ్వ్వుకున్నా తప్పే! దువ్వుకోకుంటే అంతకన్నా తప్పు. తుమ్మిన తప్పే దగ్గిన తప్పే!’’ కోడలు పడే కష్టాలను రచయిత్రి చాలా సహజంగా, వాస్తవికంగా చిత్రించారు. ‘‘ముమ్మైకత’’తో అమ్మణి పాత్ర కథ చెప్పినట్లుగా పాత్ర దృష్టి కోణంతో ఉత్తమ పురుషలో కథనం నడిచింది.
సర్వసాక్షి కథనంలో మధ్య మధ్య పాత్రల మనస్సులో సాగే ఆలోచనల రూపంగా కథనం నడిపిన సందర్భాలు
ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు ‘‘మ్యానరికం’’ కథలో మొదటి రెండు పేజీలు కమలమ్మ పాత్ర ఆలోచనలు, స్వగతం రూపంగా కథ సాగుతుంది. తర్వాత సర్వసాక్షి కథనం కనిపిస్తుంది. పాత్రలకు పేర్లు పెట్టేటప్పుడు కూడా తెలంగాణలో ఉండే పేర్లను, లేదా తెలంగాణ
ఉచ్ఛారణలో ఉండే పేర్లను యశోదారెడ్డి తీసుకున్నారు. కమలమ్మ అనుకోకుండా ‘కములమ్మ’ అనటం, ‘రాధమ్మ’ అనకుండా ‘రాదమ్మ’ అనటం, ‘చెన్నబసప్ప’ అనకుండా ‘చెన్నబసప్ప’ అనటం ‘శివమ్మ’ బదులుగా ‘శివ్వమ్మ’ అనటం… అట్లా కథలో వాతావరణాన్ని సృష్టించటానికి ఆమె తెలంగాణ ప్రాంతపు ఉచ్ఛారణలతో ఉన్న పేర్లనే వాడారు.
రచయిత తన అనుభవాలను నిశిత దృష్టితో చూసిన విషయాలను ‘‘మెదడులో ఓ మూల స్థిరనివాసాన్ని ఏర్పరచుకుంటాయి. ఆ అనుభవసారమే రచయితకు నిగూఢ నిధిలా ఉపకరిస్తుంది’’ అని ఆమె గుర్తించారు. అందుకేనేమో యశోదారెడ్డి చాలా కథల్లో ఆమె చిన్ననాటి పల్లెటూళ్ళు, అక్కడి మనుషులు, పేర్లు, అప్పటి జీవితం, సంస్కృతి ప్రతిబింబించి కనిపిస్తాయి.
యశోదారెడ్డి రచనారంభ కాలంలో వ్రాసిన ‘‘నాగి’’, ‘‘ముమ్మైకత’’, ‘‘మా పంతులు’’ కథల్లో ఆమె బాల్య జీవిత, బాల్యానుభావాలు ప్రతిబింబించాయి. నాగి పేదరికం, ఆకలితో దొంగగా మారుతుంది. అల్లరి చిల్లరిగా తిరుగుతుంది. పట్నంలో చదువు చాలించుకొని వచ్చిన రాంరెడ్డి నాగిని చూసి బాధపడతాడు. ఆ పిల్లను చేరదీసి ‘పొట్టనిండా అన్నం బెడ్త, పై నిండ బట్టలిస్త, ఆ దొంగతనం గింగతనం మాని పనిజేస్తవ?’ అని అడుగుతాడు. నాగి బువ్వబుట్ట దొరికిం తర్వాత బుద్ధిమంతురాలవుతుంది. మనిషి మీద పరిసరాల ప్రభావం ఉంటుందని నిరూపించే కథ ఇది. ‘‘ముమ్మైకత’’ ఒక చిన్న పిల్ల తన చిన్ననాడు ఎత్తుకొని ఆడిరచిన అమరసింగును చూసి గుర్తుపట్టక వాడు తనను కాలే నూనెలో వేసి ‘‘ముమ్మై’’ అంటే ‘‘మోమ్‌’’ మైనం చేసేవాడని భయపడుతుంది. తర్వాత అమరసింగు ఇంటికి వచ్చి తనను పరిచయం చేసుకోవటంతో ఆ పిల్ల భయం వదులుతుంది. సామాన్యంగా చిన్నపిల్లల్లో ఎత్తుకుపోతారని, జోలెలో వేసుకొని పోతారని, కుక్కపిల్లలుగా జేసుకొని వెంట తీసుకుపోతారని… ఇటువంటి భయాలు చోటుచేసుకుంటాయి. అలా భయపడే ఒక చిన్నపిల్ల వృత్తాంతాన్ని యశోదారెడ్డి ఈ ‘‘ముమ్మైకత’’లో చెప్పారు. అది ఆమె చిన్ననాటి స్వానుభవం, స్వానుభూతుల నుంచి వచ్చిన వృత్తాంతమేమో! ‘‘మా పంతులు’’ కథలో ఒక చిన్న బడి పంతులు గురించి బడిలో రోజూ జరిగే విషయాల గురించి యశోదారెడ్డి కండ్లకు కట్టేటట్లుగా వర్ణించింది. నిజాం కాలంలో తెలుగుబడులు… అంటే తెలుగు నేర్పే బడులు తక్కువ. నిజాం పాలన పోయి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్కూలును అప్‌గ్రేడ్‌ చేసి ఊరిమనిషి టీచరుగా పనికిరాదని, తెలుగు రాదని, తెలుగు బాగా వచ్చినోడు కాదని ఏరవతలోడిని టీచరుగా నియమిస్తారు. అమాయకులైన పిల్లలు ‘‘పంతులూ!’’ అనుకుంటూ కడ్పదాటి ఎంట ఊర్మటంతోటి రచయిత్రి కథను ముగించింది. ఈ కథలో 1930, 40ల్లో ఊరిబడులు వీథిబడులుగా ఎలా ఉండేవి, తెలుగు పాఠాలేమేమి చెప్పేవాళ్ళు అనే చాలా విషయాలను తెలిపారు రచయిత్రి.
‘‘మ్యానరికం’’ కథలో తల్లి తన కొడుక్కి అన్న కూతురును చేసుకోవాలని కోరుకొని కొడుకును అన్న ఇంటికి తీసుకు పోతుంది. ఆమె అన్నకు తన కోరిక చెపుతున్నప్పుడే మేనకోడలు తన కొడుకు తలమీదున్న తిరుపతి వేంకటేశ్వరుని మొక్కయిన పొడవైన వెంట్రుకలను కత్తిరించడం చూసి అలిగి నీ కూతురు సంబంధం వద్దని వెళ్ళిపోతుంది. ఇదే ఇతివృత్తం ‘‘గంగిరేగి చెట్టు’’ కథలో ఉంది. ఆ కథలో మేనకోడలు ఎచ్చమ్మ. ‘‘ఎచ్చమ్మ’’ అంటే ఏశమ్మ, యశోదయే. అంటే చిన్ననాటి యశోదారెడ్డియే. ఎచ్చమ్మ గంగిరేగి చెట్టు మీదికి వంగిన బావ వీపు మీద కాలు పెట్టి ఎక్కి దిగుతుంది. ఆ దృశ్యం చూసిన ఎచ్చమ్మ మేనత్త ఈ పిల్ల ముందు ముందు తన కొడుకు మీద పెత్తనం చెలాయిస్తుందని, అటువంటిది తనకు కోడలిగా పనికిరాదని కోపంతో వెళ్ళిపోతుంది. రెండు కథల ఇతివృత్తం ఒక్కటే అయినా రెండు కథలను పూర్తిగా వేరు వేరు భాషతో, యాసతో, పాత్రలతో, సంభాషణలతో, వాతావరణంతో, శిల్పంతో నడపడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రెండు కథల్లో పాటించిన యశోదారెడ్డి కథా నిర్వహణా నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేము!!
‘‘పీర్ల పండుగ’’ కథలో హిందువులు కూడా భక్తి నిష్టలతో పీర్లను ఎత్తుకుంటారు. మత వైషమ్యం లేకుండా ఒకే మతస్తులుగా మెదులుతుంటారు అనే ఇతివృత్తముంది. ‘‘జతగాళ్ళు’’ కూడా హిందూ ముస్లింల సఖ్యతను చెప్పే కథనే. సీతక్క రాధమ్మ స్నేహితులు. సీతక్క కొడుక్కు, మొగుళ్ళ రోగం వస్తే తురక ఫకీరును ఆశ్రయిస్తుంది. కొడుక్కు నయం కావటంతో ఆమె ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో దర్గాకు పోతుంటుంది. సీతక్క ముస్లిం మతాన్ని విశ్వసించటం రాధమ్మకు ఇష్టముండదు. ఇద్దరి స్నేహం బీటలు వారుతుంది. రాధమ్మ కొడుకు గోపాల్‌ సెలవుల్లో ఒకరోజు తన ముస్లిం దోస్తు రహీంను వెంటతీసుకుని ఇంటికి వస్తాడు. రహీం సత్ప్రవర్తనను, తన కొడుకుకు అతనితో ఉన్న స్నేహ సంబంధాన్ని చూసి రాధమ్మ హృదయం పశ్చాత్తాపానికి గురవుతుంది. ‘‘సీతక్కను అనరాని మాటలంటి, ఇంత కుంపటి నాతండ్రి నా ఇంట్లో వెడ్తడని నాకు దెల్వకపాయె. గిట్లని ఎరుక ఉంటే కులం తలం ఈడూ జోడూ మాట మన్నిక గలిసిన పిల్ల సీతక్క బిడ్డను వొద్దనకపోదును గదా!’’ అనుకొని మళ్ళీ సీతక్కతో స్నేహం కడుతుంది. ఆమె కూతురును తన కొడుక్కు చేసుకోవటానికి ఒప్పుకుంటుంది. ‘‘జోగుళయ్య’’ కథ ఒక శైవ కుటుంబానికి చెందినది. జంగం శెన్నబసప్ప పెద్ద కొడుకు నాగప్పకు బంగు అలవాటు ఉంటుంది. దాంతో అతడు ఒకసారి పోయి పోయి సాధువుల్లో కలిసిపోయి నాగయోగి అవుతాడు. మఠంలో ఒకరోజు పెద్ద యోగిని తనకు సన్యాసం ఇప్పించమని అడుగుతాడు. అప్పుడు పెద్ద యోగిని ‘నీవు నీ ఇంటికిపోయి వారం రోజులు గడిపిరా. వచ్చినంక ఆలోచిస్తామ’ని అంటాడు. నాగయోగి ఇంటికిపోయి తల్లిదండ్రులను, భార్యను చూసి మళ్ళీ కుటుంబ మోహంలో పడిపోతాడు.
‘‘ఎంకన్న’’ కథ ఒక విచిత్రమైన కథ. సీతక్క అనే ఆవు మందలో ఉన్న ఏ కోడెనూ దగ్గరికి రానీయదు, కడ్తలేదు. ఆ ఊరిలోని వెంకట్రామిరెడ్డి ఒక కోడెల జతను కొనుక్కొస్తాడు. ఒక కోడెను నాగిరెడ్డి అడిగితే అతనికి ఇచ్చేస్తాడు. మిగిలిన కోడె ఎంకన్న. ఎంకన్నను చూసి సీతమ్మ, సీతమ్మను చూసి ఎంకన్న ఇష్టపడతారు. సీతమ్మ లక్ష్మిని కంటుంది. ఈ కథలో యశోదారెడ్డి సీతమ్మ, ఎంకన్న పశువుల ప్రేమను ఒక స్త్రీ, పురుషుల మధ్య ఉండే ప్రేమగా వర్ణించి రక్తి కట్టించారు.
‘‘మురారి’’ కథలో ఒక సాధువు ఒక ఊరికి వచ్చి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఊరిని అబివృద్ధి చేస్తాడు. ఏ ప్రలోభాలకూ లొంగడు. ఆ ఊరి పెద్ద రామచంద్రయ్య. అతని చెల్లెలు శాంతమ్మ. ఆమె పట్నంలో చదువుతున్నప్పుడు మురారి ఆమెను ప్రేమిస్తాడు. కానీ శాంత సన్నిపాత జ్వరం వచ్చి చనిపోతుంది. ఆమె మీది ప్రేమతో ఆమె మరణం తర్వాత మురారి విరాగిjైు ఆమె పుట్టిన ఊరికి వచ్చి సమాజసేవ చేస్తున్నాడని కథ చివర తెలుస్తుంది. వస్తువులో విశేషం లేకున్నా, సాధువుగా మురారి చేసిన మంచి పనులను, సాధువును చూసి ఆ ఊరి కన్యలు ప్రేమలో పడిన తీరును రచయిత్రి చక్కని శైలిలో వర్ణించారు.
మాండలిక పదాలు: యశోదారెడ్డి అప్రయత్నంగానే తెలంగాణాలో ప్రజల నోళ్ళలో ఆడే ఎన్నో అచ్చమైన తెలుగు నుడికారాలను, పలుకుబడులను తన కథల్లో వాడారు. ఆ సారిసెకే పోతుండ, మిటికెళ్ళన్ని ఇరుస్త, ఆకు మరుగు పిందోలె, ఊరిచ్చి ఊరిచ్చి చెప్తున్న, కావలిచ్చుకొని, మీకంత కష్టమైనా దుర్ల, నా కొడుకు మీ కండ్లకానంది మీ ఇంట్ల నేనెందుకు, ముద్దిచ్చుకున్నది, మళ్ళీ కాపిరం జేస్తవని నా కోర్కె సామాను పెట్టుకొనికె తనబ్బీలుండేవి, ఏగిర్తవడలేదు, వొణ్కలేదు, గేరొచ్చి బాటల సుట్కపడేవు, కట్టున కదిలింది (గుంపుగా నడిచింది), నా సొతాగ జూసిన, ఎవరి ఎచ్చులు వాళ్ళవి, సెరిసగం రాత్రి దాంక, తెల్లారెట్యాళ్ళకు, పోయొస్తా పదిలం ఇల్లు, కంట్ల కనుపాపను దీసినట్లు, మిర్రెక్కి కూసున్నది, తన రక్త సమందం మీద గుంజదా, నెయ్యి గారంగ గార్వంగ ఎంచె మరి, బూమికి మొగులుకు అంటకుండ యాళ్ళాడ్తలేమంట, కాపిరం కంపల వడ్డది, మిర్గం బూనకముందె లగ్గం గావాలె, పారజూసింది, మనమెవ్వరం ముడేసేటందుకు ఇడ్సెటందుకు, సిగ్గూ శరము పురాగ సిట్టెడు గుగ్గిళ్ళ కమ్మినట్లు సాండవు, ఏడిసిన కన్ను దుడ్సినట్లు, మన ఎల్తోటి మన కండ్లు వొడిసే కాలం, ముదురుకొని గంగెద్దోలె నెత్తి ఊపింది… వంటి ఎన్నో తెలంగాణ నుడికారాలను యశోదారెడ్డి తన కథనశైలిలో, పాత్రల సంభాషణల్లో వాడారు.
తెలంగాణాకే పరిమితమై తెలుగులో ‘శిలాజాలు’ ‘ఫాసిల్‌’గా నిలిచిపోయిన అచ్చమైన తెలుగు పదాలను యశోదారెడ్డి తన కథల్లో అడుగడుగునా ప్రయోగించారు. ఆపతి, తిప్పలు, కులం తలం (కులం హోదా), కడ్పుమసిలి, నెత్తురుకండ (రక్త సంబంధం గల), ఎన్క కట్టువడ్తరు, ఆరివారం (ప్రేమ), జోలి, బింకి (లొట్టి), అంగీ, గునియుట, ముర్మ సూసుడు, పొంటి, యాడివి, యాడ, కుందేరు, శమ్ల (తలపాగ), తండ్డాడు (బాధపడు), కుత్కె, గదుమ, దొర్మిచ్చుకొని, పాటిచ్చిచూ, తనబ్బీ, యారాలు, ఒక్కపారె, నీల్గుడు (గర్వం), కాపాయం (పొదుపు), మైదులోడు (మత్తుచల్లి ఎత్తుకపోయేవాడు), పెబ్బ (పెద్ద), గాసీం, రివాజు, పొర, లొల్లి, తస్తరి (పళ్ళెం), ఎక్కటేసింది, సొరికె, గొల్క (చెవులకు ముక్కుకు వేలాడే లోలకు), వాలాయించి, ఏలంతపోరి, యాజ్జేస్త, కాకరొడ్లు (బాస్మతి), వైనాలు, బుగులు, వయి (పుస్తకం), యాట, కీస, నాదాని (తలవంపు), అరుసుకొనుడు బర్మి (దుస్సి), దూప. గిర్క బర్తి (బరువు), ఉర్మినం, తోల్కరమ్మని, బర్రు, మెత్త, తీరుమాణం (తీరికగా), దీరాలు (సాధింపులు), తేరువాటుగ, ఎచ్చులు, మిడికి (బాధపడి), రంతు… వంటి తెలంగాణాలో ప్రజల నోళ్ళలో ఆడే ఎన్నో తెలుగు పదాలను యశోదారెడ్డి తన కథల్లో వాడారు. యశోదారెడ్డి పుట్టిన పాలమూరు జిల్లా బిజినేపల్లి గ్రామం ప్రాంతంలో ఉండే యాసతో కూడిన పదాలను, నుడికారాలను ఆమె చాలా చోట్ల కథల్లో ప్రయోగించారు. ల్యాక (లెక్క), ఆడివిల్ల, కాపిరం, సాళ్ళె, ఇంగ, యాది (ఏది), ఎతకత (మంచి చెడ్డ), ఇనవస్తి, నోట్ల్య దుసిపడ్డట్లు, న్యాల సెనక్మాయ, ఇంకా ప్రాణవార్తికం (ప్రేమ), తుర్తుల (తురంత్‌ R తొందరగా), తిర్మం (తిరగటం), వొస్తుండరు, కదుల్కం మెదుల్మం చేయకున్కి మొదలైన ఎన్నో పాలమూరు యాసతో కూడిన పదాలు యశోదారెడ్డి కథల్లో చోటు చేసుకున్నాయి.
యశోదారెడ్డి కథల్లో వస్తువు, కథనం, కథన శైలి, పాత్రలు, సంభాషణలు, స్వగతాలు, ప్రకృత్యాది వర్ణనలు అన్నీ విలక్షణంగా ఉంటాయి. ఆమె ఇతర ప్రాచీనమైన గాని, సమకాలికమైన గాని, కథా రచయితల రచనలను కథల తీరుతెన్నులను గమనించినట్లు గాని, వాటిచేత ప్రభావితమైనట్లుగా గాని కనిపించదు. ఆమె తనకు నచ్చిన, తను చూసిన, తనకు తెలిసిన సమాజాలను, మనుషులను, సంఘటనలను, వృత్తాంతాలను తీసుకొని కథలుగా వ్రాశారు. ప్రతి పాత్రను, ప్రతి సన్నివేశాన్ని పాఠకుల కండ్ల ముందు నిల్చేటట్లుగా చిత్రిక కట్టేటట్లుగా వర్ణించింది. సంఘంలోని దురాచారాలను వ్యతిరేకిస్తూ, తన కథలతో ఒక సందేశాన్నిస్తూ సాహిత్య సృజన గావించిన పాకాల యశోదారెడ్డి అక్టోబర్‌ 7, 2007న కన్నుమూశారు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.