ఇది మాలపల్లి శతజయంతి సంవత్సరం… అంటే రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ గారి శతజయంతి సంవత్సరం కాదు… వారి రచన మాలపల్లికి జరుగుతున్న శతజయంతి ఉత్సవం.
బహుశా అంటరానితనం మీద, దళిత జీవన అణచివేతల మీద, దోపిడీ పీడన, అవమానాల మీద ఏ మాత్రం విలువలేని వారి మాన ప్రాణాల గురించి, కులవర్గ దృక్పథంతో తెలుగు సాహిత్యంలో వచ్చిన విశిష్టమైన మొట్టమొదటి నవల ‘మాలపల్లి’ కావచ్చు నాకు తెలిసినంతవరకు. సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయోద్యమం, దళిత జనోద్ధరణ మాలపల్లి వస్తు నేపథ్యం. ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు, తెలుగు వచన సాహిత్య వైతాళకుడు అయిన ఉన్నవ లక్ష్మీనారాయణ గారు 1922లో రాయవేలూరు జైలులో ఉన్నప్పుడు ఈ బృహత్ నవలను రాయడం జరిగింది.
… అంటే 2021లో మొదలుపెట్టి మొదటి భాగం ప్రచురించి, మరికొన్నాళ్ళకి 2023లో రెండో భాగం పూర్తి చేశారు.
తీవ్రమైన వర్ణ వ్యత్యాసాల నేపథ్యంలో భూస్వాముల శ్రమదోపిడీ మూలంగా దుర్భరమైపోయిన అట్టడుగు వర్గాలు, వారి సాంఘిక ఆర్థిక జీవన స్థితిగతులు, వలస పాలన మూలంగా అస్తవ్యస్థమైపోయిన గ్రామాలు… ఆ విధంగా తన సమకాలీన సమాజాన్ని, వలస ప్రభుత్వ వ్యవస్థను, నిర్భయంగా బూతద్దం కింద పరిశీలించినట్లుగా చిత్రించబడిన నవల మాలపల్లి.
వలస పాలనకి వ్యతిరేకంగా ప్రజల్లో బలంగా రేగుతోన్న ఆందోళన, స్వాతంత్య్ర కాంక్ష, సరిగ్గా అప్పుడే గాంధీజీ రాజకీయ రంగ ప్రవేశం పట్ల పెరుగుతున్న ఆదరణ… ఆ సమయంలోనే రష్యాలో బోల్షెవిక్ ప్రేరణతో మన దేశంలో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం, మొలకెత్తుతున్న అభ్యుదయ భావాలు… ఈ విధమైన సమాజ పరిస్థితుల నేపథ్యంలో నుండి అంటే.. నిజానికా నాటికి భావ కవిత్వం, శృంగార రస ప్రధానమైన రచనలు విరివిగా వెలువడుతున్న సమయంలో అత్యంత ఆధునిక భావజాలంతో ఉన్న మాలపల్లి నవల వెలువడటం ఒక అద్భుతమైన విశేషం. బోల్షెవిక్ ఉద్యమ ప్రేరణతో అభ్యుదయ భావాలతో, కుల వివక్షత లేని సమాజాన్ని, ఆర్థిక అసమానతలు లేని వ్యవస్థని కలగంటూ
ఉన్నతమైన విలువలతో ఉన్నవ వారు మాలపల్లి నవలని ఆవిష్కరించారు.
నవలలో ఈ బోల్షెవిక్ భావజాలం గురించి విజయవాడలో జరిగిన ఆది ఆంధ్ర మహాసభలో వెంకటరెడ్డి సభికులందరికీ వివరించడం మనకి కనపడుతుంది. ఈ వెంకటరెడ్డి పాత్ర నిజ జీవితంలో భాగ్యరెడ్డి వర్మ అని విజ్ఞుల విశ్లేషణ. ఈ భాగ్యరెడ్డి వర్మ తొలి దళితవాది, తొలి సామాజిక న్యాయవాది అని మనకు తెలుస్తోంది. బహుశా బోల్షెవిక్ విప్లవం నుండి ప్రేరణ పొందిన మొట్టమొదటి తెలుగు సాహిత్యవేత్త ఉన్నవ వారే కావచ్చు.
… … …
ఉన్నవ వారు గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా వేదులపాడు గ్రామంలో 1877లో జన్మించారు. మంగళాపురంగా చెప్పబడిన ఈ నవలా స్థలం ఉన్నవ వారి గ్రామమే కావచ్చు, లేదా అటువంటి మరొక పల్లె కావచ్చునని సాహితీవేత్తల అభిప్రాయం.
సంఘ సంస్కరణాభిలాషి అయిన ఆయన అనాధల కోసం, వైధవ్యం పొందిన స్త్రీల గురించి, అణగారిన వర్గాల ఉన్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారు. తన సామాజిక వర్గం నుండి ఆనాటికి ఆయనకు ఎదురైన అనేక నిరసనలని ఎదుర్కొంటూ వితంతు వివాహాలను జరిపించి గుంటూరు వీరేశలింగంగా పేరు పొందారు ఉన్నవ. 1902లో వితంతు శరణాలయం స్థాపించి, వారికి ఎంతగానో అండగా నిలిచారు. సరిగ్గా అదే సంవత్సరం మన ఆంధ్రదేశంలోని బందరులో బృందావన సమాజం అని తొలి స్త్రీల సంఘం స్థాపించి స్త్రీ విద్య కోసం, స్త్రీ జనాభ్యుదయం కోసం భండారు అచ్చమాంబ గారు అవిరళ కృషి సాగిస్తూ ఉన్నారు.
ఉన్నవ వారు ఐర్లాండ్‌లోని డబ్లిన్గ్ యూనివర్సిటీలో బారిస్టరీ పాసై, స్వదేశానికి వచ్చిన పిదప మొదట మద్రాసులోని హైకోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టినప్పటికీ, తర్వాత ఆ వృత్తిని వదిలి స్వచ్ఛందంగా జాతీయ ఉద్యమంలోకి నడిచారు. ఆ సమయంలో ఆయన తన సొంత ప్రాంతమైన పల్నాడు చేరుకునేసరికి అక్కడ వలస పాలనకి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు నడుస్తున్నాయి. ఆ నేపథ్యంలో పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో యువకులకి నాయకత్వం వహించినందుకు గాను ఉన్నవ వారిని అరెస్టు చేసి రాయవేలూరు జైలుకు పంపడం జరిగింది. అక్కడ జైలులో ఉన్న సమయంలో, సుదీర్ఘమైన మాలపల్లి నవలని వారు రాయడం జరిగిందని మనందరికీ తెలుసు.
762 పేజీల ఈ బృహత్ నవలని ఆయన రాయవేలూరు జైలులో ఉండగా 1921లో మొదలుపెట్టి 1922లో మొదటి భాగం, 1923లో రెండవ భాగం పూర్తి చేశారని కూడా మనకి విదితమే. ఆనాటికి అనన్య సామాన్యమైన సమాజ స్పృహతో, ఆధునిక భావజాలంతో అణగారిన వర్గాలకు సంబంధించిన అనేక రకాల సమస్యలను కుల, వర్గ దృక్పథాల నుండి లోతులకెళ్ళి చర్చించిన అపురూపమైన నవల మాలపల్లి. ఈ నవలకి కాశీనాధుని నాగేశ్వరరావు గారి పీఠిక ఎంతైనా తగి ఉన్నది.
ఆనాటి వలస ప్రభుత్వం మాలపల్లి నవలని నిషేధించిందని మనందరికీ తెలుసు. మళ్ళీ 1928లో కొన్ని మార్పులతో మాలపల్లి నవల ప్రచురించబడిరది. అయితే మళ్ళీ 1935లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ నవలను నిషేధించింది. ఆ తరువాత 1937లో సి.రాజగోపాలాచారి గారు మద్రాసు ప్రధాని అయి, కాంగ్రెస్ మంత్రివర్గం ఏర్పడిన తర్వాత మళ్ళీ మాలపల్లి నవల ప్రచురణకు నోచుకుంది.
ఈ నవలకి ఇంత చారిత్రక నేపథ్యం ఉంది. 1958లో ఆచార్య రంగా గారు ఈ నవల గురించి మాట్లాడుతూ టాల్‌స్టాయ్ రాసిన ‘వార్ అండ్ పీస్’ నవలతో పోల్చదగిన గొప్ప నవల మాలపల్లి అని కితాబు ఇచ్చారు.
ఒక రచయిత శత జయంతిని జరుపుకోవడం అనే సాంప్రదాయం మనకి ఉంది, కానీ ఒక నవల నూరు సంవత్సరాల పాటు తెలుగు సాహిత్య వేదిక మీద నిలబడి శతజయంతిని జరుపుకోవడం నిజంగా అత్యంత అభినందనీయం. అయితే నూరేళ్ళ క్రిందటి ఈ నవల గురించి ఇవాల్టికీ మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఏమిటీ దీని ప్రాసంగికత?
ఈ నవలలో మాలలు, మాదిగల యొక్క సాంఘిక, ఆర్థిక జీవిత సంఘర్షణ ప్రధాన అంశం.
100 సంవత్సరాల ముందు ఆర్థిక దృక్పథం నుండి, కుల దృక్పథం నుండి, అనేక సమస్యల చర్చకు నెలవైన ఈ నవల నూరేళ్ళ తర్వాత చూసుకుంటే దళితుల జీవితాలలో, ముఖ్యంగా దళిత స్త్రీ జీవితంలో అనుమానాలు, అణచివేతలు, దాడులు, అంటరానితనం… ఈ పరిస్థితులన్నింటిలో చెప్పుకోదగిన మార్పయితే రాలేదన్నది మనందరికీ స్పష్టం. అదే దీని ప్రాసంగికత. అందుకే ఈ నవల గురించి మనం ఇవాళ్టికీ మాట్లాడుకోవలసిన అవసరం ఉంది. అస్పృశ్యతా వ్యతిరేక (కుల వ్యతిరేక) ఉద్యమం, రైతు కూలీ ఉద్యమం, స్వరాజ్య
ఉద్యమం ఇలా మూడు ఉద్యమాలను జమిలిగా, మూడు కోణాల నుండి కథాంశాన్ని అల్లుకుంటూ ఉన్నవ వారు రాసిన అద్భుతమైన నవల మాలపల్లి. సరిగ్గా అదే సమయంలో గోర్కీ రాసిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘అమ్మ’ నవల తెలుగు రూపం వెలుగు చూడడం విశేషం. ‘అమ్మ’ నవలలో కోర్టులో పావెల్ చేసిన సుదీర్ఘమైన ప్రసంగం, ఇక్కడ ‘మాలపల్లి’ నవలలో న్యాయమూర్తి ముందు వెంకట దాసు చేసిన ఉపన్యాసం రెండూ కూడా ఎంతైనా పోల్చదగినవి. ఇప్పుడు ఒకసారి మాలపల్లి కథాంశాన్ని ఒక విహంగ వీక్షణంగా చెప్పుకుంటే…
మాదిగ ఉప కులాల్లో ఒకటైన మాల దాసరి కులస్తుడైన రాందాసు యొక్క కుటుంబ నేపథ్యంలో నుండి కథ నడిచినట్లుగా పైకి మనకి కనిపించినప్పటికీ… మొత్తం ఆనాటి సమాజ పరిస్థితులు, అసమానతలు అనేక కోణాల నుండి నవల పొడుగూతా చర్చకు వస్తాయి. రామదాసు, అతడి భార్య మహాలక్ష్మి, ఇద్దరు కొడుకులు వెంకటదాసు, సంగదాసు, కూతురు జ్యోతి, రాందాసు చెల్లెలు సుబ్బలక్ష్మి భర్త మరణించిన తర్వాత తన కొడుకు అప్పదాసుతో కలిసి వీరితోనే ఉంటూ ఉంటారు. ఇదీ వారి కుటుంబం. తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, కుటుంబ సభ్యులంతా శ్రమిస్తూ జీవిక కొనసాగిస్తుంటారు. కుటుంబమంతా కుల అణచివేతల పట్ల వ్యతిరేకత కలిగినవాళ్ళే. సమాజపు అసమానతల వల్ల కాస్తో కూస్తో చైతన్యం కలిగినవాళ్ళే.
రామదాసు సాత్వికుడు. గాంధేయవాది. సాంప్రదాయంగా ఉండే వ్యక్తి అయినా, అతడి ఇరువురు కొడుకులు కూడా సంఘ సంస్కరణ భావాలు కలిగిన వాళ్ళు కావడం విశేషం. పెద్ద కొడుకు వెంకట దాసు తన తండ్రి పొలంలోనే సాయంగా ఉంటూ పని చేసుకుంటూ ఉంటే, చిన్న కొడుకు సంగదాసు మాత్రం ఎనిమిది వందల ఎకరాల ఆసామీ అయిన నల్లమోతు చౌదరయ్య వద్ద పాలేరుగా పనిచేస్తుంటాడు. చౌదరయ్య తాలూకు ఆ బలుపంతా కూడా పేదవారి కడుపు కొట్టి ఆర్జించిందేనని ఊళ్ళో వినికిడి.
తన యజమాని కరడుగట్టిన భూస్వామి అయినా, చౌదరయ్య చేసే ఆగడాలను, అత్యాచారాలను, దోపిడీలను ఎదుర్కోవడానికి తన తోటి దళిత కూలీలను సంఘటితపరిచి, సమ్మెకు నాయకత్వం వహించడమే కాకుండా దళితులకు విద్య నేర్పించడం కోసం బడులు తెరవడం… ఇలా దళిత జీవన వెలుగు కోసం అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటాడు సంగదాసు.
తన చిన్న కొడుకు రామానాయుడు సంగదాసుతో స్నేహంగా ఉండడం, సంగదాసు చేసే పనులకు ఆర్థిక సాయం అందించడం తెలిసి చౌదరయ్య లోలోపల రగిలిపోతూ ఉంటాడు. జొన్న చేను కోతకొచ్చిన సమయంలో కూలి, గింజల రూపంలో కాకుండా పైసల రూపంలో ఇవ్వాలన్న పెద్ద తలకాయల రహస్యపు ఆలోచనలను పసిగట్టి సంగదాసు తన మిత్రులతోనూ, తమ సామాజిక వర్గంలోని పెద్దలతోనూ సంప్రదించి కూలి పావలా నుండి రూపాయికి పెంచాల్సిన అవసరాన్ని గురించి చర్చిస్తాడు.
అదే సమయంలో సంగదాసు, రామానాయుడు కలిసి గుంటూరులో జరుగుతున్న ఆది ఆంద్ర మహాసభకు వెళ్ళడం, ఇక్కడ కూలీలెవ్వరూ జొన్న చేను కోతకు వెళ్ళకపోవడంతో, ఇదంతా చౌదరయ్యని మరింతగా రగిలిస్తుంది. ఇదంతా సంగదాసు పనేనని మునసబు ప్రచారం చేస్తాడు. ఆ తెల్లవారుజామున గుంటూరు నుండి తిరిగి వచ్చిన సంగదాసుని వ్యవసాయపు పనిముట్టుతో (రాగోలుతో) తలమీద బలంగా కొడతాడు చౌదరయ్య. దానిమ్మ పండులా పగిలిన తలతో సంగదాసు మరణిస్తూ తల్లిదండ్రుల చేతుల్లో చెయ్యేసి మనమే గెలుస్తాం అని చెప్తాడు. ఐదువేలు ఖర్చుచేసి తన కేసు నుండి బయటపడడమే కాకుండా, రామదాసు సాగు చేసుకుంటున్న ఆ పది ఎకరాల భూమి తన పూర్వీకుల అప్పుకు జమ చేయాలని కేసు పెడతాడు చౌదరయ్య.
సహజంగానే అతనే గెలిచి రామదాసు తాలూకు పది ఎకరాలను స్వాధీనం చేసుకుంటాడు. రామదాసు కుటుంబం రోడ్డున పడుతుంది. దాంతో తీవ్రమైన మనోవేదనతో వెంకట దాసు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. సంగదాసు మరణం తర్వాత, రామానాయుడు తన స్నేహితుని అభ్యుదయ భావాలను అందిపుచ్చుకొని, మరింత బలంగా సంఘ సంస్కరణవైపు మొగ్గుతాడు. సంగదాసు పేరుతో సంఘపీఠం అన్న దళిత అభ్యుదయ సంఘం ఏర్పాటుతో దళిత జనాభ్యుదయం కోసం కృషి జరుగుతుంది ఆ ఊరిలో. కాలక్రమంలో దళితేతరులు, ఇతర అగ్రకులాల వారు కూడా ఆ సంఘాన్ని మెరుగుపరుస్తారు.
ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన వెంకటదాసు అడవులలో దూరంగా ఉంటూ తక్కెళ్ళ జగ్గడు అనే పేరుతో ‘సంతాను’లనబడే రహస్య కార్యాచరణ దళాలను ఏర్పాటు చేస్తాడు. ధర్మ కన్నాలు వేయడం ద్వారా సంపన్నులను దోచి పేదవారికి పంచిపెట్టడం అనే ఉద్యమానికి వెంకటదాసు నాయకత్వం వహిస్తాడు. అయితే అంతిమంగా పోలీసులతో జరిగిన ఘర్షణలలో గాయపడి జైలు పాలవుతాడు. కోర్టులో అనేక వాదోపవాదాల తర్వాత న్యాయమూర్తి అతడ్ని ధర్మచోరుడుగా అభివర్ణించినప్పటికీ శిక్షను ఖరారు చేస్తాడు. ఒకవైపు తన ఆస్తినంతా చౌదరయ్య కొల్లగొట్టగా రోడ్డున పడిన రామదాసు దూరంగా వెళ్ళి ఒక సంపన్నుడి ఇంటిలో పనికి కుదురుతాడు. తక్కెళ్ళజెక్కడి అనుచరులు సరిగ్గా ఆ యజమాని ఇంటికి కన్నం వేయడంతో ఆ సంఘటనలో రామదాసు దంపతులకు భాగం ఉన్నదని నమ్మి పోలీసులు వారిని అరెస్టు చేసి సెటిల్మెంటులో కుక్కి వారిచేత నిర్బంధ కూలీలుగా పని చేయిస్తూ ఉంటారు.
సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న పెద్ద కొడుకు వెంకటదాసు చర్యల కోసం కొంతకాలం వీరు అక్కడ ఉండటం జరుగుతుంది. అయితే తీవ్ర గాయాల పాలైన వెంకటదాసు తిరిగి కోలుకోలేక మరణిస్తాడు.
చేతికంది వచ్చిన ఇద్దరు కొడుకుల మరణంతో పాటు కూతురు జ్యోతి కూడా హఠాత్తుగా చనిపోవడంతో దాన్ని తట్టుకోలేక తల్లి మహాలక్ష్మి మరణిస్తుంది. చివరికి జైలు నుండి విడుదలై గ్రామానికి తిరిగి వచ్చిన రామదాసుని చంగ పీఠానికి బాధ్యత వహించమని కోరుతారు ఊరివారు. అందుకు అతడు అంగీకరించక అడవుల్లోకి వెళ్ళి ఒంటరిగా జీవిస్తాడు.
ఈ నవలలో రామదాసు కుటుంబంతో పాటు అనేక ఉపకథలు కూడా మనకి కనిపిస్తాయి. ఇందులోని మరొక ప్రధాన పాత్ర రామానాయుడు. ఇతడు చౌదరయ్య రెండో కొడుకు. తండ్రి మరణం తర్వాత మరింత బలంగా పంచముత్యం వైపు మొగ్గు చూపుతాడు. ఒక క్రమంలో అతడి భార్య తమ దూరపు బంధువుతో లేచిపోయినప్పుడు, ఆ సంఘటనని మనసులోకి తీసుకున్న విధానం, అతడి భౌతికవాద తత్వం ఆనాటికే ఉన్నవ చిత్రించిన తీరు అత్యంత అభినందనీయం.
అలాగే అతడి తండ్రి చౌదరయ్య ఆనాటికే వ్యాపార పంటలైన పత్తి, నీలిమందు వంటివి పండిరచి విపరీతమైన లాభాలు గడిస్తూ ఉంటాడు. కొడుకుని తహసీల్దారుని, మనవడిని డిప్యూటీ కలెక్టర్‌ని చేయాలనుకోవడంలో కూడా ఈ సంపాదన పరదృష్టే మనకు కనిపిస్తుంది. నేడు కార్పొరేట్ చదువుల వెంట పిల్లల్ని పరిగెత్తిస్తున్న తల్లిదండ్రులకు ఒక నమూనా పాత్రగా చౌదరయ్యని ఆనాటికే సృష్టించిన ఉన్నవ దార్శనికత విభ్రమకు గురిచేస్తుంది. కుటుంబమంతా శ్రమించి జీవించే రామదాసు కుటుంబాన్ని, వల్లమాలిన ఆస్తిపాస్తులు కలిగి శారీరక శ్రమ లేకుండా బ్రతికే చౌదరయ్య కుటుంబాన్ని ఒక తులనాత్మక దృష్టితో ఈ నవలలో ఆవిష్కరించినట్లుగా అనిపిస్తుంది.
దళితుడిని కథానాయకుడిగా తీసుకుని రచించిన ఈ నవలలో ప్రధాన కథానాయకుడు సంగదాసు అనుకుంటాం కానీ, నిజానికి మనందరినీ అత్యంతగా మెప్పించే పాత్ర వెంకటదాసు. వీళ్ళిద్దరూ కూడా ప్రధాన నాయకులేనని చెప్పుకోవచ్చు.
సాత్వికుడు, భావవాది అయిన రామదాసు కొడుకులిద్దరూ కూడా భౌతికవాదులుగా ఉంటారు. వెంకటదాసు ఉరఫ్ తగ్గెళ్ళజగ్గడు అనేకసార్లు భారతీయ ఆత్మ వాదము, ధర్మవాదము వంటి వాటిని ఖండిస్తాడు. ఈ వేదాంతాలన్నీ కూడా పేదవారిని దోచుకోవడానికి
ఉద్దేశించబడినవే అంటాడు. మరణించే సమయంలో భగవంతుణ్ణి స్మరించుకోమని తండ్రి అంటే ‘అది ఆత్మవంచన నాయనా’ అంటాడు. ‘నా శిరస్సు వంచను, నా చీలికలు కూడా భగవంతుడికి లొంగవు’ అని సమాధానమిస్తాడు.
ఈ నవలలో అనేకచోట్ల అభ్యుదయ భావాలు నిండిన గీతాలు మనకి కనిపిస్తాయి. అవి పాఠకులను ఎంతగానో చైతన్యపరుస్తాయి. ఈ నవలని ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రాయవేలూరు జైలులో ఉండి రాశారని చెప్పుకున్నాం కదా… జైలు రీతులు, అక్కడి ఉద్యోగుల పోకడలు, జైళ్ళలో సెటిల్మెంట్ ఖైదీల బాధలు… అన్నీ యధాతథంగా చిత్రించబడిన ఒక వాస్తవిక శిల్పంగా అమరిన నవల మాలపల్లి.
ఈ నవలలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ, నైతిక పరిస్థితులే కాకుండా ప్రత్యేకించి మతం గురించి, విమర్శనాత్మక చిత్రణ, సాహిత్య సిద్ధాంతాల పరామర్శ, భాష పద చిత్రణ శిల్పరీతులు, తాత్విక దర్శనం అన్నీ సమపాళ్ళళో కలిసి రూపొందించబడిన నవల మాలపల్లి. నవల అంటే బహుళత్వం, వైవిధ్యంతో కూడిన మానవ సమూహపు సంబంధాలు, వైరుధ్యాలు, సంఘర్షణలు, సమన్వయాల ఆచరణల నుండి సత్య సుందరంగా సారవంతంగా రూపొందే జీవిత చిత్రపటం అంటారు కాత్యాయనీ విద్మహే.
అలా… ఆ ఒక్క చిన్న జీవితంలోనే అనేక జీవితాలయ్యాడు రచయిత అనిపిస్తుంది. ఉన్నవ వారి సామాజిక నిబద్ధత, కార్యాచరణను అర్థం చేయించిన ఈ నవల విభిన్న ధోరణుల మధ్య చర్చకు లేవనెత్తింది.
నగ్నముని గారు ఈ నవలని నాటకీకరణ చేయగా ఏఆర్ కృష్ణ గారు దానిని జీవనాటకం పేరుతో ప్రదర్శించారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రదర్శనలకు నోచుకుంది. చాలా విస్తృతమైన కాన్వాస్ కలిగిన నాటకం ఇది. మనందరికీ తెలుసు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు గాంధీ తత్వం వంట పట్టించుకున్నవారని. విప్లవ పద్ధతిలో కాకుండా గాంధేయ పద్ధతిలో సమానత్వం రావాలని కోరుకున్న వ్యక్తి అయినా, ఈ నవల గొప్ప విప్లవ నవలగా పేరు పొందడం విశేషం.
ఆయన మార్క్సిస్టు కాకపోయినప్పటికీ, అప్పుడప్పుడే రష్యాలో మొదలైన బోల్షెవిక్ విప్లవం వారిని ప్రభావితం చేసిందని ముందే చెప్పుకున్నాం కదా… నూరు సంవత్సరాల క్రితం పరాయి పాలనలో, నిర్బంధంలో నుండి ఇంత అసాధారణమైన, అత్యంత ఆధునిక భావజాలం కలిగిన ‘మాలపల్లి’ వంటి నవల రాసి, తెలుగు ప్రజలను చైతన్యవంతులను చేసిన ఉన్నవ లక్ష్మీనారాయణ గారు చిరస్మరణీయుడు.