కొమెర జాజి… ఇతని గురించి రాయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. నల్లమల అడవితో నా అనుబంధం చాలా గాఢమైంది. నల్లమలలో చాలా ముఖ్యమైన ఒక కృషి గురించి రాయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను.
దీనికి ముందు నేను ఒకసారి మన్ననూరు నుంచి శ్రీశైలం అడవి రోడ్డులో వెళ్తున్నప్పుడు కొంతమంది రోడ్డు పక్కన నడుస్తూ ప్లాస్టిక్ సీసాలను, యాత్రికులు తిని పారేసిన ప్లేట్లు, ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను తీస్తూ వాటిని ఒక పెద్ద బ్యాగ్‌లో వేసుకుంటూ వెళ్తుండడం చూశాను. వాళ్ళు ఏమి చేస్తున్నారో మొదట నాకు అర్థం కాలేదు. వాళ్ళ దగ్గర ఆగి వాళ్ళతో మాట్లాడాను. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎవరు అని అడిగాను. దానికి వారు అటవీ శాఖ వారు తమను నియమించారని, తాము ఈ రోడ్డు మీద వచ్చేపోయేవాళ్ళు, యాత్రికులు పారేసిన వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు సేకరిస్తామని చెప్పారు. అలాగే యాత్రికులు అడవి లోపలికెళ్ళి కూర్చుని తిన్న తర్వాత ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, ప్లాస్టిక్ సంచులు పారేసి వెళ్ళిపోతారని, వాటివల్ల అక్కడ ఉన్న జంతువులకు చాలా నష్టం జరుగుతోందని, ఇవన్నీ గాలికి ఎగిరి అడవి లోపలికి వెళ్ళడం వల్ల వాటిని కొన్ని జంతువులు తింటున్నాయని, తద్వారా వాటికి నష్టం కలుగుతోందని గమనించిన తర్వాత అటవీ శాఖ వారు మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు దాదాపు ఒక పదిమందిని ఈ ప్లాస్టిక్‌ను సేకరించడానికి నియమించారని చెప్పారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను గమనించిన అంశం ఏమిటంటే, వాళ్ళు అడవి లోపల ముళ్ళలో నడుస్తున్నారు కానీ వాళ్ళ కాళ్ళకు మామూలు రబ్బరు చెప్పులు మాత్రమే ఉన్నాయి. మీ పనికి సంబంధించి మీకు ఏమైనా కావాలా అని అడిగితే వాళ్ళు తమకు మోకాళ్ళ వరకు వచ్చే షూస్ కావాలని, అలాగే మిలిటరీ డ్రెస్సు లాంటవి గట్టిగా ఉండి ముళ్ళు గుచ్చుకోనటువంటి డ్రెస్సులు అయితే బాగుంటుందని చెప్పారు. ఇంకొక విషయమేమిటంటే వాళ్ళు ప్లాస్టిక్ సీసాలు ఏరుతున్నారు కానీ వాళ్ళ దగ్గర కూడా తాగడానికి ఆ ప్లాస్టిక్ సీసాలే ఉన్నాయి. మీరు అడిగిన బూట్లు, వాటర్ బాటిల్స్‌ను తప్పకుండా ఇస్తామని వాళ్ళకి ప్రామిస్ చేసి ఒక నెల రోజుల తర్వాత అవన్నీ కొని వాళ్ళ అటవీ శాఖ ద్వారా అందరినీ పిలిపించి వాళ్ళందరికీ పంచడం జరిగింది. వాళ్ళందరూ అవన్నీ వేసుకుని సురక్షితంగా తమ పని చేసుకుంటారని అనుకున్నాను. నీళ్ళ కోసం స్టీల్ సీసాలను ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఉపయోగించడానికి అనువుగా ఉంటాయి. అలా నల్లమలను ప్లాస్టిక్ రహితంగా ఉంచడానికి కృషి చేస్తున్న వారికి మా వంతు సాయం మేము చేశాము.
ఆ తర్వాత కొన్ని రోజులకు కొమెర జాజి అనే వ్యక్తి గురించి ఫేస్‌బుక్‌లో చదివి ఫోన్ చేశాను. తన గురించి వివరాలు చెబుతూ ‘ఫేస్‌బుక్‌లో మీ ఆర్టికల్స్ చదువుతానని, మీరు నల్లమల్లలో ప్లాస్టిక్ సేకరించే వారికి బూట్లు, బట్టలు ఇచ్చిన విషయం కూడా చదివాను అని చెప్పారు. తాను పల్నాడు ప్రాంతం నల్లమల ఏరియా నుండి శ్రీశైలం వేళ్ళే ప్రకాశం జిల్లా వరకు అడవిలో పనిచేస్తానని, రోజూ అడవిలోకి వెళ్ళి యాత్రికులు తిని, తాగి పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి అడవి నుంచి బయటకు తీసుకొస్తానని తన పని గురించి వివరించారు. ఆయన పర్యావరణ ప్రేమికుడు. ఆయన స్వచ్ఛందంగా చేస్తున్న పని వెనుక ఆయనకు అడవి పట్ల ఉన్న ప్రేమ, అడవి అంతరించిపోకూడదనే తపన కనిపించింది. పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో ఆయన ప్రతిరోజూ అడవికి వెళ్ళడం, అడవిలో యాత్రికులు పారేసి పోయిన టన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ని (వాటర్ బాటిల్స్, డ్రిరక్ బాటిల్స్, తిన్న ప్లేట్లు, నీళ్ళు తాగి పారేసిన గ్లాసులు, ప్లాస్టిక్ కవర్లు వంటివన్నీ) ఆయన ఏరి మొత్తం పెద్ద బ్యాగ్‌లో వేసుకుని అడవిలో ఒక చోట పోయడం చేస్తుంటారు. రోజూ అదే పని. టన్నులకొద్దీ ప్లాస్టిక్‌ను అడవిలో సేకరించి అక్కడినుంచి తీసుకొచ్చి ఒకచోట వేసి దాన్ని మళ్ళీ అడవి బయటకు తీసుకురావడం చేస్తుంటారు. అలా చేసే క్రమంలో ఆయన రోజుకు ఎన్నో కిలోమీటర్లు అడవి లోపలికి వెళ్ళి అక్కడినుంచి వీటన్నింటినీ సేకరించి తీసుకొచ్చి అడవిని శుభ్రపరుస్తూ ఉంటారు. ఆయన చెప్పిన ఈ విషయాలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఒక వ్యక్తి ఇంత కమిటెడ్‌గా అడవుల్లోకి వెళ్ళడం, ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించడం చాలా అద్భుతమనిపించింది.
కొమెర జాజి ప్రతిరోజు అడవిలోకి వెళ్ళడం, అక్కడ పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తను, భూమి లోపలి వరకు అతుక్కుపోయిన ప్లాస్టిక్ కవర్లతో సహా తీసుకొచ్చి అడవిలో ఒకచోట కుప్పగా పోసి వాటిని మళ్ళీ అడవిలో నుంచి బయటికి తీసుకెళ్ళి పారవేయడం లేదంటే వేరేచోటికి వేరేవాళ్ళకి అప్పచెప్పడం చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి అడవిమీద ప్రేమతో, జంతుజాలం మీద ప్రేమతో ఒక ఆర్మీలాగా అతనే ఒక సైన్యం లాగా అడవుల లోపలికి వెళ్ళి ఈ పని చేయడమనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆయనతో మాట్లాడినప్పుడు మీకు ఇలాచేయాలని ఎందుకనిపించింది, అడవిలోకి వెళ్ళడానికి మీకు భయం వేయదా, అక్కడ చాలా జంతువులు తిరుగుతుంటాయి, కొన్ని ప్రమాదకరమైన జంతువులు కూడా తిరుగుతుంటాయి కదా అని అడిగితే లేదు మేడం, నాకు భయం లేదు, నన్ను జంతువులు ప్రతి రోజూ చూస్తాయి. నన్ను ఏమీ అనవు, పట్టించుకోవు, నా పని నేను చేసుకుంటాను, నాకు భయమనేది లేదు, భయపడను నేను అని చెప్పారు. అందరం కలిసి అడవిని నాశనం చేస్తున్నాం, పర్యావరణాన్ని నాశనం చేస్తే మానవాళికి చాలా నష్టం జరుగుతుంది, ముఖ్యంగా అడవిని నాశనం చేస్తే మనకేమీ మిగలదు మేడం. బాగా చదువుకున్నవాళ్ళకి కూడా అవగాహన లేదు. అడవిలోకొచ్చి తాగేసిన సీసాలు చెల్లాచెదురుగా పడేస్తారు, పగలగొడతారు. జంతువులు తిరిగే ప్రాంతమని, గాజుల ముక్కలు వాటి కాళ్ళల్లో గుచ్చుకుని గాయాలవుతాయనే ఇంగితం కూడా లేదు. అలా ఎన్నో జంతువులు ఈ సీసా పెంకులు గుచ్చుకుని గాయాలై చనిపోయాయి. జంతువులు గాయాలై కుంటుతూ నడుస్తుంటే నాకు చాలా బాధేస్తుంది అంటూ చాలా విషయాలు చెప్పారు. ఆ రోజు జాజితో మాట్లాడిన తర్వాత ఆయన చేస్తున్న కృషి గురించి రాయాలనిపించింది. అడవి పట్ల, ప్రకృతి పట్ల మనుషులకు కనీస అవగాహన లేకుండా చేసే ఇలాంటి పనుల వల్ల అడవికి ఎంతో నష్టం జరుగుతుంది, అలా జరక్కూడదనే జాజి కష్టపడుతున్నారు.
నేను గమనించిన మరో విషయమేమిటంటే, హైదరాబాద్ నుంచి శ్రీశైలం గుడికి వెళ్ళే యాత్రికులు చేసే అంత విధ్వంసం ఇంకెవరూ చేయటం లేదు. వాళ్ళు వెళ్తూ మధ్యలో ఎక్కడో ఒకచోట అడవిలో ఆగి తిని, తాగి ఆ చెత్తంతా అడవిలోకి విసిరేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఏమనాలి? ఇక్కడ జంతువులు ఉంటాయి, మనం పారేస్తున్న ఈ చెత్తని జంతువులు తినే అవకాశం ఉంది. వాటికి ఎంత అనారోగ్యం చేస్తుంది ఈ పని చేయకూడదన్న ఇంగితం అనేది యాత్రికుల్లో కనబడటం లేదు. రోడ్లమీద అనేక కోతులు కనిపిస్తాయి. వీళ్ళందరూ వాటికి కొబ్బరికాయలు, అరటి పళ్ళు, విసిరేస్తూ ఉండడం వల్ల కోతులు చాలావరకు రోడ్లమీదకు వచ్చి కొట్లాడుకోవడంతో చాలా కోతులు వాహనాల కింద పడి చనిపోవడం జరుగుతోంది. అక్కడ బోర్డు ఉంటుంది కోతులకు ఆహారం వేయకూడదు, వేస్తే పదివేలు ఫైన్ అని. అయినా గానీ ఎవ్వరూ పట్టించుకోకుండా అరటి పళ్ళు విసిరేస్తుంటారు. నల్లమల అడవిలో ఇంత విధ్వంసం జరుగుతున్న క్రమంలో ఈ కొమెర జాజి అనే వ్యక్తి పల్నాడు వైపు నల్లమల అడవిలో చేస్తున్న సేవ, అతని కృషి చాలా గొప్పది. అందరం కూడా కొంతలో కొంతయినా అలా చేయగలిగితే, అది నేర్చుకోగలిగితే అడవిలోకి ప్లాస్టిక్ అనేది రాదు. ప్లాస్టిక్ వస్తే ఆ జంతువులకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంగితం కలిగిన, విచక్షణ కలిగిన మనుషులుగా చేయాల్సిన పని ఇది. జాజి చేసే మరో ముఖ్యమైన పని ఏంటంటే ఆయన అడవిని కాపాడుతాడు. అడవిలో ఉన్న చెత్తనంతా తీస్తాడు. అడవిలో ఎక్కడికైనా వెళ్ళి శుభ్రం చేస్తాడు. అంతేకాకుండా ఆయన ప్రతి సంవత్సరం అడవిలో పెరిగే రకరకాల పెద్ద చెట్లకు సంబంధించిన విత్తన బంతులను తయారుచేసి వాటిని అడవిలో చల్లుతాడు. దానిద్వారా అతను అడవిని పెంచుతున్నాడు. ఎక్కడైతే మొక్కలు ఎండిపోయాయో ఆ ప్రాంతాల్లో ఈ విత్తన బంతులు చల్లుతుంటాడు.
ఆయన ఇప్పటివరకు కొన్ని లక్షల రకరకాల విత్తనాలను బంతులుగా చేసి అడవిలోకి చేరుస్తున్నాడు. ప్రతి సంవత్సరం లక్షలాది విత్తన బంతుల్ని అడవిలో చల్లడం వల్ల అడవి గాఢంగా అవ్వడంతో పాటు ఆ ప్రాంతమంతాపచ్చగా అవుతోంది. జంతువులకు ఆవాసంగా మారుతోంది. అంతేకాదు ఆ చుట్టుపక్కల ఉన్న పాఠశాలలకు, విద్యా సంస్థలకు వెళ్ళి పిల్లలందరికీ పర్యావరణం గురించి అవగాహన కల్పించడం, చెట్లను ఎందుకు పెంచాలి, పర్యావరణాన్ని ఎందుకు రక్షించుకోపవాలి, దానికోసం మనమేమిచేయాలి, చిన్న చిన్న ప్రయత్నాలు ఎలా చేయాలి అనే వాటిని కూడా ఆయన పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. ఆ పిల్లలందరూ కూడా చాలాసార్లు వాళ్ళ పాఠశాలల్లో మొక్కలు నాటడం జరుగుతోంది. అడవిని ఎందుకు ప్రేమించాలి, ప్లాస్టిక్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల భూమి సారం ఏమవుతుంది, భూమిలో కూరుకుపోయిన ప్లాస్టిక్ ఎన్ని వందల సంవత్సరాలైనా కూడా నాశనం కాకుండా భూమిని ఎలా నాశనం చేస్తుంది అనే అంశాలన్నీ కూడా పిల్లలకి చెప్తూ ఉంటారు. ఆ జిల్లా అధికారులు కూడా జాజి సలహాలను తీసుకుంటూ ఉంటారు. పల్నాడు జిల్లా కింద అయిన తర్వాత ఆయన పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారులు అందరూ కూడా ఆయన కృషిని గుర్తించడం జరిగింది. తప్పకుండా ఆయన సలహాలను, సూచనలను తీసుకోవడం కూడా వాళ్ళు మొదలుపెట్టారు. కోటి విత్తన బంతుల కార్యక్రమం చేసినప్పుడు జిల్లా కలెక్టర్ కూడా ఆయననను అభినందించినట్లు కొన్ని పేపర్ కటింగ్‌లలో చూశాను. కాబట్టి ఆయన చేస్తున్న కృషిని మనమందరం కూడా గుర్తించాలి. అలాంటి కృషిని మనం ఎంతవరకు చేయగలుగుతాం అని కూడా ఆలోచిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎక్కడైతే పాడైపోయిన మొక్కలు, ఎండిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ మొక్కల్ని నాటగలిగితే అడవి మళ్ళీ చక్కగా తయారవుతుంది. అలాగే ప్లాస్టిక్ భూతం లాగా అడవిని కమ్మేసుకోకుండా అందరం కృషి చేయగలిగితే చాలా బాగుంటుంది. కొమెర జాజి కృషి గురించి బోలెడన్ని మీడియా కథనాలు వచ్చాయి. అతని కృషి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. జాతీయ స్థాయి మీడియాలో అతని గురించి చాలా వ్యాసాలు వచ్చాయి. అభినందనలు కొమెర జాజి గారికి.
నా పూర్తి పేరు కొమెర అంకారావ్ (జాజి), మా నాన్న పేరు కొమెర రాములు, మా అమ్మ పేరు ఏడుకొండలమ్మ. నాకు భార్య, ఇద్దరు మగపిల్లలు, చిన్నపిల్లలే.
నాకు ప్రకృతి పైన ఆసక్తి కలగడానికి కారణం… అప్పుడు నా వయస్సు మూడు, నాలుగేళ్ళు. అప్పుడు నాకు తీవ్ర అనారోగ్యం కావడంతో నేను బ్రతికే అవకాశం లేదని పెద్ద పెద్ద చదువులు చదివిన డాక్టర్లు మా అమ్మానాన్నలతో చెప్పారట. మూడు సంవత్సరాల చిన్నిప్రాయంలోనే నాకు మూడు ఆపరేషన్లు చేశారట. అనారోగ్యం కారణంగా రాత్రిళ్ళు నిద్రపోయేవాడ్ని కాదట. గుక్కపెట్టి ఏడ్చేవాడ్నట. దాంతో మా నాన్న నన్ను తన గుండెలపై పడుకోబెట్టుకొని మంచి మంచి కథలు చెప్పేవాడు. అందులో కాకమ్మకు కట్టెల గూడు, ఇసుకమ్మకు పరకల గూడు అనే ఒక కథ… ఒక అడవిలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుపై ఒక అందమైన గూడు ఉంది. ఆ గూడులో కాకమ్మ ఉంది, అలాగే ఒక పిచ్చుకమ్మ ఉంది. ఒక రోజు పెద్ద వర్షం వచ్చింది. దాంతో పిచ్చుకమ్మ పరకల గూడు పడిపోయింది. పిచ్చుకమ్మ ఏడుస్తూ కూర్చొంది. కాకమ్మ వచ్చి వెక్కిరించింది. ఇంకా ఆ అడవిలో నల్లటి బొచ్చుతో ఎలుగుబంట్లు ఉండేవి. ఇవన్నీ కుంటలోకి వెళ్ళి నీళ్ళు త్రాగేవి. అలాగే నెమళ్ళు ఎలా ఉండేవి… వంటి వాటితో ప్రకృతిని రకరకాలుగా వర్ణిస్తూ ప్రతి రాత్రి కథలు చెబుతూ ఉండేవాడు మా నాన్న. చాలా ఆసక్తితో వింటూ ఉండేవాడిని. నా చిన్నతనంలోనే నది, ప్రకృతి, కాలువలు, వాటివల్ల కలిగే లాభాల గురించి చెప్పేవాడు. అలాగే వర్షాకాలంలో వాటి వలన కలిగే నష్టాల గురించి కూడా చెప్పేవాడు.
అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. మా ఇల్లు ఊరి చివరలో ఉండేది. దాన్ని ఆనుకునే పెద్ద అడవి ఉండేది. మా ఇల్లు దాటిన తర్వాత నాగార్జునసాగర్ కుడి కాలువ, వెంటనే దాన్ని ఆనుకొని అడవి ఉండేది. చిన్నప్పుడు జీరంగులు పట్టుకోవడానికి అడవిలోకి వెళ్తున్నప్పుడు మా నాన్న చెప్పిన ప్రకృతి అందాలు గుర్తొచ్చి మురిసిపోయేవాడ్ని.
నేను పదవ తరగతి 13వ ఏటనే పూర్తి చేశాను. మా ఇంటి ప్రక్కన కాలువ కూడా ఉండేది. అది దాటి వస్తున్నప్పుడు అక్కడి నుంచి మంచి కూరగాయలు, జామకాయలు తింటుండేవాడ్ని. ఒకరోజు ఒకచోట ఒక చిన్న పిచ్చుక పగిలిపోయిన సీసాలో నీళ్ళు త్రాగుతూ కనిపించింది. బహుశా వర్షపు నీరు అనుకుంటా రంగు రంగుగా ఉన్నాయి. అది చూసి నాకు మనం కల్తీ నీళ్ళు తాగితే అనారోగ్యం పాలవుతాము కదా! అలాగే ఆ పిచ్చుక కూడా అనారోగ్యానికి గురవుతుందేమో పాపం అని ఆనిపించింది. ఈ వ్యర్థాల వల్లే కదా, మనుషులకు, జంతువులకు, పక్షులకు అనారోగ్యాలన్నీ అనుకొని అడవిలోని ప్రాణులకు నష్టం వాటిల్లకూడదనే ఆలోచనతో అక్కడున్న రెండు సీసాలను తీసుకొని అడవి నుంచి బయటకు వచ్చి వాటిని గుంతలో పడేశాను. దాంతో ఆ రోజు నేను చేసిన మంచి పనికి నాకే సంతోషం అనిపించింది.
ఇక తరువాత ఆవులు, గేదెలు రోడ్లమ్మట పడి ఉన్న ప్లాస్టిక్, పాలథిన్ కవర్లను తిని జబ్బులతో అనారోగ్యం పాలవ్వడం, చనిపోవడం తరచూ చూస్తూనే ఉన్నాను. అప్పుడు నాలో పర్యావరణ పరిరక్షణ చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచన రేకెత్తింది. పక్షులే కాకుండా పశువులు కూడా పాలిథిన్ కవర్లలోని ఆహారాన్ని వాటితో సహా అమాంతం తిని ఆ వ్యర్థ పదార్ధాల వల్ల అనేక రకాల వ్యాథులకు గురై మరణిస్తున్నాయి కదా అనే ఆలోచనతో నేను ఆ రోజు నుండి సమయం దొరికినప్పుడల్లా రోడ్లపై పడి ఉన్న వ్యర్థ పదార్థాలను నా చేతులతో తొలగించేవాడ్ని, అయితే ఎంత శుభ్రం చేసినా మళ్ళీ వ్యర్థ పదార్ధాలు అక్కడ చేరేవి.
ఇంకో ముఖ్య విషయం… నా చిన్నప్పటి నుంచి నేను ఉద్యోగమో, వ్యాపారమో చేసి ఆర్భాటంగా జీవించాలని, గొప్పగా బ్రతకాలనే కోరిక నాకు ఉండేది కాదు. ఎందుకంటే భగవంతుడు నన్ను ఏదో మంచి పని చేయడానికే బ్రతికించాడేమో, లేదంటే మూడు సంవత్సరాల ప్రాయంలోనే అన్ని జబ్బులు, ఆపరేషన్లతో అనారోగ్యంతో చనిపోయేవాడ్ని బ్రతికించారు కదా అని భగవంతుని పట్ల కృతజ్ఞుడనై గత 27 సంవత్సరాలుగా ఈ పనిని కొనసాగిస్తున్నాను. తాత్కాలికంగా జీవనాధారం కోసం, జీవించటానికి ఆహారం అవసరం కాబట్టి వారం రోజుల్లో ఒక రోజు మాత్రమే నా కోసం నేను పని చేసుకుంటూ, మిగిలిన ఆరు రోజులు
ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్విరామంగా గత 27 సంవత్సరాలుగా ప్లాస్టిక్ వంటి వ్యర్థ పదార్ధాలను తగలబెట్టి పర్యావరణాన్ని కాపాడడమే నా ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాను.
నేను అడవుల్లో ఒక స్పష్టమైన మార్పు తెచ్చాను. డి.ఎఫ్.వాళ్ళు, కలెక్టర్ గారు నేను చేసిన మంచి పనికి సన్మానించారు కూడా. ఆ చుట్టుపక్కల టూరిస్టులు కానీ లేదా పురాతన దేవాలయాల వాళ్ళు కానీ, మందుబాబులు కానీ, రాజకీయ పార్టీల కుల రాజకీయాలు కానీ రోడ్లపై వ్యర్థాలను పారేయనివ్వకుండా చూసుకునేవాడ్ని. ఇంకా దాంతోపాటు అప్పుడప్పుడూ నదులు కూడా
శుభ్రం చేసేవాడ్ని. కానీ, నా ప్రధాన లక్ష్యం అడవులను శుభ్రం చేయడం. ఈ విధంగా వారానికి ఒక రోజు మాత్రమే నా కోసం పని చేసుకుంటూ, మిగతా ఆరు రోజులూ ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు నిర్విరామంగా పర్యావరణాన్ని నా వంతుగా నేను కాపాడుతున్నాను.
నేను ఋతువుల్ని బట్టి అడవికి వచ్చే నష్టాన్ని తగ్గిస్తుంటాను. ఉదాహరణకి మంచి వేసవిలో అడవి కాలిపోతూ ఉంటుంది. కొన్నిచోట్ల ఎత్తైన కొండల్లో, గుట్టల్లో, అడవుల్లో ఎక్కి మంటలను అదుపు చేస్తూ ఉంటాను. పచ్చి మండలు ఉంటాయి కదా, వాటిని పీకేసి మండల్ని కొడుతూ మంటల్ని అదుపు చేస్తూ ఉంటా. వర్షాకాలం మొక్కలు వేయడం… అంటే విత్తన బంతులు వేయడం చేస్తుంటాను. రకరకాల విత్తనాలను మట్టిలో చుట్టి ఎత్తైన కొండలు, గుట్టల్లో, మైదాన ప్రాంతాల్లో వేస్తూ ఉంటా. చిన్నప్పటి నుండి అదే పని. ఈ 2023 సంవత్సరంలో రికార్డు స్థాయిలో తొలకరి జల్లు కాడ్నుంచి కోటి విత్తన బంతులు చల్లాను. దానికి జిల్లా కలెక్టర్ నాకు ఆగస్ట్ 15న పల్నాడు జిల్లాలో, నర్సరావుపేటలో ప్రశంసాపత్రాన్ని కూడా అందచేశారు. దానిమీద ‘కోటి విత్తన బంతులు’ అని స్పష్టంగా రాశారు. తొలి విత్తనం కూడా ఆయనే చల్లారు. అలాగే అరుదైన మొక్కలను అడవుల్లో ఉంటే వాటిని కాపాడుతూ ఉంటా. నేను అడవుల్లో తిరుగుతూ ఉంటా. ఎవర్నీ వేట జరపకుండా చూస్తా. ఆ సందర్భంలో నాకు ఎక్కడైనా అరుదైన చెట్టు కనిపిస్తే నేను దాన్ని గుర్తించి శుభ్రంగా నీళ్ళు పోసి పాదు తీసి దాన్ని కూడా కాపాడుతూ ఉంటా.
ప్రాచీన మూలికా వైద్యం, ప్రకృతి పాఠశాల, ప్రకృతి వైద్యం, ప్రకృతి ఆహారం అని నాలుగు పుస్తకాలు కూడా రాయడం జరిగింది. వాటికి కలెక్టర్ గారే ముందు మాట రాశారు. సరికొత్త హరిత భారత్‌ను సృష్టించటమే నా జీవిత లక్ష్యం. 33.3 శాతం అడవులను సృష్టించటమే నా యొక్క లక్ష్యం. 1952లో జాతీయ అటవీశాఖ తీర్మానం ప్రకారం 33.3 శాతం అడవులు ఉండాలి అని నిర్ధారించారు, కానీ ఇప్పుడు దారుణంగా 19`20 శాతమే ఉంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దీన్ని 33.3 శాతం వృద్ధి చేయాలన్నదే నా లక్ష్యం. అడవుల్ని సంరక్షించడమే నా వృత్తి. ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు నల్లమల అటవీ ప్రాంతం అనేది గుండెకాయ వంటిది. నేను ఈ ప్రాంతంలో ఉన్నాను కాబట్టి ఈ ప్రాంతం అడవులు బాగా వృద్ధి అవ్వాలి, అలాగే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అడవులన్నీ వృద్ధి కావాలి, భారతదేశం మొత్తంలో ఉన్న అడవులన్నీ వృద్ధి కావాలి అని కోరుకుంటున్నాను. నాది పల్నాడు జిల్లాలోని కారంపూడి అనే గ్రామం. ఈ ఊరి చివరనుండి నల్లమల అడవి ప్రారంభమవుతుంది. నల్లమల అడవి ఉమ్మడి గుంటూరు, ప్రస్తుత పల్నాడు, ప్రకాశం, కడప, కర్నూలుతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. నేను ఇప్పుడు నా చుట్టుపక్కల పల్నాడు ప్రాంతంలోని అడవుల్లో పనిచేస్తున్నాను. ఒకప్పుడు నంద్యాల, అలాగే మహబూబ్‌నగర్ తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి నల్లమల అడవితో పాటు, రెండు తెలుగు రాష్ట్రాలతో సహా, సరికొత్త హరిత భారత్‌ను నిర్మించటం, అలాగే వృద్ధి చేయటమే నా లక్ష్యం.