పాపం ఒకరిది ` శాపం మరొకరిదా?! – వి.శాంతి ప్రబోధ

వాకిలి బరబరా ఊడ్చి వచ్చిన యాదమ్మ పేపర్‌ చదువుతున్న నా ముందు వచ్చి నిల్చుని ‘‘నిన్నటి మాట మర్చి ఈ పొద్దు కొత్త పాట అందుకుంటే మంది నమ్ముతరా’’ అంది.

ఈ ఉపోద్ఘాతం దేనికో అర్థం కాక ఆమెకేసి చూస్తున్న నన్ను చూస్తూ ‘‘గదేనమ్మా… శుక్రవారం రాత్రి ఫోన్‌ చేసి అన్నం తిన్నవా అని అడిగింది. పరీక్షలు మల్ల వాయిదా పడ్డయని బాధపడిరదని టీవీల చెప్పిండు. బాధపడకు బిడ్డ ధైర్నంగ ఉండుమని చెప్పిన అన్నడు. నాతో మాట్లాడిన 20 నిముషాలకే సచ్చిపోయిందని తెలిసిందని కండ్లల్ల నీరుపెట్టుకున్నడు. అగ్గో… గిప్పుడేమో ప్రేమల ఎవడో మోసం చేసిండు అంటిన్రు’’ అని ఒక్క క్షణం ఆగింది యాదమ్మ.
మొన్నా మధ్య ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక విషయం అని అప్పటికి అర్థమైంది. ఇంకా ఏదో వార్తో, విశేషమో మోసుకొచ్చి ఉంటుంది. అసలు విషయం ఏదైనా బిడ్డ ప్రాణం పోయింది. రకరకాల పుకార్లు, షికార్లు చేస్తూనే ఉంటాయి. అది లోక సహజం కదా!
‘‘ప్రేమించినోని వేధింపులు ఎవ్వరికీ చెప్పలేక, ఇంట్లో చెబితే ఏమయితదోనని పానం తీసుకున్నదని ఆ పిల్ల తమ్ముడు, తల్లి అంటున్నరు. కానీ అది నిజం కాదట. ఆ పిల్ల అవ్వయ్యలను, తమ్ముని సర్కారోళ్ళు తీస్కబోయి బెదిరిచ్చిరట. పోయిన పిల్ల పాపం తిరిగొస్తదా… మేం చెప్పినట్టు చేస్తే నీ కొడుక్కు నౌకరి, మీకు మా లెస్స పైసలు ఇస్తమని అట్ల చెప్పిచ్చింరట’’ గుసగుసగా చెప్పింది యాదమ్మ. ‘‘కూలీనాలి చేసి రెక్కలు ముక్కలు చేసుకొని చదివించే తల్లిదండ్రుల కష్టం చూడలేక, పరీక్షలు మల్ల మల్ల వాయిదాల మీద వాయిదాల పడ్డయట, అది తట్టకోలేని బిడ్డ శానా బాధపడ్డదట. ఆమె దోస్తులు సుతం బాధపడ్డరట. ఆ హాస్టల్‌ల పంచేసేటి మా ఆడిబిడ్డ బిడ్డ చెప్పింది. ఆ హాస్టల్‌ల అందరిదీ అదే గోస. ఎన్ని దినాలు ఇంట్లకెల్లి తెచ్చుకు తినాలే. ఏండ్లకు ఏండ్లు చదివిన పరీక్షలు పెడ్తలేరని ఏడుస్తున్నరట. ప్చ్‌… పాపం ఆ పొల్లగాడు. ఆని గోస గోస గాదు. ఆ పిల్లవాడు రాథోడ్‌ కాకుంట రెడ్డి, రావు, శర్మ అయితే ఇట్లానే చేస్తుంటిరా?’’ అంటూ పనిలో పడిరది యాదమ్మ.
ఆ క్షణంలో వర్థమాన నటి ప్రత్యూష, ఆయేషాల విషయంలో ఏం జరిగిందో గుర్తొచ్చింది. బలవంతులు నేరం చేసినా, దోషి అయినా తప్పించుకోగలిగే, బలహీనుడు తప్పు చేయకపోయినా దోషిగా నిలబెట్టే వ్యవస్థలో
ఉన్నాం మరి! చిరు చిరు ఆశలు మొగ్గతొడుగు తుండగా చిన్ని చిన్ని లక్ష్యాలతో పల్లె నుంచి పట్నం బాట పట్టి అహోరాత్రులు కష్టపడి గ్రూప్స్‌ రాసిన ఆశావహులు ఆ యువత. భవిష్యత్‌ వెతుక్కునే బిడ్డల ఆశలపై ఎప్పటికప్పుడు కడివెడు నీళ్ళు జల్లడమే నేడు ఆనవాయితీగా మారిపోయింది. అలాంట ప్పుడు నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడటంలో ఆశ్చర్యం ఏముంది?
సరైన తిండి తినక, కన్నవాళ్ళని పైసల కోసం ఇబ్బంది పెట్టలేక ప్రభత్వ ఉద్యోగం లక్ష్యంగా రాత్రి పగలు శ్రమించే యువతకు పరీక్ష మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతుంటే, కనుచూపు మేరలో దారి కనబడకుంటే మానసికంగా కుంగుబాటుకు లోనయ్యారంటే అందుకు బాధ్యులు ఎవరు?
గంపెడాశతో భవిష్యత్‌ స్వప్నిస్తూ ఇద్దరు చిన్న బిడ్డలను తల్లిదండ్రుల దగ్గర వదిలి పరీక్షకు సన్నద్ధమైన రోజా మనోవ్యధ దగ్గరగా చూశాను. అత్తింట, ఇరుగుపొరుగు, సమాజం పొడిచే మాటలు అన్నీ ఇన్నీ కావు.
ఆడపిల్లలేనా… కాదు, మగపిల్లలు కూడా బాధితులే. బాధ్యత లేని ప్రభుత్వం వల్లేగా… యువతకి ఈ కష్టం, నష్టం. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లోపాలు, ప్రశ్నాపత్రాలు అమ్ముకోవడాలు తెలియనిదెవరికి? ఏలినవారికి ఊడిగం చేసే ఖాకీలు ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చి ఎప్పట్లానే ప్రేమ వైఫల్యం కథ గొప్పగా అల్లేశారు. సరైన ఆధారాలు లేకుండా, ఆమె మరణానికి అతనే కారణమని ఎలా అప్పటికప్పుడు చెప్పారో?
ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే అసలు విషయాన్ని పక్కన పెట్టి మసిబూసి ప్రేమ వైఫల్యం మారేడికాయ చేయడమేనా? ఆమె మనసుకి, శరీరానికి మకిలి రంగులు పులమడమేనా? అంతకుమించి ఆలోచించలేదా?
ఆమె భౌతిక స్వరూపం తప్ప మనసు కనపడని కాబోదులు కదా! హృదయాంతరాలలోకి వెళ్ళరు. మనసులోని ఆలోచనను, సంస్కారాన్ని తెలుసుకోరు. రగిలే వేదన అర్థం చేసుకోరు. చితిమంటలు మాత్రం పేర్చడానికి ముందుంటారు.
అసలు ఈనాటి ఆడపిల్లలు ఎలా ఉన్నారు? చాలామంది ప్రేమను, అందులోని వైఫల్యాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. కానీ తమ చిన్న చిన్న ఆశలు, ఆశయాలు తీర్చుకోవడానికి తమకంటూ ఒక ఉద్యోగం, సంపాదన ఉండాలని కలగంటున్నారు. తల్లిదండ్రులకు భారం కాకూడదని వారికి అండదండగా నిలబడాలని ఆశిస్తున్నారు. తమను తాము నిరూపించుకోవడానికి, తమకో అస్తిత్వం ఏర్పరచుకోవడానికి ఎంతైనా శ్రమ పడుతున్నారు.
ఎవరికైనా అనుకున్న గమ్యం చేరే దారి చీకటిగా కనిపించినపుడు ఏం చేయాలో తోచని పరిస్థితిలో బేలతనం ఆవహిస్తుంది. ఆ క్రమంలోనే ప్రవల్లిక తనకు తాను నష్టజాతకురాలిగా భావించుకున్నది. కన్నవారికి ఇంకా ఇంకా భారం కాకూడదనుకున్నది. బాధ్యతనెరిగి ఆలోచించడం ఆమె తప్పు కాదు. మరి ఎవరిది? ఆమెకు ఆ పరిస్థితి ఏర్పడడానికి కారణం ఎవరు? అటు చావలేక ఇటు బ్రతకలేక కొన ఊపిరితో కొట్టు మిట్టాడే ప్రవల్లికలు ఎందరో… అందుకే ఒక ప్రవల్లిక మరణం గ్రూప్‌ పరీక్షలు రాసేవారిని అంత కలచివేసింది, కుదిపివేసింది.
నిరుద్యోగం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన విషయంలో చెప్పిన మాటలను నెరవేర్చలేదని ఏలినవారికి తెలియకనా… తెలిసినా లెక్కలేనితనం, అంతే. ఎన్నికల వేళ ప్రవల్లిక మరణంపై నిరుద్యోగ యువత నిరసన ధ్వజమెత్తడంతో ఉరుములు మెరుపులు లేకుండా పిడుగుల జడివాన పడినట్లు ఇబ్బంది పడిరది అధికార పార్టీ. అప్పటికప్పుడు నిరుద్యోగ యువత వందలు వేలుగా జమవడం వారు ఎదుర్కొంటున్న సవాళ్ళను ఎత్తి చూపుతున్నది. అది అధినాయకులను బెంబేలెత్తించింది.
అందుకే పొసగని కామెంట్స్‌… అసలు ప్రవల్లిక గ్రూప్స్‌కు ప్రిపేర్‌ కావటం లేదని, ప్రేమ వైఫల్యమే కారణమని నమ్మబలికిన మంత్రి హుటాహుటిన ప్రవల్లిక కుటుంబ సభ్యులను పిల్చుకుని వాళ్ళకు బ్రెయిన్‌ వాష్‌ చేసి ప్రేమ వైఫల్యంతోనే చనిపో యిందని చెప్పించారు. కొరివితో తలగోక్కోలేని పేద తల్లిదండ్రులు అంతకన్నా ఏం చేస్తారు మరి!
ఆధిపత్యంతో ఆమె స్త్రీత్వపు భావోద్వేగాలపై ముద్రలు వేసి, వాటినే నిజాలుగా చెలామణి చేసి, అంటువ్యాధిలా వ్యాపింపచేసే వారిపట్ల అప్రమత్తత అవసరం. మతపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా స్త్రీని సమానంగా, ఒక మనిషిగా చూడని వ్యక్తులు, వ్యవస్థలు
ఉన్నంతకాలం పరిస్థితులు ఇలాగే ఉంటాయి.
ఒక మూసధోరణికి అలవాటు పడిన సమాజంలో ఆమె లైంగికత చుట్టూ అల్లిన అపోహలను ఛేదించుకుంటూ పోవలసిందే.
పాపం ఒకరిది ` శాపం మరొకరిదా?! పాపం ఒకరిది ` శాపం మరొకరిదా?!

Share
This entry was posted in కిటికీ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.