ఆడవారికి ఒక వయసు వచ్చాక వారిని గుర్తించడానికి రెండు అర్హతలు ఇవ్వబడతాయి. ‘కుమారి’ అనో లేదా ‘శ్రీమతి’ అనో రెండు చిన్న పదాలు. వాటి అర్థాలు సమాజంలో వారి స్థానాన్ని నిర్దేశిస్తాయి.
‘కుమారి’ అంటే ఏదో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న మహిళలాగా, ‘శ్రీమతి’ అంటే స్ధిరపడిన మహిళగా అనిపిస్తుంది అందరికీ. సరే, కుమారి శ్రీమతి అయి మళ్ళీ కుమారి అయిందను కుందాం. ఏమవుతుంది?
వద్దనుకున్నా మనలో పాతివ్రత్యం బాగా కూరుకుపోయి ఉంది. ఒకే బంధంలో ఒకరి కొకరు విశ్వాసంగా ఉండడం వేరు, పాతివ్రత్యం వేరు. ఈ పాతివ్రత్యంలో కొన్ని ప్రత్యేక లక్షణా లున్నాయి. ఇవి భార్యలు మాత్రమే పాటించ గలిగేవి.
1. భర్త చాటు భార్యలా ప్రవర్తించడం
2. భర్త అనుమతి లేకుండా మేము ఏ పనీ చేయలేమని అశక్తత ప్రకటించడం
3. భర్త పట్ల ప్రేమను పని లేదా చాకిరీ ద్వారా వ్యక్తపరచడం
4. భర్తలకు నిర్ణయాలను వదిలేస్తామని కొంగు రెపరెపలాడుతుండగా వెలిబుచ్చడం
5. భర్త పరువు భగ్నం కానివ్వమని మళ్ళీ మళ్ళీ వెలిబుచ్చడం
6. భర్త బంధువులు మనకు నచ్చకున్నా వారిని భరించడం
7. పరపురుషుడి వైపు కన్నెత్తి చూడక పోవడం లేక చూడనని శపధాలు చేయడం (కనిపించిన మగవాడిని అన్నా అని పిలి చేయడం)
8. వీలైనన్ని ఆచారాలు పాటించి భర్తల ఆరోగ్యం బావుండాలని, వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ ఇతనే భర్తగా రావాలని కోరుకోవడం.
పై జాబితాలో ఏ మూడు నిజమైనా మీరు పతివ్రతలుగా అర్హత సంపాదించినట్లన్న మాట. ఇందులో నాటు నుండి ఘాటు స్థాయి పాతి వ్రత్యాలుంటాయి. వీటి గురించి మళ్ళీ మనం రాబోయే వ్యాసాలలో చర్చించుకుందాం.
పతివ్రతలకు మరో లక్షణం కూడా ఉంది. స్వతంత్రంగా బ్రతికే మహిళల పట్ల చులకన. వీరంతా చెడిపోయిన స్త్రీల లెక్క. వీరిలో భర్తలను వదిలేసేంత బరితెగింపో లేక మంచి భర్తలను పొందలేని ఖర్మో లేక భర్తలను మార్చుకోలేని చేతకాని పొగరుబోతులో అయి ఉంటారని పతివ్రతల నమ్మకం. ఇంకొందరు తమ భర్తలు ఈ చెడిపోయిన స్త్రీల బారిన పడకూడదని కష్టపడుతుంటారు. తమ భర్తలకు ఏమీ చేతకాదని, ఈ చెడిపోయిన స్త్రీలు వారికి మందు పెట్టి ఉంటారని నానుడి.
వారి భర్తలు విపరీతమైన దుర్మార్గులై, విపరీతమైన శారీరక హింసకు గురైతే తప్ప ఈ చెడిపోయిన స్త్రీలపై పతివ్రతలకు పెద్దగా సదభిప్రాయం ఉండదు. మరో సంగతి, భర్త చనిపోయినా స్త్రీలపై వివక్షతో పాటు విమర్శ మరియు జాలి అనే మినహాయింపు కూడా కలదు. ఇది నాణానికి ఒకవైపు, రెండోవైపు చెడిపోయినట్లుగా ముద్ర వేయించుకున్న స్వతంత్య్ర మహిళల ఆలోచనలు ఎలా
ఉంటాయో తెలుసా?
1. మా జీతం మాదే. మా నిర్ణయాధికారం మాదే. మా డబ్బులు ఎవరూ ప్రేమ పేరుతో దొంగిలించరు.
2. ప్రేమ కూడా మేము పిలిస్తే వచ్చే చుట్టమే. ఇంట్లో కదలకుండా తిష్టవేసే అతిథి కాదు. మాకు ప్రేమ పరిమితులు తెలుసు. ప్రేమ పేరుతో మాపై జరిపే అన్యాయం కూడా తెలుసు.
3. మేము ఇంటికొచ్చాక ఏ మగాడి అహం కోసం చాకిరీ చేయము. మా ఇంటి కోసం, పిల్లల కోసం, ముఖ్యంగా మా ఆత్మగౌరవం కోసం మేము పాటుపడతాము.
4. లౌక్యాన్ని ప్రదర్శించి బహుమతులు పొందే అవసరమే మాకు లేదు. ఎందుకంటే మాకు కావలసినవి మేము కొనుక్కుంటాము. మా డబ్బులపై వేరే వారికి అధికారం ఇచ్చి మళ్ళీ బతిమాలి తీసుకునే అవసరం మాకు లేదు.
5. ఇంట్లో మమ్మల్ని కొట్టేవారు, తిట్టేవారు, కసిరేవారు, అవమానించే వారు లేరు. ఈ హింస చాటుగా జరిగినా దెబ్బలను కాచుకుని, దాచుకుని తిరిగే అవసరం లేదు. మమ్మల్ని అవమానించే వారికి మా ఇంట్లో స్థానం లేదు.
6. మాలో చాలామందికి పిల్లలు ఉన్నారు. మా పిల్లలకు ఇంట్లో మేమే పెద్ద అని, మేము చెప్పినదే వినాలని, తండ్రి లేకపోయినా తల్లి కూడా ధైర్యంగా పెంచగలదని తెలుసు. రేపు వారికి సమస్య వస్తే ప్రతిఘటించడానికి మేమే వారికి గొప్ప ఉదాహరణగా మిగులుతామని మాకు గర్వం.
7. దాంపత్యం అంటే తీయని బానిసత్వం కాదని, సమానత్వమంటే సహానుభూతి అని బలమైన నమ్మిక కలిగినవారం.
ఇందులో కూడా విభాగాలు కలవు. ఇవి పతివ్రతా విభాగాలంత సరళమైనవి కావు. ఇవి మరింత క్లిష్టమైనవి. ఎందుకంటే ఇవి నేపాల్‌లో భూకంపాల వలే, ఎప్పుడు, ఎందుకు, ఎలా మారిపోతాయో చెప్పలేము. ఒడ్డు మీదకు షికారుకు వచ్చిన తాబేలు మళ్ళీ సముద్రంలోకి పోవాలన్నట్లే, మళ్ళీ మళ్ళీ పాతివ్రత్యం వైపు పరుగులు తీసే స్వతంత్రులు కూడా కలరు. ఇక్కడ పెళ్ళిని పెద్దగా ప్రస్తావించరు. అయినా పాతివ్రత్యం పీఠమేసుకుని కూర్చుంటుంది. రాజుగారి దేవతా వస్త్రాల్లా పెళ్ళి ఒక ప్రామాణిక విలువగా మారుతుంది. పాపం పతివ్రతలు ఇక్కడే ఘొల్లుమంటారు.
ఇంతా చేసి వీరేం పీకారయ్యా అని ఆలోచిస్తే కొందరు పెళ్ళి చేసుకున్నారు, కొందరు చేసుకోలేదు. అదే, పాపం ఏమీ చేతగాని అమాయకులైన మగవారిని. అంతే. వారితో సాగే ఒక లీగల్ స్టేటస్ కోసం జరిగే పోరాటాన్ని బట్టి ఎవరు మంచి ఆడవారో, ఎవరు చెడిపో యిన వారో నిర్ణయిస్తుందన్న మాట సమాజం.
వారి పాతివ్రత్య మోహం సమాజం కలిగిం చినది అని తెలుసుకుని, సమాజం అంటే మనమే అని జ్ఞానాన్ని పొంది పతివ్రతలు, స్వతంత్రులు కలగలిసి పాతివ్రత్యమనే సోది యవ్వారానికి చరమగీతం పాడాలని కోరుకుంటూ…
మీ స్వతంత్ర పతివ్రత