అనువాదం: ఎ.సునీత
సమకాలీన రాడికల్ స్త్రీవాద ఉద్యమంలో పిల్లలపై దృష్టి ఒక కేంద్ర బిందువుగా ఉన్నది. పిల్లల్ని సెక్సిజం అంటకుండా పెంచితే భవిష్యత్తు ప్రపంచంలో సెక్సిజంకి వ్యతిరేక ఉద్యమ అవసరమే ఉండదని స్త్రీలు ఆశపడ్డారు. మొదట్లో దృష్టంతా పిల్లలు పుట్టినప్పటి నుండి వారిపై రుద్దబడే అబ్బాయిలూ, అమ్మాయిలూ అనే సాంఘిక పాత్రల మీదా, వాటి ప్రభావం పైనా ఉన్నది.
ముఖ్యంగా ఆడపిల్లలపైన వీటి ప్రభావం, వాటిలోని సెక్సిస్టు భావజాలాన్ని వ్యతిరేకించటం, ప్రత్యామ్నాయ చిత్రాలని రూపొందించటం పైన ఉండేది. అప్పుడప్పుడూ అబ్బాయిలని సెక్సిస్టు వ్యతిరేక భావజాలంలో పెంచాల్సిన అవసరంపైన దృష్టి సారించినప్పటికీ, ప్రధానంగా పురుషాధిక్యత, పురుషులందరికీ స్త్రీలకంటే ఆధిక్యత ఉంటుందనే భావన అందరిలో బలంగా ఉండేది. అబ్బాయిలకి అమ్మాయిల కంటే విశేషాధికారాలు, అధికారం ఎక్కువనే భావన అమ్మాయిలపై దృష్టి నిలపటానికి దారి తీసింది.
ఈ విషయంలో స్త్రీవాద ఆలోచనా పరులకి ఎదురయిన మౌలిక సమస్య కుటుంబాల్లో సెక్సిస్టు ఆలోచనలని తల్లులే ప్రధానంగా మోసి, వ్యాప్తి చెయ్యటం, మగవాళ్ళు తండ్రులుగా లేని కుటుంబాల్లో కూడా ఆడవాళ్ళు సెక్సిస్టు ఆలోచనలని పిల్లలకి నేర్పుతూ ఉంటారు. ఆడవాళ్ళు కుటుంబ పెద్దలుగా
ఉన్న కుటుంబాలన్నీ తప్పకుండా మాతృస్వామిక సంస్కృతితో ఉండే కుటుంబాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి పితృస్వామ్య సమాజాల్లో కుటుంబ పెద్దలుగా మెలగవలసి వచ్చిన ఆడవాళ్ళు, మగవాళ్ళు లేకుండా పిల్లల్ని పెంచుతున్నామని అపరాధ భావనకి గురై కొడుకులని సెక్సిస్టు విలువలని ఇంకా బలంగా నేర్పుతారు. ఈ మధ్య అన్ని జాతులు, వర్గాల యువకులు జరిపిన హింసాత్మక చర్యలకి స్పందిస్తూ జరిగిన అనేక ప్రధాన స్రవంతి సంప్రదాయ పండితులు, ఒంటరి ఆడవాళ్ళు ఆరోగ్యవంతమైన అబ్బాయిలని తయారు చెయ్యలేరని సూత్రీకరిస్తున్నారు. ఇది అబద్ధం. మన సమాజంలో అత్యంత ప్రేమ పూరితులయిన, బలవంతులయిన మగవారిని పెంచింది ఒంటరి స్త్రీలే. నిజానికి, పిల్లల్ని, ముఖ్యంగా కొడుకులని ఒంటరిగా పెంచే ఆడవాళ్ళు పురుషాధిక్యతతో మెలిగే మగవారిని తయారు చెయ్యరని అనుకోవడం వాస్తవ విరుద్ధం. అసలు అలా అనుకోవటానికి ఏ అవకాశం లేదు.
తెల్లజాతి పెట్టుబడిదారీ పితృస్వామ్యం రూపుదిద్దే ఆధిపత్య సంస్కృతుల్లో పిల్లలకి ఎటువంటి హక్కులూ ఉండవు. మనది పిల్లల్ని ప్రేమించని సంస్కృతి అనీ, వారిని కేవలం ఆస్తిగా పరిగణించి వారినేమయినా చెయ్యగలిగే అధికారం తల్లిదండ్రులకు ఉంటుందని గుర్తించిన మొదటి సామాజిక న్యాయ ఉద్యమం స్త్రీవాద ఉద్యమమే. పిల్లలపై పెద్దవాళ్ళు జరిపే హింస మన సమాజంలో అందరూ ఆమోదించే విలువ. పిల్లల్ని పెంచే బాధ్యత ప్రధానంగా ఆడవాళ్ళదే కాబట్టి వారిపై హింసలో కూడా ప్రధానంగా స్త్రీలే ముద్దాయిలనే సమస్యాత్మక విషయాన్ని స్త్రీవాద ఆలోచనాపరులు ముందుకు తీసుకు రాదలచుకోలేదు. కుటుంబాల్లో మగవారి సంపూర్ణ ఆధిపత్యం, పిల్లలపై వారు జరిపే లైంగిక వేధింపులకు కూడా దారి తీస్తుందనే విప్లవాత్మక, తీక్షణమైన సత్యాన్ని స్త్రీవాద ఉద్యమమే అందరి దృష్టికి తెచ్చింది. అయితే పిల్లల్ని రోజూ కొట్టేది, తిట్టేది ప్రధానంగా తల్లులే అన్నది మరచిపోలేము కదా. తల్లుల్లో ఏర్పడే శాడిజం పిల్లల భావోద్వేగాలతో ఆడుకోవటానికి, వేధించటానికి దారి తీస్తుంది. స్త్రీలు పిల్లలపై జరిపే హింస గురించి స్త్రీవాద విమర్శ గానీ, తీసుకోవాల్సిన కార్యాచరణ గానీ స్త్రీవాద సిద్ధాంతం ఇప్పటివరకూ మనకి అందించలేదు.
పిల్లలకి ఏ పౌర హక్కులూ లేని మన సంస్కృతిలో పెద్దవాళ్ళు ` స్త్రీలూ, పురుషులూ కూడా వారిని తమ నిరంకుశ పాలనా క్రింద పెట్టుకోగలరు. పిల్లలని తీవ్రంగా భయపెడతారని మనకి వైద్యపరమైన సాక్ష్యాలు చెపుతున్నాయి. అనేకమంది పిల్లలు దీనివల్ల చనిపోతారు కూడా. స్త్రీలు, పురుషులూ ఇద్దరూ ఈ హింసకి పాల్పడతారు, కొన్నిచోట్ల స్త్రీలే కొంచెం ఎక్కువ పాల్పడతారు. ఈ హింస గురించి సూటిగా మాట్లాడలేకపోవటం స్త్రీవాద ఆలోచనలో, కార్యాచరణలో ఒక పెద్ద లోపం. మగ దురహంకారంపై దృష్టి కేంద్రీకరించి, స్త్రీలు కూడా పితృస్వామిక ఆలోచనని, అధికారంలో ఉన్నవాళ్ళు అణగారిన ప్రజలని అణగదొక్కి ఉంచటానికి ఏ రకమైన పద్ధతులైనా వాడొచ్చనే ఆధిపత్య నీతిని వంటబట్టించుకోవటం వల్లే పిల్లలని ఈ రకంగా వేధిస్తారని అనటం తేలిక. తెల్లజాతి పెట్టుబడిదారీ పితృస్వామ్యంలో ఆడవాళ్ళపై ఆధిపత్యం సరయిందిగా చెలామణి అయినట్లే, పిల్లలపై పెద్దవాళ్ళ ఆధిపత్యం కూడా చెల్లుబాటు అవుతుంది. పిల్లల్ని వేధించే తల్లుల గురించి మాట్లాడటం ఈ సంస్కృతిలో ఎవరికీ పట్టదు.
నేనెప్పుడూ ఒక కథ చెప్తుంటాను. ఒక పెద్ద పార్టీకి వెళ్ళినప్పుడు ఒకామె తన చిన్న కొడుకుని క్రమశిక్షణలో పెట్టటానికి గట్టిగా తొడపాశం ఎలా పెడుతుందో చెప్పింది. అందరూ ఆమె క్రమశిక్షణ సామర్ధ్యం గురించి మెచ్చుకున్నారు. నేను ఆ ప్రవర్తన వేధింపు కిందకి వస్తుందని, ఆ కొడుకు పెరిగి పెద్దవాడై ఆడవాళ్ళని వేధించే వాడవటానికి తోడ్పడుతుందని అందరితో అన్నాను. ఎవరయినా మగవాడు వచ్చి ఇలాగే ఒక ఆడామెని గట్టిగా గిచ్చి తొక్కి పెడతానని అంటే మనందరం దాన్ని హింస అనటానికి వెనుకాడబోమని, ఆ స్థానంలో ఒక పిల్లాడు ఉంటే మాత్రం అది క్రమశిక్షణకి మంచిదని అంటున్నామని ఎత్తి చూపాను. నేను విన్నవాటిలో అది మొదటిది కాదు, చివరిదీ కాదు. ఇంతకంటే తీవ్రమైన వేధింపులకు కూడా తల్లితండ్రులు పిల్లలని గురి చేస్తారు.
స్త్రీవాదం తెస్తున్న మార్పులు పితృస్వామ్య ఆలోచనతో ఢీ కొడుతున్న కారణంగా ప్రతి ఇల్లూ ఒక యుద్ధ భూమిగా మారటం ఈ దేశంలో పిల్లలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సంక్షోభం. కుటుంబాల్లో మగవారి ఏకఛత్రాధిపత్యం చెల్లినప్పటి కాలంకన్నా ఇది ఎక్కువయింది. మగపిల్లలపై జరిగే లైంగిక హింస, వేధింపులు ఎంత పెద్ద ఎత్తున జరుగుతాయో అన్న విషయం బయటికి వచ్చి, అందరి దృష్టికి రావటంలో స్త్రీవాద ఉద్యమం కీలకపాత్ర పోషించింది. స్త్రీవాద ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వయోజనులయిన స్త్రీలు మానసిక ఆరోగ్య సేవలు పొందుతున్న క్రమంలో తాము చిన్నప్పుడు కుటుంబాల్లో ఎదుర్కొన్న లైంగిక హింస గురించి బయటకు రావటం, క్రమంగా ఆ విషయాన్నీ వ్యక్తిగత స్థాయి నుండి బహిరంగ చర్చల్లో చెప్పుకోవటం జరుగుతోంది. ఇలా బయటికి చెప్పుకోవటంతో పిల్లలకి తమపై జరిగే లైంగిక హింస, వేధింపుని ఎదురుకోవటానికి ఒక అనుకూల వాతావరణం, నైతిక నేపథ్యం తయారయింది.
మగపిల్లలపై కూడా లైంగిక హింస, వేధింపులు జరుగుతాయనే విషయం గురించి మాట్లాడినంత మాత్రాన ఆ వేధింపులు పురుష ఆధిపత్యంతో ముడిపడి ఉన్నాయని, పితృస్వామ్యం అంతమయినప్పుడే అవి పోతాయని జన సామాన్యానికి అర్థం కాలేదు. ఈ వేధింపులు, హింస తరచుగా జరగటమే కాదు, ఆడపిల్లలపై జరిగే వాటికంటే ఎక్కువ రిపోర్టు చెయ్యబడతాయి కూడా. ఆడపిల్లలపై జరిగే లైంగిక అణచివేత ఏమీ తక్కువ కాదు. స్త్రీవాద ఉద్యమం ఈ హింసకి పాల్పడిన వారిని స్త్రీలను హింసించే వారిని విమర్శించినంత తీవ్రంగా విమర్శించాలి. లైంగిక హింస మాత్రమే కాక, పిల్లలపై జరిగే హింస అనేక రూపాలు తీసుకుంటుంది. వాటిలో తిట్లు, మానసిక వేధింపులు వంటివి బాగా తెలిసినవి.
అవమానానికి గురి చేసే వేధింపులు, హింస మిగిలిన అన్ని రకాల వేధింపులకు పునాది. సెక్సిస్టు మగతన భావనలో ఇమడని ప్రవర్తనని కనబరిచే మగపిల్లలని లైంగిక హిసకి గురిచేయడం సర్వసాధారణం. వారిని తోటి పిల్లలు, సెక్సిస్టు పెద్దవాళ్ళు (ముఖ్యంగా తల్లులు) అవమానాలకి గురి చేస్తారు. తమ జీవితాల్లోని పురుషులు గనుక సెక్సిస్టు వ్యతిరేక ఆలోచన, ప్రవర్తన కలిగుంటే, మగపిల్లలు, ఆడపిల్లలకి స్త్రీవాదాన్ని కార్యాచరణలో చూసే అవకాశం లభిస్తుంది. స్త్రీవాద కార్యకర్తలు, ఆలోచనాపరులు పిల్లల ప్రవర్తనని సెక్సిస్టు భావజాలం బయట విద్యా వాతావరణాన్ని సృష్టింగ గలిగినప్పుడు, పిల్లలకి ఇదొక్కటే ప్రమాణం కాదని అర్థమై, ఆరోగ్యకరమైన ఆత్మవిశ్వాసాన్ని ఏర్పరచుకుంటారు.
పిల్లల తరపున స్త్రీవాద ఉద్యమం చేసిన ప్రధాన మధ్యవర్తిత్వం ఏమిటంటే మగవాళ్ళు పిల్లల పెంపకంలో సమానంగా పాల్గొనాల్సిన అవసరం గురించి సాంస్కృతిక చైతన్యాన్ని పెంచింది. కేవలం స్త్రీ పురుష సమానత్వం కోసమే కాక, పిల్లలతో మెరుగయిన సంబంధాలు ఏర్పర్చుకోవటం కోసం ఇది ముఖ్యమని చెప్పింది. భవిష్యత్తులో వచ్చే స్త్రీవాద అధ్యయనాలు సెక్సిస్టు వ్యతిరేక పిల్లల పెంపకం వల్ల పిల్లల జీవితాలు ఎలా మెరుగు పడతాయో రికార్డు చేస్తాయి. అయితే, మనం ముందు స్త్రీవాద పిల్లల ప్రవర్తనని సెక్సిస్టు భావజాలం బయట విద్యా వాతావరణాన్ని సృష్టించగలిగినప్పుడు, పిల్లలకి ఇదొక్కటే ప్రమాణం కాదని అర్థమై, ఆరోగ్యకరమైన ఆత్మవిశ్వాసాన్ని ఏర్పరచుకుంటారు.
పిల్లల తరపున స్త్రీవాద ఉద్యమం చేసిన ప్రధాన మధ్యవర్తిత్వం ఏమిటంటే మగవాళ్ళు పిల్లల పెంపకంలో సమానంగా పాల్గొనాల్సిన అవసరం గురించి సాంస్కృతిక చైతన్యాన్ని పెంచింది. కేవలం స్త్రీ పురుష సమానత్వం కోసమే కాక, పిల్లలతో మెరుగైన సంబంధాలు ఏర్పర్చుకోవటం కోసం ఇది ముఖ్యమని చెప్పింది. భవిష్యత్తులో వచ్చే స్త్రీవాద అధ్యయనాలు సెక్సిస్టు వ్యతిరేక పిల్లల పెంపకం వల్ల పిల్లల జీవితాలు ఎలా మెరుగుపడతాయో రికార్డు చేస్తాయి. అయితే, మనం ముందు స్త్రీవాద పిల్లల పెంపకం అంటే ఏమిటో తెలుసుకోవాలి. సెక్సిస్టు వ్యతిరేక వాతావరణంలో పిల్లల్ని ఎలా పెంచవచ్చో, ఇటువంటి ఇళ్ళల్లో పెరిగిన పిల్లలు ఎటువంటి మనుషులుగా రూపొందుతారో అర్థం చేసుకోవాలి.
పిల్లల పెంకంలో తల్లులుగా స్త్రీలు చేసే శ్రమని, దానికి లభించే సాంస్కృతిక గుర్తింపుని పెంపొందించటానికి కృషి చేస్తున్న క్రమంలో ఆలోచనా పరులయిన స్త్రీవాద కార్యకర్తలు ఆ పెంపకంలో మగవారి పాత్ర విలువని, ప్రాధాన్యతని ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు. మగవాళ్ళ పాత్రని మాత్రమే ప్రశంసించే క్రమంలో తల్లుల పాత్రని తక్కువ చెయ్యటం, కించపరచటం కారణంగా మొత్తం ఆడవాళ్ళందరికీ నష్టం జరిగింది. ఉద్యమం ప్రారంభమయినప్పుడు స్త్రీవాదులు తల్లితనాన్ని తీవ్రంగా విమర్శించి, దానికి విరుగుడు ఆత్మ విశ్వాసం, విముక్తి మార్గాలకి దారితీసే కెరీర్ మాత్రమే అని చెప్పుకున్నారు. అయితే, 1980ల్లోనే కొంతమంది తల్లితనాన్ని తక్కువచేసి, ఇంటి బయట వేతనం కోసం చేసే పనిని ఎక్కువ చేసి చూడటాన్ని సవాలు చేశారు. నా ‘ఫెమినిస్టు సిద్ధాంతం ః అంచుల నుండి కేంద్రం లోకి’ పుస్తకంలో నేను ఈ విషయం గురించి ఏమన్నానంటే…
‘సెక్సిజం సమాజంలో ప్రధాన విలువగా కొనసాగుతున్న నేపథ్యంలో వ్యక్తుల మధ్యలో అనవసర పోటీ, అపనమ్మకం, అసూయ, శత్రుత్వం, ద్వేషం పెంపొందించే పని స్థలాలు, శ్రమని ఒత్తిడి, నిరాశలతో నింపి పనిచెయ్యటంలో ఏ తృప్తీ లేకుండా చేస్తాయి. వేతనతమిచ్చే పనిని కోరుకుని, ఇష్టపడే ఆడవాళ్ళు కూడా చివరకు అది మొత్తం సమయాన్నంతా మింగేసి, జీవితంలో సంతృప్తినిచ్చే పనులకు చోటు లేకుండా చేస్తోందని భావిస్తారు. వేతనమిచ్చే పని కొంత ఆర్థిక స్వతంత్రాన్ని, కొంతమందికి ఆర్థిక నిర్భరతని ఇచ్చినప్పటికీ, మానవ అవసరాలని అది తీర్చలేకపోతోంది. సురక్షితమైన వాతావరణంలో అలాంటి సంతృప్తినిచ్చే పనిని అన్వేషించే క్రమంలో కుటుంబం, తల్లితనం లోని అనుకూల అంశాలను పునరుద్ఘాటించటం మొదలయింది.
స్త్రీవాదులు తల్లితనం గురించి కొంత సమతుల్య అంచనాకి వచ్చిన సమయంలోనే ప్రధాన స్రవంతి పితృస్వామ్య సంస్కృతి ఆడవాళ్ళ ఆధ్వర్యంలో నడిచే కుటుంబాలపైన దుర్మార్గమైన దాడులు మొదలుపెట్టింది. అన్నింటికన్నా తీవ్రంగా ఆ కుటుంబాలకి అందే సాంఘిక సంక్షేమంపైన దాడి చేసింది. తమకొచ్చే తక్కువ ఆదాయంతో అనేకమంది ఒంటరి తల్లులు, వాళ్ళు వేతనానికి పనిచేసే వాళ్ళయినా, ప్రభుత్వమిచ్చే సహాయంపైన ఆధారపడిన వాళ్ళయినా కావొచ్చు, ప్రేమగా, నిపుణతతో పిల్లలని పెంచుతారన్న విషయం గురించి మెండుగా ఉన్న సమాచారాన్ని పూర్తిగా పక్కకి పెట్టి, అటువంటి కుటుంబాల్లో కొన్ని విఫలమైన వాటిని ఎత్తిచూపి, స్త్రీలు కుటుంబ పెద్దలుగా ఉన్న కుటుంబాలన్నీ విఫలమవుతున్నాయని, పురుషులు లేకపోవటం వల్లే అది జరుగుతోందనీ, పురుషులు కుటుంబ పెద్దలుగానూ, పోషకులుగానూ ఉండటం మాత్రమే ఆ సమస్యకి సరయిన పరిష్కారమనీ వాదించింది.
పిల్లల శ్రేయస్సుకి ఈ ఒంటరి తల్లులపైన జరిపిన దాడుల వల్ల జరిగినంత నష్టం ఇంకే రకమైన ఇతర స్త్రీవాద వ్యతిరేక దాడుల వల్ల జరగలేదు. తల్లిదండ్రులిద్దరూ ఉండే పితృస్వామ్య కుటుంబానికి మాత్రమే ఉన్నత స్థానాన్నిచ్చే సంస్కృతిలో తమ కుటుంబం ఆ ప్రమాణానికి సరితూగదనే భావనతో అనేకమంది పిల్లలు మానసిక క్షోభకి గురవుతారు. మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ ఎవరి పెద్దరికంలో కుటుంబాలు విఫలమయినా అటువంటి వాతావరణంలో పిల్లల శ్రేయస్సు సురక్షితం కాదు. పిల్లల్ని ప్రేమించే వాతావరణంలో పెంచాలి. ఆధిపత్యం ఉన్న చోట ప్రేమ తక్కువ అవుతుంది. ఒంటరివాళ్ళో, ఇద్దరున్న వాళ్ళో, సమలింగ సంపర్కులో, పరలింగ సంపర్కులో ఆడవాళ్ళు పెద్దలుగా ఉన్నవో, మగవాళ్ళు పెద్దలుగా ఉన్నవో, ఎవరయినా సరే, ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నప్పుడే పిల్లలు సంతోషంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో పెరుగుతారు. భవిష్యత్తులో స్త్రీవాద ఉద్యమంలో మనం తల్లిదండ్రులకి సెక్సిజంని అంతమొందించినపుడు కుటుంబ జీవితం మెరుగుపడుతుందనే విషయం ఇంకా బలంగా చెప్పాలి. పిల్లలపై పితృస్వామ్య ఆధిపత్యం అంతమయినప్పుడే, అది చేసేది మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు… కుటుంబమనే వ్యవస్థలో మార్పు వచ్చి అది పిల్లలకి రక్ష।ణ, స్వేచ్ఛ, ప్రేమనివ్వగలిగే ప్రదేశంగా రూపొందుతుంది.