చెంచులక్ష్మి – సామాన్య

మా ఊరిలో రెండు బడులుంటాయి. చిన్న బడి, పెద్ద బడి. చిన్న బడంటే ఐదవ తరగతి వరకూ ఉండే ప్రాథమిక పాఠశాల. ఊర్లో పుట్టిన దిగువ తరగతి పిల్లలు, మధ్య తరగతి పిల్లలు, చాలామంది ఆడపిల్లలు ఇక్కడే చదువు మొదలు పెడతారు. ఐదవ తరగతి పూర్తయ్యాక పక్కనే ఉండే పెద్ద బడికి వెళ్ళిపోతారు. నేను కూడా అలాగే ఆరవ తరగతిలో పెద్ద బడికి వెళ్ళాను. పెద్ద బడిలో చాలా చెట్లుంటాయి.

చాలా చాలా గదులూ ఉంటాయి. ఆరవ తరగతి తూర్పు వైపు ఉండే రెండవ నెంబరు గది. అక్కడ నుండి ఎనిమిదవ తరగతిలోకి వచ్చేసరికి మేము సైన్స్‌ ల్యాబ్‌ పక్కనుండే పదహారవ నంబర్‌ గదికి వచ్చాము. మొదటి క్లాస్‌ ఉమా టీచర్‌ తీసుకుంది. ‘‘మీ క్లాస్‌ టీచర్‌ అమరేంద్ర. ఆయన మన బడికి కొత్తగా వస్తున్నారు. మీకు ఇంగ్లీష్‌ చెప్తారు. మీ రోల్‌ నెంబర్లు, అవీ ఆయనే చెప్తారు. బస్సు లేటయినట్లుంది. వచ్చేస్తారు. ఇవాళ్టికి అందరూ మీ, మీ పేర్లు చెప్పండి’’ అన్నాడు. మేడం అలా ఆ మాటలు పూర్తి చేశారో లేదో తలుపు దగ్గర నుండి ‘‘బస్‌ టైర్‌ పంక్చరైంది ఉమ గారు’’ అంటూ ఇంగ్లీష్‌ టీచర్‌ క్లాస్‌లోకి వచ్చాడు. ఆయన్ని చూడగానే నా పక్కనే ఉన్న సుభద్ర ‘అమ్మాయ్‌! సారు అచ్చం ఇంగ్లీషోళ్ళలాగే ఉండాడు కదా. ఎంత తెల్లగా ఉండాడో చూడు’ అంది గుసగుసగా. సార్‌ మా రోల్‌ నంబర్‌ ప్రకారం మా పేర్లు పిలుస్తూ ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు.
నా పేరు చెంచు లక్ష్మి. నేను మా క్లాసులో అందరికంటే ఎత్తు అని ఎవరయినా ఇట్టే చెప్పేయగలరు. సార్‌ నన్ను చూడగానే నవ్వి ‘నేను కూడా ఎప్పుడూ వెనక బెంచీనే. పొడవుగా ఉంటే వచ్చే కష్టాలలో ఇదొకటి. ఏం చేద్దాం. వెళ్ళు, వెళ్ళి లాస్ట్‌ బెంచీలో కూర్చో’ అన్నాడు. నాకు లెక్కలు చాలా సులభం, ఇంగ్లీషు చాలా కష్టం. అందుకే ఆయన్ని చూడగానే ఒక రకమయిన భయం మొదలయింది. కానీ సార్‌ చాలా మంచివాడు. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేవాడు. విసుక్కోవడమనేదే ఉండదు. అందువల్ల నాకు ఇంగ్లీషంటే చిన్న చిన్నగా ఆసక్తి మొదలయింది.
అమరేంద్ర సారు ఒకసారి క్లాసులో రోమియో, జూలియట్‌ల గురించి చెప్పాడు. ఆ కథ వినగానే అక్కడికక్కడే ఏడుపొచ్చేసింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళిద్దరే గుర్తొస్తూ ఉండినారు. ముఖాలు కనిపించలేదు కానీ, ఆ రాత్రి వాళ్ళు నా కలలోకి కూడా వచ్చారు. సుభద్రకి నా కల గురించి చెప్తే నవ్వింది. అదంతా నా భ్రమ అనేసింది. ఆ రోజు క్లాస్‌లో సార్‌ ఎవరయినా రోమియో జూలియట్‌ చదవాలంటే లైబ్రరీలో ఉంది తీసుకుని చదవండి అన్నారు. అదే మొదటిసారి మా స్కూల్‌లో ఉన్న లైబ్రరీ గురించి నేను వినడం. ఆ మధ్యాహ్నం అన్నాల బెల్లు తరవాత సుభద్ర, నేను లైబ్రరీకి వెళ్ళాం. మా లైబ్రరీ చిన్నదేం కాదు. చాలానే పుస్తకాలు ఉన్నాయి. లైబ్రరీలో లైబ్రేరియన్‌ ఉండాలని మాకు అప్పుడు తెలీదు. ఆ పోస్ట్‌ మా స్కూల్‌లో మేము ఉన్నన్ని రోజులు ఎందుకనో ఖాళీగానే ఉండిరది. చాలాసార్లు లైబ్రరీలో ఇంగ్లీష్‌ సారే కూర్చునేవాడు. రకరకాల పుస్తకాలు చదువుతుండేవాడు. ఆ రోజు మేము లైబ్రరీకి వెళ్ళేసరికి పేపర్‌ చదువుకుంటున్న సార్‌ కనిపించాడు. రోమియో జూలియట్‌ గురించి చెప్పగానే తెచ్చి చేతికిచ్చి లాగ్‌లో ఎంట్రీ చేయమని చెప్పాడు. మిగిలిన షేక్‌స్ఫియర్‌ పుస్తకాలు ఎక్కడుంటాయో కూడా చూపించాడు.
షేక్‌స్ఫియర్‌ నా జీవితంలోకి వచ్చిన తరువాత, నాకు నా మనసు ఎదగడమే కాదు శరీరం కూడా ఎదిగిందని అనిపించేది. బహుశా అప్పుడే అనుకుంటా నొప్పి పుడుతూ, తీపులు తీస్తూ తోసుకొస్తున్న నా రొమ్ములు ఇంకొంచెం విచ్చుకున్నాయి. చదువుతున్న పుస్తకం గుండెను తవ్వుతున్నట్టు, రొమ్ముల దగ్గర రaల్లుమన్నట్లు అయ్యేది. వాన పడ్డప్పుడు భూమిలో నుండి పుట్టగొడుగులు మట్టిని చీల్చుకుని బయటికొస్తాయి చూడండి, అలా ఆ పుస్తకాలు చదవడం వలన నా శరీరం కొంచెం కొంచెంగా బయటికొస్తోంది, తోసుకొస్తోందని నాకనిపించేది. కానీ షేక్‌స్ఫియర్‌ని చదవడం చాలా కష్టం. అందుకని నా సందేహాలను తీర్చుకునేందుకు వంటేలు బెల్లు కొట్టినప్పుడు కానీ, మధ్యాహ్నం అన్నం గబగబా తినేసి కానీ నేను, నాకు తోడుగా సుభద్ర అమరేంద్ర సార్‌ని వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళం. సార్‌ చాలాసార్లు లైబ్రరీలో ఉండేవాడు. లేదంటే తన రీసెర్చ్‌ వర్క్‌ రాసుకోవడానికి మిద్దెపైన ఎప్పుడూ తాళం వేసి ఉండే క్రాఫ్ట్స్‌ రూమ్‌ పక్కన ఖాళీ గదిలో ఉండేవారు. తన రీసెర్చికి సంబంధించిన అన్ని పుస్తకాలు అక్కడే పెట్టుకుని ఆ రూమ్‌ తాళం చెవి తన దగ్గరే ఉంచుకునేవారు. ఎనిమిదో తరగతి పూర్తయ్యేటప్పటికి నాకు ఇంగ్లీష్‌ అంటే భయం పోయింది కానీ పట్టు మాత్రం దొరకలేదు. అయితే, క్లాస్‌లో అమరేంద్ర సార్‌ నన్ను చాలా పొగుడుతూ ఉండేవాడు. నేను ఇంకా, ఇంకా ఇంగ్లీషులో సాహిత్యం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడు.
తొమ్మిదవ తరగతిలోకి వచ్చిన కొంతకాలం తర్వాత ఒక మధ్యాహ్నం సైన్స్‌ క్లాస్‌లో ఉండగా హఠాత్తుగా నాకు తడి బల్ల మీద కూర్చున్నట్లు, నా పావడా తడిచిపోతున్నట్లు అనిపించింది. టీచర్‌ వెళ్ళిపోయిన తర్వాత చూసుకుందామని అనుకున్నా కానీ, ఆగలేక కొంచెం లేచి చూశా. బెంచి మీద తడి మరక. నాకేదో పొడగట్టింది. నేను తేరుకునేలోపే టీచరు గబగబా నా దగ్గరికి వచ్చి చూసి, ఇంటికి పో అమ్మాయ్‌ అన్నది. తోడుగా సుభద్రని కూడా వెళ్ళమన్నది. మేమిద్దరం లేచి పుస్తకాల సంచులు తీసుకుని వెళ్తుంటే బెల్లు కొట్టారు. ఇద్దరం సంచులు తగిలించుకుని వచ్చి హెడ్మాస్టర్‌ రూమ్‌ పక్కన
ఉన్న గంగరాయి చెట్టు దగ్గర నిలబడి సంచిని పావడాకి అడ్డం పెట్టుకుని నడవడం ఎట్లాగో ఆలోచన చేస్తుండగా, హెడ్మాస్టర్‌ రూమ్‌లో నుండి వస్తూ అమరేంద్ర సార్‌ కనిపించాడు. మమ్మల్ని చూసి ‘‘చెంచు లక్ష్మీ ఇక్కడున్నారేంటీ’’ అని పిలిచాడు. నేను, సుభద్ర ఒకరి మొఖాలు ఒకరం చూసుకున్నాం. నాకు చాలా మొహమాటంగా అనిపించి తలొంచుకుని నేలను చూస్తుంటే, సుభద్ర గొంతు పెగుల్చుకుని ‘ఈ అమ్మాయి పెద్ద మనిషయ్యింది సార్‌. ఇంటికి పొమ్మన్నది సైన్స్‌ టీచర్‌. నన్ను కూడా తోడుగా పొమ్మన్నది’ అని చెప్పేసింది. నేను నా సంచిని పావడాకి అడ్డంగా పెట్టుకోవడానికి తంటాలు పడుతుంటే అమరేంద్ర సార్‌ అది చూసి ‘సరే ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా’ అని వెళ్ళి కాసేపటికి తిరిగి వచ్చి ‘అమ్మాయ్‌ సుభద్రా! నువ్వు క్లాస్‌కి వెళ్ళు. చెంచులక్ష్మిని ఇంటి దగ్గర నేను దింపుతాలే’ అన్నాడు. సుభద్ర వెళ్ళిపోయింది. సారు మా హెడ్మాస్టర్‌ని అడిగి స్కూటర్‌ తీసుకొచ్చాడు. నేను స్కూటర్‌ ఎక్కడం అదే మొదటిసారి.
మా తాత పేరు చెంచు రాముడు. సోది చెప్పడంలో మా తాతకి చాలా పేరు. ఎక్కడెక్కడి నుండో మనుషులు ఆయనతో చెప్పి బాధలు తగ్గించుకోవడానికి వచ్చేవాళ్ళు. గుండెల్లో నెమ్ము చేరి మా తాత హఠాత్తగా చనిపోయాక, ఆ పని మా నాన్న మొదలు పెట్టాడు. మా ఇల్లు చాలా పెద్ద స్థలంలో పరిశుభ్రంగా, పూల మొక్కలతో ఆశ్రమంలాగా ఉంటుంది. సార్‌ నన్ను దించడానికి వచ్చినప్పుడు మా ఇంట్లోకి వచ్చి కూర్చుని, మా అమ్మ ఇచ్చిన నీరు, మజ్జిగ తాగి, నేను ఎంత బాగా చదువుతానో చెప్పి, ఎంత పెద్ద చదువులు చదవగలనో చెప్పాడు. ఆయన వెళ్ళిన చాలాసేపటిదాకా మిగిలిన పనులన్నీ పక్కన పెట్టి మరీ మా అమ్మ, నాన్న ఆయన మంచితనం గురించి పొగుడుతూ కూర్చున్నారు. నాకు ఆ రోజు ఆనందంతో మనస్సు గాద్గదికమయింది అంటారే అలా అయింది. ఇంత మంచి మనుషులు, సంస్కారవంతులు ఉంటారా లోకంలో అని. ఆ రోజు ఒట్టు కూడా పెట్టేసుకున్నాను, నేను కూడా అమరేంద్ర సార్‌లాగే గొప్ప టీచర్‌ని అవుతా, నా స్టూడెంట్స్‌తో ఇలాగే ప్రేమగా ఉంటా, ఎంత పెద్ద
ఉద్యోగమయినా సరే నాకు అవసరం లేదు, నేను టీచర్‌నే అవుతా అని శపథం చేసుకున్నా.
ఆ తరువాత 15 రోజులు నేను స్కూల్‌కి పోలేదు. స్కూల్‌కి పోగానే మూడ్నెల్ల పరీక్షలు మొదలయ్యి సెలవులు ఇచ్చేవారు. సెలవల్లో నేను మా అన్న వాళ్ళింటికి వెళ్ళాను. మా అన్న బ్యాంక్‌లో పనిచేసేవాడు. మా వదిన, నా సొంత మేనత్త కూతురే. నేను పెద్ద మనిషయ్యానని తెలిసి మా అత్త, వదిన కలిసి నాకు రెండు జతల పైటా పావడలు, మెడలోకి లక్ష్మి డాలర్‌తో సన్న చైను కొని పెట్టారు. టైలర్‌ దగ్గరికి తీసుకెళ్ళి నా ఆది ఇచ్చి రైకలు కుట్టించారు. పైటా, పావడ ఎలా వేసుకోవాలో మా వదిన నేర్పించింది. వాటితోపాటు నాకు మా వదిన నాలుగు లో బాడీలు కూడా కొనిపెట్టింది. ఒక్కసారిగా అలా వేరే బట్టలు వేసుకోగానే ఎందుకో పెద్దదాన్నయిపోయినట్లు సంతోషమేసింది. ఆ రాత్రి పడుకున్నప్పుడు అదే మాట అత్తకి చెపితే అత్త ఏమీ మాట్లాడకుండా నిట్టూర్చింది. అత్త అలా నిట్టూర్చడం వల్లనేమో రాత్రంతా నాకు చెడ్డ చెడ్డ కలలు వచ్చాయి. చాలా భయమేసింది. పేపరు చదువుకుంటున్న మా అన్న దగ్గరికి వెళ్ళి, ‘అన్నా! నేను ఎంతవరకు చదివితే అంతవరకూ చదువుకోనిస్తారు కదా అమ్మా, నాయనా’ అన్నాను. అన్న పేపరు పేజీని తిప్పుతూ, ‘‘ఆ! బంగారుమాలా చదువుకో, నేనున్నాను కదా, నీకెందుకు భయం’’ అన్నాడు.
సెలవలయ్యాక ఇంటికి తిరిగి వచ్చేశాను. బడి తెరిచిన తర్వాతి రోజే నా పుట్టిన రోజు. అందుకని మొదటి రోజు బడికి పోకుండా, మరుసటి రోజు ఎప్పుడూ ఎత్తి కట్టి ఉంచే నా జడల్ని బారుపాటి ఒక్క జడగా వేయించుకుని, ముళ్ళగోరింట పువ్వుల్ని ముద్దగా తలలో పెట్టించుకుని, క్తొత లంగా ఓణీ వేసుకుని, పుట్టిన రోజుకని అన్న కొనిచ్చిన చాకొలెట్‌ ప్యాకెట్‌ పట్టుకుని స్కూల్‌కి వెళ్ళాను. అందరికీ చాక్లెట్లు పంచాక అమరేంద్ర సార్‌ని వెదుక్కుంటూ లైబ్రరీకి వెళ్ళాను. సార్‌ అక్కడ కూర్చుని రాసుకుంటూ ఉన్నాడు. సార్‌కి చాక్లెట్లు ఇచ్చాక చాక్లెట్ల డబ్బాను సుభద్ర చేతిలో పెట్టి సార్‌ పాదాలకి నమస్కరించాను. అలా నమస్కరించాలని నేను మనసులో చాలా ఊహించి పెట్టుకున్నాను. ఎందుకంటే సార్‌ ఆశీర్వదిస్తే అది తప్పకుండా నాకు మేలు చేస్తుందని ఎందుకో నా మనసుకి అనిపించింది. నేను పాదాలకి దండం పెట్టగానే సార్‌ లేచి నా తలమీద చేయుంచి ‘మే గాడ్‌ బ్లెస్‌ యు విత్‌ గ్రేట్‌ సక్సెస్‌ అండ్‌ ప్రాస్పరిటీ’ అని, నన్ను ఎగాదిగా చూసి తనలో తాను అనుకుంటున్నట్లుగా ‘అరే చెంచులక్ష్మీ! హఠాత్తుగా చాలా పెద్దదానివైపోయావే’ అన్నాడు. నాకు సిగ్గు కలిగింది. అలా పెద్దదాన్నయిపోవడం నాకు చాలా నచ్చింది. పైపెచ్చు నేను మా క్లాస్‌కి లీడర్ని కూడా. అందుకే కలర్‌ డ్రెస్‌ రోజుల్లో అప్పుడప్పుడూ పైటా, పావడాలు వేసుకోవటం మొదలుపెట్టాను.
ఆ డిసెంబర్‌ నెల రెండో వారంలో సుభద్ర హఠాత్తుగా స్కూల్‌కి రావడం మానేసింది. తెలుసుకుందామని వాళ్ళింటికి వెళితే, సుభద్రకి ఏదో సంబంధం కుదిరిందని, పెళ్ళి వెంటనే చేసేస్తున్నామని చెప్పింది వాళ్ళమ్మ. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నాకేమో చాలా దిగులు పట్టుకుంది. ఒకటో తరగతి నుండి ఇద్దరం స్నేహితులం. నేను దిగులు పడుతుంటే తను నా వీపుతట్టి బాగా చదువుకో, పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలి అంది. సుభద్ర చదువు మానేసి మరీ అలా సంతోషంగా ఉండటం నాకు నచ్చలేదు. చిరాకుగా కాళ్ళీడ్చుకుంటూ వస్తుంటే దారిలో కృష్ణవేణమ్మ వాళ్ళ మిద్దె వాకిలి ముందు నిలుచుని కనిపించాడు అమరేంద్ర సార్‌. ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మరుసటి రోజు క్లాస్‌లో అమరేంద్ర సార్‌ని ఇంగ్లీష్‌ మాట్లాడటం నేర్పించమని అడగాలని ఆలోచించుకుంటూ ఇంటికొచ్చేశాను. కానీ ఆ అడగటం సంక్రాంతి సెలవులు తరవాతే వీలుపడిరది. సార్‌ ‘స్పోకెన్‌ ఇంగ్లీష్‌’ మాట వినగానే మొదట కాసేపు ఏమీ మాట్లాడలేదు. చివరికి సరే నేర్పిస్తాను, కానీ కనీసం పదిమందయినా ఉండాలి, ఎవరెవరు వస్తారో చెప్పండి అన్నారు. చివరికి నలుగురు మాత్రం చేతులెత్తారు. వాళ్ళు కూడా నిక్కీ నీలిగి, తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లా ఉన్నారు. సార్‌ మొదటిసారి విసుగ్గా, కనీసం పది మందిని కూడగట్టుకుని రా చెంచులక్ష్మీ, అప్పుడు నేర్పిస్తాను అన్నాడు. సార్‌ చెప్పినట్లు పదిమందిని కూడగట్టడానికి పది రోజులు ప్రయత్నించాను. ఆశ్చర్యంగా మొదట చేతులెత్తిన నలుగురు కూడా వెనక్కి తగ్గారు. ఇంగ్లీష్‌ అంటే అందరికీ భయమే. అది చాలక మాట్లాడటం కూడానా! మా క్లాస్‌లో కొంతమందియితే ఇంతవరకూ ఎ తర్వాత బి వస్తుందని కూడా తెలీదు. నేనిక నా ఇంగ్లీష్‌ కలను వదిలేసుకున్నాను.
ఒక వారం తర్వాత అనుకుంటూ లైబ్రరీలో కూర్చుని వార్తాపత్రికలోని సినిమా బొమ్మల్ని శ్రద్ధగా చూస్తూ ఉంటే, వెనకనుండి అమరేంద్ర సార్‌ మెల్లగా తలమీద మొట్టికాయ వేశాడు. ఆయన లోపలికి ఎప్పుడొచ్చాడో నేను గమనించుకోలేదు. ‘‘ఏంటీ, ఫేవరేట్‌ హీరోనా?’’ అన్నాడు సార్‌ పేపర్లోకి వేలు చూపించి. నేను నవ్వాను కాదన్నట్లు తల ఊపుతూ. కానీ ఆ బొమ్మ నా ఫేవరేట్‌ హీరోదే. సార్‌ హఠాత్తుగా ‘‘ఏమైంది చెంచు లక్ష్మీ, నీ స్పోకెన్‌ ఇంగ్లీష్‌ ఐడియా’’ అన్నాడు. ఎవ్వరూ సిద్ధంగా లేరని చెప్పాను. సార్‌ చాలా శాంతంగా, ‘‘సరేలే నువ్వు నేర్చుకో, నీకు నేర్పిస్తా. నేర్చుకుంటాననే వాళ్ళకి లేదని చెప్పడం గురువుకి ధర్మం కాదు. నువ్వు నా టైం టేబుల్‌, నీ టైం టేబుల్‌ కలిపి చూసి ఖాళీగా ఉన్నప్పుడు వస్తుండు’’ అన్నాడు. అలా నా ఇంగ్లీష్‌ ప్రయాణం మొదలైంది. ఇంగ్లీష్‌ నేర్చుకుంటుంటే గొప్పదాన్నయిపోతున్నానన్నట్లు చాలా గర్వంగా ఉండేది నాకు.
ఒకరోజు చివరి పీరియడ్‌ సార్‌కి ఖాళీగా కనిపించింది. మా తెలుగు సార్‌ సెలవు పెట్టాడు. పిల్లలందరూ ఇళ్ళకు బయల్దేరారు. సరే అమరేంద్ర సార్‌ దగ్గరికి వెళ్ళి క్లాస్‌ చెప్తారేమో అడుగుదామని బయల్దేరుతుంటే రజియా కమ్మరకట్టు ఇచ్చింది. దాన్ని బుగ్గల్లో వేసుకుని చప్పరించుకుంటూ వెళ్ళాను. చూస్తే సార్‌ ఏదో సీరియస్‌గా రాసుకుంటూ ఉన్నాడు. నేను కూర్చుని గబగబా నోట్లోని కమ్మరకట్టుని కొరకడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఆ శబ్దానికి సార్‌ తలెత్తి చూశాడు. అలాగే కళ్ళు ఆర్పకుండా చూస్తుంటే నేను మూతికి చేతిని అడ్డం పెట్టుకుని చివరి కిటికీ దగ్గరికి వెళ్ళాను నోట్లో నుండి బయటికి ఊసేందుకు. నేను వెళ్తుంటే సార్‌ వెనకనుండి ‘ఏయ్‌ పడెయ్యకు. తిను, నెమ్మదిగా’ అన్నాడు. ఆ క్లాస్‌ రూమ్‌ పక్కన పెద్ద రావి చెట్టు ఉంటుంది. ఆకులతో క్షణం తీరిక లేకుండా చప్పుడు చేస్తూ ఉంటుంది. సూర్యాస్తమయం నారింజ కాంతి ఆకుల మీద పడుతుంటే అవి మిలమిల మెరుస్తున్నాయి. నాకు ఆ కాంతి చాలా దివ్యంగా కవిత్వంలో చెప్పినట్లు మ్యాజికల్‌గా అనిపిస్తూ ఉంటే ఎన్నోసార్లు చూసినదే అయినా కొత్తగా కళ్ళప్పగించుకుని కిటికీలో నుండి చూస్తున్నా. ఆ మైమరపులో, ఆ కిటికీ తలుపులు మూసేందుకు నా మీద నుండి వంగిన అమరేంద్ర సార్‌ని చూసుకోలేదు. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇటువైపుకి తిరగగానే నా తల సరిగ్గా సార్‌ బుగ్గల దగ్గరికి వచ్చింది, నేను పొడవు పిల్లని కదా అందుకని. నేను సారీ సార్‌ అని నా మీదుగా ఉన్న సార్‌ చేతినుండి కిందకి వంగి వెళ్ళబోతుంటే సార్‌ ఆ చేతిని వేగంగా నా నడుము చుట్టూ వేసి ఇంకో చేత్తో నా తలని పట్టుకుని పెదవుల మీద ముద్దు పెట్టాడు. ఒకసారి మామూలుగా పెదాలపైన పెట్టి, రెండోసారి నా నోట్లో కమ్మరకట్టు తన నోట్లోకి లాగేసుకోవడానికి ప్రయత్నించాడు. నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. కళ్ళు తిరిగినట్లు అనిపించింది. కమ్మరకట్టుని బుగ్గలోకి నెట్టి అలాగే నిలబడ్డాను. సార్‌ తిరిగి వెళ్ళి తన కుర్చీలో కూర్చుని ‘‘వచ్చి పుస్తకం తెరువు’’ అన్నాడు. నేను వెళ్ళి కూర్చున్నాను. కాసేపటికి నాకు ఆయన చెప్తున్నదేదీ బుర్రకి ఎక్కడం లేదని అర్థమయింది. ఏం జరిగిందో నెమ్మదిగా అర్థమవుతూ వచ్చింది. ఇంటికి వెళ్ళిపోవాలని అనిపించింది. ఆయనకేం చెప్పి వెళ్ళాలో అర్థం కాక భయం వేసింది. నన్ను చూసి ఏమనిపించిందో కానీ ఆయన ఒక్క క్షణం చెప్పేది ఆపి నా వంక అలాగే చూస్తూ కూర్చున్నాడు. చివరికి నెమ్మదిగా చేతివేళ్ళతో నుదుటిని రుద్దుకుంటూ ‘‘నోట్లో ఉండేది మింగు. లేదంటే ఇంకోసారి ముద్దు పెట్టాల్సి వస్తుంది. కళ్ళముందే ఎంత అందంగా తయారయ్యావే నువ్వు’’ అన్నాడు. నాకు భయం ఇంకా పెరిగి, చాలా త్వరగా బాత్రూంకి వెళ్ళాలన్నట్లు అనిపించింది. నేను లేచి సార్‌కి ఒక్క వేలు చూపించాను. సార్‌ నవ్వి, ‘‘సరే అటునుండి అటే ఇంటి
కెళ్ళు’’ అని తన పుస్తకాలు కూడా మూయడం మొదలుపెట్టాడు. నేను పుస్తకాలు తీసుకుని దబదబామని మెట్లు దిగి బాత్రూంకి పరిగెత్తాను.
ఇదంతా జరిగి చాలా కాలమయినా, ఆ సన్నివేశం ఇంకా అలానే అచ్చుగుద్దినట్లు మనసులో మెదులుతుంది. రజియా ఇచ్చిన కమ్మరకట్టు, గలగలమని చప్పుడు చేస్తూ మెరిసిన రావిచెట్టు, అమరేంద్ర సార్‌ ఎర్రటి పెదవులు, అన్నీ ఆ ఒక్క ముద్దు తరువాత ఎక్కడివక్కడ స్తంభించిపోయినట్లు, గడ్డకట్టుకుపోయిన ఒక సన్నివేశం కళ్ళముందు కనిపిస్తుంది. నా కళ్ళకు చీకట్లు కమ్మడం, ఆ చీకట్లలో నుండి భయం భయంగా నా గుండె కొట్టుకోవడం అన్నీ ఈ రోజు, ఇప్పుడే చూసిన సినిమాలోని దృశ్యంలా, ఎవరో స్పష్టంగా వేసిన రంగుల చిత్రంలా కళ్ళముందు కనిపిస్తుంది. ఆశ్చర్యంగా అంతటి స్పష్ట చిత్రంలో నా ముఖం నాకు కనిపించదు. ముఖం స్థానమంతా బూజర బూజరగా ఉంటుంది. ఎంత ఆలోచించినా, జ్ఞాపకం తెచ్చుకున్నా అప్పటి నా ముఖం నాకు కనిపించదు. ఎందుకని? ఎందుకనో, బహుశా అప్పటి పధ్నాలుగేళ్ళ నాకు బాగా తెలిసే ఉంటుంది.
ఆ రోజు ఇంటికి పరిగెత్తుకొచ్చి పుస్తకాల సంచి గూట్లో ఉంచి, అమ్మ పిలుస్తున్నా పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ పక్కనే నరసింహ స్వామి గుడికి వెళ్ళి, ఖాళీ ఖాళీగా ఇంకా సంధ్య దీపం వెలిగించని ఆ గుడిలో దేవుడికి దండం పెట్టుకుని, ఆ తర్వాత దేవునితో ఏం చెప్పాలో అర్థం కాక ఏడుపొచ్చి ఏడ్చిన నాకు, ఆ చిత్రంలో నా ముఖం నాకు ఎందుకు కనిపించటం లేదో తెలిసే ఉంటుంది. దేవుడికి చెప్తే, దేవుడు కోపమొచ్చి సార్‌ని ఏమయినా చేస్తేనో, వద్దొద్దు ఏం చెప్పొద్దు అనుకోవడం… కానీ సార్‌ అలా చెయ్యొచ్చా, ఆయన చేసింది తప్పు కాదా? లేదంటే నాదే తప్పా? అవును, ఖచ్చితంగా నేనే ఏదో తప్పు చేసి ఉంటాను. కానీ ఏం తప్పు అది? సార్‌ చాలా మంచివాడు, నిజ్జంగా మంచివాడు. తప్పు నాదే. కానీ, అదేంటో నాకు తెలీదు. అందుకని దేవుడికి చెప్పడం వృథా. ఎవరికయినా చెప్పడం కూడా వృథా అని నింద అంతా నా తలపై వేసుకోవడం… ఆ పసితనపు అజ్ఞానం… ఇవన్నీ గడ్డకట్టిన సన్నివేశంలో గాలిలో తేలుతూ కనిపిస్తాయి.
ఇంటికొచ్చి యూనిఫామ్‌ తీయకుండా, తిండీ తిప్పలూ లేకుండా పడుకుని ఉంటే అమ్మ ‘‘ఏమయిందమ్మా! కడుపులో నొప్పా’’ అంటే, ఊ కొట్టి, నాదేం తప్పో అడగాలని నోటివరకూ వచ్చి ఊరుకున్నాను. ఇంకెవరిని అడగాలి? సుభద్రని అడగొచ్చా? అడిగితే ఏమంటుంది? ‘‘నువ్వే పొద్దస్తమానం ఆయన వెనుక తిరిగావ్‌, నీదే తప్పు!’’ అంటుందా, ‘‘ఇంక ఆయన వంక కూడా చూడకు’’ అంటుందా? అవును, నిజం. ఇంక వెళ్ళొద్దు. అమరేంద్ర సార్‌ దగ్గరికి అసలు ఇంక ఎప్పుడూ వెళ్ళొద్దు, అసలు స్కూల్‌కే వెళ్ళొద్దు, ప్రయివేట్‌గా చదువుకుంటానని అన్నకి చెప్పేద్దాం అని నిశ్చయించుకుని హాయిగా నిద్రపోయా. మరుసటి రోజు, ఆ తర్వాత నాలుగు రోజులు బడికి వెళ్ళకపోయేసరికి సన్నగా ఏదో బాధ మొదలయింది. సరిగ్గా అప్పుడే క్లాస్‌మేట్‌ గీత ఇంటికొచ్చింది. ‘‘లక్ష్మీ! నువ్వు బడికి ఎందుకని రావటంలేదో కనుక్కుని రమ్మని పంపించాడే అమరేంద్ర సారూ. కొత్త పాఠం మొదలుపెట్టి నోట్స్‌ కూడా చెప్పేశాడు. నీకేమన్నా ఆరోగ్యం బాగాలేదా అని కనుక్కుని రమ్మన్నాడు’’ అన్నది. అప్పుడే ఇంట్లోకొచ్చిన అమ్మ అదంతా విని, ‘రేపటినుంచి వస్తుందిలే పాపా’ అన్నది గీతతో. నాకేం చెప్పాలో అర్థం కాలా. తను కాసేపుండి వెళ్ళిపోయింది. గీత వెళ్ళిపోయిన తరువాత చాలాసేపు ఆలోచించి, చివరికి సార్‌ ఇంక అలా చెయ్యడులే, అదేదో నా వలన జరిగిన పొరపాటు. నేను సక్రమంగా ఉంటే ఆయన అలా చెయ్యడు. సార్‌ చాలా మంచివాడు, చాలా మంచివాడు. ఎన్ని రోజులుగా చూడటం లేదు అని మనసు తేలిక చేసేసుకున్నాను.
బడికి వెళ్ళిన రోజు, మరుసటి రోజు, ఆపై రోజు కూడా ఏమీ కాలేదు. ఆయనవైపు చూడకుండా చూపులు తప్పించుకుని తిరుగుతుంటే ఆ తరువాతి రోజు నాలుగో పీరియడ్‌, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ క్లాస్‌ జరుగుతుండగా ‘‘అమరేంద్ర సారు ఈ క్లాస్‌ అయిపోయాక నిన్ను రమ్మన్నాడు చెంచు లక్ష్మీ’’ అని పదో తరగతి అబ్బాయి వచ్చి చెప్పాడు. అట్లాగే ‘‘సార్‌ ఇంగ్లీష్‌ వక్తృత్వం పోటీలకు నీ పేరు రాసుకోమన్నాడు. రాసుకుంటున్నా’’ అని చెప్పి వెళ్ళిపోయాడు. క్రాఫ్ట్స్‌ మేడం నా వంక చూసి ‘‘పోమ్మా చెంచులక్ష్మీ! సార్‌కి కనిపించేసి రా పో’’ అని క్లాస్‌లో నుండి పంపింది. గుండె పెద్దగా డబ్‌ డబ్‌ అని కొట్టుకుంటోంది. ఇప్పుడేం చెయ్యాలి. కడుపులో తిప్పినట్లయ్యి బాత్రూమ్‌కి వెళ్ళాలనిపించి, వెళ్ళి అక్కడే కాసేపు నిలబడ్డాను. ఆ తర్వాత చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి చూస్తే ఆయన ఆ రోజు నేను నిలబడిన కిటికీ దగ్గరే నిలబడి బయటికి చూస్తున్నాడు. చిన్నగా ‘‘సార్‌’’ అని పిలవగానే వెనక్కి తిరిగి చూసి, ‘‘వచ్చావా ఇలా రా. చూడు చెట్టు పైన వలస కొంగలు ఎలా గూడు కడుతున్నాయో’’ అన్నాడు. పోవాలా? వద్దా? భయంతో, సంశయంగా, చిన్నగా కదిలి వెళ్ళి ఆయనకు కొంత దూరంగా నిలబడి, ఆయన చూపించిన దిక్కుకి చూస్తుంటే నెమ్మదిగా తన తల నా చెవి దగ్గరగా చేర్చి చిన్నగా, మృదువుగా ‘‘నేను నిన్ను లవ్‌ చేస్తున్నానురా. నేనెందుకిలా చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. నువ్వు నాలుగు రోజులు స్కూల్‌కి రాకుంటే, ఆత్మహత్య చేసుకుని చనిపోదామనిపించింది. ప్రామిస్‌గా చెప్తున్నాను. నన్ను కాదనకురా బంగారూ, ఐలవ్‌ యూ విత్‌ ఆల్‌ మై బాడీ అండ్‌ సోల్‌’’ అన్నాడు. అంత పెద్ద వ్యక్తి అలా మాట్లాడుతుంటే నాకు మళ్ళీ అయోమయం కమ్ముకున్నది. ఆయన వంక చూడకుండా అక్కడనుండి వచ్చేద్దామని వెనక్కి తిరగగానే, ఆయన నన్ను గబుక్కున వెనకనుండి కావలించుకుని మెడమీద ముద్దు పెట్టి ‘‘ఒట్టేసి చెప్తున్నా, నువ్వు ఈ రూమ్‌ దాటి ఒక్క అడుగు బయటికి వేసినా, నేను ఈ బిల్డింగ్‌ పైనుండి దూకి చచ్చిపోతాను, ఆ తర్వాత నీ ఇష్టం’’ అన్నాడు. నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. శరీరం గడగడా వణికింది. గుండెల్లో నుండి ఏడుపు తన్నుకొచ్చింది. ఏడుస్తూ ‘‘సార్‌, నాకు భయంగా ఉంది. మీరలా మాట్లాడవద్దు. నాకు చాలా భయంగా ఉంది. నేను బాత్రూంకి వెళ్ళాలి’’ అంటే, ఆయన నన్ను తన వైపుకి తిప్పుకుని ‘‘నేనున్నాను కదా భయపడకు. నీ టెన్త్‌ క్లాస్‌ అవ్వగానే మనిద్దరం పెళ్ళి చేసుకుందాం. నిన్ను నేను చదివిస్తాను’’ అన్నాడు.
ఆ తర్వాత కొద్దిరోజులకు టౌన్‌ నుండి రావడం, పోవడం కష్టంగా ఉందని మా ఊర్లోనే కృష్ణవేణమ్మ వాళ్ళ ఖాళీ ఇంట్లోకి వచ్చి చేరాడు అమరేంద్ర సార్‌. మా ఊర్లో మేముండే ప్రాంతంలో ఒక్క కృష్ణవేణమ్మ వాళ్ళదే మిద్దె ఇల్లు. ఆవిడ చనిపోయాక అది ఖాళీగా
ఉండేది. సార్‌ అడిగితే టౌన్‌లో ఉండే ఆవిడ కొడుకు సార్‌ను ఉండమన్నాడు. సార్‌కి సహాయంగా కొంచెం ఇల్లు ఊడ్చి, నాలుగు బక్కెట్ల నీళ్ళు తోడిచ్చి వస్తానంటే వెళ్ళమనేది మా అమ్మ. సార్‌తో నా ఏకాంతం అలా మొదలయింది. ఈ ఏకాంతంలో ఇంగ్లీష్‌ నేర్చుకోవడం కొండెక్కింది. దేనిమీదా ధ్యాస ఉండేది కాదు. తొమ్మిదో తరగతి అయిపోయింది. ఎండాకాలం సెలవలు ఇచ్చేశారు. సార్‌ ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్తుంటే విపరీతమయిన దుఃఖం కమ్మేసింది. గోడకానుకుని కూర్చుని ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్న దృశ్యం ఇప్పటికి కూడా చాలా కొత్తగా కళ్ళముందు కనిపిస్తూ ఉంటుంది. ఆయన చూపించే ప్రేమ, ముద్దులు, గారాబం అన్నీ తనకు కొంతకాలమైనా సరే దూరం కాబోతున్నాయంటే తట్టుకోవడం చాలా కష్టమనిపించింది. ఏడుస్తుంటే ఆయన కూడా పక్కన కూర్చుని నా చుట్టూ చేయి వేసి తన చెంతకు లాక్కుని, ‘‘ఏడవకు బంగారు, ఎన్నో రోజులు కాదు కదా. సెలవల్లో ఇంగ్లీష్‌ బాగా ప్రాక్టీస్‌ చెయ్యి. మనిద్దరం ప్రేమలో పడి దాన్ని గాలికొదిలేశాం. నా భార్య అంటే ఎలా ఉండాలి చెప్పు. గలగలమని ఇంగ్లీష్‌ మాట్లాడగలగాలి, సరేనా?’’ అని చేతిలో చేయి వేయించుకుని ప్రమాణం చేయించుకుని వెళ్ళిపోయాడు.
ఎండాకాలం సెలవలైపోయి బడులు తెరిచారు. మేమందరం పదో తరగతిలోకి వచ్చేశాం. హెడ్మాస్టర్‌ పక్కనుండే గదికి మారాము. సెలవల్లో అప్పుడప్పుడూ వెళ్ళి అమరేంద్ర సార్‌ ఇల్లు చూసి వచ్చేదాన్ని. సాయంకాలం పూట అలా వెళ్ళి ఒక్కసారి ఆయన ఇల్లు చూసి వస్తే ఆ రాత్రి కమ్మగా నిద్ర వచ్చేది. ఆయన్నే చూసినట్లు అనిపించేది. బళ్ళు తెరిచిన మొదటి రోజు పొద్దున్నే వెళ్ళి చూస్తే ఆయన రాలేదు. బహుశా మొదటి రోజు కనుక నేరుగా బడికే వస్తారనుకుని చూస్తే, బడికి కూడా రాలేదు. ఆ తర్వాత తెలిసింది ఆయన లేట్‌గా వచ్చి త్వరగా వెళ్ళిపోయారని. మనసంతా బాధ. ఇన్ని రోజుల తర్వాత వచ్చాడు కదా, కనీసం నన్ను చూడాలని కూడా అనిపించలేదా అని. ఆ తర్వాత తెలిసిన విషయం జీవితంలో మొదటిసారి బాధకి రూపం ఎలా ఉంటుందో తెలుసుకునేలా చేసింది. అంతులేని బాధ. మనోవేదన భూతం లాంటిది. ఆ భూతం మనల్ని పట్టుకుని అనంతమయిన దుఃఖంలోకి నెట్టేస్తుంది. మన హృదయంపై దాని గోళ్ళతో బరబరా గీకి గాయం చేస్తుంది. గాయం మానినా మచ్చలు మనకు గాయం పెట్టిన బాధను జ్ఞాపకం చేస్తుంటాయి. పధ్నాలుగు, పదిహేనేళ్ళ లేత పిల్ల ఎందుకు అంత బాధని అనుభవించాలి.
రెండోరోజు సార్‌ క్లాస్‌కి వచ్చి వెళ్తుంటే, వెనకాలే వెళ్ళి ‘బాగున్నారా’ అని చిన్నగా అడిగి ‘‘సాయంత్రం ఇంటికి రమ్మంటారా’’ అంటే, ఆయన వెనక్కి తిరగకుండానే, ‘‘అవసరం లేదు, పదవ తరగతికి వచ్చావ్‌. శ్రద్ధగా చదువు’’ అని ముభావంగా చెప్పి స్టాఫ్‌ రూమ్‌లోకి వెళ్లిపోయాడు. ఏమైంది? హఠాత్తుగా అంత కఠినంగా ఎందుకు మాట్లాడాడాయన? నేనేమైనా తప్పు చేశానా? అని మనసంతా కలవరపడిపోయింది. ఏడుపు గుండెల్లోంచి ఎగదన్నుకుని వచ్చింది. క్లాస్‌కి వెళ్ళి సంచి తగిలించుకుని, కడుపులో నెప్పి వస్తోందని టీచర్‌కి చెప్పి నేరుగా వెళ్ళి నరసింహ స్వామి గుడిలో కూర్చున్నాను. గుడి ఖాళీగా ఉంది. గుడి గోడమీదకి వాలి ఉన్న పున్నాగ పూల చెట్టు గాలికి ఊగినప్పుడల్లా నిన్నటి పున్నాగ పువ్వులు, పక్షి నుంచి రాలిపోయిన ఈకల్లా గాలిలో తేలుతూ ఒక్కొక్కటీ ఒక్కోచోట పడుతున్నాయి. చూస్తూ చూస్తూ ఉంటే ఎందుకో చాలా ఏడుపు వచ్చింది. ఇక్కడ ఏడవొచ్చు. ఎవరూ చూడరు. దేవుడికి చెప్పుకోవచ్చు. ఎవరికీ చెప్పడు! ఎందుకిలా చేశావని తిట్టడూ, కొట్టడు. ఏడ్చి ఏడ్చి ఎందుకో ఒకసారి అమరేంద్ర సార్‌ ఇంటివైపుకి వెళ్ళాలనిపించి నెమ్మదిగా దారి అంచుగా, చెట్ల నీడల్లో నడిచి వెళ్తుంటే, ఆయన ఇంటి ముందు ఆపి ఉన్న ట్రక్కులో నుండి సామాన్లు దిగుతూ కనిపించాయి. మిద్దెపైన నిలబడి ఒకావిడ, పదేళ్ళ పాప కింది నుండి పట్టుకొస్తున్న సామాన్లని చూస్తూ ఉన్నారు. ఎవరై ఉంటుంది ఆవిడ? సార్‌ వాళ్ళ చెల్లెలో, బంధువో కావచ్చునేమో. రేపు సార్‌ని అడుగుదాం అనుకుని అంతవరకూ ఏడ్చిన ఏడుపును మర్చిపోయి ఇంటికి వచ్చేశాను.
మరుసటి రోజు అమరేంద్ర సార్‌ క్లాస్‌కి వచ్చాడు. అందరినీ పేరుపేరునా పలకరించాడు. నా దగ్గరికి వచ్చేసరికి, ‘‘చెంచు లక్ష్మీ! శ్రద్ధగా చదువు, ఇది పదో తరగతి. ఇప్పుడిక స్పోకెన్‌ ఇంగ్లీష్‌ అవీ కుదరవు. క్లాస్‌ పుస్తకాల మీద పూర్తి దృష్టి ఉంచు’’ అన్నాడు. ఆయన నా వైపు చూస్తున్నాడనే ఆనందం తప్పించి ఆయన చెప్పిన మాటలవైపు నా దృష్టి వెళ్ళలేదు. అందుకే, ఆ రోజు లెక్కల పీరియడ్‌లో, లెక్కల టీచర్‌కి బాత్రూంకని చెప్పి పరిగెత్తుకుంటూ ఆయన కోసం లైబ్రరీలో వెతికి ఆపై రావిచెట్టు గదిలోకి వెళ్ళి చూస్తే గడ్డం కింద చేయి ఉంచుకుని ఏదో ఆలోచిస్తూ కనిపించాడాయన. ఎవరూ లేనప్పుడు నాతో ‘సన్నీ’ అని ముద్దుగా పిలిపించుకోవడం ఆయనకు ఇష్టం. అలా పిలవడం నాకు బలవంతంగా అలవాటు చేశాడు. ఇవాళ ఇద్దరమే ఉన్నా అలా పిలవాలంటే నాకెందుకో భయం వేసింది. అయినా గొంతు పెగల్చుకుని ‘సన్నీ అలా ఉన్నావేంటి’ అని ‘మీ ఇంటి దగ్గర ఎవరినో చూశాను. మీ చెల్లాలా?’’ అంటే, ఆయన నావంక చూసి, ‘‘వాళ్ళు నా భార్య, కూతురు’’ అని, చాలా విసుగ్గా ‘‘వెళ్ళు క్లాస్‌ టైంలో ఎందుకొచ్చావు? ఇక ఈ స్పోకెన్‌ ఇంగ్లీష్‌ క్లాసు కట్టిపెట్టమని చెప్పానా, వెళ్ళిక్కడి నుంచి’’ అన్నాడు కోపంగా.
తిరిగి క్లాస్‌లోకి వచ్చి కూర్చున్నాను. ఎలా దిగి వచ్చానో, ఎలా కూర్చున్నానో ఏమీ జ్ఞాపకం లేదు. ప్రపంచంలో నిశ్శబ్దం తప్పించి మరేమీ లేనట్టు హృదయమంతా మౌనంతో నిండిపోయింది. ఏడుపు రావాలి కదా, అదీ రాలేదు. ఇంటికొచ్చాక ఆ రాత్రి నేనూ, చీకటీ మాత్రమే ఏకాంతంగా ఉన్నప్పుడు అంతవరకూ మేఘావృతమయిన ఆకాశం తెల్లగా తెరిపిన పడ్డట్లు, కాంతిగా ఒక విషయం తేటతెల్లమయింది. అమరేంద్ర సార్‌కి పెళ్ళయింది. బిడ్డ కూడా ఉంది. అంత పెద్ద బిడ్డ ఉందంటే ఎప్పుడో పెళ్ళయిందని అర్థం. పెళ్ళి, ప్రేమ అని, నాతో ఆయన చెప్పిన మాటలన్నీ అబద్ధాలు… పచ్చి పచ్చి అబద్ధాలు. ఇప్పుడిక అంతా అర్థమయింది. ఆయనకిక నాతో మాట్లాడటం, నన్ను దగ్గరికి రానీయడం ఇష్టం లేదు అని నాకు నేను స్పష్టపరచుకోగానే ఏడుపు తన్నుకొచ్చేసింది. రాత్రంతా ఆకాశం చిల్లులు పడితే కురిసే వర్షంలా ఎక్కిళ్ళు పెట్టుకుంటూ ఏడ్చి ఏడ్చి ఉదయమే లేవలేకపోతే, లేపడానికి వచ్చిన అమ్మ ‘‘ఏమయింది, ముఖం అలా వాసిందేంటి? కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి?’’ అంటే ‘‘తెలీదమ్మా! ఈ రోజు స్కూల్‌కి కూడా పోలేను’’ అని చెప్పి ముసుగు పెట్టుకుని పడుకున్నాను. అలా వారం రోజులు పడుకున్నాక ఇంకో విషయం అర్థమయింది. అదేంటంటే, అమరేంద్ర సార్‌కి పెళ్ళి అయ్యుండొచ్చు కానీ, తను మాత్రం ఆయన్ని వదిలి బ్రతకలేదు. అది ఆయనకి చెప్పేయాలి. తనని రెండో భార్యగా చేసుకోమని అడగాలి. వీలు కాదంటాడా! కనీసం ఊళ్ళో ఉండే అంగటి కిష్టయ్య, సుబ్బమ్మని ఉంచుకున్నట్టు, తనని ఉంచుకోమని అడగాలి!
బడికి వెళ్ళి తగిన సమయం చూసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. తాను చెప్పబోతున్న విషయం ఆయనకి చాలా ఆనందం కలిగిస్తుంది. అవును! ప్రేమ కోసం తాను త్యాగం చేయబోతోంది. ఉంపుడుగత్తెగా ఉండడానికి కూడా సిద్ధపడబోతోంది. ఆయన ఖచ్చితంగా ఆనందపడతాడు అనుకుంటూ, అదే విషయాన్ని ఆయనకి చెప్పగానే సర్రుమని పైకి లేచి, ‘‘చదువు మీద దృష్టి పెట్టమని చెప్పానా! ఇక్కడికి రావద్దని చెప్పా కదా. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? వెళ్ళు, వెళ్ళిక్కడినుంచి’’ అని కసిరికొట్టాడు. మళ్ళీ తలంతా స్తంభించిపోయింది. ఏం తప్పు చేసింది తను. ఉంపుడుగత్తెగా అయినా ఉండాలని సిద్ధపడిరది కదా. ఆయనకసలు నా మీద ప్రేమ ఉందా? ఉంది! ప్రేమ ఉంది. ప్రేమ లేకపోతే నా చదువు గురించి అన్నిసార్లు ఎందుకు మాట్లాడతాడు?
ఆ రోజు తరువాత మళ్ళీ ఒక వారం స్కూల్‌కి వెళ్ళలేదు. క్లాస్‌ టీచర్‌ లేపి, అటెండెన్స్‌ తక్కువయితే పబ్లిక్‌ పరీక్షకు కూర్చోనివ్వరని చెప్పింది. బాగా చదివే పిల్లకి ఏం ముసింపు వచ్చిందని విసుక్కుంది. అమరేంద్ర సార్‌ కూడా క్లాస్‌ తీసుకున్నాడు. క్లాస్‌కి వారం రోజులు రానందుకు తిడుతూ, ‘‘పదో క్లాస్‌కి వచ్చేసరికి అందరికీ తోకలు ముదిరిపోతాయ్‌. చెంచు లక్ష్మికి పెళ్ళి మీద ధ్యాస మళ్ళినట్లుంది’’ అని వెటకారంగా, ముఖం ఒకలాగా పెట్టి మాట్లాడాడు. అది మొదలు ఆయనలా నన్ను ఏదో ఒకదానికి అవమానపరుస్తూ మాట్లాడటం, ప్రతి క్లాసులో సూటీపోటీగా ఏదో ఒకటి అనేవాడు. క్లాస్‌మేట్స్‌ కూడా ఆశ్చర్యపడే వాళ్ళు. పదో క్లాస్‌ కాబట్టి ఆయనలా స్ట్రిక్టుగా మారారని అనుకున్నారు చాలామంది. కొందరు మాత్రం చెంచు లక్ష్మిని మాత్రమే అంత తిడుతున్నాడేమిటని ఆశ్చర్యపడటం మొదలుపెట్టారు.
ఆయన తిట్లు భరించి భరించి ఒకరోజు ఆయన్ని కలవాలని రావిచెట్టు రూమ్‌కి వెళ్ళి చూస్తే ఆయన అక్కడ లేడు. రూమ్‌ తాళం వేసి ఉంది. ఒక పది రోజులు తిరిగాక దాదాపు ఆరునెలల పరీక్షల ముందు ఆయన ఆ రూమ్‌లో కనిపించాడు. అప్పటికే నేను చాలా చిక్కిపోయాను. ఇంకా పొడవు ఎదిగాను. ఆయన ముందు నిలబడి, ‘‘నేను ఏం తప్పు చేయకుండానే ఎందుకు నన్నలా తిడుతున్నారు?’’ అన్నాను. అతనిప్పుడు నాకు పూర్తిగా అపరిచితుడు. నన్ను ముద్దులాడి మురిపెం చేసిన ‘‘సన్నీ’’ కాదు. కనీసం నాకు పరిచయం ఉన్న అమరేంద్ర సార్‌ కూడా కాదు. ఈ రెండు మాటలూ మాట్లాడటానికి ఎన్నో రోజులు ఆలోచించి ధైర్యం కూడగట్టుకోవాల్సి వచ్చింది. ఆ మాట అంటుంటే కూడా గొంతు వణికి ఏడుపొచ్చింది. నా ఏడుపు చూసి ఆయన లేచి నా దగ్గరకి వచ్చాడు. వచ్చి నా నడుము పట్టుకుని, నా రొమ్ము మీద చెయ్యి వేసి నొక్కుతూ, ‘‘నువ్వెలా ఉంటావో తెలుసా?’’ అని నన్ను వెనక్కు తోసి, వెళ్ళి కుర్చీలో కూర్చుని ‘‘అస్థిపంజరానికి బట్టలేసినట్లుంటావ్‌. నా మీద మీద పడుతుంటే పోన్లే అని జాలిపడి దగ్గరికి రానిచ్చాను. జన్మ ధన్యమైందని జీవితాంతం నన్ను తలచుకుంటూ మొగుడి పక్కలో పడుకో పో, పో ఇక్కడినుంచి. ఇంకోసారి ఇక్కడికొస్తే స్కూల్‌లో అందరికీ నువ్వు రాసిన లవ్‌ లెటర్లు చూపించి, నన్ను వేధిస్తున్నావని చెప్తాను’’ అన్నాడు.
ఆ రోజు తర్వాత ఆయన్ని నేనెప్పుడూ ఒంటరిగా కలవలేదు. అప్పటివరకూ మనిషి లోపల ఆత్మాభిమానం అనే పదార్థమొకటి ఉంటుందని నాకు తెలియనే తెలియదు. ఆత్మహత్య చేసుకోవాలని గన్నేరుకాయలు ఏరుకొచ్చుకుని పెట్టుకున్న ఆ రాత్రి ఆ ఆత్మాభిమానం నన్ను కావలించుకుని ముద్దుపెట్టుకున్నది. ‘నువ్వెందుకు చనిపోవాలి? నువ్వేం తప్పు చేశావు? నువ్వెప్పుడూ ఆయన మీద పడలేదు. ఆయన చెప్పేది అబద్ధం. నువ్విక ఆయన ముఖం చూడకూడదు. బక్కగా ఉన్నావు కాబట్టే స్కూల్‌కి స్పోర్ట్స్‌లో స్టేట్‌ ఛాంపియన్‌షిప్‌ తెచ్చిపెట్టావు. నువ్వు బాగా చదవాలి’ అని ఆ ఆత్మాభిమానం నాకు గుర్తుచేసింది. అప్పుడు మనసుకి శాంతి అనిపించింది. పుస్తకాలపై ఏకాగ్రత కుదిరింది.
ఆ తర్వాత చాలా క్లాసులు చదువుకుంటూ ఇంత దూరం వచ్చేశాను. మా నాన్న చనిపోయాడు. మా అన్నకి పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు కూడా అయ్యారు. మా అమ్మ ఇంటిని చూసుకుంటూ మా ఊర్లోనే ఉండేది. నేను కూడా బాగున్నాను. సుఖంగా, దర్జాగా ఉన్నాను. గౌరవాలు పొందుతూ ఉన్నాను. కానీ నా లోపల ఎవ్వరికీ తెలియకుండా దాగి ఉన్న పధ్నాలుగేళ్ళ చెంచు లక్ష్మి, కొంచెం కూడా ఎదగకుండా అక్కడే, ఆ బడిలోనే ఉండిపోయింది. నేను ఉండాల్సినంత సుఖంగా నన్ను ఉండనీయకుండా వేధిస్తూ ఉంటుంది. నన్ను లోపలికి గుంజాలని చూసే కాలబిలం ఆ పిల్ల. కృంగిపోయి, చెంపలపై కారుతున్న కన్నీటి చారికలతో బలహీనంగా నన్ను చూస్తూ ఉంటుంది. నన్ను నేనే అసహ్యించుకునేలా చేస్తూ ఉంటుంది. మంచి పుస్తకాలున్న అలమారా నుంచి అసహ్యకరమైన బొమ్మలున్న బూతు పుస్తకాన్ని బయటికి లాగి, చీదరించుకుని చెత్త కుప్పలోకి విసిరేసినట్లు, మనసులో మురుగు కంపు కొడుతున్న ఆ పిల్లని బయటికి తీసి చెత్తకుప్పలో పడేయాలని నేను శక్తి కొలదీ ప్రయత్నిస్తూ ఉంటాను. చీరల అలమారా నుండి ఒక చీరను బయటకు తీసి బాగా పాతబడిపోయింది, చాల్లే ఇక వాడిరదని పక్కన పడేసినట్లు, భారంగా మోసుకు తిరుగుతున్న ఆ పధ్నాలుగో ఏడు అనుభవాన్ని ‘‘ఇక చాల్లే అనుభవించింది’’ అని పక్కన పడేయాలని ఉంటుంది. నా మెదడు పొరల్లో, హృదయపు లోతుల్లో, గట్టిగా, ఎంతకీ మానని గజ్జి కురుపులా అంటుకుపోయిన ఆ ఒక్క జ్ఞాపకాన్ని కూకటివేళ్ళతో సహా పెకిలించి, కాళ్ళ కింద వేసి తొక్కి, నామరూపాలు లేకుండా చేయాలని నిరంతరం పోరాడుతూ ఉంటాను.
జీవిత ప్రయాణంలో, దేవుడిపైన నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోయానో నాకు సరిగ్గా జ్జాపకం లేదు. ఎవరి కర్మని
వాళ్ళు అనుభవించాల్సిందేనని ఎవరయినా అంటే నాకు నవ్వొస్తుంది. మనం అనుభవిస్తున్న ఈ ప్రాపంచిక బాధలు, దుఃఖాలు అన్నీ మన స్వయంకృతాలేనా? అదే నిజమయితే ఏ కర్మ ఫలితంగా నేనీ కష్టాన్ని, ఒంటరిగా మోసుకుని తిరుగుతున్నాను. విక్రమార్కుడిలాగా వదిలించుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తున్నా, ఈ జ్ఞాపకం భేతాళుడిలాగా తిరిగి తిరిగి నా మనసుని పట్టుకుని వేళ్ళాడుతుందే… నన్ను పీల్చి పిప్పి చేస్తోందే… ఏ కర్మ ఫలితం. ఈ కర్మ సిద్ధాంతం, చేతబడులు అన్నీ ఒకానొకనాడు నాకు అర్థమయ్యాయి. అర్థం చేసుకోవడంలోని ఈ నా స్వంత పద్ధతికి సార్వజనీనత లేకపోవచ్చు, మీకెవరికీ వర్తించకపోవచ్చు, మీరెవరూ అంగీకరించకపోవచ్చు కూడా. అయినా ఫర్లేదు, నాకు ఎవరి అంగీకారాలూ అవసరం లేదు.
ఒకరోజు నేను పనిచేసే చోటకి ఒక కేస్‌ వచ్చింది. ఒక అమ్మాయి తన కొలీగ్‌ ఒకతన్ని ప్రేమిస్తోందట. ఇద్దరూ రకరకాల మార్గాలలో, వివిధ రకాల సంభాషణలు, శృంగార భంగిమల ఫోటోలు పంపించుకున్నారు. కొంతకాలమయ్యాక ఆ అమ్మాయి అతనితో పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చింది. అతను చాలా మృదువుగా, ‘‘నిన్ను నేనెలా పెళ్ళి చేసుకోగలను. నీ న్యూడ్‌ ఫోటోలు చూసి లొట్టలేసుకునే నా ఫ్రెండ్స్‌లో ఎవడయినా చేసుకుంటాడేమో అడుగుతాను’’ అన్నాడు. ఆ అమ్మాయి నివ్వెరపోయింది. అతను తన నగ్న ఫోటోలు అందరికీ చూపించడం నిజమేనా అని అతని స్నేహితులని అడిగి నిర్ధారించుకుంది. చివరికి ధైర్యంగా తల్లిదండ్రులతో కలిసి మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. ఆ కేసుని నా ఆధ్వర్యంలో మా వాళ్ళందరూ చాలా చాకచక్యంగా పరిష్కరించారు. ఎక్కడా ఆ అమ్మాయి పేరు కానీ, కుటుంబ పరువు కానీ రచ్చకెక్కకుండా జాగ్రత్తపడ్డారు. ఆ అబ్బాయి తన గోతిని తానే తవ్వుకుని అందులో పడ్డట్టు, తన స్నేహితుల ముందు పరువు పోగొట్టుకుని ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. కేసు పరిష్కారమయ్యాక ఆ అమ్మాయి తల్లిదండ్రులు డీఎస్పీ గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే మా వాళ్ళు వచ్చి నాకు ఆ విషయం చెప్పారు. నాకు సమయం లేదు, మరెప్పుడయినా చూద్దాంలే అని నేనా కృతజ్ఞతా కార్యక్రమాన్ని తిరగ్గొట్టాను. ఆ కుటుంబం వెళ్ళిపోతోంటే నా గది కిటికీ పరదాల వెనకనుండి చూస్తూ నిలబడ్డాను. ముగ్గురూ చెట్టుకింద నిలబడి ఆటో కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు. ఆ అమ్మాయి తండ్రి నెరిసిన గడ్డంతో పాలిపోయి, ముడతలు పడివున్న తన ముఖాన్ని రుమాలు పెట్టి తుడుస్తున్నాడు. మనిషి వీపుమీద ఎంతో భారాన్ని మోస్తున్నట్లు వంగిపోయి నిలుచున్నాడు. చాలా బక్కగా, చొక్కా వేసుకున్న అస్థిపంజరంలా ఉన్నాడు. అతన్ని అలా చూస్తుంటే ఆ రోజు నాకు అర్థమయింది, ఎందుకని మనుషులు దేవుడనీ, కర్మలనీ అంటారో. అది నిస్సహాయత. మన నిస్సహాయత ఆశ్రయించే రకరకాల పేర్లు అవి. మన అబలత్వం ఆశ్రయించే చేయూతలవి. ఆ వంగిపోయిన ముసలి బక్క వ్యక్తిని కిటికీలో నుండి చూస్తూ ఆ రోజు నా లోపల్లోపల గడ్డకట్టుకున్న నా రహస్య భారం నుండి విముక్తమయిన తేలికతనంతో నిట్టూర్చి, ‘‘మై డియర్‌ ఫోర్టీన్‌ ఇయర్స్‌ ఓల్డ్‌ చెంచు లక్ష్మీ! డోంట్‌ వర్రీ. నథింగ్‌ టు వర్రీ, అయామ్‌ హియర్‌ ఫర్‌ యూ! వియ్‌ విల్‌ సీ, వియ్‌ విల్‌ సీ!’’

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.