బాలికలు భారతదేశ భవిష్యత్తు – కొండవీటి సత్యవతి

‘‘పాపం పుణ్యం ప్రపంచమార్గం మెరుపు మెరిస్తే వాన కురిస్తే
కష్టం సౌఖ్యం, శ్లేషార్ధాలూ ఆకసమున హరివిల్లు విరిస్తే

ఏమీ ఎరుగని పూవుల్లారా అవి మీకే అని ఆనందించే కూనల్లారా’’
ఐదారేడుల పాపల్లారా – శ్రీశ్రీ
ఈ కవిత చదివినప్పుడు బాల్యంలోని అమాయకత్వం గురించి ఎంతో ఆర్ద్రంగా అనిపిస్తుంది. శ్రీశ్రీ పిల్లల పట్ల తనకున్న ప్రేమనంతా ఈ కవితలో రంగరించి రాశాడు. అయితే ఇప్పటి సామాజిక నేపథ్యానికి అన్వయించి చూస్తే బాల్యం కోల్పోతున్న లక్షలాదిమంది పిల్లలు కళ్ళముందు కదలాడుతారు. ఆకుపచ్చని ఆకుల మీద వాన చినుకులు చిందేసినంత స్వచ్ఛంగా, చైతన్యంతో తుళ్ళిపడే పిల్లల మీద, ముఖ్యంగా ఆడపిల్లల మీద అమలయ్యే వివక్ష ఎన్నో రూపాల్లో కనబడుతుంటుంది. గర్భంలోని ఆడపిండం మీద కత్తులు దూసి హతమార్చే అమానుష సమాజం, పెరిగి పెద్దయ్యే క్రమంలో ఎన్నో ఆంక్షల్లో బిగించి ఊపిరాడకుండా చేస్తుంది.
నవ్వితే తప్పు, వడివడిగా నడిస్తే తప్పు, తలెత్తితే తప్పు, తలదించకపోతే మరింత తప్పు. కుటుంబం, కమ్యూనిటీ, సమాజం ఒక్కటై ఆడపిల్లల మీద నిరంతర నిఘా నేత్రాన్ని ప్రసరిస్తూ వాళ్ళ ఎదుగుదలని క్రమబద్ధంగా కుదించేస్తోంది. వాళ్ళ ఆత్మగౌరవం మీద, ఆత్మవిశ్వాసం మీద చావుదెబ్బ కొడుతోంది. ఫలితంగా తాము అన్నింటా తక్కువే, తమకు అసలు విలువ లేదు, తమమీద అమలయ్యే హింసను సహించాలి తప్ప ఎదురు తిరగకూడదు, ఎవ్వరికీ చెప్పకూడదు అని నూరిపోయడం వల్ల ఈ రోజు చిన్నారి బాలికలు, యవ్వనారంభంలో ఉన్న అమ్మాయిలు ఇంటా బయటా భయంకరమైన హింసకి గురవుతున్నారు.
పితృస్వామ్య భావజాలపు వికృత పార్శ్వం ఏమిటంటే తల్లి గర్భంలో మొదలయ్యే వివక్ష పుట్టకలో, పెరుగుదలలో, కుటుంబంలో, పాఠశాలలో వెరసి సమాజంలోని అన్ని రంగాలలోను విషవృక్షంలాగా విస్తరించి ఆడపిల్లలకి ఊపిరాడకుండా చేయడం, ఎదగనీయకుండా సంకెళ్ళు బిగించడం, దీని పర్యవసానం ఆడపిల్లల మీద విపరీతంగా పెరిగిపోతున్న లైంగిక హింస. ఈ హింస కారణంగా వారి కదలికల మీద, వారి వస్త్రధారణ మీద ఎక్కువవుతున్న కట్టడులు, ఆంక్షలు, వీటి కారణంగా చదువుకు దూరమవ్వడం, బాల్యవివాహాలకు బలవ్వడం జరుగుతోంది. కోవిడ్‌ విపత్తు తర్వాత దేశంలో పెరిగిపోయిన బాల్య వివాహాల గణాంకాలు చూస్తే ఛిద్రమైపోతున్న ఆడపిల్లల కలలు, జీవితాలు స్పష్టంగా కనబడతాయి. వారికున్న సర్వహక్కులకు భంగం కలగడం, వారు బాల్యవివాహాల కారణంగా ఎదుర్కొంటున్న గృహ హింస తీవ్రత ఏ పోలీస్‌ స్టేషన్‌కో, సఖి సెంటర్లకో, భరోసాలకో వెళ్ళి చూస్తే అర్థమౌతుంది. చదువుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ స్వతంత్రంగా బ్రతకాల్సిన ఆడపిల్లలు అన్ని రకాల హింసలను ఎదుర్కొంటూ, బాల్యవివాహం కారణంగా గృహహింసకి కూడా గురవుతున్న విషాదకర పరిస్థితులు సర్వత్రా విస్తరించిన సందర్భమిది.
పైన ప్రస్తావించిన నేపథ్యానికి కారకులెవరు? పితృస్వామ్య భావజాలమా? అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘనలా? రాజకీయ నాయకుల పట్టనితనమా? నిజానికి అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘనతో పాటు, రాజ్యాంగ ఉల్లంఘనలు, పిల్లల హక్కుల ఉల్లంఘనలు యధేచ్చగా, ఎలాంటి జంకూ, గొంకూ లేకుండా జరిగిపోతున్నాయనేది వాస్తవం. కంటి తుడుపుగా కొన్ని చట్టాలు తీసుకొచ్చినా వాటి అమలులో చిత్తశుద్ధి లేదు. ఎన్నో సహాయ సంస్థలను ఏర్పాటు చేశారు. వాటి గురించిన అవగాహన కల్గించిన దాఖలాలు లేవు. పి.సి.పి.ఎన్‌.డి.టి చట్టం అమలులో ఉన్నా లక్షలాది ఆడపిండాల హత్యలు అనుక్షణం జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని హత్యలు జరుగుతున్నా ఒక్క డాక్టరుకూ శిక్ష పడదు. బాల్యవివాహాలు నిర్భయంగా జరిగిపోతున్నాయి. బాల్యవివాహాల నిరోధక చట్టం అమలు కాదు. బాలికల మెళ్ళో తాళి పేరుతో ఉరితాళ్ళు పడుతూనే ఉన్నాయి.
ఢల్లీిలో జరిగిన నిర్భయ విషాద సంఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం పిల్లల రక్షణ కోసం తీసుకొచ్చిన పిల్లలపై లైంగిక అత్యాచారాల నిరోధక చట్టం 2012 (POCSO) లో ఉన్న కఠినమైన సెక్షన్లు పిల్లలపై లైంగిక అత్యాచారాలను ఏ మాత్రం తగ్గించలేకపోతున్నాయి. నిజానికి పోక్సో చట్టం గురించి ఎలాంటి ప్రచారమూ లేదు. అవగాహన కల్గించే కార్యక్రమాలు లేవు. ఈ చట్టం ప్రకారం మారిన రేప్‌ నిర్వచనం, పెరిగిన శిక్షాకాలం, ఆఖరికి మరణశిక్ష కూడా నేరస్థుల్లో ఎలాంటి భయాన్నీ కల్గించకపోగా లైంగిక హింసకి పాల్పడి, బాధితుల్ని హతమారుస్తున్న దారుణ ఉదంతాలు పెరిగిపోయాయి. బాధితుల్ని చంపేస్తే శిక్షల్నుంచి తప్పించుకోవచ్చనే భయానక ధోరణి కూడా పెరిగినట్టు ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని కేసుల్ని చూస్తే అర్థమవుతోంది. కఠినమైన చట్టాలు నేరస్తుల్ని శిక్షించకుండా బాధితుల ప్రాణాలు తీస్తున్నదా అనే ఊహ కూడా భయం కలిగిస్తున్నది.
ఇలాంటి పరిస్థితుల్లో మనం జాతీయ బాలికా దినోత్సవం, అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్ని అంచనా వేసుకుంటూ ముందు ముందు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే ఆలోచనలు చేస్తున్నాం. పితృస్వామ్య, సనాతన భావాలను యధాతథంగా ఉంచి వాటిమీద పనిచెయ్యకుండా ఎన్ని కాన్ఫరెన్స్‌లు జరిపినా, ఎన్ని చట్టాలు తెచ్చినా ఫలితం ఉండదనేది ఎన్నో దారుణ ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. సంప్రదాయాలు, కట్టుబాట్ల ముందు చట్టాలు వెలవెల పోతున్నాయి. ‘పున్నామ నరకం’ అనే అభూత కల్పన, మగపిల్లలనే కనాలి, ఆడపిల్లల అవసరం లేదు అనే తల్లిదండ్రుల మౌఢ్యపు ఆలోచనల వల్లనే కోట్లాదిమంది ఆడపిల్లలు పిండ దశలోనే చనిపోతున్నారు. దీనివల్ల లింగ నిష్పత్తి రోజురోజుకీ దిగజారిపోయి ఆడపిల్లల భద్రత మరింత ప్రమాదకరంగా తయారవుతోంది. ‘బేటీ బచావో బేటీ పఢావో’ లాంటి శుష్క నినాదాల వల్ల సమాజంలో ఎలాంటి మార్పూ కనబడటం లేదు.
మన విద్యావ్యవస్థ కూడా సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారుతున్న దాఖలాలు లేవు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో యునిసెఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన టెక్స్ట్‌బుక్‌ రివ్యూ కమిటీలో నేను కూడా సభ్యురాలిగా ఉన్నాను. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకూ అన్ని సబ్జెక్టుల పుస్తకాలను సమీక్షించినపుడు కాలానుగుణంగా ఎలాంటి మార్పులకూ నోచుకోని టెక్స్ట్‌ పుస్తకాలు చదివి నిర్ఘాంతపోవడం నా వంతైంది. తెలుగు వాచకాల నిండా రామాయణ, భారత, భాగవత పద్యాలు, అర్థం పర్థం లేని పాఠాలు దర్శనమిచ్చాయి. అలాగే సోషల్‌, ఇంగ్లీష్‌, సివిక్స్‌ లలో కూడా ప్రస్తుత సమాజాన్ని అర్థం చేయించే పాఠాలు కానీ, వారు నేర్చుకోవాల్సిన జీవన నైపుణ్యాలు కానీ, కొత్తగా వచ్చిన చట్టాల గురించిన అవగాహన కానీ మచ్చుకైనా కనబడలేదు. పాచిపోయిన పాఠాల నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఆధునిక సమాజ సంక్షోభాల గురించి, వాటిని ఎదుర్కోగలిగిన నైపుణ్యాలను, కఠినమైన చట్టాల గురించి, ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాల గురించి ఈ పిల్లలకి ఎవరు చెప్పాలి? ‘అమ్మ వంట చేయును, నాన్న సంపాదించును’ దగ్గరే ఈ పాఠాలు ఆగిపోతే పిల్లలకి ఏమర్థమౌతుంది? ఓహో! ఇంటి ప్రపంచం ఆడవాళ్ళది, బయట ప్రపంచం మగవాళ్ళది అనే ఆలోచన మగపిల్లల బుర్రల్లో స్థిరపడిపోతుంది. ఆడపిల్లలు అన్నింటా అణిగిమణిగి ఇంట్లో వంట చేసుకోవాలి, బయటకొస్తే మేం వేధించొచ్చు, లైంగిక హింసకి పాల్పడొచ్చు అనే సిగ్నల్‌ చదువు ద్వారానే వాళ్ళకి అందుతుంటే మార్పు ఎలా సాధ్యమవుతుంది? పోక్సో లాంటి కఠినమైన చట్టాల వల్ల కూడా ఆడపిల్లలకి భద్రత లేకుండా పోవడానికి ముఖ్య కారణం బూజుపట్టిన మన విద్యావిధానం కూడా. పాఠ్యపుస్తకాల్లో ఇప్పుడిప్పుడే కొన్ని మార్పులు, చేర్పులు చేరుతుండడం ఆహ్వానించదగిన పరిణామం.
ఈ రోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవం గురించి, ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయాల గురించి కూడా ప్రస్తావించుకోవాలి. 1995లో బీజింగ్‌లో జరిగిన ప్రపంచ మహిళల సదస్సులో ‘‘బీజింగ్‌ డిక్లరేషన్‌ మరియు ప్లాట్‌ఫాం ఫర్‌ యాక్షన్‌’’ డాక్యుమెంటును అన్ని దేశాలూ ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఇది మహిళలకు మాత్రమే కాకుండా బాలికల హక్కులను కూడా ముందుకు తీసుకువెళ్ళే అత్యంత ప్రగతిశీలమైన డాక్యుమెంట్‌. బీజింగ్‌ డిక్లరేషన్‌ నుండి ప్రత్యేకంగా బాలికల హక్కుల కోసం వెలువడిన మొట్టమొదటి డాక్యుమెంట్‌. అన్ని దేశాలూ బాలికల హక్కుల అమలులో తమ తమ కార్యాచరణలను రూపొందించుకునేలా దిశానిర్దేశం చేసిన చాలా ముఖ్యమైన డాక్యుమెంటుగా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా 2011, డిసెంబరు 19న యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ, అక్టోబర్‌ 11వ తేదీని ‘‘అంతర్జాతీయ బాలికా దినోత్సవం’’గా ప్రకటించడానికి తీర్మానం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ళను అంతర్జాతీయ వేదిక మీద గుర్తించిన తీర్మానమిది. ఈ తీర్మానం ముఖ్య ఉద్దేశ్యం, బాలికల మానవ హక్కులను గుర్తించి ముందుకు తీసుకుపోవడం. అలాగే భద్రమైన జీవితం పొందడానికి, చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి, మంచి ఆరోగ్యం పొందడానికి వారికి సర్వహక్కులూ ఉన్నాయని బీజింగ్‌ డిక్లరేషన్‌ నిర్ధారించింది. 2030 నాటికి పూర్తి చేయాలని ఎజెండాగా రూపొందిన ‘‘సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌’’ రోడ్‌ మ్యాప్‌లో కూడా ప్రపంచ నాయకులందరూ ఏకగ్రీవంగా అంగీకరించిన అంశాల్లో బాలికల మానవ హక్కుల అంశం కూడా ఇమిడి ఉంది.
2030 నాటికి అన్ని సమాజాలూ జెండర్‌ సమానత్వాన్ని సాధించాలని, మహిళలు, బాలికల మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి జరగాలని అన్ని దేశాలూ ఆకాంక్షిస్తున్నప్పటికీ ఎంతవరకు ఆచరణ సాధ్యమో ఆలోచించాలి. భారతదేశానికి సంబంధించి మహిళా సాధికారత, జెండర్‌ ఈక్వాలిటీ సాధించడానికి ఆచరణాత్మకమైన కృషి జరగాలి కానీ, శుష్క వాగ్దానాల వల్ల ప్రయోజనంన ఉండదు. ‘‘బేటీ బచావో బేటీ పఢావో’’ నినాదం చాలా ప్రభావవంతమైనదే కానీ ఆచరణలో ఆ ప్రభావం కనబడటం లేదు. బాలికలు ఈ దేశ భవిష్యత్తు, లింగ సమానత్వం కాదు అనే అంశం ప్రధాన స్రవంతిలోకి బలంగా వెళ్ళినప్పుడే మార్పు సాధ్యమవుతుంది.
పిల్లలు ఈ దేశ భవిష్యత్తు. పిల్లలంటే మగపిల్లలు మాత్రమే అని నమ్మే పితృస్వామ్య సమాజానికి పిల్లలంటే బాలికలు కూడా అని తెలియాలి. బాలికలు తగ్గిపోయే సమాజం అంధకారంలోకి నడుస్తుంది తప్ప ప్రగతివైపు కాదు. ఈ దేశ బాలికలు కూడా ఈ దేశ భవిష్యత్తు.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.