ఇంకొన్నాళ్ళు బతకనిస్తారా?? – రోజారాణి దాసరి

నేను పుట్టిన పది రోజులకే మా అమ్మ చనిపోయింది…
నన్ను ముట్టుకోకుండానే మా నాన్న చనిపోయాడు…
ఎందుకో నాకు ఇంకొన్నాళ్ళు మా అమ్మ కడుపులోనే ఉంటే మంచిగుండనిపించింది…

యుద్ధం జరుగుతుండంగనే పుట్టిన ప్రాణాలెన్నో ?? పుట్టినందుకు సంతోషించాలా,బాధపడాలో తెలియని పరిస్థితి…
నిజమే పుట్టిన ప్రతీ ఒక్కరు చచ్చిపోతరు కానీ చచ్చిపోయే సమయంలో పుట్టాము మేము…
బాంబుల శబ్దాలు నాకు లాలి పాటలు పాడుతున్నాయి…
ఆ పాటలు నన్ను శాశ్వతంగా నిద్రపుచ్చడానికనీ నాకేం తెలుసు…
ఆకాశంలో యుద్ధ విమానాలు వేసే గుండ్రని గీతలు నాకు ఉయ్యాలలూపున్నాయి…
కానీ ఆ గీతలు నరమేధానికి ముందు ఊపే పచ్చ జెండాలనీ నాకేం తెలుసు…
ఏడ్చి ఏడ్చి కండ్లలో నీరు ఇంకిపోయినాయి
నా శరీరం ఏమైనా విసర్జించాలంటే ఏదో ఒకటి తినాలిగా,నాకేమో తినే వయసు లేదు, మా అమ్మకేమో తినటానికి ఏమీ లేదు, పాపం పాలకి బదులు రక్తం వస్తున్నట్టుంది మా అమ్మ పాలివ్వడమే మానేసింది…
అందుకే నాకు ఇంకొన్నాళ్ళు మా అమ్మ కడుపులోనే ఉంటే మంచిగుండనిపిచింది…
నీకేం కావాలని అడిగే వారు లేరు కానీ పొరపాటున ఎవరైనా అడిగితే ఓసారి నవ్వమని అడగాలనిపిస్తుంది…
నవ్వు అంటువ్యాదంట కదా అట్లైనా ఓసారి నవ్వొచ్చని నేను నవ్వితే ఎట్ల ఉంటనో చూసుకోవాలనిపిస్తుంది, కానీ ఇది నవ్వే సమయమేనా!!! మాకు నవ్వడానికి కారణాలెక్కడివి?? కారణం లేకుండా నవ్వే కాలమెక్కడిది??
నేను కడుపులో ఉన్నన్నాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా దాడి జరిగితే ఆ చోటు నుంచి మా అమ్మ పరిగెత్తి తనని తాను, తనలో ఉన్న నన్ను కాపాడగలిగింది…
నేను బయటకొచ్చాక అమ్మకి పరిగెత్తే శక్తి లేదు, నాకేమో ఇంకా కదలడమే సరిగ్గా రాదు… ఇక చచ్చిపోవడమే!! తప్పించుకునే దారెక్కడిది…
అందుకే నాకు ఇంకొన్నాళ్ళు మా అమ్మ కడుపులోనే ఉంటే మంచిగుండనిపించింది…
యుద్ధం ముగిసాకే మా అమ్మ నాకు పేరు పెట్టాలనుకుంటుంది పిచ్చి తల్లి
ఆ బాంబులకేమన్నా తెలుసా పేరు పెట్టని పసిపాపలున్నారు!! పేలోద్దని, వాటికి అందరూ సమానమేగా…
నేను బడికి పోయి చదివిందే లేదు పుస్తకం పెన్ను పట్టిందే లేదు
అయినా సరే నాకు పెన్ను పేపర్‌ కనిపిస్తే బాంబుల బొమ్మలు, రాకెట్‌ బొమ్మలు వేస్తాను నాకు కలలో కూడా అవే చప్పుళ్ళు, అవే దృశ్యాలు…
ఎన్ని బాంబులు వేస్తున్నారో అని లెక్కపెట్టుకుంటూ మేము అంకెలు నేర్చుకుంటున్నాము…
కానీ చచ్చిపోయిన వారిని లెక్కపెట్టాల, బతికి ఉన్న వారిని లెక్కపెట్టాల?? ఏ లెక్క అయితే తొందరగా అయిపోతుందో తెలియక తికమక పడుతున్నాము…
నాకు రాయడం రాదు, నేను ఏ భాష నేర్చుకోలేదింకా…
కానీ నా కళ్ళలోకి చూడండి నేను చెప్పాలనుకున్న మాటలన్నీ అక్కడ రాసున్నాయి…
ఆటలాడుకునే వయసే నాది కానీ ఒక చావుకి ఏడ్చి కన్నీరు తుడుస్తుండంగనే ఇంకో చావు. ఇక ఆటకి సమయమెక్కడిది…
ఆలోచిస్తేనే భయమైతుంది నా చావుకి ఏడ్చే
మనిషి ఉంటాడా?? లేదా అని??
అందుకే నాకు ఇంకొన్నాళ్ళు మా అమ్మ కడుపులోనే ఉంటే మంచిగుండనిపిస్తుంది…
దాడి జరిగాక ఊపిరున్నా బయటికి రాలేక బతికున్న శవాలెన్ని ఉన్నయో ఆ బండల నడుమ…
నాతోనే తిరిగే నా అక్కా, తమ్ముడు నా పక్కన లేరిప్పుడు, బరువులు మోస్తూ భూమి మీదే ఉన్నారో?? బట్టలు చుట్టుకొని భూమి లోపల ఉన్నారో… ఎవరు చెప్తారు వారి చావు, బతుకుల కబురు… ఎప్పటికైనా వస్తారనుకునే నా తల్లికి ఏమని చెప్పాలి, ఇక నీకు వారు కలలోనే కనిపిస్తారని చెప్పనా??…
భూమిని లాక్కుంటున్నామనుకొని నా నవ్వుని, బువ్వని, ప్రాణాల్ని, భవిష్యత్తుని, స్వేచ్ఛ ని లాక్కుంటున్నారు…
అంతా అయ్యాక మా సమాధుల మీద మీ కూర్చీలు వేసుకుని కూర్చున్నప్పుడు!! నేను అడుగుతాను?? సౌకర్యంగా ఉందా అని లేదంటే మా శవాలు వలిచి కొత్త కుర్చీ చేయించుకోవస్తదేమో చూడు కానీ మాలో ఒకడు బ్రతికుంటే మాత్రం వాడిని బతకనివ్వు…
ఈ పవిత్ర భూమి నాదో ఇంకెవరిదో నాకు తెలియదు…
కానీ ఇట్ల చంపుకుంటూ పోతే మనమంతా చచ్చిపోయాక ఇంకొకడెవడో వచ్చి ఉంటాడని నాకనిపిస్తుంది, నా వయసు చిన్నదే మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు కానీ ఒకటి చెప్పాలనిపిస్తుంది మా అమ్మ కడుపులోనుంచి నేను బయటికి రాగానే, అక్కడ నా తమ్ముడు వచ్చి చేరాడు…
నా తమ్ముడే కదా అని నేను ఉండనిచ్చాను… వాడు బయటికి వచ్చాక కలిసి ఏ ఆటలాడాలో ఆలోచిస్తున్నా!! మీరు ఆడుకోనిస్తారా??
ఎందుకో నాకు ఇంకొన్నాళ్ళు ఈ పవిత్ర భూమి మీద బతకాలనిపిస్తుంది!!! బతకనిస్తారా???

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.