శప్తభూమి నవల ` నామౌచిత్యం – బుక్కే ధనకా నాయక్‌

1. ఉపోద్ఘాతం:
శప్తభూమి నవల రచయిత బండి నారాయణ స్వామి. ఈ నవలకి 2019లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని దక్కించుకున్నారంటే శప్తభూమి నవల యొక్క రచనా తీరు ఎంత గొప్పదో గ్రహించదగ్గ విషయం. అయితే, రాయలసీమ నేలకి శప్తభూమి అని

పేరు పెట్టడానికి కారణాలను పాఠకులకు తెలియజేయాలన్నదే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
2. శప్తభూమి నవల ఇతివృత్తం:
శప్తభూమి అంటే శపించబడిన భూమి అని అర్థం. శప్తభూమి నవల వర్ణనతో, ఊహలతో కల్పించిన రచన కాదు. ఇది రాయలసీమ చారిత్రక కథా నేపథ్యంతో మొదలైన నవల. రెండు సంస్థానాల మధ్య వైరంతో మొదలైన కథ. సిద్ధ రామప్ప నాయుడు (హండేరాజు) అనంతపురం సంస్థాన దొర. తాడిమర్రి సంస్థాన రాజు రామప్ప నాయుడు. 18వ శతాబ్దంలో రెండు సంస్థానాల మధ్య నీటిపారుదల కోసం ఏర్పడిన మినీ యుద్ధం. ఈ వైరం రక్తపాతానికి దారితీసింది. మనిషి చెయ్యి, కాళ్ళు విడివిడిగా రక్తంలో పారుతున్న సంఘర్షణ అది. ఈ రెండు సంస్థానాలకు చుట్టుపక్కల ఉన్న ఎర్ర కొండాపురం, రాయలచెరువు, బాలకొండ, అగ్రహార గ్రామం, చెరువులోపల్లి, ప్యాపిలి, జొన్నగిరి గ్రామాలు గుక్కపట్టేడ్చి మెడకు ఉరేసుకున్న పరిస్థితి వచ్చింది. రాయలసీమ ప్రాంతంలో తడి, తేమ లేక కరువు తాండవమాడుతున్న రోజులు మొదలయ్యాయి. తాడిమర్రి గ్రామ దుండగులు అనంతపురం సంస్థాన ఆధీనంలో ఉన్న బుక్కరాయసముద్రం చెరువుకి గండి పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ రెండు సంస్థానాలకు సంబంధమే లేని చెరువులోపల్లి గ్రామ వాస్తవ్యుడు, గొర్రెల కాపరి బిల్లే ఎల్లప్ప దుండగులను తరిమికొట్టి బుక్కరాయసముద్రం చెరువుని కాపాడి, వారిని అనంతపుర సంస్థాన రాజుకు పట్టించాడు. బిల్లే ఎల్లప్ప సాహస చర్యలను మెచ్చిన అనంతపురం సంస్ధాన రాజు సిద్ధ రామప్ప నాయుడు, బిల్లే ఎల్లప్పకు జట్టి పదవిని అప్పగించాడు. జెట్టి అంటే సైన్యాధికారి అని అర్థం. పదవిలో కొనసాగుతూ తనకు పదవిని అప్పగించిన రాజు కోసం ప్రాణ త్యాగం చేసిన వీరుడు బిల్లే ఎల్లప్ప కథ ఇది. కరువు, వలసలతో పోరాడుతున్న సంస్థాన ప్రజల కోసం, తన రాజు ఔన్నత్య పాలన కోసం శ్రీశైలం మల్లికార్జున స్వామికి అర్పించి ప్రాణ త్యాగం చేశాడు బిల్లే ఎల్లప్ప. అయినప్పటికీ శ్రీశైలం మల్లకార్జునుడు వర్షాన్ని ప్రసాదించలేదు. ఈ సంఘటనతో రాయలసీమ ప్రాంతంలో మూఢ విశ్వాసాలు అధికంగా ఉంటాయని తెలుపుతూ ఏ దేవుడి వల్లనో, ఏ త్యాగం వల్లనో ఈ రాయలసీమ భూమిపై ఒక్క వర్షం చినుకు కూడా స్పర్శించదని రాయలసీమ యదార్ధ గాథని బండి నారాయణస్వామి ఈ నవలలో వివరించారు.
3. శప్తభూమి నవల ` నామౌచిత్యం:
శప్తభూమి నవల వృత్తాంతమంతా గ్రామీణ ప్రాంతంలోనే కొనసాగింది. ఈ నవలలో చారిత్రక అంశానికే ప్రాధాన్యతనిస్తూ మూఢనమ్మకాలను విశ్వసించే ప్రజలకు సామాజిక, సామూహిక స్పృహ రావాలనే అంశాన్ని రచయిత తెలపకనే తెలిపాడు. శప్తభూమి నవలలో రాయలసీమ ప్రాంతం శపించబడిరదని భావించడానికి కొన్ని ప్రధానమైన అంశాలు కనిపిస్తున్నాయి. అవి:
3.1. కరువు: కొండాపురం గ్రామంలో బాలకొండ బీరప్ప, ఉజ్జయినమ్మ భార్యాభర్తలు. వీరికి రెండు సంవత్సరాలు, ఆరు నెలల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అది వైశాఖ మాసం. కొండాపురం గ్రామం మొత్తం ఎడారిలా కనిపిస్తుంది. ఆకలితో
ఉజ్జయినమ్మ కడుపు డొక్కలనుంచి వెనుక ఉన్న వెన్నెముక కనబడుతోంది. ఇద్దరు బిడ్డలకు ఆకలతో గొంతు తడారి నోట మాట రాకుండాది. కరువును జయించాలంటే కొండాపురం వదిలేసి కొత్తపల్లికి వలస ఒక్కటే మార్గమని నిశ్చయించుకుని బయలుదేరారు. వెళ్ళే మార్గమధ్యలో ‘‘పుష్టిగా బలిసిన రాబందులు శవాల చుట్టూ బరువు బరువుగా గెంతుతున్నాయి. శవాల కళ్ళను పరమ ఇష్టంగా పొడుచుకుని తింటున్నాయి’’. (నారాయణస్వామి బండి, శప్తభూమి, ప్రథమార్థం) బీరప్ప ఏదైనా తెచ్చి తన భార్యాబిడ్డల కడుపు నింపి వారిని కాపాడుకునేందుకు వాళ్ళను ఒక చెట్టు కింద కూర్చోబెట్టి, కొన్ని ఆకులు తెంపి తన కాళ్ళకు చెప్పులుగా చుట్టుకొని ఆ ఎడారంతా తిరిగాడు. కప్ప దొరికినా దాన్ని చంపి తిని కడుపు నింపుకోవచ్చు అనుకున్నాడు. కానీ కప్పా లేదు, బల్లీ లేదు, చీమా లేదు, పామూ లేదు, ఉడుతా లేదు… ఏ జీవీ లేదు. ఏది కనిపించినా కడుపు నింపుకోవచ్చన్న ఆశతో చెట్టెక్కాడు, పుట్టెక్కాడు, రాళ్ళల్లో వెతికాడు, గుంతల్లో చేయి పెట్టి లాగాడు. తినడానికి ఏ జీవీ లేదు, ఏ పదార్థమూ దొరకలేదు. దూరంగా ఏదో సింహం గర్జించినట్లు శబ్దం వినిపించింది. భయపడ్డాడు. అయినా, ఆ సింహాన్ని చంపయినా ఆకలి తీర్చుకోవాలన్న ఆశతో దాన్ని వెతకసాగాడు. కానీ కానీ అక్కడ సింహం కాదు, 80 ఏళ్ళ వయసున్న మతిస్థిమితం లేని ఒక వృద్ధురాలు నగ్నంగా చెట్టుకింద కూర్చుని ఉంది. చేతిలో చనిపోయిన ఒక కుందేలుని పట్టుకొని పీక్కుని తింటోంది ఆమె. కొన్ని రోజులుగా ఎండిపోయిన ఆ పెదాలతో ఆ వృద్ధురాలు కుందేలుని తింటూ ఉంటే రక్తపు చుక్కలు మట్టి కడుపులో బొట్లు బొట్లుగా పడుతున్నాయి. ఆ కరవు భూమి ఆ రక్తపు చుక్కలను మెల్లగా ఆస్వాదిస్తోంది. ఆమె రక్తాన్ని నోటితో జుర్రుతూ ఉంది. కుందేలు వెంట్రుకలు నోటికి అడ్డుపడుతోంటే ఆ వెంట్రుకలని థూ థూ అని ఉమ్మేస్తోంది ఆమె. కుందేలుని ఆశగా చూశాడు బీరప్ప. ఆమెను ఒక కట్టెతో కొట్టి ఆ కుందేలుని తీసుకువెళ్ళాలని అనుకున్నాడు, కానీ ఆత్మాభిమానం అడ్డొచ్చింది. చేసేదేమీ లేక, భార్యాబిడ్డలను కాపాడుకోవాలన్న సంకల్పంతో ఆ వృద్ధురాలిని తలమీద గట్టిగా కొట్టి ఆ కుందేలు శవాన్ని లాక్కొని పరిగెత్తసాగాడు బీరప్ప. ఈ సంఘటనతో రాయలసీమ ప్రాంతంలోని కరువు ఎటువంటి ఉద్రిక్తతను నెలకొల్పిందో అర్థమవుతుంది. మనిషిని మనిషి చంపుకు తినడం ఇదే కాబోలు అంటారు రచయిత బండి నారాయణస్వామి.
3.2 వలసలు: కొత్తపల్లి గ్రామ కురువల వలస మొదలైంది. గొర్రెల కాపర్లు గొర్రెలను తోలుకుంటూ వెళ్తున్నారు. కుంటి గొర్రెలను, అప్పుడే పుట్టిన గొర్రె పిల్లల్ని భుజానికెత్తుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ బయలుదేరారు. వలస వెళ్ళే మార్గంలో ఆడవాళ్ళు పసిపిల్లలకు పాలు ఇవ్వడానికి చనుల నుంచి పాలు రాక తమ రెండు చేతులతో చనులను గట్టిగా పిండి వచ్చిన రక్తపు చుక్కతో పసిపిల్లల గొంతులను తడుపుతున్నారు. వీళ్ళంతా మళ్ళీ తిరిగి వచ్చేది బీరప్ప పసర రోజే. పుష్కరం తర్వాత బీరప్ప పసర జాతర రానే వచ్చింది. నలుమూలల అడవి ప్రాంతాలకు వలస వెళ్ళిన గొల్లలు పుష్కరం తర్వాత వాళ్ళ బంధువులను, ఇంటివాళ్ళను చూస్తూ కౌగలించుకొని ఏడుస్తున్నారు.
అన్నా పెద్దమ్మ కనిపించదే? అత్తా, మామ కనిపించడే?
‘‘ఇంకెక్కడి పెద్దమ్మరా తమ్ముడూ! ఇంకెక్కడి మామరా అల్లుడూ! పన్నెండేళ్ళలో చనిపోయినారు’’ (నారా సింహన పల్లె సావులు కథ) అని తలచుకొని తలచుకొని గుండెలు బాదుకుంటున్నారు. చావు కబుర్లు కొత్తగా విన్నవారు తల పట్టుకొని కూలబడుతున్నారు. గతాన్ని చెప్పుకుంటూ సంఘటనలను వివరిస్తూ దగ్గరవుతున్నారు. ఈ సంఘటనతో బ్రతుకు కోసం కుటుంబ బాంధవ్యాలను కొద్దిరోజుల పాటు దూరం చేస్తూ వలస వెళ్ళి బ్రతకడానికి ప్రయత్నిస్తూ అనుకోని సంఘటనల ద్వారా ప్రాణాలు కోల్పోయి ఆ బంధు బాంధవ్యాలను శాశ్వతంగా కోల్పోయారని కళ్ళముందు చిత్రీకరణ జరుగుతుంది.
3.3 ఆర్థిక స్థితిగతులు: కొండాపురం గ్రామానికి వీరనారాయణరెడ్డి దొర. అతని పెద్ద కొడుకు నల్లారెడ్డి, చిన్న కొడుకు ఎర్ర నాగిరెడ్డి. కొండాపురం గ్రామంలోని స్త్రీ పురుషులకి ఉపాధికల్పనలో వీరనాగిరెడ్డి ఆధిపత్యమే సాగుతుంది. కూలీల చేత పొలంలోని వరి పంట కోయించి, వాటిని ధాన్యంగా మార్చి, బస్తాలకి ఎక్కించే పనిని నల్ల నాగిరెడ్డి, ఎర్ర నాగిరెడ్డి చేయిస్తుంటారు. వడ్లు, కంది, పెసర, మినుము, ధాన్యాన్ని బస్తాల్లోకి ఎక్కించే పని కేవలం స్త్రీలకు మాత్రమే అప్పగిస్తారు. కూలీకి వచ్చిన స్త్రీల పట్ల నల్ల నాగిరెడ్డి, ఎర్ర నాగిరెడ్డి దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ, వడ్ల బస్తాలు లెక్కపెట్టి రమ్మని ఆడవాళ్ళని చీకటి గదిలోకి పంపించి వారిపై లైంగిక దాడికి పాల్పడతారు. ఒప్పుకున్న ఆడోళ్ళకు ఎక్కువ కూలీ ఇస్తానని మభ్యపెడతారు. ఒప్పుకోని స్త్రీలని ఆ చీకటి గది నుంచి బయటికి రానివ్వకుండా తాళ్ళతో కట్టిపడేసి బలవంతంగా అనుభవిస్తారు. పెళ్లిచేసుకుంటానంటూ చిన్న కొడుకు ఎర్ర నాగిరెడ్డి, నీల రెడ్డమ్మని నమ్మించి శారీరకంగా దోచుకుని ఆమెపై వ్యామోహం తగ్గిన తర్వాత ఆమెకీ, తనకీ సంబంధం లేనట్లు తెగదెంపులు చేసుకున్నాడు. కొడుకులు మాత్రమే కాదు తండ్రి వీరనాగిరెడ్డి కూడా అదే కోవకు చెందినవాడు. ఆర్థికంగా కూలీలను, గ్రామ ప్రజలను, సైనికులను, వ్యవసాయదారులను దొరలు, అధికారులు దోచుకుంటున్న సంఘటనలు ఈ నవలలో తారాస్థాయిలో కనిపిస్తాయి.
బీరప్ప, ఇజ్జయినమ్మ తమ ఇద్దరి బిడ్డలను సాదుకొనే స్థోమత లేక ఒక బిడ్డను అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చిన్న కుమార్తెను పద్మసాని అనే వేశ్యకు రూ.50కు అమ్మేశారు.
‘‘లాలీ లాలీ లాలీ…!!
లాలెమ్మా లాలీ…
ఏడవాకూ ఏడవాకూ ఎర్రనాతల్లీ…
ఏడిస్తే నిన్ను ఎవరు ఎత్తుకుంటారు…
ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారూ…
నీలాలు కారితే నే చూడలేనూ…(నారాయణస్వామి బండి, శప్తభూమి ద్వితీయార్థం, భాగం 25) అంటూ పాపను ఆడిస్తూ ప్రేమగా పెంచుకుంటుంది పద్మసాని.
3.4 రాజకీయ పరిస్థితులు: సిద్ధ రామప్ప నాయుడు అనంతపురం సంస్థాన దొర. ఈయన గుత్తి సుబేదారునికి 25 లక్షలు చెల్లించవలసి ఉంది. వాటిని ఎలా చెల్లించాలి? కరవు కాటకాలతో ఉన్న ప్రజలకు ధాన్యమంతా పంచిపెట్టాడు. వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగా ప్రజలకి, సుబేదారునికి పంచుతూనే ఉన్నాడు. కానీ సుబేదారుకి ఇంకా చెల్లించవలసిన ఖాతా
ఎక్కువే ఉంది. చెల్లించకపోతే ఆ సంస్థాన కోట యొక్క తాళాలను అప్పగించి, మోకాళ్ళ మీద నిలబడి క్షమించమని బ్రతిమాలి చాకిరీ చేయాలని సిద్ధ రామప్ప నాయుడుని హెచ్చరించాడు గుత్తి సుబేదారు. సిద్ధ రామప్పనాయుడు సైన్యాధికారి అయిన జెట్ట్టి బెల్లే ఎల్లప్ప తన దొరకి అండగా నిలిచాడు, కానీ ఆర్థికంగా సహాయపడలేకపోయాడు. కారణం తెలిసిన విషయమే… కరవు. జెట్టి బిల్లే ఎల్లప్ప తన సైన్యంలోని సైనికులకి ఆయుధాలు ఇచ్చి పొరుగూరైన తాడిమర్రి గ్రామంలోని ఆర్థిక సంపాదనని కొల్లగొట్టాలని హెచ్చరించాడు.
అనంతపురం సంస్థాన సైనికులు తాడిమర్రి గ్రామంపైన విరుచుకుపడ్డారు. దొరికిన ఆడవాళ్ళ మెడలోని గొలుసులు, చేతి గాజులు, కాళ్ళ కడియాలు, మెట్టెలు, తాళిబొట్లు, ఇంట్లోని కంచు, బంగారం, ఇనుప తలుపు గొళ్ళెం, వంట పాత్రలు, ధాన్యం బస్తాలన్నింటినీ దోచుకుని అనంతపురం సంస్థానానికి ధారాదత్తం చేశారు. తాడిమర్రి రామప్ప నాయుడు దీనికి ప్రతిగా అనంతపురం సంస్థానంపై ప్రతిదాడికి దిగాడు. ఇది ఇప్పటి సంఘర్షణ కాదు, బుక్కరాయల చెరువు కోసం వందేళ్ళ క్రితం ఏర్పడిన వైరం. ఈ సంఘటనతో ఈ రెండు సంస్థానాల మధ్య వైరం మరింత ఉద్రిక్తతలకు లోనై మరో రక్తపాత యుద్ధానికి దారితీసింది.
3.5 ప్రజల్లో లోపించిన చైతన్యం: ఎర్ర కొండాపురం వీర నారాయణరెడ్డి కుమారులైన నల్ల నాగిరెడ్డి, ఎర్ర నాగిరెడ్డి స్త్రీలపై చేసిన లైంగిక దాడులపై స్త్రీలలో చైతన్యం లేకపోవడంతో చీకటి గదిలో బంధించబడిన స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. స్త్రీలలో చైతన్యమే ఉంటే ఉన్మాద చర్యకు ప్రతి చర్య జరిగేది. కానీ స్త్రీలలో చైతన్యం, శారీరక బలం, మానసిక ధైర్యం లేకపోవడం వలన ఈ శారీరక లైంగిక దోపిడీ సాగుతూనే ఉంది. తాడిమర్రి గ్రామంలో జరిగిన దోపిడీలో ప్రజల్లో చైతన్యం లోపించడం వల్లే దుండగులు వారి యొక్క ఆర్థిక వనరులను దోపిడీ చేయగలిగారు. ప్రజలలో చైతన్యమే బలంగా ఉంటే దుండగులపై ప్రతి చర్య జరిగి వారి ఆస్తులను, ఆర్థిక సంపదను రక్షించుకునే అవకాశం ఉండేది. ప్రతి ఏడు వలస వెళ్ళే ప్రజలు వారిలో చైతన్యాన్ని నెలకొల్పి ఉంటే నీటిపారుదల గల ఒక ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఆ సంస్థాన రాజుతో ఒప్పందాలు చేసుకునేవారు, కానీ వారిలో అవగాహన, చైతన్యం లోపించింది. అక్షరాస్యత లేకపోవడం వలన కూలీ పనికి వెళ్ళే కూలీలు తమకు వచ్చిన సంపాదన లెక్కపెట్టే క్రమంలో ఆర్థిక దోపిడీకి లోనయ్యారు. చైతన్యం, సామూహిక, సామాజిక స్పృహ లేనందువల్ల రాచరిక అరాచకాలకు, దోపిడీకు లోనవుతూనే ఉన్నారు ఆనాటి రాయలసీమ ప్రజలు.
3.6 మూఢాచారాలు: శప్తభూమి నవలలో మూఢాచారాలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రాణ త్యాగం చేయడం, కులాంతర వివాహాలు చేస్తే మరణం సంభవిస్తుందని నమ్మడం, సతీసహగమనం చేయకపోతే మరికొన్ని రోజుల్లోనే వితంతువు మరణిస్తుందని విశ్వసించడం వంటివి ఎక్కువ స్థాయిలో కనిపిస్తాయి.
1) జెట్టి బెల్లే ఎల్లప్ప శ్రీశైలం మల్లికార్జున స్వామిని కొలిచి తన సంస్థానంలో వర్షం కోసం ప్రార్థించి తన శరీరంలోని అంగాంగం స్వామికి అర్పించి తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు. ‘‘అష్టదిశలలోని అష్టభైరవుల్లారా! నా అష్టాంగాల రుధిరంతో మిమ్మల్ని అభిషేకిస్తాను, ఆరాధిస్తాను. నా దేవుని కోసం నేను ఇట్లా నా మాంసాన్ని ఖండిస్తున్నాను’’ (నారాయణస్వామి బండి, శప్తభూమి, ద్వితీయార్థం) అంటూ ఎల్లప్ప గండకత్తెరతో తన శరీర భాగాల్ని ఖండిరచుకున్నాడు.
2) బీరప్ప పసర రాయలసీమ ఆచార ఉత్సవం: ఈ బీరప్ప పసర జాతరలో జంతు బలులు అధికంగా కనిపిస్తున్నాయి. గొర్రెలు, పొట్టేళ్ళు, మేకలు, దేవర దున్నపోతుల తలలను కోసి ఆ రక్తాన్ని బీరప్ప స్వామి విగ్రహంపై కుమ్మరించి చుట్టుపక్కల గొర్రె, మేక, దున్నపోతు కాళ్ళను పేర్చి పసుపు, కుంకుమ, వేపాకులతో నీళ్ళు చల్లి గ్రామస్తులంతా దర్శనం చేసుకుంటారు. ఆ ఊరంతా ఆ రోజు జాగారం చేయాలి. జాగారం చేయని ఏ కుటుంబమైనా ఆ సంవత్సరం పాటు ఆర్థికంగా, మానసికంగా బలహీనులవడంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుందని విశ్వసించేవారు.
3) అగ్రహార గ్రామం దొర నాగప్ప ప్రగడ సతీసహగమనం పట్ల అత్యంత మక్కువ కలిగిన వ్యక్తి. తన సవతి తల్లి కూతురు బాల్యంలోనే వితంతువు కావడం వలన ఆమెను ఖచ్చితంగా సతీసహగమనం చేయించాలని ఉత్కంఠ పడేవాడు. 12 ఏళ్ళ బాల్య వితంతువు సతీసహగమనం చేయాల్సిన రోజు వచ్చింది. ఆ బాల్య వితంతువు సహగమనానికి వ్యతిరేకిస్తూ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఊరు వదిలి పారిపోతుంది. నాగప్ప ప్రగడ దాసీలతో ఇలా అంటున్నాడు:
‘‘ఏమి చేస్తున్నారు మీరు, పట్టుకోండి’’
పాప కిందికి వేలాడబడి నేలకేసి కాళ్ళు తప తప కొడుతుంది.
‘‘నేను రాను నేను రాను’’ అని భోరున ఏడుస్తుంది.
‘‘చూస్తారేమిరా పట్టుకొని తోయండి’’ అంటూ మంటల్లోకి తోయించాడు నాగప్ప.
అమ్మా అనే అరుపులను కూడా కాలే కట్టలు మూసివేసినాయి.
(నారాయణస్వామి బండి, శప్తభూమి, భాగం 17)
4) అగ్రహార గ్రామంలోని గ్రామస్తులు చాలా వింతైన మూఢాచారాన్ని బలంగా విశ్వసించేవాళ్ళు. పెళ్ళయిన కొత్త జంట బీరప్ప పసర రోజు గ్రామస్తులందరికీ అన్నదానం చేసి నూతన వధూవరులిద్దరూ తలనీలాలు తీసి గుండు చేయించుకోకపోతే వారికి సంతానం కలగదు, గ్రామానికి కరువు సంభవిస్తుందని విశ్వసించే ఆచారం ఆ గ్రామంలో పతాక స్థాయిలో ఉంది.
3.7 కుల వ్యవస్థ: కంబలి శరబడు ఎర్ర కొండపురంలోని మాదిగ వంశానికి చెందిన సామాన్యుడు. ఎర్ర కొండాపురంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే వివిధ రకాలైన దళిత కులస్తులు వ్యాపారం కోసం గ్రామంలోకి ప్రవేశించవచ్చు. సాయంత్రం ఆరు తర్వాత ఆ గ్రామంలో దళితులకు ప్రవేశం లేదు. దళితుల గుడిసెలన్నీ ఎర్ర కొండాపురం గ్రామ పొలిమేరలో మాత్రమే ఉంటాయి. కంబలి శరభడు ఆహార ప్రియుడు, అమాయకుడు. ఇతను నిబంధనలను ఉల్లంఘించి ఎర్ర కొండాపురంలో ప్రవేశించినందుకు ‘‘సగం గుండు గీయించి, సగం మీసం గొరిగించి ఆపైన ఎర్ర కొండాపురం అమరనాయక మండలం నుండి శాశ్వతంగా బహిష్కరించారు.’’ (నారాయణస్వామి బండి, శప్తభూమి, ప్రథమార్ధం) ఈ సంఘటన ఆ కాలంనాటి అగ్రకులాల దౌర్జన్యాన్ని, దళిత కులాల దీన, నిరాధికార స్థితిగతులను వివరిస్తుంది.
3.8 బీరప్ప పసరా: ఈ జాతర ప్రత్యేకత వలస వెళ్ళిన కులవృత్తుల వారంతా పుష్కరానికోసారి కలుసుకునే మహత్తరమైన కుల సాంస్కృతిక ఉత్సవం. కురుమ లేదా కురుబ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఒక కులం. కురుమ ప్రజలు బీరయ్యను తమ కుల దైవంగా పూజిస్తారు. కురుమలు బీరయ్య పట్నాలు అనే పండుగను జరుపుకుంటారు. ఇది ప్రతి 12 సంవత్సరాలకొకసారి జరుపుకునే కురువ తెగల మహత్తర ఉత్సవ వేడుక. కురవ సమాజంలో ఇదే అతి పెద్ద పండుగ. దీనిని కురువల ఆచార ప్రధాన ఘట్టం అనవచ్చు.పైన పేర్కొన్న అంశాలన్నీ రాయలసీమ ప్రాంతంలో నేటికీ కనిపిస్తున్న దృశ్యాలే.
‘‘చుక్క రాలదు నేల తడవదు
మొక్క పుట్టదు చెట్టు ఎదగదు
చుట్టూ క్షామం ఎక్కడా లేదు క్షేమం
క్షామం ఉన్న నేల క్షేమం లేని చోటు
మనిషికి శాపమే కదా?’’
కనుక ఇది కచ్చితంగా శప్తభూమేనని భావించాలి అని అంటారు ఆచార్య ఎన్‌.వి.కృష్ణారావు
4. శప్తభూమి నవల సామాజిక సందేశం:
సాంకేతిక పరిజ్ఞానంతో నూతన ఆవిష్కరణలు చేస్తున్న సువిశాల జ్ఞాన సుసంపన్నమైన దేశం మనది. కులమతాలకు అతీతంగా సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక చైతన్యానికి చిహ్నంగా ప్రపంచ నలుమూలలా ఖ్యాతిని విస్తరింపజేస్తున్న ఉపఖండం మనది. ప్రకృతి పంచభూతాలను దైవంగా స్వీకరించి వాటి రక్షణకై చట్టాలు, చర్యలు, నియమ నిబంధనలు రూపొందించుకున్న రాజ్యాంగం మనది. ఇంతటి విశిష్టత ఉన్న ‘‘మన భారతదేశంలో కుల మతానికి అగ్ర తాంబూలాన్ని ఇచ్చి స్వీయ, సామూహిక నరహత్యలు చేస్తున్న సంఘటనలు ఇప్పటికీ అక్కడక్కడా వెలుగులోకి వస్తున్నాయి’’ అని కత్తి పద్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. (కులం అంటే ఏమిటి`కత్తి పద్మారావు) కత్తి పద్మారావు దళిత చైతన్య సభ (విజయవాడ) ఉపన్యాసం ప్రకారం స్త్రీని మాతృమూర్తిగా భావించే ప్రస్తుత సమాజంలో ఇప్పటికీ వీర నారాయణరెడ్డి, నల్ల నాగిరెడ్డి లాంటి అరాచకులు అక్కడక్కడా వెలుగులోకి వస్తూనే ఉన్నారు. ప్రజలలో చైతన్యం లోపించడం కారణంగానే అణగారిన వర్గాలవారు అధికార వర్గాలను ధీటుగా ప్రశ్నించలేకపోతున్నారు. బీరప్ప పసర రాయలసీమ జానపదుల పవిత్రమైన ఆచారమే అయినప్పటికీ నర బలులు, జంతు బలుల కారణంగా అపవిత్రం జరుగుతుందన్న విషయాన్ని సమాజం గుర్తించాలి. పురాతన ఆచార వ్యవహారాలను విశ్వసించాలి, గౌరవించాలి, పాటించాలి. అయితే, వాటి పేరుతో జరిగే మోసాలను, అన్యాయాలను, నరబలులను, జంతు బలులను నిషేధించాలి. కరవు ప్రాంతాలలో వర్షం పడదనే భావన నుంచి వైదొలగి ప్రకృతి రక్షణకు పాటుపడాలనే గూడార్థాన్ని గ్రహించాలి. ఆధిపత్యం కోసం యుద్ధమే శరణ్యమనే భావాన్ని విస్మరించి సంధి, ఒడంబడికలకు ప్రాధాన్యతనివ్వాలి.
ముగింపు:
శప్తభూమి నవల రాయలసీమ చారిత్రక నేపథ్యంలో ముడిపడిన కథల సంకలనం. ఈ నవలలో దాదాపు 95 పాత్రల చిత్రీకరణ జరిగింది. ఏ కథలోనైనా కథానాయకుడు, ప్రతినాయకుడు ఉంటారు. కానీ, ఈ నవలలో ఏ పాత్రకూ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఏ పాత్రకూ ప్రాధాన్యత లోపించలేదు. ‘‘రాయలసీమ ఆచార వ్యవహారాలను సూచిస్తూ, రాయలసీమ ఆహార వంటకాలను పరిచయం చేస్తూ, రాయలసీమ కులవృత్తులను చూపిస్తూ, రాయలసీమ సంస్కృతిని, అరాచక పరిస్థితులను, రాయలసీమ నేల, కరువు వలసలను’’ (విఆర్‌.రాసాని, వలస నవల) అని విఆర్‌. రాసాని వలస నవలలో శప్తభూమిని ఉద్దేశించి చెప్పిన విధంగా పాఠకుని మనసుకి, కళ్ళకు అద్దం పట్టేలా బండి నారాయణస్వామి ఈ నవలను చిత్రీకరించారు. స్త్రీల పట్ల చులకన భావం, స్త్రీలు కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే ఉపయోగపడతారన్న అహంకార భావాన్ని ఆ కాలం నాటి రాజకీయ అరాచకీయ పురుష ఆధిక్యం చెలామణిలో ఉండేదని, దేవదాసి మరియు వేశ్య వృత్తిలో కొనసాగుతూ ఆ వృత్తిపై ఇష్టం లేకపోయినా తన జీవితాన్ని, కుటుంబాన్ని, ఆర్థికంగా నిలబెట్టడానికి శరీరాన్ని బలవంతంగా అమ్ముకోవలసిన పరిస్థితులను మరియు స్త్రీల మానసిక స్థితిగతులను గురించి బండి నారాయణస్వామి ఇందులో మహోన్నతంగా వివరించారు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.